03-04-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీరు తండ్రి స్మృతిలో ఏక్యురేట్ (ఖచ్చితం) గా ఉన్నట్లయితే మీ ముఖం సదా ప్రకాశిస్తూ, సంతోషంగా ఉంటుంది”

ప్రశ్న:-

స్మృతిలో కూర్చునే విధి ఏమిటి మరియు దీని ద్వారా కలిగే లాభాలేమిటి?

జవాబు:-

స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి ద్వారా వ్యాపార-వ్యవహారాలు మొదలైన పంచాయితీలన్నింటినీ మరచి స్వయాన్ని దేహీ (ఆత్మ) గా భావించండి. దేహము మరియు దేహపు సంబంధాల వల చాలా పెద్దది, ఆ వలను మింగేసి దేహాభిమానం నుండి అతీతులుగా అవ్వండి అనగా మీరు మరణిస్తే, మీకు సంబంధించినంత వరకు ఈ ప్రపంచం మరణించినట్లే. జీవిస్తూనే అంతటినీ మరచి ఒక్క తండ్రి స్మృతియే ఉండాలి, ఇది అశరీరి అవస్థ, దీనితో ఆత్మకు పట్టిన తుప్పు వదలుతూ ఉంటుంది.

గీతము:-

రాత్రి ప్రయాణీకుడా..... (రాత్ కే రాహీ.....)

ఓంశాంతి. పిల్లలు స్మృతియాత్రలో కూర్చున్నారు, దీనినే యోగంలో కూర్చోవడము లేదా శాంతిలో కూర్చోవడమని అంటారు. కేవలం శాంతిలో కూర్చోవడమే కాదు, ఏదో చేస్తున్నారు, స్వధర్మంలో స్థితులై ఉన్నారు కానీ యాత్రలో కూడా ఉన్నారు. ఈ యాత్రను నేర్పించే తండ్రి తనతో పాటు తీసుకువెళ్తారు కూడా. వారు దైహిక బ్రాహ్మణులు, తమతో పాటు తీసుకువెళ్తారు. మీరు ఆత్మిక బ్రాహ్మణులు, బ్రాహ్మణుల వర్ణం లేదా కులమని అంటారు. ఇప్పుడు పిల్లలు స్మృతి యాత్రలో కూర్చున్నారు, ఇతర సత్సంగాల్లో కూర్చున్నప్పుడు, గురువు గుర్తుకొస్తారు. గురువు వచ్చి ప్రవచనాన్ని వినిపిస్తారు. అదంతా భక్తి మార్గము. ఇది స్మృతి యాత్ర, దీని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. మీరు తుప్పు తొలగించుకునేందుకు స్మృతిలో కూర్చుంటారు. స్మృతి ద్వారా తుప్పు తొలగిపోతుందని తండ్రి డైరెక్షన్ ఉంది ఎందుకంటే నేనే పతితపావనుడను. ఎవరో స్మృతి చేయడం వలన నేను రాను. నేను రావడం కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. పతిత ప్రపంచం మారి పావన ప్రపంచంగా అవ్వనున్నప్పుడు, ప్రాయః లోపమైపోయిన ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని, మళ్ళీ బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తాను. ఒక్క సెకెండులో బ్రహ్మా నుండి విష్ణువుగా అవుతారని ఈ బ్రహ్మాను గురించే అర్థం చేయించారు. మళ్ళీ విష్ణువు నుండి బ్రహ్మాగా అవ్వడానికి 5 వేల సంవత్సరాలు పడుతుంది. ఇవి కూడా బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇంతకుముందు శూద్రులుగా ఉన్న మీరు ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. మీరు బ్రాహ్మణులుగా అవుతారు, అప్పుడు మాలిన్యాన్ని తొలగించేందుకు, శివబాబా బ్రహ్మా ద్వారా మీకు ఈ స్మృతియాత్రను నేర్పిస్తారు. ఈ రచన యొక్క చక్రం ఎలా తిరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకున్నారు. దీనికి సమయమేమి పట్టదు. వాస్తవానికి ఇప్పుడిది కలియుగము. ఇదింకా కలియుగం యొక్క ఆది సమయమని వారంటారు, కానీ తండ్రి అంటారు, ఇది కలియుగం యొక్క అంతిమము, ఘోరమైన అంధకారముంది. మీకు ఈ వేద శాస్త్రాల సారాన్ని అంతా అర్థం చేయిస్తానని తండ్రి అంటారు.

