11-09-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - సత్యమైన తండ్రి సత్య ఖండాన్ని స్థాపన చేస్తారు, మీరు నరుని నుండి నారాయణునిగా తయారయ్యే సత్యాతి-సత్యమైన జ్ఞానాన్ని వినేందుకు తండ్రి వద్దకు వచ్చారు

ప్రశ్న:-

పిల్లలైన మీరు మీ గృహస్థ వ్యవహారంలో చాలా-చాలా సంభాళించుకుని నడుచుకోవాలి - ఎందుకు?

జవాబు:-

ఎందుకంటే మీ గతి-మతి అన్నింటికన్నా అతీతమైనవి. మీ జ్ఞానం గుప్తమైనది, అందుకే విశాల బుద్ధి కలవారిగా అయి అందరితో యుక్తియుక్తంగా సంబంధాలను నిర్వర్తించాలి. మనమందరము పరస్పరంలో సోదరులము లేక సోదరీ-సోదరులము అని లోలోపల భావించాలి. అంతేకానీ, స్త్రీ తన పతిని, మీరు నా సోదరుడు అని అనకూడదు. అలా అంటే, ఆ మాట వినేవారు వీరికి ఏమైంది అని అంటారు. కావున యుక్తిగా నడుచుకోవాలి.

ఓంశాంతి.

