08-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీ చదువుకు పునాది పవిత్రత, పవిత్రత ఉంటేనే యోగములో పదును నింపుకోగలరు, యోగములో పదును ఉన్నట్లయితే వాణిలో శక్తి ఉంటుంది”

ప్రశ్న:-

పిల్లలైన మీరిప్పుడు ఎటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా చేయాలి?

జవాబు:-

తలపై వికర్మల భారమేదైతే ఉందో దానిని తొలగించుకునేందుకు పూర్తిగా ప్రయత్నము చేయాలి. తండ్రికి చెందినవారిగా అయి ఏదైనా వికర్మ చేసినట్లయితే చాలా గట్టిగా పడిపోతారు. ఒకవేళ బి.కె.లను నిందింపజేసినట్లయితే, ఏదైనా కష్టము కలిగించినట్లయితే చాలా పాపం కలుగుతుంది. ఆ తర్వాత జ్ఞానము వినడం-వినిపించడం వలన ఎటువంటి లాభమూ ఉండదు.

ఓంశాంతి. తాము పతితుల నుండి పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా ఎలా అవ్వగలరో ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పావన ప్రపంచాన్ని స్వర్గము లేక విష్ణుపురి, లక్ష్మీ-నారాయణుల రాజ్యము అని అంటారు. విష్ణువు అనగా లక్ష్మీ-నారాయణుల కంబైండ్ చిత్రాన్ని ఆ విధంగా తయారుచేశారు, అందువలన అర్థం చేయించడం జరుగుతుంది. అయితే విష్ణువును పూజించేటప్పుడు వారు ఎవరు అన్నది అర్థము చేసుకోరు. మహాలక్ష్మిని పూజిస్తారు కానీ వారు ఎవరు అన్నది తెలియదు. బాబా ఇప్పుడు పిల్లలైన మీకు రకరకాల పద్ధతులలో అర్థం చేయిస్తున్నారు. బాగా ధారణ చేయండి. పరమాత్మకైతే అన్నీ తెలుసు, మనం చేసే మంచి లేదా చెడు పనులన్నీ వారికి తెలుసు అని కొందరి బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు దీనిని అంధశ్రద్ధతో కూడిన భావన అని అంటారు. భగవంతుడికి ఈ విషయాల గురించి తెలియనే తెలియదు. భగవంతుడు పతితులను పావనంగా చేసేవారు అని పిల్లలైన మీకు తెలుసు. పావనంగా తయారుచేసి స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు, ఆపై ఎవరైతే బాగా చదువుకుంటారో వారు ఉన్నత పదవిని పొందుతారు. అంతేకానీ తండ్రికి అందరి మనసులలో ఏముందో తెలుసు అని అనుకోకూడదు. దీనిని అవివేకమని అంటారు. మనుష్యులు ఏ కర్మలైతే చేస్తారో, వాటి మంచి లేక చెడు ప్రభావం డ్రామానుసారముగా వారికి లభించి తీరుతుంది. ఇందులో తండ్రికి ఎటువంటి సంబంధమూ ఉండదు. బాబాకైతే అన్నీ తెలుసు అని ఎప్పుడూ ఆలోచించకూడదు. చాలామంది వికారాలలోకి వెళ్తూ, పాపం చేస్తూ ఉంటారు, వారు మళ్ళీ ఇక్కడకి లేక సెంటర్లకు వస్తారు. బాబాకైతే తెలుసు అని అనుకుంటారు. కానీ నేను ఈ పనులేవీ చేయను అని బాబా చెప్తున్నారు. అన్నీ తెలిసినవారు అన్న పదం కూడా తప్పే. మీరు వచ్చి పతితుల నుండి పావనంగా చేయండి, స్వర్గానికి యజమానులుగా చేయండి అని మీరు తండ్రిని పిలుస్తారు, ఎందుకంటే జన్మ-జన్మాంతరాల పాపాలు తలపై చాలా ఉన్నాయి. ఈ జన్మవి కూడా ఉన్నాయి. ఈ జన్మలోని పాపాలను తెలియజేస్తారు కూడా. చాలామంది ఎటువంటి పాపాలు చేశారంటే పావనంగా అవ్వడం చాలా కష్టమనిపిస్తుంది. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము. చదువు అయితే చాలా సహజము, కానీ వికర్మల భారము ఎలా తొలగించుకోవాలి అని ప్రయత్నము చేయాలి. లెక్కలేనన్ని పాపాలు చేసినవారు చాలామంది ఉన్నారు, చాలా డిస్-సర్వీస్ చేస్తారు. బి.కె.ల ఆశ్రమాలకు కష్టము కలగించేందుకు ప్రయత్నిస్తారు. దీని వలన చాలా పాపము కలుగుతుంది. ఈ పాపాలు మొదలైనవి జ్ఞానము ఇవ్వడం ద్వారా నశించవు. పాపాలు, యోగము ద్వారానే సమాప్తమవుతాయి. మొదట అయితే యోగములో పూర్తి పురుషార్థము చేయాలి, అప్పుడే ఇతరులకు బాణము కూడా తగులుతుంది. మొదట పవిత్రంగా అవ్వాలి, యోగముండాలి, అప్పుడే వాణిలో కూడా పదును నిండుతుంది. లేకపోతే ఎవరికి ఎంతగా అర్థం చేయించినా కూడా, ఎవరి బుద్ధికీ ఎక్కదు, బాణము తగలదు. జన్మ-జన్మాంతరాల పాపాలున్నాయి కదా. ఇప్పుడు ఏ పాపాలు అయితే చేస్తారో, అవి జన్మ-జన్మాంతరాల పాపాలు కన్నా కూడా ఎక్కువైపోతాయి, అందుకే సద్గురువును నిందించేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు.... అని గాయనము చేయబడింది, వీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్, సద్గురువు. బి.కె.లను నిందింపజేసేవారి పాపము కూడా చాలా భారీగా ఉంటుందని తండ్రి చెప్తున్నారు. మొదట స్వయం పావనంగా అవ్వాలి. ఎవరికైనా అర్థం చేయించే అభిరుచి ఎంతగానో ఉంటుంది. కానీ యోగము కొద్దిగా కూడా ఉండదు, దాని వల్ల లాభమేముంటుంది? స్మృతి ద్వారా పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము అని తండ్రి చెప్తున్నారు. పావనంగా అయ్యేందుకే పిలుస్తారు కూడా. భక్తిమార్గములో ఎదురు దెబ్బలు తినడం, వ్యర్థమైన మాటలు మాట్లాడడం ఒక అలవాటుగా అయిపోయింది. ప్రార్థన చేస్తారు కానీ భగవంతునికి చెవులు ఎక్కడున్నాయి, చెవులు లేకుండా, నోరు లేకుండా ఎలా వినగలరు, ఎలా మాట్లాడగలరు? వారైతే అవ్యక్తంగా ఉంటారు. ఇదంతా అంధశ్రద్ధ.

మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా పాపాలు నశిస్తాయి. ఫలానావారు చాలా స్మృతి చేస్తున్నారు, వీరు తక్కువగా స్మృతి చేస్తున్నారు అని బాబాకు తెలుసు అని అనుకోకూడదు, మీ చార్టును మీరే చూసుకోవాలి. స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనమౌతాయని తండ్రి చెప్పారు. ఎంతగా స్మృతి చేస్తున్నారు అని బాబా కూడా మిమ్మల్నే అడుగుతారు. నడవడిక ద్వారా కూడా తెలిసిపోతుంది. స్మృతితో తప్ప పాపాలు సమాప్తమవ్వవు. ఎవరికైనా జ్ఞానాన్ని వినిపిస్తే మీ పాపాలు లేదా వారి పాపాలు సమాప్తమవుతాయని అనుకోకండి. అలా జరగదు. స్వయం స్మృతి చేసినప్పుడే పాపాలు సమాప్తమౌతాయి. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము. నాకు చెందినవారిగా అయ్యారు కనుక ఎటువంటి పాపాలూ చేయకండి. లేకపోతే చాలా గట్టిగా పడిపోతారు అని బాబా చెప్తున్నారు. మేము మంచి పదవిని పొందగలము అన్న ఆశను కూడా పెట్టుకోకూడదు. ప్రదర్శనీలో చాలామందికి అర్థం చేయిస్తారు, మేము చాలా సేవ చేశామని సంతోషిస్తారు. కానీ మొదట మీరైతే పావనంగా అవ్వండి, తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. స్మృతిలో చాలామంది ఫెయిల్ అయిపోతారు. జ్ఞానమైతే చాలా సహజము, కేవలం 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. ఆ చదువులో లెక్కలు ఎంతగా చదువుతారు, ఎంతగా కష్టపడతారు. ఏమి సంపాదిస్తారు? చదువుతూ-చదువుతూ మరణించినట్లయితే చదువు సమాప్తమైపోతుంది. పిల్లలైన మీరు ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా ధారణ జరుగుతుంది. పవిత్రంగా అవ్వకపోతే, పాపాలను సమాప్తము చేసుకోకపోతే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. మా స్మృతి బాబాకు తప్పకుండా చేరుతుందని అనుకోకండి. బాబా ఏమి చేస్తారు! మీరు స్మృతి చేస్తే మీరే పావనంగా అవుతారు, ఇందులో బాబా ఏమి చేస్తారు, ఏమని అభినందిస్తారు. చాలా మంది పిల్లలు, మేమైతే సదా తండ్రిని స్మృతి చేస్తూనే ఉంటాము, వారు తప్ప మాకు ఇంకెవరున్నారు అని అంటారు, ఈ విధంగా కూడా వ్యర్థ ప్రలాపాలు పలుకుతూ ఉంటారు. స్మృతి చేయడంలోనే చాలా శ్రమ ఉంది. మేము స్మృతి చేస్తున్నామా లేదా అని కూడా అర్థము చేసుకోలేరు. మేమైతే స్మృతి చేస్తూనే ఉన్నామని తెలియనితనంతో అంటారు. శ్రమ చేయకుండా ఎవ్వరూ విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. ఉన్నత