03-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - ఈ పురుషోత్తమ సంగమయుగంలో పవిత్రంగా అయినట్లయితే సత్యయుగ వారసత్వము లభిస్తుంది అనేది తండ్రి ఆజ్ఞ - అందరికీ ఈ సందేశాన్నే ఇవ్వండి”

ప్రశ్న:-

ఏ చౌక వ్యాపారం గురించి అందరికీ తెలియజేయాలి?

జవాబు:-

ఈ అంతిమ జన్మలో తండ్రి డైరెక్షన్లపై నడుచుకొని పవిత్రంగా అయినట్లయితే 21 జన్మలకు విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది, ఇది చాలా చౌక వ్యాపారము. మీరు అందరికీ ఈ వ్యాపారాన్ని చేయడమే నేర్పించండి. ఇప్పుడు శివబాబాను స్మృతి చేసి పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారని చెప్పండి.

ఓంశాంతి. తండ్రి నుండి ఇప్పుడు అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలని ప్రదర్శినీ లేక మేళాలలో షో చూపిస్తారు లేదా చిత్రాలపై మనుష్యులకు అర్థం చేయిస్తారు అని ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తారు, ఇది ఆత్మిక పిల్లలకు తెలుసు. ఏ వారసత్వము? మనుష్యుల నుండి దేవతలుగా ఎలా అవుతారనేది మరియు అర్ధకల్పం కోసం అనంతమైన తండ్రి నుండి స్వర్గ రాజ్యాన్ని ఎలా తీసుకోవాలనేది అర్థము చేయించాలి. తండ్రి అయితే వ్యాపారస్థుడే, వారితో ఈ వ్యాపారము చేయాలి. దేవీదేవతలు పవిత్రంగా ఉంటారని మనుష్యులకు తెలుసు. భారతదేశంలో సత్యయుగము ఉన్నప్పుడు దేవీ దేవతలు పవిత్రంగా ఉండేవారు. స్వర్గం కోసం వారు తప్పకుండా ఏదో ఒక ప్రాప్తి పొంది ఉంటారు. స్వర్గ స్థాపన చేసే తండ్రి తప్ప ఇంకెవ్వరూ ప్రాప్తిని కలిగించలేరు. పతితపావనుడైన తండ్రియే పతితులను పావనంగా తయారుచేసి పావన ప్రపంచం యొక్క రాజ్యాన్నిచ్చేవారు. ఎంత చౌక వ్యాపారాన్ని అందిస్తున్నారు. ఇది మీ అంతిమ జన్మ అని కేవలం ఇదే చెప్తారు. నేను ఇక్కడ ఉన్నప్పుడు పవిత్రంగా అవ్వండి. నేను పవిత్రంగా తయారుచేసేందుకు వచ్చాను. మీరు ఈ అంతిమ జన్మలో పావనంగా అయ్యే పురుషార్థము చేసినట్లయితే పావన ప్రపంచం యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. ఇది చాలా చౌక వ్యాపారము. కావున పవిత్రంగా అవ్వండి అనేది తండ్రి ఆజ్ఞ అని పిల్లలకు ఈ విధంగా అర్థం చేయించాలని తండ్రికి ఆలోచన వచ్చింది. ఇది పవిత్రంగా తయారయ్యే పురుషోత్తమ సంగమయుగము. ఉత్తమోత్తమ పురుషులు దేవతలే. లక్ష్మీనారాయణుల రాజ్యము నడిచింది కదా. తండ్రి మతముపై ఈ అంతిమ జన్మ పవిత్రంగా అయినట్లయితే దేవతా ప్రపంచపు రాజ్యాధికారం మీకు తండ్రి నుండి వారసత్వంగా లభించగలదు. యోగబలముతో స్వయాన్ని తమోప్రధానము నుండి సతోప్రధానంగా ఎలా తయారుచేసుకోవాలి అనే యుక్తిని కూడా తెలియజేస్తారు. కళ్యాణము కోసం పిల్లలు ఖర్చు చేయవలసిందే. ఖర్చు లేకుండా రాజధాని స్థాపన అవ్వలేదు. ఇప్పుడు లక్ష్మీనారాయణుల రాజధాని స్థాపనవుతుంది. పిల్లలు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. మనసా-వాచా-కర్మణా ఎటువంటి తప్పుడు కర్మలూ చేయకూడదు. దేవతలకు ఎప్పుడూ ఎలాంటి చెడు ఆలోచనలు కూడా రావు. నోటి నుండి అటువంటి మాటలేవీ వెలువడవు. వారు ఉన్నదే సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు, మర్యాదా పురుషోత్తములు..... ఎవరైతే ఉండి వెళ్తారో, వారి మహిమ గాయనము చేయబడుతుంది. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని కూడా అటువంటి దేవీదేవతలుగా తయారు చేయడానికి వచ్చాను. కావున మనసా-వాచా-కర్మణా ఎటువంటి చెడు కర్మ చేయకూడదు. దేవతలు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు, ఈ గుణాలను కూడా మీరు ఇప్పుడే ధారణ చేయగలరు ఎందుకంటే ఈ మృత్యులోకంలో మీకు ఇది అంతిమ జన్మ. పతిత ప్రపంచాన్ని మృత్యులోకమని, పావన ప్రపంచాన్ని అమరలోకమని అంటారు. ఇప్పుడు మృత్యులోకం యొక్క వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. అమరపురి స్థాపన తప్పకుండా జరగవచ్చు. ఇది అదే మహాభారీ మహాభారత యుద్ధము, దీనినే శాస్త్రాలలో చూపించారు, దీనితో పాత వికారీ ప్రపంచము సమాప్తమవుతుంది. కానీ ఈ జ్ఞానము ఎవరిలోనూ లేదు. అందరూ అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారని తండ్రి అంటారు. 