ఆత్మిక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక అనే పదం ఉపయోగించకుండా కేవలం తండ్రి అన్నా సరే, వారు ఆత్మిక తండ్రి అని అర్థమవుతుంది. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. అందరూ పరస్పరంలో తమను తాము సోదరులుగా చెప్పుకుంటారు. కనుక తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. వారు అందరికీ అర్థం చేయిస్తూ ఉండకపోవచ్చు. గీతలో కూడా భగవానువాచ అని రాయబడి ఉంది. ఎవరి కోసం? అందరూ భగవంతుని పిల్లలే. ఆ భగవంతుడు తండ్రి కనుక భగవంతుని పిల్లలందరూ పరస్పరంలో సోదరులు. భగవంతుడే అర్థం చేయించి ఉంటారు మరియు రాజయోగం నేర్పించి ఉంటారు. ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరుచుకుంది కావున ఇటువంటి ఆలోచనలు మీకు తప్ప ఇంకెవరికీ నడవవు. ఎవరెవరికైతే సందేశం లభిస్తూ ఉంటుందో, వారు స్కూలుకు వస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు. ప్రదర్శనీ అయితే చూసాము, ఇప్పుడు వెళ్ళి ఇంకా ఎక్కువ వినాలని వారు భావిస్తారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయము ఏమిటంటే - ఇది జ్ఞానసాగరుడు, పతితపావనుడు, గీతా జ్ఞానదాత అయిన శివ భగవానువాచ. ఇక్కడ మీకు నేర్పించేవారు, అర్థం చేయించేవారు ఎవరు అనేది వారికి తెలియాలి. వారు పరమాత్మ, జ్ఞానసాగరుడు, నిరాకారుడు. వారు సత్యము. వారు సత్యమే వినిపిస్తారు కనుక ఇక అందులో ఎలాంటి ప్రశ్న ఉత్పన్నం అవ్వలేదు. మీరు అంతా ఆ సత్యంపై వదిలేసారు. కావున మొట్టమొదట - పరమపిత పరమాత్మ మనకు బ్రహ్మా ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అనేది అర్థం చేయించాలి. ఇది రాజ్య పదవి. అందరికీ తండ్రి అయిన ఆ పారలౌకిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారని, వారే అందరికంటే గొప్ప అథారిటీ అని - ఎవరికైతే నిశ్చయం కలుగుతుందో, వారికి ఇక వేరే ప్రశ్నలేవీ కలగవు. వారు పతితపావనుడు. వారు ఇక్కడకు వచ్చినప్పుడు తప్పకుండా వారి సమయానికి వస్తూ ఉండవచ్చు. ఇది ఆ మహాభారత యుద్ధమేనని మీరు చూస్తున్నారు కూడా. వినాశనం తర్వాత నిర్వికారీ ప్రపంచం రానున్నది. భారత్ యే నిర్వికారీగా ఉండేదని మనుష్యులకు తెలియదు. వారి బుద్ధి పని చేయదు. గోద్రెజ్ తాళం వేయబడి ఉంది. దాని తాళంచెవి ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది, అందుకే మిమ్మల్ని చదివించేవారు ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఈ దాదా (బ్రహ్మా) చదివిస్తున్నారని అనుకుంటారు, అందుకే వీరిని విమర్శిస్తారు, ఏదో ఒకటి అంటారు. కావున మొట్టమొదటగా - ఇక్కడ శివ భగవానువాచ అని రాసి ఉందని అర్థం చేయించండి. వారు సత్యము. తండ్రి జ్ఞానసాగరుడు. సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాలను అర్థం చేయిస్తారు. ఈ శిక్షణ ఇప్పుడు మీకు ఆ అనంతమైన తండ్రి నుండి లభిస్తుంది. వారే సృష్టి రచయిత, పతిత సృష్టిని పావనంగా తయారుచేసేవారు. కావున మొట్టమొదట తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. ఆ పరమపిత పరమాత్మతో ఏ సంబంధముంది అనేది చెప్పాలి. వారు నరుని నుండి నారాయణునిగా తయారుచేసే సత్య జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రి సత్యము అని పిల్లలకు తెలుసు, ఆ తండ్రియే సత్య ఖండాన్ని తయారుచేస్తారు. నరుని నుండి నారాయణునిగా తయారయ్యేందుకే మీరు ఇక్కడకు వచ్చారు. బ్యారిస్టరు వద్దకు వెళ్తే, బ్యారిస్టరుగా అయ్యేందుకు వచ్చాము అని భావిస్తారు. మనల్ని భగవంతుడు చదివిస్తున్నారని ఇప్పుడు మీకు నిశ్చయముంది. చాలా మంది నిశ్చయం ఏర్పరచుకుంటారు, మళ్ళీ సంశయ బుద్ధి కలవారిగా అయిపోతారు. అప్పుడు - మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని అనేవారు కదా, మరి భగవంతుడిని ఎందుకు వదిలేసి వచ్చారని వారిని అందరూ అడుగుతారు. సంశయం కలిగినప్పుడే వదిలేసి పారిపోతారు. ఏదో ఒక వికర్మ చేస్తారు. భగవానువాచ - కామం మహాశత్రువు, దానిపై విజయం పొందడంతోనే జగత్ జీతులుగా అవుతారు. ఎవరైతే పావనంగా అవుతారో, వారే పావన ప్రపంచంలోకి వెళ్తారు. ఇక్కడ ఇది రాజయోగానికి సంబంధించిన విషయము, మీరు వెళ్ళి రాజ్యం చేస్తారు. మిగిలిన ఆత్మలందరూ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని తిరిగి వెళ్ళిపోతారు. ఇది వినాశన సమయము. సత్యయుగ స్థాపన తప్పకుండా జరగనున్నదని ఇప్పుడు బుద్ధి చెప్తుంది. పావన ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు. మిగిలినవారంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. వారు మళ్ళీ తమ పాత్రను రిపీట్ చేయాల్సి ఉంటుంది. పావనంగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు మీరు కూడా మీ పురుషార్థం చేస్తూ ఉంటారు. తమను తాము యజమానులుగా భావిస్తారు కదా. ప్రజలు కూడా యజమానులే. ఇప్పుడు ప్రజలు కూడా మా భారత్ అని అంటారు కదా. ఇప్పుడు అందరూ నరకవాసుల వలె ఉన్నారని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం స్వర్గవాసులుగా అయ్యేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. అందరూ స్వర్గవాసులుగా అవ్వరు. తండ్రి అంటారు - ఎప్పుడైతే భక్తి మార్గం పూర్తవుతుందో, అప్పుడే నేను వస్తాను, నేనే వచ్చి భక్తులందరికీ భక్తి ఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మెజారిటీ భక్తులదే కదా. ఓ గాడ్ ఫాదర్ అని అందరూ పిలుస్తూ ఉంటారు. భక్తుల నోటి నుండి ఓ గాడ్ ఫాదర్, ఓ భగవంతుడా అనే పిలుపు తప్పకుండా వెలువడుతుంది. ఇప్పుడు భక్తికి మరియు జ్ఞానానికి మధ్యన తేడా ఉంది. మీ నోటి నుండి ఎప్పుడూ ఓ ఈశ్వరా, ఓ భగవంతుడా అనే మాట రాదు. కానీ మనుష్యులకు ఇది అర్ధకల్పం బట్టి అలవాటైపోయింది. వారు మన తండ్రి అని మీకు తెలుసు. మీరు ఓ బాబా, అని పిలవకూడదు. తండ్రి నుండి మీరు తప్పకుండా వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారని ముందు మీకు నిశ్చయముండాలి. తండ్రి పిల్లలను వారసత్వం తీసుకునేందుకు అధికారులుగా తయారుచేస్తారు. వీరు సత్యమైన తండ్రి కదా. తండ్రికి తెలుసు - నేను ఏ పిల్లలకైతే జ్ఞానామృతాన్ని తాగించి, జ్ఞాన చితిపై కూర్చోబెట్టి, విశ్వానికి యజమానులుగా, దేవతలుగా తయారుచేసానో, వారే కామ చితిపై కూర్చొని భస్మమైపోయారు అని. ఇప్పుడు నేను మళ్ళీ జ్ఞాన చితిపై కూర్చోబెట్టి గాఢ నిద్ర నుండి మేల్కొలిపి స్వర్గంలోకి తీసుకువెళ్తాను.

