07-04-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - తండ్రి పిల్లలైన మీ కోసం కొత్త రాజ్యాన్ని స్థాపన చేయడానికి దూరదేశం నుండి వచ్చారు, మీరిప్పుడు స్వర్గానికి యోగ్యులుగా అవుతున్నారు”

ప్రశ్న:-

ఏ పిల్లలకైతే శివబాబా పట్ల ఎడతెగని నిశ్చయం ఉంటుందో వారి గుర్తులేమిటి?

జవాబు:-

వారు కళ్ళు మూసుకొని, బాబా శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉంటారు, ఏ ఆజ్ఞ లభిస్తే అది స్వీకరిస్తారు. దీనివల్ల ఏమైనా నష్టం కలుగుతుందేమో అన్న ఆలోచన కూడా వారికెప్పుడూ రాదు, ఎందుకంటే ఇటువంటి నిశ్చయబుద్ధి కల పిల్లల బాధ్యత తండ్రిది. వారికున్న నిశ్చయానికి బలం లభిస్తుంది. అవస్థ స్థిరంగా మరియు అచలంగా తయారవుతుంది.

గీతము:-

నీవే తల్లివి, నీవే తండ్రివి..... (తుమ్ హీ హో మాతా, పితా తుమ్ హీ హో.....)

ఓంశాంతి. మీరు ఎవరి మహిమను విన్నారు, వారి గురించి పిల్లలైన మీకు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు. ఇది ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి మహిమ. ఇక మిగిలినవారెవరి మహిమను చేసినా అది వ్యర్థమే. ఉన్నతాతి ఉన్నతమైనవారు ఒక్క తండ్రి మాత్రమే. కానీ తండ్రి పరిచయాన్ని ఎవరిస్తారు. వారే స్వయంగా వచ్చి ఆత్మ పరిచయాన్ని మరియు తమ పరిచయాన్ని ఇస్తారు. మహాన్ ఆత్మ, జీవాత్మ అని అంటూ ఉంటారు కానీ మనుష్యులెవరికీ ఆత్మ పరిచయం లేదు. శరీరం వదిలినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుందని అంటారు. శరీరం శవమైపోతుంది, ఆత్మ అవినాశీ, అది ఎప్పుడూ సమాప్తమవ్వదు. నక్షత్రం వలె ఉండే ఆత్మ చాలా సూక్ష్మమైనది. అది ఈ కళ్ళకు కనిపించదు. కర్తవ్యాలన్నీ ఆత్మయే చేస్తుంది కానీ పదే-పదే దేహాభిమానంలోకి వచ్చి, నేను ఫలానా, నేను ఇది చేస్తాను అని అంటారు. వాస్తవానికి అంతా ఆత్మయే చేస్తుంది. శరీరమైతే ఇంద్రియాలతో కూడినది. ఆత్మ చాలా సూక్ష్మమైనదని, భృకుటి మధ్యలో ఉంటుందని ఈ సాధువులు మొదలైనవారికి కూడా తెలుసు కానీ ఆత్మలో ఈ పాత్రను అభినయించే సంస్కారం ఉంటుందనే జ్ఞానం వారికి లేదు. ఆత్మలో సంస్కారం ఉండదు, ఆత్మ నిర్లేపి అని కొంతమంది అంటారు. సంస్కారాలనుసారంగా జన్మ లభిస్తుందని కొంతమంది అంటారు. అనేక అభిప్రాయ బేధాలున్నాయి. ఎటువంటి ఆత్మలు 84 జన్మలు తీసుకుంటారు అనేది కూడా ఎవరికీ తెలియదు. సూర్యవంశీయులు మాత్రమే 84 జన్మల చక్రాన్ని తిరగవలసి ఉంటుందని మీకు తెలుసు. ఆత్మయే 84 జన్మల చక్రం తిరిగి పతితంగా అవుతుంది, దానిని ఇప్పుడు పావనంగా ఎవరు చేయాలి. పతితపావనుడు, ఉన్నతాతి ఉన్నతమైనవారు ఒక్క తండ్రి మాత్రమే, వారి మహిమ అందరికన్నా ఉన్నతమైనది. అందరూ 84 జన్మలు తీసుకోరు. వెనుక వచ్చేవారు 84 జన్మలను తీసుకోలేరు. అందరూ ఒకేసారి రారు. సూర్యవంశ రాజులు మరియు ప్రజలు, ఎవరైతే మొట్టమొదట సత్యయుగంలోకి వస్తారో, వారికి 84 జన్మలు ఉంటాయి. తర్వాతర్వాత మనుష్యుల సంఖ్య చాలా వృద్ధి చెందుతుంది కదా. ఇక కొంతమందికి 83, కొంతమందికి 80 జన్మలు ఉంటాయి. అక్కడ సత్యయుగంలోనైతే పూర్తి 150 సంవత్సరాల ఆయుష్షు ఉంటుంది, ఎవరూ ముందే మరణించరు. ఈ విషయాలను తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. పరమపిత పరమాత్మను గురించి ఇప్పుడు ఎవరికీ తెలియదు. తండ్రి అంటారు - మీ ఆత్మ ఎలాగైతే ఉంటుందో, అలాగే నా ఆత్మ కూడా ఉంటుంది కానీ మీరు జనన మరణాల్లోకి వస్తారు, నేను రాను. నన్ను పిలవడం కూడా పతితులుగా అయినప్పుడు పిలుస్తారు, చాలా దుఃఖితులుగా అయినప్పుడు పిలుస్తారు. ఈ సమయంలో పిల్లలైన మిమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు.

