03-02-2020 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము


'' మధురమైన పిల్లలారా - ఇంటింటికి బాబా సందేశాన్ని ఇవ్వడం మీ బాధ్యత, ఎటువంటి పరిస్థితులలోనైనా యుక్తి రచించి ప్రతి ఒక్కరికి తండ్రి పరిచయాన్ని తప్పకుండా ఇవ్వండి ''

ప్రశ్న :-

పిల్లలైన మీకు ఏ ఒక్క విషయంలో ఆసక్తి ఉండాలి ?

జవాబు :-

కొత్త కొత్త పాయింట్లు ఏవైతే వెలువడుతాయో, వాటిని తమ వద్ద నోట్‌ చేసుకునే ఆసక్తి ఉండాలి, ఎందుకంటే ఇన్ని పాయింట్లు గుర్తు ఉండడం కష్టము. నోట్సు వ్రాసుకొని తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. అలాగని వ్రాసుకొని ఆ కాపీని అలాగే ఉంచుకోరాదు, ఉపయోగించాలి. ఏ పిల్లలైతే బాగా అర్థము చేసుకుంటారో, వారికి నోట్స్‌ వ్రాసుకునే ఆసక్తి చాలా ఉంటుంది.

పాట :-

లక్షలను జమ చేసుకునేవారు,......... (లాఖ్‌ జమానే వాలే,............)  

