01-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - అనేక దేహధారులపై ప్రీతిని తొలగించి ఒక్క విదేహీ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ అవయవాలన్నీ శీతలమవుతాయి"

ప్రశ్న:-

ఎవరైతే దైవీ కులానికి చెందిన ఆత్మలు ఉన్నారో, వారి గుర్తులు ఏమిటి?

జవాబు:-

1 - దైవీ కులం యొక్క ఆత్మలకు సహజంగానే ఈ పాత ప్రపంచముపై వైరాగ్యము ఉంటుంది. 2 - వారి బుద్ధి అనంతంలో ఉంటుంది. శివాలయములోకి వెళ్ళేందుకు వారు పావన పుష్పాలుగా అయ్యే పురుషార్థము చేస్తారు. 3 - ఎటువంటి ఆసురీ నడవడికను నడవరు. 4 - ఎటువంటి ఆసురీ కర్మలు జరగలేదు కదా అని తమ లెక్కను పెట్టుకుంటారు. తండ్రికి సత్యమునే వినిపిస్తారు. ఏదీ దాచిపెట్టరు.

గీతము:-

వారు మా నుండి విడిపోరు..... (నా వహ్ హమ్ సే జుదా హోంగే.....)

ఓంశాంతి. ఇప్పుడివన్నీ అనంతమైన విషయాలు. హద్దు యొక్క విషయాలన్నీ తొలగిపోతాయి. ఈ ప్రపంచములో అయితే అనేకులని స్మృతి చేయడం జరుగుతుంది, అనేక దేహధారులతో ప్రీతి ఉంది. విదేహీ ఒక్కరు మాత్రమే, వారిని పరమపిత పరమాత్మ శివ అని అనడం జరుగుతుంది. మీరిప్పుడు వారితోనే బుద్ధియోగాన్ని జోడించాలి. ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు. బ్రాహ్మణులు మొదలైనవారికి తినిపించడము, ఇవన్నీ కలియుగ ఆచార-సంప్రదాయాలు. అక్కడి ఆచార-సంప్రదాయాలు, ఇక్కడి ఆచార-సంప్రదాయాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. ఇక్కడ ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు. ఆ స్థితి చేరుకునే వరకు పురుషార్థము నడుస్తూనే ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, పాత ప్రపంచంలో ఎవరైతే ఉండి వెళ్ళిపోయారో మరియు ప్రస్తుతము ఉన్నవారందరినీ ఎంత వీలైతే అంత మర్చిపోవాలి. ఎవరికి ఏమి అర్థము చేయించాలి, అనే ఆలోచనలు పూర్తి రోజంతా మీ బుద్ధిలో నడుస్తూ ఉండాలి. ఎవ్వరికీ తెలియని ప్రపంచము యొక్క భూత-వర్తమాన-భవిష్యత్తుల గురించి వచ్చి అర్థం చేసుకోండి అని అందరికీ చెప్పండి. భూత కాలము అనగా ఎప్పటి నుండి మొదలైంది అని. ఇప్పుడు వర్తమానమేమిటి. సత్యయుగము నుండి ప్రారంభమయింది. అంటే సత్యయుగము నుండి ఇప్పటివరకు, అలాగే భవిష్యత్తులో ఏం జరిగేది ఉందో ప్రపంచానికి తెలియనే తెలియదు. పిల్లలైన మీకు తెలుసు, అందుకే చిత్రాలు మొదలైనవి తయారుచేస్తారు. ఇది పెద్ద అనంతమైన నాటకము. వారు అసత్యపు హద్దు నాటకాలను ఎక్కువగా తయారుచేస్తారు. కథలు వ్రాసేవారు వేరుగా ఉంటారు మరియు నాటకములోని సీన్-సీనరీలు (వివిధ దృశ్యాలను) తయారుచేసేవారు వేరుగా ఉంటారు. ఈ రహస్యమంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరేదైతే చూస్తున్నారో అది ఉండదు. వినాశనమైపోతుంది. కావున మీరు సత్యయుగ కొత్త