పదవిని పొందలేరు. స్మృతి యొక్క పదును నిండినప్పుడే సేవను చేయగలరు. ఆ తర్వాత ఎంత సేవ చేసి ప్రజలను తయారుచేశారో చూడాలి. నేను ఎంతమందిని నా సమానంగా తయారుచేశాను అన్న లెక్క అయితే కావాలి కదా. ప్రజలను తయారుచేయవల్సి ఉంటుంది కదా, అప్పుడే రాజ్యపదవిని పొందగలరు. ఇప్పుడైతే అదేమీ లేదు. యోగములో ఉంటూ పదును నిండినప్పుడే ఎవరికైనా పూర్తిగా బాణము తగులుతుంది. అంతిమంలో భీష్మపితామహుడు, ద్రోణాచార్యుడు మొదలైన వారికి జ్ఞానాన్ని ఇచ్చారు అని శాస్త్రాలలో కూడా ఉంది కదా! ఎప్పుడైతే మీ పతితత్వము తొలగి ఆత్మ సతోప్రధానత వరకు చేరుకుంటుందో అప్పుడు పదును నిండుతుంది కనుక వెంటనే బాణము తగులుతుంది. బాబాకు అన్నీ తెలుసు అని ఎప్పుడూ భావించకూడదు. బాబాకు తెలుసుకోవలసిన అవసరమేముంది, ఎవరు చేస్తారో వారే పొందుతారు. బాబా సాక్షీగా అయి చూస్తూ ఉంటారు. మేము ఫలానా స్థానానికి వెళ్ళి సేవ చేశాము అని బాబాకు వ్రాస్తారు. మొదట మీరు స్మృతి యాత్రలో తత్పరులై ఉన్నారా అని బాబా అడుగుతారు. ఇతర సాంగత్యాలన్నీ విడిచి ఒక్క బాబాతోనే సాంగత్యం జోడించండి - ఇదే మొట్టమొదటి విషయము. దేహీ-అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. ఇంట్లో ఉంటూ కూడా, ఇదైతే పాత ప్రపంచము, పాత శరీరము అని భావించాలి. ఇదంతా సమాప్తమవ్వనున్నది. మనకు తండ్రి మరియు వారసత్వంతోనే పని ఉంది. గృహస్థ వ్యవహారములో ఉండకండి, ఎవరితోనూ మాట్లాడకండి అని బాబా చెప్పడం లేదు. వివాహానికి వెళ్ళవచ్చా అని బాబాను అడుగుతారు. వెళ్తే వెళ్ళండి, వెళ్ళి అక్కడ కూడా సేవ చేయండి, బుద్ధియోగము శివబాబాతో ఉండాలి అని బాబా చెప్తారు. జన్మ-జన్మాంతరాల వికర్మలు స్మృతి బలముతోనే భస్మమౌతాయి. ఇక్కడ కూడా ఒకవేళ వికర్మలు చేస్తూ ఉన్నట్లయితే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. పావనంగా అవుతూ-అవుతూ వికారాలలో పడిపోతే మరణిస్తారు. ఒక్కసారిగా ముక్కలు-ముక్కలుగా అయిపోతారు. శ్రీమతంపై నడవకపోతే చాలా నష్టపోతారు. అడుగడుగులోనూ శ్రీమతము ఉండాలి. ఎటువంటి పాపాలు చేస్తారంటే, వాటివల్ల అసలు యోగమే కుదరదు. స్మృతి చేయలేరు. ఎవరి దగ్గరకైనా వెళ్ళి భగవంతుడు వచ్చారు, వారి నుండి వారసత్వము తీసుకోండి అని చెప్తే వారు అంగీకరించరు. బాణము తగలదు. భక్తులకు జ్ఞానాన్ని వినిపించండి, వ్యర్థంగా ఎవ్వరికీ ఇవ్వకండి, లేకపోతే ఇంకా నిందింపజేస్తారు అని బాబా చెప్పారు.

