02-06-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - సత్యమైన తండ్రి మీకు అంతా సత్యాన్నే వినిపిస్తారు, ఇటువంటి సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండాలి, లోపల ఎటువంటి అసత్యమును, కపటమును ఉంచుకోకూడదు

ప్రశ్న:-

సంగమంలో పిల్లలైన మీకు ఏ వ్యత్యాసాల గురించి చాలా బాగా తెలుసు?

జవాబు:-

బ్రాహ్మణులు ఏం చేస్తారు మరియు శూద్రులు ఏం చేస్తారు, జ్ఞాన మార్గం ఏమిటి మరియు భక్తి మార్గం ఏమిటి, ఆ దైహిక సైన్యం కోసం యుద్ధ మైదానం ఏమిటి మరియు మన యుద్ధ మైదానం ఏమిటి - ఈ వ్యత్యాసాలన్నీ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. సత్యయుగంలో లేక కలియుగంలో ఈ వ్యత్యాసాల గురించి ఎవ్వరికీ తెలియదు.

పాట:-
మాతా ఓ మాతా...

ఓంశాంతి

ఏ విధంగానైతే పరమపిత పరమాత్మ శివుని యొక్క మహిమ ఉందో, అలా ఇది భారత మాతల మహిమ. కేవలం ఒకే ఒక్క మాత మహిమ అయితే ఉండలేదు. ఒక్కరే అయితే ఏమీ చేయలేరు. తప్పకుండా సైన్యము కావాలి. సైన్యము లేకుండా పని ఎలా అవుతుంది. శివబాబా ఒక్కరే. ఆ ఒక్కరూ లేకపోతే మాతలు కూడా ఉండరు. పిల్లలూ ఉండరు, బ్రహ్మాకుమారులు మరియు కుమారీలు కూడా ఉండరు. మెజారిటీ మాతలది, అందుకే మాతలకే మహిమ చేయడం జరిగింది. భారత మాతలు, గుప్తమైన శివ శక్తి సైన్యము మరియు అహింసకులు. ఏ రకమైన హింసనూ చేయరు. హింస రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కామ ఖడ్గాన్ని ఉపయోగించడము, రెండవది తుపాకి గుండ్లు మొదలైనవాటిని ఉపయోగించడము, క్రోధము చేయడము, హతమార్చడము మొదలైనవి. ఈ సమయంలో దైహిక సైన్యాలలో ఎవరైతే ఉన్నారో, వారు రెండు హింసలనూ చేస్తారు. ఈ రోజుల్లో తుపాకీలు మొదలైనవాటిని ఉపయోగించడము మాతలకు కూడా నేర్పిస్తున్నారు. వారు దైహిక సైన్యంలోని మాతలు మరియు వీరు ఆత్మిక సైన్యంలోని దైవీ సంప్రదాయం కల మాతలు. వారు డ్రిల్లు మొదలైనవి ఎన్ని నేర్చుకుంటారు. మీరు బహుశా మైదానంలోకి ఎప్పుడూ వెళ్ళి ఉండకపోవచ్చు. వారు చాలా కష్టపడతారు. కామ వికారములోకి కూడా వెళ్తారు, వివాహం చేసుకోనివారు ఎవరో అరుదుగా ఉంటారు. ఆ మిలిటరీలో కూడా చాలా నేర్చుకుంటూ ఉంటారు. చిన్న-చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తారు. అది కూడా సైన్యమే, ఇది కూడా సైన్యమే. సైన్యము గురించైతే గీతలో చాలా విస్తారంగా వ్రాసి ఉంది. కానీ ప్రాక్టికల్ గా ఏం జరిగింది - మనమెంత గుప్తంగా ఉన్నాము అన్నది కేవలం మీకు మాత్రమే తెలుసు. శివశక్తి సైన్యము ఏం చేస్తుంది? విశ్వానికి యజమానులుగా ఎలా అవుతారు? దీనిని యుద్ధ స్థలమని అంటారు. మీ యుద్ధ మైదానము కూడా గుప్తంగా ఉంది. మైదానము అని ఈ నాటక రంగస్థలాన్ని అంటారు. ఇదివరకు మాతలు యుద్ధ మైదానంలోకి వెళ్ళేవారు కాదు. ఇప్పుడు ఇక్కడున్నదానితో అంతా పోల్చడం జరుగుతుంది. రెండు సైన్యాలలోనూ మాతలు ఉన్నారు. అక్కడ మెజారిటీ పురుషులది, ఇక్కడ మెజారిటీ మాతలది. జ్ఞాన మార్గానికి మరియు భక్తి మార్గానికి వ్యత్యాసముంది కదా. ఇది చివరి వ్యత్యాసము. సత్యయుగంలో వ్యత్యాసము యొక్క విషయమేమీ ఉండదు. బ్రాహ్మణులు ఏం చేస్తారు మరియు శూద్రులు ఏం చేస్తారు అన్న వ్యత్యాసాన్ని బాబా వచ్చి తెలియజేస్తారు. ఇరువురూ ఇక్కడ యుద్ధ మైదానంలో ఉన్నారు. ఇది సత్యయుగము లేక కలియుగము యొక్క విషయము కాదు. ఇది సంగమయుగము యొక్క విషయము. పాండవులైన మీరు సంగమయుగంలోని వారు. కౌరవులు కలియుగంలోని వారు. వారు కలియుగ సమయాన్ని చాలా ఎక్కువగా చూపించారు. ఈ కారణం వలన సంగమము గురించి వారికి తెలియనే తెలియదు. మెల్ల-మెల్లగా ఈ జ్ఞానాన్ని కూడా మీ ద్వారా అర్థము చేసుకుంటారు. ఇది కేవలం ఒక్క మాత యొక్క మహిమ కాదు. ఇది శక్తి సైన్యము. ఉన్నతోన్నతమైనవారు ఒక్క భగవంతుడే మరియు మీరు కల్పక్రితము యొక్క సైన్యమే. ఈ భారత్ ను దైవీ రాజ్య స్థానంగా తయారుచేయడము, ఇది మీ పనే.

