02-10-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


ప్రశ్న:- ఈ జ్ఞాన మార్గములో ఏ విషయాన్ని ఆలోచించడం లేక మాట్లాడడం వలన ఎప్పుడూ ఉన్నతి జరగదు? జవాబు:- డ్రామాలో ఉంటే పురుషార్థము చేస్తాము. డ్రామా చేయిస్తే చేస్తాము. ఇలా ఆలోచించే లేక మాట్లాడే వారి ఉన్నతి ఎప్పుడూ జరగదు. ఇలా అనడమే తప్పు. ఇప్పుడు మనము ఏ పురుషార్థమునైతే చేస్తున్నామో, ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉందని మీకు తెలుసు. పురుషార్థము చేయాల్సిందే.

గీతము:-

ఇది దీపము మరియు తుఫాను యొక్క కథ...... (యహ్ కహాని హై దీవా ఔర్ తూఫాన్ కీ......)

ఓంశాంతి. ఇది కలియుగీ మనుష్యుల పాట. కానీ దీని అర్థము వారికి తెలియదు. ఇది మీకు తెలుసు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగవాసులు. సంగమయుగముతో పాటు పురుషోత్తమ అని కూడా వ్రాయాలి. పిల్లలకు జ్ఞానం యొక్క పాయింట్లు గుర్తు ఉండని కారణంగా ఇలాంటి పదాలను వ్రాయడం మర్చిపోతారు. ఇది ముఖ్యమైనది, దీని అర్థము కూడా మీకు మాత్రమే తెలుసు. పురుషోత్తమ మాసము కూడా ఉంటుంది. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఈ సంగమం కూడా ఒక పండుగ. ఈ పండుగ అన్నిటికన్నా ఉన్నతమైనది. ఇప్పుడు మనము పురుషోత్తములుగా అవుతున్నామని మీకు తెలుసు. ఉత్తమోత్తమ పురుషులు. లక్ష్మీనారాయణులను ఉన్నతాతి ఉన్నతమైనవారు, షావుకారులకే షావుకార్లు, నెంబరువన్ అని అంటారు. మహాప్రళయము జరిగినట్లు, తర్వాత నెంబరువన్ శ్రీకృష్ణుడు సాగరంలో రావి ఆకుపై వచ్చినట్లు శాస్త్రాలలో చూపిస్తారు. అయితే ఇప్పుడు మీరేమంటారు? ఈ శ్రీకృష్ణుడు నెంబరువన్, వారినే శ్యామ-సుందరుడని అంటారు. వారు బొటన వ్రేలు చప్పరిస్తూ వచ్చారని చూపిస్తారు. చిన్న బిడ్డ గర్భములోనే ఉంటాడు. కనుక జ్ఞానసాగరుని నుండి వెలువడిన మొట్టమొదటి ఉత్తమాతి ఉత్తమ పురుషుడు శ్రీకృష్ణుడు. జ్ఞానసాగరుని ద్వారా స్వర్గ స్థాపన జరుగుతుంది. అక్కడ నెంబరువన్ పురుషోత్తముడు ఈ శ్రీకృష్ణుడు మరియు వీరు జ్ఞానసాగరుడు, నీటి సాగరము కాదు. ప్రళయము కూడా జరగదు. కొందరు కొత్త-కొత్త పిల్లలు వస్తారు కనుక బాబా పాత పాయింట్లను మళ్ళీ రిపీట్ చేయవలసి ఉంటుంది. సత్యయుగ-త్రేతా-ద్వాపర-కలియుగము...... ఇవి నాలుగు యుగాలు. ఐదవది పురుషోత్తమ సంగమయుగము. ఈ యుగములో మనుష్యులు మారుతారు. కనిష్ఠుల నుండి సర్వోత్తములుగా అవుతారు. శివబాబాను కూడా పురుషోత్తముడు లేక సర్వోత్తముడు అని అంటారు కదా. వారు ఉన్నదే పరమ ఆత్మ, పరమాత్మ. తర్వాత పురుషులలో ఉత్తములు ఈ లక్ష్మీ-నారాయణులు. వీరిని ఈ విధంగా ఎవరు తయారుచేశారు? ఈ విషయం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఈ విధంగా తయారయ్యేందుకు ఈ సమయంలో మనం పురుషార్థము చేస్తున్నాము అని పిల్లలకు కూడా అర్థమైయ్యింది. పురుషార్థము పెద్దదేమీ కాదు. చాలా సింపుల్. నేర్చుకునేవారు కూడా ఏ మాత్రం చదువుకోని అబలలు, కుబ్జలు. వారి కోసం ఎంత సహజంగా అర్థము చేయించడం జరుగుతుంది. చూడండి, అహ్మదాబాద్ లో ఒక సాధువు ఉండేవారు, నేను ఏమీ తినను-తాగను అని చెప్పేవారు. అచ్ఛా, ఎవరైనా జీవితాంతం తినకుండా-త్రాగకుండా ఉంటే లాభమేముంటుంది? ప్రాప్తి ఏమీ లేదు కదా. వృక్షానికి కూడా భోజనం లభిస్తుంది కదా. దానికి ఎరువు, నీరు మొదలైనవి న్యాచురల్ గా లభిస్తుంది, వాటి ద్వారా వృక్షము వృద్ధి చెందుతుంది. వారు (సాధువు) కూడా ఏదో రిద్ధి-సిద్ధి పొంది ఉంటారు. అగ్ని పైన, నీటి పైన నడిచి వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. కానీ వీటి వలన లాభమేముంటుంది. మీ ఈ సహజ రాజయోగముతో జన్మ-జన్మాంతరాలకు లాభముంటుంది. ఇది మిమ్మల్ని జన్మ-జన్మాంతరాలకు దుఃఖితుల నుండి సుఖవంతులుగా చేస్తుంది. పిల్లలూ, డ్రామానుసారంగా నేను మీకు గుహ్యమైన విషయాలను వినిపిస్తానని తండ్రి చెప్తున్నారు.