ఓంశాంతి.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఆత్మిక పిల్లలారా! అను మాట ఒక్క తండ్రి మాత్రమే అనగలరు. ఆత్మిక తండ్రి తప్ప ఎప్పుడూ, ఎవ్వరూ, ఎవ్వరినీ '' ఆత్మిక పిల్లలారా! '' అని సంబోధించలేరు. ఆత్మలందరి తండ్రి ఒక్కరేనని, మనమంతా సోదరులమని పిల్లలకు తెలుసు. భ్రాతృత్వము(సోదరత్వము) అని కూడా గానము చేస్తారు, అయినా మాయ ప్రవేశత వల్ల పరమాత్ముని సర్వవ్యాపి అని అంటారు. అప్పుడు ఫాదర్‌హుడ్‌(అందరూ తండ్రులే / పితృత్వము) అవుతంది కదా. రావణ రాజ్యము పాత ప్రపంచములోనే ఉంటుంది. కొత్త ప్రపంచము రామరాజ్యము లేక ఈశ్వరీయ రాజ్యము అని అనబడ్తుంది. ఇవి అర్థము చేసుకోవాల్సిన విషయాలు. ఈశ్వరీయ రాజ్యము, ఆసురీ రాజ్యము అను రెండు రాజ్యములున్నాయి. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము. కొత్త ప్రపంచాన్ని తప్పకుండా తండ్రే రచించి ఉంటారు. ఈ ప్రపంచములోని మనుష్యులు కొత్త ప్రపంచము, పాత ప్రపంచము అనగా ఏమిటో కూడా అర్థము చేసుకోలేరు. అనగా వారికేమీ తెలియదు. మీకు కూడా ఏమీ తెలిసేది కాదు, అవివేకులుగా ఉండేవారు. కొత్త సుఖమయ ప్రపంచము ఎవరు స్థాపన చేస్తారు, మళ్లీ పాత ప్రపంచములో దుఃఖము ఎందుకు ఉంటుంది? స్వర్గము నుండి నరకంగా ఎలా అవుతుంది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలను అర్థము చేసుకునేది మనుష్యులే కదా. దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి. కనుక ఆదిసనాతన దేవీదేవతల రాజ్యము తప్పకుండా ఉండేది. అయితే అది ఈ సమయములో లేదు. ఇది ప్రజల పై ప్రజా రాజ్యము. తండ్రి భారతదేశములోనే వస్తారు. శివబాబా భారతదేశములో వచ్చి ఏం చేస్తారో మనుష్యులకు తెలియదు. తమ ధర్మమునే మర్చిపోయారు. ఇప్పుడు మీరు త్రిమూర్తి పరిచయము, శివబాబా పరిచయము ఇవ్వాలి. బ్రహ్మ దేవతా, విష్ణు దేవతా, శంకర దేవతా అని అంటారు. తర్వాత శివ పరమాత్మాయ నమః అని అంటారు. కనుక పిల్లలైన మీరు త్రిమూర్తి శివుని పరిచయాన్నే అందరికీ ఇవ్వాలి. ఈ విధంగా సర్వీసు చేయాలి. ఎలాంటి పరిస్థితులలోనైనా తండ్రి పరిచయము అందరికి లభించినట్లయితే, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మనమిప్పుడు వారసత్వము తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఇంకా చాలా మంది వారసత్వమును(ఆస్తిని) తీసుకోవాలి. ఇంటింటిలో తండ్రి సందేశాన్ని ఇచ్చే బాధ్యత మన పై ఉంది. వాస్తవంలో సందేశకులు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి తన పరిచయాన్ని మీకు ఇస్తారు. మీరు మళ్లీ ఇతరులకు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి తెలిపిన జ్ఞానమునివ్వాలి. ముఖ్యమైనవారు త్రిమూర్తి శివ. దీనినే కోట్‌ ఆఫ్‌ ఆర్మ్స్‌(జాతీయ సంకేతము)గా కూడా తయారు చేశారు. ప్రభుత్వానికి దీని యదార్థమైన అర్థము తెలియదు. అందులో రాట్నము వలె చక్రాన్ని కూడా చూపారు, అందులో సత్యమేవ జయతే అని కూడా వ్రాశారు. దీనికి అర్థమే రాదు. ఇది సంస్కృత శబ్ధము. ఇప్పుడు తండ్రి సత్యమైనవారు. వారు ఏం అర్థం చేయిస్తారో, దాని ద్వారా పూర్తి విశ్వము పై మీకు విజయము కలుగుతుంది. తండ్రి చెప్తారు - నేను సత్యము చెప్తున్నాను, మీరు ఈ చదువు ద్వారా సత్య-సత్యమైన సత్యనారాయణులుగా అవ్వగలరు. వారు ఏమేమో అర్థాలు వెలికి తీస్తారు. అది కూడా వారిని అడగాలి. తండ్రి అనేక ప్రకారాలుగా అర్థం చేయిస్తారు. ఎక్కడెక్కడ మేళాలు జరుగుతాయో, అక్కడ నదీ తీరాలకు కూడా వెళ్ళి అర్థం చేయించండి. పతితపావని గంగ అయ్యేందుకు వీలు లేదు. నదులు సాగరము నుండి వెలువడ్తాయి. అది నీటి సాగరము. దాని ద్వారా నీటి నదులు వెలువడ్తాయి. జ్ఞాన సాగరము నుండి జ్ఞాన నదులు వెలువడ్తాయి. మాతలైన మీకిప్పుడు జ్ఞానముంది. గోముఖమునకు వెళ్తారు, దాని నోటి నుండి నీరు వెలువడ్తుంది, ఇది గంగా జలమని భావిస్తారు. ఇక్కడ గంగా జలము ఎక్కడ నుండి వస్తుంది అని విద్యావంతులైన మనుష్యులు కూడా అర్థము చేసుకోరు. బాణము వేశారు, గంగ వెలికి వచ్చిందని శాస్త్రాలలో ఉంది. ఇప్పుడివి జ్ఞాన మాటలు. అర్జునుడు బాణము వేశాడు, గంగ వెలువడింది - ఇవన్నీ జరగని విషయాలు. ఎంతో దూర-దూరంగా తీర్థ స్థానాలకు వెళ్తారు. శంకరుని జటాజూటము నుండి గంగ వెలువడిందని, దానిలో స్నానము చేయడం వలన మనుష్యులు దేవతలుగా అవుతారని అంటారు. మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు, ఇది కూడా దేవ కన్యల ఉదాహరణే కదా.

ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. అందుకే బాబా ఈ చిత్రాలను తయారు చేయించారు. త్రిమూర్తి శివుని చిత్రములో పూర్తి జ్ఞానమంతా ఉంది. వారి త్రిమూర్తి చిత్రములో జ్ఞానాన్ని ఇచ్చే శివుని చిత్రము మాత్రము లేదు. జ్ఞానాన్ని తీసుకునే వారి చిత్రముంది. ఇప్పుడు మీరు త్రిమూర్తి శివుని చిత్రము చూపించి అర్థం చేయిస్తారు. చిత్రము పై భాగములో జ్ఞానాన్ని ఇచ్చేవారు ఉన్నారు. బ్రహ్మకు వారి ద్వారా జ్ఞానము లభిస్తుంది. తర్వాత బ్రహ్మ దానిని వ్యాపింపజేస్తారు. దీనికి ఈశ్వరుని ధర్మస్థాపనా సంస్థ(మిషినరీ) అని అంటారు. ఈ దేవీ దేవతా ధర్మము చాలా సుఖమునిచ్చేది. పిల్లలైన మీరు మీ సత్య ధర్మమేదో గుర్తించారు. మమ్ములను భగవంతుడు చదివిస్తున్నారని మీకు తెలుసు. మీరు ఎంతో సంతోషిస్తారు. తండ్రి చెప్తారు - మీ సంతోషానికి హద్దులు ఉండరాదు ఎందుకంటే మిమ్ములను చదివించేవారు స్వయము భగవంతుడు, భగవంతుడు నిరాకార శివుడు, శ్రీ కృష్ణుడు కాదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు - సర్వుల సద్గతిదాత ఒక్కరే, సద్గతి అని సత్యయుగాన్ని అంటారు. దుర్గతి అని కలియుగాన్ని అంటారు. కొత్త ప్రపంచాన్ని కొత్తదని, పాత ప్రపంచాన్ని పాతదనే అంటారు. ఇప్పుడు ప్రపంచము పాతదిగా అయ్యేందుకు ఇంకా 40 వేల సంవత్సరాలు అవుతుంది అని మనుష్యులు అనుకుంటారు. ఎంత తికమకపడి ఉన్నారు. తండ్రి తప్ప ఈ విషయాలను వేరెవ్వరూ అర్థం చేయించలేరు. బాబా చెప్తారు - నేను పిల్లలైన మీకు రాజ్య భాగ్యాన్ని ఇచ్చి మిగిలిన అందరినీ ఇంటికి తీసుకెళ్తాను. ఎవరు నా మతమును అనుసరిస్తారో, వారు దేవతలుగా అవుతారు. ఈ మాటలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. కొత్తవారెవ్వరూ అర్థము చేసుకోలేరు.

