06-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - నేను పుష్పం వలె అయ్యానా, దేహ అహంకారం లోకి వచ్చి ముల్లులా అవ్వడం లేదు కదా? అని స్వయాన్ని చూసుకోండి. మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు ”

ప్రశ్న:-

ఏ నిశ్చయం ఆధారంగా తండ్రిపై ఎడతెగని ప్రేమ ఉండగలదు?

జవాబు:-

మొట్టమొదట స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకుంటే, తండ్రిపై ప్రీతి ఉంటుంది. నిరాకార తండ్రి ఈ భగీరథునిపై విరాజమానమై ఉన్నారు, వారు మనల్ని ఇతని ద్వారా చదివిస్తున్నారు అనే ఎడతెగని నిశ్చయం కూడా కావాలి. ఎప్పుడైతే ఈ నిశ్చయం తెగిపోతుందో, అప్పుడు ప్రేమ తగ్గిపోతుంది.

ఓంశాంతి. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేసే భగవానువాచ లేక తోట యజమాని యొక్క భగవానువాచ. మనం ఇక్కడకు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకు వచ్చామని పిల్లలకు తెలుసు. మొదట మనం ముళ్ళగా ఉండేవారమని, ఇప్పుడు పుష్పాలుగా అవుతున్నామని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. పతితపావనా రండి అని తండ్రిని చాలా మహిమ చేస్తారు. వారు నావికుడు, తోట యజమాని, పాపకటేశ్వరుడు. చాలా పేర్లతో పిలుస్తారు కానీ అన్ని స్థానాలలో చిత్రం ఒకటే ఉంది. జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు.... అని వారి మహిమను కూడా గానం చేస్తారు, మనం ఆ తండ్రి వద్ద కూర్చొని ఉన్నామని ఇప్పుడు మీకు తెలుసు. ముళ్ళ రూపి మనుష్యుల నుండి ఇప్పుడు మనం పుష్పాల రూపి దేవతలుగా అయ్యేందుకు వచ్చాము. ఇదే లక్ష్యం మరియు ఉద్దేశ్యం. మాలో దైవీ గుణాలు ఉన్నాయా? నేను సర్వగుణ సంపన్నంగా ఉన్నానా? అని ఇప్పుడు ప్రతి ఒక్కరు తమ మనస్సులో చూసుకోవాలి. ఇంతకుముందు దేవతల మహిమను గానం చేసేవారు, స్వయాన్ని ముళ్ళగా భావించేవారు. నిర్గుణులైన మాలో ఏ గుణాలు లేవు..... ఎందుకంటే 5 వికారాలున్నాయి. దేహాభిమానం కూడా చాలా కఠినమైన అభిమానం. స్వయాన్ని ఆత్మగా భావిస్తే తండ్రి పట్ల కూడా చాలా ప్రేమ ఉంటుంది. నిరాకార తండ్రి ఈ రథములో విరాజమానమై ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఈ నిశ్చయంలో ఉంటూ-ఉంటూ కూడా మళ్ళీ నిశ్చయం తెగిపోతుంది. మీరు అంటారు కూడా, మేము శివబాబా వద్దకు వచ్చాము, వారు ఈ భగీరథుడైన ప్రజాపిత బ్రహ్మా తనువులో ఉన్నారు, ఆత్మలమైన మన అందరి తండ్రి ఒక్క శివబాబాయే, వారు ఈ రథములో విరాజమానమై ఉన్నారు. ఇందులో పూర్తి పక్కా నిశ్చయముండాలి, ఇందులోనే మాయ సంశయములోకి తెస్తుంది. కన్య పతితో వివాహమైనప్పుడు, అతనితో నాకు చాలా సుఖం లభిస్తుందని అనుకుంటుంది కానీ ఏం సుఖం లభిస్తుంది, వెళ్ళిన వెంటనే అపవిత్రమవుతుంది. కుమారిగా ఉన్నప్పుడు తల్లి-తండ్రి మొదలైనవారందరూ తల వంచి నమస్కరిస్తారు ఎందుకంటే పవిత్రంగా ఉంటుంది. అపవిత్రమైన వెంటనే అందరి ముందు తల వంచడం ప్రారంభిస్తుంది. నేడు అందరూ ఆమె ముందు తల వంచుతారు, రేపు స్వయం ఆమే అందరి ముందు తల వంచుతుంది.

