04-04-2021 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 06-12-1987


‘‘సిద్ధికి ఆధారము - శ్రేష్ఠమైన వృత్తి’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ హోలీహంసల సభను చూస్తున్నారు. ప్రతి హోలీహంస తన శ్రేష్ఠ స్థితి అనే ఆసనంపై విరాజమానమై ఉన్నారు. ఆసనధారులైన హోలీహంసలందరి సభ మొత్తం కల్పంలోనే అలౌకికమైనది మరియు అతీతమైనది. ప్రతి హోలీహంస తన విశేషతలతో అత్యంత సుందరంగా అలంకరించబడి ఉన్నారు. విశేషతలు శ్రేష్ఠమైన అలంకరణ. అలంకరించబడి ఉన్న హోలీహంసలు ఎంత ప్రియంగా అనిపిస్తున్నారు! బాప్ దాదా ప్రతి ఒక్కరి విశేషతల అలంకరణను చూసి హర్షిస్తున్నారు. అందరూ అలంకరించబడి ఉన్నారు, ఎందుకంటే బాప్ దాదా బ్రాహ్మణ జన్మను ఇస్తూనే బాల్యములోనే ‘విశేష ఆత్మ భవ’ అనే వరదానమునిచ్చారు. నంబరువారుగా ఉన్నా సరే చివరి నంబరులోని ఆత్మ కూడా విశేష ఆత్మయే. బ్రాహ్మణ జీవితంలోకి రావడం అనగా విశేష ఆత్మలలోకి వచ్చేసినట్లే. బ్రాహ్మణ పరివారంలో చివరి నంబరు వారైనా సరే, విశ్వంలోని అనేక ఆత్మలతో పోలిస్తే, వారు కూడా విశేషమైన వారిగా మహిమ చేయబడ్డారు. అందుకే ‘కోట్లలో కొందరు, కొందరిలో కూడా కొందరు’ అనే మహిమ ఉంది. కనుక బ్రాహ్మణుల సభ అనగా విశేష ఆత్మల సభ.

ఈ రోజు బాప్ దాదా చూస్తున్నారు - విశేషతల అలంకరణను బాబా అయితే అందరికీ సమానంగా, ఒకేలా చేసారు కానీ కొందరు ఆ అలంకరణను ధారణ చేసి సమయం అనుసారంగా కార్యంలో ఉపయోగిస్తారు, కొందరు ధారణ చెయ్యలేరు లేదా సమయం అనుసారంగా కార్యంలో ఉపయోగించలేరు. ఉదాహరణకు ఈ రోజుల్లోని రాయల్ ఫ్యామిలీ వారు సమయం అనుసారంగా అలంకరించుకుంటారు, అప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది, ఎలాంటి సమయమో అలాంటి అలంకరణ - దీనినే నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. ఈ రోజుల్లో అలంకరణ కోసం వేరు వేరు సెట్లు పెట్టుకుంటూ ఉంటారు కదా. మరి బాప్ దాదా అనేక విశేషతలు మరియు అనేక శ్రేష్ఠమైన గుణాల యొక్క వెరైటీ సెట్లను ఎన్ని ఇచ్చారు! ఎంత విలువైన అలంకరణ అయినా సరే, ఒకవేళ అది సమయం అనుసారంగా లేకపోతే ఎలా అనిపిస్తుంది? ఇటువంటి విశేషతలు, గుణాలు, శక్తులు మరియు జ్ఞాన రత్నాల యొక్క అనేక అలంకరణలను బాబా అందరికీ ఇచ్చారు కానీ వాటిని సమయానికి కార్యంలో ఉపయోగించడంలో నంబరు ఏర్పడుతుంది. ఈ అలంకరణలన్నీ ఉన్నాయి, కానీ ప్రతి