ఓంశాంతి
ఇప్పుడు పిల్లలైన మీరు ఎదురుగా కూర్చున్నారు. తండ్రి అంటారు, ఓ జీవాత్మలు,
వింటున్నారా. ఆత్మలతో మాట్లాడుతున్నారు. మా అనంతమైన తండ్రి మమ్మల్ని, ఎక్కడైతే దుఃఖం
యొక్క పేరు ఉండదో, అక్కడకు తీసుకువెళ్తారు అని ఆత్మలకు తెలుసు. పాటలో కూడా అంటారు -
ఈ పాపపు ప్రపంచము నుండి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి. పతిత ప్రపంచమని దేనినంటారు,
ఇది ప్రపంచానికి తెలియదు. చూడండి, ఈ రోజుల్లో మనుష్యులలో కామము, క్రోధము ఎంత
తీవ్రంగా ఉన్నాయి. క్రోధానికి వశీభూతులై, మేము వీరి దేశాన్ని నాశనము చేస్తాము అని
అంటారు. ఇలా కూడా అంటారు - ఓ భగవంతుడా, మమ్మల్ని ఘోర అంధకారము నుండి అత్యంత
ప్రకాశంలోకి తీసుకువెళ్ళండి ఎందుకంటే ఇది పాత ప్రపంచము. కలియుగాన్ని పాత యుగమని,
సత్యయుగాన్ని కొత్త యుగమని అంటారు. తండ్రి తప్ప కొత్త యుగాన్ని ఇతరులెవ్వరూ
తయారుచేయలేరు. మన మధురమైన బాబా మనల్ని ఇప్పుడు దుఃఖధామము నుండి సుఖధామంలోకి
తీసుకువెళ్తారు. బాబా, మీరు తప్ప మమ్మల్ని ఇతరులెవ్వరూ స్వర్గంలోకి తీసుకువెళ్ళలేరు.
బాబా ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. అయినా కూడా, ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఈ
సమయంలో బాబా యొక్క శ్రేష్ఠ మతము లభిస్తుంది. శ్రేష్ఠ మతముతో మనం శ్రేష్ఠంగా అవుతాము.
ఇక్కడ శ్రేష్ఠంగా తయారైతే శ్రేష్ఠ ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు. ఇదైతే
భష్టాచారీ రావణ ప్రపంచము. స్వయం యొక్క మతముపై నడుచుకోవడాన్ని మన్మతమని అంటారు.
తండ్రి అంటారు, శ్రీమతంపై నడవండి. కానీ మిమ్మల్ని పదే-పదే ఆసురీ మతము నరకంలోకి
తోసేస్తుంది. క్రోధం చేయడం ఆసురీ మతము. తండ్రి అంటారు, ఒకరిపై ఒకరు క్రోధం చేయకండి.
ప్రేమగా నడుచుకోండి. ప్రతి ఒక్కరూ స్వయం కోసం సలహా తీసుకోవాలి. తండ్రి అంటారు,
పిల్లలూ, పాపం ఎందుకు చేస్తారు, పుణ్యంతో పని కానివ్వండి. తమ ఖర్చును తగ్గించుకోండి.
తీర్థాలలో ఎదురుదెబ్బలు తినడం, సన్యాసుల వద్ద ఎదురుదెబ్బలు తినడం, ఈ
కర్మకాండలన్నింటిపై ఎంత ఖర్చు చేస్తారు. వాటన్నింటి నుండి విడుదల చేస్తారు.
వివాహాలను మనుష్యులు ఎంత ఆడంబరంగా జరుపుతారు. అప్పు తీసుకునైనా సరే వివాహాలు
చేయిస్తారు. ఒకటేమో అప్పు తీసుకుంటారు, ఇంకొకటి పతితంగా అవుతారు. ఎవరైనా పతితంగా
అవ్వాలనుకుంటే, వెళ్ళి అవ్వండి. ఎవరైతే శ్రీమతంపై నడుస్తూ పవిత్రంగా అవుతారో, వారిని
ఎందుకు ఆపుచేయాలి. మిత్ర-సంబంధీకులు మొదలైనవారు గొడవ చేస్తే సహనం చేయాల్సే ఉంటుంది.