తండ్రి అర్థం చేయించారు - ఆత్మలైన మీరు అక్కడ శాంతిధామంలో మరియు సుఖధామంలో ఉంటారు. సుఖధామాన్ని వైస్ లెస్ వరల్డ్ అని, సంపూర్ణ నిర్వికారీ ప్రపంచమని అంటారు. అక్కడ (సుఖధామం) దేవతలుంటారు మరియు అది (శాంతిధామం) స్వీట్ హోమ్, ఆత్మల ఇల్లు. పాత్రధారులందరూ ఆ శాంతిధామం నుండి ఇక్కడ పాత్రను అభినయించేందుకు వస్తారు. ఆత్మలమైన మనం ఇక్కడి నివాసులము కాము. ఆ పాత్రధారులు ఇక్కడి నివాసులు. వారు ఇంటి నుండి వచ్చి, కేవలం వస్త్రాలను మార్చుకొని పాత్రను అభినయిస్తారు. మన ఇల్లు శాంతిధామమని, మనం అక్కడికే తిరిగి వెళ్తామని మీకు తెలుసు. పాత్రధారులందరూ స్టేజి పైకి వచ్చినప్పుడు, తండ్రి వచ్చి అందరినీ తీసుకువెళ్తారు. అందుకే వారిని లిబరేటర్ (ముక్తిదాత) మరియు గైడ్ (మార్గదర్శకుడు) అని కూడా అంటారు. వారే దుఃఖహర్త-సుఖకర్త కావున ఇంతమంది మనుష్యులు ఎక్కడికి వెళ్తారు. పతితపావనుడిని ఎందుకు పిలుస్తారో ఆలోచించండి. తమ మృత్యువు కోసం పిలుస్తారు. దుఃఖమయ ప్రపంచంలో ఉండడానికి ఇష్టపడరు, అందుకే ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటారు. ఈ మాట అంటున్నవారంతా కేవలం ముక్తిని మాత్రమే నమ్ముతారు. భారత్ యొక్క ప్రాచీన యోగం కూడా ఎంత ప్రసిద్ధమైనది. ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేందుకు విదేశాలకు కూడా వెళ్తారు. క్రైస్తవులలో చాలా మంది సన్యాసులను గౌరవించేవారు ఉన్నారు. కాషాయ వస్త్రధారణ హఠయోగానికి సంబంధించింది. ఇక్కడ మీరు ఇళ్ళు-వాకిళ్ళను వదలకూడదు, తెలుపు వస్త్రాలను ధరించాలనే బంధనం కూడా లేదు. కానీ, తెలుపు మంచిది. మీరు భట్టీలో ఉన్నారు కావున ఇదే మీ డ్రెస్సుగా అయిపోయింది. ఈ రోజుల్లో తెలుపును ఇష్టపడతారు. మనుష్యులు మరణించినప్పుడు తెల్ల వస్త్రాన్ని కప్పుతారు. కనుక ముందు ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇద్దరు తండ్రులు ఉన్నారు. ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి వారికి సమయం పడుతుంది. ప్రదర్శనీలలో అంతెక్కువ అర్థం చేయించలేరు. సత్యయుగంలో ఒక్క తండ్రి ఉంటారు, ఇప్పుడు ఈ సమయంలో మీకు ముగ్గురు తండ్రులున్నారు. ఎందుకంటే భగవంతుడు ప్రజాపిత బ్రహ్మా తనువులోకి వస్తారు. వీరు (బ్రహ్మా) కూడా అందరికీ తండ్రియే. అచ్ఛా, ఇప్పుడు ముగ్గురు తండ్రులలోనూ ఉన్నతమైన వారసత్వం ఎవరిది? నిరాకార తండ్రి వారసత్వాన్ని ఎలా ఇస్తారు? వారు బ్రహ్మా ద్వారా ఇస్తారు. బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు మరియు బ్రహ్మా ద్వారా వారసత్వాన్ని కూడా ఇస్తారు. ఈ చిత్రంపై మీరు మంచి రీతిలో అర్థం చేయించవచ్చు. శివబాబా ఉన్నారు, తర్వాత ఆది దేవుడైన ప్రజాపిత బ్రహ్మా మరియు ఆది దేవి ఉన్నారు. వీరు (బ్రహ్మా) గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. తండ్రి అంటారు - శివుడినైన నన్ను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనరు. నేను అందరికీ తండ్రిని. వీరు ప్రజాపిత బ్రహ్మా. మీరందరూ పరస్పరంలో సోదరీ-సోదరులు కావున పరస్పరం వికారాలలోకి వెళ్ళకూడదు. ఒకవేళ ఇరువురికీ ఒకరి పట్ల ఒకరికి వికారీ దృష్టి ఆకర్షించినట్లయితే కింద పడిపోతారు, ఇక తండ్రిని మర్చిపోతారు. తండ్రి అంటారు - నీవు నా బిడ్డగా అయి నల్ల ముఖం చేసుకున్నావు. అనంతమైన తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, మీకు ఈ నషా ఎక్కి ఉంది. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి, లౌకిక బంధు-మిత్రులకు కూడా ముఖాన్ని చూపించాలి అని మీకు తెలుసు. లౌకిక తండ్రిని మీరు తండ్రి అనే పిలుస్తారు కదా. వారిని మీరు సోదరుడు అని పిలవరు. సాధారణ రీతిలో తండ్రిని తండ్రి అనే పిలుస్తారు. బుద్ధిలో, వీరు మా లౌకిక తండ్రి అని ఉంటుంది. జ్ఞానముంది కదా. ఈ జ్ఞానం చాలా విచిత్రమైనది. ఈ రోజుల్లోనైతే పేరు కూడా తీసుకుంటారు కానీ ఎవరైనా విజిటర్లు లేక బయట వారి ముందు తండ్రిని సోదరుడని సంబోధిస్తే, వీరి తల పాడైపోయిందని అనుకుంటారు. ఇక్కడ చాలా యుక్తిగా నడుచుకోవాలి. మీ జ్ఞానం గుప్తమైనది, సంబంధము గుప్తమైనది. చాలా వరకు స్త్రీలు, తమ పతిని పేరుతో పిలవరు, కానీ పతి తన స్త్రీని పేరుతో పిలుస్తారు. ఇక్కడ చాలా యుక్తిగా నడుచుకోవాలి. లౌకికం వారితో కూడా యుక్తిగా సంబంధాన్ని నిర్వర్తించాలి. బుద్ధి పైకి వెళ్ళిపోవాలి. మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఇకపోతే, చిన్నాన్నను చిన్నాన్న అని, తండ్రిని తండ్రి అని పిలవాలి కదా. బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలుగా అవ్వని వారు సోదరీ-సోదరులుగా భావించరు. బి.