5 వికారాల నషా ఉంటుంది. పవిత్రంగా అవ్వండని ఇప్పుడు తండ్రి అంటారు. మాస్టర్ గాడ్ గా అయితే అవుతారు కదా. లక్ష్మీనారాయణులను గాడ్-గాడెస్ అని అంటారు అంటే వారు గాడ్ ద్వారా ఈ వారసత్వాన్ని పొందారు. ఇప్పుడు భారతదేశము పతితంగా ఉంది. మనసా-వాచా-కర్మణా కర్తవ్యాలు కూడా అలాగే ఉంటాయి. ఏ విషయమైనా మొదట బుద్ధిలోకి వస్తుంది, తర్వాత నోటి నుండి వెలువడుతుంది. కర్మణాలోకి రావడంతో అది వికర్మగా అవుతుంది. అక్కడ ఎలాంటి వికర్మలు జరగవు, ఇక్కడ వికర్మలు జరుగుతాయి ఎందుకంటే ఇది రావణ రాజ్యము అని తండ్రి అంటారు. మిగిలిన ఆయువు అంతా పవిత్రంగా ఉండండి అని ఇప్పుడు తండ్రి అంటారు. ప్రతిజ్ఞ చేయాలి, పవిత్రంగా అయ్యి నాతో బుద్ధియోగాన్ని కూడా జోడించాలి, దీనితో మీ జన్మ-జన్మాంతరాల పాపాలు కూడా తొలగిపోతాయి, అప్పుడే మీరు 21 జన్మలకు స్వర్గానికి యజమానులుగా అవుతారని బాబా ఆఫర్ చేస్తున్నారు. తండ్రి వీరి ద్వారా ఈ వారసత్వాన్నిస్తారని అర్థం చేయిస్తూ ఉంటారు. వారు శివబాబా, వీరు దాదా, అందుకే సదా బాప్ దాదా అని అంటారు. శివబాబా, బ్రహ్మా దాదా. తండ్రి ఎంతటి వ్యాపారాన్ని చేస్తారు. మృత్యులోక వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. అమరలోక స్థాపన జరుగుతుంది. భారతవాసీయుల కళ్యాణము జరగాలనే ప్రదర్శినీలను మరియు మేళాలను చేస్తారు. తండ్రియే వచ్చి భారతదేశాన్ని రామరాజ్యంగా తయారుచేస్తారు. రామరాజ్యంలో తప్పకుండా పవిత్రమైనవారే ఉంటారు. పిల్లలూ, కామము మహాశత్రువు అని తండ్రి అంటారు. ఈ 5 వికారాలనే మాయ అని అంటారు. దీనిపై విజయము పొందినట్లయితే మీరు జగత్ జీతులుగా అవుతారు. దేవీ దేవతలే జగత్ జీతులు, ఇతరులెవ్వరూ జగత్ జీతులుగా అవ్వలేరు. ఒకవేళ క్రిస్టియన్లు పరస్పరములో ఒక్కటైతే మొత్తం సృష్టి యొక్క రాజ్యాన్ని తీసుకోగలరు అని బాబా అర్థం చేయించారు. కానీ అటువంటి లా లేదు. ఈ బాంబులు పాత ప్రపంచాన్ని సమాప్తం చేసేందుకే ఉన్నాయి. ఈ విధంగా కల్ప-కల్పము కొత్త ప్రపంచము నుండి పాతదిగా, పాతదాని నుండి కొత్తదిగా అవుతుంది. కొత్త ప్రపంచంలోనే ఈశ్వరీయ రాజ్యముంటుంది, దానిని రామరాజ్యమని అంటారు. ఈశ్వరుడిని తెలుసుకోని కారణంగా రామ-రామ అని అలాగే జపిస్తూ ఉంటారు. కనుక పిల్లలైన మీలో ఈ విషయాలు ధారణ అవ్వాలి. తప్పకుండా మనము 84 జన్మలలో సతోప్రధానము నుండి తమోప్రధాంగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. ఇది శివబాబా డైరెక్షన్, ఇప్పుడు దానిపై నడిచినట్లయితే 21 జన్మల కోసం పవిత్ర ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు పురుషార్థము చేయండి, చేయకపోండి, స్మృతిలో ఉంటూ ఇతరులకు మార్గం తెలియజేయండి, తెలియజేయకపోండి. ప్రదర్శినీల ద్వారా పిల్లలు చాలామందికి మార్గాన్ని తెలియజేస్తున్నారు. స్వయం యొక్క కళ్యాణము కూడా చేసుకోవాలి. ఇది చాలా చౌక వ్యాపారము. కేవలం ఈ అంతిమ జన్మ పవిత్రంగా ఉండడంతో, శివబాబా స్మృతిలో ఉండడంతో మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయిపోతారు. ఇది ఎంత చౌక వ్యాపారము. జీవితమే పూర్తిగా పరివర్తన అయిపోతుంది. ఈ విధంగా ఆలోచించాలి. రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు - ఈ సమయం తమోప్రధాన ప్రపంచంలా ఉన్నప్పుడు, ఇందులో పవిత్రంగా ఉండడం అసంభవము అని కొంతమంది అన్నారని బాబా వద్దకు సమాచారము వస్తుంది. ఇప్పుడిది సంగమయుగమని పాపం వారికి తెలియదు. తండ్రియే పవిత్రంగా తయారుచేస్తారు. వీరికి సహాయకులు పరమపిత పరమాత్మ, ఇక్కడ చాలా భారీ ఆకర్షణ ఉందని వారికి తెలియదు. పవిత్రంగా అవ్వడంతో పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వడం జరుగుతుంది. ఈ మాయా