07-01-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - ఈ భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు మీరు పూర్తి ప్రకాశంలో ఉండేవారు, ఇప్పుడు అంధకారము ఉంది, మళ్ళీ ప్రకాశంలోకి పదండి”

ప్రశ్న:-

తండ్రి తమ పిల్లలకు ఏ కథను వినిపించేందుకు వచ్చారు?

జవాబు:-

మధురమైన పిల్లలూ, నేను మీకు 84 జన్మల కథను వినిపిస్తాను. మీరు మొట్టమొదటి జన్మలో ఉన్నప్పుడు ఒకే దైవీ ధర్మముండేది, మళ్ళీ రెండు యుగాల తర్వాత మీరే పెద్ద-పెద్ద మందిరాలను కట్టించారు. భక్తిని ప్రారంభించారు. ఇప్పుడిది మీ అంతిమంలో కూడా అంతిమ జన్మ. మీరు దుఃఖహర్త, సుఖకర్త రండి..... అని పిలిచారు. ఇప్పుడు నేను వచ్చాను అని బాబా అంటారు.

గీతము:-

ఈనాడు మానవులు అంధకారములో ఉన్నారు..... (ఆజ్ అంధేరే మే హై ఇన్సాన్.....)

ఓంశాంతి. ఇప్పుడిది కలియుగ ప్రపంచమని, అందరూ అంధకారములో ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు ప్రకాశంలో ఉండేవారు. ఇప్పుడు తమను తాము హిందువులుగా పిలుచుకునే ఈ భారతవాసులే, నిజానికి దేవీదేవతలుగా ఉండేవారు. ఇతర ఏ ధర్మమూ లేనప్పుడు భారతదేశములో స్వర్గవాసులుండేవారు. అప్పుడు ఒకే ధర్మముండేది. స్వర్గము, వైకుంఠము, బహిష్త్, హెవెన్ - ఇవన్నీ ఈ భారతదేశము పేర్లే. భారతదేశము పవిత్రమైనది మరియు ప్రాచీనమైనది, ఎంతో సంపన్నంగా ఉండేది. ఇప్పుడు భారతదేశము నిరుపేదగా ఉంది ఎందుకంటే ఇప్పుడిది కలియుగము. మనం అంధకారములో ఉన్నామని మీకు తెలుసు. స్వర్గములో ఉన్నప్పుడు వెలుగులో ఉండేవారము. స్వర్గపు రాజరాజేశ్వరుడు, రాజరాజేశ్వరిగా శ్రీ లక్ష్మీనారాయణులు ఉండేవారు. దానిని సుఖధామమని అంటారు. తండ్రి నుండే మీరు స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి, దానిని జీవన్ముక్తి అని అంటారు. ఇప్పుడు అందరూ జీవన బంధనములో ఉన్నారు. ముఖ్యంగా భారతదేశము మరియు పూర్తి ప్రపంచమంతా రావణుని జైలులో, శోకవాటికలో ఉన్నారు. రావణుడు కేవలం లంకలో ఉండేవారని మరియు రాముడు భారతదేశంలో ఉండేవారని, అతడు వచ్చి సీతను అపహరించాడని కాదు. ఇవన్నీ కట్టు కథలు. ముఖ్యమైనది గీత, అది సర్వశాస్త్రమయి శిరోమణి, శ్రీమతము అనగా భగవంతుని ద్వారా భారతదేశములో వినిపించబడినది. మనుష్యులైతే ఎవరి సద్గతిని చేయలేరు. సత్యయుగంలో జీవన్ముక్త దేవీ-దేవతలుండేవారు, వారు ఈ వారసత్వాన్ని కలియుగాంతములో పొందారు. ఇది భారతవాసులకు తెలియదు, అలానే ఇది ఏ శాస్త్రాలలోనూ లేదు. శాస్త్రాలలో భక్తి మార్గపు జ్ఞానముంది. సద్గతి మార్గం యొక్క జ్ఞానము మనుష్యమాత్రులలో ఏ మాత్రమూ లేదు. అందరూ భక్తిని నేర్పించేవారే. శాస్త్రాలు చదవండి, దాన-పుణ్యాలు చేయండని అంటారు. ఈ భక్తి ద్వాపరం నుండి కొనసాగుతూ వస్తుంది. సత్య-త్రేతా యుగాలలో జ్ఞాన ప్రారబ్ధముంటుంది. అక్కడ కూడా ఈ జ్ఞానము కొనసాగుతూ వస్తుందని కాదు. భారతదేశానికి ఉన్న ఈ వారసత్వము, సంగమయుగంలోనే తండ్రి ద్వారా లభించింది, అది మళ్ళీ ఇప్పుడు మీకు లభిస్తుంది. భారతవాసులు ఎప్పుడైతే నరకవాసులుగా, అనంతమైన దుఃఖితులుగా అవుతారో, అప్పుడు - ఓ పతితపావనా, దుఃఖహర్త, సుఖకర్త అని పిలుస్తారు. ఎవరికి? సర్వులకు, ఎందుకంటే ముఖ్యంగా భారతదేశంలో మరియు పూర్తి ప్రపంచంలో, అందరిలోనూ 5 వికారాలున్నాయి. తండ్రి పతితపావనుడు. నేను కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమంలో వస్తానని తండ్రి