04-10-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - తండ్రిని స్మృతి చేసేందుకు రకరకాల యుక్తులను రచించండి, పురుషార్థం చేసి చార్టు పెట్టుకోండి, అలసిపోకండి, తుఫాన్లలో స్థిరంగా ఉండండి

ప్రశ్న:-

పిల్లలు తమ ఏ అనుభవాన్ని పరస్పరంలో ఒకరికొకరు వినిపించుకోవాలి?

జవాబు:-

మనం తండ్రిని ఎంత సమయం మరియు ఎలా స్మృతి చేస్తాము, భోజనం చేసే సమయంలో తండ్రి స్మృతి ఉంటుందా లేక అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయా! బాబా అంటారు - పిల్లలూ, ప్రయత్నించి చూడండి. భోజనం చేసే సమయంలో తండ్రి తప్ప ఇంకేదీ గుర్తు రావడం లేదు కదా! ఆ తర్వాత పరస్పరంలో ఒకరికొకరు అనుభవాలను వినిపించుకోండి. 2. ఏదైనా బాధాకరమైన దృశ్యం చూసినప్పుడు మన స్థితి ఎలా ఉంది! ఈ అనుభవాన్ని కూడా ఒకరికొకరు వినిపించుకోవాలి.

గీతము:-
ప్రపంచంలోని లక్షలాది మంది ఏమి చేసినా..... (లాఖ్ జమానే వాలే.....)

ఓంశాంతి.