బాబా, మాకు దానము చేసే అలవాటుంది, ఇప్పుడు జ్ఞానములోకి వచ్చాము, ఇప్పుడేమి చేయాలి అని కొంతమంది పిల్లలు బాబాను అడుగుతారు. బాబా సలహా ఇస్తారు - పిల్లలూ, పేదవారికి దానము చేసేవారైతే చాలామంది ఉన్నారు. పేదవారు ఆకలితో ఏమీ మరణించరు, ఫకీర్ల వద్ద ఎంతో ధనం పడి ఉంటుంది కనుక ఈ విషయాలన్నింటి నుండి మీ బుద్ధిని తొలగించుకోవాలి. దానము మొదలైనవి చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది చెప్పడానికి వీలు లేనటువంటి పనులు చేస్తారు, ఆ తర్వాత వారి తలపై ఎంతో భారము ఏర్పడుతుంది అన్నది స్వయం అర్థము చేసుకోరు. జ్ఞాన మార్గము తమాషా మార్గము కాదు. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. ధర్మరాజు ద్వారా పెద్ద-పెద్ద శిక్షలను అనుభవించవలసి వస్తుంది. అంతిమంలో ధర్మరాజు లెక్క చూస్తారు, అప్పుడు తెలుస్తుంది అని అంటారు కదా. జన్మ-జన్మాంతరాల శిక్షలను అనుభవించడానికి ఎక్కువ సమయమేమి పట్టదు. బాబా కాశీలోని కత్తుల బావిలో దూకే ఉదాహరణ కూడా అర్థము చేయించారు. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. మనుష్యులను కూడా బలి ఇస్తారు, ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఈ విషయాలన్నీ అర్థము చేసుకోవాలి, అంతేకానీ ఈ డ్రామా ఎందుకిలా తయారుచేయబడింది, ఈ చక్రములోకి ఎందుకు తీసుకొచ్చారు అనే ప్రశ్నలు రాకూడదు. చక్రములోకైతే వస్తూనే ఉంటారు. ఇదైతే అనాది డ్రామా కదా. చక్రంలోకి రాకపోతే మరి ప్రపంచమే ఉండదు. మోక్షమనేది ఉండదు. ముఖ్యమైన వారికి కూడా మోక్షము లభించదు. 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగే చక్రములో తిరుగుతారు. ఇది డ్రామా కదా. కేవలం ఎవరికైనా అర్థం చేయించినంత మాత్రాన, వాణి నడిపించినంత మాత్రాన పదవి లభించదు, మొదట అయితే పతితుల నుండి పావనంగా అవ్వాలి. బాబాకు అన్నీ తెలుసు అని అనుకోకూడదు. బాబా తెలుసుకుని కూడా ఏమి చేస్తారు, శ్రీమతానుసారముగా మేము ఏమి చేస్తున్నాము, ఎంతవరకు బాబాను స్మృతి చేస్తున్నాము అని మొదట మీ ఆత్మ తెలుసుకుంటుంది. అంతేకానీ బాబా కూర్చుని తెలుసుకోవడం వలన లాభమేమిటి? మీరు ఎదైతే చేస్తారో దాన్ని మీరే పొందుతారు. బాబా మీ నడవడిక మరియు సేవ ద్వారా ఈ పిల్లలు మంచి సేవ చేస్తున్నారు అని తెలుసుకుంటారు. ఫలానావారు బాబాకు చెందినవారిగా అయి ఎన్నో వికర్మలు చేశారు కనుక వారి మురళీలో పదును నిండదు. ఇది జ్ఞాన ఖడ్గము. ఇందులో స్మృతి బలము యొక్క పదును అవసరము. యోగబలము ద్వారా మీరు విశ్వముపై విజయము ప్రాప్తి చేసుకుంటారు, జ్ఞానము ద్వారా కొత్త ప్రపంచములో ఉన్నతమైన పదవిని పొందుతారు. మొదట పవిత్రంగా అవ్వాలి, పవిత్రంగా అవ్వకుండా ఉన్నత పదవి లభించదు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు ఇక్కడకి వస్తారు. పతితులు, నరుని నుండి నారాయణునిగా అవ్వలేరు. పావనంగా అయ్యే పూర్తి యుక్తి కావాలి. సెంటర్లను సంభాళించే అనన్యమైన పిల్లలు కూడా చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. అంతగా శ్రమ చేయడం లేదు, అందుకే ఆ పదును నిండడం లేదు, వారి బాణము తగలడం లేదు, స్మృతియాత్ర ఎక్కడుంది! కేవలం ప్రదర్శనీలో చాలా మందికి అర్థం చేయిస్తారు, మొదట స్మృతి ద్వారానే పవిత్రంగా అవ్వాలి, ఆ తర్వాత జ్ఞానము. పావనంగా అయినట్లయితే జ్ఞాన ధారణ జరుగుతుంది. పతితులకు ధారణ జరగదు. ముఖ్యమైన సబ్జెక్టు స్మృతి. ఆ చదువులో కూడా సబ్జెక్టులు ఉంటాయి కదా. మీ వద్ద కూడా బి.