09-04-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - తండ్రి సమానంగా లవ్లీ గా (అత్యంత ప్రియంగా) తయారయ్యేందుకు స్వయాన్ని ఆత్మగా, బిందువుగా భావిస్తూ బిందువైన తండ్రిని స్మృతి చేయండి”

ప్రశ్న:-

స్మృతిలో ఉండే గుప్తమైన, తీవ్రమైన శ్రమ పిల్లలు ప్రతి ఒక్కరు చేయాలి - ఎందుకు?

జవాబు:-

ఎందుకంటే స్మృతి చేయకుండా ఆత్మ, పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవ్వలేదు. గుప్తమైన స్మృతిలో ఉంటూ, దేహీ-అభిమానులుగా అయినప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. ధర్మరాజు శిక్షల నుండి రక్షింపబడేందుకు సాధనం కూడా స్మృతియే. స్మృతిలోనే మాయా తుఫాన్లు విఘ్నాలను కలిగిస్తాయి, అందుకే స్మృతి యొక్క గుప్తమైన శ్రమను చేయండి, అప్పుడే లక్ష్మీనారాయణుల వలె లవ్లీగా అవ్వగలరు.

గీతము:-

ఓం నమః శివాయ.....

ఓంశాంతి. ఈ మహిమ అందరి తండ్రిది. భగవంతుడిని అనగా తండ్రిని స్మృతి చేయడం జరుగుతుంది, వారిని తల్లి-తండ్రి అని అంటారు కదా. గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. మనుష్యులందరినీ గాడ్ ఫాదర్ అంటారని కాదు. బాబా అని వారిని (లౌకిక తండ్రిని) కూడా అంటారు. లౌకిక తండ్రి అని ఎవరినైతే అంటారో, వారు కూడా మళ్ళీ పారలౌకిక తండ్రినే స్మృతి చేస్తారు. వాస్తవానికి స్మృతి చేసేది ఆత్మ. ఆత్మ లౌకిక తండ్రిని కూడా స్మృతి చేస్తుంది. కానీ ఆత్మకు తన రూపం, కర్తవ్యం గురించి తెలియదు. ఆత్మకు స్వయం గురించే తెలియనప్పుడు గాడ్ ఫాదర్ గురించి ఎలా తెలుస్తుంది. తమ లౌకిక తండ్రి గురించి అయితే అందరికీ తెలుసు, వారి నుండి వారసత్వం లభిస్తుంది, లేదంటే ఎందుకు స్మృతి చేస్తారు. పారలౌకిక తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తూ ఉండవచ్చు. ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. వారిని దయ, క్షమ చూపమని కోరుకుంటారు ఎందుకంటే పాపాలు చేస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. కానీ ఆత్మను గురించి తెలుసుకోవడం మరియు పరమాత్మను గురించి తెలుసుకోవడం అనేది కష్టమైన సబ్జెక్ట్. సహజాతి సహజము మరియు కష్టాతి కష్టము. నిజానికి సైన్స్ మొదలైనవి ఎంతగా నేర్చుకొని చంద్రుని వరకు వెళ్ళినా సరే, ఈ జ్ఞానం ముందు అది తుచ్ఛమైనది. స్వయాన్ని మరియు తండ్రిని తెలుసుకోవడం చాలా కష్టము. బ్రహ్మాకుమార-కుమారీలుగా పిలవబడే పిల్లలు కూడా స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. ఆత్మనైన నేను బిందువును, నా తండ్రి కూడా బిందువే అన్నది మర్చిపోతారు. ఇది కష్టమైన సబ్జెక్ట్. నేను ఆత్మను అన్నది మర్చిపోతే తండ్రిని స్మృతి చేయడం కూడా మర్చిపోతారు. దేహీ-అభిమానులుగా అయ్యే అభ్యాసం లేదు. ఆత్మ బిందువు, ఆత్మలోనే 84 జన్మల పాత్ర ఇమిడి ఉంది. ఆత్మనైన నేను రకరకాల శరీరాలను తీసుకొని పాత్రను అభినయిస్తున్నానని పదే-పదే మర్చిపోతారు. ఇది అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయము. ఆత్మ మరియు పరమాత్మలను గురించి అర్థం చేసుకోవడం తప్ప మిగిలిన జ్ఞానమంతా అందరి బుద్ధిలోకి వస్తుంది. మనము 84 జన్మలు తీసుకుంటాము, సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా..... అవుతాము. ఈ చక్రం చాలా సహజము, దీనిని అర్థం చేసుకుంటారు. కానీ స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయడంలో ఉన్నంత లాభం కేవలం చక్రాన్ని తెలుసుకోవడంలో లేదు. ఆత్మనైన నేను నక్షత్రాన్ని. తండ్రి కూడా అతి సూక్ష్మమైన నక్షత్రము. వారే సద్గతిదాత. వారిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఈ పద్ధతిలో ఎవరూ నిరంతరం స్మృతి చేయరు. దేహీ-అభిమానులుగా అవ్వరు. నేను ఆత్మను అన్నది పదే-పదే గుర్తు చేసుకోవాలి. