10-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఈ పాత ప్రపంచము నుండి మరణించి కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు మీరు ఈ విశ్వ విద్యాలయములోకి వచ్చారు, ఇప్పుడు మీకు ఒక్క భగవంతుని పట్ల ప్రీతి ఉంది”

ప్రశ్న:-

ఏ విధి ద్వారా తండ్రి యొక్క స్మృతి మిమ్మల్ని షావుకార్లుగా చేస్తుంది?

జవాబు:-

తండ్రి ఒక బిందువు. మీరు బిందువుగా అయి, బిందువును స్మృతి చేసినట్లయితే షావుకార్లుగా అవుతారు. ఏ విధంగా ఒకటి పక్కన బిందువు పెట్టినట్లయితే 10 అవుతుంది, తర్వాత మరొక బిందువు పెడితే 100, తర్వాత 1000 అయిపోతుంది, అదే విధంగా తండ్రి స్మృతి ద్వారా బిందువు ఏర్పడుతూ ఉంటుంది. మీరు ధనవంతులుగా అవుతూ ఉంటారు. స్మృతిలోనే సత్యమైన సంపాదన ఉంది.

గీతము:-

సభలో జ్యోతి వెలిగింది..... (మెహఫిల్ మే జల్ ఉఠీ షమా.....)

