02-04-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - జ్ఞానసాగరుడైన తండ్రి, పిల్లలైన మీ సమ్ముఖంలో జ్ఞాన డాన్స్ చేసేందుకు వచ్చారు, మీరు తెలివైనవారిగా, సేవాధారులుగా అయినట్లయితే జ్ఞాన డాన్స్ కూడా బాగా జరుగుతుంది”

ప్రశ్న:-

పిల్లలైన మీరు సంగమయుగంలో ఏ హాబీ (అలవాటు) ను అలవరచుకుంటారు?

జవాబు:-

స్మృతిలో ఉండే హాబీ. ఇదే ఆత్మిక హాబీ. ఈ హాబీతో పాటుగా మీరు దివ్యమైన మరియు అలౌకికమైన కర్మలను కూడా చేయాలి. మీరు బ్రాహ్మణులు, మీరు తప్పకుండా అందరికీ సత్యాతి-సత్యమైన కథను వినిపించాలి. పిల్లలైన మీకు సేవ చేసే హాబీ కూడా ఉండాలి.

గీతము:-

ఓర్పు వహించు మానవా..... (ధీరజ్ ధర్ మనువా.....)

ఓంశాంతి. హాస్పిటల్ లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే, ఆ పేషెంట్ దుఃఖం నుండి విముక్తుడవ్వాలని ఆశిస్తాడు. నా పరిస్థితి ఎలా ఉంది, ఈ అనారోగ్యం ఎప్పుడు నయమవుతుంది అని డాక్టరును అడుగుతారు. అవన్నీ హద్దు విషయాలు. ఇది అనంతమైన విషయము. తండ్రి వచ్చి పిల్లలకు సలహానిస్తారు. ఇది నిజంగానే సుఖం మరియు దుఃఖం యొక్క ఆట అని పిల్లలు తెలుసుకున్నారు. నిజానికి సత్యయుగంలోకి వెళ్ళినదాని కన్నా, ఇక్కడే ఎక్కువ లాభముంటుందని పిల్లలైన మీకు తెలుసు ఎందుకంటే ఈ సమయంలో మనం ఈశ్వరీయ ఒడిలో ఉన్నాము, మనం ఈశ్వరీయ సంతానము. ఈ సమయంలో మనకు ఎంతో ఉన్నతాతి ఉన్నతమైన గుప్తమైన మహిమ ఉంది. మనుష్యమాత్రులు తండ్రిని శివ, ఈశ్వర, భగవంతుడా అని కూడా అంటారు కానీ వారి గురించి తెలియదు, కేవలం పిలుస్తూ ఉంటారు. డ్రామానుసారంగానే ఇలా జరుగుతుంది. జ్ఞానము మరియు అజ్ఞానము, పగలు మరియు రాత్రి అని కూడా పాడుతూ వచ్చారు కానీ బుద్ధి ఎంత తమోప్రధానంగా అయిపోయిందంటే, తమను తాము తమోప్రధానమని భావించరు. ఎవరి భాగ్యంలోనైతే తండ్రి వారసత్వం ఉంటుందో, వారి బుద్ధిలోనే కూర్చోగలదు. మేము పూర్తిగా ఘోర అంధకారంలో ఉండేవారమని పిల్లలకు తెలుసు. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక ఎంత ప్రకాశం లభించింది. తండ్రి ఏ జ్ఞానాన్ని అయితే అర్థం చేయిస్తారో, అది ఏ వేద శాస్త్రాల్లోనూ, గ్రంథాలు మొదలైనవాటిలోనూ లేదు. ఇది కూడా తండ్రి నిరూపించి తెలియజేస్తారు. పిల్లలైన మీకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల ప్రకాశాన్నిస్తాను, అది మళ్ళీ ప్రాయః లోపమైపోతుంది. నా ద్వారా తప్ప ఇంకెవ్వరి ద్వారా జ్ఞానం లభించజాలదు, ఈ జ్ఞానం మళ్ళీ ప్రాయః లోపమైపోతుంది. కలియుగం గతించిపోయింది, మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుందని అర్థమవుతుంది. ఇది కొత్త విషయము. ఇది శాస్త్రాల్లో లేదు.

