07-09-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - మీరు గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్ (ఈశ్వరీయ విద్యార్థులు), మీరు సత్యాతి-సత్యమైన రూప్ బసంత్ లుగా (జ్ఞాని-యోగి) అయ్యి తమ నోటితో సదా జ్ఞాన రత్నాలే మాట్లాడుతూ ఉండాలి

ప్రశ్న:-
బాబా పిల్లలను మేల్కొలిపేందుకు ఏ సంజీవిని మూలికను ఇస్తారు?

జవాబు:-
మన్మనాభవ అనగా తండ్రి స్మృతి చేయండి. మేము పరమాత్మ ద్వారా దేవతలుగా అయ్యేందుకు అనగా రాజ్య పదవిని పొందేందుకు ఈ చదువును చదువుకుంటున్నాము అనే నషా ఉండాలి. ఈ స్మృతియే సంజీవిని మూలిక, ఇది మేల్కొల్పుతుంది. అటువంటి వారి అవస్థ ఎప్పుడూ వాడిపోలేదు. వారు సదా స్వయాన్ని చెక్ చేసుకుంటూ, ఇతరులను కూడా సావధానపరుస్తూ ఉంటారు.

ఓంశాంతి.
ఇది కాలేజ్ కదా. ఎలాగైతే స్కూలులో విద్యార్థులు కూర్చున్నప్పుడు, మేము టీచరు ఎదురుగా కూర్చున్నామని భావిస్తారు. ఏ పరీక్ష పాస్ అయ్యేందుకు కూర్చున్నారు అనేది కూడా వారి బుద్ధిలో ఉంటుంది. సత్సంగాలలో వేద-శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తారు, అక్కడ లక్ష్యమేమీ ఉండదు. ఆ శాస్త్రాలు మొదలైనవి మీ బుద్ధి నుండి తొలగిపోయాయి. మనం భవిష్య 21 జన్మల కోసం మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. విద్యార్థులు ఇంట్లో కూర్చుని ఉన్నా లేక ఎక్కడికి వెళ్ళినా సరే, నేను ఫలానా పరీక్ష పాస్ అవుతాను అని బుద్ధిలో ఉంటుంది. పిల్లలైన మీరు కూడా క్లాసులో కూర్చుని ఉన్నారు, మేము దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. మీరు కూడా స్వయాన్ని విద్యార్థిగా భావిస్తారు కదా. మనం ఆత్మలము, ఈ శరీరం ద్వారా మనం చదువుకుంటున్నాము. మనం ఈ శరీరాన్ని వదిలి భవిష్యత్తులో కొత్త శరీరాన్ని తీసుకుంటామని ఆత్మకు తెలుసు. అప్పుడు దేవతలు అని అంటారు. ఇదైతే వికారీ పతిత శరీరము, మనకు మళ్ళీ కొత్త శరీరం లభిస్తుంది. ఈ వివేకం ఇప్పుడు లభించింది. ఆత్మనైన నేను చదువుకుంటున్నాను, జ్ఞాన సాగరుడు చదివిస్తున్నారు. ఇక్కడ మీకు గృహస్థ వ్యవహారము యొక్క చింత ఉండదు. మేము భవిష్యత్తులో మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని బుద్ధిలో ఇదే ఉంటుంది. దేవతలు స్వర్గంలో ఉంటారు. ఈ చింతనను పదే-పదే చేస్తూ ఉన్నట్లయితే పిల్లలకు సంతోషం ఉంటుంది మరియు పురుషార్థం కూడా చేస్తారు. మనసా-వాచా-కర్మణా పవిత్రంగా కూడా ఉంటారు. అందరికీ సంతోషం యొక్క సందేశాన్ని వినిపిస్తూ ఉంటారు. బ్రహ్మాకుమారులైతే చాలా మంది ఉన్నారు కదా. అందరూ విద్యార్థి జీవితంలో