కె.లుగా అయినవారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. బయటివారు ఈ విషయాలను వింటే ఆశ్చర్యపోతారు. ఈ విషయాలను అర్థం చేసుకునేందుకు మంచి బుద్ధి కావాలి. తండ్రి పిల్లలను విశాల బుద్ధి కలవారిగా తయారుచేస్తారు. ఇంతకుముందు మీరు హద్దు బుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడు బుద్ధి అనంతంలోకి వెళ్ళిపోతుంది. వారు మన అనంతమైన తండ్రి. వీరంతా మన సోదరీ-సోదరులు, కానీ ఇంట్లో అత్తగారిని అత్తగారు అనే పిలవాలి, అంతేకానీ సోదరి అని పిలవకూడదు. ఇంట్లో ఉంటూ చాలా యుక్తిగా నడుచుకోవాలి. లేదంటే మనుష్యులు - వీరు పతిని సోదరుడని, అత్తగారిని సోదరి అని పిలుస్తారు, ఇదేమిటి అని అడుగుతారు. ఈ జ్ఞానం యొక్క విషయాలు మీకు మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలియవు. ప్రభూ, మీ గతి-మతి మీకే తెలుసు అని అంటారు కదా. ఇప్పుడు మీరు వారికి పిల్లలుగా అయ్యారు కనుక మీ గతి-మతి మీకే తెలుసు. చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ ఎవరూ తికమకపడకూడదు. ప్రదర్శనీలలో పిల్లలైన మీరు మొట్టమొదట ఇది అర్థం చేయించాలి - మనల్ని చదివించేవారు భగవంతుడు, మరి ఇప్పుడు భగవంతుడు ఎవరో మీరు చెప్పండి. నిరాకారుడైన శివుడా లేక దేహధారి అయిన కృష్ణుడా? గీతలో భగవానువాచ ఉంది - ఆ మహావాక్యాలను శివ పరమాత్ముడు ఉచ్చరించారా లేక శ్రీకృష్ణుడు ఉచ్చరించారా? కృష్ణుడు స్వర్గం యొక్క మొదటి రాకుమారుడు. కృష్ణ జయంతియే శివజయంతి అని అనలేరు. శివజయంతి తర్వాత కృష్ణ జయంతి వస్తుంది. శివజయంతి ద్వారా శ్రీకృష్ణుడు స్వర్గ రాకుమారునిగా ఎలా అయ్యారు అనేది అర్థం చేసుకోవాల్సిన విషయము. శివజయంతి, తర్వాత గీతా జయంతి, తర్వాత వెంటనే కృష్ణ జయంతి వస్తుంది, ఎందుకంటే తండ్రి రాజయోగం నేర్పిస్తారు కదా. ఈ విషయం పిల్లల బుద్ధిలోకి వచ్చింది కదా. శివపరమాత్మ రానంత వరకు శివజయంతిని జరుపుకోలేరు. శివుడు వచ్చి కృష్ణపురిని స్థాపన చేయనంత వరకు, కృష్ణ జయంతిని కూడా ఎలా జరుపుకుంటారు. కృష్ణుని జన్మను జరుపుకుంటారు కానీ అర్థం చేసుకోరు. కృష్ణుడు రాకుమారుడు కావున తప్పకుండా సత్యయుగంలోనే ఉంటారు కదా. అక్కడ దేవీ-దేవతల రాజధాని తప్పకుండా ఉంటుంది. కేవలం ఒక్క కృష్ణునికి మాత్రమే రాజ్యాధికారం లభించదు కదా. తప్పకుండా కృష్ణపురి ఉంటుంది కదా! కృష్ణపురి ఉండేదని అంటారు... ఇప్పుడు ఇది కంసపురి. కృష్ణపురి అంటే కొత్త ప్రపంచము, కంసపురి అంటే పాత ప్రపంచము. దేవతలకు మరియు అసురులకు యుద్ధం జరిగిందని, దేవతలు గెలుపొందారని అంటారు. కానీ అలా జరగలేదు. కంసపురి సమాప్తమై కృష్ణపురి స్థాపన అయ్యింది కదా. కంసపురి పాత ప్రపంచంలో ఉంటుంది. కొత్త ప్రపంచంలో ఈ కంసుడు మొదలైన రాక్షసులు ఉండరు. ఇక్కడ ఎంతమంది మనుష్యులున్నారో చూడండి. సత్యయుగంలో చాలా కొద్దిమంది ఉంటారు. ఇది కూడా మీరు అర్థం చేసుకోగలరు, ఇప్పుడు మీ బుద్ధి పని చేస్తుంది. దేవతలైతే ఏ యుద్ధము చేయలేదు. దైవీ సంప్రదాయం సత్యయుగంలోనే ఉంటుంది. ఆసురీ సంప్రదాయం ఇక్కడ ఉంది. అంతేకానీ దేవతలు మరియు రాక్షసులకు మధ్యన యుద్ధం జరగలేదు, అలాగే కౌరవులు మరియు పాండవులకు మధ్యన కూడా యుద్ధం జరగలేదు. మీరు రావణునిపై విజయం పొందుతారు. తండ్రి అంటారు - ఈ వికారాలపై విజయం పొందాలి, అప్పుడు జగత్ జీతులుగా అవుతారు. దీనికి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. యుద్ధం అన్న పేరు తీసుకుంటే, అది హింస అవుతుంది. రావణునిపై విజయం పొందాలి కానీ అహింసాయుతంగా పొందాలి. కేవలం తండ్రిని స్మృతి చేస్తే మన వికర్మలు వినాశనమవుతాయి. భారత్ యొక్క ప్రాచీన రాజయోగం ప్రసిద్ధమైనది.

