08-04-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీరు పుష్పాలుగా అయి అందరికీ సుఖాన్నివ్వాలి, పుష్పాల వంటి పిల్లల నోటి నుండి రత్నాలే వెలువడతాయి”

ప్రశ్న:-

పుష్పాలుగా అయ్యే పిల్లలకు సదా సుగంధభరితంగా ఉండేందుకు భగవంతుడు ఎటువంటి శిక్షణనిస్తారు?

జవాబు:-

ఓ నా పుష్పాల వంటి పిల్లలూ, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి - నాలో ఆసురీ అవగుణం రూపీ ముల్లు ఏదీ లేదు కదా! ఒకవేళ లోపల ఏదైనా ముల్లు ఉన్నట్లయితే - ఎలాగైతే ఇతరుల అవగుణాల పట్ల ద్వేషం కలుగుతుందో, అలా మీ ఆసురీ అవగుణాలను కూడా ద్వేషించండి, అప్పుడు ముల్లు తొలగిపోతుంది. శిక్షలు అనుభవించవలసి వచ్చే విధమైన వికర్మలేవీ మనసా-వాచా-కర్మణా జరగడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఈ సమయంలో ఇది రావణ రాజ్యము కావున మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు, అందుకే వారిని అడవి ముళ్ళు అని అంటారు. ఇది ఎవరు అర్థం చేయిస్తారు? అనంతమైన తండ్రి. వారిప్పుడు ముళ్ళను పుష్పాలుగా చేస్తున్నారు. మాయ ఎటువంటిదంటే, అక్కడక్కడా పుష్పాలుగా అవుతున్నవారిని, వెంటనే మళ్ళీ ముళ్ళగా చేసేస్తుంది. దీనినే ముళ్ళ అడవి అని అంటారు, ఇందులో అనేక రకాల జంతువుల వలె ఉండే మనుష్యులు ఉంటారు. వాస్తవానికి మనుష్యులే కానీ పరస్పరంలో జంతువుల వలె కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. ప్రతి ఇంట్లోనూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. అందరూ విషయ సాగరంలోనే ఉన్నారు, ఈ ప్రపంచమంతా విషం యొక్క చాలా పెద్ద సాగరము, ఇందులో మనుష్యులు మునకలు వేస్తున్నారు. దీనినే పతిత భ్రష్టాచారీ ప్రపంచమని అంటారు. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. తండ్రిని తోట యజమాని అని కూడా అంటారు. బాబా కూర్చుని అర్థం చేయిస్తారు - గీతలో జ్ఞానం యొక్క విషయాలున్నాయి మరియు భాగవతంలో మనుష్యుల నడవడిక ఎలా ఉంటుందన్న వర్ణణ ఉంది. ఏటువంటి విషయాలను రాసేసారు. సత్యయుగంలో ఇటువంటివి చెప్పరు. సత్యయుగము పుష్పాల తోట. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతున్నారు. పుష్పాలుగా అయి మళ్ళీ ముళ్ళగా అయిపోతారు. ఈ రోజు చాలా బాగా నడుచుకుంటారు, మళ్ళీ మాయా తుఫాన్లు వచ్చేస్తాయి. కూర్చుని-కూర్చునే మాయ ఎటువంటి పరిస్థితికి తీసుకొస్తుంది. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తానని తండ్రి అంటారు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారని భారతవాసులకు చెప్తారు. ఇది నిన్నటి విషయమే - లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, వజ్ర వైఢూర్యాల మహళ్ళుండేవి, దీనినే గార్డెన్ ఆఫ్ అల్లా అని అంటారు. అడవి ఇక్కడే ఉంది, తర్వాత తోట కూడా ఇక్కడే ఉంటుంది కదా. భారత్ స్వర్గంగా ఉండేది, అక్కడ అన్నీ పుష్పాలే ఉండేవి. తండ్రియే పుష్పాల తోటను తయారుచేస్తారు. పుష్పాలుగా అవుతూ-అవుతూ మళ్ళీ సాంగత్య దోషంలోకి వచ్చి పాడైపోతారు. బాబా, మేము ఇక వివాహం చేసుకుంటామని అంటారు. మాయ ఆర్భాటాన్ని చూస్తారు కదా. ఇక్కడైతే పూర్తి శాంతి ఉంటుంది. ఈ ప్రపంచమంతా అడవిలా ఉంది. అడవికి తప్పకుండా నిప్పు అంటుకుంటుంది కావున అడవిలో నివసించేవారు కూడా సమాప్తమైపోతారు కదా. 5 వేల సంవత్సరాల క్రితం అంటుకున్న అగ్నియే మళ్ళీ అంటుకోనున్నది, దానికి మహాభారత యుద్ధం అన్న పేరును పెట్టారు. అటామిక్ బాంబుల యుద్ధం మొదట యాదవుల ద్వారానే జరుగుతుంది, దీని గురించి కూడా చెప్పుకుంటూ ఉంటారు. సైన్స్ ద్వారా మిసైల్స్ ను తయారుచేసారు. శాస్త్రాల్లోనైతే చాలా కథలున్నాయి. కడుపు నుండి ముసలము మొదలైనవి ఏమైనా వెలువడగలవా అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. సైన్స్ ద్వారా బాంబులు మొదలైనవి ఎన్ని తయారుచేస్తున్నారనేది మీరిప్పుడు చూస్తున్నారు. కేవలం రెండు బాంబులను వేస్తేనే ఎన్ని పట్టణాలు అంతమయ్యాయి, ఎంతమంది మనుష్యులు మరణించారు, లక్షలాది మంది మరణించి ఉంటారు. ఇప్పుడు ఇంత పెద్ద అడవిలో కోట్లాది మంది మనుష్యులున్నారు, దీనికి నిప్పు అంటుకోనున్నది.