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అన్నది తండ్రి ఆజ్ఞ. నేను బిందువును. ఇక్కడకు వచ్చి పాత్రధారిగా అయ్యాను. నాలో 5 వికారాల తుప్పు పట్టి ఉంది. ఇనుప యుగంలో ఉన్నాను. ఇప్పుడు బంగారు యుగంలోకి వెళ్ళాలి కావున తండ్రిని ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి. ఈ విధంగా తండ్రిని స్మృతి చేస్తే తుప్పు వదిలిపోతుంది. ఇందులోనే శ్రమ ఉంది. తాము చేసిన సేవ గురించి చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజు ఈ సేవ చేశాను, చాలా ప్రభావితమయ్యారు అని చెప్తారు కానీ ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానం విషయంలో వారు ఏ మాత్రము ప్రభావితమవ్వలేదని శివబాబాకు అర్థమవుతుంది. భారత్ స్వర్గంగా మరియు నరకంగా ఎలా అవుతుంది, 84 జన్మలను ఎలా తీసుకుంటారు, సతో రజో తమోలలోకి ఎలా వస్తారు అని కేవలం ఇది విని ప్రభావితులవుతారు. పరమాత్మ నిరాకారుడని కూడా అర్థం చేసుకుంటారు కానీ నేను ఆత్మను, నాలో 84 జన్మల పాత్ర నిండి ఉంది, తండ్రి కూడా బిందువు, వారిలో పూర్తి జ్ఞానముంది, వారిని స్మృతి చేయాలి అన్న విషయాలను ఎవరూ అర్థం చేసుకోరు. ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోరు. ప్రపంచ చరిత్ర-భూగోళాల జ్ఞానాన్ని తండ్రి మాత్రమే ఇస్తారు. ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఉండాలని గవర్నమెంట్ వారు కూడా కోరుకుంటున్నారు. ఇవి వాటి కన్నా సూక్ష్మమైన విషయాలు - ఆత్మ ఏమిటి, ఆత్మలో 84 జన్మల పాత్ర ఎలా ఉంది, అది కూడా అవినాశీగా ఎలా ఉంది. ఇలా స్మృతి చేయడం, స్వయాన్ని బిందువుగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి - ఈ యోగంలో ఎవరూ తత్పరులై ఉండరు. ఈ స్మృతిలో ఉన్నట్లయితే చాలా లవ్లీగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు ఎంత లవ్లీగా ఉన్నారో చూడండి. ఇక్కడున్న మనుష్యులు ఎలా ఉన్నారో చూడండి. మాలో ఏ గుణాలు లేవు, మేము దిగజారిపోయినవారము, మీరు స్వచ్ఛమైనవారు అని స్వయమే అంటారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేసినట్లయితే సఫలత లభిస్తుంది లేదంటే సఫలత చాలా తక్కువగా లభిస్తుంది. మాలో చాలా మంచి జ్ఞానముందని, ప్రపంచ చరిత్ర-భూగోళాలను గురించి మాకు తెలుసు అని భావిస్తారు. కానీ యోగం చార్టు గురించి చెప్పరు. ఈ అవస్థలో ఉండేవారు అనగా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసేవారు ఎవరో అరుదుగా ఉంటారు. చాలామందికి అభ్యాసం లేదు. పిల్లలు కేవలం జ్ఞాన చక్రాన్ని బుద్ధిలో తిప్పుతున్నారని బాబాకు అర్థమవుతుంది. ఇకపోతే నేను ఆత్మను, నేను బాబాతో యోగాన్ని జోడించాలి, దీని ద్వారా ఇనుప యుగం నుండి బంగారు యుగంలోకి వెళ్తాను, ఆత్మనైన నేను తండ్రిని తెలుసుకోవాలి, వారి స్మృతిలోనే ఉండాలి అన్న అభ్యాసం చాలా మందికి తక్కువగా ఉంది. చాలా మంది వస్తారు కూడా. బాగుంది-బాగుంది అని కూడా అంటారు. కానీ లోపల ఎంత తుప్పు పట్టి ఉంది అన్నది వారికి తెలియదు. సుందరం నుండి శ్యామంగా అయిపోయారు. మళ్ళీ సుందరంగా ఎలా అవ్వాలి? ఇది ఎవ్వరికీ తెలియదు. కేవలం చరిత్ర-భూగోళాలను తెలుసుకోవడం కాదు. పావనంగా ఎలా తయారవ్వాలి? శిక్షలు అనుభవించకుండా ఉండేందుకు ఉపాయము - కేవలం స్మృతిలో ఉండడము. యోగం సరిగ్గా లేకపోతే ధర్మరాజు శిక్షలను అనుభవిస్తారు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, దీనిని