విశేషతకు మరియు గుణానికి సమయం అనుసారంగా మహత్వముంటుంది. అన్నీ ఉన్నా కానీ వాటిని సమయానికి కార్యంలో ఉపయోగించకపోతే, అవి విలువైనవి అయినా సరే, వాటికి విలువ ఉండదు. ఏ సమయంలో ఏ విశేషతను ధారణ చేయవలసిన కార్యముంటుందో, ఆ సమయంలో ఆ విశేషతకే విలువ ఉంటుంది. ఏ విధంగా హంస రాళ్ళు మరియు రత్నాలు, ఈ రెండింటినీ పరిశీలించి వాటిని వేరు వేరుగా చేసి రత్నాలను ధారణ చేస్తుందో, రాళ్ళను వదిలేసి రత్నాలను, ముత్యాలను ధారణ చేస్తుందో, అలా హోలీహంసలు అనగా సమయం అనుసారంగా విశేషతలు మరియు గుణాలను పరిశీలించి వాటిని సమయానికి ఉపయోగించాలి. ఇటువంటి వారిని పరిశీలనా శక్తి మరియు నిర్ణయ శక్తి కలిగిన హోలీహంసలని అంటారు. కనుక పరిశీలించడం మరియు నిర్ణయించడం - ఈ రెండు శక్తులు నంబరును ముందుకు తీసుకువెళ్తాయి. ఎప్పుడైతే ఈ రెండు శక్తులు ధారణ అవుతాయో, అప్పుడు సమయం అనుసారంగా ఏ విశేషత అవసరమో, ఆ విశేషతనే కార్యంలో ఉపయోగించ గలుగుతారు. కనుక హోలీహంసలైన ప్రతి ఒక్కరు తమ ఈ రెండు శక్తులను చెక్ చేసుకోండి. ఈ రెండు శక్తులు సమయానికి మోసం చేయడం లేదు కదా? సమయం గడిచిపోయిన తర్వాత ఒకవేళ పరిశీలించినా లేక నిర్ణయించినా, ఆ సమయమైతే గడిచిపోయింది కదా. ఎవరైతే నంబరువన్ హోలీహంసలుగా ఉన్నారో, వారికి ఈ రెండు శక్తులు సమయం అనుసారంగా కార్యం చేస్తాయి. ఒకవేళ సమయం గడిచిపోయిన తర్వాత ఈ శక్తులు కార్యాన్ని చేస్తే, రెండవ నంబరులోకి వస్తారు. మూడవ నంబరు విషయాన్ని అయితే ఇక వదిలేయండి. ఎవరి బుద్ధి అయితే సదా హోలీగా (పవిత్రంగా) ఉంటుందో, ఆ హంసనే సమయానికి కార్యం చేయగలరు.

హోలీ అర్థాన్ని వినిపించాము కదా. ఒకటేమో హోలీ అనగా పవిత్రము, మరొకటి హిందీలో హో లీ అనగా గతం గతః. కనుక ఎవరి బుద్ధి అయితే హోలీగా అనగా స్వచ్ఛంగా ఉంటుందో, మరియు ఏ సెకండు, ఏ పరిస్థితి గడిచిపోతుందో, దానిని గతం గతః చేసే అభ్యాసముంటుందో, ఇటువంటి బుద్ధి కలిగినవారు సదా హోలీగా అనగా ఆత్మిక రంగులో రంగరించబడి ఉంటారు, సదా తండ్రి సాంగత్యమనే రంగులో రంగరించబడి ఉంటారు. కనుక ‘హోలీ’ అనే ఒక్క పదము మూడు రూపాలలో ఉపయోగపడుతుంది. ఎవరిలోనైతే ఈ మూడు అర్థాలకు సంబంధించిన విశేషతలున్నాయో అనగా ఏ హంసలకైతే ఈ విధి తెలుసో, వారు ప్రతి సమయము సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. కనుక ఈ రోజు బాప్ దాదా హోలీహంసల సభలో హోలీహంసలందరిలోనూ ఈ విశేషతను చూస్తున్నారు. స్థూల కార్యములోనైనా లేక ఆత్మిక కార్యములోనైనా, రెండింటిలోనూ పరిశీలన శక్తి మరియు నిర్ణయ శక్తియే సఫలతకు ఆధారము. ఎవరి సంపర్కములోకైనా వచ్చినప్పుడు, ఎప్పటివరకైతే వారి భావమును మరియు భావనను పరిశీలించలేకపోతారో, మరియు పరిశీలించిన తర్వాత యథార్థమైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతారో, అప్పటివరకు వ్యక్తుల విషయంలోనైనా లేక పరిస్థితుల విషయంలోనైనా, రెండు కార్యాలలోనూ సఫలత ప్రాప్తించదు. ఎందుకంటే వ్యక్తుల సంబంధంలోకి కూడా రావలసి ఉంటుంది మరియు పరిస్థితులను కూడా దాటవలసి ఉంటుంది. జీవితంలో ఈ రెండు విషయాలు వస్తాయి. కనుక నంబరువన్ హోలీహంసలు అనగా రెండు విశేషతలలోనూ సంపన్నమైనవారు. ఇది ఈ నాటి సభ గురించిన సమాచారము. ఈ సభ అనగా కేవలం ఎదురుగా కూర్చున్నవారే కాదు. బాప్ దాదా ఎదురుగానైతే మీతో పాటు నలువైపులా ఉన్న పిల్లలు కూడా ఇమర్జ్ అవుతారు. బేహద్ పరివారం మధ్యన బాప్ దాదా కలుసుకుంటారు మరియు ఆత్మిక సంభాషణను చేస్తారు. బ్రాహ్మణాత్మలందరూ తమ స్మృతి శక్తి ద్వారా స్వయం కూడా మధుబన్ లో హాజరవుతారు. మరియు బాప్ దాదా మరొక విశేషమైన విషయాన్ని చూస్తున్నారు, అదేమిటంటే - పిల్లలు ప్రతి ఒక్కరి విధి యొక్క రేఖ మరియు సిద్ధి యొక్క రేఖ, ఈ రెండు రేఖలు ఎంత స్పష్టంగా ఉన్నాయి, ఆది నుండి ఇప్పటివరకు విధి ఎలా ఉంది, మరియు ఆ విధికి ఫలస్వరూపంగా ఎంత సిద్ధిని ప్రాప్తి చేసుకున్నారు, రెండు రేఖలు ఎంత స్పష్టంగా ఉన్నాయి, ఎంత పొడవుగా ఉన్నాయి అనగా విధి మరియు సిద్ధి యొక్క ఖాతా ఎంతవరకు యథార్థ రూపంలో జమ అయ్యాయి. విధికి ఆధారము - శ్రేష్ఠమైన వృత్తి. ఒకవేళ శ్రేష్ఠమైన వృత్తి ఉన్నట్లయితే యథార్థమైన విధి కూడా ఉంటుంది మరియు యథార్థమైన విధి ఉన్నట్లయితే, శ్రేష్ఠమైన సిద్ధి తప్పకుండా ఉంటుంది. కనుక విధి మరియు సిద్ధికి బీజము ‘వృత్తి’. సదా భాయి-భాయీ (సోదరులము) అనే శ్రేష్ఠమైన వృత్తి, ఆత్మిక వృత్తి ఉండాలి. ఇది ముఖ్యమైన విషయమే కానీ దీనితో పాటు సంపర్కంలోకి వచ్చే ప్రతి ఆత్మ పట్ల కల్యాణము యొక్క, స్నేహము యొక్క, సహయోగము యొక్క, నిస్వార్థమైన, నిర్వికల్ప వృత్తి ఉండాలి, వ్యర్థ రహిత సంకల్పాల వృత్తి ఉండాలి. చాలా సార్లు ఏ ఆత్మ పట్లనైనా వ్యర్థ సంకల్పాలు లేక వికల్పాల వృత్తి ఉన్నట్లైతే, ఎలాంటి వృత్తి మరియు దృష్టి ఉంటుందో, అలా