03-10-2021 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 31-03-1988


వాచా మరియు కర్మణా - రెండు శక్తులను జమ చేసుకునేందుకు ఈశ్వరీయ స్కీమ్ (పథకం)

ఈ రోజు ఆత్మిక దీపం తమ ఆత్మిక దీపపు పురుగులను చూస్తున్నారు. నలువైపులా ఉన్న దీపపు పురుగులు దీపం పైన బలిహారమయ్యారు అనగా సమర్పణ అయ్యారు. సమర్పణయ్యే అనగా బలిహారమయ్యే దీపపు పురుగులు అనేకమంది ఉన్నారు కానీ సమర్పణ అయిన తర్వాత ఆ దీపం పట్ల ఉన్న స్నేహంతో దీపం సమానంగా అవ్వడంలో, సమర్పణ చేయడంలో నంబరువారుగా ఉన్నారు. వాస్తవానికి హృదయపూర్వకమైన స్నేహం కారణంగానే సమర్పణ అవుతారు. హృదయపూర్వకమైన స్నేహం మరియు స్నేహం - ఈ రెండింటి మధ్యన వ్యత్యాసముంది. స్నేహమైతే అందరికీ ఉంది, స్నేహం కారణంగానే సమర్పణయ్యారు. హృదయపూర్వకమైన స్నేహీ లకు బాబా హృదయంలోని విషయాలు లేక హృదయంలోని ఆశలు తెలుసు, అంతేకాక వాటిని పూర్తి చేస్తారు. హృదయపూర్వకమైన స్నేహీలు హృదయంలోని ఆశలను పూర్తి చేసేవారు. హృదయపూర్వకమైన స్నేహీలు అనగా బాబా హృదయం ఏం చెప్తుందో, అది పిల్లల హృదయంలో ఇమిడిపోతుంది మరియు ఏదైతే హృదయంలో ఇమిడిపోతుందో, అది కర్మలలోకి స్వతహాగానే వస్తుంది. స్నేహీ ఆత్మలకు కొన్ని విషయాలు హృదయంలో ఇముడుతాయి, కొన్ని బుద్ధిలో ఇముడుతాయి. ఏ విషయాలైతే హృదయంలో ఇముడుతాయో, వాటిని కర్మలలోకి తీసుకొస్తారు, ఏ విషయాలైతే బుద్ధిలో ఇముడుతాయో, వాటి గురించి - చేయగలమా లేదా, చేయాల్సిందే, సమయానికి జరిగిపోతుందిలే అనే ఆలోచనలు నడుస్తాయి. ఇలాంటి ఆలోచనలు కారణంగా ఆ విషయాలు ఆలోచనల వరకే ఉండిపోతాయి, కర్మలలోకి రావు.

ఈ రోజు బాప్ దాదా చూస్తున్నారు - అందరూ సమర్పణ అయ్యేవారే. ఒకవేళ సమర్పణ అవ్వలేదంటే బ్రాహ్మణులుగా పిలవబడరు. కానీ బాబా స్నేహంలో - బాబా ఏం చెప్తే, అది చేయడానికి సమర్పణ చేయాల్సి ఉంటుంది అనగా నేను అనే భావనను త్యాగం చేయాలి. ఆ నేను అనే భావనలో అభిమానం ఉన్నా లేక బలహీనత ఉన్నా - రెండింటినీ త్యాగం చేయాల్సి ఉంటుంది, దీనినే సమర్పణ అని అంటారు. సమర్పణ అయ్యేవారు చాలామంది ఉన్నారు కానీ నేను అనే దానిని సమర్పణ చేసేందుకు ధైర్యం కలవారు నంబరువారుగా ఉన్నారు.