పిల్లలైన మీరు ఉదయం ఇక్కడ కూర్చున్నప్పుడు స్మృతిలో కూర్చోవలసి ఉంటుంది. లేకపోతే మాయ తుఫానులు వస్తాయి. వ్యాపార-వ్యవహారాల వైపుకు బుద్ధియోగం వెళ్ళిపోతుంది. ఇవన్నీ బయటి పంచాయితీలు కదా. సాలె పురుగు ఎంతటి వలను అల్లుతుంది, ఆ వలనంతా మింగేస్తుంది కూడా. అలాగే దేహానికి సంబంధించిన ప్రపంచం ఎంత ఉంటుంది. మామయ్య, చిన్నాన్న, గురువులు..... ఎన్ని వలలు కనిపిస్తాయి. దేహ సహితంగా వాటన్నింటినీ మింగేయాలి. కేవలం దేహీగా మాత్రమే అవ్వాలి. మనుష్యులు శరీరాన్ని వదిలినప్పుడు అంతా మర్చిపోతారు. మీరు మరణిస్తే, మీకు సంబంధించినంత వరకు ఈ ప్రపంచం మరణించినట్లే. ఈ ప్రపంచం సమాప్తమవ్వనున్నదని బుద్ధిలో జ్ఞానముంది. ఎవరి నోరు అయితే తెరుచుకోదో, వారు కేవలం స్మృతి చేయండి అని తండ్రి అర్థం చేయిస్తారు. వీరు (బ్రహ్మా) తండ్రిని స్మృతి చేస్తారు. కన్య పతిని స్మృతి చేస్తుంది ఎందుకంటే ఆమెకు పతి, పరమేశ్వరుడు అవుతాడు, అందుకే తన తండ్రి నుండి బుద్ధి తొలగి, పతి వైపుకు వెళ్ళిపోతుంది. వీరైతే పతులకే పతి, వరుడు కదా. మీరందరూ వధువులు, అందరూ భగవంతుని భక్తిని చేస్తారు. భక్తురాళ్ళందరూ రావణుని నిఘాలో ఖైదీగా ఉన్నారు కనుక తండ్రికి తప్పకుండా దయ కలుగుతుంది కదా. తండ్రి దయాహృదయుడు, వారిని మాత్రమే దయాహృదయుడని అంటారు. ఈ సమయంలో గురువులైతే అనేక రకాలవారున్నారు. ఎవరైనా ఏ మాత్రం శిక్షణనిచ్చినా, వారిని గురువని అనేస్తారు. ఇక్కడైతే తండ్రి ప్రాక్టికల్ గా రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ రాజయోగాన్ని నేర్పించడం పరమాత్మకు తప్ప ఇంకెవ్వరికీ అసలు రాదు. పరమాత్మయే వచ్చి రాజయోగాన్ని నేర్పించారు, తర్వాత దీని ద్వారా ఏమి జరిగింది అనేది ఎవరికీ తెలియదు. చాలామంది గీతలోని ఉదాహరణలను చెప్తారు, చిన్న కుమారీలు కూడా గీతను కంఠస్థం చేస్తారు కనుక ఎంతో కొంత మహిమ జరుగుతుంది. గీత ఏమీ మాయమైపోలేదు. గీతకు చాలా మహిమ ఉంది. గీతా జ్ఞానం ద్వారానే తండ్రి ప్రపంచమంతటినీ రెజువనేట్ (కొత్తగా) చేస్తారు. మీ శరీరాలను కల్పతరువులా అనగా కల్పవృక్షంలా అమరంగా చేస్తారు.

