12-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీకు సంపాదన పట్ల చాలా అభిరుచి ఉండాలి, ఈ చదువులోనే సంపాదన ఉంది”

ప్రశ్న:-

జ్ఞానము లేనప్పుడు సంతోషమును కలిగించే ఏ విషయము కూడా విఘ్న రూపంగా అవుతుంది?

జవాబు:-

సాక్షాత్కారాలు జరగడం, వాస్తవానికి ఇది సంతోషకరమైన విషయమే కానీ ఒకవేళ జ్ఞానము యథార్థ రూపంలో లేకపోతే ఇంకా తికమకపడిపోతారు. ఒకవేళ ఎవరికైనా తండ్రి సాక్షాత్కారము జరిగిందనుకోండి, బిందువును చూసారనుకోండి, ఏమి అర్థం చేసుకుంటారు, ఇంకా తికమకపడిపోతారు, అందుకే జ్ఞానము లేకుండా సాక్షాత్కారాలు జరగడం వలన ఏ లాభము ఉండదు. ఇందులో మాయ విఘ్నాలు ఇంకా కలుగుతాయి. చాలామందికి సాక్షాత్కారాల యొక్క తప్పుడు నషా కూడా ఎక్కుతుంది.

గీతము:-

భాగ్యాన్ని మేలుకొలుపుకుని వచ్చాను..... (తక్ దీర్ జగాకర్ ఆయీ హూ.....)

