07-10-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - చెడు వినకండి. ఒక్క తండ్రి నుండే వినాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండాలి

ప్రశ్న:-

ఏ ఆట గురించి యథార్థంగా తెలుసుకున్న పిల్లలు ఎప్పుడూ తికమకపడరు?

జవాబు:-

దుఃఖం మరియు సుఖం, భక్తి మరియు జ్ఞానముల ఆట ఏదైతే నడుస్తుందో, దీని గురించి యథార్థ రీతిగా తెలిసినవారు ఎప్పుడూ తికమకపడరు. భగవంతుడు ఎవ్వరికీ దుఃఖాన్నివ్వరని మీకు తెలుసు. వారు దుఃఖహర్త-సుఖకర్త. ఎప్పుడైతే అందరూ దుఃఖితులుగా అవుతారో, అప్పుడు దుఃఖాల నుండి విముక్తులుగా చేసేందుకు వారు వస్తారు.

గీతము:-
ఈ రోజు ఉదయాన్నే ఎవరు వచ్చారు..... (యహ్ కౌన్ ఆజ్ ఆయా సవేరే సవేరే.....)

ఓంశాంతి.

పిల్లలు ఏం విన్నారు? ఇది భక్తిలోని పాట. ఇంగ్లీషులో భక్తిని ఫిలాసఫీ అని అంటారు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పి.హెచ్.డి) అనే టైటిల్ లభిస్తుంది. ఇప్పుడు ఫిలాసఫీ (భక్తి) గురించైతే చిన్న, పెద్ద అందరికీ తెలుసు. ఈశ్వరుడు ఎక్కడ ఉంటారు అని ఎవరినైనా అడగండి, అప్పుడు వారు సర్వవ్యాపి అని అంటారు. ఇది కూడా ఒక ఫిలాసఫీయే కదా. ఇప్పుడు తండ్రి శాస్త్రాల విషయాలనేవీ వినిపించరు. భక్తులెవ్వరినీ జ్ఞానసాగరుడు అని అనరు. వారిలో జ్ఞానము లేదు, అలాగని వారు జ్ఞానసాగరుని పిల్లలు కూడా కారు. జ్ఞానసాగరుడైన తండ్రి గురించి ఎవరికీ తెలియదు. అలాగే ఎవరూ తమను తాము వారి సంతానముగా కూడా భావించరు. వారంతా భగవంతుడిని కలుసుకునేందుకు భక్తి చేస్తారు కానీ భగవంతుని గురించే తెలియనప్పుడు భక్తితో లాభమేముంటుంది? చాలామందికి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనే టైటిల్ లభిస్తూ ఉంటుంది. వారి బుద్ధిలో, ఈశ్వరుడు సర్వవ్యాపి అన్న మాట ఒక్కటే ఉంటుంది. వారు దానిని ఫిలాసఫీగా భావిస్తారు. దీని కారణంగానే పడిపోతూ వచ్చారు. దీనినే ధర్మ గ్లాని అని అంటారు. మనం మనుష్యులెవ్వరితోనూ శాస్త్రాల గురించి వాదోపవాదాలు చేయము. మనం ఏ మనుష్యులు ద్వారా చదువుకోవడం లేదు. మిగిలిన మనుష్యులందరూ మనుష్యుల ద్వారా చదువుకుంటారు. వేదశాస్త్రాలు మొదలైనవన్నీ మనుష్యుల ద్వారానే చదువుకుంటారు, వాటిని తయారుచేయడం కూడా మనుష్యులే తయారుచేసారు. మీకు ఈ జ్ఞానాన్ని వినిపించేవారు ఆత్మిక తండ్రి ఒక్కరే. వారు ఒక్కసారి మాత్రమే వచ్చి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మనకు మనుష్యులెవ్వరి నుండి ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఆత్మిక తండ్రి నుండి మాత్రమే వినాలి. వినేవారు ఆత్మిక పిల్లలు, ఆత్మలు. ఆ మనుష్యులందరూ మనుష్యులకు వినిపిస్తారు. ఇది ఆత్మిక తండ్రి ఇచ్చే జ్ఞానము, వారిది మనుష్యుల జ్ఞానము. ఈ బాబా (సాకార) కూడా మనిషే కదా. వాళ్ళకు చెప్పండి - ఆత్మిక తండ్రి వీరి ద్వారా వినిపిస్తారు, ఆత్మలైన మేము వింటాము, తర్వాత ఆత్మలైన మేము శరీరం ద్వారా ఇతరులకు వినిపిస్తాము. ఇది ఆత్మిక జ్ఞానము. మిగతా అంతా భౌతిక జ్ఞానము. భక్తి మార్గంలో శరీరాలను పూజిస్తారు. తండ్రి అంటారు - మీరు స్వయాన్ని ఒక మనిషిగా లేక భక్తునిగా భావించకండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఆత్మలైన మీరు పరస్పరంలో సోదరులు. ఆత్మ-పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారని అంటూ ఉంటారు కూడా. కావున మనం మనుష్యులెవ్వరి నుండి వినకూడదు. ఎవరైనా ప్రశ్న అడిగితే, మాది శాస్త్రాల జ్ఞానమేమీ కాదు అని చెప్పండి. మనం దానిని ఫిలాసఫీ అని అంటాము అనగా అది భక్తి మార్గపు జ్ఞానము. సద్గతినిచ్చే జ్ఞానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. సర్వుల సద్గతిదాత ఒక్కరే అని అంటూ ఉంటారు. కావున పిల్లలైన మీరు ఎవరితోనూ వాదించకూడదు.

