06-10-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - ఈ పాత ప్రపంచం పట్ల అనంతమైన వైరాగులుగా అవ్వండి ఎందుకంటే తండ్రి మీ కోసం స్వర్గం రూపీ కొత్త ఇంటిని తయారుచేస్తున్నారు

ప్రశ్న:-

ఈ అవినాశీ రుద్ర యజ్ఞంలో ఏయే విషయాల కారణంగానే విఘ్నాలు కలుగుతాయి?

జవాబు:-

ఇది శివబాబా ద్వారా రచించబడిన అవినాశీ రుద్ర యజ్ఞము, ఇందులో మీరు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు పవిత్రంగా అవుతారు, భక్తి మొదలైనవి వదిలేస్తారు, ఈ కారణంగానే విఘ్నాలు కలుగుతాయి. మనుష్యులు శాంతి ఏర్పడాలి, వినాశనం జరగకూడదు అని అంటారు కానీ తండ్రి ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని పాత ప్రపంచ వినాశనం కోసమే రచించారు. దీని తర్వాతనే శాంతి ప్రపంచం వస్తుంది.

ఓంశాంతి.

ఓంశాంతి అర్థాన్ని తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. ఆత్మనైన నా స్వధర్మం శాంతి. శాంతిధామానికి వెళ్ళేందుకు పురుషార్థమేమీ చేయాల్సిన అవసరం లేదు. ఆత్మ స్వయంగా శాంతి స్వరూపము, శాంతిధామ నివాసి. ఇక్కడైతే కొద్ది సమయం కోసం శాంతిగా ఉండగలరు. ఆత్మ అంటుంది - నా కర్మేంద్రియాల వాయిద్యం అలసిపోయింది, నేను నా స్వధర్మంలో స్థితి అవుతాను, శరీరం నుండి వేరవుతాను. కానీ కర్మలైతే చేయాల్సిందే. ఎంతవరకని శాంతిగా కూర్చుని ఉంటారు. ఆత్మ అంటుంది - నేను శాంతిదేశ నివాసిని. కేవలం ఇక్కడ శరీరంలోకి రావడంతో నేను టాకీగా అయ్యాను. నేను ఆత్మను, ఇది ఈ శరీరం. ఆత్మయే పతితంగా మరియు పావనంగా అవుతుంది. ఆత్మ పతితంగా అయితే శరీరం కూడా పతితంగా అవుతుంది - ఎందుకంటే సత్యయుగంలో 5 తత్వాలు కూడా సతోప్రధానంగా ఉంటాయి మరియు ఇక్కడ 5 తత్వాలు తమోప్రధానంగా ఉన్నాయి. బంగారంలో మాలిన్యం చేరడంతో బంగారం పతితంగా అవుతుంది. తర్వాత దానిని స్వచ్ఛంగా చేసేందుకు అగ్నిలో వేయడం జరుగుతుంది. దానిని యోగాగ్ని అని అనరు. యోగం కూడా అగ్ని వంటిది, దీని ద్వారా పాపాలు భస్మమైపోతాయి. ఆత్మను పతితం నుండి పావనంగా తయారుచేసేవారు పరమాత్మ. కేవలం వారి పేరు మాత్రమే తీసుకుంటారు. వారిని, ఓ పతితపావనా రండి, అని పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ పతితంగా, తమోప్రధానంగా అవ్వాల్సిందే. ఇది వృక్షము కదా. ఆ స్థూలమైన వృక్షానికి బీజం కింద ఉంటుంది. దీని బీజం పైన ఉన్నారు. తండ్రిని పిలిచేటప్పుడు బుద్ధి పైకి వెళ్తుంది. మీరు ఎవరి నుండైతే వారసత్వం తీసుకుంటున్నారో, వారిప్పుడు కిందకు వచ్చి ఉన్నారు. నాకు కూడా రావాల్సి ఉంటుంది అని అంటారు. నా ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం ఎన్నో వెరైటీ ధర్మాలతో కూడినది. ఇప్పుడది తమోప్రధానంగా, పతితంగా అయింది, శిథిలావస్థను చేరుకుంది. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు - సత్యయుగంలో మొట్టమొదట దేవీ-దేవతలుంటారు, ఇప్పుడు కలియుగంలో అసురులున్నారు. ఇకపోతే, అసురులకు మరియు దేవతలకు మధ్యన యుద్ధమేమీ జరగలేదు. మీరు ఈ ఆసురీ 5 వికారాలపై యోగబలంతో విజయం పొందుతారు. అంతేకానీ, హింసాత్మక యుద్ధం యొక్క విషయమేమీ లేదు. మీరు ఏ రకంగానూ హింస చేయరు. మీరు ఎవరినీ ముట్టుకోను కూడా ముట్టుకోరు. మీరు డబల్ అహింసకులు. కామ ఖడ్గాన్ని ఉపయోగించడమనేది అన్నింటికంటే పెద్ద పాపము. తండ్రి అంటారు - ఈ కామ ఖడ్గం ఆదిమధ్యాంతాలు దుఃఖమిస్తుంది. వికారాల్లోకి వెళ్ళకూడదు. దేవతల ఎదురుగా - మీరు సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు అని మహిమను పాడుతారు. ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా అర్థం చేసుకుంటుంది. మేము పతితులుగా అయిపోయామని అంటారు, అంటే తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు పావనంగా ఉండేవారు. అందుకే కదా, మేము పతితులుగా అయ్యామని అంటారు. ఓ పతితపావనా రండి, అని పిలుస్తారు కూడా. పావనంగా ఉన్నప్పుడు ఎవరూ పిలవరు. దానిని స్వర్గమని అంటారు. ఇక్కడైతే సాధు సత్పురుషులు మొదలైనవారు, పతితపావన సీతా-రామ..... అంటూ ఎంతగా జపిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇలా పాడుతూనే ఉంటారు. ఈ ప్రపంచమంతా పతితంగా ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది రావణ రాజ్యం కదా, రావణుడిని కాలుస్తారు కానీ అతని రాజ్యం ఎప్పటి నుండి మొదలైంది అనేది ఎవరికీ తెలియదు. భక్తి మార్గం యొక్క సామాగ్రి ఎంతో ఉంది. ఒకరు ఒకటి చేస్తారు, మరొకరు మరొకటి చేస్తారు. సన్యాసులు కూడా ఎన్ని రకాల యోగాలు నేర్పిస్తారు. వాస్తవానికి యోగమని దేనినంటారు అనేది ఎవరికీ తెలియదు. ఇందులో ఎవరి దోషము లేదు. ఇది తయారై తయారవుతున్న డ్రామా. నేను రానంతవరకు వీరికి తమ పాత్రలను అభినయించాల్సి ఉంటుంది. జ్ఞానం మరియు భక్తి, జ్ఞానమనగా పగలు, సత్య-త్రేతా యుగాలు. భక్తి అనగా రాత్రి, ద్వాపర-కలియుగాలు. తర్వాత వైరాగ్యము అనగా పాత ప్రపంచం పట్ల వైరాగ్యము. ఇది అనంతమైన వైరాగ్యము, వారిది హద్దు వైరాగ్యము. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. కొత్త ఇంటిని కట్టుకుంటున్నప్పుడు పాతదాని పట్ల వైరాగ్యం కలుగుతుంది.