పరమాత్మ వస్తారు అన్నది ఎలా నమ్మాలి అని కొంతమంది అడుగుతారు. వారికి ఇలా అర్థం చేయించాలి - ఓ పతిత-పావనా రండి అని అందరూ పిలుస్తారు, అయితే వారు నిరాకారుడు, వారికి తమకంటూ శరీరం లేదు, రావడం కూడా పతిత ప్రపంచంలోకి రావలసి ఉంటుంది, పావన ప్రపంచంలోకైతే రారు. ఈ విధంగా అర్థం చేయించాలి. ఇది కూడా అర్థం చేయించాలి - ఏ విధంగా ఆత్మ చిన్నగా ఉంటుందో, పరమాత్మ కూడా అంతే చిన్నగా ఉంటారు కానీ వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, నాలెడ్జ్ ఫుల్. తండ్రి అంటారు - మీరు నన్ను పరమపిత పరమాత్మ అని అంటారు, పిలుస్తారు కనుక తప్పకుండా వస్తాను కదా. దూరదేశంలో నివసించేవారు పరాయి దేశంలోకి వచ్చారని గాయనం కూడా ఉంది. ఇప్పుడు మనము పరాయి దేశంలో అనగా రావణ దేశంలో ఉన్నామని తండ్రి ద్వారా తెలిసింది. సత్య, త్రేతా యుగాలలో మనము ఈశ్వరీయ దేశం అనగా మన దేశంలో ఉండేవారము, తర్వాత ద్వాపరం నుండి మొదలుకొని పరాయి దేశంలో, పరాయి రాజ్యంలోకి వచ్చేస్తాము. వామ మార్గంలోకి వచ్చేస్తాము. అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. మొట్టమొదట శివబాబాను భక్తి చేయడం మొదలుపెడతారు, మనుష్యులు శివునికి ఇంత పెద్ద లింగాన్ని తయారుచేస్తారు కానీ వారు అంత పెద్దగా ఉండరు. ఇప్పుడు మీరు, ఆత్మ మరియు పరమాత్మకు గల తేడాను అర్థం చేసుకున్నారు. వారు నాలెడ్జ్ ఫుల్, సదా పావనుడు, సుఖ సాగరుడు, ఆనంద సాగరుడు. ఇది పరమాత్మ మహిమయే కదా. ఓ పతితపావనా రండి అని ఇప్పుడు పిలుస్తారు. వారు పరమపిత, కల్ప-కల్పము వస్తారు. దూరదేశంలో ఉండే ప్రయాణీకుడిని పిలుస్తారు, వారి మహిమను పాడుతారు. బ్రహ్మా సరస్వతులనైతే పిలవరు, నిరాకార పరమాత్మను పిలుస్తారు. దూరదేశంలో నివసించేవారు, ఇప్పుడు పరాయి దేశంలోకి రండి అని ఆత్మ పిలుస్తుంది ఎందుకంటే అందరూ పతితంగా అయిపోయారు. నేను కూడా రావణ రాజ్యం సమాప్తమవ్వనున్నప్పుడు వస్తాను, నేను సంగమయుగంలోనే వస్తాను. ఇది ఎవరికీ తెలియదు. వారు పరమాత్మ బిందువు అని కూడా అంటారు. ఈ రోజుల్లోనైతే ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అంటారు కానీ ఆత్మ పరమాత్మగా కాలేదు. ఆత్మ పరమాత్మ, ఇరువురూ వేర్వేరు. ఇరువురి రూపాలు ఒకేలా ఉంటాయి. కానీ ఆత్మ పతితంగా అవుతుంది, 84 జన్మల పాత్రను అభినయించవలసి ఉంటుంది. పరమాత్మ జనన-మరణ రహితుడు. ఒకవేళ ఆత్మయే పరమాత్మ అని అంటే, సతోప్రధానమైన పరమాత్మ, తమోప్రధానములోకి వస్తారా, రారు, ఈ విధంగా జరగజాలదు. తండ్రి అంటారు - నేను సర్వాత్మల సేవ చేసేందుకు వస్తాను. నా జన్మ జరిగింది అని కూడా అనరు. నేను నరకవాసులను స్వర్గవాసులుగా చేసేందుకే వస్తాను. వారు స్వర్గాన్ని స్థాపన చేసేందుకు పరాయి దేశంలోకి వచ్చారు. తండ్రియే వచ్చి మనల్ని స్వర్గానికి యోగ్యులుగా చేస్తారు. మిగిలిన ఆత్మలందరికీ తమ-తమ పాత్రలుంటాయని కూడా అర్థం చేయించారు. పరమాత్మ జనన-మరణ రహితుడు. వారు తప్పకుండా వస్తారు, అందుకే శివరాత్రిని జరుపుకుంటారు. కానీ వారు ఎప్పుడు వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. మామూలుగా శివజయంతిని జరుపుకుంటూ వచ్చారు. స్వర్గ స్థాపన చేసేందుకు వారు తప్పకుండా సంగమంలోనే వచ్చి ఉంటారు. పతితులను