06-01-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీరు ఏ కర్మలైతే చేస్తారో, దాని ఫలము తప్పకుండా లభిస్తుంది, నిష్కామ సేవనైతే కేవలం ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు”

ప్రశ్న:-

ఈ క్లాసు చాలా అద్భుతమైనది, ఎలా? ఇక్కడ ఏ ముఖ్యమైన శ్రమ చేయవలసి ఉంటుంది?

జవాబు:-

ఈ ఒక్క క్లాసులో మాత్రమే చిన్న పిల్లలు కూడా కూర్చున్నారు, వృద్ధులు కూడా కూర్చున్నారు. ఈ క్లాసు ఎంత అద్భుతమైనదంటే, ఇందులో అహల్యలు, కుబ్జలు, సాధువులు కూడా ఇక్కడికి వచ్చి కూర్చునే రోజు వస్తుంది. ఇక్కడ ముఖ్యమైనది స్మృతి యొక్క శ్రమ. స్మృతి ద్వారానే ఆత్మ మరియు శరీరము యొక్క నేచర్ క్యూర్ జరుగుతుంది కానీ స్మృతి కోసం కూడా జ్ఞానము కావాలి.

గీతము:-

రాత్రి ప్రయాణికుడా అలసిపోకు..... (రాత్ కే రాహీ.....)

