06-04-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి కావున దేహభానాన్ని మరచి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి, అందరి పట్ల మమకారాన్ని తొలగించండి”

ప్రశ్న:-

సంగమయుగంలో పిల్లలైన మీరు తండ్రి నుండి ఏ తెలివిని నేర్చుకుంటారు?

జవాబు:-

తమోప్రధానం నుండి సతోప్రధానంగా ఎలా తయారవ్వాలి, తమ భాగ్యాన్ని ఉన్నతంగా ఎలా తయారుచేసుకోవాలి అనే తెలివిని మీరు ఇప్పుడే నేర్చుకుంటారు. ఎవరెంత యోగయుక్తులుగా మరియు జ్ఞానయుక్తులుగా అవుతారో, వారి ఉన్నతి అంతగా జరుగుతూ ఉంటుంది. తమ ఉన్నతి చేసుకునే పిల్లలు ఎప్పటికీ దాగి ఉండలేరు. పిల్లల్లో ఎవరు తమ భాగ్యాన్ని ఉన్నతంగా చేసుకుంటున్నారు అనేది తండ్రి ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా అర్థం చేసుకుంటారు.

గీతము:-

మరణించినా నీ దారిలోనే..... (మర్నా తేరీ గలీ మే.....)

ఓంశాంతి. పిల్లలందరూ ఈ పాటను విన్నారు. పిల్లలు అని అన్నప్పుడు బాబా బ్రాహ్మణులైన మా కోసమే అంటున్నారని అన్ని సెంటర్లలోని పిల్లలకు తెలుసు - జీవిస్తూనే మెడలోని హారంగా అయ్యేందుకు అనగా మూలవతనానికి వెళ్ళి బాబా ఇంట్లో ఉండేందుకు పిల్లలు ఈ పాటను విన్నారు. అది శివబాబా ఇల్లు కదా, అందులో సాలిగ్రామాలన్నీ ఉంటాయి. తప్పకుండా ఆ బాబాయే వచ్చారని బ్రాహ్మణ కులభూషణులైన, స్వదర్శన చక్రధారులైన పిల్లలకు తెలుసు. ఇప్పుడు మీరు అశరీరిగా అవ్వాలి అనగా దేహ భానాన్ని మర్చిపోవాలి అని వారంటారు. ఈ పాత ప్రపంచము అంతమైపోతుంది. ఈ శరీరాన్ని అయితే విడిచిపెట్టాలి అనగా అందరినీ విడిచిపెట్టాలి ఎందుకంటే ఈ ప్రపంచమే సమాప్తమవ్వనున్నది. కావున ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు పిల్లలందరికీ సంతోషం కలుగుతుంది, ఎందుకంటే అర్ధకల్పం బట్టి ఇంటికి వెళ్ళేందుకు చాలా ఎదురుదెబ్బలు తిన్నారు కానీ మార్గం లభించలేదు సరికదా, ఇంకా భక్తి మార్గపు ఆర్భాటాలను చూస్తూ మనుష్యులు చిక్కుకుంటూ వచ్చారు. ఇది భక్తి మార్గపు ఊబి, ఇందులో మనుష్యులు మెడ వరకు చిక్కుకుని ఉన్నారు. బాబా, మేము పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని మర్చిపోతాము, ఇప్పుడు అశరీరులుగా అయి మీతో పాటు ఇంటికి వస్తాము అని పిల్లలంటారు. మమ్మల్ని తీసుకువెళ్ళేందుకు పరమపిత పరమాత్మ పరంధామం నుండి వచ్చారని అందరి బుద్ధిలోనూ ఉంది. వారు, కేవలం మీరు పవిత్రంగా అయి నన్ను స్మృతి చేయండి అని అంటారు. జీవిస్తూ మరణించాలి. ఆ ఇంట్లో ఆత్మలు నివసిస్తాయని మీకు తెలుసు. ఆత్మ అయితే బిందువు. నిరాకారీ ప్రపంచంలోకి ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి, ఎంతమంది మనుష్యులో అన్ని ఆత్మలు అక్కడ ఉంటాయి. ఆ మహాతత్వంలో ఆత్మలు ఎంత చోటు తీసుకుంటాయి. శరీరమైతే ఇంత పెద్దది, ఎంత చోటు తీసుకుంటుంది? అదే ఆత్మకైతే ఎంత చోటు కావాలి! ఆత్మలైన మనం ఎంత తక్కువ చోటును తీసుకుంటాము? చాలా తక్కువ. ఈ విషయాలన్నింటినీ తండ్రి ద్వారా వినే సౌభాగ్యము ఇప్పుడు పిల్లలకు లభిస్తుంది. తండ్రియే అర్థం చేయిస్తారు - ఇక్కడకు మీరు శరీరం లేకుండా వచ్చారు, తర్వాత శరీరాన్ని ధరించి పాత్రను అభినయించారు, ఇప్పుడు మళ్ళీ జీవిస్తూ మరణించాలి, అందరినీ మర్చిపోవాలి. తండ్రి వచ్చి మరణించడం నేర్పిస్తారు. మీ తండ్రిని, మీ ఇంటిని స్మృతి చేయండి, బాగా పురుషార్థం చేయండి అని చెప్తారు. యోగంలో ఉండడంతో పాపాలు నశిస్తాయి. అప్పుడు ఆత్మ తమోప్రధానం నుండి సతోప్రధానం అయిపోతుంది, కావుననే దేహపు సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి అని కల్పక్రితం కూడా చెప్పానని తండ్రి సలహాను ఇస్తారు. అందరి తండ్రి వారొక్కరే కదా. మీరు ప్రజాపిత బ్రహ్మా ముఖవంశావళి పిల్లలు, మీరు జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. మీరు ఎలాగో శివుని పిల్లలే. మేము భగవంతుని పిల్లలము అన్న నిశ్చయమైతే అందరికీ ఉంది కానీ వారి నామ, రూప, దేశ, కాలాలను మర్చిపోయిన కారణంగా ఎవరికీ భగవంతుని పట్ల అంత ప్రేమ ఉండదు. దీనికి ఎవరినీ దూషించరు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది.