తండ్రి అంటారు - జ్ఞానం యొక్క అథారిటీ - జ్ఞాన సాగరుడినైన నేను. నేను మీకు శాస్త్రాలు మొదలైనవేవీ వినిపించను. నేను అందిస్తున్న ఈ జ్ఞానము ఆత్మిక జ్ఞానము, మిగిలినదంతా భౌతిక జ్ఞానము. ఆ సత్సంగాలు మొదలైనవన్నీ భక్తి మార్గం కోసం ఉన్నవి. ఈ ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. కావున దేహీ-అభిమానులుగా అవ్వడంలో పిల్లలకు శ్రమ అనిపిస్తుంది. ఆత్మలైన మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి పిల్లలు తప్పకుండా తండ్రి సింహాసనానికే వారసులు అవుతారు కదా. లక్ష్మీనారాయణులు కూడా దేహధారులే. వారి పిల్లలు దైహిక తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. ఈ విషయము అతీతమైనది. సత్యయుగంలో కూడా ఇది ఒక దైహిక విషయంలానే ఉంటుంది. అక్కడ ఆత్మిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుందని అనరు. దేహాభిమానాన్ని తెంచివేయాలి. నేను ఒక ఆత్మను మరియు నేను తండ్రిని స్మృతి చేయాలి - దీనినే భారత్ యొక్క ప్రాచీన యోగమని అంటూ ఉంటారు. యాద్ (స్మృతి) అనేది హిందీ పదము. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని మీకు ఎవరు ఇస్తున్నారు అనేది మనుష్యులెవ్వరికీ తెలియదు. జన్మజన్మలుగా మనుష్యులు మనుష్యులతో మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆత్మ వినిపిస్తుంది, అందుకే దీనిని ఆత్మిక స్పిరిచ్యుల్ నాలెడ్జ్ అని అంటారు. గీతను కూడా వారు స్పిరిచ్యుల్ నాలెడ్జ్ (ఆధ్యాత్మిక జ్ఞానం) గా భావిస్తారు కానీ ఇందులో దేహధారి అయిన కృష్ణుని పేరు వేసేసారు. మనుష్యులెవ్వరిలోనూ ఈ జ్ఞానం ఉండదు అని తండ్రి అంటారు. ఎప్పుడైనా, ఎవరైనా మీతో వాదిస్తే, వారికి - మీది భక్తికి సంబంధించిన జ్ఞానం, ఇది మనుష్యుల ద్వారా తయారుచేయబడిన శాస్త్రాల జ్ఞానము అని చెప్పండి. సత్యమైన జ్ఞానమైతే ఒక్క జ్ఞానసాగరుడైన తండ్రి వద్ద మాత్రమే ఉంది. స్వయంగా వారే జ్ఞానాన్ని ఇస్తున్నారు. వారిని సుప్రీమ్ తండ్రి అని కూడా అంటారు. పూజ కూడా ఆ నిరాకారునికి జరుగుతుంది. ఒకవేళ నిరాకారిగా ఉన్న ఇంకెవరికైనా పూజ జరుగుతుందంటే, వారు కూడా ఈ తండ్రి పిల్లలే. మట్టితో సాలిగ్రామాలను తయారుచేసి పూజిస్తారు. రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. ఆ పరమపిత పరమాత్మ నిరాకారీ ప్రపంచంలో ఉంటారని మీకు తెలుసు. ఆత్మలైన మనం కూడా అక్కడే ఉంటాము. ఆ జ్ఞాన సాగరుడు వచ్చి జ్ఞానాన్ని వినిపించి అందరికీ సద్గతినిస్తారు. వారు అత్యంత అతీతమైన స్థానంలో ఉండే పరమపిత పరమాత్మ. సోదరులైన ఆత్మలందరికీ పాత్ర లభించి ఉంది. వారే తర్వాత శరీరాలను ధారణ చేసి సోదరీ-సోదరులుగా అవుతారు. ఆత్మలందరూ ఒక్క తండ్రి పిల్లలు. ఆత్మ శరీరాన్ని ధారణ చేసినప్పుడు స్వర్గంలో సుఖాన్ని మరియు నరకంలో దుఃఖాన్ని పొందుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? జ్ఞానం మరియు భక్తి ఉంటాయని అర్థం చేయించడం జరుగుతుంది. అది పగలు, ఇది రాత్రి. జ్ఞానంతో సుఖము, భక్తితో దుఃఖము కలుగుతుంది. ఈ ఆట ఈ విధంగా తయారుచేయబడింది. అంతేకానీ, దుఃఖం, సుఖం అన్నీ భగవంతుడే రచిస్తారని కాదు. దుఃఖితులైనప్పుడే భగవంతుడిని పిలుస్తారు. వారిని సుఖాన్నిచ్చేవారిగా భావిస్తారు. తర్వాత సుఖం యొక్క సమయం పూర్తయినప్పుడు రావణుని పంచ వికారాల కారణంగా దుఃఖం మొదలవుతుంది, ఇదే ఆట. దీనిని యథార్థ రీతిలో అర్థం చేసుకోవాలి. దీనినే ఆత్మిక జ్ఞానమని అంటారు. మిగిలినదంతా భౌతిక జ్ఞానము. మనకి అది వినాలని ఉండదు. మనకు లభించిన ఆజ్ఞ ఏమిటంటే - కేవలం నిరాకార తండ్రినైన నా ద్వారా మాత్రమే వినండి - అని. తండ్రి అంటారు - చెడు వినకండి..... మేము ఒక్క భగవంతుని