తోటను వేసి తయారు చేయడం తోటమాలురైన మీ కర్తవ్యము. తోటయజమాని ఆదేశము నిస్తారు. బాబా కొత్తవారిని కలిసి జ్ఞానమునివ్వరు. ఈ పని తోటమాలులైన మీది. బాబా కలకత్తాకు వెళ్లారనుకోండి - మేము ఫలానా ఆఫీసరును, ఫలానా మిత్రులను బాబా వద్దకు తీసుకెళ్ళాలని పిల్లలు భావిస్తారు, కాని బాబా చెప్తారు - వారు ఏమీ అర్థము చేసుకోలేరు. బుద్ధిహీనులని ఎదురుగా కూర్చుండబెట్టినట్లు అవుతుంది. కనుక కొత్తవారిని ఎప్పుడూ బాబా ముందుకు తీసుకు రాకండి అని బాబా చెప్తారు. ఈ పని మాలురైన మీది, తోట యజమానిది కాదు. తోటను వేయడము మాలి పని. ఇలా - ఇలా చేయండి అని తండ్రి ఆదేశాలనిస్తారు. అందువలన బాబా ఎప్పుడూ కొత్తవారిని కలువరు. కానీ ఎక్కడైనా అతిథులుగా ఇంటికి వచ్చినప్పుడు దర్శనము చేసుకోవాలని అంటారు. మీరు మమ్ములను ఎందుకు కలవనివ్వరు? శంకరాచార్యుడు మొదలైన వారి వద్దకు ఎంతమంది వెళ్తారు. ఈ రోజులలో శంకరాచార్యునికి గొప్ప స్థానముంది. విద్యావంతులైనా వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు కదా. ట్రస్టీలోని వారినెవరినైనా గద్దె పై కూర్చుండబెడ్తారు. అందరికీ తమ తమ మతాలున్నాయి. నేను కల్ప - కల్పము ఈ పాత తనువులో వస్తానని తండ్రి స్వయంగా వచ్చి పిల్లలకు తన పరిచయాన్నిస్తారు. ఇతనికి కూడా తన జన్మల గురించి తెలియదు. శాస్త్రాలలో కల్పము ఆయువు లక్షల సంవత్సరాలని చెప్పేశారు. మనుష్యులు ఇన్ని జన్మలు తీసుకోరు, జంతువులు మొదలైన యోనులను కూడా చేర్చుకొని 84 లక్షలుగా చేసేశారు. మనుష్యులు ఏం వింటారో, దానినంతా సత్యము-సత్యము(సత్‌ - సత్‌) అని అంటూ ఉంటారు. శాస్త్రాలలో ఉన్నదంతా భక్తిమార్గములోని విషయాలు. కలకత్తాలో చాలా శోభాయమానమైన సుందర దేవీల మూర్తులను తయారుచేస్తారు, అంలంకరిస్తారు. మళ్లీ వాటిని నీటిలో ముంచేస్తారు. వీరు కూడా బొమ్మల పూజ చేసే బేబీలు కదా. పూర్తి అమాయకులు. ఇది నరకమని మీకు తెలుసు. స్వర్గములో అపారమైన సుఖముండేది. ఇప్పుడు కూడా ఎవరైనా మరణిస్తే ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు అనగా ఏదో ఒక సమయములో స్వర్గము తప్పకుండా ఉండేది, ఇప్పుడు లేదు, నరకము తర్వాత మళ్లీ స్వర్గము తప్పకుండా వస్తుంది. ఈ విషయాలు కూడా మీకు తెలుసు. మనుష్యులకు కొద్దిగా కూడా తెలియదు. అందువలన కొత్తవారు బాబా ముందు కూర్చొని ఏం చేస్తారు? కనుక పూర్తి పాలన చేసేందుకు మాలి కావాలి. ఇక్కడ తోటమాలీలు కూడా చాలా మంది అవసరము. మెడికల్‌ కాలేజీలో ఎవరైనా కొత్తవారు వెళ్ల్లి కూర్చుంటే వారికి ఏమీ అర్థము కాదు. ఈ జ్ఞానము కూడా కొత్తది. తండ్రి చెప్తారు - నేను అందరినీ పావనంగా చేసేందుకు వచ్చాను. నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు. ఈ సమయంలో అందరూ తమోప్రధాన ఆత్మలు, అందువలననే ఆత్మయే పరమాత్మ అని అంటారు. అందరిలో పరమాత్మ ఉన్నారని అంటారు. తండ్రి అలాంటి వారితో కూర్చొని తల బాదుకోరు. ముళ్లను పుష్పాలుగా తయారు చేయడం మాలీలైన మీ పని.

భక్తి రాత్రి అని, జ్ఞానము పగలు అని మీకు తెలుసు. బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని గాయనము కూడా చేయబడింది. ప్రజాపిత బ్రహ్మకు తప్పకుండా పిల్లలు కూడా ఉంటారు కదా. కొందరు కొద్దిగా కూడా వివేకము లేకుండా ఇంతమంది బ్రహ్మకుమారి - కుమారులున్నారు, వీరి బ్రహ్మ ఎవరు? అని అడుగుతారు. అరే! ప్రజాపిత బ్రహ్మ ప్రసిద్ధమైనవారు. వారి ద్వారానే బ్రాహ్మణ ధర్మము స్థాపన అవుతుంది. బ్రహ్మ దేవతాయ నమః అని కూడా అంటారు. తండ్రి పిల్లలైన మిమ్ములను బ్రాహ్మణులుగా చేసి తర్వాత దేవతలుగా చేస్తారు.