తండ్రి అంటారు - నాతో బుద్ధియోగాన్ని జోడిస్తే, మీ పాపాలు భస్మమవుతాయి. తండ్రి పతితపావనుడు కనుక బుద్ధియోగాన్ని ఆ తండ్రితోనే జోడించాలి, అప్పుడు మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా వారితో యోగం జోడిస్తున్నారు, ఇందులో యుద్ధమనే మాటే లేదు. ఎవరైతే బాగా చదువుకుంటారో, తండ్రితో యోగం జోడిస్తారో, వారే తండ్రి నుండి కల్ప క్రితం వలె వారసత్వాన్ని పొందుతారు. ఈ పాత ప్రపంచ వినాశనం కూడా జరుగుతుంది. అందరూ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని వెళ్తారు. తర్వాత క్లాసులోకి ట్రాన్స్ఫర్ అయి, నంబరువారుగా వెళ్ళి కూర్చొంటారు కదా. మీరు కూడా నంబరువారుగా వెళ్ళి అక్కడ రాజ్యం చేస్తారు. ఇవి ఎంతగా అర్థం చేసుకునే విషయాలు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ వినాశన సమయంలో, సత్యయుగ స్థాపన జరుగుతున్నప్పుడు తప్పకుండా పావనంగా అవ్వాలి. తండ్రి పట్ల మరియు తండ్రి కార్యం పట్ల ఎప్పుడూ సంశయం ఉత్పన్నమవ్వకూడదు.