ప్రపంచము యొక్క దృశ్యాలను చాలా బాగా చూపించాల్సి ఉంటుంది. ఉదాహరణకి అజ్మేరులో బంగారు ద్వారక ఉంది, దాని నుండి కూడా కొన్ని దృశ్యాలను తీసుకొని కొత్త ప్రపంచాన్ని వేరుగా తయారుచేసి చూపించండి. ఈ పాత ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది, దీని చిత్రపటమైతే ఉంది కదా. అలాగే ఈ కొత్త ప్రపంచము ఇమర్జ్ అవుతూ ఉంది. ఈ విధంగా ఆలోచించి మంచిరీతిలో తయారుచేయాలి. ఇదైతే మీరు అర్థము చేసుకుంటారు. ఈ సమయములో మనుష్యుల బుద్ధి పూర్తి రాతి బుద్ధిగా ఉంది. మీరు ఎంతగా అర్థం చేయించినా, వారి బుద్ధిలో కూర్చోదు. ఎలా అయితే నాటకాల వారు సుందరమైన దృశ్యాలను తయారుచేస్తారో, అలా ఇతరుల సహాయము తీసుకొని స్వర్గం యొక్క సీన్-సీనరీలను చాలా బాగా తయారుచేయాలి. వారు మంచి ఐడియాలను ఇస్తారు. యుక్తులు చెప్తారు. వారికి అర్థం చేయించి ఎంత బాగా తయారుచేయాలి అంటే అవి మనుష్యులు వచ్చి అర్థం చేసుకనే విధంగా ఉండాలి. సత్యయుగములో తప్పకుండా ఒకే ధర్మము ఉండేది. పిల్లలైన మీలో కూడా ధారణ చేసేవారు నంబరువారుగా ఉన్నారు. దేహాభిమాన బుద్ధి కలవారిని ఛీ-ఛీ అని అనడం జరుగుతుంది. దేహీ-అభిమాన బుద్ధి కలవారిని పుష్పాలని అనడం జరుగుతుంది. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతున్నారు. దేహాభిమానములో ఉంటే ముళ్ళు ముళ్ళుగానే ఉండిపోతారు. పిల్లలైన మీకైతే ఈ పాత ప్రపంచముపై వైరాగ్యముంది. మీదిప్పుడు అనంతమైన బుద్ధి, అనంతమైన వైరాగ్యము. మనకు ఈ వేశ్యాలయముపై చాలా ద్వేషం ఉంది. మనమిప్పుడు శివాలయానికి వెళ్ళేందుకు పుష్పాలుగా అవుతున్నాము. అవుతూ-అవుతూ ఏదైనా తప్పుడు నడవడిక నడిచినట్లయితే వీరిలో ఇప్పుడు భూతం ప్రవేశించిందని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఒకే ఇంటిలో పతి పవిత్ర హంసగా తయారవుతూ, పత్ని అర్థము చేసుకోనట్లయితే కష్టమవుతుంది. సహనము చేయవలసి వస్తుంది. ఆమె అదృష్టములో లేదని అర్థం చేసుకోవడం జరుగుతుంది. అందరూ దైవీ కులానికి చెందినవారుగా తయారవ్వరు, ఎవరు తయారవ్వాలో వారే అవుతారు. అనేకుల తప్పుడు నడవడిక గురించిన రిపోర్టులు వస్తాయి. ఈ-ఈ ఆసురీ గుణాలున్నాయి, అందువల్లనే బాబా రోజూ అర్థం చేయిస్తారు, తమ లెక్కను రాత్రి చూసుకోండి - ఈ రోజు నేను ఎటువంటి ఆసురీ కర్మ చేయలేదు కదా? తమ మొత్తం జీవితంలో ఏవైతే పొరపాట్లు చేశారో, వాటిని చెప్పండి అని బాబా చెప్తున్నారు. ఏదైనా పెద్ద పొరపాటు చేసినట్లయితే సర్జన్ కు చెప్పేందుకు సిగ్గుగా అనిపిస్తుంది, ఎందుకంటే గౌరవము పోతుంది కదా. చెప్పకపోతే ఇంకా నష్టము కలుగుతుంది. ఎంతగా మాయ చెంపదెబ్బ వేస్తుందంటే, ఒక్కసారిగా సర్వనాశనము చేస్తుంది. మాయ చాలా శక్తివంతమైనది. పంచ వికారాలపై విజయము పొందలేకపోతే తండ్రి కూడా ఏం చేయగలరు?