ఇప్పుడు పిల్లలైన మీరు సంగమయుగములో పురుషోత్తములుగా అవుతున్నారు. రేపు ఎక్కడుంటారు? నేడు ఈ ఇల్లు పరివారాలు అన్నీ ఎలా ఉన్నాయి? ఎంత మలినమై ఉన్నాయి? దీనిని వేశ్యాలయమని అంటారు. అందరూ విషము ద్వారా జన్మ తీసుకుంటారు. మీరే శివాలయంలో ఉండేవారు, నేటికి 5 వేల సంవత్సరాల క్రితం చాలా సుఖంగా ఉండేవారు. దుఃఖం యొక్క నామ రూపాలే ఉండేవి కావు. ఇప్పుడు మళ్ళీ అలా తయారయ్యేందుకు వచ్చారు. మనుష్యులకు శివాలయం గురించి తెలియనే తెలియదు. స్వర్గాన్ని శివాలయమని అంటారు. శివబాబా స్వర్గాన్ని స్థాపన చేశారు. బాబా అని అందరూ అంటారు కానీ తండ్రి ఎక్కడున్నారు? అని అడిగితే వారు సర్వవ్యాపి, కుక్క, పిల్లి, తాబేలు, చేపలలో ఉన్నారని అంటారు. ఎంత వ్యత్యాసముంది! తండ్రి చెప్తారు, మీరు పురుషోత్తములుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు అనుభవించి మీరు ఎలా అయ్యారు? నరకవాసులుగా అయ్యారు, కనుక ఓ పతితపావనా రండి అని అందరూ పాడతారు. ఇప్పుడు తండ్రి పావనంగా తయారుచేసేందుకు వచ్చారు. వారు చెప్తున్నారు, ఈ అంతిమ జన్మలో విషాన్ని త్రాగడము వదిలేయండి. అయినా అర్థం చేసుకోరు. ఆత్మలందరి యొక్క తండ్రి పవిత్రులవ్వండి అని ఇప్పుడు చెప్తున్నారు. అందరూ బాబా అని కూడా అంటారు, మొట్టమొదట ఆత్మకు ఆ తండ్రి గుర్తు వస్తారు, తర్వాత ఈ తండ్రి. నిరాకారములో ఆ తండ్రి, సాకారములో మళ్ళీ ఈ తండ్రి. సుప్రీమ్ ఆత్మ ఈ పతితాత్మలకు కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీరు కూడా మొదట పవిత్రంగా ఉండేవారు. తండ్రితో పాటు ఉండేవారు, మళ్ళీ ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఈ చక్రాన్ని మంచి రీతిలో అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం సత్యయుగానికి, కొత్త ప్రపంచానికి వెళ్ళబోతున్నాము. స్వర్గానికి వెళ్ళాలని మీకు కూడా ఆశ ఉంది కదా. కృష్ణుని వంటి పుత్రుడు లభించాలని మీరు అనేవారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అలా తయారుచేసేందుకే వచ్చాను. అక్కడ పిల్లలు ఉండడమే కృష్ణుని వలె ఉంటారు. సతోప్రధాన పుష్పాలు కదా. ఇప్పుడు మీరు కృష్ణపురికి వెళ్తారు. మీరైతే స్వర్గానికి యజమానులుగా అవుతారు. నేను పుష్పంగా అయ్యానా? ఎక్కడైనా దేహ అహంకారంతో ముల్లుగా అవ్వడం లేదు కదా? అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. మనుష్యులు స్వయాన్ని ఆత్మ అని భావించేందుకు బదులు దేహమని భావిస్తారు. ఆత్మను మర్చిపోవడం వలన తండ్రిని కూడా మర్చిపోతారు. తండ్రిని తండ్రి ద్వారానే తెలుసుకోవడం వలన తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి వారసత్వం అందరికీ లభిస్తుంది. వారసత్వం లభించనివారు ఒక్కరు కూడా ఉండరు. తండ్రే వచ్చి అందరినీ పావనంగా తయారుచేస్తారు, నిర్వాణధామానికి తీసుకెళ్తారు. జ్యోతి జ్యోతిలో లీనమయిందని, బ్రహ్మ తత్వములో లీనమయిందని వారు చెప్తారు. జ్ఞానం కొంచెం కూడా లేదు. మనం ఎవరి దగ్గరకు వచ్చామన్నది మీకు తెలుసు. ఇది ఏ మనుష్యుల సత్సంగం కాదు. ఆత్మలు పరమాత్మ నుండి విడిపోయారు, ఇప్పుడు వారి సాంగత్యం లభించింది. ఈ సత్యాతి-సత్యమైన సత్య సాంగత్యము 5 వేల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. సత్యయుగం, త్రేతా యుగంలో సత్సంగము ఉండదు. కానీ భక్తిమార్గములో అయితే అనేకానేక సత్సంగాలు ఉంటాయి. ఇప్పుడు వాస్తవానికి సత్యమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు మీరు వారి సాంగత్యములో కూర్చొని ఉన్నారు. మనం ఈశ్వరీయ విద్యార్థులము, భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అనే స్మృతి ఉన్నా అహో సౌభాగ్యము.