ఈ రోజు బాప్ దాదా కేవలం ఒక నెల రిజల్టును చూస్తున్నారు. ఇదే సీజన్లో విశేషంగా బాప్ దాదా బాబా సమానంగా అయ్యేందుకు రకరకాలుగా ఎన్ని సార్లు సూచనలు ఇచ్చారు. అంతేకాక, విశేషంగా బాప్ దాదా హృదయంలో ఉన్న శ్రేష్ఠమైన ఆశ ఇదే. ఎంత ఖజానా లభించింది, ఎన్ని వరదానాలు లభించాయి! ఆ వరదానాల కోసం పరుగు పరుగున వచ్చారు. పిల్లలు స్నేహంతో కలుసుకునేందుకు వస్తారని, వరదానాలు తీసుకొని సంతోషిస్తారని బాబాకు కూడా సంతోషం కలుగుతుంది. కానీ బాబా హృదయంలోని ఆశను పూర్తి చేసేవారెవరు? బాబా వినిపించిన విషయాలను కర్మలలోకి ఎంతవరకు తీసుకొచ్చారు? మనసా, వాచా, కర్మణా - ఈ మూడింటిలోనూ ఎంత రిజల్టు వచ్చిందని భావిస్తున్నారు? సంబంధ-సంపర్కాలలో మనసు ఎంతవరకు శక్తిశాలిగా ఉంటుంది? కేవలం మీకు మీరు కూర్చుని మననం చేయడమనేది స్వ-ఉన్నతికి చాలా మంచిది మరియు ఈ విధంగా చేయాల్సిందే. కానీ ఏ శ్రేష్ఠ ఆత్మలకైతే శ్రేష్ఠమైన మనసు ఉంటుందో అనగా సంకల్పాలు శక్తిశాలిగా, శుభ భావన, శుభ కామన కలిగినవిగా ఉంటాయో, వారి మనసా శక్తికి దర్పణం ఏమిటి? మాటలు మరియు కర్మలే దర్పణము. అజ్ఞానీ ఆత్మలైనా లేక జ్ఞానీ ఆత్మలైనా, ఇరువురి సంబంధ-సంపర్కంలో మాటలు మరియు కర్మలే మనసా శక్తికి దర్పణము. ఒకవేళ మాటలు మరియు కర్మలు శుభ భావన, శుభ కామన కలిగినవిగా లేకపోతే, మనసా శక్తి యొక్క ప్రత్యక్ష స్వరూపం ఎలా అర్థమవుతుంది? ఎవరి మనసైతే శక్తిశాలిగా మరియు శుభంగా ఉంటుందో, వారి మాటలు మరియు కర్మలు స్వతహాగానే శక్తిశాలిగా, శుద్ధంగా ఉంటాయి, శుభ భావన కలిగి ఉంటాయి. మనసు శక్తిశాలిగా ఉందంటే స్మృతి శక్తి కూడా శ్రేష్ఠంగా ఉంటుంది, శక్తిశాలిగా ఉంటుంది, వారు సహజ యోగులుగా ఉంటారు. కేవలం సహజ యోగులుగా మాత్రమే కాదు, సహజ కర్మయోగులుగా ఉంటారు.

బాప్ దాదా చూసారు - స్మృతిని శక్తిశాలిగా చేసుకోవడంలో మెజారిటీ పిల్లలకు అటెన్షన్ ఉంది, స్మృతిని సహజంగా మరియు నిరంతరంగా చేసుకోవాలనే ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి. ముందుకు వెళ్తూ ఉన్నారు మరియు వెళ్తూనే ఉంటారు ఎందుకంటే బాబా పట్ల స్నేహం బాగుంది కావుననే స్మృతి పట్ల అటెన్షన్ బాగుంది. స్మృతికి ఆధారమే స్నేహము. బాబాతో ఆత్మిక సంభాషణ చేయడంలో కూడా అందరూ బాగున్నారు. అప్పుడప్పుడు కళ్ళతో కొంచెం కోపంగా కూడా చూస్తారు, అది కూడా ఎప్పుడంటే పరస్పరంలో కొద్దిగా డిస్టర్బ్ అయినప్పుడు. అప్పుడు బాబాకు మీరెందుకు సరి చేయరు? అని ఫిర్యాదు చేస్తారు. కానీ ఎంతైనా అవి స్నేహంతో నిండిన ప్రేమపూర్వకమైన నయనాలు. కానీ సంగఠనలోకి వచ్చినప్పుడు, కర్మల్లోకి వచ్చినప్పుడు, కార్య-వ్యవహారాలలోకి వచ్చినప్పుడు, పరివారంలోకి వచ్చినప్పుడు, ఆ సంగఠనలోని మాటలలో అనగా వాచా శక్తిలో వ్యర్థం ఎక్కువగా కనిపిస్తుంది.

