08-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - పిల్లలైన మీతో అవినాశి సంపాదనను చేయించేందుకు తండ్రి వచ్చారు, ఇప్పుడు మీరు జ్ఞానరత్నాల సంపాదన ఎంత చేసుకోవాలనుకుంటే అంత చేసుకోవచ్చు"

ప్రశ్న:-

ఆసురీ సంస్కారాలను పరివర్తన చేసుకొని దైవీ సంస్కారాలను తయారుచేసుకునేందుకు ఏ విశేషమైన పురుషార్థం చేయాలి?

జవాబు:-

సంస్కారాల పరివర్తన కొరకు ఎంత వీలైతే అంత దేహీ-అభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి. దేహాభిమానంలోకి రావడం వల్లనే ఆసురీ సంస్కారాలు తయారవుతాయి. తండ్రి ఆసురీ సంస్కారాలను దైవీ సంస్కారాలుగా తయారుచేసేందుకు వచ్చారు. మొదట, నేను దేహీ ఆత్మను, తర్వాత ఈ శరీరం అని పురుషార్థం చేయండి.

గీతము:-

మీరు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నారు... (తూనే రాత్ గవాయి సోకె...)

ఓంశాంతి. పిల్లలు ఈ పాటను అనేకసార్లు విన్నారు. ఇది పోగొట్టుకునే సమయం కాదని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను సావధానపరుస్తూ ఉంటారు. ఇది చాలా గొప్ప సంపాదన చేసుకునే సమయం. సంపాదన చేయించేందుకే తండ్రి వచ్చి ఉన్నారు. సంపాదన కూడా లెక్కలేనంత ఉంది. ఎవరు ఎంత సంపాదించుకోవాలనుకుంటే అంత చేసుకోవచ్చు. ఇది అవినాశి జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకునే సంపాదన. ఈ సంపాదన భవిష్యత్తు కొరకు ఉంది. అది భక్తి, ఇది జ్ఞానం. రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుందని మనుష్యులకు తెలియదు. మళ్ళీ తండ్రి వచ్చి రామరాజ్యం స్థాపన చేసినప్పుడు జ్ఞానం ప్రారంభమవుతుంది. ఈ జ్ఞానం కొత్త ప్రపంచం కొరకు, భక్తి పురాతన ప్రపంచం కొరకు ఉంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మొదట స్వయాన్ని దేహీగా (ఆత్మగా) భావించాలి. మొదట మేము ఆత్మలము, తర్వాత శరీరాలని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. కాని డ్రామా ప్లాన్ అనుసారంగా మనుష్యులు అందరూ తప్పుగా అయిపోయారు, కనుక విరుద్ధంగా అర్థం చేసుకున్నారు అనగా మొదట మనం దేహము, తర్వాత దేహీ అని భావిస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, ఈ శరీరం వినాశి. దీనిని మీరు తీసుకుంటూ మరియు విడిచిపెడుతూ ఉంటారు. సంస్కారాలు ఆత్మలో ఉంటాయి. దేహాభిమానంలోకి రావడంతో సంస్కారాలు ఆసురీగా అయిపోతాయి. మళ్ళీ ఆసురీ సంస్కారాలను దైవీ సంస్కారాలుగా తయారుచేసేందుకు తండ్రి రావలసి ఉంటుంది. ఈ మొత్తం రచనంతా ఆ ఒక్క రచయిత అయిన తండ్రిదే. వారిని అందరూ ఫాదర్ (తండ్రి) అని అంటారు. లౌకిక తండ్రిని కూడా ఫాదర్ అనే పిలుస్తారు. బాబా మరియు మమ్మా, ఈ రెండు అక్షరాలు చాలా మధురమైనవి. రచయిత అని తండ్రినే అంటారు. వారు మొదట స్త్రీని దత్తత చేసుకొని తర్వాత రచనను రచిస్తారు. అనంతమైన తండ్రి