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. ఆత్మిక తండ్రి పిల్లలకు దీని అర్థాన్ని కూడా తెలియజేస్తారు. విచిత్రమేమిటంటే గీత లేక శాస్త్రాలు మొదలైనవి తయారుచేసేవారికి దీని అర్థము తెలియదు. ప్రతి ఒక్క విషయానికి అనర్థమునే వెలికి తీస్తారు. జ్ఞానసాగరుడు, పతితపావనుడు అయిన ఆత్మిక తండ్రి కూర్చుని దీని అర్థమును తెలియజేస్తారు. రాజయోగము కూడా తండ్రియే నేర్పిస్తారు. ఇప్పుడు మళ్ళీ రాజులకే రాజుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. మేము మళ్ళీ బ్యారిస్టరుగా అవుతున్నామని వేరే పాఠశాలల్లో ఎవరూ ఈ విధంగా అనరు. ‘మళ్ళీ’ అన్న పదమును వాడడం ఎవ్వరికీ రాదు. మేము 5 వేల సంవత్సరాల క్రితము వలె మళ్ళీ అనంతమైన తండ్రి నుండి చదువుకుంటున్నామని మీరు అంటారు. ఈ వినాశనము కూడా తప్పకుండా మళ్ళీ జరగవలసిందే. ఎంత పెద్ద పెద్ద బాంబులను తయారుచేస్తూ ఉంటారు. చాలా శక్తివంతమైనవి తయారుచేస్తారు. వాటిని దాచుకునేందుకు అయితే తయారుచేయరు కదా. ఈ వినాశనము కూడా శుభకార్యము కోసమే కదా. పిల్లలైన మీరు భయపడవలసిన అవసరమేమీ లేదు. ఇది కళ్యాణకారి యుద్ధము. తండ్రి కళ్యాణము కోసమే వస్తారు. తండ్రి వచ్చి బ్రహ్మా ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశన కర్తవ్యాన్ని చేయిస్తారని కూడా అంటారు. కావున ఈ బాంబులు మొదలైనవి వినాశనము కోసమే ఉన్నాయి. వీటికన్నా పెద్దవి ఇంకేవీ లేవు. వాటితో పాటు ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. వాటినేమీ ఈశ్వరీయ వైపరీత్యాలు అని అనరు. ఈ ప్రకృతి వైపరీత్యాలు డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇది కొత్త విషయమేమీ కాదు. పెద్ద-పెద్ద బాంబులు ఎన్ని తయారుచేస్తూ ఉంటారు. మేము పట్టణాలకు పట్టణాలనే అంతం చేసేస్తామని అంటారు. ఇప్పుడు జపాన్ యుద్ధములో వేసిన బాంబులు అయితే చాలా చిన్నవి. ఇప్పుడైతే పెద్ద-పెద్ద బాంబులను తయారుచేసారు. ఎప్పుడైతే ఎక్కువ కష్టాలలో పడిపోతారో, ఇక సహించలేరో, అప్పుడు బాంబులు వేయడం మొదలుపెడతారు. ఎంత నష్టము జరుగుతుంది. వారు కూడా ట్రయల్ వేసి చూస్తున్నారు. కోట్ల రూపాయలను ఖర్చు చేస్తారు. వీటిని తయారుచేసేవారి జీతం కూడా ఎక్కువగా ఉంటుంది. కావున పాత ప్రపంచమే వినాశనమవ్వనున్నదని పిల్లలైన మీకు సంతోషముండాలి. పిల్లలైన మీరు కొత్త ప్రపంచము కొరకు పురుషార్థము చేస్తున్నారు. పాత ప్రపంచము తప్పకుండా సమాప్తమవ్వనున్నదని వివేకము కూడా చెప్తుంది. కలియుగంలో ఏముంది, సత్యయుగంలో ఏముంటుంది అనేది పిల్లలకు తెలుసు. ఇప్పుడు మీరు సంగమములో నిలబడి ఉన్నారు. సత్యయుగంలో ఇంతమంది మనుష్యులు ఉండరు కావున వీటన్నింటి వినాశనము జరుగుతుందని మీకు తెలుసు. ఈ ప్రాకృతిక ఆపదలు కల్పక్రితము కూడా జరిగాయి. పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. ఇటువంటి వైపరీత్యాలు అయితే ఎన్నో జరుగుతూ వచ్చాయి కానీ అవి తక్కువ పరిమితిలోనే జరిగేవి. ఇప్పుడు ఈ పాత ప్రపంచమంతా సమాప్తమవ్వనున్నది. పిల్లలైన మీకైతే చాలా సంతోషముండాలి. ఆత్మిక పిల్లలైన మనకు తండ్రి అయిన పరమపిత పరమాత్మ కూర్చొని అర్థం చేయిస్తున్నారు, ఈ వినాశనము మీ కొరకే జరుగుతుంది. రుద్ర జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమయిందని కూడా గాయనం ఉంది. గీతలో ఉన్న ఎన్నో విషయాల అర్థము చాలా బాగుంది, కానీ ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. వారు శాంతిని కోరుకుంటూ ఉంటారు. మీరేమో త్వరగా వినాశనమైతే మేము వెళ్ళి సుఖంగా ఉండవచ్చని అంటారు. సతోప్రధానంగా ఉన్నప్పుడే సుఖంగా ఉంటారని తండ్రి అంటారు. తండ్రి అనేక రకాల పాయింట్లు ఇస్తూ ఉంటారు, అవి కొందరి బుద్ధిలో బాగా కూర్చుంటాయి, కొందరి బుద్ధిలో తక్కువగా కూర్చుంటాయి. కేవలం శివబాబాను స్మృతి చేయాలి, అంతే అని వృద్ధ మాతలు భావిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయమని వారికి అర్థం చేయించడం జరుగుతుంది. అయినా వారసత్వాన్ని అయితే పొందుతారు. తోడుగా ఉంటారు. ప్రదర్శినీలలో అందరూ వస్తారు. అజామిళ్ వంటి పాపాత్ములు, గణికలు మొదలైన వారందరి ఉద్ధరణ జరగనున్నది. ఊడ్చేవారు కూడా మంచి వస్త్రాలను ధరించి వచ్చేస్తారు. గాంధీజీ అంటరానివారిని ఫ్రీ చేసేశారు, వారితో కలిసి భోజనం కూడా చేస్తారు. బాబా అయితే అసలు నిరాకరించరు. వీరి ఉద్ధరణ కూడా చేయవలసిందేనని భావిస్తారు. వారు చేసే పనితో ఎలాంటి సంబంధము లేదు. దీనిలో మొత్తం ఆధారమంతా తండ్రితో బుద్ధియోగాన్ని జోడించడంపైనే ఉంది. తండ్రిని స్మృతి చేయాలి. నేను అంటరానివాడిని అని ఆత్మ అంటుంది. మనము సతోప్రధాన దేవీ దేవతలుగా ఉండేవారము, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ అంతిమంలోకి వచ్చి పతితులుగా అయ్యామని మీకిప్పుడు తెలుసు. ఇప్పుడు ఆత్మనైన నేను మళ్ళీ పావనంగా అవ్వాలి. సింధ్ లో ఒక కొండజాతి స్త్రీ వచ్చేవారు, ధ్యానములోకి వెళ్ళేవారు అని మీకు తెలుసు. ఆమె పరుగెత్తుకొని వచ్చి కలుసుకునేవారు. ఆమెలో కూడా ఆత్మ అయితే ఉంది కదా అని అర్థం చేయించబడుతుంది. తన తండ్రి నుండి వారసత్వం తీసుకునే హక్కు ఆత్మకు ఉంది. ఆమెను జ్ఞానము తీసుకోనివ్వండని ఆమె ఇంటి వారికి చెప్పడం జరిగింది కానీ మా వంశములో గొడవ జరిగిపోతుందని వారు అన్నారు. భయముతో ఆమెను తీసుకువెళ్ళిపోయారు. మీ వద్దకు కూడా వస్తారు, మీరు ఎవరినీ నిరాకరించడానికి వీల్లేదు. అబలలు, గణికలు, కొండజాతి వారు, సాధువులు మొదలైన వారందరినీ ఉద్ధరిస్తారని గాయనముంది. సాధువుల నుండి కొండజాతివారి వరకు అందరినీ ఉద్ధరిస్తారు.