ఎవరూ తెలుసుకోలేరు. జ్ఞానంలో తమకు అంతా తెలుసని భావిస్తారు, ఇందులో అనుమానమేమీ లేదు. ముఖ్యమైనది యోగము. యోగంలో చాలా మంది అపరిపక్వంగా ఉన్నారు, కావున తండ్రి అంటారు - జాగ్రత్తగా ఉండండి, కేవలం పండితులుగా అవ్వకండి. నేను ఆత్మను, నేను తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఆజ్ఞ ఇచ్చారు - మన్మనాభవ. ఇది మహా మంత్రము. స్వయాన్ని నక్షత్రంగా భావిస్తూ తండ్రిని కూడా నక్షత్రంగా భావించండి, అప్పుడు తండ్రిని స్మృతి చేయండి. తండ్రి యొక్క పెద్ద రూపమేమీ మీ ముందుకు రాదు. కావున దేహీ-అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. విశ్వానికి మహారాజు-మహారాణిగా ఒక జంట అవుతారు, వారికి లక్షలాది మంది ప్రజలు తయారవుతారు. ప్రజలైతే చాలామంది ఉన్నారు కదా. చరిత్ర-భూగోళాలను తెలుసుకోవడం సహజమే కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినప్పుడే పావనంగా అవుతారు. ఈ అభ్యాసం చాలా కష్టమైనది. స్మృతి చేసేందుకు కూర్చున్నప్పుడు చాలా తుఫానులు విఘ్నాలను కలిగిస్తాయి. ఎవరైనా ఒక అరగంట ఏకరసంగా కూర్చోవాలన్నా చాలా కష్టము. పదే-పదే మర్చిపోతారు. ఇందులో సత్యాతి-సత్యమైన గుప్తమైన శ్రమ ఉంది. చక్రం యొక్క రహస్యాన్ని తెలుసుకోవడం సహజము. ఇకపోతే దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయడమనేది అరుదుగా ఎవరో అర్థం చేసుకుని ఆ పని చేస్తారు. తండ్రి స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. నిరోగి శరీరం, దీర్ఘ ఆయుష్షు లభిస్తుంది. కేవలం ప్రపంచ చరిత్ర-భూగోళాలను అర్థం చేయించడంతో మాలలోని మణులుగా అవ్వలేరు. స్మృతి ద్వారా మణులుగా అవుతారు. ఈ శ్రమను ఎవరూ చేయలేకపోతున్నారు. మేము స్మృతిలో ఉండడం లేదని స్వయం కూడా అర్థం చేసుకుంటారు. మంచి-మంచి మహారథులు ఈ విషయంలో ఢీలాగా ఉన్నారు. ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించడము రాదు. అయినా ఇది కష్టమైన విషయము. వారు కల్పం ఆయువును పొడిగించారు. మీరు 5 వేల సంవత్సరాలని ఋజువు చేస్తారు. కానీ ఆత్మ-పరమాత్మల రహస్యాలేవీ తెలియదు, స్మృతియే చేయరు కావున అవస్థ కింద-మీద అవుతూ ఉంటుంది. దేహాభిమానం చాలా ఉంది. దేహీ-అభిమానులుగా అయినప్పుడే మాలలోని మణులుగా అవ్వగలరు. అంతేకానీ, మేము ప్రపంచ చరిత్ర-భూగోళాలను అర్థం చేయిస్తాము కావున మాలలో దగ్గరగా వెళ్ళగలమని కాదు. ఆత్మ ఇంత చిన్నది, ఇందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ముందుగా ఈ విషయాన్ని బుద్ధిలోకి తీసుకురావాలి, తర్వాత చక్రాన్ని స్మృతి చేయాలి. ముఖ్యమైనది యోగము. యోగీ అవస్థ ఉండాలి. పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవ్వాలి. యోగంతోనే ఆత్మ పవిత్రంగా అవుతుంది. యోగబలం కలవారే ధర్మరాజు శిక్షల నుండి రక్షించబడగలరు. ఈ శ్రమ కష్టం మీద ఎవరో చేస్తారు. మాయా తుఫానులు కూడా చాలా వస్తాయి. ఇది చాలా తీవ్రమైన, గుప్తమైన శ్రమ. లక్ష్మీ-నారాయణులుగా అవ్వడం పిన్నమ్మ ఇంటికి వెళ్ళినంత సులువేమీ కాదు. ఇది అభ్యాసమైనట్లయితే నడుస్తూ-తిరుగుతూ తండ్రి స్మృతి కలుగుతూ ఉంటుంది, దీనినే యోగమని అంటారు. ఇకపోతే జ్ఞానపు విషయాలను చిన్న-చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. చిత్రాలలో యుగాలు మొదలైనవి అన్నీ చూపించడం జరిగింది. ఇది సాధారణమైన విషయము. ఏదైనా కార్యాన్ని ప్రారంభించినప్పుడు స్వస్తికను వేస్తారు. ఇది సత్య, త్రేతా మొదలైన యుగాలకు గుర్తు..... ఇకపోతే పైన చిన్న సంగమయుగం ఉంది. కావున ముందు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే, అప్పుడు