02-10-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - ఇప్పుడిది ఈ మృత్యులోకం యొక్క అంతిమము, అమరలోకం స్థాపనవుతుంది, అందుకే మీరు మృత్యులోకం వారిని స్మృతి చేయకూడదు

ప్రశ్న:-

తండ్రి తమ పేద పిల్లలకు ఏ స్మృతిని ఇప్పిస్తారు?

జవాబు:-

పిల్లలూ, మీరు వైస్ లెస్ (పవిత్రం) గా ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉండేవారు. మీ వంటి షావుకారులు ఇంకెవ్వరూ ఉండేవారు కారు, మీరు అపార సుఖవంతులుగా ఉండేవారు. భూమి, ఆకాశం అన్నీ మీ చేతిలోనే ఉండేవి. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని మళ్ళీ షావుకారులుగా చేసేందుకు వచ్చారు.

గీతము:-
నయన హీనులకు దారి చూపించండి ప్రభూ..... (నయన్ హీన్ కో రాహ్ దిఖావో ప్రభూ...)

ఓంశాంతి.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు, ఆత్మలు పాట విన్నారు. ఇలా ఎవరన్నారు? ఆత్మల యొక్క ఆత్మిక తండ్రి అన్నారు. ఆత్మిక తండ్రితో ఆత్మిక పిల్లలు - బాబా అని అన్నారు. వారిని ఈశ్వరుడని కూడా అంటారు, తండ్రి అని కూడా అంటారు. ఏ తండ్రి? పరమపిత. ఇద్దరు తండ్రులున్నారు. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. లౌకిక తండ్రి పిల్లలు పారలౌకిక తండ్రిని - ఓ బాబా అని పిలుస్తారు. బాబా పేరేమిటి? శివ. ఆ నిరాకారుడైన శివుడు పూజించబడతారు. వారిని సుప్రీమ్ ఫాదర్ అని అంటారు. లౌకిక తండ్రిని సుప్రీమ్ అని అనరు. ఉన్నతోన్నతమైనవారు, ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. జీవాత్మలందరూ ఆ తండ్రిని స్మృతి చేస్తారు. మన తండ్రి ఎవరు అనేది ఆత్మలు మర్చిపోయారు. ఇలా పిలుస్తారు - ఓ గాడ్ ఫాదర్, నయనహీనులైన మాకు నయనాలు ఇవ్వండి, అప్పుడు మేము మా తండ్రిని గుర్తించగలము, భక్తి మార్గంలో మేము అంధులమై ఎదురుదెబ్బలు తింటూ ఉంటాము, ఇప్పుడు ఆ ఎదురుదెబ్బల నుండి విడిపించండి. తండ్రియే కల్ప-కల్పము వచ్చి భారత్ ను స్వర్గంగా తయారుచేస్తారు. ఇప్పుడు ఇది కలియుగం, సత్యయుగం రానున్నది. కలియుగం మరియు సత్యయుగానికి మధ్యన ఉన్న సమయాన్ని సంగమం అని అంటారు. ఇది పురుషోత్తమ సంగమము. అనంతమైన తండ్రి వచ్చి - భ్రష్టాచారులుగా అయిన వారిని శ్రేష్ఠాచారులుగా, పురుషోత్తములుగా తయారుచేస్తారు. లక్ష్మీనారాయణులు పురుషోత్తములుగా ఉండేవారు. లక్ష్మీనారాయణుల వంశం యొక్క రాజ్యముండేది. తండ్రి వచ్చి దీని స్మృతినిప్పిస్తారు. భారతవాసులైన మీరు నేటికి 5 వేల సంవత్సరాల క్రితం స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేది, భారత్ కు చాలా మహిమ ఉండేది. బంగారం-వజ్రాలతో తయారుచేయబడిన మహళ్ళు ఉండేవి. ఇప్పుడు ఏమీ లేవు. ఆ సమయంలో వేరే ధర్మాలేవీ ఉండేవి కావు, కేవలం సూర్యవంశీయులు మాత్రమే ఉండేవారు. చంద్రవంశీయులు తర్వాత వస్తారు. మీరే సూర్యవంశీయులుగా ఉండేవారని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పటికీ లక్ష్మీనారాయణుల మందిరాలను నిర్మిస్తూ ఉన్నారు. కానీ, లక్ష్మీనారాయణుల రాజ్యం ఎప్పుడు ఉండేది, వారు ఆ రాజ్యాన్ని ఎలా పొందారు అనేది ఎవ్వరికీ తెలియదు. పూజ చేస్తారు కానీ వారి గురించి తెలియకపోతే, అది అంధ విశ్వాసం అయినట్లు కదా. శివుడిని, లక్ష్మీనారాయణులను పూజిస్తారు కానీ వారి జీవితచరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు. భారతవాసులు తమంతట తామే అంటారు - మేము పతితులుగా ఉన్నాము, ఓ పతితపావనుడైన బాబా రండి, వచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి, రావణ రాజ్యం నుండి ముక్తులుగా చేయండి అని. తండ్రి వచ్చి అందరినీ ముక్తులుగా చేస్తారు. సత్యయుగంలో ఒకే రాజ్యముండేదని పిల్లలకు తెలుసు. కాంగ్రెస్ వారు మరియు బాపూజీ కూడా అనేవారు - మాకు మళ్ళీ రామరాజ్యం కావాలి, మేము స్వర్గవాసులుగా అవ్వాలని అనుకుంటున్నాము. ఇప్పుడు నరకవాసుల పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారా? దీనిని నరకము, ఆసురీ ప్రపంచమని అంటారు. ఈ భారత్ యే ఒకప్పుడు దైవీ ప్రపంచంగా ఉండేది. ఇప్పుడు ఆసురీ ప్రపంచంగా తయారయింది.