వాణి శక్తి వ్యర్థమవుతున్న కారణంగా, ఆ వాణి ద్వారా ఏదైతే బాబాను ప్రత్యక్షం చేసేందుకు శక్తిని అనుభవం చేయించాలో, అది తక్కువైపోతుంది. మీరు వినిపిస్తున్న విషయాలు బాగా అనిపిస్తాయి, అది వేరే విషయం. బాబా వినిపించిన విషయాలను రిపీట్ చేస్తారు కనుక అవి తప్పకుండా బాగా అనిపిస్తాయి. కానీ వాచా శక్తి వ్యర్థమవుతున్న కారణంగా శక్తి జమ అవ్వదు, అందుకే బాబాను ప్రత్యక్షం చేసే శబ్దం ప్రతిధ్వనించడంలో ఆలస్యం జరుగుతుంది. సాధారణమైన మాటలు ఎక్కువగా ఉన్నాయి. అలౌకిక మాటలు ఉండాలి, ఫరిశ్తాల మాటలు ఉండాలి. ఇప్పుడు ఈ సంవత్సరం దీనిని అండర్ లైన్ చేయండి. ఉదాహరణకు బ్రహ్మాబాబాను చూసారు - ఫరిశ్తాల మాటల వలె ఉండేవి, తక్కువగా మాట్లాడేవారు మరియు మధురంగా మాట్లాడేవారు. ఏ మాటలకైతే ఫలం వెలువడుతుందో, అవి యథార్థమైన మాటలు మరియు ఏ మాటలకైతే ఎలాంటి ఫలము ఉండదో, అవి వ్యర్థ మాటలు. కార్య-వ్యవహారాలలో లభించే ఫలమైనా కావచ్చు. కార్య-వ్యవహారాల కోసం కూడా మాట్లాడాల్సి ఉంటుంది కదా, అక్కడ కూడా చాలా ఎక్కువగా మాట్లాడకండి. ఇప్పుడు శక్తిని జమ చేసుకోవాలి. ఎలాగైతే స్మృతి ద్వారా మనసా శక్తిని జమ చేసుకుంటారో, సైలెన్సులో కూర్చున్నప్పుడు సంకల్ప శక్తిని జమ చేసుకుంటారో, అలా వాచా శక్తిని కూడా జమ చేసుకోండి.

నవ్వు వచ్చే విషయం ఒకటి వినిపిస్తాము - బాప్ దాదా వతనంలో అందరి జమకు సంబంధించిన భండారీలు (హుండీలు) ఉన్నాయి. మీ సేవాకేంద్రాలలో కూడా భండారీలు ఉన్నాయి కదా. బాబా వతనంలో పిల్లలకు చెందిన భండారీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు మొత్తం రోజంతటిలో మనసా, వాచా, కర్మణా - ఈ మూడు శక్తులను పొదుపు చేసి జమ చేస్తారు కదా, అవి ఆ భండారీలు. మనసా శక్తిని ఎంత జమ చేసుకున్నారు, వాచా శక్తిని, కర్మణా శక్తిని ఎంత జమ చేసుకున్నారు - దీనికి సంబంధించిన పూర్తి లెక్క ఉంది. మీరు కూడా ఖర్చు మరియు పొదుపులకు సంబంధించిన లెక్కలను పంపిస్తారు కదా. ఈ రోజు బాప్ దాదా ఈ జమకు సంబంధించిన భండారీలను చూసారు. ఏం కనిపించి ఉంటుంది? జమ ఖాతా ఎంత వెలువడి ఉంటుంది? ప్రతి ఒక్కరిది ఎవరి రిజల్టు వారిదే. భండారీలైతే చాలా నిండుగా ఉన్నాయి కానీ చిల్లర ఎక్కువగా ఉంది. చిన్న పిల్లలు హుండీలో చిల్లర జమ చేస్తే ఆ హుండీ ఎంత బరువుగా అవుతుంది! అలా వాచా రిజల్టులో విశేషంగా ఇది ఎక్కువ చూసారు. స్మృతి పట్ల ఎంత అటెన్షన్ ఉందో, వాచా పట్ల అంత అటెన్షన్ లేదు. కనుక ఈ సంవత్సరం వాచా మరియు కర్మణా - ఈ రెండు శక్తులను జమ చేసుకునే స్కీమ్ (పథకం) తయారుచేయండి. ఎలాగైతే గవర్నమెంట్ కూడా రకరకాల పద్ధతుల ద్వారా పొదుపు పథకాలను తయారుచేస్తుందో, అలా ఇక్కడ ముఖ్యమైనది మనసా, ఈ విషయం అందరికీ తెలుసు. కానీ మనసాతో పాటు విశేషంగా మాటలు మరియు కర్మలు - ఇవి సంబంధ-సంపర్కాలలో స్పష్టంగా కనిపిస్తాయి. మనసా ఎంతైనా గుప్తంగా ఉంటుంది కానీ ఇవి ప్రత్యక్షంగా కనిపిస్తాయి. మాటలను జమ చేసుకునేందుకు సాధనము - తక్కువగా మాట్లాడండి మరియు మధురంగా మాట్లాడండి, స్వమానంతో మాట్లాడండి. ఎలాగైతే బ్రహ్మాబాబా చిన్నవారిని మరియు పెద్దవారిని స్వమానంతో కూడిన మాటలతో తమ వారిగా చేసుకున్నారో, అలా ఈ విధితో ఎంత ముందుకు వెళ్తారో అంత త్వరగా విజయమాల తయారవుతుంది. మరి ఈ సంవత్సరం ఏం చేయాలి? సేవ చేయడంతో పాటు విశేషంగా ఈ శక్తులను జమ చేసుకుంటూ సేవ చేయాలి.