శివుడిని మరియు శంకరుడిని ఎందుకు కలిపారో బాబా అర్థము చేయించారు. శంకరునికైతే ఈ సృష్టిలో పాత్రే లేదు. శివుడు, బ్రహ్మా, విష్ణువులకు పాత్ర ఉంది. బ్రహ్మా మరియు విష్ణువులది ఆల్ రౌండ్ పాత్ర. శివబాబా పాత్ర కూడా ఈ సమయంలో ఉంది, వారు వచ్చి జ్ఞానాన్నిస్తారు. తర్వాత నిర్వాణధామానికి వెళ్ళిపోతారు. పిల్లలకు ఆస్తినిచ్చి స్వయం వానప్రస్థంలోకి వెళ్ళిపోతారు. వానప్రస్థులుగా అవ్వడం అనగా గురువు ద్వారా వాణికి అతీతంగా వెళ్ళే పురుషార్థము చేయడం. కానీ తిరిగి ఎవ్వరూ వెళ్ళలేరు ఎందుకంటే వికారీ, భ్రష్టాచారులుగా ఉన్నారు. అందరి జన్మ వికారాల ద్వారానే జరుగుతుంది. ఈ లక్ష్మీనారాయణులు నిర్వికారులు, వారి జన్మ వికారాల ద్వారా జరగదు కనుక వారు శ్రేష్ఠాచారులుగా పిలవబడతారు. కుమారీలు కూడా నిర్వికారులు కనుక వారి ముందు తల వంచుతారు. ఇక్కడ శంకరునికి ఎలాంటి పాత్ర లేదు అని బాబా అర్థం చేయించారు, ఇక ప్రజాపిత బ్రహ్మా తప్పకుండా ప్రజలకు పిత కదా. శివబాబాను ఆత్మల పిత అని అంటారు. వారు అవినాశీ తండ్రి, ఈ గుహ్యమైన విషయాలను బాగా ధారణ చేయాలి. ఎవరైతే గొప్ప-గొప్ప ఫిలాసఫర్లు ఉంటారో, వారికి చాలా టైటిల్స్ లభిస్తాయి. శ్రీ శ్రీ 108 అనే టైటిల్ కూడా విద్వాంసులకు లభిస్తుంది. బనారస్ కాలేజీ నుండి పాస్ అయ్యి టైటిల్స్ తీసుకుంటారు. తండ్రి టైటిల్ ను కూడా వాళ్ళపై పెట్టుకుని కూర్చున్నారు అని వారికి వెళ్ళి అర్థం చేయించమని బాబా గుప్తాజీ ని బనారస్ పంపించారు. తండ్రిని శ్రీ శ్రీ 108 జగత్ గురువు అని అంటారు. 108 మాల ఉంటుంది. అష్టరత్నాలు గాయనము చేయబడతారు. వారు పాస్ విత్ ఆనర్ అవుతారు కనుక వారి మాలను జపిస్తారు. 108 మందికి వారి కన్నా తక్కువ పూజ జరుగుతుంది. యజ్ఞాన్ని రచించినప్పుడు కొందరు 1000 సాలిగ్రామాలను తయారుచేస్తారు, కొందరు 10,000, కొందరు 50,000, కొందరు లక్ష కూడా తయారుచేస్తారు. మట్టితో తయారుచేసి యజ్ఞాన్ని రచిస్తారు. సేఠ్ ఏ విధంగా ఉంటారో, అంత బాగా తయారుచేయిస్తారు, పెద్ద సేఠ్ అయితే లక్ష తయారు చేయిస్తారు. మాల అయితే పెద్దది కదా అని తండ్రి అర్థం చేయించారు - 16,108 మాలను తయారుచేస్తారు. ఈ విషయాలను తండ్రి కూర్చొని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. మీరందరూ బాబాతో పాటు భారతదేశానికి సేవ చేస్తున్నారు. తండ్రికి పూజ జరుగుతునప్పుడు పిల్లలకు కూడా పూజ జరగాలి, రుద్ర పూజ ఎందుకు జరుగుతుందో వారికి తెలియదు. పిల్లలందరూ శివబాబాకు చెందినవారు. ఈ సమయములో సృష్టిలో ఎంత జనభా ఉంది, ఇందులో ఆత్మలందరూ శివబాబాకు పిల్లలే కదా. కానీ అందరూ సహాయకులుగా అవ్వరు. ఈ సమయంలో మీరు ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా ఉన్నతంగా అవుతారు. పూజాయోగ్యులుగా అవుతారు. ఈ విషయాన్ని అర్థం చేయించగల శక్తి వేరెవ్వరికీ లేదు, అందుకే ఈశ్వరుని అంతము ఎవ్వరికీ తెలియదని అంటారు. తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు, తండ్రిని జ్ఞానసాగరుడని అంటారు కనుక తప్పకుండా జ్ఞానాన్నిస్తారు కదా. ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. భగవంతుడు ఏమైనా ప్రేరణ ద్వారా అర్థం చేయిస్తారా. వారి వద్ద సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది, దానిని మళ్ళీ పిల్లలైన మీకు వినిపిస్తారని మీకు తెలుసు. మీకు ఈ నిశ్చయముంది - నిశ్చయమున్నా కూడా తండ్రిని మర్చిపోతారు. తండ్రి స్మృతియే ఈ చదువు యొక్క సారము. స్మృతియాత్ర ద్వారా కర్మాతీత స్థితిని పొందేందుకు శ్రమ అనిపిస్తుంది, ఇందులోనే మాయ విఘ్నాలు వస్తాయి. చదువులో ఇన్ని విఘ్నాలు రావు. శంకరుడు నేత్రాన్ని తెరిస్తే వినాశనం జరుగుతుందని శంకరుని గురించి ఇప్పుడు చెప్తారు, ఇలా చెప్పడం కూడా సరి కాదు. వినాశనము నేనూ చేయించను, శంకరుడు కూడా చేయరు, ఇది తప్పు, దేవతలు పాపము చేయరు అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు శివబాబా కూర్చొని ఈ విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఆత్మకు ఈ శరీరము రథము. ప్రతి ఒక్క ఆత్మ తన రథముపై స్వారీ చేస్తుంది. నేను వీరిది లోన్ గా తీసుకుంటాను కనుక నాది దివ్య అలౌకిక జన్మ అని అంటారని బాబా చెప్తున్నారు. ఇప్పుడు మీ బుద్ధిలో 84 జన్మల చక్రముంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తాము, తర్వాత స్వర్గములోకి వస్తామని మీకు తెలుసు. బాబా చాలా సహజము చేసి అర్థం చేయిస్తారు, ఇందులో హార్ట్ ఫెయిల్ అవ్వకూడదు. బాబా, మేము చదువుకోలేదు, నోటి ద్వారా ఏమీ వెలువడడం లేదు అని చెప్తారు. కానీ అలా జరగదు. నోరు అయితే తప్పకుండా పని చేస్తుంది. భోజనం చేస్తున్నారు అంటే నోరు పని చేస్తుంది కదా. వాణి వెలువడకపోవడమనేది జరగదు. బాబా చాలా సింపుల్ గా అర్థం చేయించారు. ఎవరైనా మౌనంలో ఉన్నాసరే, వారిని స్మృతి చేయండి అని పైకి చూపిస్తారు. దుఃఖహర్త-సుఖకర్త ఆ ఒక్క దాత మాత్రమే. భక్తిమార్గములో కూడా దాతనే, ఈ సమయంలో కూడా దాతనే, తర్వాత వానప్రస్థంలో శాంతి మాత్రమే ఉంటుంది. పిల్లలు కూడా శాంతిధామంలో ఉంటారు. పాత్ర నిర్ణయించబడి ఉంది, అది పాత్రలోకి వస్తుంది. విశ్వాన్ని కొత్తగా తయారుచేయడం ఇప్పుడు మన పాత్ర. హెవెన్లీ గాడ్ ఫాదర్ అనే వారి పేరు చాలా బాగుంది. తండ్రి స్వర్గ రచయిత. తండ్రి నరకాన్ని రచించరు. పాత ప్రపంచాన్ని ఎవరైనా రచిస్తారా. ఎప్పుడూ కొత్త ఇల్లే నిర్మించబడుతుంది. శివబాబా బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. వారికి పాత్ర లభించి ఉంది. ఇక్కడ పాత ప్రపంచములో ఉన్న మనుష్యులందరూ ఒకరికొకరు దుఃఖాన్నిచ్చుకుంటూ ఉంటారు.