తండ్రి చెప్తున్నారు - నేను దయాసాగరుడను, కాలుడికే కాలుడిని కూడా. పతితపావనా వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని నన్ను పిలుస్తారు కూడా. రెండూ నా పేర్లే కదా! దయాహృదయుడను మరియు కాలుడికే కాలుడిని, రెండు పాత్రలు ఇప్పుడు అభినయిస్తున్నాను. ముళ్ళను పుష్పాలుగా చేస్తాను, కనుక మీ బుద్ధిలో ఆ సంతోషం ఉంది. అమరనాథుడైన తండ్రి చెప్తున్నారు, మీరందరూ పార్వతులు. ఇప్పుడు మీరు నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు అమరపురికి వెళ్తారు, అంతేకాక మీ పాపాలు వినాశనమవుతాయి. ఆ యాత్రలు చేయడం వలన మీ పాపాలు నశించవు. అవి భక్తిమార్గములోని యాత్రలు. మీ ఖర్చు ఎలా నడుస్తుంది అన్న ప్రశ్న కూడా పిల్లలను అడుగుతారు. అయితే మేము ఈ విధంగా సమాధానము చెప్పామని కనీసము సమాచారము కూడా ఇవ్వరు. ఇంత మంది పిల్లలు బ్రహ్మా సంతానమైన బ్రాహ్మణులుండగా మా కొరకు మేమే ఖర్చు చేస్తాం కదా. మా కొరకు మా రాజ్యమును శ్రీమతమనుసారంగా స్థాపన చేసుకుంటున్నాము. రాజ్యపాలన కూడా మేమే చేస్తాము. మేము రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము కావున ఖర్చు కూడా మేమే చూసుకుంటాము. శివబాబా అవినాశి జ్ఞానరత్నాలను దానమిస్తున్నారు, వీటి ద్వారా మేము రాజాధి రాజులుగా అవుతాము. చదువుకునే పిల్లలే ఖర్చు చూసుకుంటారు కదా. మా కొరకు మేము ఖర్చు చేస్తాము, మేము ఎవ్వరి దగ్గర భిక్షము గానీ, విరాళాలు గానీ తీసుకోము అని అర్థమ చేయించండి. కానీ పిల్లలు, మమ్మల్ని ఈ ప్రశ్న కూడా అడుగుతారని వ్రాస్తారు. అందుకే బాబా చెప్పారు, రోజంతా చేసిన సర్వీసు గురించి సాయంకాలము పూర్తి లెక్క తెలియజేయాలి. ఇదంతా ఫాలో అప్ చేయాలి. అయితే అనేక మంది వస్తారు. వారంతా ప్రజలుగా అవుతారు, ఉన్నత పదవిని పొందేవారు చాలా కొద్ది మంది ఉన్నారు. రాజులు కొద్దిమంది మాత్రమే ఉంటారు, ధనవంతులుగా కూడా కొద్దిమందే అవుతారు. అయితే పేదలు చాలా మంది ఉంటారు. ఇక్కడ కూడా ఇలాగే ఉంటే దైవీ ప్రపంచంలో కూడా అలాగే ఉంటారు. రాజ్యస్థాపన జరుగుతుంది, అందులో నంబరువారుగా అందరూ కావాలి. తండ్రి వచ్చి పిల్లలకు రాజయోగము నేర్పించి ఆదిసనాతన దైవీ రాజధానిని స్థాపన చేయిస్తారు. దైవీ ధర్మము వారి రాజధాని ఉండేది, ఇప్పుడు లేదు. నేను దానిని మళ్ళీ స్థాపన చేస్తానని తండ్రి చెప్తున్నారు. అయితే ఎవరికైనా అర్థం చేయించేందుకు మీకు చిత్రాలు కూడా ఇటువంటివి కావాలి. బాబా మురళి వింటారు, విని చేస్తారు. రోజు-రోజుకూ కరెక్షన్లు అవుతూ ఉంటాయి. మేము ఎంత వరకు కరెక్ట్ గా అవుతున్నాము అని పిల్లలు తమ స్థితిని కూడా చూసుకుంటూ ఉండాలి. తండ్రి వచ్చి పిల్లలను మురికి నుండి బయటకి తీస్తారు, ఎవరు ఎంతగా బయటకు తీసే సర్వీసు చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. పిల్లలైన మీరు పూర్తిగా క్షీరఖండము వలె (పాలు, పంచదార వలె కలిసి-మెలిసి) ఉండాలి. తండ్రి ఇక్కడ మిమ్మల్ని సత్యయుగములో కంటే ఉన్నతంగా తయారుచేస్తున్నారు. తండ్రి అయిన ఈశ్వరుడు చదివిస్తున్నారంటే, మీరు ఆ తండ్రికి మీ చదువు యొక్క సత్తాను చూపించాలి, అప్పుడు తండ్రి కూడా బలిహారం అవుతారు. మేము ఇప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా చేసే వ్యాపారమే చేస్తామని మనసులో అనిపించాలి. ఈ ఉద్యోగాలు మొదలైనవి చేస్తూనే ఉంటారు. మొదట తమ ఉన్నతిని చేసుకోవాలి కదా. చాలా సహజము. మనుష్యులు అన్నీ చేయవచ్చు. గృహస్థ వ్యవహారములో ఉంటూ రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ప్రతిరోజూ మీ లెక్కను తీయండి. రోజంతటి యొక్క లాభ-నష్టాలను తీయండి. లెక్క తీయకపోతే పరివర్తన అవ్వడం చాలా కష్టము. తండ్రి చెప్పింది ఒప్పుకోరు. ఎవ్వరికీ దుఃఖమునివ్వలేదు కదా అని ప్రతి రోజూ చూసుకోవాలి. ఇది చాలా గొప్ప పదవి, లెక్కలేనంత సంపాదన ఉంది. లేకపోతే తర్వాత ఏడవవలసి వస్తుంది. పందెము కదా. కొందరు లక్షల రూపాయలు సంపాదిస్తారు, మరికొందరు పేదవారిగా మిగిలిపోతారు.