ఆ ఆత్మ చేసే కర్తవ్యము, కర్మల సృష్టి కనిపిస్తుంది. అప్పుడప్పుడు పిల్లల విషయాలను వింటాము మరియు చూస్తాము కూడా. ఇలాంటి వృత్తి ఉన్న కారణంగా వర్ణన కూడా చేస్తారు, వారు ఎంత మంచి కార్యాన్ని చేసినా కానీ వ్యర్థమైన వృత్తి ఉన్న కారణంగా సదా ఆ ఆత్మ పట్ల - వీరు ఇలాంటి వారే, ఇలాగే జరుగుతుంది అనే మాటలే వస్తాయి. కనుక ఈ వృత్తి, వారి కర్మల రూపీ సృష్టిని అలానే అనుభవం చేయిస్తుంది. ఎలాగైతే మీరు ఈ ప్రపంచంలో కళ్ళద్దాల ఉదాహరణను ఇస్తారు కదా, ఏ రంగు కళ్ళద్దాలను ధరిస్తే ఆ రంగే కనిపిస్తుంది, అలాగే ఎలాంటి వృత్తి ఉంటుందో, ఆ వృత్తి దృష్టిని పరివర్తన చేస్తుంది, దృష్టి సృష్టిని పరివర్తన చేస్తుంది. ఒకవేళ వృత్తి యొక్క బీజము సదా శ్రేష్ఠంగా ఉన్నట్లయితే, విధి మరియు సిద్ధి తప్పకుండా సఫలతాపూర్వకంగా ఉంటాయి. కనుక ముందు వృత్తి యొక్క పునాదిని చెక్ చేసుకోండి. దీనినే శ్రేష్ఠమైన వృత్తి అని అంటారు. ఒకవేళ ఏదైనా సంబంధ-సంపర్కంలో శ్రేష్ఠ వృత్తికి బదులుగా మిక్స్ (కల్తీ) ఉన్నట్లయితే, మీరు విధిని ఎంతగా ఉపయోగించినా కానీ సిద్ధి లభించదు. ఎందుకంటే వృత్తి బీజము వంటిది, విధి వక్షము వంటిది మరియు సిద్ధి ఫలము వంటిది. ఒకవేళ బీజము బలహీనంగా ఉంటే, వృక్షము ఎంత విస్తారమైనదైనా కానీ సిద్ధి రూపీ ఫలము లభించదు. ఈ వృత్తి మరియు విధి గురించి బాప్ దాదా పిల్లలతో ఒక విశేషమైన ఆత్మిక సంభాషణను చేశారు. స్వ ఉన్నతి పట్ల మరియు సేవా సఫలత పట్ల ఒక రమణీకమైన స్లోగన్ ను ఆత్మిక సంభాషణలో చెప్పారు. ఈ స్లోగన్ ను (నినాదాన్ని) మీరు కూడా పరస్పరంలో చెప్పుకుంటారు. ప్రతి కార్యంలో ‘ముందు మీరు’ - ఈ స్లోగన్ గుర్తుంది కదా? ఒకటేమో - ‘ముందు మీరు’, రెండవది - ‘ముందు నేను’. ఈ రెండు స్లోగన్లు ‘‘ముందు మీరు’’ మరియు ‘‘ముందు నేను’’ - ఈ రెండూ అవసరమే. కానీ బాప్ దాదా ఆత్మిక సంభాషణ చేస్తూ చిరునవ్వు నవ్వుతున్నారు. ఎక్కడైతే ‘ముందు నేను’ అని అనాలో, అక్కడ ‘ముందు మీరు’ అని అంటున్నారు, ఎక్కడైతే ‘ముందు మీరు’ అని అనాలో అక్కడ ‘ముందు నేను’ అని అంటున్నారు. రెండింటినీ మార్చేస్తున్నారు. ఏదైనా స్వ పరివర్తన యొక్క విషయం వచ్చినప్పుడు ‘ముందు మీరు’ అని అంటారు, వీరు మారితే నేను మారుతాను అని అంటారు కనుక ఇందులో ‘ముందు మీరు’ అన్నట్లు అయింది కదా. ఎప్పుడైతే ఏదైనా సేవ యొక్క ఛాన్స్ వచ్చినప్పుడు లేదా ఏదైనా