పావనంగా చేసేందుకు తప్పకుండా సంగమంలోనే వస్తారు కదా. స్వర్గము పావన సృష్టి. పతితపావనా రండి అని అంటారు. మరి తప్పకుండా పతిత ప్రపంచ వినాశన సమయంలోనే, పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. ప్రతి యుగంలోనూ రారు. తండ్రి అంటారు - నేను సంగమంలోనే వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారుచేయవలసి ఉంటుంది. ఇది పరాయి దేశము, రావణుని దేశము. కానీ రావణ రాజ్యం నడుస్తుందని మనుష్యులెవరికీ తెలియదు. ఈ రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది, ఏమీ తెలియదు. మొట్టమొదటి ముఖ్యమైన విషయము - ఆత్మ మరియు పరమాత్మల రహస్యాన్ని అర్థం చేయించాలి. వారు పావనంగా తయారుచేసేందుకు కల్పం యొక్క సంగమయుగంలో వస్తారని తర్వాత అర్థం చేయించాలి. ఈ పని వారిదే కానీ శ్రీకృష్ణునిది కాదు. శ్రీకృష్ణుడే స్వయంగా 84 జన్మలను తీసుకొని కిందకు వస్తారు. సూర్యవంశీయులందరూ కిందకు దిగుతారు. వృక్షంలోని సగ భాగం తాజాగా, సగ భాగం పాతదిగా ఉండదు. అందరూ శిథిలావస్థకు చేరుకుంటారు. కల్పం ఆయువు గురించి కూడా మనుష్యులకు తెలియదు. శాస్త్రాల్లో చాలా ఎక్కువ ఆయువును చూపించారు. ఇది తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. ఇందులో వేరే ప్రశ్నలేవీ తలెత్తవు. రచయిత అయిన తండ్రి సత్యాన్నే చెప్తారు. మనం ఇంతమంది బి.కె.లున్నాము, అందరం నమ్ముతాము. వారు తప్పకుండా ఉన్నారు కావుననే నమ్ముతున్నాము. మున్ముందు నిశ్చయం ఏర్పడినప్పుడు, అంతా అర్థం అవుతుంది. మొట్టమొదట మనుష్యులకు ఇది అర్థం చేయించాలి - పరమపిత పరమాత్మ నిరాకారుడు, వారు దూరదేశం నుండి వచ్చారు. కానీ ఏ శరీరంలోకి వచ్చారు, సూక్ష్మవతనంలోకి వచ్చి ఏమి చేస్తారు. వారు తప్పకుండా ఇక్కడికే రావలసి ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మా కూడా ఇక్కడే కావాలి. బ్రహ్మా ఎవరు అనేది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. నేను ఎవరిలోనైతే ప్రవేశించానో, వారికి ఇంతకుముందు తమ జన్మల గురించి తెలియదు, అలానే పిల్లలకు కూడా తెలియదు. నేను దత్తత తీసుకున్నప్పుడే పిల్లలుగా అవుతారు. నేను వీరి (సాకార బ్రహ్మా) సహితంగా పిల్లలను - మీరు మీ జన్మలను మర్చిపోయారా అని అడుగుతాను. ఇప్పుడు సృష్టి చక్రం పూర్తవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. నేను, పావనంగా తయారుచేసేందుకు, రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. పావనంగా అవ్వడానికి ఇంకే మార్గము లేదు. ఒకవేళ ఈ రహస్యాన్ని మనుష్యులు తెలుసుకున్నట్లయితే, గంగా మొదలైన చోటులకు స్నానం చేయడానికి వెళ్ళరు, మేళాలు మొదలైనవాటికి వెళ్ళరు. ఈ నీటి నదుల్లోనైతే సదా స్నానాలు చేస్తూ ఉంటారు. ద్వాపరం నుండి మొదలుకొని చేస్తూనే వచ్చారు. గంగలో మునకలు వేస్తే పాపాలు నశిస్తాయని భావిస్తారు కానీ ఎవరి పాపాలు నశించవు. మొట్టమొదట ఆత్మ మరియు పరమాత్మల రహస్యాన్నే తెలియజేయండి. ఆత్మలే పరమాత్మ తండ్రిని పిలుస్తాయి, వారు నిరాకారుడు, ఆత్మ కూడా నిరాకారియే. ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా పిలుస్తుంది. భక్తి తర్వాతనే భగవంతుడు రావలసి ఉంటుంది, డ్రామాలో ఈ పాత్ర కూడా ఉంది.