కె.లుగా అవుతారు కానీ బ్రహ్మాకుమారీ-కుమారులుగా, సోదరీ-సోదరులుగా అవ్వడం పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులభము కాదు. కేవలం నామమాత్రంగా అలా అవ్వడం కాదు. దేవతలుగా అయ్యేందుకు మొదట తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. ఆ తర్వాతనే చదువు. కేవలం చదువు ఉండి పవిత్రంగా అవ్వకపోతే ఉన్నతపదవిని పొందలేరు. ఆత్మ పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉన్నప్పుడే పవిత్ర ప్రపంచములో ఉన్నతపదవిని పొందగలరు. బాబా పవిత్రత విషయంలోనే ప్రాధాన్యతనిస్తున్నారు. పవిత్రత లేకుండా ఎవ్వరికీ జ్ఞానాన్నివ్వలేరు. అంతేగాని బాబా అయితే ఏమీ చూడరు. వారు స్వయంగా కూర్చుని ఉన్నారు కదా, అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. భక్తిమార్గములో భావనకు ఫలితము లభిస్తుంది. అది కూడా డ్రామాలో రచించబడి ఉంది, శరీరము లేకుండా తండ్రి ఎలా మాట్లాడగలరు? ఎలా వినగలరు? ఆత్మకు శరీరము ఉన్నప్పుడే వింటుంది, మాట్లాడుతుంది. నాకు ఇంద్రియాలే లేకపోతే ఎలా వినగలను, ఎలా తెలుసుకోగలను అని బాబా అంటారు. మేము వికారాలలోకి వెళ్తున్నామని బాబాకు తెలుసు అని అనుకుంటారు. ఒకవేళ తెలియకపోతే మేము వారిని భగవంతునిగా భావించము అని అంటారు. ఇటువంటివారు కూడా చాలామంది ఉన్నారు. మిమ్మల్ని పావనంగా తయారుచేసే మార్గాన్ని తెలియజేసేందుకు నేను వచ్చాను అని బాబా అంటారు. సాక్షీగా అయ్యి చూస్తాను. వీరు కుపుత్రులా లేక సుపుత్రులా అని పిల్లల నడవడిక ద్వారా తెలిసిపోతుంది. సేవకు కూడా ఋజువు కావాలి కదా. ఎవరైతే చేస్తారో వారే పొందుతారని కూడా తెలుసు. శ్రీమతంపై నడుచుకున్నట్లయితే శ్రేష్ఠంగా అవుతారు. నడవకపోతే స్వయమే అశుద్ధంగా అయి క్రింద పడిపోతారు. ఏదైనా విషయముంటే స్పష్టంగా అడగండి. ఇందులో అంధశ్రద్ధ విషయమేమీ లేదు. స్మృతి యొక్క పదును లేకపోతే పావనంగా ఎలా అవ్వగలరు అని మాత్రమే బాబా అంటారు. ఈ జన్మలో కూడా చెప్పడానికి వీలు లేని విధంగా పాపాలు చేస్తారు. ఇది ఉన్నదే పాపాత్మల ప్రపంచము, సత్యయుగము పుణ్యాత్మల ప్రపంచము. ఇది సంగమయుగము. కొంతమంది మందబుద్ధి కలవారిగా ఉంటారు, వారు ధారణ చేయలేరు. బాబాను స్మృతి చేయలేరు. తర్వాత టూలేట్ అయిపోతుంది, ఈ అడవికి నిప్పు అంటుకుంటుంది, ఆ తర్వాత యోగములో కూడా ఉండలేరు. ఆ సమయములో హాహాకారాలు వెలువడుతాయి. దుఃఖం యొక్క పర్వతాలు ఎన్నో పడనున్నాయి. మేము మా రాజ్య-భాగ్యాన్ని తండ్రి నుండి తీసుకోవాలి అన్న చింత ఉండాలి. దేహాభిమానాన్ని వదిలి సేవలో నిమగ్నమవ్వాలి. కళ్యాణకారులుగా అవ్వాలి. ధనాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. ఎవరైతే అర్హులుగా ఉండరో అటువంటి పతితులకు ఎప్పుడూ దానము చేయకూడదు, అలా చేస్తే దానమిచ్చేవారికి కూడా పాపము వస్తుంది. భగవంతుడు వచ్చారని దండోరా వేయించడం కాదు. ఇలా తమనుతాము భగవంతుడు అని పిలిపించుకునేవారు భారత్ లో చాలామంది ఉన్నారు. ఎవ్వరూ అంగీకరించరు. మీకు ప్రకాశము లభించిందని ఇప్పుడు మీకు తెలుసు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. చదువుతో పాటు పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. అటువంటి యోగ్యులుగా లేదా సుపుత్రులుగా అయి సేవకు ఋజువు చూపించాలి. శ్రీమతానుసారముగా స్వయాన్ని శ్రేష్ఠంగా తయారుచేసుకోవాలి.