పిల్లలైన మీరిప్పుడు యజ్ఞసేవ చేస్తారు, ఈ సేవతో చాలా ప్రాప్తి కలుగుతుంది. అనేకుల కళ్యాణము జరుగుతుంది. రోజురోజుకు ప్రదర్శినీ సేవ చాలా వృద్ధి చెందుతుంది. బాబా బ్యాజ్ లు కూడా తయారుచేయిస్తూ ఉంటారు. వీరు తండ్రి, వీరు దాదా, ఇది తండ్రి ఇచ్చే వారసత్వం అని మీరు ఎక్కడకు వెళ్ళినా వీటిపై అర్థము చేయించాలి. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేయండని గీతలో కూడా ఉంది. కేవలం అందులో నా పేరును తీసేసి కొడుకు పేరును పెట్టేసారు. రాధా-కృష్ణులకు పరస్పరంలో ఏ సంబంధం ఉంది అనేది భారతవాసులకు కూడా తెలియదు. వారి వివాహము మొదలైన చరిత్రను గురించి ఏమీ చెప్పరు. ఇద్దరూ వేర్వేరు రాజధానులకు చెందినవారు. ఈ విషయాలను తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. ఒకవేళ దీన్ని అర్థము చేసుకొని శివభగవానువాచ అని అన్నట్లయితే, అందరూ వారిని తరిమేస్తారు. నీవు ఇది ఎక్కడి నుండి నేర్చుకున్నావు? ఆ గురువు ఎవరు? అని అడుగుతారు. బి.కె.లు అని చెప్పారంటే అందరూ గొడవ చేస్తారు. ఈ గురువుల రాజ్యాలే సమాప్తమైపోతాయి. ఇటువంటివారు చాలామంది వస్తారు, వ్రాసి కూడా ఇస్తారు, తర్వాత మాయమైపోతారు.