ఆత్మలైన మీరు ఎంత సూక్ష్మమైన బిందువులు, ఆ బిందువులో 84 జన్మల పాత్ర ఇమిడి ఉంది అని తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మ శరీరాన్ని ధరించి పాత్రను ఎలా అభినయిస్తుంది అనేది ఎంత అద్భుతము. ఇప్పుడు మీకు అనంతమైన పాత్ర గురించి తెలిసింది. ఈ జ్ఞానం ఇంకెవ్వరికీ లేదు. మీరు కూడా దేహాభిమానులుగా ఉండేవారు. ఇప్పుడు ఎంత పరివర్తనవుతారు అనేది కూడా ప్రతి ఒక్కరి భాగ్యంపై ఆధారపడి ఉంటుంది. కల్పక్రితపు భాగ్యం ఇప్పుడు సాక్షాత్కారమవుతుంది. ప్రపంచంలో ఎంతమంది మనుష్యులున్నారు, ప్రతి ఒక్కరి భాగ్యం ఎవరిది వారిది. ఎవరు ఎలాంటి కర్మలను చేసారో, దాని అనుసారంగా దుఃఖమయంగా, సుఖమయంగా, షావుకార్లుగా, పేదవారిగా అవుతారు. అలా అయ్యేది ఆత్మనే. ఆత్మ సుఖంలోకి ఎలా వస్తుంది, మళ్ళీ దుఃఖంలోకి ఎలా వస్తుంది అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యే తెలివిని కల్పక్రితం వలె తండ్రియే నేర్పిస్తారు. అప్పుడు ఎవరెంత తెలివిని పొందారో, ఇప్పుడు కూడా అంతే పొందుతున్నారు. అంతిమంలో ప్రతి ఒక్కరి భాగ్యాన్ని అర్థం చేసుకుంటారు, అప్పుడిక కల్ప-కల్పము ప్రతి ఒక్కరి భాగ్యం ఇలాగే ఉంటుందని అంటారు. ఎవరైతే బాగా యోగయుక్తులుగా, జ్ఞానయుక్తులుగా ఉంటారో - వారు సేవను కూడా చేస్తూ ఉంటారు. చదువులో సదా ఉన్నతి జరుగుతూ ఉంటుంది. కొందరు పిల్లలు త్వరగా ఉన్నతిని పొందుతారు, కొందరు చాలా తలనొప్పిని కలిగిస్తారు. ఇక్కడ కూడా అలానే ఉంటుంది. కల్పక్రితం వలె ఎవరెవరైతే ఉన్నతి చేసుకుంటారో, వారు దాగి ఉండలేరు. అందరి కనెక్షన్ శివబాబాతో ఉందని తండ్రికి తెలుసు కదా. వీరు (బ్రహ్మా) కూడా పిల్లల కర్మలు చూసి అర్థం చేసుకుంటారు, వారు (శివబాబా) కూడా చూస్తూ ఉంటారు. వీరి నుండి ఎవరైనా దాచిపెట్టవచ్చు కానీ శివబాబా నుండి ఎవరూ దాచిపెట్టలేరు. భక్తి మార్గంలోనే పరమాత్మ నుండి దాచిపెట్టలేరంటే ఇక జ్ఞాన మార్గంలో ఎలా దాచిపెట్టగలరు. చదువు చాలా సహజమైనదని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. కర్మలు కూడా చేయాలి. పాత ప్రపంచంలో మిత్ర-సంబంధీకుల వద్దనే ఉండాలి. అక్కడ ఉంటూ శ్రమ చేయాలి. ఒకవేళ ఎంతో లగన్ (ప్రేమ) ఉన్నట్లయితే, ఇక్కడ ఉంటూ పురుషార్థం చేసేవారి కన్నా అక్కడ ఇంట్లో