తండ్రి అర్థం చేయిస్తారు - మీరు 84 జన్మలు తీసుకున్నారు, 84 లక్షల జన్మలు కాదు. ఇది శాస్త్రాలలో ప్రగల్భంగా రాసేశారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం సద్గతి మార్గముండేది. అక్కడ భక్తి గాని, దుఃఖం యొక్క నామ-రూపాలు గాని ఉండేవి కావు, దానిని సుఖధామమని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు - మీరు వాస్తవానికి శాంతిధామ నివాసులు. ఇక్కడికి మీరు పాత్రను అభినయించేందుకు వచ్చారు. పునర్జన్మలు 84 ఉంటాయి, అంతేకానీ 84 లక్షలు కాదు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. తండ్రి ఆత్మలైన మీతో మాట్లాడుతారు. ఇతర సత్సంగాలలో మనుష్యులు, మనుష్యులకు భక్తి విషయాలను వినిపిస్తారు. అర్ధకల్పం భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు, పతితులు ఒక్కరు కూడా ఉండేవారు కారు. ఇప్పుడు పావనమైనవారు ఒక్కరు కూడా లేరు. ఇది పతిత ప్రపంచము. తండ్రి అర్థం చేయిస్తారు - గీతలో కృష్ణ భగవానువాచ అని రాసేసారు. కృష్ణుడు భగవంతుడు కాదు, అలాగని వారు గీతను వినిపించలేదు. ఈ మనుష్యులకు తమ ధర్మ శాస్త్రాల గురించి కూడా తెలియదు. తమ ధర్మాన్నే మర్చిపోయారు. ముఖ్యమైన ధర్మాలు 4, మొదటిది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం, ఇందులో ముందు సూర్యవంశం, ఆ తర్వాత చంద్రవంశం ఉంటాయి, రెండింటినీ కలిపి దేవీ-దేవతా ధర్మమని అంటారు. అక్కడ దుఃఖము అన్న మాటే లేదు. 21 జన్మలు మీరు సుఖధామంలో ఉండేవారు. తర్వాత రావణ రాజ్యం, భక్తి మార్గం ప్రారంభమవుతుంది. శివబాబా ఎప్పుడు వస్తారు? రాత్రి అయినప్పుడు, భారతవాసులు ఘోర అంధకారంలోకి వస్తారు, అప్పుడు బాబా వస్తారు. బొమ్మల పూజ చేస్తూ ఉంటారు. ఒక్కరి జీవితచరిత్ర గురించి కూడా తెలియదు. భక్తి మార్గంలో అనేక ఎదురుదెబ్బలు తింటారు. తీర్థ స్థానాలకు వెళ్తారు, ప్రదక్షిణలు చేస్తారు, ఏ ప్రాప్తి ఉండదు. తండ్రి అంటారు - నేను వచ్చి బ్రహ్మా ద్వారా మీకు యథార్థ జ్ఞానాన్ని వినిపిస్తాను. మాకు సుఖధామం మరియు శాంతిధామం యొక్క మార్గాన్ని తెలియపరచండి అని పిలుస్తారు. తండ్రి అంటారు - నేటికి 5 వేల సంవత్సరాల క్రితం నేను మిమ్మల్ని చాలా షావుకారులుగా తయారుచేసాను, ఎంతో ధనాన్ని ఇచ్చాను, అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? మీరు ఎంత షావుకారులుగా ఉండేవారు. ఇప్పుడు దీనిని భారత్ అని ఎవరంటారు. భారత్ యే అన్నింటికన్నా ఉన్నతోన్నతమైన ఖండంగా ఉండేది. వాస్తవానికి ఇది అందరికీ తీర్థ స్థానము, ఎందుకంటే ఇది పతితపావనుడైన తండ్రి యొక్క జన్మ స్థలము. అన్ని ధర్మాల వారికి తండ్రి వచ్చి సద్గతినిస్తారు. ఇప్పుడు రావణుని రాజ్యం మొత్తం సృష్టిలో ఉంది, కేవలం లంకలో మాత్రమే కాదు. సూర్యవంశ రాజ్యమున్నప్పుడు ఈ వికారాలు ఉండేవి కావు. భారత్ నిర్వికారిగా ఉండేది, ఇప్పుడు వికారిగా ఉంది. అందరూ నరకవాసులుగా ఉన్నారు. సత్యయుగంలో ఉన్న దైవీ సంప్రదాయం వారు 84 జన్మలను అనుభవించి, ఆసురీ సంప్రదాయం వారిగా అయ్యారు, మళ్ళీ దైవీ సంప్రదాయం వారిగా అవ్వాలి. భారత్ చాలా షావుకారుగా ఉండేది, ఇప్పుడు నిరుపేదగా అయింది, అందుకే భిక్షం అడుగుతుంది. తండ్రి