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. కొత్తవారు కూడా విన్నారు, పాతవారు కూడా విన్నారు. ఇది ఒక పాఠశాల అని కుమారులు కూడా విన్నారు. పాఠశాలలో ఏదో ఒక భాగ్యం తయారుచేసుకోవడం జరుగుతుంది. అక్కడైతే అనేక రకాల భాగ్యాలున్నాయి. కొంతమంది సర్జన్లుగా, మరికొంతమంది బ్యారిస్టర్లుగా తయారయ్యే భాగ్యాన్ని తయారుచేసుకుంటారు. భాగ్యాన్ని లక్ష్యము-ఉద్దేశ్యము అని అంటారు. భాగ్యాన్ని తయారుచేసుకోకుండా పాఠశాలలో ఇంకేమి చదువుకుంటారు. ఇప్పుడు మనము కూడా భాగ్యాన్ని తయారుచేసుకుని ఇక్కడకు వచ్చామని పిల్లలకు తెలుసు. కొత్త ప్రపంచం కోసం తమ రాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఈ రాజయోగము కొత్త ప్రపంచము కోసమే ఉన్నది. ఆ చదువు పాత ప్రపంచము కోసం ఉన్నది. వారు పాత ప్రపంచములో బ్యారిస్టరుగా, ఇంజనీరుగా, సర్జన్ మొదలైనవారిలా అవుతారు. ఆ విధంగా తయారవుతూ-తయారవుతూ ఇప్పుడు పాత ప్రపంచానికి చాలా కొద్ది సమయమే మిగిలి ఉంది. వారంతా సమాప్తమైపోతారు. ఆ భాగ్యము ఈ మృత్యులోకము కోసము ఉన్నది అంటే ఈ జన్మ కోసము ఉన్నది. మీ ఈ చదువు కొత్త ప్రపంచము కోసం ఉన్నది. మీరు కొత్త ప్రపంచము కోసం భాగ్యాన్ని తయారుచేసుకుని వచ్చారు. కొత్త ప్రపంచంలో మీకు రాజ్య భాగ్యము లభిస్తుంది. ఎవరు చదివిస్తున్నారు? అనంతమైన తండ్రి, వారి నుండే వారసత్వమును పొందాలి. డాక్టరు ద్వారా డాక్టరు యొక్క వారసత్వమును పొందుతారు, అది ఈ జన్మ యొక్క వారసత్వం అవుతుంది. ఒకటి, తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది, మరొక వారసత్వము తమ చదువు ద్వారా లభిస్తుంది. అచ్ఛా, మళ్ళీ వృద్ధులుగా అయినప్పుడు గురువుల వద్దకు వెళ్తారు. ఏమి కోరుకుంటారు? మాకు శాంతిధామానికి వెళ్ళే శిక్షణనివ్వండి, మాకు సద్గతినివ్వండి, ఇక్కడ నుండి బయటకు తీసి శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని అంటారు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది, ఈ జన్మ కోసం టీచరు నుండి కూడా వారసత్వము లభిస్తుంది, కానీ గురువు నుండి ఏమీ లభించదు. టీచరు వద్ద చదువుకొని ఏదో ఒక వారసత్వాన్ని పొందుతారు. టీచరుగా అవుతారు, కుట్టు టీచరుగా అవుతారు, ఎందుకంటే జీవనోపాధి అయితే కావాలి కదా. తండ్రి వారసత్వము ఉన్నా కూడా చదువుకుంటారు ఎందుకంటే మేము కూడా మా సంపాదన చేసుకోవాలని అనుకుంటారు. గురువు ద్వారా ఏ సంపాదన జరగదు. అయితే, కొంతమంది గీత మొదలైనవి మంచి రీతిగా చదువుకొని తర్వాత గీతపై భాషణ మొదలైనవి చేస్తారు. ఇవన్నీ అల్పకాలిక సుఖము కోసం ఉన్నాయి. ఇప్పుడు ఈ మృత్యులోకములో కొద్ది సమయమే ఉంది. పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. మనము కొత్త ప్రపంచం యొక్క భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. తండ్రి ఆస్తి మరియు మీ ఆస్తి కూడా భస్మమైపోతుంది. అప్పుడు ఇక చేతులు ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు కొత్త ప్రపంచం కోసం సంపాదన కావాలి. పాత ప్రపంచములోని మనుష్యులు ఈ సంపాదనను చేయించలేరు. కొత్త ప్రపంచము కోసం సంపాదన చేయించేవారు శివబాబా. మీరు కొత్త ప్రపంచము కోసం భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు ఇక్కడకు వచ్చారు. ఆ తండ్రి మీకు తండ్రి కూడా, టీచరు కూడా, గురువు కూడా. వారు సంగమయుగములోనే వస్తారు. భవిష్యత్తు కోసం సంపాదించడం నేర్పిస్తారు. ఈ పాత ప్రపంచములో ఇప్పుడిక కొద్ది రోజులే ఉన్నాయి. ఇది ఈ ప్రపంచములోని మనుష్యులకు తెలియదు. కొత్త ప్రపంచము మళ్ళీ ఎప్పుడు వస్తుంది, వీరు ప్రగల్భాలు పలుకుతున్నారని అంటారు. ఈ విధంగా భావించేవారు కూడా చాలామంది ఉన్నారు. ఒకే ఇంటిలో, కొత్త ప్రపంచం స్థాపనవుతుందని తండ్రి అంటారు, ఇవి ప్రగల్భాలని కొడుకు అంటాడు. కొత్త ప్రపంచము కోసం వీరు మనకు తండ్రి, టీచరు, సద్గురువు అని పిల్లలైన మీకు తెలుసు. శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళేందుకే తండ్రి వస్తారు. ఎవరైనా భాగ్యాన్ని తయారుచేసుకోవడం లేదంటే వారు ఏమీ అర్థము చేసుకోనట్లే. ఒకే ఇంటిలో, పత్ని చదువుకుంటారు, పతి చదవరు, పిల్లలు చదువుకుంటారు, తల్లి-తండ్రులు చదవరు. ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రారంభంలో కుటుంబాలకు కుటుంబాలే వచ్చేసాయి కానీ మాయ తుఫానులు రావడంతో ఆశ్చర్యవంతులై విన్నారు, వర్ణించారు, తండ్రిని వదిలి వెళ్ళిపోయారు. ఆశ్చర్యవంతులై వింటారు, తండ్రికి చెందినవారిగా అవుతారు, చదువును చదువుకుంటారు, అయినా..... డ్రామా విధి అని కూడా అంటారు. స్వయంగా తండ్రి, ఓహో డ్రామా, ఓహో మాయ అని అంటారు, ఇది డ్రామా యొక్క విషయమే కదా. స్త్రీ-పురుషులు ఒకరికొకరు విడాకులిచ్చుకుంటారు. పిల్లలు తండ్రికి విడాకులిచ్చేస్తారు, ఇక్కడైతే అలా ఉండదు. ఇక్కడైతే విడాకులివ్వలేరు. పిల్లల చేత సత్యమైన సంపాదన చేయించడానికే తండ్రి వచ్చారు. తండ్రి ఎవ్వరినీ గోతిలోకి తోయరు. తండ్రి అయితే పతితపావనుడు, దయాహృదయుడు. తండ్రి వచ్చి దుఃఖము నుండి విముక్తులుగా చేస్తారు మరియు వారు మార్గదర్శకునిగా అయ్యి తమతో పాటు తీసుకువెళ్ళేవారు. నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తానని ఈ విధంగా ఏ లౌకిక గురువు చెప్పరు. ఇటువంటి గురువును ఎప్పుడైనా చూసారా, ఎప్పుడైనా విన్నారా? మీరు గురువులను అడగండి - మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మీరు శరీరాన్ని విడిచిపెడితే ఈ ఫాలోవర్స్ ను కూడా మీతో పాటు తీసుకువెళ్తారా? నేను నా ఫాలోవర్స్ ను నాతో పాటు