ఉంటూ పురుషార్థం చేసేవారు చురుకుగా ముందు వెళ్ళగలరు. శాస్త్రాలలో అర్జునుడు మరియు బోయవాడి (ఏకలవ్యుడు) ఉదాహరణ ఉంది కదా. బోయవాడు (ఏకలవ్యుడు) బయట నివసించేవాడు కానీ అభ్యాసంతో బాణాలు వేయడంలో అతను అర్జునుని కన్నా తెలివైనవాడిగా అయ్యాడు. కావున గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండాలి. మీరు ఇటువంటి ఉదాహరణలను కూడా చూస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ చాలా మంచి సేవను చేయవచ్చు. అటువంటివారు చాలా వృద్ధిని పొందుతూ ఉంటారు. ఇక్కడ ఉండేవారిని కూడా మాయ విడిచిపెట్టదు. బాబా వద్దకు వస్తే విముక్తులైపోతారని కాదు. ప్రతి ఒక్కరి పురుషార్థం ఎవరిది వారిది. గృహస్థ వ్యవహారంలో ఉండేవారు ఇక్కడ ఉండేవారి కన్నా మంచి పురుషార్థం చేయగలరు. వారు చాలా మంచి ధైర్యాన్ని చూపించగలరు. ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా అయి చూపిస్తారో వారినే మహావీరులని అంటారు. బాబా, మీరు వదిలేశారని అంటారు. బాబా అంటారు - నేనెక్కడ విడిచిపెట్టాను, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. బాబా అయితే ఎవరినీ విడిచిపెట్టి రాలేదు. ఇంటికి ఇంకా ఎక్కువమంది పిల్లలు వచ్చారు. అయితే, కన్యలకు ఈశ్వరీయ సేవ చేయమని బాబా చెప్తారు. వీరు కూడా బాబానే, వారు కూడా బాబానే. కుమారులు కూడా చాలామంది వచ్చారు కానీ నడవలేకపోయారు. కన్యలు ఎంతైనా బాగానే ఉన్నారు. కన్య 100 మంది బ్రాహ్మణుల కన్నా ఉత్తమంగా భావించబడతారు. కావున కన్యలు అనగా 21 కులాలను ఉద్ధరించేవారు, జ్ఞాన బాణాలను వేసేవారు. ఇకపోతే గృహస్థంలో ఉండేవారు కూడా బి.కె. లే. మున్ముందు వారి బంధనం కూడా సమాప్తమైపోతుంది. సేవ అయితే చేయాలి కదా. చాలా మంది సేవ చేసే పిల్లలు బాప్ దాదా హృదయాన్ని అధిరోహించి ఉన్నారు, వారు వేలాది మంది కళ్యాణాన్ని చేస్తున్నారు కావున ఇటువంటి సేవాధారి పిల్లలకు ఆశీర్వాదాలు కూడా లభిస్తూ ఉంటాయి. వారు హృదయాన్ని అధిరోహించి ఉంటారు. హృదయంలో ఉండేవారే సింహాసనంపై కూర్చొంటారు. అందరికీ మార్గాన్ని తెలియజేసేందుకు పరస్పరంలో కలుసుకుని యుక్తులను రచిస్తూ ఉండండి అని బాబా అంటారు. చిత్రాలు కూడా తయారవుతూ ఉంటాయి. ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు.