మన తండ్రి ఇక్కడున్నారు, వారు తండ్రి, టీచరు మరియు గురువుగా కూడా అవుతారు. మూడు పాత్రలను ఇప్పుడు అభినయిస్తున్నారు. పిల్లలను తమవారిగా చేసుకుంటారు. తండ్రి చెప్తారు, స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రిని స్మృతి చేయడం వలన మాత్రమే పాపాలు సమాప్తమవుతాయి. తర్వాత మీకు ప్రకాశ కిరీటం లభిస్తుంది. ఇది కూడా ఒక గుర్తు. అంతేకాని వెలుగు కనిపిస్తుందని కాదు. ఇది పవిత్రతకు గుర్తు. ఈ జ్ఞానం ఇతరులెవ్వరికీ లభించదు. ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారిలో పూర్తి జ్ఞానముంది. తండ్రి చెప్తారు, నేను మనుష్య సృష్టికి బీజరూపుడను. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షం. ఇది కల్పవృక్షం కదా. మొదట దైవీ పుష్పాల వృక్షం ఉండేది. ఇప్పుడు ముళ్ళ అడవిగా అయిపోయింది. ఎందుకంటే 5 వికారాలు వచ్చేశాయి. మొట్టమొదట ముఖ్యమైనది దేహాభిమానం. అక్కడ దేహాభిమానముండదు. మేము ఆత్మలమని మాత్రమే తెలుసు, కాని పరమాత్మను గురించి తెలియదు. మేము ఆత్మలము, అంతే. ఇక వేరే ఏ జ్ఞానమూ ఉండదు. (సర్పము యొక్క ఉదాహరణ) జన్మ-జన్మాంతరాల యొక్క పాత కుళ్ళిపోయిన శరీరమేదైతే ఉందో ఇప్పుడు దాన్ని వదిలిపెట్టాలని ఇప్పుడు మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ఆత్మ, శరీరం రెండూ పతితంగా ఉన్నాయి. ఆత్మ పవిత్రమైతే ఈ శరీరం వదిలిపోతుంది. ఆత్మలన్నీ ఇంటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతుంది, తండ్రి వద్దకు వెళ్ళాలి కనుక ఇంటిని స్మృతి చేయాలనే జ్ఞానం మీకిప్పుడుంది. ఈ దేహాన్ని వదిలేయాలి, శరీరం సమాప్తమైతే ప్రపంచం కూడా సమాప్తమైనట్లే, మళ్ళీ కొత్త ఇంటికి వెళ్తే కొత్త సంబంధాలు ఏర్పడతాయి. వారు మళ్ళీ పునర్జన్మలు ఇక్కడే తీసుకుంటారు. మీరు పునర్జన్మలు పుష్పాల ప్రపంచంలో తీసుకుంటారు. దేవతలను పవిత్రులని అంటారు. మనమే పుష్పాలుగా ఉండేవారము, తర్వాత ముళ్ళుగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ పుష్పాల ప్రపంచంలోకి వెళ్ళాలి అని మీకు తెలుసు. ముందు-ముందు మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి. అవి ఆటపాటల వంటివి. మీరా ధ్యానములో ఆడుకునేవారు, ఆమెకు జ్ఞానం లేదు. మీరా వైకుంఠానికేమీ వెళ్ళలేదు. ఇక్కడే ఎక్కడో ఉండొచ్చు. ఈ బ్రాహ్మణ కులంలో ఉన్నట్లైతే ఇక్కడే జ్ఞానం తీసుకుంటూ ఉండొచ్చు. నాట్యం చేసినందున వైకుంఠానికి వెళ్ళిపోయారని కాదు. అలా అయితే చాలామంది నాట్యం చేసేవారు. కొంతమంది ధ్యానములో వెళ్ళి చూసి వచ్చినవారు మళ్ళీ వెళ్ళి వికారులుగా అయిపోయారు. ఉన్నతమైతే వైకుంఠ రసాన్ని చవిచూస్తారు.... అని గాయనం కూడా ఉంది కదా. తండ్రి హెచ్చరిస్తున్నారు - మీరు జ్ఞాన-యోగాలు నేర్చుకుంటేనే వైకుంఠానికి యజమానులుగా అవ్వగలరు. తండ్రిని వదిలేస్తే బురదలోకి (వికారాల్లోకి) వెళ్ళిపోతారు. ఆశ్చర్యంగా తండ్రికి చెందినవారిగా అవుతారు, జ్ఞానం వింటారు, వినిపిస్తారు మళ్ళీ పారిపోతారు. అహో మాయా, ఎంత పెద్ద దెబ్బ తగులుతుంది. ఇప్పుడు తండ్రి యొక్క శ్రీమతంపై మీరు దేవతలుగా అవుతారు. ఆత్మ, శరీరం రెండూ శ్రేష్ఠమైనవి కావాలి కదా. దేవతల జన్మ వికారాల ద్వారా జరగదు. అది నిర్వికారి ప్రపంచం. అక్కడ 5 వికారాలు ఉండవు. శివబాబా స్వర్గాన్ని తయారుచేశారు. ఇప్పుడు నరకం వలె ఉంది. ఇప్పుడు మీరు మళ్ళీ స్వర్గవాసులుగా అయ్యేందుకు వచ్చారు, ఎవరైతే బాగా చదువుకుంటారో వారే స్వర్గంలోకి వెళ్తారు. మీరు మళ్ళీ చదువుకుంటారు, అలా కల్ప-కల్పం చదువుకుంటూ ఉంటారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది తయారైన డ్రామా, దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఏమేం చూస్తున్నారో, ఇప్పుడు దోమ ఎగిరిందనుకోండి, కల్పం తర్వాత కూడా ఎగురుతుంది. దీనిని అర్థం చేసుకునేందుకు చాలా మంచి బుద్ధి కావాలి. షూటింగ్ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది కర్మక్షేత్రము. పాత్రను అభినయించేందుకు పరంధామం నుండి ఇక్కడకు వచ్చారు.