తీసుకువెళ్తానని ఈ విధంగా ఎవ్వరూ ఎప్పుడూ చెప్పరు. ఇదైతే జరగదు. నేను మిమ్మల్నందరినీ నిర్వాణధామానికి లేక ముక్తిధామానికి తీసుకువెళ్తానని ఎవ్వరూ ఎప్పుడూ చెప్పలేరు. మమ్మల్ని మీతోపాటు తీసుకువెళ్తారా అని ఇటువంటి ప్రశ్నను ఎవ్వరూ అడగలేరు కూడా. నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అని శాస్త్రాలలో భగవానువాచ ఉన్నది. దోమల గుంపు వలె అందరూ వెళ్తారు. సత్యయుగంలో కొద్దిమంది మనుష్యులే ఉంటారు. కలియుగంలోనైతే ఎంతోమంది మనుష్యులు ఉంటారు. మిగిలిన ఆత్మలు శరీరాలను వదిలి లెక్కాచారాన్ని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాయి. తప్పకుండా పారిపోవలసిందే, ఇంతమంది మనుష్యులు ఉండలేరు. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీకు మంచి రీతిగా తెలుసు. ఈ శరీరాన్ని అయితే విడిచిపెట్టాలి. మీరు మరణిస్తే మీ కోసం ప్రపంచం మరణించినట్లే. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టాలి. ఈ ప్రపంచం కూడా పాతది. ఎలాగైతే కొత్త ఇల్లు ఎదురుగా తయారవుతున్నప్పుడు, పాత ఇంట్లో కూర్చుని ఉన్నా, ఈ ఇల్లు మా కోసం తయారవుతుందని భావిస్తారు. బుద్ధి కొత్త ఇంటి వైపుకు వెళ్ళిపోతుంది. ఇందులో ఇది తయారుచేయాలి, ఇది చేయాలి అని అనుకుంటారు. పాతదాని నుండి మమకారం అంతా తొలగిపోయి కొత్తదాని వైపు జోడించబడుతుంది. అది హద్దు యొక్క విషయము. ఇది అనంతమైన ప్రపంచము యొక్క విషయము. పాత ప్రపంచం పట్ల మమకారాన్ని తొలగించాలి మరియు కొత్త ప్రపంచంతో జోడించాలి. ఈ పాత ప్రపంచమైతే సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. కొత్త ప్రపంచమంటే స్వర్గము. అందులో మనము రాజ్య పదవిని పొందుతాము. ఎంతగా యోగములో ఉంటామో, జ్ఞాన ధారణను చేస్తామో, ఇతరులకు అర్థం చేయిస్తామో, అంతగా సంతోషము యొక్క పాదరసం ఎక్కుతుంది. ఇది చాలా పెద్ద పరీక్ష. మనము 21 జన్మల కోసం స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నాము. షావుకారులుగా అవ్వడం మంచిదే కదా. ఆయుష్షు ఎక్కువగా లభించడమైతే మంచిదే కదా. ఎంతగా సృష్టి చక్రాన్ని స్మృతి చేస్తారో, ఎంతమందిని తమ సమానంగా తయారుచేస్తారో, అంత లాభముంటుంది. రాజులుగా అవ్వాలంటే ప్రజలను కూడా తయారుచేసుకోవాలి. ప్రదర్శినీలకు ఎంతోమంది వస్తారు. వారంతా ప్రజలుగా అవుతూ ఉంటారు ఎందుకంటే ఈ అవినాశీ జ్ఞానము యొక్క వినాశనం జరగదు. పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలని బుద్ధిలోకి వచ్చేస్తుంది. పురుషార్థము ఎక్కువగా చేస్తే ప్రజలలో ఉన్నత పదవిని పొందుతారు లేకపోతే తక్కువ పదవిగల ప్రజలుగా అవుతారు. నంబరువారుగా అయితే ఉంటారు కదా. రామరాజ్య స్థాపన జరుగుతుంది. రావణ రాజ్యము వినాశనమైపోతుంది. సత్యయుగంలో దేవతలే ఉంటారు.