నుండి మాత్రమే వింటాము మరియు మీరు మనుష్యుల నుండి వింటారు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. పెద్ద-పెద్ద విద్వాంసులు శాస్త్రాలు మొదలైనవాటిని చదువుతారు. వాటినైతే మనము కూడా చాలా చదివాము. ఇప్పుడు భగవంతుడు అంటారు - మీరు చాలా మంది గురువులను ఆశ్రయించారు, ఇప్పుడు వారిని వదిలేయండి, నేను ఏదైతే వినిపిస్తున్నానో అది మాత్రమే వినండి. భగవంతుడు నిరాకారుడు. వారి పేరు శివ. ఇప్పుడు మనం వారి నుండి వింటున్నాము. స్వయంగా తండ్రి తమ పరిచయాన్ని మరియు తమ రచన యొక్క ఆదిమధ్యాంతాల పరిచయాన్ని ఇస్తారు. అలాంటప్పుడు మేము శాస్త్రాలు మొదలైనవాటికి సంబంధించిన విషయాలను మీ నుండి ఎందుకు వినాలి! మేము మీకు ఆత్మిక జ్ఞానాన్ని వినిపిస్తాము. వినాలనుకుంటే వినండి. ఇందులో తికమకపడే విషయమేమీ లేదు. ప్రపంచమంతా ఒకవైపు ఉంది, ఇంకొక వైపు మీరు ఎంత తక్కువమంది ఉన్నారు. ఇప్పుడు తండ్రి అంటారు - నన్ను స్మృతి చేస్తే మీ పై ఉన్న పాపాల భారం తొలగిపోతుంది మరియు మీరు పవిత్రంగా అవుతారు. ఎవరైతే పవిత్రంగా అవుతారో, వారే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు పాత ప్రపంచం మారనున్నది. కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది. సత్యయుగం పావన ప్రపంచము. మీరు వచ్చి పావన ప్రపంచాన్ని తయారుచేయండి అని నన్ను కలియుగంలోనే పిలుస్తారు. అందుకే ఇప్పుడు నేను వచ్చాను. నన్నొక్కడినే స్మృతి చేయండి. ఇప్పుడు ప్రపంచం మారుతుంది. ఇది మీ అంతిమ జన్మ. ఈ పాత ప్రపంచంలో ఆసురీ రాజ్యం సమాప్తమై, రామ రాజ్యం స్థాపనవుతుంది. అందుకే ఇప్పుడు ఈ అంతిమ జన్మలో గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. ఇది విషయ సాగరం కదా. కమలపుష్పం నీటిపై ఉంటుంది. ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. మనం రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా మారుతుంది. ఆ ధర్మ స్థాపకులు కేవలం తమ-తమ ధర్మాలను స్థాపన చేస్తారు. వారు ముందు పావనంగా ఉంటారు, తర్వాత పతితంగా అవుతారు. ఒక్క సద్గురువు మాత్రమే సద్గతిదాత. మనుష్యులు సద్గతిలోకి వెళ్ళాలనుకున్నప్పుడే గురువులను ఆశ్రయిస్తారు. పాపాలు బాగా పెరిగినప్పుడు ఆత్మిక తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తారు. భక్తికి ఫలమైన జ్ఞానము మీకు భగవంతుని ద్వారా లభిస్తుంది. భగవంతుడు భక్తినేమీ నేర్పించరు. వారు జ్ఞానాన్ని ఇస్తారు. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని అంటారు. పావనంగా అయ్యేందుకు వేరే మార్గమేమీ లేదు. కొత్త ప్రపంచంలో అందరూ స్వర్గవాసులుగా ఉంటారు. ఇప్పుడు పాత ప్రపంచంలో అందరూ నరకవాసులుగా ఉన్నారు. అందుకే తండ్రి అంటారు - నేను అందరినీ ఉద్ధరించేందుకు వస్తాను, నేనే వచ్చి ఆత్మిక జ్ఞానాన్ని ఇస్తాను. నేను మీ తండ్రిని అని తండ్రి తమ పరిచయాన్ని ఇస్తున్నారు. ఇప్పుడిది నరకము. కొత్త ప్రపంచాన్ని స్వర్గమని అంటారు. ఇక్కడే స్వర్గము, నరకము ఉన్నాయని ఎలా అంటారు. ఎవరి వద్దనైతే చాలా ధనముంటుందో, వారు స్వర్గంలో ఉన్నారని భావిస్తారు. కానీ స్వర్గమనేది కొత్త ప్రపంచంలో ఉంటుంది. ఇక్కడ స్వర్గం ఎక్కడ నుండి వస్తుంది! అందుకే మనం మనుష్యులెవ్వరి మాటలు వినము. మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలంటే నన్నొక్కడినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. రోజంతా మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉండాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క తండ్రి నుండి మాత్రమే ఆత్మిక విషయాలను వినాలి. ఎవరితోనూ వేరే విషయాల గురించి వాదోపవాదాలు చేయకూడదు.