తండ్రి పిల్లలకు ఎటువంటి కష్టాన్ని ఇవ్వరు. చాలా సహజమైన యుక్తిని తెలియజేస్తారు. ఎవరికైనా పిల్లలు లేకపోతే సంతానాన్ని ఇవ్వమని భగవంతుడిని అడుగుతారు. సంతానం కలిగితే వారికి చాలా మంచి పాలన చేస్తారు, చదివిస్తారు. పెద్దవారైన తర్వాత ఇప్పుడు నీ వ్యాపారం చేసుకో అని అంటారు. తండ్రి పిల్లలను పాలన చేసి వారిని యోగ్యులుగా తయారుచేస్తారు కావున వారు పిల్లలకు సేవకుడు కదా. ఈ తండ్రి పిల్లలకు సేవ చేసి తోడుగా తీసుకువెళ్తారు. ఆ లౌకిక తండ్రి, కొడుకు పెద్దవాడై తన వ్యాపారములో నిమగ్నమై, తర్వాత మేము వృద్ధులమైతే మా సేవ చేస్తాడని భావిస్తారు. ఈ తండ్రి అయితే సేవను అడగరు. వీరు నిష్కాములు. ఎప్పటివరకైతే జీవించి ఉంటానో, అప్పటివరకు మమ్మల్ని సంభాళించడం పిల్లల బాధ్యత అని లౌకిక తండ్రి భావిస్తారు. ఈ కోరికను పెట్టుకుంటారు. నేను నిష్కామ సేవ చేస్తానని ఈ తండ్రి అంటారు. నేను రాజ్యం చేయను. నేను ఎంతటి నిష్కాముడిని. మిగిలినవారు ఏం చేసినా వారికి దాని ఫలము తప్పకుండా లభిస్తుంది. వీరైతే అందరికీ తండ్రి. నేను పిల్లలైన మీకు స్వర్గ రాజ్యాన్నిస్తానని అంటారు. మీరు ఎంతటి ఉన్నతమైన పదవిని ప్రాప్తించుకుంటారు. నేనైతే కేవలం బ్రహ్మాండానికే యజమానిని, మీరు కూడా యజమానులే కానీ మీరు రాజ్యాన్ని తీసుకుంటారు మరియు పోగొట్టుకుంటారు. నేను రాజ్యం తీసుకోను, పోగొట్టుకోను. నాకు డ్రామాలో ఈ పాత్ర ఉంది. పిల్లలైన మీరు సుఖ వారసత్వాన్ని పొందేందుకు పురుషార్థము చేస్తారు. మిగిలిన వారంతా కేవలం శాంతిని కోరుకుంటారు. సుఖము కాకిరెట్టతో సమానమని ఆ గురువులు అంటారు, అందుకే వారు శాంతిని మాత్రమే కోరుకుంటారు. వారు ఈ జ్ఞానాన్ని తీసుకోలేరు. వారికి సుఖము గురించే తెలియదు. శాంతి మరియు సుఖముల వారసత్వాన్ని ఇచ్చేవాడిని నేనొక్కడినేనని తండ్రి అర్థం చేయిస్తున్నారు. సత్య-త్రేతా యుగాలలో గురువులు ఉండరు, అక్కడ రావణుడే ఉండడు. అది ఉన్నదే ఈశ్వరీయ రాజ్యము. ఈ డ్రామా తయారుచేయబడింది. ఈ విషయాలు ఇంకెవ్వరి బుద్ధిలోనూ కూర్చోవు. కావున పిల్లలు బాగా ధారణ చేసి ఉన్నత పదవిని పొందాలి. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. కొత్త ప్రపంచ రాజధాని స్థాపనవుతుందని మీకు తెలుసు. మీరు సంగమయుగములోనే ఉన్నారు. మిగిలినవారంతా కలియుగములో ఉన్నారు. వారు కల్పము ఆయుష్షును లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఘోరమైన అంధకారములో ఉన్నారు కదా. కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారని గాయనం కూడా ఉంది. విజయము పాండవులదేనని గాయనం చేయబడింది.