ఓంశాంతి. ఈ పాట అర్థము ఎంత విచిత్రంగా ఉంది. ప్రీతి ఎందుకు ఏర్పడింది? ఎవరి పట్ల ఏర్పడింది? భగవంతుని పట్ల, ఎందుకంటే ఈ ప్రపంచము నుండి మరణించి వారి వద్దకు వెళ్ళాలి. ఎప్పుడైనా ఎవరి పట్లనైనా ఈ విధమైన ప్రీతి ఉంటుందా? ఈ ప్రీతి వలన మేము మరణిస్తాము అన్న ఆలోచన వచ్చినప్పుడు ఎవరైనా ప్రీతి కలిగి ఉంటారా? పాట అర్థము ఎంత అద్భుతంగా ఉంది. దీపపు పురుగులు దీపము పట్ల ప్రీతిని పెట్టుకుని దాని చుట్టూ తిరుగుతూ, కాలిపోయి మరణిస్తాయి. మీరు కూడా తండ్రి ప్రీతిలో ఈ శరీరాన్ని వదలాలి అనగా తండ్రిని స్మృతి చేస్తూ శరీరాన్ని వదలాలి. ఈ గాయనము కేవలం ఒక్కరి కోసమే చేయబడింది. ఆ తండ్రి వచ్చినప్పుడు, ఎవరైతే వారి పట్ల ప్రీతిని పెట్టుకుంటారో, వారు ఈ ప్రపంచము నుండి మరణించవలసి ఉంటుంది. భగవంతుని పట్ల ప్రీతి కలిగి ఉన్నట్లయితే మరణించిన తర్వాత ఎక్కడకు వెళ్తారు. తప్పకుండా భగవంతుని వద్దకే వెళ్తారు. భగవంతుని వద్దకు వెళ్ళేందుకు మనుష్యులు దానపుణ్యాలు, తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు. శరీరమును విడిచిపెట్టే సమయంలో కూడా భగవంతుడిని స్మృతి చేయమని మనుష్యులకు చెప్తారు. భగవంతుడు ఎంత పేరు ప్రఖ్యాతి గలవారు. వారు వచ్చినప్పుడు మొత్తం ప్రపంచమంతటినీ సమాప్తం చేసేస్తారు. మీరు పాత ప్రపంచము నుండి మరణించి కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు ఈ యూనివర్సిటీలోకి వచ్చారు. పాత ప్రపంచాన్ని పతిత ప్రపంచమని, హెల్ (నరకం) అని అంటారు. తండ్రి కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు మార్గాన్ని చెప్తారు. కేవలం నన్ను స్మృతి చేయండి, నేను హెవెన్లీ గాడ్ ఫాదర్ ను. ఆ తండ్రి నుండి మీకు ధనము లభిస్తుంది, ఆస్తి, ఇల్లు మొదలైనవి లభిస్తాయి. కుమారీలకు వారసత్వము లభించదు. వారిని ఇంకొక ఇంటికి పంపించేస్తారు, అనగా వారు వారసులుగా లేనట్లు. ఈ భగవంతుడు ఆత్మలందరికీ తండ్రి, వీరి వద్దకు అందరూ రావలసిందే. తండ్రి తప్పకుండా ఏదో ఒక సమయంలో వచ్చి ఇంటికి తీసుకువెళ్తారు ఎందుకంటే కొత్త ప్రపంచంలో చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారు. పాత ప్రపంచంలోనైతే అనేక మంది ఉన్నారు. కొత్త ప్రపంచంలో మనుష్యులు కొంతమందే ఉంటారు మరియు సుఖము చాలా ఉంటుంది. పాత ప్రపంచంలో చాలామంది మనుష్యులు ఉన్నారు కావున దుఃఖము కూడా ఎక్కువగా ఉంది, అందుకే పిలుస్తారు. బాపూ గాంధీజీ కూడా ఓ పతితపావనా రండి, అని పిలిచేవారు, కాకపోతే వారెవరో తెలియదు. పతితపావనుడు పరమపిత పరమాత్మ అని, వారే ప్రపంచం యొక్క ముక్తిదాత అని కూడా భావించేవారు. సీతా-రాములను ప్రపంచమంతా అంగీకరించదు. ప్రపంచమంతా పరమపిత పరమాత్మను ముక్తిదాత, మార్గదర్శకుడు అని అంగీకరిస్తుంది. వారు దుఃఖము నుండి విముక్తులుగా చేస్తారు. అచ్ఛా, దుఃఖమును ఇచ్చేవారు ఎవరు? తండ్రి దుఃఖమునివ్వరు, ఎందుకంటే వారు పతితపావనుడు. వారు పావన ప్రపంచమైన సుఖధామములోకి తీసుకువెళ్ళేవారు. మీరు ఆ ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు. తండ్రి ఎలా ఉంటారో, పిల్లలు కూడా అలాగే ఉంటారు. లౌకిక తండ్రికి లౌకిక పిల్లలు అనగా దైహిక పిల్లలు ఉంటారు. మేము ఆత్మలము, పరమపిత పరమాత్మ మాకు వారసత్వమును ఇవ్వడానికి వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకోవాలి. మనము వారికి పిల్లలుగా అయినట్లయితే స్వర్గ వారసత్వము తప్పకుండా లభిస్తుంది. వారు స్వర్గాన్ని స్థాపన చేసేవారు. మేము విద్యార్థులము అన్నది మర్చిపోకూడదు. శివబాబా మధుబన్ లో మురళీని వినిపిస్తారని పిల్లల బుద్ధిలో ఉంటుంది. ఆ చెక్క మురళీ ఇక్కడ లేదు. కృష్ణుడు డాన్స్ చేయడం, మురళీని వాయించడం - ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇకపోతే, జ్ఞాన మురళీనైతే ఒక్క శివబాబా మాత్రమే వినిపిస్తారు. మీ వద్దకు మంచి-మంచి పాటలను తయారు చేసేవారు వస్తారు. పురుషులే ఎక్కువగా పాటలను తయారుచేస్తారు. మీరు జ్ఞానం యొక్క పాటలను మాత్రమే పాడాలి, వాటితో మీకు శివబాబా యొక్క స్మృతి కలగాలి.