పిల్లలైన మీరు తండ్రి స్మృతిలో ఉంటారు, తండ్రిని ఆహ్వానించరు. మీరు తండ్రి స్మృతిలో ఉంటూ మీ ఉన్నతిని చేసుకుంటున్నారు. తండ్రి డైరెక్షన్ పై నడుచుకునే అభిరుచి కూడా ఉండాలి. మేము శివబాబా స్మృతిలోనే భోజనం తింటాము అనగా శివబాబాతో పాటు తింటాము. ఆఫీసులో కూడా ఎంతో కొంత సమయం లభిస్తుంది. కుర్చీలో కూర్చున్నప్పుడు, స్మృతిలో కూర్చుండిపోతామని పిల్లలు బాబాకు రాస్తారు. ఆఫీసర్ వచ్చి చూసినప్పుడు, అతనికి వారు కూర్చుని ఉండగానే మాయమైపోయినట్లుగా కనిపిస్తారు ఎందుకంటే వారు అశరీరిగా అయిపోతారు. కొంతమంది కళ్ళు మూసుకుంటాయి, కొంతమంది కళ్ళు తెరిచి ఉంటాయి, కొంతమంది ఏమీ చూడనట్లే కూర్చుని ఉంటారు, అక్కడి నుండి మాయమైపోయినట్లుగా ఉంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. బాబా వారి బుద్ధి తాడును లాగారు (ఆకర్షించారు), మరియు వారు ఆనందంగా కూర్చుండిపోయారు. వారిని, మీకు ఏమయింది అని అడుగుతారు. మేము తండ్రి స్మృతిలో కూర్చున్నామని అంటారు. మేము బాబా వద్దకు వెళ్ళాలి అని బుద్ధిలో ఉంటుంది. తండ్రి అంటారు - ఆత్మాభిమానులుగా అవ్వడంతో మీరు నా వద్దకు వచ్చేస్తారు, పవిత్రంగా అవ్వకుండా అక్కడకు వెళ్ళలేరు. ఇప్పుడు పవిత్రంగా ఎలా అవ్వాలి? అది తండ్రియే చెప్పగలరు. మనుష్యులు చెప్పలేరు. మీరు ఎంతో కొంత అర్థం చేసుకొని ఉంటే ఇతరుల కళ్యాణం కూడా చేస్తారు. మీరు ఇతరుల కళ్యాణం చేసేటువంటి మరియు తండ్రి పరిచయాన్ని ఇచ్చేటువంటి పురుషార్థం తప్పకుండా చేయాలి. భక్తి మార్గంలో కూడా ఓ గాడ్ ఫాదర్ అని అంటూ స్మృతి చేస్తారు. గాడ్ ఫాదర్, దయ చూపించండి అని అంటూ పిలవడం ఒక అలవాటైపోయింది. తండ్రి పిల్లలైన మిమ్మల్ని తన సమానంగా కళ్యాణకారిగా తయారుచేస్తారు. మాయ అందరినీ ఎంత తెలివితక్కువవారిగా చేసింది. లౌకిక తండ్రి కూడా పిల్లల నడవడిక బాగా లేకపోవడం చూస్తే, నీవు తెలివితక్కువ వాడివి, ఒక్క సంవత్సరంలో తండ్రి ఆస్తినంతా పోగొట్టేస్తావు అని అంటారు. మరి అనంతమైన తండ్రి కూడా అంటారు - మిమ్మల్ని ఎలా తయారుచేశాను, ఇప్పుడు మీ నడవడికను చూసుకోండి. ఇది ఎంత అద్భుతమైన ఆట అన్నది పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకుంటారు. భారత్ యొక్క డౌన్ ఫాల్ (పతనం) ఎంతగా జరుగుతుంది. భారతవాసుల డౌన్ ఫాల్ జరుగుతుంది. మేము పడిపోయామని, మేము కలియుగీ తమోప్రధానులుగా అయ్యామని స్వయం గురించి ఇలా అనుకోరు. భారత్ స్వర్గంగా ఉండేది అనగా మనుష్యులు స్వర్గవాసులుగా ఉండేవారు, ఆ మనుష్యులే ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. ఈ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. ఇంతకుముందు ఈ బాబాకు కూడా తెలియదు. ఇప్పుడు బుద్ధిలో చమత్కారం జరిగింది. 84 జన్మలను తీసుకుంటూ-తీసుకుంటూ తప్పకుండా మెట్లు దిగాల్సి ఉంటుంది, పైకి ఎక్కే ఆస్కారమే లేదు. దిగిపోతూ-దిగిపోతూ పతితంగా అవ్వాల్సిందే. ఈ విషయం ఎవరి బుద్ధిలోనూ లేదు. తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయించారు, మీరు మళ్ళీ భారతవాసులకు అర్థం చేయిస్తారు - మీరు స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు, 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు అని. పునర్జన్మలనైతే నమ్ముతారు కదా. తప్పకుండా కిందకు దిగాలి. ఎన్ని పునర్జన్మలను తీసుకున్నారు అనేది కూడా తండ్రి అర్థం చేయించారు. మేము పావన దేవీ దేవతలుగా ఉండేవారమని, మళ్ళీ రావణుడు పతితంగా చేశాడని మీరు ఈ సమయంలో ఫీల్ అవుతారు. శూద్రుల నుండి దేవతలుగా చేసేందుకు, తండ్రి వచ్చి చదివించాల్సి ఉంటుంది. తండ్రిని ముక్తిదాత, మార్గదర్శకుడు అని అంటారు కానీ అర్థం తెలుసుకోరు. చూడండి, ఎలా ఉన్నవారు ఎలా తయారయ్యారు అని అందరికీ తెలిసేటువంటి సమయం ఇప్పుడు త్వరలో రాబోతుంది. డ్రామా ఎలా తయారు చేయబడింది, మేము లక్ష్మీనారాయణుల వలె అవ్వగలమని ఎవరికీ స్వప్నంలో కూడా ఉండేది కాదు. తండ్రి ఎంతగా గుర్తు తెప్పిస్తారు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలంటే శ్రీమతాన్ని అనుసరించాలి. స్మృతి యాత్రను అభ్యాసం చేయాలి. క్రిస్టియన్ ఫాదర్లు వాకింగ్ కు వెళ్ళినప్పుడు, ఎంత సైలెన్సులో వెళ్తారో మీకు తెలుసు. వారు క్రీస్తు స్మృతిలో ఉంటారు. వారికి క్రీస్తు పట్ల ప్రేమ ఉంటుంది. ఆత్మిక పండాలైన మీకు పరమ ప్రియమైన పరమపిత పరమాత్మతో ప్రీతి బుద్ధి ఉంది. కల్పక్రితం వలె, ఎంతగా పురుషార్థం చేసి శ్రీమతాన్ని అనుసరిస్తారో అంతగా, నంబరువారు పురుషార్థానుసారంగా, రాజధాని తప్పకుండా స్థాపనవుతుందని పిల్లలకు తెలుసు. తండ్రి అయితే చాలా మంచి-మంచి మతాలను (డైరెక్షన్) ఇస్తారు. అయినా కానీ గ్రహచారం ఎలా కూర్చుంటుందంటే ఇక శ్రీమతాన్ని అసలు అనుసరించరు. శ్రీమతాన్ని అనుసరించడంలోనే విజయముందని మీకు తెలుసు. నిశ్చయంలోనే విజయం ఉంటుంది. తండ్రి అంటారు - మీరు నా మతాన్ని అనుసరించండి, ఈ బ్రహ్మా మతాన్ని ఇస్తున్నారని ఎందుకనుకుంటారు. ఎల్లప్పుడూ శివబాబా సలహానిస్తున్నారని భావించండి. వారు సేవ కోసమే మతాన్నిస్తారు. కొంతమంది, బాబా, ఈ వ్యాపారం చేయనా అని అడుగుతారు. బాబా ఈ విషయాల కోసమేమీ మతాన్ని ఇవ్వరు. తండ్రి అంటారు - నేను పతితులను పావనంగా చేసే యుక్తులను తెలిపేందుకు వచ్చాను, ఈ విషయాల కోసం కాదు. ఓ పతితపావనా, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అనే నన్ను పిలుస్తారు కూడా. కనుక నేను చాలా సహజమైన యుక్తులను తెలియజేస్తాను. మీ పేరే గుప్త సైన్యము. వారేమో ఆయుధాలు, బాణాలు మొదలైనవి చూపించారు. కానీ ఇందులో బాణాలు మొదలైనవాటి విషయమేమీ లేదు. ఇదంతా భక్తి మార్గము.