మీకు తెలుసు, మొదట మనము సూర్యవంశీయులుగా ఉండేవారము, ఆ తర్వాత చంద్రవంశీయులుగా, వైశ్యవంశీయులుగా అయ్యాము. కానీ మహిమ సూర్యవంశీయులదే చేస్తారు. మనము మొదట సూర్యవంశములోకి అనగా స్వర్గములోకి వచ్చేటువంటి పురుషార్థాన్నే చేస్తున్నాము. సత్యయుగాన్ని స్వర్గమని అంటారు. త్రేతాను వాస్తవానికి స్వర్గమని అనరు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని అంటారు కూడా. ఫలానావారు త్రేతాలోని సీతారాముల రాజ్యములోకి వెళ్ళారనైతే అనరు. వైకుంఠంలో శ్రీకృష్ణుని రాజ్యముండేదని భారతవాసులకు తెలుసు. కానీ శ్రీకృష్ణుడిని ద్వాపరంలోకి తీసుకువెళ్ళారు. మనుష్యులకు సత్యమేమిటో తెలియనే తెలియదు. సత్యాన్ని తెలియజేసే సద్గురువు ఎవ్వరూ వారికి లభించనే లేదు, మీకు లభించారు. వారు అంతా సత్యాన్నే తెలియజేస్తారు మరియు సత్యంగా తయారుచేస్తారు. వారు పిల్లలకు చెప్తారు - పిల్లలూ, మీరు ఎప్పుడూ అసత్యము చెప్పకండి, కపటము కలిగి ఉండకండి. మీది ఏదీ దాగి ఉండదు, ఎవరు ఏ విధమైన కర్మలు చేస్తే, ఆ విధంగా పొందుతారు. తండ్రి మంచి కర్మలను నేర్పిస్తారు. ఈశ్వరుని వద్ద ఎవరి వికర్మలు కూడా దాగి ఉండలేవు. కర్మభోగము కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఇది మీ అంతిమ జన్మ కావచ్చు, అయినా కూడా శిక్షలనైతే అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే అనేక జన్మల లెక్కాచారాలు సమాప్తమవ్వనున్నాయి. బాబా అర్థం చేయించారు, కాశీలో కత్తుల బావిలోకి దూకి ప్రాణ త్యాగం చేసేటప్పుడు ప్రాణం పోయేంతవరకు భోగమును అనుభవించాల్సి ఉంటుంది. చాలా కష్టాన్ని సహించాల్సి ఉంటుంది. ఒకటేమో, అనారోగ్యము మొదలైనవాటికి సంబంధించిన కర్మభోగము, రెండవది, వికర్మల యొక్క శిక్షలు. ఇక ఆ సమయంలో ఏమీ మాట్లాడలేరు, ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. దుఃఖంలో రక్షణ కోసం ఆర్తనాదాలు చేస్తారు. పాపాత్ములకు ఇక్కడ కూడా శిక్షలుంటాయి, అక్కడ కూడా శిక్షలు లభిస్తాయి. సత్యయుగంలో పాపము ఉండనే ఉండదు. కోర్టులు ఉండవు, మెజిస్ట్రేటులు ఉండరు, గర్భ జైలు శిక్షలు ఉండవు. అక్కడ గర్భ మహలు ఉంటుంది. రావి ఆకుపై కృష్ణుడు బొటనవ్రేలును చప్పరిస్తూ వచ్చినట్లుగా చూపిస్తారు. అది గర్భ మహలు యొక్క విషయము. సత్యయుగంలో పిల్లలు చాలా సుఖంగా జన్మిస్తారు. ఆదిమధ్యాంతాలు సుఖమే సుఖము ఉంటుంది. ఈ ప్రపంచంలో ఆదిమధ్యాంతాలు దుఃఖమే దుఃఖముంది. ఇప్పుడు మీరు సుఖం యొక్క ప్రపంచంలోకి వెళ్ళేందుకు చదువుకుంటున్నారు. ఈ గుప్త సైన్యము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎవరెంతగా అనేకులకు మార్గాన్ని తెలియజేస్తారో, అంతటి ఉన్నత పదవిని పొందుతారు. స్మృతి విషయంలో కృషి చేయాలి. అనంతమైన వారసత్వము ఏదైతే లభించిందో, దానిని ఇప్పుడు పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పొందుతున్నారు. లౌకిక తండ్రిని, పారలౌకిక తండ్రిని, ఇరువురినీ గుర్తు చేసుకుంటారు. సత్యయుగంలో ఒక్క లౌకిక తండ్రిని మాత్రమే గుర్తు చేసుకుంటారు, పారలౌకిక తండ్రిని స్మృతి చేసే అవసరమే ఉండదు. అక్కడ సుఖమే సుఖము ఉంటుంది. ఈ జ్ఞానము కూడా కేవలం భారతవాసుల కోసమే ఉంది, ఇతర ధర్మాలవారి కోసము కాదు. కానీ ఎవరైతే ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయ్యారో, వారు మళ్ళీ వస్తారు. వచ్చి యోగము నేర్చుకుంటారు. యోగము గురించి అర్థం చేయించేందుకు మీకు ఆహ్వానం లభిస్తే తయారీ చేసుకోవాలి. వారికి అర్థం చేయించాలి - మీరు భారత్ యొక్క ప్రాచీన యోగాన్ని మర్చిపోయారా? భగవంతుడు మన్మనాభవ అని చెప్తున్నారు. పరమపిత పరమాత్మ నిరాకారీ పిల్లలకు చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వస్తారు. ఆత్మలైన మీరు ఈ ఇంద్రియాల ద్వారా వింటారు. ఆత్మనైన నేను ఈ ఇంద్రియాల ఆధారంగా వినిపిస్తాను. నేను అందరికీ తండ్రిని. సర్వశక్తివంతుడు, జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు మొదలైన పేర్లతో నా మహిమను అందరూ పాడుతారు. ఈ టాపిక్ కూడా చాలా బాగుంటుంది - శివ పరమాత్ముని మహిమను మరియు కృష్ణుని మహిమను చెప్పండి. ఇప్పుడు గీతా భగవానుడు ఎవరో నిర్ణయించండి. ఇది చాలా శక్తివంతమైన టాపిక్. దీనిపై మీరు అందరికీ అర్థం చేయించాలి. ఇలా చెప్పండి - మేము ఎక్కువ సమయం తీసుకోము. ఒక నిమిషము ఇచ్చినా చాలు. భగవానువాచ - మన్మనాభవ, నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే స్వర్గ వారసత్వం లభిస్తుంది. ఇలా ఎవరు అన్నారు? నిరాకార పరమాత్మ బ్రహ్మ తనువు ద్వారా బ్రాహ్మణ పిల్లలకు చెప్పారు, వీరినే పాండవ సైన్యము అని కూడా అంటారు. మీరు ఆత్మిక యాత్రకు తీసుకువెళ్ళేందుకు మార్గదర్శకులు. బాబా వ్యాసాలను ఇస్తారు. వాటిని మళ్ళీ రిఫైన్ చేసి ఎలా అర్థం చేయించాలి అని పిల్లలు ఆలోచించాలి. తండ్రిని స్మృతి చేయడంతోనే ముక్తి-జీవన్ముక్తుల వారసత్వం లభిస్తుంది. మేము బ్రహ్మాకుమారులము మరియు బ్రహ్మాకుమారీలము. వాస్తవానికి మీరు కూడా బ్రహ్మాకుమార-కుమారీలే మీరు కానీ మీరు తండ్రిని గుర్తించలేదు. పిల్లలైన మీరు ఇప్పుడు పరమపిత పరమాత్మ ద్వారా దేవతలుగా అవుతున్నారు. భారత్ లోనే లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. చిన్న-చిన్న పిల్లలు పెద్ద శబ్దముతో పెద్ద-పెద్ద సభలలో అర్థం చేయిస్తే ఎంత ప్రభావం పడుతుంది. వీరిలో జ్ఞానముందని, వీరే భగవంతుని మార్గాన్ని తెలియజేస్తారని భావిస్తారు. నిరాకార పరమాత్మనే అంటారు - ఓ ఆత్మలు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. గంగా స్నానాలు, తీర్థ యాత్రలు మొదలైనవి జన్మ-జన్మాంతరాలుగా చేస్తూ-చేస్తూ ఇంకా పతితంగానే అవుతూ వచ్చారు. భారత్ యే ఎక్కే కళలోకి వెళ్తుంది, దిగే కళలోకి వస్తుంది. తండ్రి రాజయోగాన్ని నేర్పించి ఎక్కే కళను ఏర్పరుస్తారు అనగా స్వర్గానికి యజమానులుగా చేస్తారు, ఆ తర్వాత మాయా రావణుడు నరకానికి యజమానులుగా చేస్తాడు కావున దానిని దిగే కళ అని అంటారు కదా. జన్మ-జన్మకు కొద్ది-కొద్దిగా కిందికి దిగే కళ ఏర్పడుతూ ఉంటుంది. జ్ఞానము ఎక్కే కళ. భక్తి దిగే కళ. భక్తి తర్వాత భగవంతుడు లభిస్తారని అంటారు కూడా. కావున భగవంతుడే జ్ఞానాన్ని ఇస్తారు కదా. వారే జ్ఞాన సాగరుడు. జ్ఞాన అంజనమును సద్గురువు ఇచ్చినప్పుడు అజ్ఞాన అంధకారము వినాశనమవుతుంది. సద్గురువు ఒక్క పరమపిత పరమాత్మ మాత్రమే. మహిమ సద్గురువుది, అంతేకానీ గురువుది కాదు. గురువులైతే చాలా మంది ఉన్నారు. సద్గురువు ఒక్కరే. వారే సద్గతిదాత, పతితపావనుడు, ముక్తిదాత. ఇప్పుడు పిల్లలైన మీరు భగవానువాచను వింటారు. నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే ఆత్మలైన మీరు శాంతిధామానికి వెళ్తారు. అది శాంతిధామము, మరొకటి సుఖధామము మరియు ఇది దుఃఖధామము. ఈ మాత్రము కూడా అర్థం చేసుకోరా! తండ్రే వచ్చి పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచంగా తయారుచేస్తారు.