పరమపిత పరమాత్మ నిరాకారుడు, వారు కూడా బిందువే కానీ వారు జ్ఞానసాగరుడు, పతిత పావనుడు అని మీరిప్పుడు అర్థం చేయిస్తారు. ఆత్మ కూడా బిందువే. ఎంతైనా పిల్లలు అంటే చిన్నగా ఉంటారు. తండ్రికి మరియు పిల్లలకు తేడా ఉంటుంది కదా. ఈ రోజుల్లో 15-16 సంవత్సరాల వారు కూడా తండ్రి అయిపోతున్నారు, కానీ ఎంతైనా బిడ్డ అంటే తండ్రి కన్నా చిన్నగానే ఉంటారు కదా. ఇక్కడి విచిత్రం చూడండి - తండ్రి కూడా ఆత్మనే, బిడ్డ కూడా ఆత్మనే. వారు సుప్రీమ్ ఆత్మ, నాలెడ్జ్ ఫుల్. మిగిలినవారంతా తమ చదువు అనుసారంగా నీచమైన పదవిని లేదా ఉన్నతమైన పదవిని పొందుతారు. అంతా చదువుపైనే ఆధారపడి ఉంటుంది. మంచి కర్మలు చేసినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. స్వర్గంలో కేవలం భారత్ మాత్రమే ఉండేది, ఇంకే ఖండము ఉండేది కాదు. కావున చిన్న కొత్త భారత్ లో మన స్వర్గాన్ని చూపించండి. ఉదాహరణకు ద్వారిక అన్న పేరు కాదు, లక్ష్మీనారాయణుల వంశస్థుల రాజ్యమని రాయాలి. సత్యయుగంలో మొదట దైవీ వంశస్థుల రాజ్యముంటుందని బుద్ధి కూడా చెప్తుంది. వారికి గ్రామాలుంటాయి, చిన్న-చిన్న ప్రాంతాలుంటాయి. ఇది కూడా విచార సాగర మథనం చేయాలి. దీనితో పాటు శివబాబాతో బుద్ధియోగాన్ని కూడా జోడించాలి. మనం స్మృతి ద్వారానే రాజ్యాధికారాన్ని తీసుకుంటాము. స్మృతితోనే తుప్పు వదులుతుంది, ఇందులోనే శ్రమంతా ఉంది. అనేకుల బుద్ధి బయట ఎదురుదెబ్బలు తింటూ ఉంటుంది, ఇక్కడ కూర్చున్నా కానీ పూర్తి సమయం స్మృతిలో ఉండలేరు, బుద్ధి వేరే వైపులకు వెళ్ళిపోతుంది. భక్తి మార్గంలో కూడా ఇలా జరుగుతుంది. శ్రీ కృష్ణుని భక్తిని చేస్తూ-చేస్తూ బుద్ధి వేరే వైపులకు వెళ్ళిపోతుంది. నవవిధ భక్తి చేసేవారు సాక్షాత్కారం కోసం చాలా శ్రమిస్తారు. కృష్ణుడు తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదని ఎన్ని గంటలు కూర్చుండిపోతారు, ఇందులో చాలా శ్రమ ఉంటుంది. ఇక్కడ 8 మరియు 16108 మాలలు ఉంటాయి. వారు లక్షల మణిపూసల మాలను కూడా చూపిస్తారు. కానీ జ్ఞాన మార్గం యొక్క మాల చాలా విలువైనది ఎందుకంటే ఇందులో ఆత్మిక శ్రమ ఉంది, భక్తి మార్గం యొక్క మాల చవకైనది. కృష్ణుడిని చూసి సంతోషంలో నాట్యం చేస్తారు. భక్తికి మరియు జ్ఞానానికి రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. కృష్ణుడిని స్మృతి చేస్తే తుప్పు వదులుతుందని మీకు అర్థం చేయించడం జరుగదు. ఇక్కడ ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా పాపాలు నశిస్తాయని అర్థం చేయించడం జరుగుతుంది.