తండ్రి వచ్చి సత్యమైన మార్గాన్ని తెలియజేస్తారు - దీనితో మీరు అర్ధకల్పం సత్య ఖండంలోకి వెళ్ళిపోతారు. అక్కడ అసలు వేరే ఖండమేదీ ఉండదు. ఇది ఎవరికైనా అర్థం చేయించినా సరే ఒప్పుకోరు, కేవలం భారత్ మాత్రమే ఉండడం అనేది ఎలా సాధ్యమని అంటారు. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేది కదా, అప్పుడు వేరే ధర్మాలేవీ ఉండేవి కావు. తర్వాత వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. మీరు కేవలం మీ తండ్రిని, మీ ధర్మాన్ని, కర్మను మర్చిపోయారు. స్వయాన్ని దేవీ దేవతా ధర్మం వారని భావించినట్లయితే, అశుద్ధమైన పదార్థాలు మొదలైనవేవీ తినరు. కానీ తింటున్నారు - ఎందుకంటే ఆ గుణాలు లేవు, అందుకే స్వయాన్ని హిందువులని చెప్పుకుంటారు. లేదంటే, మా పెద్దవారు ఇంత పవిత్రంగా ఉండేవారు కానీ మేము ఇంత పతితంగా అయ్యామని సిగ్గు అనిపించాలి. కానీ తమ ధర్మాన్ని మర్చిపోయారు. ఇప్పుడు మీరు డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలను మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. వేరే విషయం ఏదైనా ఉంటే, బాబా ఇంకా ఈ పాయింట్లు తెలపలేదని మీరు చెప్పవచ్చు, అంతే, లేకపోతే అనవసరంగా తికమకపడిపోతారు. మేము చదువుకుంటూ ఉన్నామని చెప్పండి. ఇప్పుడే అంతా తెలుసుకున్నట్లయితే, ఇక వినాశనమైపోతుంది, కానీ అలా జరగదు. ఇప్పుడు ఇంకా మార్జిన్ ఉంది. మనము చదువుకుంటున్నాము. అంతిమంలో సంపూర్ణ పవిత్రంగా అయిపోతాము. నంబరువారు పురుషార్థానుసారంగా తుప్పు వదలుతూ ఉంటుంది, అప్పుడు సతోప్రధానంగా అయిపోతారు. అప్పుడిక ఈ పతిత ప్రపంచం వినాశనమైపోతుంది. పరమాత్మ తప్పకుండా ఎక్కడో వచ్చి ఉన్నారు కానీ గుప్తంగా ఉన్నారని ఈ రోజుల్లో అంటూ ఉంటారు కూడా. నిజానికిది వినాశన సమయమే కదా. తండ్రియే ముక్తిదాత, మార్గదర్శకుడు, వారే తిరిగి తీసుకువెళ్తారు, అందరూ దోమల వలె మరణిస్తారు. అందరూ స్మృతిలో ఒకేలా కూర్చోరని కూడా మీకు తెలుసు. కొంతమందిది ఏక్యురేట్ యోగం ఉంటుంది, కొంతమందిది అరగంట, కొంతమందిది 15 నిముషాలు ఉంటుంది, కొంతమందైతే ఒక్క నిముషం కూడా స్మృతిలో ఉండరు. కొంతమంది, మేము పూర్తి సమయమంతా తండ్రి స్మృతిలోనే ఉంటామని అంటారు, అలా ఉంటే తప్పకుండా వారి ముఖం సంతోషంగా, ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి పిల్లలకే అతీంద్రియ సుఖం ఉంటుంది. వారి బుద్ధి ఎక్కడా భ్రమించదు. వారు సుఖం ఫీల్ అవుతూ ఉంటారు. ఒక్క ప్రియుని స్మృతిలో కూర్చున్నట్లయితే ఎంత తుప్పు తొలగిపోతుందని బుద్ధి కూడా చెప్తుంది. ఇక తర్వాత అలవాటైపోతుంది. స్మృతి యాత్ర ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా ధనవంతులుగా అవుతారు. చక్రం కూడా స్మృతిలోకి వచ్చేస్తుంది. కేవలం స్మృతిలో ఉండడంలోనే శ్రమ ఉంది. బుద్ధిలో చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది.