సేవ కోసమైతే అందరూ మంచి-మంచి ప్లాన్లు తయారుచేసారు. ఈ రోజు వరకు నలువైపులా, భారతదేశంలోనైనా లేక విదేశాలలోనైనా, ప్లాన్ల అనుసారంగా ఏదైతే సేవ చేస్తున్నారో అది బాగా చేస్తున్నారు మరియు చేస్తారు కూడా. ఎలాగైతే సేవలలో ఒకదాని కంటే ఒకదానిలో ఇంకా మంచి రిజల్టు తీసుకురావాలనే శుభ భావనతో ముందుకు వెళ్తున్నారో, అలా సేవలో సంగఠిత రూపంలో సదా సంతుష్టంగా ఉంటూ, సంతుష్టం చేసే విశేషమైన సంకల్పం కూడా సదా ఉండాలి ఎందుకంటే ఒకే సమయంలో మూడు రకాల సేవలు కలిపి జరుగుతున్నాయి. ఒకటి - స్వయం యొక్క సంతుష్టత, ఇది స్వ-సేవ, రెండవది - సంగఠనలో సంతుష్టత, ఇది పరివారం యొక్క సేవ, మూడవది - భాష ద్వారా లేక ఇంకేదైనా విధి ద్వారా విశ్వాత్మల సేవ. ఇలా ఒకే సమయంలో మూడు సేవలు జరుగుతాయి. ఏదైనా ప్రోగ్రాం తయారుచేసినప్పుడు కూడా, అందులో మూడు సేవలు ఇమిడి ఉంటాయి. ఎలాగైతే విశ్వ సేవ యొక్క రిజల్టు లేక విధి పట్ల అటెన్షన్ పెడతారో, అలా మిగిలిన రెండు సేవలు స్వ మరియు సంగఠన, ఈ మూడు సేవలు నిర్విఘ్నంగా ఉండాలి, అప్పుడు సేవలో నంబరువన్ సఫలత వచ్చిందని అంటారు. మూడు సఫలతలు కలిపి ఉండడమే నంబరు తీసుకోవడము. ఈ సంవత్సరం మూడు సేవలలోనూ సఫలత కలిపి లభించాలి - ఈ నగారా (ఢంకా) మోగాలి. ఒకవేళ కేవలం ఒక మూలలోనే నగారా మోగితే, అది కుంభకర్ణుల చెవుల వరకు చేరుకోదు. ఎప్పుడైతే నలువైపులా ఈ నగారా మోగుతుందో, అప్పుడు కుంభకర్ణులందరూ మేల్కొంటారు. ఇప్పుడైతే ఒకరు మేల్కొంటే రెండవవారు నిద్రపోతారు, రెండవవారు మేల్కొంటే మూడవవారు నిద్రపోతారు. ఒకవేళ కొద్దిగా మేల్కొన్నా, బాగుంది, బాగుంది అని మళ్ళీ నిద్రపోతారు. కానీ మేల్కొని నోటి ద్వారా లేక మనసు ద్వారా అహో ప్రభూ! అని అనాలి మరియు ముక్తి వారసత్వం తీసుకోవాలి, అప్పుడు సమాప్తి జరుగుతుంది. మేల్కొంటేనే కదా ముక్తి వారసత్వాన్ని తీసుకుంటారు. మరి ఏం చేయాలో అర్థమయిందా? ఒకరికొకరు సహయోగులుగా అవ్వండి. ఇతరుల రక్షణలో మీ రక్షణ అనగా జమ అవుతుంది.