తండ్రి అంటారు - నేను కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి రావలసి ఉంటుంది. భగవంతునికి సంకల్పం కలిగింది అని శాస్త్రాల్లో కూడా ఉంది, అంటే తప్పకుండా డ్రామా ప్లాన్ అనుసారంగా వారికి సంకల్పం వచ్చి ఉంటుంది. ఇంతకుముందు ఈ విషయాలు అర్థమయ్యేవి కావు. రోజు రోజుకు అర్థం చేసుకుంటూ ఉంటారు. తండ్రి అంటారు - నేను మీకు కొత్త-కొత్త గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను, అవి వింటూ-వింటూ అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇంతకుముందు శివబాబా చదివిస్తున్నారని అనేవారు కాదు. ఇప్పుడు మంచి రీతిగా అర్థం చేసుకున్నారు, ఇంకా అర్థం చేసుకోవలసినది చాలా ఉంది. ఎవరికి ఎలా అర్థం చేయించాలి అనేది రోజూ చెప్తూ ఉంటారు. ముందు అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారన్న నిశ్చయం ఏర్పడాలి, వారు తప్పకుండా సత్యాన్నే వినిపిస్తారు. ఇందులో తికమకపడే విషయమేమీ లేదు. పిల్లల్లో కొంతమంది పక్కాగా ఉన్నారు, కొంతమంది కచ్చాగా ఉన్నారు. కచ్చాగా ఉన్నవారు ఎవరికీ అర్థం చేయించలేరు. స్కూల్లో కూడా ఈ విధంగా నంబరువారుగా ఉంటారు. పరమపిత పరమాత్మ వచ్చి చదివిస్తున్నారన్నది మేము ఎలా నమ్మాలి అన్న సంశయం చాలామందికి కలుగుతుంది, ఎందుకంటే వారి బుద్ధిలో శ్రీ కృష్ణుడు జ్ఞానాన్ని వినిపించారన్నట్లు ఉంది. ఇప్పుడు కృష్ణుడైతే పతిత ప్రపంచంలోకి రాలేరు. పతిత ప్రపంచంలోకి మరియు పతిత శరీరంలోకి పరమాత్మయే రావలసి ఉంటుందని వారికి ఋజువు చేయండి. ప్రతి ఒక్కరికి తమ-తమ బుద్ధి ఉంటుందని కూడా తండ్రి అర్థం చేసుకుంటారు. కొంతమందైతే వెంటనే అర్థం చేసుకుంటారు. ఎంత వీలైతే అంత అర్థం చేయించాలి. బ్రాహ్మణులందరూ ఒకేలా ఉండరు. కానీ పిల్లల్లో దేహాభిమానం చాలా ఉంది. నంబరువారుగా ఉన్నారని ఈ బాబాకు కూడా తెలుసు. పిల్లలు డైరెక్షన్ అనుసారంగా నడుచుకోవలసి ఉంటుంది. పెద్ద బాబా ఏమి చెప్పినా సరే, దానిని స్వీకరించాలి. గురువులు మొదలైనవారిదైతే స్వీకరిస్తూ వచ్చారు. ఇప్పుడు స్వర్గంలోకి తీసుకువెళ్ళే తండ్రి మాటలను కళ్ళు మూసుకొని స్వీకరించాలి. కానీ అంతటి నిశ్చయబుద్ధి కలవారిగా లేరు. అందులో నష్టం ఉన్నా, లాభం ఉన్నా స్వీకరించాలి. ఒకవేళ నష్టం జరిగిందనే అనుకోండి, బాబా అయితే అంటారు కదా - ఎల్లప్పుడూ శివబాబాయే చెప్తున్నారని అనుకోండి, బ్రహ్మా చెప్తున్నారని అనుకోకండి. శివబాబా బాధ్యులవుతారు. ఇది వారి రథము, వారే సరి చేస్తారు. బాబా నేను కూర్చుని ఉన్నాను అని అంటారు. ఎల్లప్పుడూ శివబాబాయే చెప్తున్నారు, వీరికేమీ తెలియదు అని అనుకోండి. ఈ నిశ్చయం పెట్టుకోవాలి. నేను చెప్పింది వింటూ ఉన్నట్లయితే, మీ కళ్యాణం జరుగుతూ ఉంటుందని శివబాబా అంటారు. ఒకవేళ ఈ బ్రహ్మా ఏదైనా చెప్పినా, దానికి కూడా నేనే బాధ్యుడిని. పిల్లలైన మీరు చింతించకండి. శివబాబాను స్మృతి చేసినట్లయితే అవస్థ ఇంకా పక్కా అయిపోతుంది. నిశ్చయంలో వికర్మలు కూడా వినాశనమవుతాయి, బలం కూడా లభిస్తుంది. ఎంతగా బాబాను స్మృతి చేస్తారో అంత ఎక్కువ బలం లభిస్తుంది. ఎవరైతే శ్రీమతాన్ని అనుసరిస్తూ సేవ చేస్తారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. చాలామందిలో దేహాభిమానం ఎక్కువగా ఉంటుంది. బాబా పిల్లలందరితో ఎంత ప్రేమగా నడుచుకుంటారో చూడండి, అందరితో మాట్లాడుతూ ఉంటారు. పిల్లలను అడుగుతారు - బాగానే కూర్చున్నారా! ఏ కష్టము లేదు కదా. పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. అనంతమైన తండ్రికి పిల్లల పట్ల చాలా చాలా ప్రేమ ఉంటుంది. శ్రీమతమనుసారంగా ఎవరు ఎంత సేవను చేస్తారో, దాని అనుసారంగా ప్రేమ ఉంటుంది. సేవలోనే లాభం ఉంటుంది. సేవలో ఎముకలను ఇవ్వాలి. ఏదో ఒక పనిని చేస్తూ ఉన్నట్లయితే, వీరు ఫస్ట్ క్లాస్ బిడ్డ అని బాబా హృదయంలో కూడా ఉంటారు. కానీ నడుస్తూ-నడుస్తూ కొంతమందిపై గ్రహచారం కూడా కూర్చుంటుంది. మాయ ఎదుర్కుంటుంది కదా. గ్రహచారం కారణంగా ఇక జ్ఞానాన్ని తీసుకోలేరు. కొంతమందైతే కర్మణా సేవను అలసట లేకుండా చేస్తారు.