పేద పిల్లలైన మీకు స్మృతినిప్పిస్తున్నారు - పిల్లలూ, మీరు ఎంత సుఖంగా ఉండేవారు, మీలాంటి సుఖం ఇంకెవ్వరికీ లభించదు. భూమి, ఆకాశం అన్నీ మీ చేతుల్లోనే ఉండేవి. శాస్త్రాలలో కల్పం ఆయువును ఎక్కువగా చెప్పి, అందరినీ కుంభకర్ణుని ఆసురీ నిద్రలో నిద్రపుచ్చారు. ఈ భారత్, శివబాబా స్థాపించిన శివాలయంగా ఉండేది. అక్కడ పవిత్రత ఉండేది, ఆ కొత్త ప్రపంచంలో దేవీ-దేవతలు రాజ్యం చేసేవారు. రాధా-కృష్ణులకు పరస్పరంలో ఏ సంబంధముంది అనేది కూడా మనుష్యులకు తెలియదు. ఇరువురు వేర్వేరు రాజధానులకు చెందినవారు, స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ జ్ఞానం మనుష్యమాత్రులు ఎవ్వరిలోనూ లేదు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కేవలం తండ్రి మాత్రమే ఇస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు - ఆత్మాభిమానులుగా అవ్వండి, మీ పరమపితనైన నన్ను స్మృతి చేయండి. స్మృతి ద్వారా తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయిపోతారు. మీరు ఇక్కడకు మనుష్యుల నుండి దేవతలుగా అనగా పతితుల నుండి పావనులుగా తయారయ్యేందుకు వస్తారు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. భక్తిలో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. భక్తి చేసేవారందరూ రావణుని గుప్పిట్లో ఉన్నారు. మొత్తం ప్రపంచమంతా 5 వికారాల రూపీ రావణుని జైలులో ఉన్నారు, శోకవాటికలో ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ ముక్తులుగా చేసి, మార్గదర్శకునిగా అయి తమతో పాటు తీసుకువెళ్తారు. దీని కోసమే ఈ మహాభారత యుద్ధం ఉంది, ఇది 5 వేల సంవత్సరాల క్రితం జరిగింది, ఇప్పుడు తండ్రి మళ్ళీ స్వర్గాన్ని తయారుచేస్తున్నారు. అలాగని ధనం ఎక్కువగా ఉన్నవారు స్వర్గంలో ఉన్నారని కాదు. ఇప్పుడిక్కడ ఉన్నదే నరకము. పతితపావన అని తండ్రిని అంటారు, అంతేకానీ నదిని కాదు. ఇదంతా భక్తి మార్గము. ఈ విషయాలను తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ విషయమైతే మీకు తెలుసు - ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి, మూడవవారు అలౌకిక తండ్రి. ఇప్పుడు, పారలౌకిక తండ్రి అయిన శివబాబా, బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. బ్రాహ్మణులను దేవతలుగా తయారుచేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆత్మనే పునర్జన్మలు తీసుకుంటుంది. నేను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటానని ఆత్మనే అంటుంది. తండ్రి అంటారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా తయారవుతారు. ఏ దేహధారినీ స్మృతి చేయకండి. ఇప్పుడు ఇది మృత్యులోకం యొక్క అంతిమము, అమరలోక స్థాపన జరుగుతుంది. మిగిలిన అనేక ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. సత్యయుగంలో దేవీ-దేవతా ధర్మం ఒక్కటే ఉండేది, తర్వాత చంద్రవంశీయులైన సీతా-రాములు త్రేతాయుగంలో ఉండేవారు. పిల్లలైన మీకు పూర్తి చక్రం యొక్క స్మృతినిప్పిస్తారు. శాంతిధామం మరియు సుఖధామం యొక్క స్థాపన తండ్రియే చేస్తారు. మనుష్యులు, మనుష్యులకు సద్గతినివ్వలేరు. వారంతా భక్తి మార్గంలోని గురువులు.

ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము. బాబా నుండి రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. ఈ రాజధాని స్థాపనవుతుంది. చాలా మంది ప్రజలు తయారవ్వనున్నారు. కోట్లలో కొందరే రాజులుగా అవుతారు. సత్యయుగాన్ని పుష్పాల తోట అని అంటారు. ఇప్పుడిది ముళ్ళ అడవి. రావణ రాజ్యం పరివర్తనవుతుంది. వినాశనం జరగాల్సి ఉంది. ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభిస్తుంది. లక్ష్మీనారాయణులకు ఈ జ్ఞానముండదు. ప్రాయఃలోపమైపోతుంది. భక్తి మార్గంలో తండ్రి గురించి ఎవరికీ యథార్థంగా తెలియదు. తండ్రి రచయిత. బ్రహ్మా, విష్ణు, శంకరులు కూడా రచన. సర్వవ్యాపి అని అనడంతో వారసత్వం యొక్క హక్కు సమాప్తమైపోతుంది. బాబా వచ్చి అందరికీ వారసత్వాన్ని ఇస్తారు. సత్యయుగంలో మొట్టమొదట వచ్చేవారే 84 జన్మలను తీసుకుంటారు. క్రైస్తవులు మహా అంటే 40 జన్మలు తీసుకుంటూ ఉండవచ్చు. ఒక్క భగవంతుడిని వెతికేందుకు ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు. ఇప్పుడు మీరు ఎదురుదెబ్బలు తినరు. ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే తమోప్రధానం నుండి సతోప్రధానంగా తయారవుతారు. ఇది యాత్ర. ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. మీ ఆత్మ చదువుకుంటుంది. ఆత్మ నిర్లేపి అని సాధు-సత్పురుషులు అంటారు. కానీ, ఆత్మనే కర్మల అనుసారంగా తర్వాత జన్మ తీసుకుంటుంది. ఆత్మనే మంచి లేక చెడు కర్మలు చేస్తుంది. ఈ సమయంలో (కలియుగంలో) మీ కర్మలు వికర్మలుగా ఉంటాయి, సత్యయుగంలో మీ కర్మలు అకర్మలుగా ఉంటాయి. అక్కడ వికర్మలు జరగవు. అది పుణ్యాత్ముల ప్రపంచము. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. శ్రేష్ఠ కర్మలు చేయాలి. తండ్రి లభించారు కనుక ఎలాంటి ఎదురుదెబ్బలు తినకూడదు.