తండ్రి అయితే ఈ జ్ఞానాన్ని అందరికీ ఒకే విధంగా చదివిస్తారు కానీ ధారణలో నంబరువారుగా ఉన్నారు. కొంతమంది మంచి సర్వీసబుల్ పిల్లలు వచ్చినప్పుడు బాబా డాన్స్ కూడా అలాగే నడుస్తుంది. డాన్సింగ్ గర్ల్ (నృత్యం చేసే నర్తకి) ఎదురుగా, చాలా అభిరుచితో చూసేవారు ఉన్నట్లయితే, ఆమె కూడా సంతోషంతో చాలా బాగా నాట్యం చేస్తారు. కొద్దిమందే కూర్చుని ఉంటే, సాధారణ రీతిలో కొద్దిగా డాన్స్ చేస్తారు. వాహ్-వాహ్ అనేవారు చాలామంది ఉంటే, ఆమెకు కూడా ఉత్సాహాం పెరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. పిల్లలందరూ మురళీని వింటారు కానీ సమ్ముఖంగా వినడం వేరు కదా. కృష్ణుడు డాన్స్ చేసేవారని కూడా చూపిస్తారు. కానీ ఆ డాన్స్ విషయము కాదు. వాస్తవానికి ఇది జ్ఞాన డాన్స్. శివబాబా స్వయంగా చెప్తారు - నేను జ్ఞాన డాన్స్ చేయడానికి వస్తాను, నేను జ్ఞాన సాగరుడను కనుక మంచి-మంచి పాయింట్లు వెలువడతాయి. ఇది జ్ఞాన మురళీ, చెక్క మురళీ కాదు. పతితపావనుడైన తండ్రి వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పిస్తారా లేక చెక్క మురళీని వాయిస్తారా. తండ్రి వచ్చి ఈ విధంగా రాజయోగాన్ని నేర్పిస్తారన్నది ఎవరి ఆలోచనలోనూ ఉండదు. ఇప్పుడు మీకు తెలుసు, ఇక మిగిలిన మనుష్యమాత్రులెవ్వరి బుద్ధిలోకీ ఈ విషయం రాజాలదు. వచ్చేవారు కూడా నంబరువారుగా పదవిని పొందుతారు. కల్పక్రితం చేసినట్లుగానే ఇప్పుడు కూడా పురుషార్థం చేస్తూ ఉంటారు. తండ్రి కల్పక్రితం వలె వచ్చి, పిల్లలకు రహస్యాలన్నింటినీ విడమర్చి చెప్తారని మీకు తెలుసు. వారు నేను కూడా బంధనంలో బంధింపబడి ఉన్నానని అంటారు. ప్రతి ఒక్కరూ ఈ డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నారు. సత్యయుగంలో ఏదైతే జరిగిందో, అదే మళ్ళీ జరుగుతుంది. ఎన్నో రకాల యోనులున్నాయి. సత్యయుగంలో ఇన్ని యోనులు ఉండవు. అక్కడ కొన్ని రకాలు మాత్రమే ఉంటాయి. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటాయి. ధర్మాలు కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి కదా. సత్యయుగంలోనైతే ఇన్ని ధర్మాలు ఉండేవి కావు. సత్యయుగంలో ఏవైతే ఉండేవో, వాటిని మళ్ళీ సత్యయుగంలోనే చూస్తారు. సత్యయుగంలో ఛీ-ఛీగా మురికి చేసేవేవీ ఉండజాలవు. ఆ దేవీ-దేవతలను భగవాన్-భగవతీ అని అంటారు. వేరే ఏ ఖండంలోనూ ఎప్పుడూ ఎవరినీ గాడ్-గాడెస్ అని అనలేరు. ఆ దేవతలు తప్పకుండా స్వర్గంలో రాజ్యం చేసేవారు. వారికి ఎంత మహిమ ఉందో చూడండి.