అందరినీ సుఖధామానికి యజమానులుగా చేయడం మీ పని. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. జ్ఞానం లేకపోతే చాలా దుఃఖాన్ని ఇస్తారు. ఇక ఎంత అర్థం చేయించినా అర్థం చేసుకోరు. మొట్టమొదట ఆత్మ మరియు పరమాత్మ గురించి వివరించాలి, ఆత్మలో 84 జన్మల అవినాశీ పాత్ర ఎలా నిండి ఉంది అన్నది అర్థం చేయించాలి. ఇది ఎప్పటికీ మారదు, డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఈ నిశ్చయమున్న వారు ఎప్పుడూ చలించరు. చాలామంది చలించిపోతూ ఉంటారు. చివర్లో ప్రపంచానికి నిప్పు అంటుకున్నప్పుడు అచలంగా అయిపోతారు. ఇప్పుడైతే చాలా యుక్తిగా అర్థం చేయించాలి. మంచి-మంచి పిల్లలు సేవలో ఉంటారు, హృదయాన్ని అధిరోహించి ఉంటారు. చాలా చురుకుగా ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా శ్రమిస్తారు. వారికి సేవ పట్ల చాలా అభిరుచి ఉంటుంది. ఎవరిలో ఏ గుణాలైతే ఉంటాయో, వాటిని బాబా వర్ణిస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సేవలో ఎముకలను ఇవ్వాలి, ఏ విషయంలోనూ సంశయం కలగకూడదు. సేవతో అందరికీ సుఖాన్నివ్వాలి, దుఃఖాన్ని కాదు.