2. తండ్రి ఏ స్మృతినైతే ఇప్పించారో, అది గుర్తుంచుకొని అపారమైన సంతోషంలో ఉండాలి. దేహధారులు ఎవ్వరినీ స్మృతి చేయకూడదు.

వరదానము:-

నిమిత్తం అనే స్మృతి ద్వారా తమ ప్రతి సంకల్పంపై అటెన్షన్ పెట్టే నివారణ స్వరూప భవ

నిమిత్తంగా ఉన్న ఆత్మల పట్ల అందరి దృష్టి ఉంటుంది, అందుకే నిమిత్తంగా అయ్యేవారికి విశేషంగా తమ ప్రతి సంకల్పం పట్ల అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నిమిత్తంగా ఉన్న పిల్లలు కూడా ఏదైనా కారణాన్ని వినిపిస్తే, వారిని ఫాలో చేసేవారు కూడా అనేక కారణాలు వినిపిస్తారు. ఒకవేళ నిమిత్తంగా అయ్యేవారిలో ఏదైనా లోపముంటే, అది దాగి ఉండలేదు. అందుకే విశేషంగా తమ సంకల్పాలు, మాటలు మరియు కర్మల పట్ల అటెన్షన్ పెట్టి నివారణ స్వరూపులుగా అవ్వండి.

స్లోగన్:-

ఎవరికైతే తమ గుణాలు లేక విశేషతల గురించిన అభిమానము కూడా ఉండదో, వారే జ్ఞానయుక్త ఆత్మలు.

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు -

1) మనుష్యుల లక్ష్యమేమిటి? ఆ లక్ష్యాన్ని ప్రాప్తించుకునేందుకు యథార్థ విధి

తమ జీవితాన్ని మంచిగా తయారుచేసుకునేందుకు అనుగుణమైనది ఏమిటి అనేది మనుష్యులు ప్రతి ఒక్కరు తప్పకుండా ఆలోచించాలి. మనుష్యుల జీవితం దేనికోసముంది, ఆ జీవితంలో ఏమి చేయాలి? ఇప్పుడు తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి - నా జీవితంలో ఆ పరివర్తన జరుగుతుందా. మనుష్య జీవితంలో ముందు జ్ఞానం కావాలి, ఆ తర్వాత ఈ జీవితం యొక్క లక్ష్యమేమిటి? ఈ జీవితంలో సదా సుఖము మరియు శాంతి కావాలని తప్పకుండా ఒప్పుకుంటారు. మరి అవి ఇప్పుడు మీకు లభిస్తున్నాయా? ఈ ఘోర కలియుగంలో దుఃఖం, అశాంతి తప్ప ఇంకేమీ లేవు. ఇప్పుడు సుఖ-శాంతులు ఎలా లభిస్తాయి అనేది ఆలోచించాలి. సుఖము మరియు శాంతి అనే ఈ రెండు పదాలు, తప్పకుండా ఈ ప్రపంచంలోనే ఎప్పుడో ఒకప్పుడు ఉండి ఉంటాయి, కనుకనే ఈ రెండు కావాలని కోరుకుంటారు. ఒకవేళ మనుష్యులు ఎవరైనా - మేము అటువంటి ప్రపంచాన్ని చూడనే లేదని అంటే, అటువంటి ప్రపంచం ఉందని మీరెలా ఒప్పుకుంటారు? దీని గురించి ఏమని అర్థం చేయించడం జరుగుతుందంటే - పగలు మరియు రాత్రి అనే రెండు పదాలు ఉన్నాయంటే తప్పకుండా పగలు మరియు రాత్రి నడుస్తాయి. మేము కేవలం రాత్రిని మాత్రమే చూసాము కనుక పగలు ఉందని ఎలా నమ్మాలి - అని ఎవరూ అనలేరు. రెండు పేర్లు ఉన్నాయంటే, వాటి పాత్ర కూడా ఉంటుంది. అలాగే మనం కూడా విన్నాము - ఈ కలియుగం కంటే ఉన్నతమైన స్థితి కూడా ఒకప్పుడు ఉండేది, దానిని సత్యయుగమని అంటారు! ఒకవేళ ఇప్పటి లాంటి సమయమే నడుస్తూ వచ్చుంటే, ఆ సమయానికి సత్యయుగం అనే పేరును ఎందుకు ఇచ్చారు! అంటే ఈ సృష్టి తన స్థితిని మార్చుకుంటూ ఉంటుంది. ఎలాగైతే కిషోర, బాల, యువ, వృద్ధ.... అవస్థలు మారుతూ ఉంటాయో, అలాగే ఈ సృష్టి కూడా మారుతూ ఉంటుంది. నేటి జీవితానికి మరియు ఆ జీవితానికి ఎంత తేడా ఉంది. కనుక అటువంటి శ్రేష్ఠమైన జీవితాన్ని తయారుచేసుకునేందుకు ప్రయత్నం చేయాలి.