అనంతమైన తండ్రి ఎలా ఉన్నారో చూడండి! మీకు స్వర్గం రూపీ ఇంటిని తయారుచేసి ఇస్తారు. స్వర్గము కొత్త ప్రపంచము, నరకము పాత ప్రపంచము. కొత్తది నుండి పాతదిగా అవుతుంది, మళ్ళీ కొత్తదిగా అవుతుంది. కొత్త ప్రపంచ ఆయువు ఎంత ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం పాత ప్రపంచంలో ఉంటూ కొత్తదానిగా తయారుచేస్తున్నాము. మనం పాత శ్మశానవాటికపై పరిస్తాన్ ను తయారుచేస్తున్నాము. అదే యమునా నదీ తీరం ఉంటుంది, దానిపై మహళ్ళు తయారవుతాయి. ఈ ఢిల్లీయే యమునా నదీ తీరంలో ఉంటుంది. పాండవులకు కోటలు ఉండేవన్నట్లు చూపిస్తారు కదా, అవన్నీ డ్రామా ప్లాన్ అనుసారంగా తప్పకుండా మళ్ళీ తయారవుతాయి. మీరు ఎలాగైతే యజ్ఞాలు, జప తపాదులు, దానాలు మొదలైనవి చేసేవారో, అవి మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ముందుగా శివునికి భక్తి చేస్తారు, ఫస్ట్ క్లాస్ మందిరాలను తయారుచేస్తారు, దానిని అవ్యభిచారి భక్తి అని అంటారు. ఇప్పుడు మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు. ఇది అవ్యభిచారి జ్ఞానము. ఇప్పుడు మీరు ఒక్క శివబాబా నుండే వింటారు. ఇంతకుముందు మీరు వారికి భక్తి చేసారు. ఆ సమయంలో వేరే ధర్మాలేవీ ఉండేవి కావు. ఆ సమయంలో మీరు చాలా సుఖంగా ఉంటారు. దేవతా ధర్మం చాలా సుఖమిచ్చేటువంటి ధర్మం. ఆ పేరును తీసుకున్నప్పుడు నోరు మధురంగా అవుతుంది. మీరు ఒక్క తండ్రి నుండి మాత్రమే జ్ఞానం వింటారు. తండ్రి అంటారు - మీరు ఇతరులెవ్వరి నుండి వినకండి. ఇది మీ అవ్యభిచారి జ్ఞానము. మీరు అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. మీకు తండ్రి నుండే నంబరువారు పురుషార్థానుసారంగా వారసత్వం లభిస్తుంది. తండ్రి కొద్ది సమయం కోసం సాకారంలోకి వచ్చారు. బాబా అంటారు - నాకు పిల్లలైన మీకు మాత్రమే జ్ఞానం ఇవ్వాల్సి ఉంటుంది, ఇది నా పర్మనెంటు శరీరం కాదు, నేను వీరిలో ప్రవేశిస్తాను. శివ జయంతి తర్వాత వెంటనే గీతా జయంతి జరుగుతుంది. అప్పటి నుండి వారు ఈ జ్ఞానం వినిపించడం మొదలుపెడతారు. ఈ ఆత్మిక విద్యను పరమ ఆత్మ ఇస్తున్నారు. ఇక్కడ నీటి విషయమేమీ లేదు. నీటిని జ్ఞానమని అనరు. పతితం నుండి పావనంగా జ్ఞానం ద్వారా అవుతారు, నీటి ద్వారా పావనంగా అవ్వరు. నదులైతే మొత్తం ప్రపంచమంతటా ఉన్నాయి. ఇక్కడ జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చి వీరిలో ప్రవేశించి జ్ఞానం వినిపిస్తారు. ఇక్కడ గోముఖానికి వెళ్తారు. వాస్తవానికి గోముఖమంటే చైతన్యంలో ఉన్న మీరే. మీ నోటి నుండి జ్ఞానామృతం వెలువడుతుంది. గోవు నుండైతే పాలు లభిస్తాయి, అంతేకానీ నీటి విషయం కాదు. ఈ విషయాలన్నింటినీ సర్వుల సద్గతిదాత అయిన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. రావణుడిని ఎందుకు కాలుస్తారు అనేది మీకు ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు అనంతమైన దసరా జరగనున్నదని మీకు తెలుసు. ఈ ప్రపంచమంతా ఒక ద్వీపం వలె ఉంది. రావణ రాజ్యం మొత్తం సృష్టిపై ఉంది. వానర సైన్యముండేదని, వానరులు వారధి కట్టారని.... శాస్త్రాలలో ఉంది. ఇవన్నీ కల్పిత కథలు. భక్తి కొనసాగుతుంది, ముందు అవ్యభిచారి భక్తి ఉంటుంది, తర్వాత వ్యభిచారి భక్తి ఉంటుంది. దసరా, రక్షాబంధనం ఇవన్నీ ఇప్పటి పండుగలే. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. ఇప్పుడు కృష్ణపురి స్థాపనవుతుంది. నేడు కంసపురి ఉంది. రేపు కృష్ణపురి ఉంటుంది. కంసుడు అని ఆసురీ సంప్రదాయం వారిని అంటారు. పాండవులకు మరియు కౌరవులకు మధ్యన యుద్ధమేమీ జరగలేదు. కృష్ణుని జన్మ సత్యయుగంలో జరుగుతుంది. వారు మొదటి రాకుమారుడు. వారు స్కూల్లో చదువుకునేందుకు వెళ్తారు, పెద్దవారైన తర్వాత రాజ్య సింహాసనంపై కూర్చుంటారు. మహిమంతా పతితులను పావనంగా తయారుచేసే శివబాబాదే. ఇకపోతే, ఈ రాసలీలలు చేయడమంటే పరస్పరంలో సంతోషాన్ని పంచుకోవడము వంటిది. ఇకపోతే, కృష్ణుడు ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించడమనేది ఎలా జరుగుతుంది. తండ్రి అంటారు - భక్తి చేయకండి అని ఎవరికీ చెప్పకూడదు. భక్తి దానంతట అదే వదిలిపోతుంది. భక్తి వదిలేస్తారు, వికారాలను వదిలేస్తారు, దీని గురించే గొడవలు జరుగుతాయి. తండ్రి అంటారు - నేను రుద్ర యజ్ఞాన్ని రచిస్తాను, ఇందులో ఆసురీ సంప్రదాయం వారి విఘ్నాలు కలుగుతాయి. ఇది శివబాబా యొక్క అనంతమైన యజ్ఞము. దీని ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతారు. జ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల ప్రకటితమయిందని అంటూ ఉంటారు. పాత ప్రపంచ వినాశనం జరిగిన తర్వాత, మీరు కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. మనుష్యులంటారు - మేము శాంతి ఏర్పడాలి అని అంటాము, ఈ బి.కె.లు వినాశనమవ్వాలని అంటారు. జ్ఞానం అర్థం చేసుకోని కారణంగా ఈ విధంగా అంటారు. తండ్రి అంటారు - ఈ మొత్తం పాత ప్రపంచమంతా ఈ జ్ఞాన యజ్ఞంలో స్వాహా అవుతుంది. పాత ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అందరూ ఆవగింజల వలె నలిగి సమాప్తమైపోతారు. ఇకపోతే, కొంతమంది ఆత్మలు రక్షించబడతారు. ఆత్మ అయితే అవినాశీ. ఇప్పుడు అనంతమైన హోలిక జరగనున్నది. ఇందులో శరీరాలన్నీ సమాప్తమైపోతాయి. ఇకపోతే, ఆత్మలు పవిత్రంగా అయి వెళ్ళిపోతాయి. అగ్నిలో వేసినప్పుడు వస్తువు శుద్ధంగా అవుతుంది. శుద్ధత కోసమే యజ్ఞం చేస్తారు. అవన్నీ భౌతిక విషయాలు. ఇప్పుడు ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది. వినాశనానికి ముందే తప్పకుండా స్థాపన జరగాలి. ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు - ముందు స్థాపన జరుగుతుంది, తర్వాత వినాశనం జరుగుతుంది అని చెప్పండి. బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది. ప్రజాపిత బ్రహ్మా ప్రసిద్ధమైనవారు. ఆదిదేవ్, ఆదిదేవి ఉన్నారు. జగదంబకు లక్షలాది మందిరాలు ఉన్నాయి. వారి పేరు మీద ఎన్ని మేళాలు జరుగుతాయి. మీరు జగదంబ పిల్లలు జ్ఞాన-జ్ఞానేశ్వరీలు, తర్వాత రాజ-రాజేశ్వరీలుగా అవుతారు. ఇప్పుడు మీరు చాలా ధనవంతులుగా అవుతారు. తర్వాత భక్తి మార్గంలో, దీపావళి రోజున లక్ష్మి నుండి వినాశీ ధనాన్ని కోరుకుంటారు. ఇక్కడ మీకు అన్నీ లభిస్తాయి. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ. అక్కడ 150 సంవత్సరాల ఆయుష్షు ఉంటుంది. ఇక్కడ మీరు ఎంతగా యోగం జోడిస్తూ ఉంటారో, అంతగా ఆయుష్షు పెరుగుతూ ఉంటుంది. మీరు ఈశ్వరునితో యోగం జోడిస్తూ యోగేశ్వరులుగా తయారవుతారు.