ఇప్పుడు మీది ఈశ్వరీయ పందెము. ఇందులో ఎవ్వరూ స్థూలంగా పరిగెత్తే అవసరం లేదు, కేవలం బుద్ధి ద్వారా ప్రియమైన బాబాను స్మృతి చేయాలి. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే "బాబా, మా ద్వారా ఈ పొరపాటు జరిగింది, కర్మేంద్రియాల ద్వారా ఈ పొరపాటు చేశాము” అని తండ్రికి వినిపించాలి. తండ్రి చెప్తున్నారు, తప్పు-ఒప్పులను తెలుసుకునే విచక్షణా బుద్ధి లభించింది కనుక ఇప్పుడు తప్పుడు పనులు చేయకూడదు. తప్పుడు పనులు చేసినట్లయితే బాబాను క్షమాపణ అడగాలి, ఎందుకంటే ఇప్పుడు వినేందుకు తండ్రి ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఏదైనా చెడు కర్మ జరిగితే వెంటనే బాబాకు – బాబా, మా ద్వారా ఈ చెడు కర్మ జరిగింది అని చెప్పండి లేక వ్రాయండి, అప్పుడు సగం క్షమించబడ్తుంది. అలాగని నేను దయ చూపిస్తానని కాదు. కొంచెము కూడా క్షమ లేక కృప లభించదు. అందరూ స్వయాన్ని సరిదిద్దుకోవాలి. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. గతానివి కూడా యోగబలము ద్వారా తొలగుతూ ఉంటాయి. తండ్రికి చెందినవారిగా అయ్యి తండ్రిని నిందింపజేయకండి. సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత స్థానమును పొందలేరు. మీకు చాలా ఉన్నతమైన స్థానము లభిస్తుంది. ఇతర గురువుల వద్ద రాజ్య పదవి ఏదీ లేదు. ఇక్కడ మీకు లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది. భక్తి మార్గములో ఏ లక్ష్యము-ఉద్దేశ్యము ఉండదు. ఒకవేళ ఉన్నా అది అల్పకాలము కొరకే ఉంటుంది. 21 జన్మల సుఖమెక్కడ, పైసా విలువైన కాస్త సుఖమెక్కడ! ధనము ద్వారా సుఖము లభిస్తుందని కాదు. దుఃఖము కూడా ఎంత కలుగుతుంది. అచ్ఛా - ఉదాహరణకు ఎవరైనా ఆసుపత్రి కట్టిస్తే, మరుసటి జన్మలో వ్యాధులు తక్కువగా ఉంటాయి, అంతేకాని విద్య ఎక్కువగా లభిస్తుందని కాదు, ధనము కూడా ఎక్కువగా లభిస్తుందని కాదు. వాటి కొరకైతే మిగతా అన్నీ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ధర్మశాలను కట్టిస్తే తర్వాత జన్మలో మహల్ లభిస్తుంది, అయితే ఆరోగ్యంగా ఉంటారని కాదు. అలా ఉండరు. కావున తండ్రి ఎన్ని విషయాలు అర్థం చేయిస్తారు. కొందరు బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయిస్తారు, కొందరు అర్థమే చేసుకోరు. కావున ప్రతి రోజూ లెక్కను తీయండి. ఈ రోజు ఏ పాపము చేశాను? ఈ విషయంలో ఫెయిల్ అయ్యాను. అటువంటి పనులు చేయవద్దని తండ్రి సలహా ఇస్తారు. మనమిప్పుడు స్వర్గానికి వెళ్తామని మీకు తెలుసు. పిల్లలకు సంతోషపు పాదరసం ఎక్కదు. ఈ బాబాకు, నేను వృద్ధుడిని, ఈ శరీరాన్ని వదిలి రాకుమారునిగా అవుతానని ఎంత సంతోషం ఉంది. మీరు కూడా చదువుతున్నారు కావున మీకు కూడా అపారమైన సంతోషము ఉండాలి, కాని తండ్రిని స్మృతే చేయరు. తండ్రి ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు, అక్కడ ఇంగ్లీషు మొదలైనవి చదువుకోవడంలో తల ఎంతగా పాడైపోతుంది! చాలా కష్టమనిపిస్తుంది. ఇదైతే చాలా సులభము. ఈ ఆత్మిక చదువు ద్వారా మీరు శీతలంగా అవుతారు. ఇందులో మీరు కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ అవయవాలన్నీ పూర్తిగా శీతలమవుతాయి. మీకైతే శరీరము ఉంది కదా. శివబాబాకైతే శరీరము లేదు. కృష్ణునికి అవయవాలున్నాయి. వారి అవయవాలు శీతలంగానే ఉంటాయి కావున వారికి ఆ పేరు పెట్టారు. ఇప్పుడు వారి సాంగత్యమెలా చేయాలి? వారు ఉండేదే సత్యయుగంలో. వారి అవయవాలను ఇంత శీతలంగా ఎవరు తయారుచేశారు? ఇది మీరిప్పుడు అర్థము చేసుకుంటున్నారు. పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఇంతగా ధారణ చేయాలి. ఎప్పుడూ కొట్లాడకూడదు, గొడవపడకూడదు. సత్యమే మాట్లాడాలి. అసత్యము మాట్లాడినట్లయితే సర్వనాశనమైపోతుంది.