పరిస్థితిని ఎదుర్కోవలసిన ఛాన్స్ ఏర్పడినప్పుడు - ముందు నేను, నేను కూడా ఎంతోకొంత ఉన్నాను కదా, నాకు కూడా ఎదో ఒకటి లభించాలి కదా అని ప్రయత్నిస్తారు. కనుక ఎక్కడైతే ‘ముందు మీరు’ అని అనాలో అక్కడ ‘నేను’ అని అనేస్తారు. సదా స్వమానంలో స్థితులై ఇతరులకు గౌరవం ఇవ్వడమనగా ‘ముందు మీరు’ అని అనడం. అయితే, కేవలం నోటితో ‘ముందు మీరు’ అని అంటూ కర్మలో తేడా చేయడం కాదు. స్వమానంలో స్థితులై స్వమానం ఇవ్వాలి. స్వమానం ఇవ్వడం లేక స్వమానంలో స్థితులవ్వడం, దీనికి గుర్తులెలా ఉంటాయి? ఇందులో సదా రెండు విషయాలను చెక్ చేసుకోండి-

ఒకటేమో - అభిమానం యొక్క వృత్తి, రెండవది - అవమానం యొక్క వృత్తి. ఎవరైతే స్వమానంలో స్థితులవుతారో మరియు ఇతరులకు స్వమానాన్ని ఇచ్చే దాతలుగా ఉంటారో, వారిలో ఈ రెండు వృత్తులు ఉండవు - అభిమాన వృత్తి ఉండదు, అవమాన వృత్తి ఉండదు. వీరు ఇలాగే చేస్తారు, వీరు ఇలాగే ఉంటారు, ఇది కూడా రాయల్ రూపంలో ఆ ఆత్మను అవమానించడం. స్వమానంలో స్థితులై స్వమానాన్ని ఇవ్వడం - దీనినే ‘ముందు మీరు’ అని అంటారు. అర్థమయిందా? మరియు ఏదైనా స్వ ఉన్నతి విషయమున్నప్పుడు, అందులో సదా ‘ముందు నేను’ అనే స్లోగన్ గుర్తుంటే రిజల్ట్ ఏమవుతుంది? ‘ముందు నేను’ అనగా జో ఓటే సో అర్జున్ (ఎవరైతే తమకు తాముగా ముందుకు వచ్చి సేవా బాధ్యతను తీసుకుంటారో, వారే అర్జునులు). అర్జున్ అనగా విశేష ఆత్మ, అతీతమైన ఆత్మ, అలౌకిక ఆత్మ, అలౌకిక విశేష ఆత్మ. ఎలాగైతే బ్రహ్మాబాబా సదా ‘ముందు నేను’ అనే స్లోగన్ ద్వారా జో ఓటే సో అర్జున్ గా అనగా నంబరువన్ ఆత్మగా అయ్యారు కదా. నంబరువన్ అనగా నంబరువన్ డివిజన్ అని వినిపించాము కదా. వాస్తవానికి నంబరువన్ అయితే ఒక్కరే ఉంటారు. కనుక రెండు స్లోగన్లు అవసరమే. కానీ నంబరు దేని ఆధారంగా తయారవుతుందో వినిపించాము కదా. ఎవరైనా ఏదైనా విశేషతను సమయం అనుసారంగా కార్యంలో ఉపయోగించకపోతే, వారి నంబరు ముందు వెనుక అయిపోతుంది. ఎవరైతే సమయానికి కార్యంలో ఉపయోగిస్తారో, వారు విన్ (విజయులుగా) అవుతారు అనగా వన్ (నంబరువన్) అవుతారు. కనుక ఇది చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ సంవత్సరం స్వ చెకింగ్ విషయాలను వినిపిస్తున్నాము. రకరకాల విషయాలను వినిపించాము కదా? ఈ రోజు ఈ విషయాలను చెక్ చేసుకోండి - ‘మీరు’ బదులు ‘నేను’, ‘నేను’ బదులు ‘మీరు’ చేయడం లేదు కదా? దీనినే