2) నిరాకార ప్రపంచము, ఆకారీ ప్రపంచము మరియు సాకార ప్రపంచం యొక్క విస్తారము

ఈ పూర్తి బ్రహ్మాండంలో మూడు ప్రపంచాలున్నాయి - ఒకటి నిరాకార ప్రపంచము, మరొకటి ఆకారీ ప్రపంచము, మూడవది సాకార ప్రపంచము. నిరాకార సృష్టిలో ఆత్మలు నివసిస్తాయని మరియు సాకార సృష్టిలో సాకార మనుష్య సంప్రదాయం వారు నివసిస్తారని ఇప్పుడు తెలుసుకున్నారు. ఇక మిగిలింది ఆకారీ సూక్ష్మ సృష్టి. ఇప్పుడు, ఈ ఆకారీ సృష్టి సదా ఉంటుందా లేక దాని పాత్ర కొంత సమయం నడుస్తుందా - అనే ఆలోచన వస్తుంది. సూక్ష్మ ప్రపంచం ఎక్కడో పైన ఉందని, అక్కడ ఫరిశ్తాలు ఉంటారని, దానినే స్వర్గమని అంటారని, అక్కడకు వెళ్ళి సుఖాన్ని అనుభవిస్తారని ప్రపంచంలోని మనుష్యులు భావిస్తారు. కానీ - స్వర్గము మరియు నరకము ఈ సృష్టిలోనే ఉంటాయని ఇప్పుడు స్పష్టమయింది. ఇకపోతే, ఈ సూక్ష్మ ఆకారీ సృష్టి, ఎక్కడైతే శుద్ధ ఆత్మల సాక్షాత్కారం జరుగుతుందో, అది ద్వాపరం నుండి మొదలుకొని ప్రారంభమయింది. భక్తి మార్గం ప్రారంభమైనప్పుడు - నిరాకార సృష్టి మరియు సాకార సృష్టి సదా ఉండనే ఉంటాయని ఋజువయింది. సూక్ష్మ ప్రపంచం సదా ఉంటుందని అనరు, అందులో కూడా ముఖ్యంగా బ్రహ్మా, విష్ణువు, శంకరుల సాక్షాత్కారం మనకు ఈ సమయంలోనే జరుగుతుంది, ఎందుకంటే ఈ సమయంలోనే పరమాత్మ మూడు కర్తవ్యాలు చేసేందుకు, మూడు రూపాలను రచిస్తారు. అచ్ఛా - ఓం శాంతి.