2. జ్ఞానము మరియు సంబంధాలు గుప్తమైనవి, అందుకే లౌకికంలో చాలా యుక్తిగా విశాల బుద్ధి కలవారిగా అయి నడుచుకోవాలి. వినేవారు తికమకపడే విధంగా ఏ మాటలు మాట్లాడకూడదు.

వరదానము:-

మన్మతాన్ని, పరమతాన్ని సమాప్తం చేసి శ్రీమతం అనుసారంగా పదమాల సంపాదనను జమ చేసుకునే పదమాపదమ భాగ్యశాలి భవ

శ్రీమతాన్ని అనుసరించేవారు, మన్మతాన్ని లేక పరమతాన్ని అనుసరించి ఒక్క సంకల్పం కూడా చేయకూడదు. స్థితి యొక్క వేగం తీవ్రంగా లేదంటే, తప్పకుండా శ్రీమతంలో ఎంతో కొంత మన్మతము లేక పరమతము మిక్స్ అయి ఉన్నట్లు. మన్మతము అనగా అల్పజ్ఞ ఆత్మల (చాలా కొంచెం తెలిసినవారి) సంస్కారం అనుసారంగా ఉత్పన్నమయ్యే సంకల్పాలు, ఇవి స్థితిని విచలితం చేస్తాయి. అందుకే చెక్ చేసుకోండి మరియు ఇతరులతో చెక్ చేయించుకోండి, ఒక్క అడుగు కూడా శ్రీమతం లేకుండా వేయకూడదు, అప్పుడు పదమాల సంపాదనను జమ చేసుకొని పదమాపదమ భాగ్యశాలిగా అవ్వగలరు.

స్లోగన్:-

మనసులో సర్వుల పట్ల కళ్యాణ భావన కలిగి ఉండడమే విశ్వ కళ్యాణకారి ఆత్మల కర్తవ్యము.