సేవా ప్లాన్లతో ఎంత సమీప సంపర్కంలోకి తీసుకొస్తారో, అంత సేవకు ప్రత్యక్ష ఫలితం కనిపిస్తుంది. సందేశమిచ్చే సేవ అయితే చేస్తూ వచ్చారు, చేస్తూ ఉండండి కానీ విశేషంగా ఈ సంవత్సరం కేవలం సందేశమివ్వడమే కాక సహయోగులుగా చేయండి అనగా సమీప సంపర్కంలోకి తీసుకురండి. కేవలం ఫారం నింపించడమైతే జరుగుతూ ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఇంకా ముందుకు వెళ్ళండి. ఫారం నింపించండి కానీ కేవలం ఫారం నింపించి వదిలేయకండి, సంబంధంలోకి తీసుకురండి. ఎటువంటి వ్యక్తియో, ఆ విధంగా సంపర్కంలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్లు తయారుచేయండి. చిన్న-చిన్న ప్రోగ్రాంలు చేసినా కానీ, ఇదే లక్ష్యం పెట్టుకోండి. కేవలం ఒక గంట కోసమో లేక ఫారం నింపేంత వరకో సహయోగులుగా చేయడం కాదు, కానీ సహయోగం ద్వారా వారిని సమీపంగా తీసుకురావాలి. సంపర్కంలోకి, సంబంధంలోకి తీసుకురండి. అప్పుడు మున్ముందు సేవ యొక్క రూపం పరివర్తనవుతుంది. మీకు మీ కోసం ఏమీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, మీ తరఫున సంబంధంలోకి వచ్చేవారు మాట్లాడుతారు, మీకు కేవలం ఆశీర్వాదాలు మరియు దృష్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాగైతే ఈ రోజుల్లో శంకరాచార్యుల వారిని కుర్చీపై కూర్చోబెడతారో, అలా మిమ్మల్ని పూజ్యుల కుర్చీపై కూర్చోబెడతారు, వెండి కుర్చీపై కాదు. వాళ్ళు ధరణిని తయారుచేసేందుకు నిమిత్తమవుతారు, మీకు కేవలం దృష్టి ద్వారా బీజం వేయాల్సి ఉంటుంది, ఆశీర్వదించే మాటలు రెండు మాట్లాడాల్సి ఉంటుంది, అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. మీలో బాబా కనిపిస్తారు మరియు మీ ద్వారా బాబా దృష్టిని, బాబా స్నేహాన్ని అనుభూతి చేసిన వెంటనే ప్రత్యక్షతా ధ్వని మోగడం మొదలైపోతుంది.