రూపీ 5 వికారాలపై విజయం పొందటంతో మీరు జగత్ జీతులుగా అవుతారని తండ్రి అంటారు. కావున మనము పవిత్రంగా ఎందుకు అవ్వము. ఇది ఫస్ట్ క్లాస్ వ్యాపారము. కామము మహాశత్రువు, దీనిపై విజయము పొందడంతో మీరు పవిత్రంగా అవుతారని తండ్రి అంటారు. మాయాజీతులే జగత్ జీతులు. ఇది యోగబలముతో మాయను జయించే విషయము. నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యం తొలగిపోతుందని పరమపిత పరమాత్మయే వచ్చి ఆత్మలకు అర్థము చేయిస్తారు. మీరు సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. సంగమయుగంలోనే తండ్రి వారసత్వాన్నిస్తారు. ఈ లక్ష్మీనారాయణులు అందరికన్నా ఉత్తమ పురుషులుగా ఉండేవారు, వారినే మర్యాదా పురుషోత్తమ దేవీ దేవతా ధర్మానికి చెందినవారని అంటారు. చాలా మంచి రీతిగా అర్థము చేయించడం జరుగుతుంది కానీ అప్పుడప్పుడు ఈ పాయింట్లను మర్చిపోతారు. భాషణలో ఫలానా పాయింట్లు అర్థం చేయించలేదని తర్వాత మళ్ళీ ఆలోచన వస్తుంది. అర్థం చేయించవలసిన పాయింట్లు అయితే చాలా ఉన్నాయి. ఈ విధంగా జరుగుతుంది. న్యాయవాదులు కూడా కొన్ని కొన్ని పాయింట్లను మర్చిపోతారు. ఆ పాయింట్లు మళ్ళీ గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ వాదిస్తారు. డాక్టర్లకు కూడా అలాగే జరుగుతుంది. ఈ జబ్బుకు ఈ మందు సరైనదేనా అని ఆలోచన నడుస్తుంది. ఇక్కడ కూడా లెక్కలేనన్ని పాయింట్లు ఉన్నాయి. ఈ రోజు మీకు గుహ్యమైన పాయింట్లను అర్థం చేయిస్తాను అని బాబా అంటారు. కానీ అర్థము చేసుకునే వారంతా పతితులే. ఓ పతితపావనా..... అని పిలుస్తారు కూడా. కానీ ఎవరినైనా అలా అంటే డిస్టర్బ్ అవుతారు. ఓ పతితపావనా రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని ఈశ్వరుని ఎదురుగా సత్యం చెబుతారు. ఈశ్వరుడిని మర్చిపోతే మళ్ళీ అసత్యము చెప్తారు, కావున చాలా యుక్తిగా అర్థము చేయించాలి, కర్ర విరగకూడదు కానీ పాము చనిపోవాలి. ఎలుక నుండి గుణాన్ని గ్రహించండి అని తండ్రి అంటారు. ఎలుక ఎంత యుక్తిగా కొరుకుతుందంటే రక్తం కూడా వస్తుంది కానీ ఏమీ తెలియదు. కావున పిల్లల బుద్ధిలో అన్ని పాయింట్లు ఉండాలి. యోగంలో ఉండేవారికి సమయానికి సహాయము లభిస్తుంది. వినిపించేవారి కన్నా వినేవారు తండ్రికి ఎక్కువగా ప్రియంగా ఉండవచ్చు. అందుకే తండ్రి స్వయంగా కూర్చునైనా అర్థము చేయించేస్తారు. ఏ విధంగా అర్థం చేయించాలంటే, పవిత్రంగా అవ్వడం చాలా మంచిదని వారు భావించాలి. ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండడంతో మనము 21 జన్మలకు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతాము. భగవానువాచ - ఈ అంతిమ జన్మ పవిత్రంగా అయినట్లయితే డ్రామా ప్లాన్ అనుసారముగా మీరు 21 జన్మలకు వారసత్వాన్ని పొందగలరు అని నేను గ్యారెంటీ ఇస్తాను. మనము కల్ప-కల్పము వారసత్వాన్ని పొందుతూ ఉంటాము. ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారు మేము వెళ్ళి అర్థము చేయిస్తామని అనుకుంటారు. పరుగెత్తవలసి ఉంటుంది. తండ్రి అయితే జ్ఞానసాగరుడు, వారు ఎంతగా జ్ఞాన వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. ఎవరి ఆత్మ అయితే పవిత్రంగా ఉంటుందో, వారికి ధారణ కూడా జరుగుతుంది. అటువంటి వారి పేర్లు ప్రఖ్యాతి చెందుతాయి. ఎవరు ఎలాంటి సేవ చేస్తారు అనేది ప్రదర్శినీ మరియు మేళాలలో తెలిసిపోతుంది. ఎవరు ఎలా అర్థము చేయిస్తారు అనేది టీచర్లు చెక్ చేయాలి. చాలా వరకు లక్ష్మీనారాయణులు మరియు మెట్ల చిత్రాల గురించి అర్థం చేయించడం మంచిది. యోగబలము ద్వారా మళ్ళీ ఇటువంటి లక్ష్మీనారాయణులుగా అవుతారు. లక్ష్మీనారాయణులే ఆదిదేవ్, ఆదిదేవీగా అవుతారు. చతుర్భుజునిలో లక్ష్మీనారాయణులు ఇరువురూ వచ్చేస్తారు. రెండు భుజాలు లక్ష్మివి, రెండు నారాయణునివి. ఇది కూడా భారతవాసులకు తెలియదు. మహాలక్ష్మికి 4 భుజాలున్నాయి, దీని అర్థము వారు యుగల్ అన్నట్లు. విష్ణువు చతుర్భుజుడు.