ఆ శాంతి వ్యాపించగలదు. యోగం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ప్రపంచమంతా ఆత్మ-పరమాత్మల గురించి మర్చిపోయింది, కొందరు పరమాత్మ వేలాది సూర్యుల కన్నా తేజోమయుడు అని అంటారు కానీ అదెలా సాధ్యము. ఎందుకంటే ఆత్మనే పరమాత్మ అని అన్నప్పుడు, ఇరువురూ ఒకటే అయినట్లు కదా. చిన్న, పెద్ద అన్న తేడా ఏమీ ఉండదు. దీని గురించి కూడా అర్థం చేయించాలి. ఆత్మ రూపం బిందువు. ఆత్మనే పరమాత్మ అయినప్పుడు పరమాత్మ కూడా బిందువైనట్లే కదా. ఇందులో తేడా ఏమీ ఉండదు. అందరూ పరమాత్మ అయినట్లయితే అందరూ రచయితలే అవుతారు. సర్వుల సద్గతి చేసేవారు ఒక్క తండ్రియే కదా. ఇకపోతే, ప్రతి ఒక్కరికీ తమ తమ పాత్ర లభించి ఉంది. దీనిని బుద్ధిలో కూర్చోబెట్టుకోవాలి, ఇది అర్థం చేసుకోవలసిన విషయము. నన్ను స్మృతి చేసినట్లయితే తుప్పు వదిలిపోతుందని తండ్రి అంటారు. ఇందులో శ్రమ ఉంది. అర్ధకల్పం నుండి దేహాభిమానులుగా ఉన్నారు. సత్యయుగంలో దేహీ-అభిమానులుగా ఉన్నా కానీ తండ్రి గురించి తెలియదు. జ్ఞానం గురించి తెలియదు. ఈ సమయంలో మీకు ఏదైతే నాలెడ్జ్ లభిస్తుందో, అది మాయమైపోతుంది. అక్కడ కేవలం ఆత్మనైన నేను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాను అన్నది తెలుస్తుంది. పాత్రను అభినయిస్తారు. ఇందులో చింతించే విషయమేముంది. ప్రతి ఒక్కరు తమ-తమ పాత్రను అభినయించాలి. ఏడిస్తే ఏమవుతుంది? ఇది అర్థం చేయించడం జరుగుతుంది, ఒకవేళ కొంత అర్థం చేసుకున్నా శాంతి లభిస్తుంది. స్వయం అర్థం చేసుకున్నట్లయితే ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. ఏడిస్తే తిరిగి వస్తారా ఏమిటి అని వృద్ధులు అర్థం చేయిస్తారు కూడా. శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోయింది, ఇందులో ఏడ్చే విషయమేముంది. అజ్ఞాన కాలంలో కూడా ఇలాగే భావిస్తారు. కానీ ఆత్మ మరియు పరమాత్మ ఏమిటి అన్నది వారికి తెలియదు. ఆత్మలో మాలిన్యం చేరుకుంది, కానీ వారు ఆత్మ నిర్లేపి అని భావిస్తారు. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు. చాలా మంది పిల్లలు స్మృతిలో ఉండరని తండ్రికి తెలుసు. కేవలం అర్థం చేయించడంతో ఏమవుతుంది. చాలా ప్రభావితులయ్యారు అని అంటారు కానీ దీని ద్వారా వారి కళ్యాణమేమీ జరగలేదు. ఆత్మ-పరమాత్మల పరిచయం లభించినప్పుడే, మేము వారి పిల్లలమని అర్థమవుతుంది. తండ్రియే పతితపావనుడు. వారు వచ్చి మనల్ని దుఃఖం నుండి విడిపిస్తారు. వారు కూడా బిందువు. కావున తండ్రిని నిరంతరం స్మృతి చేయాలి. ఇకపోతే చరిత్ర-భూగోళాలను తెలుసుకోవడం పెద్ద విషయమేమీ కాదు. అర్థం చేసుకునేందుకు వస్తారు కానీ నేను ఆత్మను అనే స్థితిలో తత్పరులై ఉండాలి, ఇందులోనే శ్రమ ఉంది. మీకు కూడా ఆత్మ-పరమాత్మల విషయం గురించి తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. సృష్టి చక్రమైతే సహజము. ఎంత వీలైతే అంత లేస్తూ-కూర్చుంటూ దేహీ-అభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. దేహీ-అభిమానులు చాలా శాంతిగా ఉంటారు, నేను సైలెన్స్ లోకి వెళ్ళాలి, నిరాకార ప్రపంచంలోకి వెళ్ళి విరాజమానమవ్వాలి, ఇప్పుడు నా పాత్ర పూర్తి అయింది అని భావిస్తారు. తండ్రి రూపాన్ని చిన్న బిందువుగా భావిస్తారు. వారు పెద్ద లింగమేమీ కాదు. బాబా చాలా చిన్నగా ఉంటారు. వారే నాలెడ్జ్ ఫుల్, సర్వుల సద్గతిదాత. ఆత్మనైన నేను కూడా నాలెడ్జ్ ఫుల్ గా అవుతున్నాను. ఇటువంటి చింతన జరిగినప్పుడు ఉన్నత పదవిని పొందగలరు. ప్రపంచంలోని వారెవ్వరికీ ఆత్మ మరియు పరమాత్మల గురించి తెలియదు.