అంటారు. సర్వులకు సద్గతిదాతగా అవుతాను. అహల్యలు, గణికులు మరియు గురువులెవరైతే ఉన్నారో, వారందిరి ఉద్ధరణను నేనే చేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది ఉన్నదే పతిత ప్రపంచము. పావన ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు. భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. వీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని భారతవాసులకు తెలియదు. పతిత ఖండము అనగా అసత్య ఖండము, పావన ఖండము అనగా సత్య ఖండము. భారతదేశము పావన ఖండముగా ఉండేది, ఈ భారతదేశము అవినాశీ ఖండము, ఇది ఎప్పుడూ వినాశనమవ్వదు. ఎప్పుడైతే వీరి రాజ్యం (లక్ష్మీనారాయణుల రాజ్యం) ఉండేదో, అప్పుడు ఇతర ఖండాలేవీ ఉండేవి కావు. అవన్నీ తర్వాత వస్తాయి. మనుష్యులైతే కల్పము ఆయువును లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. కల్పము ఆయువు 5 వేల సంవత్సరాలని తండ్రి చెప్తారు. అలాగే మనుష్యులు 84 లక్షల జన్మలు తీసుకుంటారని వారంటారు. మనుష్యులను కుక్క, పిల్లి, గాడిద మొదలైనవిగా చేసేశారు. కానీ కుక్కలు, పిల్లుల జన్మలు వేరు, 84 లక్షల వెరైటీలున్నాయి. మనుష్యుల వెరైటీ అయితే ఒక్కటే. వారికే 84 జన్మలు ఉన్నాయి. భారతవాసులు డ్రామా ప్లాను అనుసారముగా తమ ధర్మాన్ని మర్చిపోయారని తండ్రి చెప్తారు. కలియుగాంతములో పూర్తిగా పతితులుగా అయిపోయారు. తండ్రి మళ్ళీ సంగమయుగములో వచ్చి పావనంగా చేస్తారు, దీనిని దుఃఖధామమని అంటారు, మళ్ళీ భారతదేశము సుఖధామంగా ఉంటుంది. ఓ పిల్లలూ, భారతవాసులైన మీరు స్వర్గవాసులుగా ఉండేవారు, తర్వాత మీరు 84 జన్మల మెట్లను దిగుతారు అని తండ్రి అంటారు. సతో నుండి రజో, తమోలలోకి తప్పకుండా రావాలి. దేవతలైన మీ వంటి ధనవంతులు, ఎవర్ హ్యాపీ (సదా సంతోషంగా), ఎవర్ హెల్దీ (సదా ఆరోగ్యంగా), వెల్దీ (సదా సంపన్నంగా) గా ఎవ్వరూ ఉండరు. భారతదేశము ఎంత షావుకారుగా ఉండేది, వజ్ర-వైఢూర్యాలు రాళ్ళ వలె ఉండేవి. రెండు యుగాల తర్వాత భక్తి మార్గములో ఇంత పెద్ద-పెద్ద మందిరాలను తయారుచేస్తారు. అవి కూడా ఎంత పెద్ద మందిరాలను తయారుచేసారు. సోమనాథ మందిరము చాలా పెద్దదిగా ఉండేది. కేవలం ఒక్క మందిరము మాత్రమే ఉండదు కదా. ఇంకా ఎందరో రాజుల మందిరాలు ఉండేవి. ఎంతగా దోచుకొని తీసుకువెళ్ళిపోయారు. తండ్రి పిల్లలైన మీకు స్మృతిని కలిగిస్తున్నారు. నేను మిమ్మల్ని ఎంత షావుకార్లుగా తయారుచేసాను. యథా మహారాజా-మహారాణి, మీరు కూడా సర్వగుణ సంపన్నులుగా, 16 కళా సంపూర్ణులుగా ఉండేవారు. వారిని భగవాన్-భగవతి అని కూడా అనవచ్చు. కానీ భగవంతుడు ఒక్కరే, వారే తండ్రి అని బాబా అర్థం చేయించారు. కేవలం ఈశ్వరుడు లేక ప్రభువు అని అనడంతో వారు సర్వాత్మలకు తండ్రి అన్నది గుర్తుకు రాదు. తండ్రి కూర్చొని కథను వినిపిస్తారు. ఇప్పుడిది మీ అనేక జన్మల అంతిమ జన్మ. ఇది ఒక్కరి విషయము కాదు, అలాగని యుద్ధ మైదానము మొదలైనవేవీ లేవు. తమ రాజ్యముండేదని భారతవాసులు మర్చిపోయారు. సత్యయుగ ఆయువును చాలా ఎక్కువగా చేయడం వలన చాలా దూరం తీసుకువెళ్ళిపోయారు. మనుష్యులను భగవంతుడని అనలేరని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. మనుష్యులు ఎవ్వరికీ సద్గతిని కలిగించలేరు. సర్వుల సద్గతిదాత, పతితుల పావనకర్త ఒక్కరే అన్న నానుడి ఉంది. సత్యమైన తండ్రి ఒక్కరే, వారే సత్య ఖండాన్ని స్థాపన చేసేవారు. పూజలు కూడా చేస్తారు కానీ భక్తి