ఏ అనంతమైన తండ్రి నుండి అయితే అనంతమైన వారసత్వం లభిస్తుందో, వారిని మధురాతి-మధురమైన పిల్లలు ఎలా మర్చిపోతారు. వారిని అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ ఉన్నారు. మనుష్యులను ఎప్పుడూ భగవంతుడని అనరని అర్థం చేయించడం జరిగింది. మరి ఇప్పుడు అనంతమైన తండ్రి లభించారు కనుక వారి స్మృతిలోనే చమత్కారముంది. పతితపావనుడైన తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో, అంతగా పావనంగా అవుతూ ఉంటారు. ఎప్పటివరకైతే అంతిమ సమయం రాదో, అప్పటివరకు మిమ్మల్ని మీరు పావనులుగా చెప్పుకోలేరు. సంపూర్ణంగా పావనమైనప్పుడు ఈ శరీరాన్ని వదిలి, సంపూర్ణంగా పవిత్రమైన శరీరాన్ని తీసుకుంటారు. సత్యయుగంలో కొత్త శరీరం లభించినప్పుడు సంపూర్ణులని అంటారు. అప్పుడిక రావణుడు సమాప్తమైపోతాడు. సత్యయుగంలో రావణుడి దిష్టిబొమ్మను తయారుచేయరు. కనుక పిల్లలైన మీరు కూర్చొన్నా, నడుస్తూ-తిరుగుతూ ఉన్నా, బుద్ధిలో ఈ విషయాలు గుర్తుండాలి. ఇప్పుడు మనం 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసాము, మళ్ళీ కొత్త చక్రం మొదలవుతుంది. అది కొత్త పవిత్ర ప్రపంచము, కొత్త భారత్, కొత్త ఢిల్లీ. ముందుగా యమునా నదీ తీరం ఉంటుంది, అక్కడ పరిస్తాన్ తయారవ్వనున్నదని పిల్లలకు తెలుసు. ముందుగా తండ్రిని స్మృతి చేయండి అని పిల్లలకు చాలా మంచి రీతిలో అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి అయిన భగవంతుడు చదివిస్తారు. వారే తండ్రి, టీచర్, గురువు, ఇది గుర్తుంచుకోండి. మీరు పిల్లిమొగ్గలాట ఆడుతారని కూడా బాబా అర్థం చేయించారు. వర్ణాల చిత్రం కూడా చాలా అవసరము. అందరికన్నా పైన శివబాబా ఉంటారు, తర్వాత పిలక అయిన బ్రాహ్మణులు. మీకు అర్థం చేయించడం కోసం బాబా ఇలా చెప్తారు. అచ్ఛా, మనం 84 జన్మల పిల్లిమొగ్గలాటను ఆడతాము అనేది బుద్ధిలో ఉంచుకోవాలి. ఇప్పుడిది సంగమము, తండ్రి ఎక్కువ సమయం ఉండరు. కానీ ఎంతైనా 100 సంవత్సరాలైతే పడుతుంది. పూర్తిగా అతలాకుతలం అయిన తర్వాత రాజ్యం ప్రారంభమవుతుంది. ఇది ఆ మహాభారత యుద్ధమే, ఇందులో అనేక ధర్మాల వినాశనం, ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన జరుగుతుంది. మీ ప్రతిభ అద్భుతమైనది. ఫకీర్లు తమ ప్రతిభతో విన్యాసాల వంటివి ప్రదర్శిస్తూ తీర్థ స్థానాలకు వెళ్తారని మీకు తెలుసు. మనుష్యులకు వారి పట్ల గౌరవం ఉంటుంది కదా, కనుక వారికి ఏదో ఒకటి ఇస్తారు. ఈ విధంగా వారి పోషణ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆ వ్యక్తులు తమతో ఏమి మోసుకుని తీసుకువెళ్తారు. బాబా ఈ అన్ని విషయాలలోనూ అనుభవజ్ఞులు. బాబా అనుభవజ్ఞుడి రథాన్ని తీసుకున్నారు. వీరు గురువులను కూడా ఆశ్రయించారు, ఎంతో చూసారు, తీర్థ యాత్రలు కూడా చేసారు. ఇప్పుడు బాబా అంటారు - మీరు ఈ పిల్లిమొగ్గలాటను గుర్తు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా ఉన్నాము, తర్వాత దేవతలుగా, క్షత్రియులుగా అవుతాము. ఇదంతా భారత్ కు సంబంధించిన విషయము. దానిని తండ్రి ఈ విధంగా అర్థం చేయించారు. ఇతర ధర్మాలవి ఉపకథల వంటివి. తండ్రి మీకు మాత్రమే మీ 84 జన్మల కథను తెలియజేసారు. ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో, వారు - ఇస్లాములు వస్తే సగటున ఎన్ని జన్మలు తీసుకుంటారు అనే లెక్కను అర్థం చేసుకోగలరు. ఖచ్చితమైన లెక్క అవసరం లేదు. ఈ విషయాలలో చింతించడానికి ఏమీ లేదు. అన్నింటికంటే ఎక్కువగా - మేము బాబాను స్మృతి చేస్తూ ఉండాలి అనే చింత ఉంటుంది. కేవలం ఒకటే చింత ఉంది - ఆ ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి అని. మాయ పదే-పదే వేరే చింతలలోకి తీసుకువెళ్తూ ఉంటుంది, ఇక్కడ మాయ చాలా చింత కలిగిస్తూ ఉంటుంది. పిల్లలకు తప్పకుండా స్మృతి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి. స్వీట్ హోమ్ ఎవరికీ గుర్తు రాదు. భగవంతుడిని శాంతిదేవా అని పిలుస్తూ - మాకు శాంతినివ్వండి అని వారిని అడుగుతారు.

ఈ పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నదని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది, మిగతా మనుష్యులు ఘోర అంధకారంలో ఉన్నారు. శాంతి సత్యయుగంలోనే ఉంటుంది. ఒకే ధర్మం, ఒకే భాష, ఆచార-పద్ధతులు కూడా ఒకే విధంగా ఉంటాయి. అక్కడ ఉన్నదే శాంతి రాజ్యము. అద్వైతం యొక్క ప్రసక్తే లేదు. అక్కడ ఒకటే రాజ్యముంటుంది, అది సతోప్రధానంగా ఉంటుంది. యుద్ధం జరిగేందుకు అక్కడ రావణ రాజ్యమే ఉండదు. కనుక పిల్లలైన మీకు సంతోషపు పాదరసం ఎక్కాలి. అతీంద్రియ సుఖం గురించి గోప-గోపికలను అడగండి అని శాస్త్రాలలో గాయనముంది. ఆ గోప-గోపికలు మీరే కదా. మీరు సమ్ముఖంలో కూర్చున్నారు. బాబా మాకు తండ్రి కూడా, టీచరు కూడా, గురువు కూడా అన్న విషయం గుర్తుండేవారు, మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. ఇది అద్భుతం కదా. జీవితాంతం తోడుగా ఉంటారు. దత్తత తీసుకున్న వెంటనే, చదివించడం మొదలుపెడతారు. ఇది గుర్తున్నా సరే చాలా సంతోషముంటుంది. కానీ, మాయ ఇది కూడా మరపింపజేస్తుంది. మనుష్యులకు ఇది కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉందని అంటారు కదా, దానికి ఋజువేమిటి అని మనుష్యులు అడుగుతారు. వారికి ఇలా చెప్పండి - చూడండి, ఇందులో భగవానువాచ అని రాయబడి ఉంది. యజ్ఞం కూడా రచించబడి ఉంది. ఇది జ్ఞాన యజ్ఞము. కృష్ణుడు అయితే యజ్ఞాన్ని రచించలేరు.