ఎంతైనా తండ్రి అయితే దయాహృదయుడు అని శివబాబా అర్థం చేయిస్తారు. తండ్రికి అందరి కళ్యాణం చేయవలసి ఉంటుంది, ఇంకెక్కడకు వెళ్తారు. నిజంగానే నిప్పు అంటుకోబోతుంది అని చూస్తారు, అప్పుడు తండ్రి శరణు తీసుకుంటారు. తండ్రి సర్వుల సద్గతిదాత, పునర్జన్మ రహితుడు, వారిని మళ్ళీ సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు మీరు సంగమయుగవాసులు. మీ బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. మిత్ర-సంబంధీకులు మొదలైనవారితో కూడా తోడును నిర్వర్తించాలి. వారిలో ఆసురీ గుణాలున్నాయి, మీలో దైవీ గుణాలున్నాయి. ఇతరులకు కూడా ఇది నేర్పించడమే మీ పని. మంత్రాన్ని ఇస్తూ ఉండండి. ప్రదర్శనీ ద్వారా మీరు ఎంతగా అర్థం చేయిస్తారు. భారతవాసుల 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు తండ్రి మనుష్యుల నుండి దేవతలుగా చేయడానికి వచ్చారు అనగా నరకవాసులైన మనుష్యులను స్వర్గవాసులుగా చేస్తారు. దేవతలు స్వర్గంలో ఉంటారు. ఇప్పుడు మనకు ఆసురీ గుణాల పట్ల ద్వేషం కలుగుతుంది. స్వయాన్ని ఈ విధంగా పరిశీలించుకోవడం జరుగుతుంది - నేను దైవీ గుణాలు కలవాడిగా అయ్యానా? నాలో ఎటువంటి అవగుణాలు లేవు కదా? మనసా-వాచా-కర్మణా ఆసురీ పనుల వంటి కర్మలేవీ చెయ్యలేదు కదా? నేను ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే వ్యాపారాన్ని చేస్తున్నానా లేదా. బాబా తోట యజమాని మరియు బ్రహ్మాకుమార కుమారీలైన మీరు తోట మాలులు. తోట మాలులు కూడా రకరకాలుగా ఉంటారు. ఎవరినీ తమ సమానంగా తయారుచేయలేని మూర్ఖులు కొంతమంది ఉంటారు. ప్రదర్శనీలకు తోట యజమాని వెళ్ళరు, తోట మాలులు వెళ్తారు. శివబాబాతో పాటు ఈ తోట మాలి కూడా ఉన్నారు కనుక వీరు కూడా వెళ్ళలేరు. తోట మాలులైన మీరు సేవ చేసేందుకు వెళ్తారు. మంచి-మంచి తోట మాలులనే పిలుస్తారు. మూర్ఖుల వంటి వారిని పిలవకండి అని తండ్రి కూడా అంటారు. బాబా పేర్లు చెప్పరు. థర్డ్ క్లాస్ తోట మాలులు కూడా ఉన్నారు కదా. ఎవరైతే మంచి-మంచి పుష్పాలను తయారుచేసి చూపిస్తారో, వారిని తోట యజమాని ప్రేమిస్తారు. వారిని చూసి తోట యజమాని సంతోషిస్తారు కూడా. అటువంటి వారి నోటి నుండి సదా రత్నాలే వెలువడుతూ ఉంటాయి. కొంతమంది రత్నాలకు బదులుగా రాళ్ళను వేస్తారు, అప్పుడు బాబా ఏమంటారు. శివునికి జిల్లేడు పుష్పాలను కూడా అర్పిస్తారు కదా, అంటే అలాంటివారు కూడా కొంతమంది స్వయాన్ని అర్పించుకుంటారు కదా. అలాంటివారి నడవడిక ఎలా ఉంటుందో చూడండి. ముళ్ళ వంటివారు కూడా స్వయాన్ని అర్పించుకుంటారు, అర్పించి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతారు. సతోప్రధానంగా అయ్యేందుకు బదులుగా ఇంకా తమోప్రధానంగా అవుతూ ఉంటారు. అలాంటివారి గతి ఏమవుతుంది!