2. స్థూల ధనాన్ని కూడా వ్యర్థము చేయకూడదు. పతితులకు దానము ఇవ్వకూడదు. జ్ఞాన ధనాన్ని కూడా పాత్రులను చూసి ఇవ్వాలి.

వరదానము:-

సదా మలుచుకునే విశేషత ద్వారా సంపర్కము మరియు సేవలో సఫలురుగా అయ్యే సఫలతామూర్త భవ

ఏ పిల్లలలోనైతే స్వయాన్ని మలుచుకునే విశేషత ఉంటుందో, వారు సహజంగానే స్వర్ణయుగపు స్థితి వరకు చేరుకోగలరు. సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి అదేవిధంగా మీ ధారణలను ప్రత్యక్షము చేసేందుకు మలుచుకోవలసి ఉంటుంది. అలా మలుచుకోగలిగినవారే రియల్ గోల్డ్ గా అవుతారు. సాకార తండ్రి విశేషతను చూసారు కదా - సమయాన్ని బట్టి, వ్యక్తిని బట్టి అటువంటి రూపము ధరించేవారు - ఆ విధంగా తండ్రిని అనుసరించినట్లయితే సేవ మరియు సంపర్కము అన్నింటిలోనూ సహజంగానే సఫలతామూర్తులుగా అయిపోతారు.

స్లోగన్:-

ఎక్కడైతే సర్వశక్తులుంటాయో అక్కడ నిర్విఘ్న- సఫలత తోడుగా ఉంటుంది.