2. దేహీ-అభిమానులుగా అయ్యే శ్రమను చేయాలి. సతోప్రధానంగా అయ్యేందుకు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి.

వరదానము:-

తండ్రి చేయి మరియు తోడు యొక్క స్మృతితో కష్టతరమైనదానిని సులభం చేసుకునే చింతలేనివారిగా, నిశ్చింతగా కండి

ఎవరైనా పెద్దవారి చేతిలో చేయి ఉంటే, వారి స్థితి చింతలేనిదిగా, నిశ్చింతగా ఉంటుంది. అలా ప్రతి కర్మలోనూ ఇదే భావించాలి - బాప్ దాదా నాకు తోడుగా కూడా ఉన్నారు మరియు మా ఈ అలౌకిక జీవితం యొక్క చేయి వారి చేతిలో ఉంది అనగా జీవితం వారి ఆధీనంలో ఉంది. కనుక బాధ్యత కూడా వారిదే అవుతుంది. భారమంతా తండ్రిపై పెట్టి స్వయాన్ని తేలికగా చేసుకోండి. భారాన్ని దించుకునే సాధనం మరియు కష్టతరమైనదానిని సులభం చేసుకునే సాధనము - తండ్రి చేయి మరియు తోడు.

స్లోగన్:-

పురుషార్థంలో సత్యత ఉన్నట్లయితే బాప్ దాదా నుండి ఎక్స్ ట్రా (అదనపు) సహాయాన్ని అనుభవం చేస్తారు.


మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు
1. జీవితానికి ఆధారము - జ్ఞానము, యోగము మరియు దైవీ గుణాల ధారణ

మనకు పరమపిత పరమాత్ముని ద్వారా జ్ఞానం లభిస్తుందని మనకు నిశ్చయముంది. ఈ జ్ఞానంలో ముఖ్యంగా మూడు పాయింట్లు ఉన్నాయి. వాటి కోసం మనం పూర్తి పురుషార్థం చేయాలనే అటెన్షన్ పెట్టుకోవాలి. ఇందులో మొదటిది - యోగము అనగా నిరంతర ఈశ్వరీయ స్మృతి, దీనితో వికర్మలు వినాశనమవుతాయి. రెండవది - జ్ఞానము అనగా ఈ మొత్తం బ్రహ్మాండము మరియు సృష్టి ఆదిమధ్యాంతాలు ఎలా ఉంటాయి అనేదాని జ్ఞానము. ఈ జ్ఞానమున్నప్పుడే ఈ జీవితంలో ప్రాక్టికల్ చేంజ్ (పరివర్తన) వస్తుంది మరియు మనం భవిష్య ప్రారబ్ధాన్ని బాగా తయారుచేసుకోగలము. మూడవ పాయింటు - మన క్వాలిఫికేషన్ - మనం సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా తప్పకుండా అవ్వాలి, అప్పుడే దేవతలుగా తయారవ్వగలము. కావున మనం నడుస్తూ-తిరుగుతూ, తింటూ, తాగుతూ ఈ మూడు పాయింట్ల పట్ల తప్పకుండా అటెన్షన్ పెట్టాలి. ఈ ఒక్క జన్మలోనే జ్ఞానబలం, యోగబలం ఉంటాయి మరియు దైవీ గుణాల ధారణ జరుగుతుంది. ఈ మూడింటికి పరస్పరంలో కనెక్షన్ ఉంది. జ్ఞానం లేకుండా యోగం జోడించలేము మరియు యోగం లేకుండా దైవీ గుణాల ధారణ జరగదు. ఈ మూడు పాయింట్ల పైనే మొత్తం జీవితమంతా ఆధారపడి ఉంది. అప్పుడే వికర్మల ఖాతా సమాప్తమై మంచి కర్మలు తయారవుతాయి, దీనినే ఈశ్వరీయ జీవితము అని అంటారు.

2. భారత్ యొక్క ప్రాచీన యోగము పరమాత్మ ద్వారా నేర్పించబడినది

మన ఈ ఈశ్వరీయ యోగము భారత్ లో ప్రాచీన యోగము అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ యోగాన్ని అవినాశీ యోగమని ఎందుకు అంటారు? ఎందుకంటే ఇది అవినాశీ పరమపిత పరమాత్మ ద్వారా నేర్పించబడినది. యోగాన్ని ఇతర మనుష్యాత్మలు కూడా నేర్పిస్తూ ఉండవచ్చు, అందుకే యోగాశ్రమాలు మొదలైనవాటిని తెరుస్తూ ఉంటారు. కానీ వారు ప్రాచీన యోగాన్ని నేర్పించలేరు. ఒకవేళ అది యోగమే కనుక అయితే, ఆ బలం ఎక్కడుంది? భారత్ రోజు-రోజుకు బలహీనమవుతూ ఉంది. దీనితో, వారు నేర్పించే యోగము అవినాశీ యోగము కాదని ఋజువవుతుంది. ఎవరితోనైతే యోగం జోడించాలో, స్వయం వారు మాత్రమే ఆ యోగాన్ని నేర్పించగలరు. ఇకపోతే, మిగతా ఎవరితోనూ యోగమే జోడించకూడదు అన్నప్పుడు మిగతావారు ఎలా నేర్పిస్తారు? ఈ కార్యాన్ని స్వయంగా పరమాత్మయే చేయగలరు. వారే మనకు పూర్తి బేధాన్ని తెలుపగలరు. ఇకపోతే అన్ని వైపులా, మేము యోగాన్ని నేర్పిస్తామని అంటూ ఉంటారు. సత్యమైన యోగమునైతే స్వయంగా పరమాత్మయే నేర్పించి సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాలను మరియు దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తారని మనకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రాచీన యోగాన్ని పరమాత్మ వచ్చి కల్ప-కల్పము మనకు నేర్పిస్తారు. వారంటారు - ఓ ఆత్మలూ, పరమాత్మనైన నాతో నిరంతరం యోగాన్ని జోడించినట్లయితే మీ పాపాలు నశిస్తాయి. అచ్ఛా. ఓం శాంతి.