ఉన్నారు. అలాగని వ్యాపార వ్యవహారాలలోకి వెళ్ళడంతో ఈ జీవితాన్ని మర్చిపోవడం కాదు. ఉదాహరణకు ఈ మిఠాయి వ్యాపారి ఉన్నారు, ఇతను కూడా నేను విద్యార్థిని అనే భావిస్తారు కదా. విద్యార్థులు ఎప్పుడైనా మిఠాయిలు తయారుచేయాల్సి ఉంటుందా? ఇక్కడైతే మీ విషయమే అతీతమైనది. శరీర నిర్వహణ కోసం ఉద్యోగ-వ్యాపారాలు కూడా చేసుకోవాలి. దానితో పాటు, నేను పరమపిత పరమాత్ముని ద్వారా చదువుకుంటున్నానని బుద్ధిలో గుర్తుండాలి. ఈ సమయంలో ప్రపంచంలో అందరూ నరకవాసులుగా ఉన్నారని మీ బుద్ధిలో ఉంటుంది. కానీ, భారతవాసులైన మేము నరకవాసులుగా ఉన్నామని, భారతవాసులైన మేమే ఒకప్పుడు స్వర్గవాసులుగా ఉండేవారమని ఎవరూ అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు కూడా రోజంతా ఈ నషా ఉండదు. పదే-పదే మర్చిపోతూ ఉంటారు. మీరు బి.కె.లు, టీచర్లు, శిక్షణనిస్తారు. మనుష్యులను దేవతలుగా, నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేస్తున్నారు, అయినా సరే మర్చిపోతారు. ఈ సమయంలో ప్రపంచమంతా ఆసురీ సంప్రదాయంగా ఉందని మీకు తెలుసు. ఆత్మ కూడా పతితంగా ఉంది కనుక శరీరం కూడా పతితంగా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ వికారాల పట్ల అయిష్టత ఏర్పడుతుంది. కామం, క్రోధం మొదలైనవన్నీ అయిష్టత కలిగే విషయాలు. అన్నింటికంటే ఎక్కువ అయిష్టత కలిగే విషయం వికారాలు. సన్యాసులలో కూడా కొంచెం క్రోధముంటుంది. ఎందుకంటే ఎటువంటి భోజనమో, అటువంటి మనస్సు... వారు గృహస్థులదే తింటారు. కొంతమంది భోజనం తినరు కానీ ధనమైతే తీసుకుంటారు కదా. దానిపై పతితుల ప్రభావమైతే ఉంటుంది కదా. పతితుల భోజనం పతితంగానే చేస్తుంది. మీరు విశేషంగా పవిత్రతకే ప్రాధాన్యతను ఇస్తారు. మీ ఈ ప్రచారం పెరుగుతూ ఉంటుంది. మేము పవిత్రంగా అవ్వాలి అని అందరూ కోరుకుంటారు, ఈ విషయం మనసుకు హత్తుకుంటుంది. ఎందుకంటే పవిత్రంగా అవ్వకుండా స్వర్గానికి యజమానులుగా అవ్వలేరు. నెమ్మది-నెమ్మదిగా ఈ విషయాలు అందరి బుద్ధిలోకి వస్తూ ఉంటాయి. ఎవరైతే స్వర్గవాసులుగా అయ్యేది ఉంటుందో, వారే అవుతారు. మేము పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా తప్పకుండా అవుతామని అంటారు. ఇది కళ్యాణకారీ సంగమయుగము, ఈ సమయంలో పతిత ప్రపంచం పావనంగా అవుతుంది. అందుకే దీనిని పురుషోత్తమ యుగమని అంటారు. ఇది కళ్యాణకారీ యుగము. మనుష్య సృష్టికి కళ్యాణం జరుగుతుంది. తండ్రి కళ్యాణకారీ కావున పిల్లలను కూడా అలా తయారుచేస్తారు. వారు వచ్చి యోగం నేర్పించి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు.