ప్రదర్శినీలో ప్రతి రోజు అర్థము చేయించడం జరుగుతుంది. రథాన్ని కూడా చూపించారు. అర్జునుడు రథములో కూర్చున్నాడని చెప్తారు. కృష్ణుడు రథాన్ని నడిపేవారు. ఇవన్నీ కథలు. ఇప్పుడు ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. జ్ఞానామృత కలశాన్ని లక్ష్మి తలపై పెట్టినట్లుగా చూపిస్తారు. వాస్తవానికి కలశము జగదంబపై పెట్టారు, తర్వాత వారు లక్ష్మిగా అవుతారు. ఇది కూడా అర్థము చేయించవలసి ఉంటుంది. సత్యయుగంలో ఒకే ధర్మము, ఒకే మతానికి చెందిన మనుష్యులుంటారు. దేవతలది ఒకే మతము. దేవతలనే శ్రీ అని అంటారు, ఇతరులెవ్వరినీ అనరు. ఇతరులకు అర్థము చేయించేందుకు కొన్ని పదాలే ఉండాలని బాబాకు ఆలోచన నడుస్తుంది. ఈ అంతిమ జన్మలో 5 వికారాలపై విజయము పొందడంతో మీరు రామరాజ్యానికి యజమానులుగా అవుతారు. ఇది చౌక వ్యాపారము. తండ్రి వచ్చి అవినాశీ జ్ఞాన రత్నాలను దానం ఇస్తారు. తండ్రి జ్ఞానసాగరుడు. వారే జ్ఞాన రత్నాలను ఇస్తారు. ఇంద్రసభలో పుష్యరాగము, మాణిక్యము అని కొందరు దేవతలు కూడా ఉన్నారు. అందరూ సహాయము చేసేవారే. రకరకాల వజ్రాలుంటాయి కదా, అందుకే నవరత్నాలను చూపించారు. ఎవరైతే మంచి రీతిగా చదువుతారో, పదవిని కూడా తప్పకుండా వారే పొందుతారు. నంబరువారుగా ఉన్నారు కదా. పురుషార్థము చేసే సమయము కూడా ఇదే. మనం తండ్రి మాలలో మణులుగా అవుతామని పిల్లలకు తెలుసు. శివబాబాను ఎంతగా స్మృతి చేస్తామో, అంతగా మనం స్మృతి యాత్రలో పరుగు తీస్తున్నట్లు. పాపాలు కూడా త్వరగా వినాశనం అవుతాయి.