మీకు తెలుసు, అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు అనంతమైన తండ్రి మాత్రమే. అనంతమైన దుఃఖాన్ని రావణుడు ఇస్తాడు. అతడు పెద్ద శత్రువు. రావణ రాజ్యాన్ని పతిత రాజ్యమని ఎందుకు అంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి మొత్తం రహస్యాన్ని మనకు అర్థం చేయించారు. ప్రతి ఒక్కరిలోనూ ఈ 5-5 వికారాలు ప్రవేశించి ఉన్నాయి, అందుకే 10 తలల రావణుడిని తయారుచేస్తారు. ఈ విషయము విద్వాంసులకు, పండితులకు తెలియదు. రామ రాజ్యము ఎప్పటి నుండి ఎప్పటివరకు నడుస్తుంది అనేది ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఈ అనంతమైన చరిత్ర-భౌగోళికాలను అర్థం చేయిస్తారు. రావణుడు భారత్ కు అనంతమైన శత్రువు. అతడు ఎంత దుర్గతిని కలిగించాడు. భారత్ యే స్వర్గముగా ఉండేది, ఈ విషయాన్ని మర్చిపోయారు.

ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి శ్రీమతము లభిస్తుంది - పిల్లలూ, తండ్రిని స్మృతి చేయండి. అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (వారసత్వము). పరమపిత పరమాత్మ స్వర్గాన్ని స్థాపన చేస్తారు. రావణుడు మళ్ళీ నరకాన్ని స్థాపన చేస్తాడు. మీరైతే స్వర్గ స్థాపన చేసే తండ్రిని స్మృతి చేయాలి. గృహస్థ వ్యవహారాలలో ఉండండి, వివాహాలు మొదలైనవాటికి వెళ్ళండి. సమయం లభించినప్పుడు తండ్రిని స్మృతి చేయండి. శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ ఎవరితోనైతే మీకు నిశ్చితార్థం జరిగిందో, వారిని స్మృతి చేయాలి. ఎప్పటివరకైతే వారి ఇంటికి వెళ్ళరో, అప్పటివరకు మీరు అన్ని కర్తవ్యాలను నిర్వహిస్తున్నా కానీ బుద్ధి ద్వారా తండ్రిని మర్చిపోకండి. అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శిక్షల నుండి విముక్తులయ్యేందుకు తమ లెక్కాచారాలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. సత్యమైన తండ్రి నుండి ఏదీ దాచిపెట్టకూడదు. అసత్యమును, కపటమును త్యాగము చేయాలి. స్మృతియాత్రలో ఉండాలి.