మార్గంలో మీరు ఎవరి పూజలను చేస్తూ వచ్చారో, వారిలో ఒక్కరి జీవితచరిత్ర గురించి కూడా తెలియదు. అందుకే తండ్రి అర్థం చేయిస్తారు - మీరు శివజయంతిని జరుపుకుంటారు కదా. ఆ తండ్రి కొత్త ప్రపంచానికి రచయిత, వారు హెవెన్లీ గాడ్ ఫాదర్. వారు అనంతమైన సుఖమునిచ్చేవారు. సత్యయుగంలో చాలా సుఖముండేది. దానిని ఎలా స్థాపించారు మరియు ఎవరు స్థాపించారు? ఇది తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేయడం లేక భ్రష్టాచారులను శ్రేష్ఠాచారీ దేవతలుగా తయారుచేయడం, ఈ కర్తవ్యము తండ్రిదే. నేను పిల్లలైన మిమ్మల్ని పావనంగా చేస్తాను అని తండ్రి చెప్తారు. మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. మిమ్మల్ని పతితులుగా ఎవరు తయారుచేస్తారు? ఈ రావణుడు. దుఃఖమును కూడా ఈశ్వరుడే ఇస్తారని మనుష్యులంటారు. నేను అందరికీ ఎంత సుఖమునిస్తానంటే, ఇక మళ్ళీ మీరు అర్ధకల్పము వరకు తండ్రి స్మరణను చేయరు అని తండ్రి అంటారు. మళ్ళీ ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో, అప్పుడు అందరినీ పూజించడం మొదలుపెడతారు. ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. బాబా, మేము ఎన్ని జన్మలు తీసుకున్నాము అని పిల్లలు అడుగుతారు. బాబా అంటారు - మధురాతి మధురమైన భారతవాసులు, ఓ ఆత్మలూ, నేను ఇప్పుడు మీకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తాను. పిల్లలూ, మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు మీరు 21 జన్మల కోసం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. అందరూ కలిసి రారు కదా. సత్యయుగ సూర్యవంశ పదవిని మళ్ళీ మీరే తీసుకుంటారు అనగా సత్యాతి సత్యమైన బాబా ద్వారా నరుని నుండి నారాయణునిగా అయ్యే సత్య జ్ఞానాన్ని వింటారు. ఇది జ్ఞానము, అది భక్తి. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గం కోసం ఉన్నాయి. అవి జ్ఞాన మార్గానికి చెందినవి కావు. ఇది ఆధ్యాత్మికమైన ఆత్మిక జ్ఞానము. సుప్రీమ్ ఆత్మ కూర్చుని జ్ఞానమునిస్తారు. పిల్లలు దేహీ-అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకుని నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలుంటాయి, వాటి అనుసారంగానే మనుష్యులకు మంచి లేక చెడు జన్మ లభిస్తుందని తండ్రి అర్థం చేయిస్తారు. ఇంతకుముందు పావనంగా ఉన్న వీరే అంతిమ జన్మలో పతితంగా ఉన్నారు, తతత్వమ్ అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రినైన నేను ఈ పాత రావణ ప్రపంచములోకి, పతిత ప్రపంచములోకి రావలసి ఉంటుంది. ఎవరైతే మళ్ళీ మొదటి నంబరులోకి వెళ్ళవలసి ఉంటుందో, అతని తనువులోకే రావలసి ఉంటుంది. సూర్యవంశీయులే పూర్తిగా 84 జన్మలను తీసుకుంటారు. వీరు బ్రహ్మా మరియు బ్రహ్మావంశీయులైన బ్రాహ్మణులు. తండ్రి అయితే ప్రతి రోజు అర్థం చేయిస్తారు. రాతి బుద్ధిని పారస బుద్ధిగా చేయడం పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువేమీ కాదు. ఓ ఆత్మలూ, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి. ఓ ఆత్మలూ, ఒక్క తండ్రిని స్మృతి చేయండి మరియు రాజ్యాన్ని స్మృతి చేయండి. దేహ సంబంధాలను వదిలేయండి. అందరూ మరణించవలసిందే. ఇది అందరి వానప్రస్థావస్థ. ఒక్క సద్గురువు తప్ప ఇతరులెవ్వరూ సర్వులకు సద్గతిదాతగా అవ్వలేరు. ఓ భారతవాసులైన పిల్లలూ, మీరే మొట్టమొదట నా నుండి దూరమయ్యారని తండ్రి