మీరా కూడా అంతా సహనం చేసారు కదా. అనంతమైన తండ్రి వచ్చారు, రాజయోగాన్ని నేర్పించి
భగవాన్-భగవతి పదవిని ప్రాప్తి చేయిస్తారు. లక్ష్మిని భగవతి అని, నారాయణుడిని
భగవంతుడని అనడం జరుగుతుంది. కలియుగ అంతిమంలోనైతే అందరూ పతితంగా ఉన్నారు, మరి వారిని
ఎవరు పరివర్తన చేసారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, బాబా ఏ విధంగా వచ్చి
స్వర్గాన్ని లేక రామ రాజ్యాన్ని స్థాపన చేయిస్తారు. మనము సూర్యవంశీ లేక చంద్రవంశీ
పదవిని పొందడానికి ఇక్కడకు వచ్చాము. ఎవరైతే సూర్యవంశీ సుపుత్రులైన పిల్లలు ఉంటారో,
వారు చదువును బాగా చదువుకుంటారు.
తండ్రి అందరికీ అర్థం చేయిస్తారు - పురుషార్థం చేసి మీరు తల్లి-తండ్రిని ఫాలో
చేయండి. ఎటువంటి పురుషార్థం చేయండంటే, వీరికి వారసులుగా అయి చూపించండి. మమ్మా-బాబా
అని అంటారు కావున భవిష్య సింహాసనాధికారులుగా అయి చూపించండి. తండ్రి అయితే అంటారు,
ఎంతగా చదవండంటే, నా కన్నా ఉన్నతంగా వెళ్ళాలి. తండ్రి కన్నా ఉన్నతంగా వెళ్ళే పిల్లలు
చాలామంది ఉంటారు. అనంతమైన తండ్రి అంటారు, నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా
చేస్తాను. నేను ఏమైనా అవుతానా. ఎంత మధురమైన తండ్రి. వారి శ్రీమతము ప్రసిద్ధమైనది.
మీరు శ్రేష్ఠ దేవీ-దేవతలుగా ఉండేవారు, తర్వాత 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు
పతితంగా అయిపోయారు. ఇది గెలుపు-ఓటముల ఆట. మాయతో ఓడిపోతే ఓడిపోతారు, మాయను గెలుస్తే
గెలుస్తారు. మనసు అన్న పదాన్ని ఉపయోగించడం తప్పు. మనసు సంకల్పాలు చేయకుండా ఏమైనా
ఉండగలదా. మనసైతే సంకల్పాలు చేస్తుంది. మనము సంకల్ప-రహితంగా అయి కూర్చోవాలి
కోరుకున్నా, అది ఎప్పటివరకని? కర్మలైతే చేయాలి కదా. గృహస్థ ధర్మం యొక్క కర్మలను
చేయకూడదు వారు భావిస్తారు. ఈ హఠయోగీ సన్యాసుల పాత్ర కూడా ఉంది. వారిది కూడా నివృత్తి
మార్గ ధర్మం ఒకటి ఉంది. ఇతర ఏ ధర్మాలలోనూ ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవుల్లోకి వెళ్ళరు.
ఒకవేళ ఎవరైనా వదిలినా కూడా, సన్యాసులను చూసి వదిలారు. బాబా ఏమీ ఇళ్ళు-వాకిళ్ళ పట్ల
వైరాగ్యాన్ని ఇప్పించరు. తండ్రి అంటారు, ఇంటిలో ఉండండి కానీ పవిత్రంగా అవ్వండి. పాత
ప్రపంచాన్ని మర్చిపోతూ వెళ్ళండి. మీ కోసం కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తున్నాను.
శంకరాచార్యులు సన్యాసులకు ఇలా చెప్పరు - మీ కోసం కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తాను
అని. వారిది హద్దు సన్యాసము, దాని ద్వారా అల్పకాలికమైన సుఖము లభిస్తుంది.
అపవిత్రమైనవారు వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. పవిత్రతకు ఎంత గౌరవముందో చూడండి.
ఇప్పుడైతే, ఎంత పెద్ద-పెద్ద ఫ్లాట్లు మొదలైనవి తయారుచేస్తున్నారో చూడండి. మనుష్యులు
దానం చేస్తారు కానీ ఇప్పుడు ఇందులో పుణ్యమైతే ఏమీ లేదు. మనుష్యులు - మేము ఈశ్వరార్థం
ఏదైతే చేస్తామో, అది పుణ్యమని భావిస్తారు. తండ్రి అంటారు, నా కోసమని మీరు ఏ-ఏ
కార్యాలలో పెడుతున్నారు! ఎవరైతే పాపము చేయరో, వారికి దానమివ్వాలి. ఒకవేళ పాపము
చేస్తే, మీపై దాని ప్రభావం పడుతుంది ఎందుకంటే మీరు ధనాన్ని ఇచ్చారు. పతితులకు
ఇస్తూ-ఇస్తూ మీరు నిరుపేదలుగా అయిపోయారు. ధనమంతా సర్వనాశనమైపోయింది. మహా అయితే,
అల్పకాలికమైన సుఖం లభిస్తుంది, ఇది కూడా డ్రామా. ఇప్పుడు మీరు తండ్రి శ్రీమతంపై
పావనంగా అవుతున్నారు. అక్కడ మీ వద్ద ధనం కూడా అపారంగా ఉంటుంది. అక్కడ పతితులెవ్వరూ
ఉండరు. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మీరు ఈశ్వరీయ సంతానము. మీలో చాలా
రాయల్టీ ఉండాలి. సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత స్థానాన్ని, ఉన్నత పదవిని
పొందలేరు. వారిలో తండ్రి, టీచరు, గురువు వేరు-వేరుగా ఉంటారు. ఇక్కడైతే తండ్రి, టీచరు,
సద్గురువు ఒక్కరే. ఒకవేళ మీరు ఏదైనా తప్పుడు నడవడికను నడిస్తే, ముగ్గురికీ నింద
తీసుకొచ్చినవారిగా అవుతారు. సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సద్గురు మతంపై నడవడం
ద్వారానే మీరు శ్రేష్ఠంగా అవుతారు. శరీరాన్ని అయితే వదలాల్సిందే కావున దీనిని
ఈశ్వరీయ, అలౌకిక సేవలో ఉపయోగించి తండ్రి నుండి వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు?
తండ్రి అంటారు, నేను దీనిని తీసుకుని ఏం చేస్తాను. నేను మీకు స్వర్గం యొక్క
రాజ్యాధికారాన్ని ఇస్తాను. అక్కడ కూడా నేను మహళ్ళలో ఉండను, ఇక్కడ కూడా నేను మహళ్ళలో
ఉండను. బమ్ బమ్ మహాదేవ... నా జోలిని నింపు అని పాడుతారు. కానీ వారు జోలిని ఎప్పుడు
మరియు ఎలా నింపుతారు, ఇది ఎవరికీ తెలియదు. జోలిని నింపారంటే తప్పకుండా చైతన్యంలో
ఉండేవారు. 21 జన్మల కోసం మీరు చాలా సుఖమయంగా, షావుకార్లుగా అవుతారు. ఇటువంటి తండ్రి
మతంపై అడుగడుగునా నడవాలి. గమ్యము చాలా పెద్దది. ఒకవేళ ఎవరైనా, నేను నడుచుకోలేను అని
అంటే, అప్పుడు బాబా అంటారు - మరి నీవు బాబా అని ఎందుకు అంటావు! శ్రీమతంపై
నడుచుకోకపోతే చాలా శిక్షలు అనుభవిస్తారు. పదవి కూడా భ్రష్టమైపోతుంది. పాటలో కూడా
విన్నారు - నన్ను సుఖము మరియు శాంతి ఉండేటువంటి ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని
అంటారు. వాటిని తండ్రే ఇవ్వగలరు. తండ్రి మతంపై నడుచుకోకపోతే తమను తామే
నష్టపర్చుకుంటారు. ఇక్కడ ఖర్చు మొదలైన విషయాలేవీ లేవు. గురువు వద్దకు కొబ్బరికాయలు,
మిఠాయిలు మొదలైనవి తీసుకురమ్మని లేక పాఠశాలలో ఫీజు కట్టమని ఏమైనా అంటారా.
అటువంటిదేమీ లేదు. ధనాన్ని మీ వద్దనే ఉంచుకోండి. మీరు కేవలం జ్ఞానాన్ని చదువుకోండి.