తండ్రి అంటారు - నేను చాకలివాడిని, మురికి పట్టిన ఆత్మలందరినీ శుభ్రం చేస్తాను. తర్వాత శరీరాలు కూడా శుద్ధమైనవి లభిస్తాయి. నేను సెకండులో ప్రపంచంలోని వస్త్రాలన్నింటినీ శుభ్రం చేస్తాను. కేవలం మన్మనాభవగా ఉంటే ఆత్మ మరియు శరీరం, పవిత్రంగా తయారవుతాయి. కనుక ఇది మ్యాజిక్ కదా. దీనితో సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది కావున ఇది ఎంత సహజమైన ఉపాయము. నడుస్తూ-తిరుగుతూ కేవలం తండ్రిని స్మృతి చేయండి. మీకు ఇంకే కష్టము ఇవ్వను. ఇప్పుడు మీరు ఒక్క సెకండులో ఎక్కే కళలోకి వెళ్తారు. తండ్రి అంటారు - నేను పిల్లలైన మీకు సేవకుడినై వచ్చాను. ఓ పతిత పావనా, వచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేయండి అని మీరు పిలిచారంటే నేను సేవకుడిని అయినట్లే కదా. మీరు ఎప్పుడైతే చాలా పతితంగా అవుతారో, అప్పుడు చాలా గట్టిగా పిలుస్తారు. ఇప్పుడు నేను వచ్చాను. నేను కల్ప-కల్పము వచ్చి పిల్లలకు ఈ మంత్రాన్ని ఇస్తాను - నన్ను స్మృతి చేయండి. మన్మనాభవ అర్థం కూడా ఇదే. తర్వాత మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారు. మీరు విష్ణుపురి రాజ్యం తీసుకునేందుకే వచ్చారు. రావణపురి తర్వాత విష్ణుపురి ఉంటుంది. కంసపురి తర్వాత కృష్ణపురి ఉంటుంది. ఇది ఎంత సులభంగా అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి అంటారు - కేవలం ఈ పాత ప్రపంచం పట్ల మమకారాన్ని తొలగించండి. ఇప్పుడు మనం 84 జన్మలు పూర్తి చేసుకున్నాము. ఈ పాత శరీరాలను వదిలి కొత్త ప్రపంచంలోకి వెళ్తాము. స్మృతి ద్వారానే మీ పాపాలు నశిస్తాయి. అంత ధైర్యం చేయాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నోటి నుండి సదా జ్ఞానామృతమే వెలువడాలి. జ్ఞానం ద్వారానే అందరికీ సద్గతిని అందించాలి. ఒక్క తండ్రి నుండే జ్ఞానం వినాలి, ఇతరుల నుండి కాదు.