కూడా చెప్తున్నారు, నేను వచ్చి వీరిలో ప్రవేశిస్తాను, వీరి పేరు ప్రసిద్ధమైనది. భగీరథుడని కూడా అంటారు. చిత్రాలలో మనిషిగానే చూపిస్తారు. ఎద్దుగా చూపించరు. భగీరథ్ మనుష్య శరీరం. తండ్రే వచ్చి పిల్లలకు తమ పరిచయాన్నిస్తారు. సదా మేము బాప్ దాదా వద్దకు వెళ్తున్నామనే మీరు చెప్పండి. కేవలం తండ్రి అంటే వారు నిరాకారుడవుతారు. శరీరం విడిచిపెట్టినప్పుడే నిరాకార తండ్రి వద్దకు వెళ్ళగలరు, ఊరికినే ఎవ్వరూ వెళ్ళలేరు. ఈ జ్ఞానం తండ్రినే ఇస్తారు. ఈ జ్ఞానం తండ్రి వద్ద మాత్రమే ఉంది. ఇది అవినాశి జ్ఞానరత్నాల ఖజానా. తండ్రి జ్ఞానరత్నాల సాగరుడు. నీటి విషయం కాదు. వారు జ్ఞానరత్నాల భాండాగారము. వారిలో జ్ఞానముంది. నీటిని జ్ఞానమని అనరు. మనుష్యులకు ఎలాగైతే బ్యారిష్టర్, డాక్టర్ మొదలైన వాటికి సంబంధించిన జ్ఞానముందో అలా ఇది కూడా ఒక జ్ఞానమే. ఈ జ్ఞానం గురించే ఋషులు, మునులు మొదలైనవారందరూ రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానం మాకు తెలియదని అనేవారు. అది ఒక్క రచయితకు మాత్రమే తెలుసు. వృక్షానికి బీజరూపులు కూడా వారే. సృష్ట ఆదిమధ్యాంతాల జ్ఞానం వారిలో ఉంది. ఇవన్నీ వారు వచ్చినప్పుడే వినిపిస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది, మీరు ఈ జ్ఞానం ద్వారా దేవతగా అవుతారు. జ్ఞానం పొందిన తర్వాత ప్రాలబ్ధము పొందుతారు. అక్కడ ఈ జ్ఞానం అవసరమే ఉండదు. అయితే దేవతల వద్ద ఈ జ్ఞానం లేనందున వారు అజ్ఞానులని కాదు. వారు ఈ జ్ఞానం ద్వారానే పదవిని ప్రాప్తించుకుంటారు. బాబా రండి, మేము పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి, దాని కోసం మార్గాన్ని లేక జ్ఞానాన్ని తెలియపరచమని తండ్రిని పిలుస్తూనే ఉంటారు, ఎందుకంటే వారికి తెలియదు. ఆత్మలైన మనం శాంతిధామం నుండి వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ ఆత్మలు శాంతిగా ఉంటాయి. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాయి. ఇది పాత ప్రపంచం, కనుక కొత్త ప్రపంచం తప్పకుండా ఉండేది. అది ఎప్పుడు ఉండేది, ఎవరు రాజ్యం చేసేవారు - ఇది ఎవ్వరికీ తెలియదు. మీరిప్పుడు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. తండ్రి ఉన్నదే జ్ఞానసాగరులు, సద్గతిదాత. బాబా, వచ్చి మా దుఃఖాలను హరించండి, సుఖ-శాంతులనివ్వండి అని వారినే పిలుస్తారు. ఆత్మకు తెలుసు కానీ తమోప్రధానమైపోయింది, అందుకే మళ్ళీ తండ్రి వచ్చి పరిచయమిస్తున్నారు. మనుష్యులకు ఆత్మను గురించి గానీ, పరమాత్మను గురించి గానీ తెలియదు. ఆత్మకు పరమాత్మాభిమానిగా అయ్యేటటువంటి జ్ఞానమే లేదు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. ఇప్పుడు జ్ఞానం లభించింది కావున తప్పకుండా ముఖాలు మనుష్యుల వలె, లక్షణాలు కోతుల వలె ఉండేవని తెలుసుకున్నారు.