ఇది మన హెడ్ స్కూల్ అని మీకు తెలుసు. ఇక్కడ ఎవరికీ ప్రాపంచిక పనులేవీ ఉండవు. బయటకు వెళ్ళడంతో వ్యాపార వ్యవహారాలలో నిమగ్నమైపోతారు, అప్పుడిక మేము విద్యార్థులము, మేము నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నాము అనేది గుర్తుండదు. సమయం ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆలోచనలు బుద్ధిలో నడుస్తాయి. ప్రయత్నం చేసి సమయం తీయాలి. మనం తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవుతున్నామని బుద్ధిలో గుర్తుండాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. వ్యాపారంలో కూడా తీరిక సమయం లభిస్తుంది. మేము ఈశ్వరీయ విద్యార్థులము అనే స్మృతిని ప్రయత్నం చేసి అయినా సరే బుద్ధిలోకి తీసుకురావాలి. జీవనోపాధి కోసం ఆ వ్యాపారం మొదలైనవి చేస్తారు. అది మాయావీ వ్యాపారము, ఇది కూడా మీకు జీవనోపాధి. భవిష్యత్తు కోసం సత్యమైన సంపాదనైతే ఇదే. దీని కోసం చాలా మంచి బుద్ధి కావాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమపిత పరమాత్మను స్మృతి చేయాలి. ఇప్పుడు ఆత్మలైన మనం ఇంటికి వెళ్ళాలి అని అర్థం చేయించాలి. బాబా మనల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చారు. రోజంతా బుద్ధిలో విచార సాగర మథనం నడవాలి. ఆవు గడ్డిని నెమరు వేసినట్లుగా మీరు నెమరువేస్తూ ఉండాలి. పిల్లలకు అవినాశీ ఖజానా లభిస్తుంది. ఇది ఆత్మలకు భోజనం వంటిది. మేము పరమపిత పరమాత్మ ద్వారా దేవతలుగా తయారయ్యేందుకు మరియు రాజ్య పదవిని పొందేందుకు చదువుకుంటున్నామని గుర్తు రావాలి. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దీనిని పదే-పదే మర్చిపోతూ ఉంటారు కావున సంతోషానికి బదులుగా అవస్థ వాడిపోయి ఉంటుంది. ఇది సంజీవిని మూలిక వంటిది. దీనిని మీ వద్ద కూడా ఉంచుకోవాలి మరియు ఇతరులను మేల్కొల్పేందుకు వారికి కూడా ఇవ్వాలి. శాస్త్రాలలో చాలా పెద్ద-పెద్ద కథలను రాసేసారు. బాబా కూర్చుని వీటన్నింటి రహస్యాలను తెలియజేస్తున్నారు. మన్మనాభవ అనగా తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అయిపోతారు. మీ హృదయాన్ని ప్రశ్నించుకుంటూ ఉండండి, చెక్ చేసుకుంటూ ఉండండి, ఒకరికొకరు సావధానపర్చుకుంటూ ఉండండి. ఏదైనా గొడవ జరిగినప్పుడు, బుద్ధి అందులోనే నిమగ్నమైపోయిన కారణంగా, ఎవరు ఏం చెప్పినా, అది మధురంగా అనిపించదు. బుద్ధి మాయలో నిమగ్నమైపోవడంతో ఇక అదే చింత ఉంటుంది. పిల్లలైన మీకైతే సంతోషముండాలి. తండ్రిని స్మృతి చేయండి. కానీ మీరు మీ సమస్యల్లోనే ఉన్నట్లయితే, ఆ మందు పని చేయదు, గుటకలు మింగుతూ ఉంటారు. అలా చేయకూడదు. విద్యార్థులు చదువును వదిలి వెళ్ళిపోరు కదా. మన ఈ చదువు భవిష్యత్తు కోసమని, ఇందులోనే మన కళ్యాణముందని పిల్లలైన మీకు తెలుసు. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటూ కూడా కోర్సు తీసుకోవాలి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే నాలెడ్జ్ ను కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. స్మృతి అనేది సంజీవని మూలిక వంటిది. పరస్పరంలో ఒకరికొకరు స్మృతినిప్పించుకుంటూ ఉండాలి. పతి-పత్ని ఒకరికొకరు స్మృతినిప్పించుకుంటూ ఉండాలి. శివబాబా బ్రహ్మా ద్వారా చదివిస్తున్నారు. శివబాబా రథాన్ని అలంకరిస్తున్నారు కనుక శివబాబా స్మృతి ఉండాలి. రోజంతా స్మృతిలో ఉండడమైతే కష్టము. ఆ అవస్థ చివర్లోనే తయారవ్వనున్నది. కర్మాతీత అవస్థ ఏర్పడనంతవరకు రుస్తుంతో మాయ యుద్ధం చేస్తూనే ఉంటుంది. పరస్పరంలో ఒకరినొకరు సావధానపర్చుకుంటూ ఉన్నతిని పొందండి అని అంటూ ఉంటారు కూడా. ఆఫీసర్లు నౌకర్లకు కూడా చెప్తూ ఉంటారు - మాకు ఈ విషయాలను గుర్తు చేయండి అని. మీరు కూడా పరస్పరంలో ఒకరికొకరు స్మృతినిప్పించుకోండి. గమ్యం చాలా ఉన్నతమైనది. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయడంతో పావనంగా అయిపోతారు. తండ్రి కొత్త విషయాలేవీ వినిపించడం లేదు. మీరు లక్షల, కోట్ల సార్లు ఈ జ్ఞానాన్ని విన్నారు, మళ్ళీ వింటారు. మేము కల్ప-కల్పము విన్నాము అని చెప్పేవారు ఏ సత్సంగంలోనూ ఉండరు. ఇప్పుడు వింటున్నారు, తర్వాత మళ్ళీ వింటారు. కల్ప-కల్పము వింటూ వచ్చామని ఎవరూ చెప్పలేరు. మీరు అర్ధకల్పం భక్తి చేసారని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మళ్ళీ మీకు జ్ఞానం లభించింది, దీని ద్వారా సద్గతి కలుగుతుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. ఇది అర్థం చేసుకునే విషయం కదా. పురుషార్థం చేయాలి. జడ్జి లేక ఎవరైనా గొప్ప వ్యక్తి కొడుకు ఏదైనా తప్పుడు పని చేస్తే పేరు అప్రతిష్ఠపాలవుతుంది. ఇక్కడ మీరు కూడా తండ్రికి చెందినవారిగా అయ్యారు కనుక అటువంటి కర్మలేవీ చేయకూడదు, లేదంటే తండ్రికి నింద తీసుకొస్తారు. సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు. ఈశ్వరుని సంతానంగా అయ్యారు కనుక ఆసురీ కర్మలకు భయపడాలి. శ్రీమతాన్ని అనుసరించాల్సి ఉంటుంది. సొంత మతాన్ని అనుసరిస్తే మోసపోతారు, పదవి భ్రష్టమైపోతుంది. మేము మీ మతాన్ని సరిగ్గా అనుసరిస్తున్నామా అని బాబాను అడగవచ్చు కూడా. తండ్రి యొక్క మొట్టమొదటి మతము - తండ్రిని స్మృతి చేయండి. ఏ వికర్మలూ చేయకండి. బాబా, నేను ఏ వికర్మలు చేస్తున్నానో మీకు తెలిస్తే చెప్పండి అని అడుగుతారు. నాకు తెలిస్తే చెప్తాను, మీ ద్వారా ఈ-ఈ తప్పులు జరుగుతాయి, వీటిని వికర్మలని అంటారు అని బాబా చెప్తారు. అన్నింటికంటే పెద్ద వికర్మ కామ వికారానికి సంబంధించినది. దీని గురించే ఎక్కువ గొడవలు జరుగుతాయి. పిల్లలకు ధైర్యం ఉండాలి, ఆలోచించాలి. మేము అసలు వివాహము చేసుకునేదే లేదు అని చెప్పే కుమారీల గ్రూపు ఉండాలి. ఇప్పుడిది కల్పం యొక్క సంగమయుగము, ఇందులో పురుషోత్తములుగా అవ్వాలి. ఈ లక్ష్మీనారాయణులను పురుషోత్తములు అని అంటారు. వికారులను పురుషోత్తములని అనరు. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. అలా తయారయ్యే హక్కు అందరికీ ఉంది. పురుషోత్తమ మాసంలో మీరు ఎంత సేవ చేయవచ్చు. చాలా వైభవంగా చేయాలి. ఈ పురుషోత్తమ యుగమే ఉత్తమ యుగము. ఈ సమయంలో మనుష్యులు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు. ఇది సాధారణమైన విషయము. పిల్లలైన మీరు మంచి రీతిగా అర్థం చేయించాలి. పురుషోత్తములు సత్యయుగంలో ఉంటారు. కలియుగంలో ఉత్తమ పురుషులెవరూ ఉండరు. ఇది పతిత ప్రపంచము. అక్కడైతే అందరూ పవిత్రంగానే ఉంటారు. ఇతరులకు అర్థం చేయించేందుకు తండ్రి ఈ విషయాలన్నింటినీ పిల్లలకు అర్థం చేయిస్తారు. అవకాశం చూసి అర్థం చేయించాలి. మీరు ఇక్కడ కూర్చున్నారు. మాకు నిరాకార బాబా, పరమపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పిస్తున్నారని, మేము విద్యార్థులమని మీరు అర్థం చేసుకున్నారు. ఈ చదువు ద్వారా స్వర్గంలో దేవీ-దేవతలుగా అవుతున్నారు. అన్ని పరీక్షల కంటే ఇదే పెద్ద పరీక్ష, ఇది రాజ్యం ప్రాప్తి చేసుకునే పరీక్ష. దీని కోసం పరమాత్మ తప్ప ఎవరూ చదివించలేరు. బాబా స్వయం పరోపకారి, వారు స్వయం స్వర్గానికి యజమానిగా అవ్వరు. స్వర్గ రాకుమారునిగా శ్రీకృష్ణుడే అవుతారు. బాబా నిష్కామ సేవ చేస్తారు. బాబా అంటారు - నేను రాజుగా అవ్వను, మిమ్మల్ని రాజులకే రాజులుగా చేస్తాను. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. చాలా మంది ఇక్కడ షావుకార్లుగా ఉంటారు కానీ అక్కడ పేదవారిగా అయిపోతారు మరియు ఎవరైతే ఇప్పుడు పేదవారిగా ఉన్నారో, వారు అక్కడ గొప్ప షావుకార్లుగా అవుతారు. విశ్వానికి యజమానులుగా అవ్వడమనేది అనంతమైన విషయం కదా. నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా చేస్తానని, స్వర్గానికి యజమానులుగా చేస్తాను అంటూ ఉంటారు కూడా. మనం స్వర్గానికి యజమానులుగా అవుతున్నామని మీకు తెలుసు కనుక ఎంత నషా ఉండాలి. మనల్ని చదివించేవారు పరమపిత పరమాత్మ. ఇప్పుడు మనం నరకవాసుల నుండి స్వర్గవాసులైన దేవతలుగా అవుతాము. ఈ విషయం గుర్తున్నా సరే, సంతోషం యొక్క పాదరసం ఎక్కి ఉంటుంది. స్టూడెంట్ లైఫ్ ఈజ్ ది బెస్ట్ (విద్యార్థి జీవితం అత్యుత్తమమైన జీవితం). పురుషార్థం చేసి రాజా, రాణిగా అవ్వాలి కదా. మనము రాజుగా అయి, మళ్ళీ పేదవారిగా అవుతామని ఇతరులకు చెప్పకూడదు. ఈ విషయం చెప్పకూడదు. ఏమవ్వాలని అనుకుంటున్నారు - అని అడగాలి. అందరూ, మేము విశ్వానికి యజమానులుగా అవుతామని అంటారు. తండ్రి అయిన భగవంతుడు మాత్రమే అలా తయారుచేయగలరు. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయిపోతారని అంటారు. ఇది ఎంత సహజమైన విషయము. ఎవరైనా సరే, ఎంతటి పేదవారైనా సరే అలా తయారవ్వగలరు. ఇందులో ధనం విషయమేమీ లేదు. అందుకే తండ్రిని పేదల పెన్నిధి అని అంటారు.