తండ్రి అంటారు - ఒకటి, నేను నిష్కాముడిని మరియు రెండు, నేను పరోపకారిని. నన్ను నిందించిన భారతవాసులకు పరోపకారం చేస్తాను. నేను ఈ సమయంలోనే వచ్చి స్వర్గ స్థాపనను చేస్తానని తండ్రి అంటారు. ఎవరినైనా స్వర్గానికి పదండి అని అంటే, మేము ఇక్కడ స్వర్గంలోనే ఉన్నాము కదా అని అంటారు. అరే, స్వర్గం సత్యయుగంలో ఉంటుంది. కలియుగంలో స్వర్గం ఎక్కడ నుండి వస్తుంది. కలియుగాన్ని నరకం అని అంటారు, ఇది పాత తమోప్రధాన ప్రపంచము. స్వర్గం ఎక్కడ ఉంటుంది అనేది మనుష్యులకు అసలు తెలియదు. స్వర్గం ఆకాశంలో ఉంటుందని భావిస్తారు. దిల్వాడా మందిరంలో కూడా స్వర్గాన్ని పైభాగంలో (పైకప్పులో) చూపించారు, కింద తపస్సు చేస్తున్నారు. అందుకే మనుష్యులు కూడా - ఫలానావారు స్వర్గస్థులయ్యారని అంటారు. స్వర్గం ఎక్కడ ఉంది. అందరి విషయంలోనూ స్వర్గస్థులయ్యారని అంటారు. ఇది విషయ సాగరము. క్షీర సాగరమని విష్ణుపురిని అంటారు. వారు పూజ కోసం ఒక పెద్ద కొలను తయారుచేసారు. అందులో విష్ణువును పెట్టారు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడ పాల నదులు ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీరు పుష్పాలుగా అవుతూ వెళ్ళండి. వీరు ముల్లులా ఉన్నారు అని ఎవరైనా అనేలాంటి నడవడికను ఎప్పుడూ నడుచుకోకూడదు. ఎల్లప్పుడూ పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉండండి. మాయ ముళ్ళగా చేస్తుంది, అందుకే స్వయాన్ని చాలా-చాలా సంభాళించుకోవాలి.