ఇప్పుడు మీరు మాస్టర్ బీజరూపులుగా అవుతారు. స్మృతితో పాటు స్వదర్శన చక్రాన్ని కూడా తిప్పాలి. భారతవాసులైన మీరు లైట్ హౌస్ లు. స్పిరిచ్యుల్ లైట్ హౌస్ లైన మీరు అందరికీ ఇంటి మార్గాన్ని తెలియజేస్తారు. ఇది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది కదా. మీరు ముక్తి, జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేస్తారు కనుక మీరు స్పిరిచ్యుల్ లైట్ హౌస్ లు. మీ స్వదర్శన చక్రం తిరుగుతూ ఉంటుంది. పేరు రాయాలి అంటే దాని గురించి అర్థం చేయించవలసి ఉంటుంది కూడా. మీరు సమ్ముఖంలో కూర్చున్నారని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎవరైతే ప్రియునితో ఉంటారో, వారి కోసం సమ్ముఖంలో (జ్ఞాన) వర్షం కురుస్తుంది. అన్నింటికన్నా ఎక్కువ ఆనందం సమ్ముఖంలో కలుగుతుంది. తర్వాత రెండవ నంబరు - టేప్ ద్వారా వినడం, మూడవ నంబరు - మురళీ. శివబాబా బ్రహ్మా ద్వారా అంతా అర్థం చేయిస్తారు. వీరికి (బ్రహ్మా) కూడా తెలుసు కదా. అయినా మీరు శివబాబా చెప్తున్నారనే భావించండి, ఇది అర్థం చేసుకోని కారణంగా, ఎంతగానో ఆజ్ఞను ఉల్లంఘిస్తారు. శివబాబా ఏదైతే చెప్తారో, అది కళ్యాణకారిగానే ఉంటుంది. ఒకవేళ అకళ్యాణం జరిగినా, అది కూడా కళ్యాణం రూపంలోకి మారిపోతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఇచ్చే ప్రతి డైరెక్షన్ ను అనుసరిస్తూ తమ ఉన్నతిని చేసుకోవాలి. ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి. స్మృతిలోనే భోజనాన్ని తయారు చేయాలి మరియు తినాలి.