అల్ఫ్ అయిన నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. శివుడిని బిందువని అంటారు. వ్యాపారస్థులు బిందువు వ్రాసినప్పుడు శివ అని అంటారు. ఒకటి పక్కన బిందువు పెడితే 10 అవుతుంది, తర్వాత ఇంకొక బిందువు పెడితే 100 అవుతుంది. ఇంకొక బిందువు పెడితే 1000 అయిపోతుంది. మీరు కూడా శివుడిని స్మృతి చేయాలి. శివుడిని ఎంతగా స్మృతి చేస్తారో, అన్ని బిందువులు ఏర్పడుతూ ఉంటాయి. మీరు అర్థకల్పం కోసం షావుకార్లుగా అవుతారు. అక్కడ పేదవారు అసలు ఉండరు. అందరూ సుఖంగా ఉంటారు. దుఃఖమనే మాటే ఉండదు. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. దీనినే సత్యమైన తండ్రి ద్వారా లభించే సత్యమైన సంపాదన అని అంటారు. ఇదే మీతోపాటు వస్తుంది. మనుష్యులందరూ ఖాళీ చేతులతో వెళ్తారు కానీ మీరు నిండు చేతులతో వెళ్ళాలి. తండ్రిని స్మృతి చేయాలి. పవిత్రత ఉన్నట్లయితే శాంతి, సంపదలు లభిస్తాయని తండ్రి అర్థం చేయించారు. ఆత్మలైన మీరు మొదట పవిత్రంగా ఉండేవారు, తర్వాత అపవిత్రంగా అయ్యారు. సన్యాసులను కూడా సెమీ ప్యూర్ (సగము పవిత్రులు) అని అంటారు. మీది ఫుల్ సన్యాసము (పూర్తి సన్యాసము). ఇతరులు ఎంత సుఖాన్ని అనుభవిస్తారు అనేది మీకు తెలుసు. కొద్దిగా సుఖం ఉంటుంది, ఆ తర్వాత దుఃఖమే ఉంటుంది. ఇంతకు ముందు వారు సర్వవ్యాపి అని అనేవారు కాదు. సర్వవ్యాపి అనడం వలన దిగజారుతూ వచ్చారు. ప్రపంచంలో అనేక రకాల మేళాలు జరుగుతాయి, ఎందుకంటే వాటి నుండి ఆదాయము వస్తుంది కదా. ఇది వారి వ్యాపారము. అన్ని వ్యాపారాలలో ధూళి (పాపము) ఉంటుంది కానీ ఈ వ్యాపారము ధూళి లేకుండా నరుని నుండి నారాయణునిగా తయారుచేసేటువంటిది. ఈ వ్యాపారము ఎవరో చాలా అరుదుగా చేస్తారు. తండ్రికి చెందినవారిగా అయి దేహ సహితంగా అన్నిటినీ తండ్రికి ఇవ్వాలి, ఎందుకంటే మీరు కొత్త శరీరం లభించాలని కోరుకుంటున్నారు. ఎప్పుడైతే ఆత్మ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతుందో, అప్పుడు మీరు కృష్ణపురికి వెళ్ళగలరని తండ్రి చెప్తారు. మమ్మల్ని పావనంగా చేయండి అని కృష్ణపురిలో ఈ విధంగా అనరు. ఇక్కడైతే మనుష్య మాత్రులందరూ ఓ ముక్తిదాత రండి, ఈ పాపాత్ముల ప్రపంచము నుండి ముక్తిని కలిగించండి అని తండ్రిని పిలుస్తారు.