పిల్లలైన మీకిప్పుడు ఓర్పు కలిగింది. మా పదవి ఎంత ఉన్నతమైనది లేదా ఎంత తక్కువైనది, మేము ఇన్ని మార్కులతో పాస్ అవుతాము అనేది మీకు తెలుసు. ఫలానావారు మంచి సేవను చేస్తున్నారని ప్రతి ఒక్కరు మీకు మీరు అర్థం చేసుకోగలరు కదా. అయితే, నడుస్తూ-నడుస్తూ తుఫానులు కూడా వస్తాయి. పిల్లలకు ఎటువంటి గ్రహచారం గానీ, తుఫానులు మొదలైనవి గానీ రాకూడదనైతే తండ్రి అంటారు. మాయ మంచి-మంచి పిల్లలను కూడా పడేస్తుంది. కనుక ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉందని తండ్రి ఓర్పునందిస్తూ ఉంటారు. మీరు సేవను కూడా చేయాలి. స్థాపన జరిగిపోయినట్లయితే, ఇక వెళ్ళాల్సిందే. ఇందులో ఒక్క సెకండు కూడా ముందు-వెనుక అవ్వలేదు. ఈ రహస్యాన్ని పిల్లలే అర్థం చేసుకోగలరు. మనం డ్రామాలోని పాత్రధారులము, ఇందులో మనది ముఖ్యమైన పాత్ర. గెలుపు-ఓటముల ఆట భారత్ పైనే తయారుచేయబడింది. భారత్ యే పావనంగా ఉండేది, ఎంత శాంతి, పవిత్రత ఉండేవి. ఇది నిన్నటి విషయమే. నిన్న మనమే పాత్రను అభినయించాము. 5 వేల సంవత్సరాల పాత్ర పూర్తిగా నిశ్చయింపబడి ఉంది. మనం చక్రం తిరిగి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ తండ్రితో యోగాన్ని జోడిస్తాము, దీనితోనే మాలిన్యం తొలగిపోతుంది. తండ్రి గుర్తు వచ్చినట్లయితే, వారసత్వం కూడా తప్పకుండా గుర్తుకొస్తుంది. మొట్టమొదట అల్ఫ్ (భగవంతుడు) ను తెలుసుకోవాలి. తండ్రి అంటారు - మీరు నన్ను తెలుసుకోవడంతో, నా ద్వారా అంతా తెలుసుకుంటారు. జ్ఞానమైతే చాలా సులువైనది, ఇది ఒక్క సెకండుకు సంబంధించినది. అయినా అర్థం చేయిస్తూ ఉంటారు, పాయింట్లను ఇస్తూ ఉంటారు. ముఖ్యమైన పాయింటు, మన్మనాభవ, ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి. దేహాభిమానం రావడంతో అనేక రకాలుగా గుటకలను మింగుతారు, అవి యోగంలో ఉండనివ్వవు. భక్తి మార్గంలో కృష్ణుని స్మృతిలో కూర్చుంటారు కానీ బుద్ధి ఎక్కడెక్కడికో పరుగెడుతుంది. భక్తిలో అందరికీ ఈ అనుభవముంది. ఇది ఈ జన్మ యొక్క విషయము. ఈ జన్మ గురించి తెలుసుకుంటే, ఎంతో కొంత గత జన్మ గురించి కూడా తెలుసుకోవచ్చు. తండ్రిని స్మృతి చేయడం పిల్లలకు హాబీగా అయిపోయింది. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా సంతోషం పెరుగుతుంది. దీనితో పాటు దివ్య అలౌకిక కర్మలను కూడా చేయాలి. మీరు బ్రాహ్మణులు. మీరు సత్యనారాయణ కథను, అమరకథను వినిపిస్తారు. ముఖ్యమైన విషయం ఒక్కటే - అందులోనే అన్నీ వచ్చేస్తాయి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఈ ఒక్క హాబీయే ఆత్మికమైనది. జ్ఞానమైతే చాలా సులువైనదని తండ్రి అర్థం చేయిస్తారు. కన్యల పేరు కూడా మహిమ చేయబడింది. అదర్ కుమారీ, కుమారీ కన్య, కుమారీల పేరు అందరికన్నా ఎక్కువ ప్రసిద్ధి గాంచినది. వారికి ఎటువంటి బంధనం ఉండదు. ఆ పతి అయితే వికారీగా చేస్తాడు. ఈ తండ్రి అయితే స్వర్గంలోకి తీసుకువెళ్ళేందుకు అలంకరిస్తారు, మధురమైన సాగరంలోకి తీసుకువెళ్తారు. ఈ పాత ప్రపంచాన్ని, పాత దేహం సహితంగా పూర్తిగా మర్చిపోండి అని తండ్రి అంటారు. నేనైతే 84 జన్మలను పూర్తి చేసుకున్నాను, ఇప్పుడు నేను మళ్ళీ తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాను అని ఆత్మ అంటుంది. ధైర్యమునుంచుతారు కానీ మాయతో యుద్ధమైతే జరుగుతుంది. ముందు ఈ బాబా ఉన్నారు, మాయా