2. ఆత్మిక లైట్ హౌస్ లుగా తయారై అందరికీ ముక్తి-జీవన్ముక్తుల మార్గాన్ని చూపించాలి. తండ్రి సమానంగా తప్పకుండా కళ్యాణకారులుగా అవ్వాలి.

వరదానము:-

ఒక్క తండ్రిలోనే మొత్తం ప్రపంచాన్ని అనుభవం చేసే అనంతమైన వైరాగీ భవ

ఎవరైతే ఒక్క తండ్రినే తమ ప్రపంచంగా భావిస్తారో, వారే అనంతమైన వైరాగులుగా అవ్వగలరు. ఎవరికైతే తండ్రే ప్రపంచమో, వారు తమ ఆ ప్రపంచంలోనే ఉంటారు, వేరే వైపులకు వెళ్ళనే వెళ్ళరు, కావున స్వతహాగా పక్కకు తప్పుకుంటారు. ప్రపంచమంటే, అందులో వ్యక్తులు, వైభవాలు అన్నీ వస్తాయి. తండ్రి సంపద అంటే నా సంపద - ఈ స్మృతిలో ఉండటం ద్వారా అనంతమైన వైరాగులుగా అవుతారు. ఎవరినైనా సరే చూస్తూ కూడా చూడనట్లు ఉంటారు. అసలు వేరే వాళ్ళు కనే కనిపించరు.

స్లోగన్:-

శక్తిశాలి స్థితిని అనుభవం చేసేందుకు ఏకాంతము మరియు రమణీకతల బ్యాలెన్స్ ను పెట్టుకోండి.