మనల్ని వారితో పాటు తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారని మీకిప్పుడు తెలుసు. అక్కడకు వెళ్ళడమైతే మంచిదే కదా. మనుష్యులు శాంతి కావాలని కోరుకుంటున్నారు. కానీ శాంతి అని దేనినంటారు? కర్మలు చేయకుండానైతే ఎవరూ ఉండలేరు. శాంతిధామములోనే శాంతి ఉంది. అయినా సరే శరీరాన్ని తీసుకుని కర్మలనైతే చేయవలసిందే. సత్యయుగంలో కర్మలు చేస్తూ కూడా శాంతి ఉంటుంది. అశాంతిలో మనుష్యులకు దుఃఖము కలుగుతుంది, అందుకే శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు. శాంతిధామము మా ఇల్లు అని పిల్లలైన మీరిప్పుడు తెలుసుకున్నారు. సత్యయుగంలో శాంతి కూడా ఉంది, సుఖము కూడా ఉంది. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కావాలా లేక కేవలం శాంతి మాత్రమే కావాలా. ఇక్కడ దుఃఖమున్న కారణంగా పతితపావనుడైన తండ్రిని కూడా ఇక్కడికే పిలుస్తారు. భగవంతుడిని కలుసుకునేందుకే భక్తి చేస్తారు. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది, తర్వాత వ్యభిచారిగా అవుతుంది. వ్యభిచారి భక్తిలో ఏమేమి చేస్తారో చూడండి. మెట్ల చిత్రములో ఎంత బాగా చూపించారు, కానీ మొట్టమొదట భగవంతుడు ఎవరు అనేది ఋజువు చేయాలి, శ్రీకృష్ణుడిని ఈ విధంగా ఎవరు తయారుచేశారు, గత జన్మలో వారు ఎవరు - ఈ విషయాలను చాలా యుక్తిగా అర్థము చేయించాలి. ఎవరైతే సేవ బాగా చేస్తారో, వారి హృదయము కూడా సాక్ష్యము చెప్తుంది. యూనివర్సిటీలో ఎవరైతే బాగా చదువుకుంటారో, వారు తప్పకుండా చురుకుగా ముందుకు వెళ్తారు. నంబరువారుగా అయితే ఉంటారు. కొందరు డల్ హెడ్ గా (మంద బుద్ధి గలవారిగా) కూడా ఉంటారు. మా బుద్ధి తాళము తెరవండి అని ఆత్మ శివబాబాతో అంటుంది. బుద్ధి తాళమును తెరిచేందుకే నేను వచ్చానని తండ్రి అంటారు. కానీ మీ కర్మలు ఎలా ఉన్నాయంటే, వాటి కారణంగా తాళము తెరుచుకోవడమే లేదు. అటువంటప్పుడు బాబా ఏం చేస్తారు? చాలా పాపము చేసి ఉన్నారు. ఇప్పుడు బాబా వారిని ఏం చేస్తారు? మేము తక్కువగా చదువుకుంటామని విద్యార్థులు టీచరుకు చెప్తే, టీచరు ఏం చేస్తారు? టీచరు కృపనైతే చూపించరు! మహా అయితే వారి కోసం అదనపు సమయాన్ని కేటాయిస్తారు. ఈ విషయంలో మీకు ఎటువంటి నిషేధం లేదు. ప్రదర్శిని తెరవబడి ఉంది, మీరు కూర్చొని అభ్యాసము చేయండి. భక్తి మార్గంలోనైతే మాల తిప్పమని కొందరు అంటారు, ఈ మంత్రాన్ని స్మృతి చేయండి అని కొందరు అంటారు. ఇక్కడైతే తండ్రి వారి పరిచయమును ఇస్తారు. తండ్రిని స్మృతి చేయాలి, దీని ద్వారా వారసత్వము లభిస్తుంది. కావున మంచి రీతిలో తండ్రి నుండి పూర్తి వారసత్వమును తీసుకోవాలి కదా. ఇందులో కూడా ఎప్పటికీ వికారాలలోకి వెళ్ళకండి అని తండ్రి చెప్తారు. వికారాల రుచి ఏ మాత్రమైనా మిగిలి ఉన్నట్లయితే, అది మళ్ళీ వృద్ధి చెందుతుంది. సిగరెట్టు మొదలైనవాటి రుచి ఒకసారి చూసినా సరే, సాంగత్యపు రంగు వెంటనే అంటుకుంటుంది. తర్వాత ఆ అలవాటును మానుకోవడం చాలా కష్టమైపోతుంది. ఎన్ని సాకులు చెప్తారు. దేనికీ అలవాటు పడకూడదు. చెడు అలవాట్లను కూడా తొలగించుకోవాలి. జీవిస్తూనే శరీర భానాన్ని వదిలి నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. దేవతలకు ఎప్పుడూ పవిత్రమైన భోగ్ మాత్రమే పెట్టడం జరుగుతుంది, కావున మీరు కూడా పవిత్రమైన భోజనమునే తినండి. ఈ రోజుల్లో స్వచ్ఛమైన నెయ్యి లభించడం లేదు, నూనెను ఉపయోగిస్తారు. అక్కడ నూనె మొదలైనవి ఉండవు. ఇక్కడ డైరీలో చూడండి, స్వచ్ఛమైన నేతిని కూడా పెడతారు, కల్తీ నేతిని కూడా పెడతారు. రెండింటి పైనా స్వచ్ఛమైన నెయ్యి అని వ్రాసి ఉంటుంది కానీ ధరలో తేడా ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు వికసించిన పుష్పాల వలె హర్షితంగా ఉండాలి. స్వర్గంలో సహజ సౌందర్యం ఉంటుంది. అక్కడ ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుంది. లక్ష్మీనారాయణుల వంటి సహజ సౌందర్యమును ఇక్కడ ఎవరూ తయారుచేయలేరు. వారిని ఈ కళ్ళతో ఎవరూ చూడలేరు. అవును, సాక్షాత్కారమవుతుంది కానీ సాక్షాత్కారం అవ్వడం వలన అదే విధమైన చిత్రాలను ఎవరూ తయారుచేయలేరు. అయితే, ఎవరైనా కళాకారునికి సాక్షాత్కారమై, వారు ఆ సమయంలో కూర్చొని తయారుచేస్తే.... కానీ ఇది చాలా కష్టము. కావున పిల్లలైన మీకు చాలా నషా ఉండాలి. ఇప్పుడు మమ్మల్ని తీసుకువెళ్ళేందుకు బాబా వచ్చారు. తండ్రి నుండి మాకు స్వర్గ వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు మా 84 జన్మలు పూర్తయ్యాయి. ఇటువంటి ఆలోచనలు బుద్ధిలో ఉన్నట్లయితే సంతోషం కలుగుతుంది. వికారాల ఆలోచనలు కొంచెం కూడా రాకూడదు. కామము మహాశత్రువు అని తండ్రి అంటారు. ద్రౌపది కూడా అందుకే పిలిచారు కదా. ద్రౌపదికి 5 మంది పతులు లేరు. నన్ను ఈ దుశ్శాసనుడు వివస్త్రగా చేస్తున్నాడు, దీని నుండి రక్షించండి అని ఆమె పిలిచారు. ఇంకా, ఐదుగురు పతులు ఎలా ఉండగలరు. అటువంటి విషయమేమీ ఉండదు. పిల్లలైన మీకు పదే-పదే కొత్త-కొత్త పాయింట్లు లభిస్తూ ఉంటాయి, కావున (చిత్రాలను) మార్చవలసి ఉంటుంది, ఏంతో కొంత మార్పు చేసి పదాలను వ్రాయాలి.