స్మృతియాత్ర ద్వారా మీరు సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారని తండ్రి అర్థం చేయించారు. రాజులు, ప్రజలు, అందరూ యజమానులుగానే ఉంటారు. మా భారతదేశము అన్నింటికన్నా ఉన్నతమైనదని ప్రజలు కూడా అంటారు. భారతదేశము తప్పకుండా చాలా ఉన్నతంగా ఉండేది. ఇప్పుడలా లేదు, ఒకప్పుడుండేది. ఇప్పుడైతే పూర్తిగా నిరుపేదగా అయిపోయింది. ప్రాచీన భారతదేశము అన్నింటికన్నా షావుకారుగా ఉండేది. తప్పకుండా భారతవాసులైన మనము అన్నింటికన్నా ఉన్నతమైన దేవీదేవతా కులానికి చెందినవారమని మీకు తెలుసు. ఇతరులెవ్వరినీ దేవతలని అనరు. ఇప్పుడు పిల్లలైన మీరు చదువుకుంటున్నారు, తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. మనుష్యులకైతే అర్థం చేయించాలి కదా. మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి, వీరు ఈ పదవిని ఎలా పొందారు అనేది మీరు ఋజువు చేసి చెప్పగలరు. తిథి-తారీఖుల సహితంగా మీరు ఋజువు చేయగలరు. ఇప్పుడు శివబాబా నుండి మళ్ళీ ఈ పదవిని పొందుతున్నారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. శివ అనగా పరమపిత పరమాత్మ. బ్రహ్మా ద్వారా మీకు యోగబలముతో 21 జన్మల వారసత్వము లభిస్తుందని తండ్రి అంటారు. మీరు సూర్యవంశీ దేవీదేవతలుగా, విష్ణుపురికి యజమానులుగా అవ్వగలరు. శివబాబా, దాదా అయిన బ్రహ్మా ద్వారా ఈ వారసత్వమునిస్తున్నారు. మొదట వీరి ఆత్మ వింటుంది. ఆత్మనే ధారణ చేస్తుంది. ఇదే ముఖ్యమైన విషయము. శివుని చిత్రాన్ని చూపిస్తారు. ఈ చిత్రము పరమపిత పరమాత్మ శివునిది. బ్రహ్మా-విష్ణు-శంకరులు సూక్ష్మవతనములోని దేవతలు. ప్రజాపిత బ్రహ్మా అయితే తప్పకుండా ఇక్కడ ఉండాలి. ప్రజాపిత బ్రహ్మా పిల్లలైన బ్రహ్మాకుమార-కుమారీలు ఎంతోమంది ఉన్నారు. బ్రహ్మాకు పిల్లలుగా అవ్వనంత వరకు బ్రాహ్మణులుగా అవ్వరు, అటువంటప్పుడు శివబాబా నుండి వారసత్వమును ఎలా తీసుకుంటారు. గర్భము నుండి జన్మ తీసుకునేవారైతే కాదు. ముఖవంశావళి అన్న గాయనం ఉంది. మేము ప్రజాపిత బ్రహ్మా ముఖ వంశావళి అని మీరంటారు. వారు గురువులకు ఫాలోవర్స్ గా ఉంటారు. ఇక్కడ మీరు ఒక్కరినే తండ్రి-టీచరు-సద్గురువు అని అంటారు. అది కూడా వీరిని అలా అనరు. నిరాకార శివబాబా కూడా ఉన్నారు. వారు జ్ఞానసాగరుడు. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానమునిస్తారు. టీచరు కూడా ఆ నిరాకారుడే, వారు సాకారుని ద్వారా జ్ఞానమును వినిపిస్తారు. ఆత్మయే మాట్లాడుతుంది. నా శరీరాన్ని విసిగించకండి అని ఆత్మ అంటుంది. ఆత్మ దుఃఖమయం అయినప్పుడు వివరణ ఇవ్వడం జరుగుతుంది. వినాశనము ఎదురుగా నిలిచి ఉన్నప్పుడు, పారలౌకిక తండ్రి అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు అంతిమంలో వస్తారు. ఇక మిగిలినదంతా వినాశనమవ్వనున్నది. దీనిని మృత్యులోకమని అంటారు. ఇక్కడ పృథ్విపైనే స్వర్గము ఉంటుంది. దిల్వాడా మందిరము నిర్మించబడింది. అందులో కింద తపస్సు చేస్తున్నారు, పైన స్వర్గాన్ని చూపించారు. లేకపోతే స్వర్గాన్ని ఎక్కడ చూపించాలి. పై భాగములో దేవతల చిత్రాలను చూపించారు. వారు కూడా ఇక్కడే ఉంటారు కదా. అర్థము చేయించడానికి చాలా యుక్తి కావాలి. మందిరాలకు వెళ్ళి ఇది శివబాబా స్మృతిచిహ్నమని, శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారని అర్థము చేయించాలి. వాస్తవానికి శివుడు ఒక బిందువు, కానీ బిందువును ఎలా పూజిస్తారు, ఫలాలు, పుష్పాలను ఎలా అర్పిస్తారు, అందుకే పెద్ద రూపాన్ని తయారుచేశారు. ఇంత పెద్దగా ఎవ్వరూ ఉండరు. ఆత్మ భృకుటి మధ్యలో ప్రకాశించే అద్భుతమైన నక్షత్రము అని గాయనము జరుగుతుంది కూడా. ఆత్మ అతి సూక్ష్మమైన బిందువు, అది పెద్దగా ఉండి ఉంటే సైన్సువారు దాన్ని వెంటనే పట్టుకునేవారు. అలాగని వేలాది సూర్యుల కన్నా తేజోమయమని కాదు, అలా ఏమీ ఉండదు. కొంతమంది భక్తులు కూడా వస్తారు కదా, మాకు కేవలం ఈ ముఖమే కనిపిస్తుందని అంటారు. వారికి పరమపిత పరమాత్మ పరిచయము పూర్తిగా లభించలేదని, వారి భాగ్యము ఇంకా తెరుచుకోలేదని బాబా భావిస్తారు. తండ్రిని