భవిష్యత్తును చక్కదిద్దుకోవడంలో నష్టమేమీ లేదు కదా. ఇక్కడ తల వంచి నమస్కరించడం కూడా
నేర్పించబడదు. అర్ధకల్పమైతే మీరు ధనాన్ని ఇస్తూ, తలను వంచుతూ-వంచుతూ నిరుపేదలుగా
అయిపోయారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్తారు. అక్కడ
నుండి సుఖధామంలోకి పంపిస్తారు. ఇప్పుడు కొత్త యుగము, కొత్త ప్రపంచము రానున్నది.
కొత్త యుగమని సత్యయుగాన్ని అంటారు, ఇక తర్వాత కళలు తగ్గిపోతూ వస్తాయి. ఇప్పుడు
తండ్రి మిమ్మల్ని యోగ్యులుగా చేస్తున్నారు. నారదుని ఉదాహరణ... ఒకవేళ ఏదైనా భూతముంటే,
మీరు లక్ష్మిని వరించలేరు. పిల్లలైన మీరు మీ ఇళ్ళు-వాకిళ్ళను కూడా సంభాళించాలి మరియు
సేవను కూడా చేయాలి. మొదట్లో వీరు ఎందుకు పరుగెత్తి వచ్చారంటే, వీరిపై చాలా దెబ్బలు
పడ్డాయి. చాలా అత్యాచారాలు జరిగాయి. దెబ్బలను కూడా వీరు లెక్కచేయలేదు. భట్టీ నుండి
కొంతమంది పక్కాగా, కొంతమంది కచ్చాగా వెలువడ్డారు. డ్రామా విధి ఈ విధంగా ఉంది.
జరగాల్సిందేదో జరిగిపోయింది, అది మళ్ళీ జరగనున్నది. నిందలు కూడా వేస్తారు.
అందరికన్నా పెద్ద-పెద్ద నిందలు పడేది పరమపిత పరమాత్మ శివునికి. పరమాత్మ సర్వవ్యాపి
అని, కుక్క, పిల్లి, తాబేలు, చేప అన్నింటిలోనూ ఉన్నారని అంటారు. తండ్రి అంటారు,
నేనైతే పరోపకారిని. మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తాను. శ్రీకృష్ణుడు
స్వర్గానికి రాకుమారుడు కదా. వారిని సర్పము కాటు వేసిందని, నల్లగా అయిపోయారని అంటారు.
ఇప్పుడు అక్కడ సర్పము ఎలా కాటేస్తుంది? కృష్ణపురిలో కంసుడు ఎక్కడి నుండి వచ్చాడు?
ఇవన్నీ కట్టుకథలు. ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి, దీని ద్వారా మీరు కిందికి దిగుతూ
వచ్చారు. బాబా అయితే మిమ్మల్ని పుష్పాలుగా తయారుచేస్తారు. కొంతమందైతే చాలా పెద్ద
ముళ్ళలా ఉన్నారు. ఓ గాడ్ ఫాదర్ అని అంటారు కానీ వారికి ఏమీ తెలియదు. వారు తండ్రే
కానీ తండ్రి నుండి ఏం వారసత్వం లభిస్తుంది, ఏమీ తెలియదు. అనంతమైన తండ్రి అంటారు,
నేను మీకు అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను. మీకు ఒకరు లౌకిక తండ్రి,
రెండవవారు అలౌకిక ప్రజాపిత బ్రహ్మా, మూడవవారు పారలౌకిక శివ్. మీకు ముగ్గురు తండ్రులు
ఉన్నారు. మీకు తెలుసు, మేము తాతగారి నుండి బ్రహ్మా ద్వారా వారసత్వాన్ని తీసుకుంటాము
కనుక శ్రీమతంపై నడవాల్సి ఉంటుంది, అప్పుడే శ్రేష్ఠంగా అవుతారు. సత్యయుగంలో మీరు
ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ ప్రజాపిత బ్రహ్మా గాని, శివుడు గాని తెలియదు.
అక్కడ కేవలం లౌకిక తండ్రి మాత్రమే తెలుసు. సత్యయుగంలో ఒక్క తండ్రి ఉంటాడు. భక్తిలో
ఇద్దరు తండ్రులుంటారు. లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి. ఈ సంగమంలో ముగ్గురు
తండ్రులున్నారు. ఈ విషయాలు ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. కనుక నిశ్చయం కూర్చోవాలి.