ఇంకా కొద్ది సమయములో మేము ఈ భారతదేశాన్ని పరిస్తాన్ గా చేస్తామని మీరు వ్రాస్తారు. మీరు ఛాలెంజ్ చేస్తారు. సన్ షోజ్ ఫాదర్ (కొడుకు తండ్రిని ప్రత్యక్షము చేస్తారు), ఫాదర్ షోజ్ సన్ (తండ్రి కొడుకును ప్రత్యక్షము చేస్తారు) అని తండ్రి అంటారు. ఏ తండ్రి? శివుడు మరియు సాలిగ్రామాలకే గాయనముంది. శివబాబా అర్థం చేయించిన దానిని ఫాలో చేయండి. ఫాలో ఫాదర్ అనే గాయనము కూడా వారిదే. లౌకిక తండ్రిని ఫాలో చేయడం (అనుసరించడం) వలన మీరు పతితులుగా అయిపోతారు. వీరైతే పావనంగా తయారుచేసేందుకు ఫాలో చేయిస్తారు. తేడా ఉంది కదా. మధురమైన పిల్లలూ, ఫాలో చేసి పవిత్రులుగా అవ్వండి అని తండ్రి అంటారు. ఫాలో చేస్తేనే స్వర్గానికి యజమానులుగా అవుతారు. లౌకిక తండ్రిని ఫాలో చేయడం వలన 63 జన్మలుగా మీరు మెట్లు క్రిందకు దిగిపోయారు. ఇప్పుడు తండ్రిని ఫాలో చేసి పైకి ఎక్కాలి. తండ్రితో పాటు వెళ్ళాలి. ఈ ఒక్కొక్క రత్నము లక్షల రూపాయల విలువైనది అని తండ్రి అంటారు. మీరు తండ్రిని తెలుసుకుని తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. వాళ్ళు బ్రహ్మ తత్వంలో లీనమవుతామని అంటారు. లీనము అవ్వలేరు, వారు మళ్ళీ వస్తారు. మధురాతి మధురమైన పిల్లలూ, మొట్టమొదట అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి అని తండ్రి ప్రతిరోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. పావనంగా తయారుచేసే వారసత్వాన్ని పారలౌకిక తండ్రి ఇస్తారు, అందుకే పావనంగా తయారుచేయండి అని అనంతమైన తండ్రితో అంటారు కూడా. వారు పతితపావనుడు. లౌకిక తండ్రిని పతిత పావనుడని అనరు. లౌకిక తండ్రి కూడా స్వయంగా - ఓ పతిత పావనా, రండి అని పిలుస్తూ ఉంటారు. కావున ఇద్దరు తండ్రుల పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. వివాహము చేసుకుని పతితంగా అవ్వండి అని లౌకిక తండ్రి అంటారు, పావనంగా అవ్వండి అని పారలౌకిక తండ్రి అంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. అందరినీ పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. అర్థం చేయించేందుకు ఇవి చాలా మంచి పాయింట్లు. విచార సాగర మథనము చేసి రకరకాల పాయింట్లను అర్థము చేయిస్తూ ఉండండి. ఇది మీ వ్యాపారము. పతితులను పావనంగా తయారుచేసేవారు మీరే. ఇప్పుడు పావనంగా అవ్వండి, వినాశనము ఎదురుగా నిలబడి ఉందని పారలౌకిక తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? పారలౌకిక తండ్రి మతమును తప్పకుండా అనుసరించాలి కదా. ఈ ప్రతిజ్ఞను కూడా ప్రదర్శినీలో వ్రాయాలి, పారలౌకిక తండ్రిని అనుసరిస్తాము, పతితులుగా అవ్వడం మానేస్తాము. తండ్రి నుండి గ్యారెంటీ తీసుకుంటాము అని వ్రాయండి. మొత్తం విషయమంతా పవిత్రతకు సంబంధించినది. తండ్రి (అల్ఫ్) మాకు స్వర్గ వారసత్వమును (బే, రాజ్యాధికారమును) ఇస్తున్నారని పిల్లలైన మీకు రాత్రింబవళ్ళు సంతోషం ఉండాలి. శివజయంతి అంటేనే భారతదేశ స్వర్గం యొక్క జయంతి అని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. గీతనే సర్వ శాస్త్రమయి శిరోమణి, గీతా మాతా. వారసత్వమైతే తండ్రి నుండి లభిస్తుంది. గీత రచయిత శివబాబాయే. పారలౌకిక తండ్రి నుండి పావనంగా తయారయ్యే వారసత్వము లభిస్తుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మేము గాడ్లీ స్టూడెంట్స్ (ఈశ్వరీయ విద్యార్థులము) అన్నది సదా స్మృతిలో ఉంచుకోవాలి. ఎటువంటి ఛీ-ఛీ అలవాట్లను చేసుకోకూడదు. వాటిని తొలగించాలి. వికారీ ఆలోచనలు కొంచెము కూడా రాకూడదు.