తండ్రి పిల్లలైన మీకు ఆల్ రౌండ్ అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. అందరికీ అందేలా చాలా మంచి-మంచి చిత్రాలను తయారుచేయండి. మంచివి చూస్తే వెళ్ళి చూడమని అందరికీ చెప్తారు. అర్థం చేయించేవారు కూడా వివేకవంతులు కావాలి. సేవ చేయడం కూడా నేర్చుకోవాలి. తమ సమానంగా తయారుచేయగలిగే మంచి బ్రాహ్మణీలు కూడా కావాలి. తమ సమానంగా మేనేజర్లుగా చేసేవారిని మంచి బ్రాహ్మణీలు అని అంటారు. వారు ఉన్నతమైన పదవిని కూడా పొందుతారు. బేబీ బుద్ధిలా కూడా ఉండకూడదు, లేకపోతే ఎత్తుకొని వెళ్ళిపోతారు. రావణ సంప్రదాయము కదా. మీ వెనుక సేవాకేంద్రాలను సంభాళించే విధంగా బ్రాహ్మణీలను కూడా తయారుచేయండి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రికి తమ చదువు యొక్క సత్తాను చూపించాలి. భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవలో నిమగ్నమై ఉండాలి. మొదట స్వ ఉన్నతి గురించి ఆలోచించాలి. క్షీరఖండముగా వలె (పాలు-పంచదార వలె కలిసి-మెలిసి) ఉండాలి.

2. ఏదైనా పొరపాటు జరిగినట్లయితే తండ్రిని క్షమాపణ అడిగి స్వయాన్ని స్వయమే సరిదిద్దుకోవాలి. తండ్రి కృప చూపించరు, తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనము చేసుకోవాలి, తండ్రికి నిందను తీసుకొచ్చే కర్మ ఏదీ చేయకూడదు.

వరదానము:-

తమ శక్తిశాలి స్థితి ద్వారా సర్వుల శుభ కామనలను పూర్తి చేసే మహాదాని భవ

చివర్లో వచ్చే ఆత్మలు కొద్దిమాత్రంతోనే సంతోషిస్తారు, ఎందుకంటే వారిది చాలా తక్కువ తీసుకునేటువంటి పాత్ర. కనుక ఇటువంటి ఆత్మలకు వారి భావనకు ఫలము ప్రాప్తి అవ్వాలి, ఎవ్వరూ వంచితులుగా మిగిలిపోకూడదు. కావున ఇప్పటి నుండే తమలో సర్వ శక్తులను జమ చేసుకోండి. ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ శక్తిశాలి, మహాదాని స్థితిలో స్థితులై ఉంటారో అప్పుడు ఏ ఆత్మనైనా మీ సహయోగముతో, మహాదానమిచ్చే కర్తవ్యము ఆధారముతో, శుభ భావనల స్విచ్ ను ఆన్ చేస్తూనే దృష్టితో తృప్తిపరుస్తారు.

స్లోగన్:-

సదా ఈశ్వరీయ మర్యాదలపై నడుస్తూ ఉన్నట్లయితే, మర్యాదా పురుషోత్తములుగా అవుతారు.