2. ఎక్కే కళలోకి వెళ్ళేందుకు నడుస్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయాలి. ఈ పాత ప్రపంచం, పాత శరీరం పట్ల మమకారాన్ని తొలగించాలి.

వరదానము:-

ఒకే మార్గం మరియు ఒక్కరితోనే సంబంధం ఉంచుకునే సంపూర్ణ ఫరిశ్తా భవ

నిరాకార రూపంలో మరియు సాకార రూపంలో, ఒక్క తండ్రితో బుద్ధి యొక్క సాంగత్యం మరియు సంబంధం పక్కాగా ఉన్నట్లయితే ఫరిశ్తాగా అవుతారు. ఎవరికైతే సర్వ సంబంధ-బాంధవ్యాలు ఒక్కరితోనే ఉన్నాయో, వారే సదా ఫరిశ్తాలు. ఎలాగైతే గవర్నమెంటు ఈ దారి మూసివేయబడింది అని దారిలో బోర్డును పెడుతుందో, అలా అన్ని దారులను మూసేస్తే బుద్ధి భ్రమించడం ఆగిపోతుంది. బాప్ దాదా ఆజ్ఞ ఏమిటంటే - ముందు అన్ని దారులను మూసివేయండి, దీనితో సహజంగా ఫరిశ్తాలుగా అవుతారు.