ఇప్పుడిప్పుడే నిశ్చయము, మళ్ళీ ఇప్పుడిప్పుడే సంశయము, ఇప్పుడిప్పుడే జన్మ తీసుకోవడము,
మళ్ళీ ఇప్పుడిప్పుడే మరణించడము అన్నట్లు ఉండకూడదు. మరణిస్తే వారసత్వము
సమాప్తమైపోతుంది. ఇటువంటి తండ్రికి విడాకులివ్వకూడదు. ఎంతగా నిరంతరం స్మృతి చేస్తారో,
సేవ చేస్తారో, అంతటి ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి ఇది కూడా తెలియజేస్తున్నారు -
నా మతంపై నడుచుకున్నట్లయితే రక్షించబడతారు లేదంటే చాలా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
నీవు ఈ పాపాలు చేసావు, శ్రీమతంపై నడుచుకోలేదు అని అంతా సాక్షాత్కారం చేయిస్తారు.
సూక్ష్మ శరీరాన్ని ధారణ చేయించి శిక్షలు ఇవ్వడం జరుగుతుంది. గర్భజైలులో కూడా
సాక్షాత్కారాలు చేయిస్తారు. ఈ పాప కర్మలు చేసావు, ఇప్పుడు శిక్ష అనుభవించు. వృక్షం
వృద్ధి చెందుతూ ఉంటుంది. ఎవరైతే ఈ ధర్మానికి చెందినవారిగా ఉండేవారో, వేర్వేరు
ధర్మాలలోకి వెళ్ళిపోయారో, వారంతా బయటకు వస్తారు. మిగిలినవారు తమ-తమ సెక్షన్లలోకి
వెళ్ళిపోతారు. వేర్వేరు సెక్షన్లు ఉన్నాయి. వృక్షం ఎలా వృద్ధి చెందుతుందో చూడండి.
చిన్న-చిన్న కొమ్మలు వెలువడుతూ ఉంటాయి.
మీకు తెలుసు, మధురమైన బాబా మనల్ని తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చి ఉన్నారు,
అందుకే వారిని ముక్తిదాత అని అంటారు. వారు దుఃఖహర్త, సుఖకర్త. మార్గదర్శకునిగా అయి
మళ్ళీ సుఖధామంలోకి తీసుకువెళ్తారు. ఇలా అంటారు కూడా - 5 వేల సంవత్సరాల క్రితం
మిమ్మల్ని సుఖం యొక్క సంబంధంలోకి పంపించాను, మీరు 84 జన్మలు తీసుకున్నారు, ఇప్పుడు
తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. శ్రీకృష్ణుని పట్ల అయితే అందరికీ ప్రీతి ఉంది.
ఎంతైతే కృష్ణుని పట్ల ఉందో, అంతగా లక్ష్మీ-నారాయణుల పట్ల లేదు. రాధే-కృష్ణులే
లక్ష్మీ-నారాయణులుగా అవుతారు అనేది మనుష్యులకు తెలియదు. ఎవరికీ ఈ విషయం తెలియదు.
ఇప్పుడు మీకు తెలుసు, రాధే-కృష్ణులు వేర్వేరు రాజధానులకు చెందినవారు, మళ్ళీ స్వయంవరం
తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అయ్యారు. వారైతే కృష్ణుడిని ద్వాపరంలోకి తీసుకువెళ్ళారు.
కృష్ణుడిని పతితపావనుడు అని ఎవరూ అనలేరు. రెగ్యులర్ గా చదువుకోకుండా ఉన్నత పదవిని
ఎవరూ పొందలేరు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తమ నడవడికను చాలా రాయల్ గా ఉంచుకోవాలి, చాలా తక్కువగా మరియు మధురంగా
మాట్లాడాలి. శిక్షల నుండి రక్షించుకునేందుకు అడుగడుగునా తండ్రి శ్రీమతంపై
నడుచుకోవాలి.
2. చదువును చాలా అటెన్షన్ తో, మంచి రీతిలో చదువుకోవాలి. తల్లి-తండ్రిని ఫాలో చేసి
సింహాసనాధికారులుగా, వారసులుగా అవ్వాలి. క్రోధానికి వశమై దుఃఖాన్ని ఇవ్వకూడదు.