ఈ చదువేమీ ఎక్కువ కాదు, కేవలం పవిత్రంగా ఉండాలి. దైవీగుణాలు కూడా ధారణ చేయాలి. నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు. రాళ్ళు విసిరేవారు రాతిబుద్ధి కలవారిగానే అవుతారు. రత్నాలను ఇచ్చేవారు ఉన్నత పదవిని పొందుతారు. ఇది చాలా సహజము. జిజ్ఞాసులకు అర్థం చేయించండి - పతితపావనుడు, సర్వుల ముక్తి-జీవన్ముక్తిదాత, పరమపిత పరమాత్మ శివుడు చెప్తున్నారు - ఓ భారతవాసులైన ఆత్మిక పిల్లలూ, రావణ రాజ్యమైన మృత్యులోకంలో, ఈ కలియుగీ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండడంతో మరియు పరమపిత పరమాత్మ శివునితో బుద్ధి యోగ బలము యొక్క యాత్రతో, తమోప్రధాన ఆత్మలు సతోప్రధాన ఆత్మలుగా అయి సతోప్రధాన సత్యయుగీ విశ్వంలో పవిత్రత, సుఖము, శాంతి, సంపదలతో సంపన్నమైన, మర్యాదా పురుషోత్తమ దైవీ స్వరాజ్య పదవిని, 5 వేల సంవత్సరాల క్రితము వలె మళ్ళీ పొందగలరు. కానీ జరగబోయే మహాభారీ వినాశనానికి ముందే తండ్రి మనకు వారసత్వాన్నిస్తారు, చదువును చదివిస్తారు. ఎంతగా చదువుకుంటారో, అంతటి పదవిని పొందుతారు. వారు తప్పకుండా తోడుగా తీసుకువెళ్తారు కావున మనకు ఈ పాత శరీరము మరియు ఈ ప్రపంచం యొక్క ఆలోచనలు ఎందుకు ఉండాలి. ఇది మీకు పాత ప్రపంచాన్ని వదిలి పెట్టే సమయము. బుద్ధిలో ఇటువంటి విషయాల మథనము జరుగుతూ ఉన్నాసరే చాలా మంచిది. మున్ముందు పురుషార్థము చేస్తూ చేస్తూ ఇక సమయము వచ్చేస్తుంది, అప్పుడు గుటకలు మింగరు. ప్రపంచము కూడా ఇక కొంత సమయమే ఉంటుందని చూస్తున్నారు కావున బుద్ధియోగాన్ని జోడించాలి. సేవ చేస్తే సహాయము కూడా లభిస్తుంది. ఎంతగా సుఖం యొక్క మార్గాన్ని తెలియజేస్తారో, అంతగా సంతోషము కలుగుతుంది. పురుషార్థము కూడా నడుస్తుంది. భాగ్యము కనిపిస్తుంది. తండ్రి అయితే పురుషార్థం నేర్పిస్తారు. కొంతమంది అందులో నిమగ్నమవుతారు, కొంతమంది నిమగ్నమవ్వరు. కోటీశ్వరులు, పదమపతులు అందరూ అలానే సమాప్తమైపోతారని మీకు తెలుసు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఉన్నత పదవిని పొందేందుకు నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి, రాళ్ళు వెలువడకూడదు. మనసా-వాచా-కర్మణా మర్యాదా పురుషోత్తములుగా తయారుచేసే కర్మలే చేయాలి.

2. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయ్యే ప్రతిజ్ఞను చేయాలి. అందరికీ పవిత్రంగా అయ్యే యుక్తినే వినిపించాలి.

వరదానము:-

సదా కళ్యాణకారి భావన ద్వారా గుణాలను గ్రహించేవారిగా అయ్యే చలించని, స్థిరమైనవారిగా కండి

మీ స్థితిని చలించకుండా, స్థిరంగా తయారు చేసుకునేందుకు సదా గుణాలను గ్రహించేవారిగా అవ్వండి. ఒకవేళ ప్రతి విషయంలోనూ గుణాలను గ్రహించేవారిగా అయినట్లయితే అలజడిలోకి రారు. గుణాలను గ్రహించడం అనగా కళ్యాణ భావన. అవగుణంలో గుణాన్ని చూడడము, దీనినే గుణాలను గ్రహించేవారిగా అవ్వడమని అంటారు, అందుకే అవగుణాలు కలిగినవారి నుండి కూడా గుణాలను గ్రహించండి. ఏ విధంగా వారు అవగుణాలలో దృఢంగా ఉన్నారో, అదే విధంగా మీరు గుణాలలో దృఢంగా ఉండండి. గుణాలను గ్రహించేవారిగా అవ్వండి, అవగుణాలను గ్రహించేవారిగా కాదు.

స్లోగన్:-

తమదంతా తండ్రికి అర్పణ చేసి సదా తేలికగా ఉండేవారే ఫరిస్తాలు.