ఇప్పుడు తండ్రి జ్ఞానాన్నిచ్చారు కనుక మనం కూడా జ్ఞాన స్వరూపులుగా అయ్యాము. రచయిత మరియు రచనల జ్ఞానం లభించింది. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు, మరి ఎంత నషా ఉండాలి! బాబా జ్ఞానసాగరులు, వారిలో అనంతమైన జ్ఞానముంది. మీరు ఎవరి వద్దకైనా వెళ్ళండి - సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానమే కాదు, ఆత్మ అంటే ఏమిటో, అది కూడా తెలియదు. తండ్రిని దుఃఖహర్త-సుఖకర్త అని కూడా స్మృతి చేస్తారు, కానీ మళ్ళీ ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేస్తారు. డ్రామానుసారంగా వారిది కూడా ఎటువంటి దోషం లేదని తండ్రి చెప్తున్నారు. మాయ పూర్తిగా తుచ్చబుద్ధిగా తయారుచేస్తుంది. కీటకాలకు మురికిలోనే సుఖమనిపిస్తుంది. తండ్రి మురికి నుంచి బయటకు తీసేందుకు వస్తారు. మనుష్యులు ఊబిలో చిక్కుకొని ఉన్నారు. జ్ఞానం గురించే తెలియకపోతే వారేం చేస్తారు. ఊబిలో కూరుకుపోయి ఉన్నారు, వారిని బయటకు తీయడం కూడా కష్టమవుతుంది. బయటకు తీసి, అర్ధ-మూడొంతుల భాగం వరకు పైకి ఎత్తిన తర్వాత కూడా చేతిని విడిపించుకొని ఊబిలోనే పడిపోతారు. చాలామంది పిల్లలు ఇతరులకు జ్ఞానం ఇస్తూ-ఇస్తూ స్వయమే మాయతో చెంపదెబ్బ తింటారు ఎందుకంటే తండ్రి డైరెక్షన్ కు విరుద్ధమైన కార్యాలు చేస్తారు. ఇతరులను బయటకు తీసే ప్రయత్నం చేస్తూ స్వయమే పడిపోతారు, తర్వాత వారిని బయటకి తీయడం ఎంత కష్టమవుతుంది, ఎందుకంటే మాయతో ఓడిపోతారు. లోపల వారి పాపమే వారిని తింటూ ఉంటుంది. మాయతో యుద్ధం కదా. ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. వారు బాహుబలంతో పోట్లాడే హింసాయుత సైనికులు. మీరు అహింసకులు. మీరు అహింస ద్వారానే రాజ్యాన్ని తీసుకుంటారు. హింస రెండు రకాలుగా ఉంటుంది కదా. ఒకటి - కామ ఖడ్గమును ఉపయోగించడం మరియు రెండవది - ఎవరినైనా కొట్టడము. మీరిప్పుడు డబల్ అహింసకులుగా అవుతారు. ఈ జ్ఞాన బలం యొక్క యుద్ధం గురించి ఎవ్వరికీ తెలియదు. అహింస అని దేనినంటారో కూడా ఎవ్వరికీ తెలియదు. భక్తి మార్గంలోని సామగ్రి చాలా భారీగా ఉంది. పతితపావనా రండి అని కూడా పాడారు, అయితే నేను వచ్చి పావనంగా ఎలా చేస్తాను, ఇది ఎవ్వరికీ తెలియదు. గీతలోనే పొరపాటు చేసేశారు, మనిషిని భగవంతుడని అనేశారు. శాస్త్రాలు మనుష్యులే తయారుచేశారు, మనుష్యులే చదువుతారు. దేవతలకు శాస్త్రాలు చదవవలసిన అవసరం లేదు. అక్కడ శాస్త్రాలేవీ ఉండవు. జ్ఞానం, భక్తి తర్వాత వైరాగ్యం. దేనిపట్ల వైరాగ్యం? భక్తి పట్ల, పాత ప్రపంచం పట్ల వైరాగ్యము, పాత శరీరం పట్ల వైరాగ్యము. తండ్రి చెప్తున్నారు, ఈ కళ్ళ ద్వారా ఏవేవి చూస్తున్నారో అవేవీ ఉండవు. ఈ మొత్తము ఛీ-ఛీ ప్రపంచం పట్ల వైరాగ్యము. ఇక దివ్యదృష్టి ద్వారా మీరు కొత్త ప్రపంచాన్ని సాక్షాత్కారాలలో చూస్తారు. మీరు కొత్త ప్రపంచం కొరకే చదువుకుంటున్నారు. ఈ చదువు ఈ జన్మ కోసం కాదు. మిగిలిన చదువులన్నీ ఆ సమయం, ఆ జన్మ కొరకే ఉంటాయి. ఇప్పుడు ఇది సంగమయుగము. అందువలన మీరేది చదువుకుంటారో, దాని ప్రాలబ్ధము మీకు కొత్త ప్రపంచంలో లభిస్తుంది. అనంతమైన తండ్రి ద్వారా ఎంత గొప్ప ప్రాలబ్ధము మీకు లభిస్తుంది! అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖము ప్రాప్తిస్తుంది. కనుక పిల్లలు పూర్తి పురుషార్థం చేసి శ్రీమతానుసారంగా నడవాలి. తండ్రి శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు. వారి ద్వారా మీరు శ్రేష్ఠంగా అవుతారు. వారు సదా శ్రేష్ఠంగానే ఉంటారు. మిమ్మల్ని శ్రేష్ఠంగా తయారుచేస్తారు. 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ మళ్ళీ మీరు భ్రష్ఠమైపోతారు. నేనైతే జనన-మరణాలలోకి రానని తండ్రి చెప్తున్నారు. నేను ఇప్పుడు భాగ్యశాలి రథములోనే ప్రవేశిస్తాను. వారిని పిల్లలైన మీరు గుర్తించారు. ఇప్పుడు మీది చిన్న వృక్షము. వృక్షానికి తుఫానులు కూడా వస్తాయి కదా! ఆకులు రాలిపోతూ ఉంటాయి. చాలా పుష్పాలు వస్తాయి కానీ తుఫానుల వల్ల రాలిపోతాయి. కొన్ని మంచి మంచి ఫలాలు వస్తాయి, కానీ మాయా తుఫానుల వల్ల పడిపోతాయి. మాయా తుఫానులు చాలా తీవ్రంగా ఉంటుంది. అటువైపు బాహుబలం, ఇటువైపు యోగబలం లేక స్మృతి యొక్క బలం. మీరు స్మృతి అనే పదాన్ని పక్కాగా చేసుకోండి. వారు యోగం-యోగం అనే పదాలు అంటూ ఉంటారు. మీది 'స్మృతి'. నడుస్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు, దీనిని యోగమని అనరు. యోగమనే పదం సన్యాసుల వద్ద ప్రసిద్ధి గాంచినది. అనేక రకాల యోగాలు నేర్పిస్తారు. తండ్రి ఎంత సహజంగా తెలియజేస్తారు. కూర్చుంటూ-లేస్తూ, నడుస్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. మీరు అర్ధకల్పపు ప్రేయసులు. నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను వచ్చాను. ఆత్మ గురించి ఎవ్వరికీ తెలియదు, కనుక తండ్రి వచ్చి రియలైజ్ (అనుభూతి) చేయిస్తారు. ఇవి కూడా అర్థం చేసుకోవలసిన చాలా సూక్ష్మమైన విషయాలు. ఆత్మ అతి సూక్ష్మమైనది మరియు అవినాశి. ఆత్మ వినాశనమవ్వదు, అందులోని పాత్ర కూడా వినాశనమవ్వదు. ఈ విషయాలను మందబుద్ధి గలవారు కష్టంగా అర్థం చేసుకుంటారు. శాస్త్రాలలో కూడా ఈ విషయాలు లేవు.

పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేసే శ్రమ చాలా చేయవలసి ఉంటుంది. జ్ఞానమైతే చాలా సహజము. మరి వినాశ కాలములో ప్రీతి బుద్ధి మరియు విపరీత బుద్ధి అనేది స్మృతి కొరకే చెప్తారు. స్మృతి బాగుంటే ప్రీతి బుద్ధి గలవారని అంటారు. ప్రీతి కూడా అవ్యభిచారిగా ఉండాలి. మేము బాబాను ఎంత స్మృతి చేస్తున్నాము - అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. బాబాపై ప్రీతి పెట్టుకుంటూ-పెట్టుకుంటూ కర్మాతీత అవస్థను పొందినప్పుడు ఈ శరీరం విడిచిపెడతాము మరియు యుద్ధం మొదలవుతుందని కూడా తెలుసుకున్నారు. తండ్రిపై ఎంత ప్రీతి ఉంటుందో అంత తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. పరీక్ష అయితే ఒకే సమయంలో ఉంటుంది కదా. సమయం పూర్తిగా వచ్చినప్పుడు, అందరి బుద్ధి ప్రీతి బుద్ధిగా అవుతుంది, ఆ సమయంలో వినాశనం జరుగుతుంది. అంతవరకు కొట్లాటలు మొదలైనవి జరుగుతూనే ఉంటాయి. విదేశస్థులు కూడా ఇప్పుడు మృత్యువు ఎదురుగా ఉందని, వారిచేత బాంబులు తయారుచేయించేందుకు ఎవరో ప్రేరేపిస్తున్నారని భావిస్తారు, కానీ ఏం చేయగలరు? డ్రామాలో నిశ్చితమై ఉంది కదా! తమ సైన్స్ బలం ద్వారానే తమ కులానికి మృత్యువు తెచ్చుకుంటారు. పిల్లలు పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళమంటారు, మరి శరీరాలను తీసుకెళ్ళలేరు. తండ్రి కాలుడికే కాలుడు కదా. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. వేటగానికి అది వేట, వేటకు అది మృత్యువు (పిల్లికి చెలగాటము, ఎలుకకు ప్రాణ సంకటము) అని గాయనము కూడా ఉంది. వినాశనం ఆగిపోయి శాంతి జరగాలని వారంటారు. అరే, వినాశనం అవ్వకుండా సుఖ-శాంతులు ఎలా స్థాపనవుతాయి? అందుకే చక్రముపై తప్పనిసరిగా అర్థం చేయించండి. ఇప్పుడు స్వర్గ ద్వారము తెరుచుకుంటుంది. బాబా చెప్తారు - గేట్ వే టు శాంతిధామ్-సుఖధామ్ (శాంతిధామ, సుఖధామాలకు దారి) అనే దానిపై కూడా ఒక పుస్తకాన్ని ముద్రించండి. దీని అర్థం కూడా అర్థం చేసుకోలేరు. చాలా సహజమే కాని, కోటిలో కొందరే అతి కష్టం మీద అర్థం చేసుకుంటారు. మీరు ప్రదర్శనీ మొదలైనవాటిలో ఎప్పుడూ నిరుత్సాహపడకూడదు. ప్రజలైతే తయారవుతారు కదా. గమ్యం గొప్పది, శ్రమ అనిపిస్తుంది. స్మృతిలోనే శ్రమ ఉంటుంది. అందులో చాలామంది ఫెయిల్ అవుతారు. స్మృతి కూడా అవ్యభిచారిగా ఉండాలి. మాయ ఘడియ-ఘడియ మరిపింపజేస్తుంది. శ్రమ లేకుండా విశ్వానికి యజమానులుగా ఎవ్వరూ అవ్వలేరు. పూర్తి పురుషార్థము చేయాలి. మనం సుఖధామానికి యజమానులుగా ఉండేవారము. అనేకసార్లు చక్రంలో తిరిగాము. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. మాయ చాలా విఘ్నాలు కలిగిస్తుంది. బాబా వద్దకు సేవా సమాచారం కూడా వస్తుంది. ఈ రోజు విధ్వాంసుల సభలో అర్థం చేయించాము, ఈ రోజు ఇది చేశాము.... డ్రామానుసారంగా మాతల పేరు ప్రసిద్ధమవ్వాలి. మాతలను ముందుంచాలని పిల్లలైన మీరు ధ్యాస ఉంచాలి. ఇది చైతన్య దిల్వాడా మందిరం. మీరు చైతన్యంగా తయారైపోతారు, తర్వాత మీరు రాజ్యం చేస్తూ ఉంటారు. భక్తిమార్గంలోని మందిరాలు మొదలైనవేవీ ఉండవు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క తండ్రితోనే అవ్యభిచారి ప్రీతిని పెట్టుకుంటూ-పెట్టుకుంటూ కర్మాతీత స్థితిని పొందాలి. ఈ పాత దేహం మరియు పాత ప్రపంచం పట్ల అనంతమైన వైరాగ్యముండాలి.