ఇప్పుడు సేవ యొక్క గోల్డెన్ జూబ్లీని పూర్తి చేసుకున్నారు. ఇప్పుడిక ఇతరులు సేవ చేస్తారు మరియు మీరు చూసి హర్షిస్తూ ఉంటారు. ఉదాహరణకు పోప్ (క్రైస్తవ మత పెద్ద) ఏం చేస్తారు? పెద్ద సభ మధ్యలో దృష్టినిచ్చి ఆశీర్వచనాల మాటలు మాట్లాడుతారు. దీర్ఘంగా ఉపన్యసించేందుకు వేరే వాళ్ళు నిమిత్తమవుతారు. మాకు బాబా వినిపించారని మీరు చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు దానికి బదులుగా ఇతరులు ఏం చెప్తారంటే - వీరు ఏదైతే వినిపించారో, అది బాబా వినిపించిందే, ఇంకెవ్వరూ లేనే లేరు. ఇప్పుడు నెమ్మది-నెమ్మదిగా ఇలాంటి హ్యాండ్స్ (సహయోగులు) తయారవుతారు. సేవాకేంద్రాలను సంభాళించేందుకు హ్యాండ్స్ తయారయ్యారు కదా, అలా స్టేజి పైన మీ తరఫున మాట్లాడేవారు, అనుభవం చేసి మాట్లాడేవారు వెలువడతారు. వారు కేవలం మహిమ చేసేవారిగా ఉండరు, వారు జ్ఞానంలోని లోతైన పాయింట్లను స్పష్టం చేయడానికి, పరమాత్మ జ్ఞానాన్ని ఋజువు చేయడానికి నిమిత్తులవుతారు. కానీ దీని కోసం అటువంటి వ్యక్తులను స్నేహీలుగా, సహయోగులుగా సంపర్కంలోకి తీసుకొస్తూ సంబంధంలోకి తీసుకురండి. ఈ పూర్తి కార్యక్రమం యొక్క లక్ష్యమేమిటంటే - మీరు స్వయం మైట్ గా అవ్వాలి మరియు వారు మైక్ గా అవ్వాలి - ఇలాంటి సహయోగులను తయారుచేయండి. ఈ సంవత్సరం అందరి సహయోగం ద్వారా జరిగే సేవ యొక్క లక్ష్యమేమిటంటే - మైక్ లను తయారుచేయాలి. వారు తమ అనుభవం యొక్క ఆధారంతో మీ జ్ఞానాన్ని లేక బాబా జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయాలి. ఎవరి ప్రభావమైతే ఇతరులపై స్వతహాగా మరియు సహజంగా పడుతుందో, అలాంటి మైక్ లను తయారుచేయండి. సేవ యొక్క ఉద్దేశ్యం ఏమిటో అర్థమయిందా? ఇన్ని ప్రోగ్రాంలు తయారుచేసారు. వీటి నుండి ఏ వెన్న (ఫలితం) వెలువడుతుంది? బాగా సేవ చేయండి కానీ ఈ సంవత్సరం సందేశమివ్వడంతో పాటు దీనిని కలుపుకోండి. ఎవరెవరు ఇలాంటి సేవకు పాత్రులుగా ఉన్నారో, వారిని దృష్టిలో పెట్టుకోండి మరియు వారిని సమయమనుసారంగా రకరకాల విధుల ద్వారా సంపర్కంలోకి తీసుకురండి. అంతేకానీ, ఒక ప్రోగ్రాం చేసారు, దాని తర్వాత రెండవది చేసారు, దాని తర్వాత మూడవది చేసారు కానీ మొదటి ప్రోగ్రాంలో వచ్చినవారు అక్కడికక్కడ ఉండిపోయారు మరియు మూడవ ప్రోగ్రాం వారు ఇప్పుడు వచ్చారు అన్నట్లు జరగకూడదు. ఇందులో కూడా జమ చేసే శక్తిని ప్రయోగించాల్సి ఉంటుంది. ప్రతి ప్రోగ్రాం ద్వారా (సంపర్కంలోకి వచ్చేవారిని) జమ చేస్తూ వెళ్ళండి. చివర్లో ఇలా సంబంధ-సంపర్కంలోకి వచ్చినవారి మాల తయారవ్వాలి. అర్థమయిందా? ఇప్పుడింక ఏం మిగిలింది? కలుసుకునే ప్రోగ్రాం మిగిలింది.