పిల్లలైన మీరిప్పుడు యోగబలంతో విశ్వానికి యజమానులుగా అవుతారు. స్వప్నంలో కూడా ఎవరికీ ఈ ఆలోచన రాదు. లక్ష్మీనారాయణులు యుద్ధాలు మొదలైనవేవీ చేయలేదు. మరి వారు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు, ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. యోగబలంతో మీకు రాజ్యం లభిస్తుందని తండ్రి అంటారు. కానీ భాగ్యంలో లేకపోతే పురుషార్థమే చేయరు. సేవాధారులుగా అవ్వరు. ఈ విధంగా ప్రదర్శనీలు చెయ్యండి అని బాబా అయితే సూచనలు ఇస్తూనే ఉంటారు. ఒక రోజులో తక్కువ లో తక్కువ 150-200 ప్రదర్శనీలు జరగాలి. అన్ని గ్రామాలు తిరగండి. ఎన్ని సెంటర్లు ఉన్నాయో అన్ని ప్రదర్శనీలు జరగాలి. ఒక్కొక్క సెంటర్లోనూ ప్రదర్శనీని ఏర్పాటు చేసినట్లయితే అర్థం చేయించడం సహజమవుతుంది. చిత్రాలు మొదలైనవి పెట్టుకోగలిగేలా సెంటర్లు కూడా రోజు-రోజుకూ పెద్దవిగా అవుతూ ఉంటాయి. చిత్రాల ఆవిష్కరణ కూడా జరుగుతూ ఉంటుంది. వైకుంఠ చిత్రాన్ని భారతదేశంలో సుందరమైన మహళ్ళు మొదలైనవి ఉన్నట్లుగా తయారుచేయాలి. మున్ముందు అర్థం చేయించేందుకు మంచి-మంచి చిత్రాలు వెలువడుతూ ఉంటాయి. వానప్రస్థావస్థ కలవారు నడుస్తూ-తిరుగుతూ కూడా సేవ చేస్తూ ఉండాలి, ఎవరి భాగ్యం ఉదయిస్తే వారు వెలువడుతారు. చాలామంది పిల్లలు కుకర్మలు చేసి తమ గౌరవాన్ని పోగొట్టుకుంటారు, అప్పుడు యజ్ఞ గౌరవాన్ని భంగపరుస్తారు. నడవడిక ఎలా ఉంటే, అటువంటి పదవి లభిస్తుంది. ఎవరైతే అనేకులకు సుఖం ఇస్తారో, వారి పేరు మహిమ చేయబడుతుంది కదా. ఇప్పుడింకా సర్వ గుణాలతో సంపన్నులుగా అవ్వలేదు కదా. కొందరు చాలా మంచి సేవను చేస్తున్నారు. అటువంటి వారి పేర్లను విని బాబా సంతోషిస్తారు. సేవాధారి పిల్లలను చూసి బాబా సంతోషిస్తారు కదా. వారు సేవలో మంచిగా శ్రమిస్తూ ఉంటారు. సెంటర్లు కూడా తెరుస్తూ ఉంటారు, దీనితో వేలాది మంది కళ్యాణం జరుగుతుంది. మళ్ళీ వారి ద్వారా చాలామంది వెలువడుతూ ఉంటారు. ఎవరూ ఇంకా సంపూర్ణం అవ్వలేదు. ఏవో పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మాయ వదిలిపెట్టదు. ఎంతగా సేవ చేసి తమ ఉన్నతిని చేసుకుంటారో, అంతగా హృదయాన్ని అధిరోహిస్తారు, అంతగా ఉన్నత పదవిని కూడా పొందుతారు. ఇక కల్ప-కల్పము ఇటువంటి పదవియే లభిస్తుంది. శివబాబా నుండి ఎవరూ దాచిపెట్టలేరు. అంతిమంలో ప్రతి ఒక్కరికీ తమ కర్మల సాక్షాత్కారం జరుగుతుంది. అప్పుడిక ఏమి చేయగలరు! వెక్కి-వెక్కి ఏడవవలసి వస్తుంది, అందుకే బాబా అర్థం చేయిస్తూ ఉంటారు - అంతిమంలో శిక్షలను అనుభవించి, పశ్చాత్తాప పడవలసి వచ్చే కర్మలేవీ చేయకండి. కానీ ఎంతగా అర్థం చేయించినా కానీ భాగ్యంలో లేకపోతే అసలు పురుషార్థం చేయరు. ఈ రోజుల్లోని మనుష్యులకు తండ్రి గురించి తెలియదు. భగవంతుడిని గుర్తు చేసుకుంటారు కానీ వారెవరో తెలియదు. వారు చెప్పేది వినరు. ఇప్పుడు ఆ అనంతమైన తండ్రి నుండి మీకు క్షణంలో సత్యయుగ స్వరాజ్య వారసత్వం లభిస్తుంది. శివబాబా పేరునైతే అందరూ ఇష్టపడతారు కదా. ఆ అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుందని పిల్లలకు తెలుసు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ నడవడిక ద్వారా తండ్రి పేరును మరియు యజ్ఞం పేరును ప్రఖ్యాతం చేయాలి, తండ్రి గౌరవాన్ని పోగొట్టే విధమైన కర్మలేవీ చేయకూడదు. సేవ ద్వారా మీ భాగ్యాన్ని మీరే తయారుచేసుకోవాలి.