తుఫానులు ఎక్కువగా వీరి వద్దకు వస్తాయి. బాబా, మాకు ఇలా అవుతుంది అని చాలామంది వచ్చి అడుగుతారు. బాబా అంటారు - పిల్లలూ, ఈ తుఫానులైతే తప్పకుండా వస్తాయి, ముందు నా వద్దకు వస్తాయి. అంతిమంలో అందరూ కర్మాతీత అవస్థను పొందుతారు. ఇది కొత్త విషయమేమీ కాదు. కల్పక్రితం కూడా జరిగింది. డ్రామాలో పాత్రను అభినయించారు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు. ఈ పాత ప్రపంచం నరకమని పిల్లలకు తెలుసు. ఈ లక్ష్మీ నారాయణులు క్షీరసాగరంలో ఉండేవారని కూడా అంటారు. వీరికి ఎంత మంచి-మంచి మందిరాలను నిర్మిస్తారు. ప్రారంభంలో మందిరాలను నిర్మించేటప్పుడు, పాలతోనే కొలనును తయారుచేసి, విష్ణు మూర్తిని పెట్టి ఉంటారు. చాలా మంచి-మంచి చిత్రాలను తయారుచేసి పూజించేవారు. ఆ సమయంలో అన్నీ చాలా చౌకగా ఉండేవి. బాబా ఇవన్నీ చూశారు. ఈ భారత్ నిజంగా ఎంతో పవిత్రంగా, క్షీరసాగరం వలె ఉండేది. పాలు, నెయ్యి నదుల వలె ఉండేవి. ఇటువంటి మహిమను చేశారు. స్వర్గం పేరు తీసుకోవడంతోనే, నోటిలో నీరు ఊరుతుంది. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం యొక్క మూడవ నేత్రం లభించింది. కనుక బుద్ధికి వివేకం లభించింది. బుద్ధి ఇంటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ స్వర్గంలోకి వస్తుంది. అక్కడ అన్నీ కొత్తగానే ఉంటాయి. బాబా, శ్రీ నారాయణుని మూర్తిని చూసి చాలా సంతోషించేవారు, చాలా ప్రేమగా చూసుకునేవారు. వారే ఇలా అవుతారని వారు అనుకోలేదు. ఈ జ్ఞానమైతే ఇప్పుడు తండ్రి నుండి లభించింది. మీకు బ్రహ్మాండము మరియు సృష్టి చక్ర ఆదిమధ్యాంతాల జ్ఞానం ఉంది. మనము చక్రంలో ఎలా తిరుగుతాము అనేది మీకు తెలుసు. బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పిల్లలైన మీకు చాలా సంతోషముండాలి. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. శరీరానికైతే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడిది మీ అంతిమ జన్మ. ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా మీకు సుఖమయమైన రోజులు వస్తాయి. వినాశనం ఎదురుగా నిలబడి ఉందని చూస్తారు. మీకు మూడవ నేత్రం లభించింది. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము గురించి మీకు మంచి రీతిగా తెలుసు. ఈ స్వదర్శన చక్రం మీ బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది, సంతోషం కలుగుతుంది. ఈ సమయంలో అనంతమైన తండ్రి, టీచరుగా అయి మనల్ని చదివిస్తారు. కానీ ఇది కొత్త విషయం అయిన కారణంగా పదే-పదే మర్చిపోతారు. లేకపోతే బాబా అని అనడంతోనే సంతోషం యొక్క పాదరసం ఎక్కాలి. రామతీర్థ, శ్రీకృష్ణుని భక్తునిగా ఉండేవారు కనుక కృష్ణుని దర్శనం కోసం ఎంత చేసేవారు. అతనికి సాక్షాత్కారం కలిగింది, సంతోషపడ్డారు. కానీ దాని వలన ఏమి జరిగింది, ఏమీ లభించలేదు. ఇక్కడైతే పిల్లలైన మీకు సంతోషం కూడా ఉంది ఎందుకంటే మనం 21 జన్మలకు ఇంత ఉన్నతమైన పదవిని పొందుతామని మీకు తెలుసు. మూడు వంతులు అయితే మీరు సుఖంగా ఉంటారు. ఒకవేళ సగం-సగం ఉన్నట్లయితే లాభం లేనట్లు. మీరు మూడు వంతులు సుఖంలో ఉంటారు. మీ అంతటి సుఖాన్ని ఎవరూ చూడలేరు. మీకైతే అపారమైన సుఖముంటుంది. మహాన్ సుఖంలో దుఃఖం గురించి తెలియదు. ఇప్పుడు మేము దుఃఖం నుండి సుఖంలోకి వెళ్తున్నామని, సంగమంలో మీరు రెండింటి గురించి తెలుసుకుంటారు. ముఖము పగలు వైపు మరియు కాళ్ళు రాత్రి వైపు ఉంటాయి. ఈ ప్రపంచాన్ని కాలదన్నాలి అనగా బుద్ధి ద్వారా మర్చిపోవాలి. ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలని ఆత్మకు తెలుసు, చాలా పాత్రను అభినయించారు. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగానే తుప్పు తొలగిపోతుంది. తండ్రి సేవలో ఉంటూ ఎంతగా తమ సమానంగా తయారుచేస్తారో, అంతగానే తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని బుద్ధిలో ఉంది. కనుక ఇంటినే స్మృతి చేయాలి. పాత ఇల్లు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కొత్త ఇల్లు ఎక్కడ, పాత ఇల్లు ఎక్కడ. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇది అదే విషయ-వైతరణీ నది. ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు, గొడవపడుతూ ఉంటారు. ఇకపోతే తండ్రి వచ్చినప్పుడు కూడా చాలా కొట్లాటలు మొదలయ్యాయి. ఒకవేళ పత్ని వికారాలను అందించకపోతే ఎంతగా విసిగిస్తారు, ఎంతగా తల కొట్టుకుంటారు. కల్పక్రితం కూడా అత్యాచారాలు జరిగాయి. ఇప్పటి విషయాల గురించే చెప్పుకుంటారు. ఎంతగా ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు అనేది చూస్తారు. డ్రామాలోని అదే పాత్ర మళ్ళీ నడుస్తుంది. ఇది తండ్రికి తెలుసు మరియు పిల్లలకు తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు. మున్ముందు అందరికీ అర్థమవుతుంది. పతితపావనుడు, సర్వుల సద్గతిదాత తండ్రి అని పాడుతారు కూడా. భారత్ స్వర్గంగా మరియు నరకంగా ఎలా అవుతుంది అన్నది మీరెవరికైనా అర్థం చేయించవచ్చు. మీరు వచ్చినట్లయితే మేము మీకు మొత్తం ప్రపంచ చరిత్ర-భూగోళాలను అర్థం చేయిస్తామని చెప్పాలి. ఈ అనంతమైన చరిత్ర-భూగోళాలు ఈశ్వరునికే తెలుసు మరియు ఈశ్వరుని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఈ చరిత్ర-భూగోళాలను తెలుసుకోవడంతో, పవిత్రత, సుఖ-శాంతుల స్థాపన ఎలా జరుగుతుంది అనేదంతా మీరు తెలుసుకుంటారు. మీరు అనంతమైన తండ్రి నుండి తప్పకుండా అనంతమైన వారసత్వాన్నే తీసుకుంటారు. మీరు వచ్చి ఇది అర్థం చేసుకోండి. చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి నిండుగా అయిపోయింది. సంతోషం యొక్క పాదరసం ఎంతగా ఎక్కింది. పిల్లలైన మీ వద్ద మొత్తం నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ఫుల్ తండ్రి నుండి నాలెడ్జ్ లభిస్తుంది. తర్వాత మనమే వెళ్ళి లక్ష్మీనారాయణలుగా అవుతాము. అక్కడ మళ్ళీ ఈ నాలెడ్జ్ ఏమీ ఉండదు. ఇవి అర్థం చేసుకోవాల్సిన ఎంతో గుహ్యమైన విషయాలు. పిల్లలు మెట్ల చిత్రాన్ని మంచి రీతిగా అర్థం చేసుకున్నారు కదా. ఈ చక్రం 84 జన్మలది. ఇప్పుడు మనుష్యులకు కూడా స్పష్టంగా అర్థం చేయించాలి. దీనిని ఇప్పుడు స్వర్గం లేక పావన ప్రపంచమని అనరు. సత్యయుగం వేరు, కలియుగం వేరు. ఈ చక్రం ఎలా తిరుగుతుంది అనేది సులువుగా అర్థం చేయించవచ్చు. వివరణ మంచిగా అనిపిస్తుంది. కానీ పురుషార్థం చేసి స్మృతి యాత్రలో ఉండాలి, ఇది చాలామంది చేయలేరు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పాత దేహాన్ని మరియు పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోయి తండ్రిని మరియు ఇంటిని గుర్తు చేయాలి. ఇప్పుడు మా సుఖమయమైన రోజులు ఇక వచ్చేసాయని సదా ఇదే సంతోషంలో ఉండాలి.