ఇప్పుడు చదువులో కొందరు చాలా చురుకైనవారిగా అయిపోతారు, కొందరు ఇంకా చదువుతున్నారు. కొందరు చదువుతూ-చదువుతూ పాతవారి కంటే కూడా చురుకైనవారిగా అయిపోతారు. జ్ఞానసాగరులైతే అందరినీ చదివిస్తూ ఉంటారు. తండ్రికి చెందినవారిగా అయితే విశ్వం యొక్క వారసత్వం మీదవుతుంది. అయితే అందుకు పతితమైన మీ ఆత్మను తప్పకుండా పావనంగా తయారుచేసుకోవాలి, దాని కొరకు అతి సహజమైన పద్ధతి, అనంతమైన తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీరు ఈ విధంగా తయారవుతారు. పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచంపై వైరాగ్యము కలగాలి. మిగిలినవి ముక్తిధామం, జీవన్ముక్తిధామం, ఒక్కరిని తప్ప మిగిలిన వారెవ్వరినీ మనం స్మృతి చేయము. ఉదయముదయమే లేచి "మేము అశరీరులుగా వచ్చాము, మళ్ళీ అశరీరులుగా వెళ్ళాలి” అని అభ్యాసం చెయ్యండి. మళ్ళీ ఏ దేహధారులనైనా మేము ఎందుకు స్మృతి చేయాలి? ఉదయం అమృతవేళ లేచి స్వయంతో ఇలా మాట్లాడుకోవాలి. ఉదయాన్ని అమృతవేళ అని అంటారు. జ్ఞానసాగరుని వద్ద జ్ఞానామృతం ఉంది. ఉదయం సమయం చాలా మంచిదని జ్ఞానసాగరుడు చెప్తున్నారు. ఉదయం లేచి చాలా ప్రేమతో బాబా, మీరు 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ లభించారని తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు నాశనమవుతాయి. శ్రీమతంపై నడవాలి. తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేయడం అలవాటైపోతే సంతోషంలో కూర్చొని ఉంటారు. దేహ భానం తొలగిపోతూ ఉంటుంది. తర్వాత దేహ భానం ఉండదు. చాలా సంతోషముంటుంది. మీరు పవిత్రంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండేవారు. మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి. మొట్టమొదట ఎవరైతే వస్తారో వారు తప్పకుండా 84 జన్మలు తీసుకుంటారు. తర్వాత చంద్రవంశీయులు కొద్దిగా తక్కువ, ఇస్లామీయులు వారి కంటే తక్కువ. నంబరువారుగా వృక్షం వృద్ధి చెందుతుంది కదా. ముఖ్యమైనది దైవీ ధర్మము మళ్ళీ దాని నుండి 3 ధర్మాలు వెలువడుతాయి. తర్వాత కొమ్మలు-రెమ్మలు వెలువడుతాయి. ఇప్పుడు మీరు డ్రామా గురించి తెలుసుకున్నారు. ఈ డ్రామా పేను వలె చాలా నెమ్మది-నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది. క్షణ-క్షణం టిక్ టిక్ అని నడుస్తూ ఉంటుంది అందుకే సెకండులో జీవన్ముక్తి అని గాయనం చేయబడుతుంది. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది, బాబా, మేము మీ పిల్లలము. మేము స్వర్గంలో ఉండాలి. మరి నరకంలో ఎందుకున్నాము. తండ్రి స్వర్గ స్థాపన చేసేవారు, మరి నరకంలో ఎందుకు పడ్డాము. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు స్వర్గంలో ఉండేవారు, 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ మీరు అంతా మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ నా మతాన్ని అనుసరించండి. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఎందుకంటే ఆత్మలోనే మలినం చేరుతుంది. శరీరం ఆత్మకు ఆభరణం వంటిది. ఆత్మ పవిత్రంగా ఉంటే, శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. మీకు తెలుసు, మనం స్వర్గంలో ఉండేవారిమి, ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు కనుక వారి నుండి వారసత్వము పూర్తిగా తీసుకోవాలి కదా. 5 వికారాలను వదలాలి. దేహాభిమానాన్ని వదలాలి. కార్యవ్యవహారాలు చేసుకుంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఆత్మ తన ప్రియుడిని అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రియుడు వచ్చారు. వారు చెప్తున్నారు, మీరు కామచితిపై కూర్చుని నల్లగా అయిపోయారు. ఇప్పుడు నేను మళ్ళీ సుందరంగా తయారుచేసేందుకు వచ్చాను. దాని కొరకు ఈ యోగాగ్ని ఉంది. జ్ఞానాన్ని చితి అని అనరు. యోగాన్ని చితి అని అంటారు. స్మృతి అనే చితిపై కూర్చుంటే వికర్మలు వినాశనమవుతాయి. జ్ఞానాన్ని నాలెడ్జ్ అని అంటారు. తండ్రి మీకు సృష్టి ఆదిమధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఉన్నతాతి ఉన్నతమైనవారు తండ్రి, తర్వాత బ్రహ్మా-విష్ణు-శంకరులు, తర్వాత సూర్య వంశము వారు, చంద్ర వంశము వారు, తర్వాత ఇతర ధర్మాల కొమ్మలున్నాయి. వృక్షం ఎంత పెద్దదిగా అవుతుంది. ఇప్పుడు ఈ వృక్షానికి పునాది లేదు అందువలన మర్రి వృక్షం ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. దేవీ దేవతా ధర్మము ప్రాయః లోపమైపోయింది. ధర్మ భ్రష్టులుగా, కర్మ భ్రష్టులుగా అయిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రేష్ఠులుగా అయ్యేందుకు శ్రేష్ఠ కర్మలు చేస్తారు. మీ దృష్టిని సివిల్ (పవిత్రం)గా చేసుకుంటున్నారు. మీరిప్పుడు భ్రష్ట కర్మలు చేయకూడదు. ఎలాంటి కుదృష్టి ఉండకూడదు. మేము లక్ష్మిని వరించేందుకు యోగ్యులుగా అయ్యామా? మేము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తున్నామా? అని స్వయాన్ని పరిశీలించుకోండి. రోజూ మీ లెక్కను చూసుకోండి. రోజంతటిలో దేహాభిమానంలోకి వచ్చి ఏ వికర్మలు చేయలేదు కదా? లేదంటే 100 రెట్లు అయిపోతుంది. మాయ చార్టు కూడా పెట్టనివ్వదు. 2-4 రోజులు వ్రాసి మళ్ళీ వదిలేస్తారు. తండ్రికి చింత ఉంటుంది కదా. దయ కలుగుతుంది - పిల్లలు నన్ను స్మృతి చేస్తే వారి పాపము సమాప్తమైపోతుంది. ఇందులో శ్రమ ఉంది. స్వయానికి నష్టం కలిగించుకోకూడదు. జ్ఞానమైతే చాలా సహజం. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఉదయం అమృతవేళలో లేచి తండ్రితో మధురాతి మధురమైన మాటలు మాట్లాడాలి. అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయాలి. బాబా స్మృతి తప్ప ఇంకేదీ స్మృతి రాని విధంగా ధ్యానం పెట్టాలి.