ఈ సంవత్సరం బాప్ దాదా 6 నేలల సేవా రిజల్టును చూడాలనుకుంటున్నారు. ఎవరెవరైతే సేవా ప్లాన్లు తయారుచేసారో, వారు ఒకరికొకరు సహయోగులుగా అయి నలువైపులా బాగా తిరగండి. చిన్న-పెద్ద అందరినీ ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకొచ్చి మూడు రకాల సేవలలోనూ ముందుకు తీసుకువెళ్ళండి. అందుకే బాప్ దాదా ఈ సంవత్సరం పూర్తి రాత్రిని పగలుగా చేసి సేవ ఇచ్చారు. ఇప్పుడిది ఈ మూడు రకాల సేవా ఫలాన్ని తినే సంవత్సరం. ఫలం వచ్చే సంవత్సరం కాదు, ఫలం తినే సంవత్సరం. ఇది ఫలం వచ్చే సంవత్సరంగా నిర్ణయించబడలేదు. బాబా సకాష్ అయితే సదా తోడుగా ఉంటుంది. డ్రామాలో నిర్ణయించబడి ఉన్న విషయాన్ని వినిపించాను. డ్రామాకు ఏది అంగీకారమో, దానిని అంగీకరించాల్సే ఉంటుంది. సేవ బాగా చేయండి. 6 నెలల్లోనే ఫలితం తెలిసిపోతుంది. బాబా ఆశలను పూర్తి చేసే ప్లాన్ తయారుచేయండి. ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ప్రతి ఒక్కరి సంకల్పాలు, మాటలు మరియు కర్మలు బాబా ఆశల దీపాన్ని వెలిగించేవిగా ఉండాలి. ముందుగా మధుబన్ లో ఈ ఉదాహరణ చూపించండి. పొదుపు పథకం యొక్క మోడల్ (నమూనా) ను ముందు మధుబన్ లో తయారుచేయండి. ముందు ఈ బ్యాంకులో జమ చేయండి. మధుబన్ వారికి కూడా వరదానాలు లభించాయి. మిగిలినవారిని కలవడం కూడా ఈ సంవత్సరంలో త్వరగా పూర్తి చేస్తాము ఎందుకంటే బాబా స్నేహమైతే పిల్లలందరి పట్ల ఉంది. వాస్తవానికి పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ప్రతి అడుగులోనూ వరదానం ఉంది. హృదయపూర్వకమైన స్నేహీ ఆత్మలు ప్రతి అడుగు వరదానంతోనే వేస్తారు. బాబా వరదానాలు కేవలం నోటి ద్వారా వచ్చినవి మాత్రమే కావు, అవి హృదయం నుండి కూడా వెలువడినవి. హృదయపూర్వకంగా ఇచ్చిన వరదానాలు సదా హృదయంలో సంతోషాన్ని మరియు ఉల్లాస-ఉత్సాహాలను అనుభవం చేయిస్తాయి. ఇది హృదయపూర్వకంగా ఇచ్చిన వరదానాలకు గుర్తు. హృదయపూర్వకంగా ఇచ్చిన వరదానాలను ఎవరైతే హృదయంలో ధారణ చేస్తారో, వారి గుర్తు ఏమిటంటే, వారు సదా సంతోషం మరియు ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఎప్పుడూ ఏ విషయాలలోనూ చిక్కుకోరు, ఆగరు. వరదానాలతో ఎగురుతూ ఉంటారు, మిగిలిన విషయాలన్నీ కింద ఉండిపోతాయి. ఎగిరేవారిని సైడ్ సీన్స్ కూడా ఆపలేవు.