బ్రాహ్మణులైన మీరిప్పుడు తెలుసుకున్నారు. సన్యాసులకు కూడా తెలియదు, వారు వచ్చి అర్థం చేసుకోరు. వారందరూ తమ-తమ ధర్మాలలోనే వస్తారు. లెక్కాచారాలను సమాప్తం చేసుకొని వెళ్ళిపోతారు. ఈ శ్రమ చేసినట్లయితేనే మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు మళ్ళీ దేహీ-అభిమానులుగా అవ్వాలి. మనసు ఆత్మలో ఉంది కదా. ఆత్మయే మనసును తండ్రితో జోడించాలి. మనసు శరీరంలో లేదు. శరీరానికైతే అన్ని స్థూల కర్మేంద్రియాలు ఉన్నాయి. మనసును జోడించడమనేది ఆత్మ కర్తవ్యము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మ తండ్రితో మనసును జోడించాలి. ఆత్మ చాలా సూక్ష్మమైనది. ఆత్మ ఎంత చిన్నది, సూక్ష్మమైనది, కానీ ఎంత పాత్రను అభినయిస్తుంది. ఇది ప్రాకృతికము. ఇంత చిన్న వస్తువులో అవినాశీ పాత్ర ఎంతగా నిండి ఉంది. అది ఎప్పటికీ నశించదు. ఆత్మ చాలా సూక్ష్మమైనది. మీరు ప్రయత్నించినా సరే పెద్ద వస్తువులే గుర్తుకొస్తాయి. ఆత్మనైన నేను చిన్న నక్షత్రాన్ని, తండ్రి కూడా చిన్నగా ఉంటారు. పిల్లలైన మీరు మొట్టమొదట ఈ శ్రమను చేయాలి. ఇంత చిన్న ఆత్మనే ఇప్పుడు పతితంగా అయింది. ఇది ఆత్మను పావనంగా చేసే మొట్టమొదటి ఉపాయము. చదువు చదువుకోవాలి. ఇకపోతే ఆటపాటలు వేరే విషయము. ఆడుకోవడం కూడా ఒక కళయే. చదువు ద్వారా పదవి లభిస్తుంది. ఆట పాటల ద్వారా పదవి లభించదు. ఆటలు మొదలైనవాటి డిపార్టుమెంటు వేరుగా ఉంటుంది. దానికి జ్ఞానం మరియు యోగంతో సంబంధము లేదు. భోగ్ పెట్టడం మొదలైనవి కూడా ఆటనే. ముఖ్యమైనది స్మృతి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ధర్మరాజు శిక్షల నుండి రక్షించబడేందుకు స్మృతి యొక్క గుప్తమైన శ్రమ చేయాలి. స్వయాన్ని ఆత్మగా, బిందువుగా భావిస్తూ బిందువైన తండ్రిని స్మృతి చేయడమే పావనంగా అయ్యే ఉపాయము.