మనము శివబాబా సంతానమని మీకు తెలుసు. తర్వాత శరీరధారి ప్రజాపిత బ్రహ్మాకు దత్తత తీసుకోబడిన పిల్లలుగా అయ్యాము. మనకు జ్ఞానాన్ని వినిపించేవారు, రచయిత అయిన శివబాబా. వారు తమ రచన యొక్క ఆదిమధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తారు. ఈ విధంగా అవ్వడమే మీ ముఖ్య లక్ష్యము-ఉద్దేశ్యము. మనుష్యులు ఎంతగా ఖర్చు చేసి మార్బల్ మొదలైనవాటితో మూర్తులను తయారుచేస్తారో చూడండి. ఇది ఈశ్వరీయ విశ్వ విద్యాలయము, వరల్డ్ యూనివర్సిటీ. మొత్తం విశ్వాన్ని చేంజ్ చేయడం జరుగుతుంది. వారికున్న క్యారెక్టర్లు అన్నీ ఆసురీ క్యారెక్టర్లు. అవి ఆదిమధ్యాంతాలు దుఃఖాన్నిచ్చేవి. ఇది ఈశ్వరీయ విశ్వ విద్యాలయము. ఈశ్వరీయ విశ్వ విద్యాలయము ఒక్కటే ఉంటుంది, దానిని ఈశ్వరుడే వచ్చి తెరుస్తారు, దీని ద్వారా మొత్తం విశ్వానికి కళ్యాణము జరుగుతుంది. పిల్లలైన మీకిప్పుడు రైట్ మరియు రాంగ్ యొక్క వివేకము లభిస్తుంది, ఇలా అర్థం చేసుకునే మనుష్యులు ఎవ్వరూ లేరు. రైట్ రాంగ్ లను అర్థం చేయించేవారు ఒక్కరే ధర్మయుక్తమైనవారు, వారినే సత్యము అని అంటారు. తండ్రియే వచ్చి ప్రతి ఒక్కరిని ధర్మయుక్తంగా తయారుచేస్తారు. ధర్మయుక్తంగా అయినట్లయితే ముక్తిలోకి వెళ్ళి జీవన్ముక్తిలోకి వస్తారు. పిల్లలైన మీకు డ్రామా గురించి కూడా తెలుసు. ఆది నుండి మొదలుకొని అంతిమం వరకు పాత్రను అభినయించేందుకు నెంబరువారుగా వస్తారు. ఈ ఆట నడుస్తూనే ఉంటుంది. డ్రామా షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది ఎవర్ న్యూ. ఈ డ్రామా ఎప్పుడూ పాతదిగా అవ్వదు, మిగితా నాటకాలు మొదలైనవన్నీ వినాశనమైపోతాయి. ఇది అనంతమైన అవినాశీ డ్రామా. ఇందులో అందరూ అవినాశీ పాత్రధారులు. అవినాశీ ఆట లేక రంగస్థలం ఎంత పెద్దదిగా ఉందో చూడండి. తండ్రి వచ్చి పాత సృష్టిని మళ్ళీ కొత్తదిగా చేస్తారు. అవన్నీ మీకు సాక్షాత్కారమవుతాయి. సమీపంగా వచ్చే కొద్దీ మీకు సంతోషము కలుగుతుంది. సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇప్పుడు పాత్ర పూర్తయ్యిందని చెప్తారు. డ్రామా అయితే మళ్ళీ రిపీట్ అవ్వాలి. కల్పక్రితం అభినయించిన పాత్రను మళ్ళీ కొత్తగా అభినయిస్తారు. ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు, కనుక ఎంత వీలైతే అంత పిల్లలైన మీరు ఉన్నత పదవిని పొందాలి. పురుషార్థము చేయాలి, తికమకపడకూడదు. డ్రామా ఏది చేయించాలని ఉంటే, అది చేయిస్తుంది - ఇలా అనడం కూడా తప్పు. మనమైతే పురుషార్థము చేయాల్సిందే. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. చదువు యొక్క సారాన్ని బుద్ధిలో ఉంచుకొని స్మృతియాత్ర ద్వారా కర్మాతీత స్థితిని పొందాలి. ఉన్నతమైనవారిగా, పూజ్యనీయులుగా అయ్యేందుకు తండ్రికి పూర్తిగా సహాయకులుగా అవ్వాలి.