తెలుసుకోనంత వరకు, నా ఆత్మ బిందువు సమానమైనదని, శివబాబా కూడా బిందువని, వారిని స్మృతి చేయాలని వారు అర్థం చేసుకోరు. అలా భావించి స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. అంతేకానీ నాకు వారు కనిపిస్తున్నారు, వారు అలా కనిపిస్తున్నారు, ఇలా కనిపిస్తున్నారు..... ఇలా అంటే వీటిని మాయ విఘ్నాలని అంటారు. మాకు తండ్రి లభించారని ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. కృష్ణుని సాక్షాత్కారమును పొంది చాలా సంతోషంగా డాన్స్ మొదలైనవి చేస్తారు కానీ దాని వలన సద్గతి ఏమీ లభించదని తండ్రి అంటారు. ఈ సాక్షాత్కారాలు అయితే అనాయాసంగానే జరుగుతాయి. ఒకవేళ మంచి రీతిగా చదువుకోకపోతే ప్రజలలోకి వెళ్ళిపోతారు. సాక్షాత్కారాల వలన లాభము కలగాలి కదా. భక్తి మార్గంలో చాలా శ్రమించినప్పుడు సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇక్కడ కొంచెం శ్రమ చేసినా సాక్షాత్కారాలు జరుగుతాయి కానీ లాభమేమీ ఉండదు. కృష్ణపురిలోకి వెళ్ళి సాధారణ ప్రజలు మొదలైనవారిగా అవుతారు. ఇప్పుడు శివబాబా మనకు ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. తప్పకుండా పవిత్రంగా అవ్వాలన్నది తండ్రి ఆజ్ఞ. కానీ కొంతమంది పవిత్రంగా కూడా ఉండలేరు, అప్పుడప్పుడు ఇక్కడకు పతితులు కూడా దాక్కుని వచ్చేస్తారు. వారు తమను తామే నష్టపర్చుకుంటారు, స్వయాన్ని మోసం చేసుకుంటారు. తండ్రిని మోసగించే మాటే లేదు. తండ్రిని మోసం చేసి ఏమైనా ధనం తీసుకోవాలా? శివబాబా శ్రీమతంపై నియమానుసారంగా నడుచుకోకపోతే, వారి పరిస్థితి ఏమవుతుంది. భాగ్యంలో లేదని అర్థం చేసుకోవడం జరుగుతుంది. చదువుకోకపోతే ఇతరులకు ఇంకా దుఃఖమునిస్తూ ఉంటారు. అప్పుడు, ఒకటేమో చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది మరియు రెండవది, పదవి కూడా భ్రష్టమైపోతుంది. నియమానికి విరుద్ధంగా ఏ పనీ చేయకూడదు. మీ నడవడిక బాగోలేదని తండ్రి అయితే అర్థం చేయిస్తారు కదా. తండ్రి సంపాదించుకునే మార్గమును తెలియజేస్తారు, ఇక చేసుకోడం, చేసుకోకపోవడం అనేది వారి భాగ్యము. శిక్షలు అనుభవించి తిరిగి శాంతిధామానికి వెళ్ళాల్సిందే, అప్పుడు పదభ్రష్టులైపోతారు, ఏమీ లభించదు. ఇక్కడకు రావడం చాలామంది వస్తారు కానీ ఇక్కడ తండ్రి నుండి వారసత్వమును తీసుకునే విషయము. పిల్లలు అంటారు - బాబా, మేము అయితే స్వర్గం యొక్క సూర్యవంశీ రాజ్యపదవిని పొందుతాము. ఇది రాజయోగము కదా. విద్యార్థులు స్కాలర్షిప్ ను కూడా తీసుకుంటారు కదా. పాస్ అయ్యే వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఎవరైతే స్కాలర్షిప్ తీసుకున్నారో, వారి మాలే తయారుచేయబడింది. పాస్ అయిన దాని బట్టి స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ మాల తయారుచేయబడింది. స్కాలర్షిప్ తీసుకునేవారి వృద్ధి జరుగుతూ-జరుగుతూ వేలాది మంది తయారవుతారు. రాజ్య పదవియే స్కాలర్షిప్. ఎవరైతే మంచిరీతిగా చదువును చదువుకుంటారో, వారు గుప్తంగా ఉండలేరు. చాలామంది కొత్తవారు కూడా పాతవారి కన్నా ముందుకు వెళ్ళిపోతారు. చూడండి, చాలామంది కుమార్తెలు వస్తారు, వారంటారు - మాకు ఈ చదువు చాలా బాగా అనిపిస్తుంది, దైహిక చదువు యొక్క కోర్సును పూర్తి చేసుకొని ఈ చదువులో నిమగ్నమైపోతామని మేము ప్రమాణము చేస్తాము, మా జీవితాన్ని వజ్రం వలె తయారుచేసుకుంటాము, మేము మా సత్యమైన సంపాదన చేసుకొని 21 జన్మలకు వారసత్వాన్ని పొందుతాము. ఎంత సంతోషం కలుగుతుంది. ఈ వారసత్వాన్ని ఇప్పుడు తీసుకోకపోతే ఇంకెప్పటికీ తీసుకోలేమని వారికి తెలుసు. చదువు పట్ల అభిరుచి ఉంటుంది కదా. కొంతమందికి అర్థము చేసుకునే అభిరుచి ఏ మాత్రం ఉండదు. కొత్త వారికున్నంత అభిరుచి పాతవారికి కూడా ఉండదు. ఇది ఆశ్చర్యము కదా. డ్రామానుసారముగా భాగ్యములో లేకపోతే భగవంతుడు కూడా ఏమి చేస్తారని అంటారు. టీచరు అయితే చదివిస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ లోపాలను దాచిపెట్టడం కూడా స్వయాన్ని మోసగించుకోవడము కనుక స్వయాన్ని ఎప్పుడూ మోసగించుకోకూడదు.