యథార్థమైన విధి అని అంటారు. ఎక్కడైతే యథార్థమైన విధి ఉంటుందో, అక్కడ తప్పకుండా సిద్ధి ఉంటుంది. ఈ వృత్తి యొక్క విధిని వినిపించాము - రెండు విషయాలను చెక్ చేసుకోవాలి - అభిమాన వృత్తి ఉండకూడదు, అవమాన వృత్తి కూడా ఉండకూడదు. ఎక్కడైతే ఈ రెండింటి అప్రాప్తి ఉంటుందో, అక్కడే స్వమానం యొక్క ప్రాప్తి ఉంటుంది. మీరు అడిగినా అడగకపోయినా, ఆలోచించినా ఆలోచించకపోయినా, వ్యక్తులు మరియు ప్రకృతి, ఇరువురూ సదా స్వతహాగా స్వమానాన్ని (గౌరవాన్ని) ఇస్తూ ఉంటారు. సంకల్పమాత్రంలోనైనా స్వమానం ప్రాప్తి అవ్వాలనే కోరిక ఉన్నట్లయితే స్వమానం లభించదు. నిర్మానులుగా (నిరహంకారిగా) అవ్వడమనగా ‘ముందు మీరు’ అనడం. నిర్మాన స్థితి స్వతహాగానే స్వమానాన్ని ఇప్పిస్తుంది. స్వమానం యొక్క పరిస్థితులలో ‘ముందు మీరు’ అనడం అనగా బాబా సమానంగా అవ్వడం. బ్రహ్మాబాబా సదా స్వమానం ఇవ్వడంలో ముందు జగదంబ, ముందు సరస్వతి తల్లిని ఉంచి వెనుక బ్రహ్మాబాబా ఉండేవారు. బ్రహ్మా తల్లి ఉన్నా కానీ స్వమానాన్ని ఇచ్చేందుకు జగదంబ తల్లిని ముందుంచారు. ప్రతి కార్యంలో పిల్లలను ముందుంచారు. మరియు పురుషార్థ స్థితిలో సదా ‘ముందు నేను’ అని స్వయాన్ని ఇంజన్ రూపంలో చూసుకున్నారు. ఇంజన్ ముందు ఉంటుంది కదా. కనుక సాకార జీవితంలో ‘నేను ఏదైతే చేస్తానో, నన్ను చూసి అందరూ చేస్తారు’ అనేదే సదా చూశారు. కనుక విధిలో, స్వ ఉన్నతిలో మరియు తీవ్ర పురుషార్థం యొక్క లైనులో సదా ‘ముందు నేను’ అని స్వయాన్ని ఉంచారు. కనుక ఈ రోజు విధి మరియు సిద్ధి యొక్క రేఖలను చెక్ చేస్తూ ఉన్నారు. అర్థమయిందా? కనుక రెండింటినీ మార్చకండి. వీటిని మార్చడం అనగా భాగ్యాన్ని మార్చడం. సదా హోలీహంసలుగా అయి నిర్ణయ శక్తిని, పరిశీలనా శక్తిని సమయానికి కార్యంలో ఉపయోగించే విశాలబుద్ధి కలవారిగా అవ్వండి మరియు సదా వృత్తి రూపీ బీజాన్ని శ్రేష్ఠంగా చేసుకొని విధి మరియు సిద్ధిని సదా శ్రేష్ఠంగా అనుభవం చేస్తూ వెళ్ళండి.

బాప్ దాదాకు పిల్లల పట్ల స్నేహముందని ఇంతకుముందు కూడా వినిపించాము. స్నేహానికి గర్తు ఏమిటి? స్నేహమున్నవారు స్నేహితుల లోపాలను చూడలేరు, సదా స్వయాన్ని మరియు స్నేహీ ఆత్మలను సంపన్నంగా, సమానంగా చూడాలని కోరుకుంటారు. అర్థమయిందా? అందుకే పదే పదే అటెన్షన్ ఇప్పిస్తారు, చెకింగ్ చేయిస్తారు - ఇదే సంపన్నంగా తయారుచేసే సత్యమైన స్నేహము. అచ్ఛా.