2. జ్ఞానంలో నాకు అంతా తెలుసు అని అనుకోకూడదు, ఏకరస అవస్థను తయారుచేసుకునే అభ్యాసం చేయాలి. తండ్రి ఆజ్ఞను పాటించాలి.

వరదానము:-

సత్యత మరియు స్వచ్ఛతల ధారణ ద్వారా సామీప్యతను అనుభవం చేసే సంపూర్ణ మూర్త భవ

అన్ని ధారణలలోనూ ముఖ్యమైన ధారణలు సత్యత మరియు స్వచ్ఛత. ఒకరి పట్ల ఒకరికి హృదయంలో పూర్తి స్వచ్ఛత కలిగి ఉండాలి. ఎలాగైతే స్వచ్ఛమైన వస్తువులో అంతా స్పష్టంగా కనిపిస్తుందో, అలా ఒకరి పట్ల ఒకరికి భావనలు, భావ-స్వభావాలు స్పష్టంగా కనిపించాలి. ఎక్కడైతే సత్యత-స్వచ్ఛత ఉంటుందో, అక్కడ సామీప్యత ఉంటుంది. ఎలాగైతే బాప్ దాదాకు సమీపంగా ఉన్నారో, అలా పరస్పరంలో కూడా హృదయం యొక్క సామీప్యత ఉండాలి. స్వభావాలలో భిన్నత్వం సమాప్తమవ్వాలి. దీని కోసం మనోభావాలను మరియు స్వభావాలను కలుపుకోవాలి. స్వభావాలలో తేడా కనిపించనప్పుడే సంపూర్ణ మూర్తులని అంటారు.

స్లోగన్:-

పాడైపోయిన దానిని బాగుచేయడమే అన్నింటికన్నా పెద్ద సేవ.