బ్రాహ్మణులైన మనం ఈ అనంతమైన యజ్ఞానికి చెందినవారమని కూడా పిల్లల బుద్ధిలో ఉండాలి. బాబా మనల్ని నిమిత్తులుగా చేసారు. మీరు జ్ఞానాన్ని మరియు యోగాన్ని మంచి రీతిలో ధారణ చేసినప్పుడు, ఆత్మ సంపూర్ణంగా అవుతుంది, అప్పుడు ఈ అడవికి నిప్పు అంటుకుంటుంది. ఇది అనంతమైన కర్మ క్షేత్రమని, ఇక్కడకు అందరూ వచ్చి పాత్రను అభినయిస్తారని మనుష్యులకే తెలుస్తుంది కదా. ఈ సృష్టి నాటకం తయారై సిద్ధంగా ఉంది, అది ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు..... తండ్రి అంటారు - పిల్లలూ, ఏదైనా జరగకూడనిది జరిగితే దాని గురించి చింతించాల్సి ఉంటుంది. ఏదైతే జరిగిందో, అది డ్రామాలో నిశ్చితమై ఉంది కావున దాని గురించి ఎందుకు చింతించాలి. మనం డ్రామాలు చూస్తాము. ఆ డ్రామాలలో ఎప్పుడైనా, ఏవైనా బాధాకరమైన దృశ్యాలు ఉంటే, వాటిని చూసి మనుష్యులు ఏడుస్తారు. కానీ అది అసత్యమైన డ్రామా. ఇది సత్యమైన డ్రామా. మనుష్యులు ఇది సత్యం, ఇది సత్యం అని అంటూ ఉంటారు. కానీ మీకు దుఃఖపు కన్నీరు రాకూడదు. మీరు సాక్షీగా ఉంటూ చూడాలి. ఇది డ్రామా అని మీకు తెలుసు, ఇందులో ఏడ్వాల్సిన అవసరమేముంది. గతం గతః (జరిగిపోయిందేదో జరిగిపోయింది). ఇక దాని గురించి ఎప్పుడూ ఆలోచించను కూడా ఆలోచించకూడదు. మీరు ముందుకు వెళ్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి మరియు అందరికీ మార్గాన్ని తెలియజేస్తూ ఉండండి. బాబా అయితే సలహాలు ఇస్తూ ఉంటారు. మీ వద్ద త్రిమూర్తి చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో - వారు శివబాబా, ఇది వారసత్వము అని క్లియర్ గా రాసి ఉంది. పిల్లలైన మీకు ఈ చిత్రాలను చూసినప్పుడు చాలా సంతోషం కలగాలి. బాబా నుండి మనకు విష్ణుపురి యొక్క వారసత్వం లభిస్తుంది. పాత ప్రపంచం సమాప్తమవ్వనున్నది. కేవలం ఈ చిత్రాలను ఎదురుగా పెట్టుకోండి, ఇందులో ఖర్చేమీ ఉండదు. వృక్షం చిత్రం కూడా చాలా బాగుంటుంది. రోజూ ఉదయాన్నే లేచి విచార సాగర మథనం చేయండి. మీకు మీరే టీచర్ గా అయి చదువుకోండి. బుద్ధి అయితే అందరికీ ఉంది. చిత్రాలను మీ ఇంట్లో పెట్టుకోండి. ప్రతి చిత్రంలోనూ ఫస్ట్ క్లాస్ జ్ఞానముంది. వినాశనం జరుగుతుందని అంటారు, మరి మీకు తండ్రి పట్ల ప్రీతి ఉంది కదా. సద్గురువు మధ్యవర్తి రూపంలో లభించారు... అని కూడా అంటూ ఉంటారు. కనుక మీకు అర్థం చేసుకునేందుకు మరియు అర్థం చేయించేందుకు ఎంత మంచి-మంచి విషయాలు లభించాయి. కానీ మాయ ఆర్భాటం చాలా ఉంది. 100 సంవత్సరాల క్రితం ఈ కరెంటు, గ్యాస్ మొదలైనవి ఉండేవి కావు. ఇదివరకు వైస్ రాయ్ మొదలైనవారు 4 గుర్రాల బండిలో లేక 8 గుర్రాల బండిలో వచ్చేవారు. ఇదివరకు షావుకారులు కార్లలో ప్రయాణం చేసేవారు. ఇప్పుడు విమానాలు మొదలైనవి వచ్చాయి. ఇంతకుముందు ఇవేవీ ఉండేవి కావు. ఈ 100 సంవత్సరాలలోనే ఏమైపోయిందో చూడండి. మనుష్యులు, దీనినే స్వర్గంగా భావిస్తారు. కానీ ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - స్వర్గమైతే స్వర్గమే. ఇవన్నీ పైసకు కొరగాని వస్తువులు, దీనిని కృత్రిమమైన వైభవమని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు - తండ్రిని స్మృతి చేయాలనే చింత ఒక్కటే ఉండాలి, ఇందులోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. బాబా తమ ఉదాహరణ కూడా చెప్తారు - భోజనం చేసేటప్పుడు స్మృతిలో ఉంటూ తినాలని చాలా ప్రయత్నిస్తాను కానీ మర్చిపోతాను. కావున పిల్లలకైతే చాలా శ్రమ అనిపిస్తూ ఉండవచ్చు అని నాకు అర్థమవుతుంది. అచ్ఛా, పిల్లలూ, మీరు ప్రయత్నించి చూడండి. బాబా స్మృతిలో ఉండి చూపించండి. బాబా స్మృతి పూర్తి సమయం నిలవగలదేమో చూడండి. మీ అనుభవాన్ని వినిపించాలి. బాబా, స్మృతి పూర్తి సమయం నిలవడం లేదు, అనేక రకాల విషయాలు గుర్తుకొస్తున్నాయి అని పిల్లలంటారు. బాబా స్వయంగా వారి అనుభవాన్ని వినిపిస్తారు - బాబా ఎవరిలోనైతే ప్రవేశించారో, వారు కూడా పురుషార్థియే, వీరికైతే చాలా బాధ్యతలున్నాయి. పెద్దవారు అని పిలిపించుకోవడమంటే ఎక్కువ దుఃఖం పొందడం అని అర్థము. ఎన్ని సమాచారాలు వస్తాయి. వికారాల కారణంగా ఎంతగా కొడతారు, ఇంటి నుండి పంపించేస్తారు. కుమార్తెలు, నేను ఈశ్వరుని శరణులోకి వచ్చాను అని అంటారు. ఎన్ని విఘ్నాలు కలుగుతాయి. ఎవ్వరి వద్ద శాంతి లేదు. పిల్లలైన మీకు గౌరవముంది. ఇప్పుడు పురుషార్థం చేసి శ్రీమతాన్ని అనుసరిస్తూ శాంతిగా ఉంటారు. ఈ బాబా ఇక్కడ కూడా - పరస్పరంలో చాలా కలిసి-మెలిసి ఉండేటువంటి పరివారాలను ఎన్నో చూసారు. అందరూ పెద్దల ఆజ్ఞానుసారంగా నడుచుకుంటారు. మేము స్వర్గంలో ఉన్నాము అన్నట్లుగా ఉందని అంటారు.