2. జీవిస్తూనే శరీర భానాన్ని మరచి తండ్రిని స్మృతి చేయాలి. భిన్న-భిన్న పాయింట్లను విచార సాగర మథనము చేసి పతితులను పావనంగా చేసే వ్యాపారము చేయాలి.

వరదానము:-

జన్మ సిద్ధ అధికారపు నషా ద్వారా లక్ష్యమును మరియు లక్షణాలను సమానంగా తయారుచేసుకునే శ్రేష్ఠ భాగ్యశాలి భవ

ఎలాగైతే లౌకిక జన్మలో స్థూల సంపద జన్మ సిద్ధ అధికారంగా ఉంటుందో, అలా బ్రాహ్మణ జన్మలో దివ్యగుణ రూపీ సంపద, ఈశ్వరీయ సుఖము మరియు శక్తి జన్మ సిద్ధ అధికారము. జన్మ సిద్ధ అధికారపు నషా న్యాచురల్ రూపంలో ఉన్నట్లయితే శ్రమించే అవసరముండదు. ఈ నషాలో ఉన్నట్లయితే లక్ష్యము మరియు లక్షణాలు సమానమవుతాయి. నేను ఎవరిని, ఎలా ఉన్నాను, ఏ శ్రేష్ఠమైన తండ్రికి మరియు పరివారానికి చెంది ఉన్నాను అని తెలుసుకొని, అంగీకరించి శ్రేష్ఠ భాగ్యశాలిగా అవ్వండి.

స్లోగన్:-

ప్రతి కర్మను స్వ స్థితిలో స్థితులై చేసినట్లయితే సహజంగానే సఫలతా సితారలుగా అవుతారు.