ఏ కొత్త కొత్త పాయింట్లు ఏవైతే వెలువడ్తాయో, వాటిని తమ వద్ద నోట్‌ చేసుకునే ఆసక్తి పిల్లలకుండాలి. ఏ పిలలైతే బాగా అర్థము చేసుకుంటారో, వారికి నోట్స్‌ వ్రాసుకునే ఆసక్తి చాలా ఉంటుంది. నోట్స్‌ వ్రాసుకోవడము చాలా మంచిది. ఎందుకంటే ఇన్ని పాయింట్లు జ్ఞాపకం ఉండడం కష్టము. నోట్స్‌ వ్రాసుకుని తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. వ్రాసుకుని అలాగే ఆ కాపీని ఉంచుకోరాదు. కొత్త కొత్త పాయింట్లు లభిస్తూ ఉంటాయి, కనుక పాత పాయింట్ల కాపీలు అలాగే పడి ఉంటాయి. స్కూలులో కూడా చదువుతూ ఉంటారు, మొదటి తరగతి పుస్తకాలు అలాగే పడి ఉంటాయి. మీరు అర్థం చేయించినప్పుడు చివర్లో మన్మనాభవ గురించి తప్పకుండా అర్థం చేయించండి. తండ్రిని, సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. ముఖ్య విషయము ''నన్నొక్కరినే స్మృతి చేయండి''. (మామేకం యాద్‌ కరో) అని అంటారు. దీనినే యోగాగ్ని అని అంటారు. భగవంతుడు జ్ఞానసాగరుడు, మనుష్యులు శాస్త్రాల సాగరాలు. తండ్రి ఏ శాస్త్రాలను వినిపించరు, వారు కూడా శాస్త్రాలను వినిపించినట్లయితే, వారికి మనుష్యులకు వ్యత్యాసమేముంటుంది? తండ్రి చెప్తారు - ఈ భక్తి మార్గ శాస్త్రాల సారాన్ని నేను మీకు అర్థం చేయిస్తాను.

ఆ మురళి మోగించేవారు - సర్పాన్ని(పామును) పట్టుకుంటారు, వాటి దంతాలు(కోరలు) తీసేస్తారు. తండ్రి కూడా విషము తాగించడం నుండి మిమ్ములను ముక్తులుగా చేస్తారు. ఈ విషము ద్వారానే మనుష్యులు పతితులుగా అయ్యారు. వీటిని వదలండి అని తండ్రి చెప్తారు. అయినా వదలరు. తండ్రి సుందరంగా, తెల్లగా(పవిత్రంగా) తయారు చేస్తారు. అయినా పడిపోయి ముఖము నల్లగా(అపవిత్రంగా) చేసుకుంటారు. మిమ్ములను జ్ఞానచితి పై కూర్చోబెట్టేందుకు తండ్రి వచ్చారు. జ్ఞానచితి పై కూర్చోవడం వలన మీరు విశ్వానికి అధికారులుగా, జగత్‌జీతులుగా అవుతారు. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-

1. మేము సత్య ధర్మస్థాపనకు నిమిత్తమై ఉన్నాము. స్వయం భగవంతుడు మమ్ములను చదివిస్తున్నారని, మా దేవీ దేవతా ధర్మము చాలా సుఖాన్నిచ్చేదని సదా ఖుషీ ఉండాలి.

2. తోటమాలురై ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి. పూర్తి పాలన ఇచ్చిన తర్వాత తండ్రి ముందుకు తీసుకురావాలి. శ్రమ పడాలి.

వరదానము :-

'' ప్రతి శక్తిని కార్యములో ఉపయోగించి వృద్ధి చేసే శ్రేష్ఠ ధనవంతులుగా, వివేకవంతులుగా అవ్వండి.''

వివేకవంతులైన పిల్లలకు ప్రతి శక్తిని కార్యములో ఉపయోగించే విధానము తెలుసు. ఎవరు ఎంతగా శక్తులను కార్యములో ఉపయోగిస్తారో, వారికి అంతగా శక్తులు వృద్ధి చెందుతాయి. కనుక ఈశ్వరీయ బడ్జెట్‌ను ఎలా తయారు చేయాలంటే విశ్వములోని ప్రతి ఆత్మ మీ ద్వారా ఏదో కొంత ప్రాప్తి చేసుకొని మీ గుణగానము చేయాలి. అందరికీ ఏదో కొంత ఇవ్వనే ఇవ్వాలి. ముక్తినైనా ఇవ్వండి, జీవన్ముక్తినైనా ఇవ్వండి. ఈశ్వరీయ బడ్జెట్‌ తయారు చేసి, సర్వ శక్తులను పొదుపు చేసి జమ చేయండి. జమ అయిన శక్తుల ద్వారా సర్వ ఆత్మలను భికారితనము నుండి, దు:ఖము అశాంతుల నుండి ముక్తము చేయండి.

స్లోగన్‌ :-

'' శుద్ధ సంకల్పాలను మీ జీవితంలో అమూల్యమైన ఖజానాగా చేసుకుంటే మాలామాల్‌గా(సంపన్నంగా) అవుతారు ''