ఇప్పుడు అన్ని వైపుల నుండి పాత పిల్లలు మెజారిటీ ఉన్నారు. పాతవారు అని ఎవరిని అంటారో దాని అర్థం తెలుసు కదా? బాప్ దాదా అన్ని విషయాలలోనూ పక్కాగా ఉన్నవారినే పాతవారని అంటారు. పాతవారు అనగా పక్కాగా ఉన్నవారు. అనుభవం కూడా పక్కాగా చేస్తుంది. కొద్దిగా మాయ పిల్లి రాగానే భయపడే కచ్చా పిల్లలు కాదు. పాతవారందరూ అనగా పక్కాగా ఉన్నవారు వచ్చారు కదా? కలుసుకునే ఛాన్స్ తీసుకునేందుకు అందరూ ‘ముందు నేను’ అని అన్నా ఏం ఫర్వాలేదు. కానీ ప్రతి కార్యంలో నియమము మరియు లాభము అనేవి తప్పకుండా ఉంటాయి. అలాగని ‘ముందు నేను’ అని అంటూ వెయ్యి మంది రావడమని కాదు. సాకార సృష్టిలో నియమం కూడా ఉంది, లాభం కూడా ఉంది. అవ్యక్త వతనంలో నియమాల మాట ఉండదు. అక్కడ నియమాలు తయారుచేయవలసిన అవసరం ఉండదు. అవ్యక్త మిలనం చేసుకోవడం కష్టమనిపిస్తుంది, సాకార మిలనం సహజమనిపిస్తుంది, అందుకే పరుగెత్తుకుని వస్తారు. కానీ సమయం అనుసారంగా ఎంతగా నియమాలను పాటిస్తారో, అంత లాభముంటుంది. బాప్ దాదా కొద్దిగా ఏదైనా సూచనను ఇస్తే, ఇప్పుడు ఏం జరుగబోతుందో ఏమిటో తెలియదు అని అంటారు. ఒకవేళ ఏదైనా జరిగేది ఉన్నా సరే, చెప్పి జరగదు. సాకార బాబా అవ్యక్తమైనప్పుడు ఏమైనా చెప్పి వెళ్ళారా? ఏదైతే అకస్మాత్తుగా జరుగుతుందో అది అలౌకికంగా, ప్రియంగా ఉంటుంది, అందుకే బాప్ దాదా సదా ఎవర్రెడీగా ఉండమని చెప్తారు. ఏమి జరిగినా, చాలా మంచే జరుగుతుంది. అర్థమయిందా? అచ్ఛా.

సర్వ హోలీహంసలకు, విశాల బుద్ధి, శ్రేష్ఠమైన స్వచ్ఛమైన బుద్ధిని ధారణ చేసే బుద్ధివంతులైన పిల్లలందరికీ, సర్వ శక్తులను, సర్వ విశేషతలను సమయం అనుసారంగా కార్యంలో ఉపయోగించే జ్ఞానీ ఆత్మలు, యోగీ ఆత్మలైన పిల్లలకు, సదా బాబా సమానంగా సంపన్నంగా అయ్యే ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే సంపన్న పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

యజమానత్వపు స్మృతి ద్వారా హైయ్యెస్ట్ (అత్యంత ఉన్నతమైన) అథారిటీని అనుభవం చేసే కంబైండ్ స్వరూపధారి భవ

ముందు మీ శరీరము మరియు ఆత్మల కంబైండ్ రూపాన్ని స్మృతిలో ఉంచుకోండి. శరీరము రచన, ఆత్మ రచయిత - ఈ స్మృతి ద్వారా యజమానత్వపు స్మృతి స్వతహాగానే ఉంటుంది. యజమానత్వపు స్మృతి ద్వారా స్వయాన్ని హైయ్యెస్ట్ (అత్యంత ఉన్నతమైన) అథారిటీగా అనుభవం చేస్తారు. శరీరాన్ని నడిపించేవారిగా ఉంటారు. రెండవది - తండ్రి మరియు బిడ్డ (శివశక్తి), ఈ కంబైండ్ స్వరూపపు స్మృతి ద్వారా మాయ విఘ్నాలను అథారిటీతో దాటేస్తారు.

స్లోగన్:-

విస్తారాన్ని సెకండులో ఇముడ్చుకుని జ్ఞానం యొక్క సారాన్ని అనుభవం చేయండి మరియు ఇతరులకు చేయించండి.