స్లోగన్:-

సదా సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలలో ఉండడమే మాయ నుండి రక్షించుకునే సాధనము.


మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు - నిరంతరం ఈశ్వరీయ స్మృతిలో కూర్చోవడము

ఇప్పుడు మనం పరమాత్మ స్మృతిలో కూర్చున్నప్పుడు, కూర్చోవడమంటే అర్థమేమిటి? మనం పరమాత్మ స్మృతిలో కేవలం కూర్చోవడమే కాదు, కానీ ఈశ్వరీయ స్మృతిని నడుస్తూ-తిరుగుతూ నిత్యం, అన్ని వేళలా చేస్తూ ఉండాలి. అంతేకాక, ఎవరి పరిచయమైతే మనకు తెలుసో, ఎవరి నామ రూపాలైతే మనకు తెలుసో, వారి స్మృతే ఉంటుంది. ఒకవేళ మనం ఈశ్వరుడు నామ-రూపాలకు అతీతమైనవారు అని అంటే, అప్పుడు ఏ రూపాన్ని స్మృతి చేయాలి? ఒకవేళ ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అంటే, వారు సర్వత్రా వ్యాపించి ఉన్నారని అర్థము, అటువంటప్పుడు ఎవరిని స్మృతి చేయాలి. ఒకవేళ స్మృతి అనే పదముంది అంటే, తప్పకుండా స్మృతికి రూపమనేది ఉంటుంది. స్మృతి చేసే విషయంలో - ఒకరు స్మృతి చేసేవారు, రెండవవారు ఎవరినైతే స్మృతి చేస్తారో వారు. అంటే, స్మృతి చేసేవారు తప్పకుండా స్మృతి చేయబడుతున్నవారికి వేరుగా ఉంటారు. అంటే, ఈశ్వరుడు సర్వవ్యాపి కాదని అర్థము. ఒకవేళ ఎవరైనా, ఆత్మలైన మేము పరమాత్ముని అంశము అని అంటే, పరమాత్మ కూడా ఎన్నో ముక్కలుగా ఉన్నట్లా? అలా అయితే, పరమాత్మ వినాశీ అయినట్లు. అలాగే, వారి స్మృతి కూడా వినాశీ అయినట్లు. ఇప్పుడు మనుష్యులకు తెలియని విషయమేమిటంటే - పరమాత్మ కూడా అవినాశీ, అలాగే ఆ అవినాశీ పరమపిత పరమాత్ముని సంతానమైన ఆత్మలము కూడా అవినాశీ. కనుక మనం వంశం అయినట్లు, అంతేకానీ అంశం కాదు. ఇప్పుడు ఈ జ్ఞానం కావాలి, దీనిని స్వయంగా పరమాత్మ వచ్చి పిల్లలైన మనకు ఇస్తారు. పిల్లలైన మన పట్ల పరమాత్ముని మహావాక్యాలు ఏమిటంటే - పిల్లలూ, నేను ఎవరినో, ఎలా ఉంటానో, ఆ రూపాన్నే స్మృతి చేస్తే మీరు నన్ను తప్పకుండా పొందుతారు. ఒకవేళ సుఖ-దుఃఖాలకు అతీతమైన తండ్రినైన నేను, సర్వవ్యాపిగా ఉన్నట్లయితే, ఇక ఈ ఆటలో సుఖ-దుఃఖాలే ఉండవు. కనుక నేను సర్వవ్యాపిని కాను. నేను కూడా ఆత్మ వలె ఆత్మను కానీ సర్వాత్మలలో కల్లా నా గుణాల ఉన్నతమైనవి (పరమ), అందుకే నన్ను పరమ-ఆత్మ అనగా పరమాత్మ అని అంటారు. అచ్ఛా. ఓంశాంతి.