ఇప్పుడు తండ్రి మిమ్మల్ని అటువంటి స్వర్గంలోకి తీసుకువెళ్తారు, అక్కడ అన్ని రకాల సుఖాలు ఉంటాయి. దేవతలకు 36 రకాల భోజనమును అర్పిస్తారు అని అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు. అక్కడ ఎంత రుచికరమైనవి, వైభవంగా ఉండేవి తింటూ ఉంటారు మరియు పవిత్రంగా ఉంటారు. ఇప్పుడు మీరు ఆ ప్రపంచానికి యజమానులుగా అవుతారు. రాజు-రాణి మరియు ప్రజలకు వ్యత్యాసముంటుంది కదా. ఇంతకుముందు రాజులు చాలా ఆర్భాటంగా ఉండేవారు కానీ ఎంతైనా వారు పతితులు మరియు రావణ రాజ్యంలో ఉన్నవారు. మరి ఆలోచించండి, సత్యయుగంలో ఉండేవారు ఎలా ఉండి ఉండవచ్చు. ఎదురుగా లక్ష్మీనారాయణుల చిత్రం పెట్టడం జరిగింది. కృష్ణుని గురించి అసత్యమైన విషయాలను రాసి అప్రతిష్టపాలు చేసేసారు. అసత్యమంటే అసత్యమే, సత్యమనేది ఇసుమంత కూడా లేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు - మనం స్వర్గానికి యజమానులుగా ఉండేవారము, తర్వాత 84 జన్మలు తీసుకొని పూర్తిగా శూద్ర బుద్ధి కలవారిగా అయ్యాము. ఎలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి ఎలా తయారవుతున్నారు! మీరు ఏమవుతారు అని బాబా కూడా అడుగుతారు కదా. అప్పుడు, మేము సూర్యవంశీయులుగా అవుతామని అందరూ చేతులెత్తుతారు - మేము మాత-పితలను పూర్తిగా ఫాలో చేస్తాము, తక్కువ పురుషార్థం చేయము అని అంటారు. శ్రమంతా స్మృతి చేయడంలో మరియు తమ సమానంగా తయారుచేయడంలో ఉంది, అందుకే తండ్రి అంటారు - ఎంత వీలైతే అంత సేవ చేయడం నేర్చుకోండి. ఇది చాలా సహజము. వీరు శివబాబా, ఇది విష్ణుపురి, ఇదే లక్ష్మీనారాయణుల రాజ్యము. ఇతను చాలా అనుభవజ్ఞులు. మెట్ల చిత్రం చూపించి మీరు అర్థం చేయించవచ్చు.