2. నిశ్చయం యొక్క బలంతో తమ అవస్థను స్థిరంగా చేసుకోవాలి. ఏ శ్రీమతమైతే లభిస్తుందో, అందులో కళ్యాణం ఇమిడి ఉంది, ఎందుకంటే తండ్రి బాధ్యులు, కనుకనే చింతించకూడదు.

వరదానము:-

సహజయోగాన్ని నేచర్ (స్వభావం)గా మరియు నేచురల్ (సహజం)గా చేసుకునే ప్రతి సబ్జెక్టులో పర్ఫెక్ట్ భవ

తండ్రికి పిల్లలుగా అవ్వడంలో ఎలాగైతే పర్సెంటేజ్ ఉండదో, అలా నిరంతర సహజయోగులుగా లేక యోగులుగా అయ్యే స్థితిలో ఇప్పుడు పర్సెంటేజ్ సమాప్తమవ్వాలి. నేచురల్ గా మరియు నేచర్ గా అయిపోవాలి. ఎలాగైతే కొంతమందికి విశేషమైన నేచర్ ఉంటుంది, వద్దనుకున్నా ఆ నేచర్ కు వశమై నడుచుకుంటూ ఉంటారో, అదే విధంగా ఇది కూడా నేచర్గా అయిపోవాలి. ఏమి చేయాలి, యోగం ఎలా జోడించాలి - ఈ మాటలు సమాప్తమైనట్లయితే ప్రతి సబ్జెక్టులో పర్ఫెక్ట్ గా అవుతారు. పర్ఫెక్ట్ అనగా ఎఫెక్ట్ (ప్రభావం) మరియు డిఫెక్ట్ (లోపం) నుండి ముక్తులుగా అవ్వడము.

స్లోగన్:-

సహనం చేయాలి అంటే, సంతోషంగా చేయండి, తప్పదని కాదు.