ఈ రోజు బాప్ దాదా పిల్లలందరికీ, ఎవరైతే హృదయపూర్వకంగా, అలసిపోకుండా సేవ చేసారో, ఆ సేవాధారులందరికీ ఈ సీజన్లో చేసిన సేవకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మధుబన్ కు వచ్చి మధుబన్ కు అలంకారంగా అయిన పిల్లలందరికీ బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు మరియు నిమిత్తంగా అయిన శ్రేష్ఠ ఆత్మలకు కూడా సదా అలసిపోనివారిగా అయి బాబా సమానంగా తమ సేవల ద్వారా అందరినీ రిఫ్రెష్ చేసినందుకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. అంతేకాక, రథానికి కూడా శుభాకాంక్షలు. నలువైపులా ఉన్న సేవాధారి పిల్లలకు శుభాకాంక్షలు. నిర్విఘ్నంగా ముందుకు వెళ్తున్నారు మరియు ముందుకు వెళ్తూ ఉండండి. దేశ-విదేశాల పిల్లలందరికీ మధుబన్ కు వచ్చినందుకు కూడా శుభాకాంక్షలు మరియు రిఫ్రెష్ అయినందుకు కూడా శుభాకాంక్షలు. కానీ సదా రిఫ్రెష్ గా ఉండండి, కేవలం 6 నెలల వరకే కాదు. ఇంకా ఎక్కువ రిఫ్రెష్ అయ్యేందుకు వస్తే రండి ఎందుకంటే బాబా ఖజానాపైన పిల్లలందరికీ సదా అధికారముంది. బాబా మరియు ఖజానా సదా మీతో పాటు ఉన్నాయి మరియు సదా మీతో పాటే ఉంటాయి. కేవలం ఏ విషయాన్ని అయితే అండర్ లైన్ చేయించారో, విశేషంగా అందులో స్వయాన్ని ఉదాహరణగా తయారుచేసుకొని పరీక్షలో అదనపు మార్కులు తీసుకోవాలి. ఇతరులను చూడవద్దు, స్వయాన్ని ఉదాహరణగా తయారుచేసుకోవాలి. ఇందులో ఎవరు చేస్తారో, వారే అర్జునులు అనగా నంబరువన్. మళ్ళీ సారి బాప్ దాదా వచ్చినప్పుడు, ప్రతి ఒక్కరు సదా ఫరిశ్తాల కర్మలు, ఫరిశ్తాల మాటలు, ఫరిశ్తాల సంకల్పాలు చేసేవారిగా కనిపించాలి. ఇలాంటి పరివర్తన సంగఠనలో కనిపించాలి. ఈ ఫరిశ్తాల మాటలు, ఫరిశ్తాల కర్మలు ఎంత అలౌకికంగా ఉన్నాయని ప్రతి ఒక్కరు అనుభవం చేయాలి. ఈ పరివర్తనా సమారోహాన్ని బాప్ దాదా చూడాలనుకుంటున్నారు. ఒకవేళ ప్రతి ఒక్కరు పూర్తి రోజంతటిలో తమ మాటలను టేప్ లో రికార్డు చేస్తే, చాలా బాగా తెలిసిపోతుంది. చెక్ చేసుకుంటే ఎంత వ్యర్థమవుతుందో తెలిసిపోతుంది. మనసులో రికార్డ్ చేసి చెక్ చేయండి, స్థూలంగా కాదు. సాధారణ మాటలు కూడా వ్యర్థంలో జమ అవుతాయి. ఒకవేళ నాలుగు మాటలకు బదులుగా 24 మాటలు మాట్లాడితే, మిగతా 20 మాటలు ఎందులోకి వెళ్ళినట్లు? శక్తిని జమ చేసుకోండి, అప్పుడు మీరు మాట్లాడే రెండు ఆశీర్వాదాల మాటలు ఒక గంట పాటు చేసిన భాషణ వలె పని చేస్తాయి. అచ్ఛా.

నలువైపులా ఉన్న సమర్పణ అయ్యే ఆత్మిక దీపపు పురుగులందరికీ, బాబా సమానంగా అయ్యే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళే విశేష ఆత్మలందరికీ, సదా ఎగిరే కళ ద్వారా ఏ రకమైన సైడ్ సీన్స్ ను అయినా దాటే డబల్ లైట్ పిల్లలకు ఆత్మిక దీపమైన బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

కళ్యాణ భావన ద్వారా ప్రతి ఆత్మ యొక్క సంస్కారాలను పరివర్తన చేసే నిశ్చయబుద్ధి భవ

తండ్రి పట్ల ఎలాగైతే 100 శాతం నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారో, ఎవరెంతగా కదిలించే ప్రయత్నం చేసినా కానీ కదలరో, అలా దైవీ పరివారం ద్వారా లేక ప్రపంచంలోని ఆత్మల ద్వారా, ఎవరు ఎలాంటి పరీక్ష తీసుకున్నా, క్రోధులుగా అయి ఎదిరించినా లేక ఎవరైనా అవమానించినా, నిందించినా - అందులో కూడా చలించరు. దీని కోసం కేవలం ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన ఉండాలి. ఈ భావన వారి సంస్కారాలను పరివర్తన చేస్తుంది. ఇందులో కేవలం అధైర్య పడకూడదు, అంతే. సమయ ప్రమాణంగా ఫలం తప్పకుండా లభిస్తుంది - ఇది డ్రామాలోని నిర్ణయించబడి ఉంది.

స్లోగన్:-

పవిత్రతా శక్తి ద్వారా తమ సంకల్పాలను శుద్ధంగా, జ్ఞాన స్వరూపంగా తయారుచేసుకొని బలహీనతలను సమాప్తం చేయండి.