అంటారు. ఆత్మ-పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారు..... అని పాడుతారు. మొట్టమొదట భారతవాసీ దేవీ-దేవతా ధర్మస్థులైన మీరే వచ్చారు. ఇతర ధర్మాలవారికి కొన్ని జన్మలే ఉంటాయి. పూర్తి చక్రమంతా ఎలా తిరుగుతుంది అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఎవరైతే ధారణ చేయలేరో, వారికి కూడా ఇది చాలా సహజము. ఆత్మలు ధారణ చేస్తాయి, పుణ్య ఆత్మగా, పాపాత్మగా అవుతాయి కదా. ఇది మీ 84వ అంతిమ జన్మ. మీరందరూ వానప్రస్థావస్థలో ఉన్నారు. వానప్రస్థావస్థలో ఉన్నవారు మంత్రము తీసుకునేందుకు గురువులను ఆశ్రయిస్తారు. మీకిప్పుడు దేహధారి గురువులను ఆశ్రయించవలసిన అవసరము లేదు. నేను మీ అందరికీ తండ్రిని, శిక్షకుడిని, గురువును. నన్ను ఓ పతిత పావన శివబాబా అని అంటారు. ఇప్పుడు స్మృతి కలిగింది. వారు సర్వాత్మలకు తండ్రి, ఆత్మ సత్యమైనది, చైతన్యమైనది ఎందుకంటే ఆత్మ అమరమైనది. ఆత్మలందరిలోనూ పాత్ర నిండి ఉంది. తండ్రి కూడా సత్యమైనవారు, చైతన్యమైనవారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడైన కారణంగా - నాకు పూర్తి వృక్షము యొక్క ఆదిమధ్యాంతాలు తెలుసు, అందుకే నన్ను జ్ఞానసాగరుడని అంటారని బాబా చెప్తారు. మీకు కూడా పూర్తి జ్ఞానముంది. బీజము నుండి వృక్షము ఎలా వెలువడుతుంది. వృక్షము పెరిగేందుకు సమయము పడుతుంది కదా. నేను బీజరూపుడను, అంతిమంలో వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంటుందని తండ్రి అంటారు. ఇప్పుడు చూడండి, దేవీదేవతా ధర్మం యొక్క పునాది లేదు. అది మాయమైపోయింది. ఎప్పుడైతే దేవతా ధర్మము మాయమైపోతుందో, అప్పుడు తండ్రి ఒకే ధర్మాన్ని స్థాపన చేసి మిగిలిన వాటన్నింటినీ వినాశనము చేయించేందుకు రావలసి ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మా ద్వారా తండ్రి ఆదిసనాతన దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తున్నారు. ఇదంతా కూడా రచింపబడి ఉన్న డ్రామా. ఇది అంతమవ్వదు. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపించవలసినప్పుడు తండ్రి అంతిమంలో వస్తారు అనగా తప్పకుండా సంగమంలోనే వస్తారు. మీకు ఒకే తండ్రి ఉన్నారు. ఆత్మలందరూ సోదరులు, మూలవతనములో నివసించేవారు. ఆ ఒక్క తండ్రిని అందరూ స్మృతి చేస్తారు. దుఃఖములో అందరూ స్మరిస్తారు..... రావణ రాజ్యములో దుఃఖముంది కదా, ఇక్కడ స్మరణ చేసుకుంటారు. కావున సర్వుల సద్గతిదాత అయిన తండ్రి ఒక్కరే. వారికే మహిమ ఉంది. తండ్రి రాకపోతే భారతదేశాన్ని స్వర్గంగా ఎవరు తయారుచేస్తారు! ఇస్లాములు మొదలైనవారంతా ఈ సమయంలో తమోప్రధానంగా ఉన్నారు. అందరూ తప్పకుండా పునర్జన్మలు తీసుకోవలసిందే. ఇప్పుడు నరకంలో పునర్జన్మలు లభిస్తాయి, స్వర్గములోకి వెళ్ళిపోతారని కాదు. స్వర్గస్థులయ్యారని హిందువులు అంటారు, అంటే తప్పకుండా ఇప్పటివరకు నరకములో ఉన్నట్లు, ఇప్పుడు స్వర్గానికి వెళ్ళినట్లు కదా. మీ నోటిలో గులాబ్ జామూన్. స్వర్గవాసులుగా అయినట్లయితే మళ్ళీ నరకపు ఆసురీ వైభవాలను వారికెందుకు తినిపిస్తారు! బెంగాల్ లో చేపలు మొదలైనవి కూడా తినిపిస్తారు. అరే, వారు వీటన్నింటినీ తినవలసిన అవసరమేముంది! ఫలానావారు నిర్వాణమునకు వెళ్ళారని అంటారు, అవన్నీ ప్రగల్భాలని తండ్రి అంటారు. ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. మొదటి నంబరువారే 84 జన్మలు తీసుకోవలసి ఉంటుందంటే, ఇక మిగతావారు ఎలా వెళ్ళగలరు.