2. ఏ విధంగానైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారము చేస్తారో, అలా అందరికీ ఉపకారము చేయాలి. అందరికీ తండ్రి యొక్క సత్య పరిచయాన్ని ఇవ్వాలి.

వరదానము:-

ఈశ్వరీయ సంస్కారాలను కార్యములో ఉపయోగించి సఫలం చేసుకునే సఫలతా మూర్త్ భవ

ఏ పిల్లలైతే తమ ఈశ్వరీయ సంస్కారాలను కార్యములో ఉపయోగిస్తారో, వారి వ్యర్థ సంకల్పాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. సఫలం చేసుకోవడమనగా పొదుపు చేయడము లేక వృద్ధి చేయడము. పాత సంస్కారాలనే ఉపయోగిస్తూ, ఈశ్వరీయ సంస్కారాలను బుద్ధి అనే లాకర్ లో ఉంచుకోవడం కాదు. ఏ విధంగానైతే చాలామందికి మంచి వస్తువులను లేక ధనాన్ని బ్యాంకుల్లో లేక అల్మరాల్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది. పాత వస్తువుల పట్ల ప్రేమ ఉంటుంది, వాటినే ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ ఆ విధంగా చేయకూడదు, ఇక్కడైతే మనసా ద్వారా, వాణి ద్వారా, శక్తిశాలి వృత్తి ద్వారా తమదంతా సఫలం చేసుకోవాలి, అప్పుడు సఫలతా మూర్తులుగా అవుతారు.

స్లోగన్:-

తండ్రి మరియు నేను - ఈ ఛత్రఛాయ తోడుగా ఉన్నట్లయితే ఎటువంటి విఘ్నము నిలవలేదు.

బ్రాహ్మణ పిల్లలందరికీ విశేషమైన అటెన్షన్ - పరమాత్మ మహావాక్యాలు

ఒకే బలము, ఒకే నమ్మకము అనగా సదా ఈ నిశ్చయముండాలి - సాకార మురళి ఏదైతే ఉందో, అదే మురళి. మధుబన్ నుండి ఏ శ్రీమతమైతే లభిస్తుందో, అదే శ్రీమతము. తండ్రి మధుబన్ లో తప్ప ఇంకెక్కడా లభించరు. సదా ఒక్క తండ్రి చదివించే చదువు పట్ల నిశ్చయముండాలి. మధుబన్ నుండి చదువు యొక్క ఏ పాఠమైతే వెళ్తుందో, అదే చదువు, ఇక వేరే చదువేమీ లేదు. ఒకవేళ ఎక్కడైనా భోగ్ మొదలైన సమయాలలో సందేశీ ద్వారా బాబా పాత్ర నడిస్తే, అది పూర్తిగా తప్పు, ఇది కూడా మాయ, దీనిని ఒకే బలము, ఒకే నమ్మకము అని అనరు. మధుబన్ నుండి ఏదైతే మురళి వస్తుందో, దాని పట్ల శ్రద్ధ పెట్టండి లేదంటే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు. మధుబన్ లోనే బాబా మురళి నడుస్తుంది, మధుబన్ లోనే బాబా వస్తారు, అందుకే పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ అటెన్షన్ ఉంచాలి, లేదంటే మాయ మోసం చేసేస్తుంది.