తండ్రిని స్మృతి చేసి పాపాల కుండను ఖాళీ చేసుకోవాలి, ఎవరు ఎంత శ్రమ చేస్తారో అంత పొందుతారు. మీరు ఎంత పైకి (ఉన్నతంగా) ఎక్కుతారు అనేది మెట్ల చిత్రంలో చూస్తారు. ఎవరైతే జ్ఞాన మార్గంలో సదా ఉన్నతిని పొందుతూ ఉంటారో, వారు రాజ్య రసాన్ని ఆస్వాదిస్తారు, ఒకవేళ తప్పటడుగు వేసి మాయకు వశమై దిగజారితే అధఃపాతాళం తప్పదు. వికారాల్లో పడిపోయారంటే, విడాకులిచ్చేసారంటే బాబా అంటారు - పూర్తిగా క్రింద పడిపోతారు. సుపుత్రులైన పిల్లలైతే పురుషార్థం చేసి తమ జన్మను వజ్ర సమానంగా తయారుచేసుకుంటారు. పిల్లలకు చాలా పురుషార్థం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరెంత చేస్తారో, అంత పొందుతారు. మాత-పితలను అనుసరించండి, తమ సమానంగా తయారుచేయండి అని బాబా అందరికీ చెప్తారు. ఎంతగా దయాహృదయులుగా అవుతారో, అంతగా మీకే లాభముంటుంది. సమయాన్ని వృథా చేసుకోకూడదు. ఇతరులకు యుక్తులను తెలుపుతూ ఉండాలి. లేదంటే అంత ఉన్నత పదవిని పొందలేరు. చివర్లో మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. అప్పుడిక ఆ సమయంలో మీరేమీ చేయలేరు. పరీక్షలో ఫెయిల్ అయ్యారు అంటే ఇక ఫెయిల్ అయినట్లే. చివర్లో పశ్చాత్తాపపడాల్సిన అవసరం రాకూడదు. ఇక అప్పుడు పురుషార్థం చేయలేరు. అందుకే, ఎంతగా స్వయం మరియు ఇతరుల కళ్యాణం చేయాలో, అంత చేయండి. అంధులకు చేతి కర్రగా అవ్వండి. కల్ప-కల్పము స్వర్గ స్థాపన చేసారు, ఇప్పుడు కూడా తప్పకుండా చేస్తారు. డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఇప్పుడు ఎవరు చేస్తారో, వారే పొందుతారు. బాబా యొక్క ప్రియమైన పిల్లలు దాగి ఉండరు. రూప్-బసంత్ లు (జ్ఞాని-యోగి) వలె నోటి నుండి రత్నాలే వెలువడాలి. కపటంతో గొడవలు పెట్టేవారిగా కాకూడదు, ఇతరులను నష్టపర్చకూడదు. మీకు ఎవరైనా తప్పుడు విషయాలను వినిపిస్తే, వారు కపటంతో గొడవలు పెట్టేవారని భావించండి. వారితో జాగ్రత్తగా ఉండాలి. తమ అనంతమైన వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకోవడంలో పూర్తిగా తత్పరులై ఉండండి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయం మరియు ఇతరుల కళ్యాణం చేయాలి. అంధులకు చేతి కర్రగా అవ్వాలి. ఎవరైనా ఎప్పుడైనా తప్పుడు మాటలు వినిపిస్తే వారితో జాగ్రత్తగా ఉండాలి.

2. మనసా-వాచా-కర్మణా పవిత్రంగా అవ్వాలి. మేము విద్యార్థులము, భగవంతుడు మాకు దేవతలుగా తయారయ్యే చదువును చదివిస్తున్నారు - ఈ సంతోషంలోనే ఉండాలి.

వరదానము:-
శక్తిశాలి దర్పణం ద్వారా అందరికీ స్వయం యొక్క సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార మూర్త భవ

ఎలాగైతే దర్పణం ముందుకు ఎవరు వెళ్ళినా సరే, వారికి స్వయం యొక్క సాక్షాత్కారం స్పష్టంగా జరుగుతుంది. కానీ ఒకవేళ దర్పణం శక్తిశాలిగా లేకపోతే, రియల్ రూపానికి బదులుగా వేరే రూపం కనిపిస్తుంది. ఉండడం సన్నగా ఉంటారు కానీ లావుగా ఉన్నట్లు కనిపిస్తారు. అందుకే, మీరు ఎటువంటి శక్తిశాలి దర్పణంగా అవ్వాలంటే, అందరికీ స్వయం యొక్క సాక్షాత్కారం చేయించగలగాలి అనగా మీ ఎదురుగా వస్తూనే వారు దేహాన్ని మరచి, తమ దేహీ రూపంలో స్థితులవ్వాలి - ఇదే నిజమైన సేవ, దీనితోనే జయ-జయకారాలు జరుగుతాయి.

స్లోగన్:-
శిక్షణలను స్వరూపంలోకి తీసుకువచ్చే వారే జ్ఞాన స్వరూప మరియు ప్రేమ స్వరూప ఆత్మలు.