ఇందులో ఎటువంటి కష్టము లేదని తండ్రి అర్థము చేయిస్తారు. భక్తి మార్గంలో ఎంత కష్టము ఉంటుంది. రామ-రామ అని జపిస్తూ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అదంతా భక్తి మార్గము. ఈ సూర్య-చంద్రులు కూడా ప్రకాశాన్ని ఇచ్చేవని మీకు తెలుసు. ఇవేమీ దేవతలు కావు. వాస్తవానికి జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు మరియు జ్ఞాన సితారలు ఉన్నారు, వారికే మహిమ ఉంది. వారు మళ్ళీ సూర్య దేవతాయ నమః అని అంటారు. వాటిని దేవతగా భావించి నీటిని అర్పణ చేస్తారు. కావున ఇదంతా భక్తి మార్గము, ఇది మళ్ళీ జరుగుతుందని తండ్రి అర్థము చేయిస్తారు. మొట్టమొదట ఒక్క శివబాబాకు అవ్యభిచారి భక్తి జరుగుతుంది, తర్వాత దేవతలకు, తర్వాత దిగుతూ-దిగుతూ ఇప్పుడు మూడు రోడ్ల కూడలిలో కూడా మట్టి దీపాన్ని వెలిగించి, నూనె మొదలైనవి వేసి దానిని కూడా పూజిస్తారు. తత్వాలను కూడా పూజిస్తారు. మనుష్యుల చిత్రాలను కూడా తయారుచేసి పూజిస్తారు. ఇప్పుడు వీటి ద్వారా ఎటువంటి ప్రాప్తి లభించదు, ఈ విషయాలను పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఆత్మ నుండి చెడు సంస్కారాలను తొలగించుకునేందుకు దేహీ-అభిమానిగా ఉండే అభ్యాసము చేయాలి. ఇది అంతిమ 84వ జన్మ, ఇది వానప్రస్థావస్థ కావున పుణ్యాత్మగా అయ్యేందుకు శ్రమించాలి.