2. తండ్రి సమానంగా కళ్యాణకారులుగా అయి సర్వుల ఆశీర్వాదాలను పొంది ముందు నంబరును తీసుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండేందుకు మంచి ధైర్యాన్ని చూపించాలి.

వరదానము:-

సహయోగం ద్వారా స్వయాన్ని సహజయోగిగా చేసుకునే నిరంతర యోగీ భవ

సంగమయుగంలో తండ్రికి సహయోగిగా అవ్వడమే సహజయోగిగా అయ్యేందుకు విధి. ఎవరి యొక్క ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ, తండ్రి విషయంలో మరియు తమ రాజ్యస్థాపనా కర్తవ్యంలో సహయోగిగా ఉంటాయో, వారిని జ్ఞానయుక్తమైన, యోగయుక్తమైన ఆత్మలని, నిరంతర సత్యమైన సేవాధారులని అంటారు. మనసుతో కాకపోతే శరీరంతో, శరీరంతో కాకపోతే ధనంతో, ధనంతో కూడా కాకపోతే ఏ విధంగా సహయోగులుగా అవ్వగలరో ఆ విధంగా సహయోగులుగా అయినట్లయితే, అది కూడా యోగమే. తండ్రికి చెందినవారిగానే ఉన్నప్పుడు, ఇక తండ్రి మరియు మీరు - మూడవ వారెవరూ లేరు - దీని ద్వారా నిరంతర యోగులుగా అవుతారు.

స్లోగన్:-

సంగమయుగంలో సహనం చేయడం అనగా మరణించడమే స్వర్గ రాజ్యాన్ని తీసుకోవడం.