మీరు బ్రాహ్మణులు. బ్రాహ్మణులే యజ్ఞమును రచిస్తారు. ఇది అన్నింటికన్నా పెద్ద అనంతమైన భారీ ఈశ్వరీయ రుద్ర యజ్ఞము. ఆ హద్దు యజ్ఞాలు అనేక రకాలుగా ఉంటాయి. ఈ రుద్ర యజ్ఞము ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. సత్య-త్రేతా యుగాలలో ఇక ఎటువంటి యజ్ఞాలు ఉండవు ఎందుకంటే అక్కడ ఆపదలు మొదలైనవాటి విషయమేమీ ఉండదు. అవన్నీ హద్దు యజ్ఞాలు. ఇది అనంతమైనది. ఇది అనంతమైన తండ్రి ద్వారా రచింపబడిన యజ్ఞము, ఇందులో అనంతమైన ఆహుతి జరగనున్నది. తర్వాత అర్థకల్పము ఎటువంటి యజ్ఞాలు ఉండవు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. రావణ రాజ్యము ప్రారంభమవ్వడంతో ఇవన్నీ మళ్ళీ ప్రారంభమవుతాయి. అనంతమైన యజ్ఞము ఒక్కసారి మాత్రమే జరుగుతుంది, అందులో ఈ పాత సృష్టి అంతా స్వాహా అయిపోతుంది. ఇది అనంతమైన రుద్ర జ్ఞాన యజ్ఞము. ఇందులో ముఖ్యమైనవి జ్ఞానం మరియు యోగం విషయాలు. యోగము అనగా స్మృతి. స్మృతి అనే పదము చాలా మధురమైనది. యోగమనే పదము సామాన్యమైపోయింది. యోగం అర్థమును ఎవరూ అర్థం చేసుకోరు. యోగమంటే తండ్రిని స్మృతి చేయడమని మీరు అర్థం చేయించవచ్చు. బాబా, మీరు మాకు అనంతమైన వారసత్వమును ఇస్తారు. ఆత్మ అంటుంది - బాబా, మీరు మళ్ళీ వచ్చారు. మేము మిమ్మల్ని మర్చిపోయాము. మీరు మాకు రాజ్యాధికారాన్నిచ్చారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి కలిశారు. మేము మీ శ్రీమతంపై తప్పకుండా నడుచుకుంటాము. ఈ విధంగా మీతో మీరే లోలోపల మాట్లాడుకోవడం జరుగుతుంది. బాబా, మీరు మాకు చాలా మంచి మార్గాన్ని తెలియజేస్తున్నారు. మేము కల్ప-కల్పము మర్చిపోతాము. ఇప్పుడు తండ్రి మళ్ళీ తప్పు చేయని వారిగా తయారుచేస్తారు కావున ఇప్పుడు తండ్రినే స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే వారసత్వము లభిస్తుంది. నేను సన్ముఖములోకి వచ్చినప్పుడు మీకు అర్థం చేయిస్తాను. అంతవరకు మీరు దుఃఖహర్త సుఖకర్త అని పాడుతూ ఉంటారు. మహిమ పాడుతారు కానీ ఆత్మ గురించి గాని, పరమాత్మ గురించి గాని తెలియదు. ఇంత చిన్న బిందువులో అవినాశీ పాత్ర రచింపబడి ఉందని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఇది కూడా తండ్రి అర్థము చేయిస్తారు. వారిని పరమపిత పరమాత్మ అనగా పరమ ఆత్మ అని అంటారు. అంతేకానీ వేలాది సూర్యుల వలె పెద్దగా ఏమీ ఉండను. నేను టీచరు వలె చదివిస్తూ ఉంటాను. ఎంతమంది పిల్లలున్నారు. ఈ క్లాసు ఎంత అద్భుతమైనదో చూడండి. ఇందులో ఎవరెవరు చదువుతున్నారు? అబలలు, కుబ్జలు, సాధువులు కూడా ఒకానొక రోజు వచ్చి కూర్చుంటారు. వృద్ధుల మాతలు, చిన్న పిల్లలు మొదలైన వారందరూ కూర్చున్నారు. ఇటువంటి పాఠశాలను ఎక్కడైనా చూశారా. ఇక్కడ స్మృతి యొక్క శ్రమ ఉంటుంది. ఈ స్మృతియే సమయము తీసుకుంటుంది. స్మృతి యొక్క పురుషార్థము చేయడం కూడా జ్ఞానమే కదా. స్మృతి కొరకు కూడా జ్ఞానము ఉంది. చక్రమును అర్థము చేయించడానికి కూడా జ్ఞానము ఉంది. దీనిని సహజమైన, సత్యమైన నేచర్ క్యూర్ (ప్రకృతి వైద్యము) అని అంటారు. మీ ఆత్మ పూర్తిగా పవిత్రంగా అయిపోతుంది. అక్కడ శరీరానికి వైద్యం జరుగుతుంది. ఇది ఆత్మకు వైద్యము. ఆత్మలోనే మలినము చేరుతుంది. సత్యమైన బంగారముతో సత్యమైన ఆభరణము తయారవుతుంది. ఇక్కడ శివబాబా సన్ముఖంగా వచ్చేసారని ఇప్పుడు పిల్లలకు తెలుసు. పిల్లలు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలి. ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళాలి. తండ్రిని, వారసత్వాన్ని మరియు ఇంటిని కూడా స్మృతి చేయండి. అది స్వీట్ సైలెన్స్ హోమ్. అశాంతి వల్లనే దుఃఖము కలుగుతుంది, శాంతితో సుఖము ఉంటుంది. సత్యయుగంలో సుఖము, శాంతి, సంపద అన్నీ ఉంటాయి. అక్కడ గొడవలు కొట్లాటల విషయమే ఉండదు. పిల్లలకు ఇదే చింత ఉండాలి - మేము సతోప్రధానంగా, సత్యమైన బంగారంగా అవ్వాలి, అప్పుడే ఉన్నత పదవిని పొందుతాము. ఈ ఆత్మిక భోజనము లభిస్తుంది, ఈ రోజు ఏయే ముఖ్యమైన పాయింట్లు విన్నాను అని నెమరు వేయాలి. ఆత్మిక యాత్ర మరియు దైహిక యాత్ర అనే రెండు యాత్రలుంటాయని కూడా అర్థం చేయించారు. ఈ ఆత్మిక యాత్ర మాత్రమే ఉపయోగపడుతుంది. భగవానువాచ – ‘మన్మనాభవ’. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ వినాశనము కూడా శుభ కార్యము కొరకే జరుగుతుంది కనుక భయపడకూడదు, కళ్యాణకారి తండ్రి సదా కళ్యాణం యొక్క కార్యాలే చేయిస్తారు, ఈ స్మృతితో సదా సంతోషంగా ఉండాలి.