తండ్రి అంటారు - గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. తోట యజమాని అయిన బాబా ముళ్ళ నుండి పుష్పాలుగా చేసేందుకు వచ్చారు. నేను పుష్పంగా అయ్యానా అని స్వయాన్ని చూసుకోవాలి. పుష్పాలనే ప్రతి చోటకు సేవ కోసం పిలుస్తారు. బాబా, గులాబీ పుష్పాన్ని పంపించండి. ఎవరు ఎటువంటి పుష్పమనేది కనిపిస్తుంది కదా. నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకే వస్తాను అని తండ్రి అంటారు. ఇది సత్యనారాయణ కథ, సత్య ప్రజల కథ కాదు. రాజా-రాణులు తయారవుతారంటే తప్పకుండా ప్రజలు కూడా తయారవుతారని అర్థం. రాజా-రాణి, తథా ప్రజా నంబరువారుగా ఎలా తయారవుతారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పేదవారి వద్ద 2-5 రూపాయలు కూడా మిగలకపోతే వారేమి ఇస్తారు. వెయ్యి రూపాయలు ఇచ్చేవారికి ఎంతైతే లభిస్తుందో, వారికి కూడా అంతే లభిస్తుంది. అన్నింటికన్నా భారత్ యే చాలా పేదది. భారతవాసులైన మేము స్వర్గవాసులుగా ఉండేవారమని ఎవరికీ గుర్తు లేదు. దేవతల మహిమను కూడా పాడుతారు కానీ అర్థం చేసుకోలేరు. కేవలం కప్ప వలె శబ్దం చేస్తూ ఉంటారు. బుల్ బుల్ పిట్ట ఎంత మధురంగా పాడుతుంది కానీ దానికి అర్థమేమీ ఉండదు. ఈ రోజుల్లో గీతను వినిపించేవారు ఎంతమంది ఉన్నారు. మాతలు కూడా తయారయ్యారు. గీత ద్వారా ఏ ధర్మం స్థాపనయ్యింది అనేది ఏమీ తెలియదు. ఎవరైనా కొంచెం రిద్ధి-సిద్ధిని చూపించినా చాలు, ఇక వారిని భగవంతుడని అనుకుంటారు. పతితపావనా అని పాడుతారు, అంటే పతితులనే కదా. వికారాల్లోకి వెళ్ళడం నంబరువన్ పతితత్వమని తండ్రి అంటారు. ఈ ప్రపంచమంతా పతితంగా ఉంది. ఓ పతితపావనా రండి అని అందరూ పిలుస్తారు. ఇప్పుడు వారు రావాలా లేక గంగా స్నానాలు చేయడం ద్వారా పావనంగా అవుతారా. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేందుకు తండ్రికి ఎంత శ్రమ చేయవలసి ఉంటుంది. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అయిపోతారని తండ్రి అంటారు. నోటి ద్వారా ఎప్పుడూ రాళ్ళను రానివ్వకండి. పుష్పాలుగా అవ్వండి. ఇది కూడా చదువు కదా. నడుస్తూ-నడుస్తూ గ్రహచారం కూర్చున్నట్లయితే ఫెయిల్ అయిపోతారు, హోప్ ఫుల్ (ఆశ ఉన్నవారు) నుండి హోప్ లెస్ (నిరాశపరులు) గా అయిపోతారు. మళ్ళీ, మేము బాబా వద్దకు వెళ్ళాలని అంటారు. ఇంద్రసభలోకి అపవిత్రులు రాలేరు. ఇది ఇంద్రసభ కదా. తీసుకువచ్చే బ్రాహ్మణిపై కూడా చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. వికారాల్లోకి వెళ్ళినట్లయితే బ్రాహ్మణిపై కూడా భారం పడుతుంది, అందుకే ఎవరినైనా సరే జాగ్రత్తగా తీసుకురావాలి. మున్ముందు సాధు సన్యాసులు మొదలైనవారందరూ క్యూలో నిలబడడాన్ని మీరు చూస్తారు. భీష్మ పితామహ మొదలైనవారి పేర్లు అయితే ఉన్నాయి కదా. పిల్లలు చాలా విశాలబుద్ధి కలిగి ఉండాలి. భారత్ పుష్పాల తోటగా (గార్డెన్ ఆఫ్ ఫ్లవర్) ఉండేదని మీరు ఎవరికైనా చెప్పవచ్చు. అక్కడ దేవీదేవతలు నివసించేవారు, ఇప్పుడు ముళ్ళలా అయిపోయారు. మీలో పంచ వికారాలు ఉన్నాయి కదా. రావణ రాజ్యమంటేనే అడవి. తండ్రి వచ్చి ముళ్ళను పుష్పాలుగా చేస్తారు. ఆలోచించండి - ఇప్పుడు నేను గులాబీ పుష్పముగా అవ్వకపోతే, ఇక జన్మ-జన్మలు జిల్లేడు పుష్పముగానే అవుతాను. ప్రతి ఒక్కరు తమ కళ్యాణం చేసుకోవాలి. మీరు శివబాబాపై దయ చూపించడం లేదు. మీపై మీరు దయ చూపించుకోవాలి. ఇప్పుడు శ్రీమతాన్ని అనుసరించాలి. ఎవరైనా తోటలోకి వెళ్ళినప్పుడు సుగంధభరితమైన పుష్పాలనే చూస్తారు, జిల్లేడు పుష్పాలను చూడరు. ఫ్లవర్ షో ఉంటుంది కదా. ఇది కూడా ఒక ఫ్లవర్ షో. చాలా పెద్ద బహుమానం లభిస్తుంది. చాలా ఫస్ట్ క్లాస్ పుష్పాలుగా అవ్వాలి. చాలా మధురమైన నడవడిక ఉండాలి. క్రోధం ఉండేవారితో చాలా నమ్రతగా ఉండాలి. నేను శ్రీమతాన్ని అనుసరించి, పవిత్రంగా అయి, పవిత్ర ప్రపంచమైన స్వర్గానికి యజమానిగా అవ్వాలనుకుంటున్నాను. యుక్తులైతే చాలా ఉంటాయి కదా. మాతల వద్ద చాలా యుక్తులు ఉంటాయి కదా. చతురతతో పవిత్రంగా ఉండేందుకు పురుషార్థం చేయాలి. మీరు ఇలా చెప్పవచ్చు - కామము మహా శత్రువు, పవిత్రంగా అయినట్లయితే సతోప్రధానంగా అవుతారు అన్నది భగవానువాచ, అటువంటప్పుడు మేము భగవంతుడు చెప్పినది వినకూడదా. యుక్తిగా స్వయాన్ని రక్షించుకోవాలి. విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు కొద్దిగా సహనం చేస్తే ఏమైంది. మీరు మీ కోసమే చేసుకుంటున్నారు కదా. వారు రాజ్యం కోసం పోరాడుతారు, మీరు మీ కోసమే అంతా చేస్తారు. పురుషార్థం చేయాలి. తండ్రిని మర్చిపోవడం వల్లనే పడిపోతారు, తర్వాత సిగ్గు అనిపిస్తుంది. మరి దేవతలుగా ఎలా అవుతారు? అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మాయా గ్రహచారం నుండి రక్షించుకునేందుకు నోటి నుండి సదా జ్ఞాన రత్నాలు వెలువడాలి. సాంగత్య దోషం నుండి స్వయాన్ని సంభాళించుకోవాలి.