2. తండ్రి డైరెక్షన్ కు విరుద్ధంగా ఏ కర్తవ్యమూ చేయకూడదు. యుద్ధ మైదానంలో ఎప్పుడూ కూడా ఓటమి పొందకూడదు. డబల్ అహింసకులుగా అవ్వాలి.

వరదానము:-

తమ ఆత్మిక లైట్ ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ చేసే సహజ సఫలతామూర్త్ భవ

సాకార సృష్టిలో ఏ రంగు లైట్ వేస్తారో, అదే వాతావరణం ఏర్పడుతుంది. ఒకవేళ ఆకుపచ్చ రంగు లైట్ వెలిగిస్తే నలువైపులా అదే ప్రకాశం వ్యాపిస్తుంది. ఎరుపు రంగు లైట్ వేస్తే స్మృతి యొక్క వాయుమండలం తయారవుతుంది. స్థూలమైన లైట్ వాయుమండలాన్ని పరివర్తన చేసినప్పుడు లైట్ హౌస్ అయిన మీరు కూడా పవిత్రత యొక్క లైట్ లేక సుఖం యొక్క లైట్ తో వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ చెయ్యండి, అప్పుడు సఫలతా మూర్తులుగా అవుతారు. స్థూల లైట్ ను కళ్ళ ద్వారా చూస్తారు, ఆత్మిక లైట్ ను అనుభవం ద్వారా తెలుసుకుంటారు.

స్లోగన్:-

వ్యర్థమైన విషయాలలో సమయాన్ని మరియు సంకల్పాలను పోగొట్టుకోవడం - ఇది కూడా అపవిత్రతే.