2. సత్యమైన తండ్రి ద్వారా లభించిన రైట్-రాంగ్ యొక్క వివేకము ద్వారా ధర్మయుక్తంగా అయి జీవన బంధనము నుండి ముక్తులవ్వాలి. ముక్తి మరియు జీవన్ముక్తుల వారసత్వం తీసుకోవాలి.

వరదానము:-

సంగమయుగపు సర్వ ప్రాప్తులను స్మృతిలో ఉంచుకొని ఎక్కేకళను అనుభవం చేసే శ్రేష్ఠ ప్రారబ్ధీ భవ

పరమాత్మ మిలనము మరియు పరమాత్మ జ్ఞానానికి గల విశేషత - అవినాశీ ప్రాప్తులు కలగడం. సంగమయుగము పురుషార్థీ జీవితము మరియు సత్యయుగము ప్రారబ్ధము పొందే జీవితమని కాదు. ఒక అడుగు వేయండి మరియు ప్రారబ్ధములో వేయి అడుగులు పొందండి అనేది సంగమయుగ విశేషత. కనుక కేవలం పురుషార్థము చేసేవారే కాదు, కానీ శ్రేష్ఠమైన ప్రారబ్ధమును పొందేవారు - ఈ స్వరూపాన్ని సదా ముందుంచుకోండి. ప్రారబ్ధాన్ని చూసి సహజంగానే ఎక్కేకళను అనుభవం చేస్తారు. "పొందాల్సినదంతా పొందేశాము" - ఈ పాట పాడుతూ ఉన్నట్లయితే గుటకలు మింగడం మరియు కునికిపాట్లు పడడం నుండి రక్షింపబడతారు.

స్లోగన్:-

బ్రాహ్మణుల శ్వాస ధైర్యము, దీని ద్వారా కఠినాతి కఠినమైన కార్యము కూడా సులభమైపోతుంది.

 

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

"ముక్తి మరియు మోక్షము

ఈ రోజులలో మనుష్యులు ముక్తినే మోక్షమని అంటారు, ఎవరైతే ముక్తి పొందుతారో, వారు జనన మరణాల నుండి విడుదల అవుతారని భావిస్తారు. వారు జనన మరణాలలోకి రాకపోవడమే ఉన్నతమైన పదవిగా భావిస్తారు, దానినే ప్రారబ్ధమని నమ్ముతారు. జీవితంలో ఉంటూ మంచి కర్మలు చేయడమే జీవన్ముక్తి అని భావిస్తారు, ధర్మాత్మలు వంటివారిది జీవన్ముక్తిగా భావిస్తారు. అంతేకానీ, కర్మ బంధనాల నుండి ముక్తులవ్వడమే జీవన్ముక్తి అని కోటిలో ఎవరో అరుదుగా మాత్రమే అర్థం చేసుకుంటారు, ఇప్పుడిది వారి స్వంత మతము. కానీ ఎంతవరకైతే మనుష్యులు మొదట వికారీ కర్మ బంధనాల నుండి ముక్తులవ్వరో, అంతవరకు ఆది-మధ్యాంతాలు దుఃఖము నుండి విడుదలవ్వలేరని మనము పరమాత్మ ద్వారా తెలుసుకున్నాము. కనుక దీని నుండి విడుదల అవ్వడం కూడా ఒక స్టేజ్. అది కూడా మొదట ఈశ్వరీయ జ్ఞానాన్ని ధారణ చేసినప్పుడే, ఆ స్టేజ్ వరకు చేరుకోగలరు మరియు ఆ స్టేజ్ వరకు చేర్చేందుకు స్వయంగా పరమాత్మ కావాలి, ఎందుకంటే ముక్తి జీవన్ముక్తులను ఇచ్చేవారు వారు, అది కూడా ఒక్క సమయములోనే వచ్చి అందరికీ ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు. అంతేకానీ పరమాత్మ అనేకసార్లు ఏమీ రారు. పరమాత్మయే అన్ని అవతారాలను ధారణ చేస్తారని కూడా భావించకండి. ఓం శాంతి.