2. సుగంధభరితమైన పుష్పముగా అయ్యేందుకు అవగుణాలను తొలగించుకుంటూ వెళ్ళాలి. శ్రీమతాన్ని అనుసరించి చాలా-చాలా నమ్రచిత్తులుగా అవ్వాలి. కామము మహా శత్రువుతో ఎప్పుడూ ఓడిపోకూడదు. యుక్తిగా స్వయాన్ని రక్షించుకోవాలి.

వరదానము:-

సదా శక్తిశాలి వృత్తి ద్వారా అనంతమైన సేవలో తత్పరులయ్యే హద్దు విషయాల నుండి ముక్త భవ

ఏ విధంగా సాకార తండ్రికి సేవ తప్ప ఇంకేమీ కనిపించేది కాదో, అదే విధంగా పిల్లలైన మీరు కూడా, మీ శక్తిశాలి వృత్తి ద్వారా అనంతమైన సేవలో సదా తత్పరులై ఉన్నట్లయితే, హద్దు విషయాలు స్వతహాగా సమాప్తమైపోతాయి. హద్దు విషయాలకు సమయాన్ని ఇవ్వడమంటే, ఇది కూడా బొమ్మలాట, ఇందులో సమయం మరియు శక్తి వృథా అవుతాయి. అందుకే చిన్న-చిన్న విషయాల్లో సమయాన్ని మరియు జమ చేసుకున్న శక్తులను వ్యర్థంగా పోగొట్టుకోకండి.

స్లోగన్:-

సేవలో సఫలతను ప్రాప్తి చేసుకోవాలంటే మాట మరియు నడవడిక ప్రభావశాలిగా ఉండాలి.