పిల్లలైన మీకు ఈ వృక్షాన్ని మరియు చక్రాన్ని చూస్తూనే, బుద్ధిలోకి మొత్తం జ్ఞానమంతా రావాలి. ఈ లక్ష్మీనారాయణుల రాజధాని ఎక్కడకు వెళ్ళిపోయింది! ఎవరు యుద్ధం చేసారు! మిమ్మల్ని ఓడించింది ఎవరు? ఇప్పుడు ఆ రాజ్యము లేదు. ఈ ఈశ్వరీయ విషయాల గురించి ఏమీ తెలియదు. గుహలలోకి, గనులలోకి వెళ్ళి బంగారం, వజ్రాలు మొదలైనవి ఎలా తీసుకువస్తారు అనే సాక్షాత్కారం కూడా పిల్లలైన మీకు జరిగింది. అక్కడ సైన్స్ మీ సుఖం కోసముంటుంది. ఇక్కడ సైన్స్ దుఃఖం కోసముంది, అక్కడ విమానాలు కూడా ఫుల్ ఫ్రూఫ్ గా ఉంటాయి. ప్రారంభంలో, పిల్లలకు ఈ సాక్షాత్కారాలన్నీ జరిగాయి. చివర్లో కూడా మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. దొంగలు దోచుకునేందుకు వస్తారు, అప్పుడు మీ శక్తి రూపాన్ని చూసి పారిపోతారు - అని కూడా మీకు సాక్షాత్కారం జరిగింది. ఈ విషయాలన్నీ అంతిమ సమయానికి సంబంధించినవి. దొంగలు దోచుకునేందుకు వస్తారు కానీ మీరు తండ్రి స్మృతిలో నిలబడి ఉంటే వారు వెంటనే పారిపోతారు.

ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, బాగా పురుషార్థం చేయండి. ముఖ్యమైనది పవిత్రత. ఒక్క జన్మ పవిత్రంగా అవ్వాలి. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ప్రకృతి వైపరీత్యాలు చాలా కఠినంగా వస్తాయి, అప్పుడు అంతా సమాప్తమైపోతుంది. శివబాబా వీరి ద్వారా అర్థం చేయిస్తారు, వీరి ఆత్మ కూడా వింటుంది. ఈ బాబా అన్నీ చెప్తారు. శివబాబా ఇవేవీ అనుభవించరు. మాయా తుఫాన్లు ఎలా వస్తాయనేది పిల్లలకు అనుభవమవుతుంది. మొదటి నంబరులో ఇతను (బ్రహ్మా) ఉన్నారు కనుక ఇతనికి అన్నీ అనుభవమవుతాయి. కనుక ఇందులో భయపడకూడదు, స్థిరంగా ఉండాలి. తండ్రి స్మృతిలో ఉండడంతోనే శక్తి లభిస్తుంది. కొంతమంది పిల్లలు చార్టు రాస్తారు, తర్వాత నడుస్తూ-నడుస్తూ రాయడం ఆపేస్తారు. వారు అలసిపోయారని బాబాకు అర్థమవుతుంది. పారలౌకిక తండ్రి, ఎవరి నుండైతే ఇంత గొప్ప వారసత్వం లభిస్తుందో, అలాంటి తండ్రికి ఎప్పుడూ లెటర్ కూడా రాయరు. వారిని స్మృతియే చేయరు! ఇలాంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. శివబాబా, మేము మిమ్మల్ని చాలా స్మృతి చేస్తాము. బాబా, మీ స్మృతి లేకుండా మేము ఎలా ఉండగలము! ఏ తండ్రి నుండైతే విశ్వ రాజ్యాధికారం లభిస్తుందో, అలాంటి తండ్రిని ఎలా మర్చిపోతాము. ఒక ఉత్తరం రాసినా, అది కూడా స్మృతి చేసినట్లే కదా. లౌకిక తండ్రి కూడా పిల్లలకు ఉత్తరం రాస్తారు - కంటి వెలుగు... అని సంబోధిస్తారు. అలాగే పత్ని, తన పతికి ఎలా ఉత్తరం రాస్తుంది! ఇక్కడైతే రెండు సంబంధాలు ఉన్నాయి. ఇది కూడా స్మృతి చేసేందుకు యుక్తి. బాబా ఎంత మధురమైనవారు! మనల్ని ఏం అడుగుతారు? ఏమీ అడగరు. వారు దాత, ఇచ్చేవారు కదా. వారు తీసుకునేవారు కాదు. బాబా అంటారు - స్వీట్ చిల్డ్రన్, నేను వచ్చాను, భారత్ ను సుగంధభరితమైన పూదోటగా తయారుచేసి వెళ్తాను. అచ్ఛా.

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సూర్యవంశీయులుగా అయ్యేందుకు మాత-పితలను పూర్తిగా ఫాలో చేయాలి. స్మృతిలో ఉండేందుకు మరియు తమ సమానంగా తయారుచేసేందుకు శ్రమించాలి.

2. పురుషార్థం చేసి శ్రీమతాన్ని అనుసరిస్తూ శాంతిగా ఉండాలి. పెద్దల ఆజ్ఞను పాటించాలి.

వరదానము:-

స్వయాన్ని సేవాధారిగా భావిస్తూ, వంగుతూ మరియు అందరినీ వంగే విధంగా చేసే నిమిత్త మరియు నమ్రచిత్త భవ

ఎవరైతే తమ ప్రతి సంకల్పాన్ని మరియు ప్రతి కర్మను తండ్రి ముందు అర్పణ చేస్తారో, వారిని నిమిత్తులని అంటారు. నిమిత్తంగా అవ్వడమంటే అర్పణమవ్వడము మరియు నమ్రచిత్తులంటే వంగేవారు. సంస్కారాలలో, సంకల్పాలలో ఎంతగా వంగుతారో, అంతగా విశ్వం మీ ముందు వంగుతుంది. వంగడం అనగా వంగే విధంగా చేయడము. ఇతరులు కూడా నా ముందు ఎంతో కొంత వంగాలి కదా అనే సంకల్పం కూడా రాకూడదు. సత్యమైన సేవాధారులు సదా వంగుతారు, ఎప్పుడూ తమ అధికారాన్ని చూపించరు.

స్లోగన్:-

ఇప్పుడు సమస్యా స్వరూపులుగా కాదు, సమాధాన స్వరూపులుగా అవ్వండి.