2. మీ దృష్టిని చాలా శుద్ధంగా, పవిత్రంగా చేసుకోవాలి. దైవీ పుష్పాల తోట తయారవుతూ ఉంది. అందువలన పుష్పంగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ముల్లులా తయారవ్వకూడాదు.

వరదానము:-

ప్రతి సంకల్పం, సమయం, వృత్తి మరియు కర్మ ద్వారా సేవ చేసే నిరంతర సేవాధారి భవ

ఎలాగైతే తండ్రి అతి ప్రియమనిపిస్తారో, తండ్రి లేకుంటే జీవితమే లేదనిపిస్తుందో, అలా సేవ లేకుంటే జీవితమే లేదు. నిరంతర యోగితో పాటు నిరంతర సేవాధారిగా అవ్వండి. నిద్రలో కూడా సేవ జరగాలి. నిదురించునప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూస్తే మీ ముఖం ద్వారా శాంతి, ఆనందాల వైబ్రేషన్లు అనుభవమవ్వాలి. ప్రతి కర్మేంద్రియం ద్వారా తండ్రి స్మృతినిప్పించే సేవ చేస్తూ ఉండండి. మీ శక్తిశాలి వృత్తి ద్వారా వైబ్రేషన్లు వ్యాపింపజేస్తూ ఉండండి, కర్మ ద్వారా కర్మయోగీ భవ అనే వరదానాన్ని ఇస్తూ ఉండండి, ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకుంటూ ఉండండి. అప్పుడు నిరంతర సేవాధారులు అనగా సర్వీసబుల్ అని అంటారు.

స్లోగన్:-

మీ ఆత్మిక పర్సనాలిటీని స్మృతిలో ఉంచుకుంటే, మాయాజీతులుగా అయిపోతారు.