2. దేహ సంబంధాలన్నింటినీ వదిలి ఒక్క తండ్రిని మరియు రాజ్యాన్ని స్మృతి చేయాలి, బీజము మరియు వృక్షం యొక్క జ్ఞానాన్ని స్మరిస్తూ సదా హర్షితంగా ఉండాలి.

వరదానము:-

విశ్వ పరివర్తన అనే శ్రేష్ఠమైన కార్యము యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ డబల్ లైట్ గా ఉండే ఆధారమూర్త భవ

ఎవరైతే ఆధారమూర్తులుగా ఉంటారో వారి పైనే మొత్తం బాధ్యత ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ రూపంతో, ఎక్కడ అడుగు వేసినా, అలాగే అనేక ఆత్మలు మిమ్మల్ని అనుసరిస్తారు, ఈ బాధ్యత ఉంది. కానీ ఈ బాధ్యత, స్థితిని తయారుచేసుకోవడంలో చాలా సహాయం చేస్తుంది, ఎందుకంటే దీని ద్వారా అనేక ఆత్మల ఆశీర్వాదాలు లభిస్తాయి, ఈ కారణంగా బాధ్యత తేలికగా అయిపోతుంది, ఈ బాధ్యత అలసటను దూరం చేసేటటువంటిది.

స్లోగన్:-

మనసు మరియు బుద్ధి, ఈ రెండింటి బ్యాలెన్స్ ను పెట్టుకుని సేవ చేసినట్లయితే సఫలత లభిస్తుంది.