2. నాలెడ్జ్ ఫుల్ తండ్రి నుండి ఏ నాలెడ్జ్ అయితే లభించిందో, దానిని స్మరణ చేస్తూ బుద్ధిని నిండుగా ఉంచుకోవాలి. దేహాభిమానంలోకి వచ్చి ఎప్పుడూ ఏ రకమైన గుటకలను మింగకూడదు.

వరదానము:-

ఈశ్వరీయ భాగ్యంలో లైట్ కిరీటాన్ని ప్రాప్తి చేసుకునే సర్వ ప్రాప్తి స్వరూప భవ

ప్రపంచంలో భాగ్యానికి గుర్తుగా రాజ్యం ఉంటుంది మరియు రాజ్యానికి గుర్తుగా కిరీటం ఉంటుంది. ఇదే విధంగా ఈశ్వరీయ భాగ్యానికి గుర్తు లైట్ కిరీటము మరియు ఈ కిరీటం యొక్క ప్రాప్తికి ఆధారము పవిత్రత. సంపూర్ణ పవిత్రాత్మలు లైట్ కిరీటధారులుగా అవ్వడంతో పాటుగా సర్వ ప్రాప్తులతో కూడా సంపన్నంగా అవుతారు. ఒకవేళ ఏ ప్రాప్తి అయినా తక్కువైనట్లయితే, లైట్ కిరీటము స్పష్టంగా కనిపించదు.

స్లోగన్:-

తమ ఆత్మిక స్థితిలో స్థితులై ఉండేవారే మనసా మహాదానులు.