2. సతోప్రధానమైన, సత్యమైన బంగారముగా అయి ఉన్నత పదవిని పొందాలి అన్న ఒక్క చింతను సదా ఉంచుకోవాలి. ఆత్మిక భోజనమేదైతే లభిస్తుందో, దాన్ని నెమరు వేయాలి.

వరదానము:-

సత్సంగం ద్వారా ఆత్మిక రంగును వేసే సదా హర్షిత మరియు డబల్ లైట్ భవ

ఏ పిల్లలైతే తండ్రిని హృదయపూర్వకమైన సత్యమైన సహచరునిగా చేసుకుంటారో, వారికి సాంగత్యము యొక్క ఆత్మిక రంగు సదా అంటుకునే ఉంటుంది. బుద్ధి ద్వారా సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు మరియు సద్గురువుల సాంగత్యం చేయడమే సత్సంగము. ఎవరైతే ఈ సత్సంగంలో ఉంటారో వారు సదా హర్షితంగా మరియు డబల్ లైట్ గా ఉంటారు. వారికి ఏ రకమైన భారమూ అనుభవమవ్వదు. నేను నిండుగా ఉన్నాను, సంతోషాల గని నాతో పాటు ఉంది, తండ్రికి చెందినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నావైపోయాయి అని ఈ విధంగా అనుభవం చేస్తారు.

స్లోగన్:-

మీ మధురమైన మాటలు మరియు ఉల్లాస-ఉత్సాహాల సహయోగంతో నిరాశగా ఉన్నవారిని శక్తివంతులుగా చేయండి.