2. తమ ఉన్నతమైన భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు నియమవిరుద్ధమైన పనులేవీ చేయకూడదు. చదువు పట్ల అభిరుచినుంచుకోవాలి. తమ సమానంగా తయారుచేసే సేవ చేయాలి.

వరదానము:-

ప్రతి అడుగు ఆజ్ఞపై నడుస్తూ మాయను బలిహారం చేయించే సహజయోగీ భవ

ఏ పిల్లలైతే ప్రతి అడుగు ఆజ్ఞపై నడుస్తారో, వారి ఎదురుగా మొత్తం విశ్వం బలిహారమవుతుంది, దానితో పాటు మాయ కూడా తన వంశ సహితంగా బలిహారమైపోతుంది. మొదట మీరు తండ్రిపై బలిహారం అయినట్లయితే మాయ మీపై బలిహారం అవుతుంది మరియు మీరు మీ శ్రేష్ఠ స్వమానంలో ఉంటూ ప్రతి ఆజ్ఞపై నడుస్తూ ఉన్నట్లయితే జన్మ జన్మల కష్టము నుండి విడుదలవుతారు. ఇప్పుడు సహజయోగులుగా ఉంటారు మరియు భవిష్యత్తులో సహజమైన జీవితముంటుంది. ఇటువంటి సహజమైన జీవితాన్ని తయారుచేసుకోండి.

స్లోగన్:-

స్వయం యొక్క పరివర్తన ద్వారా ఇతర ఆత్మలను పరివర్తన చేయడమే ప్రాణదానమునివ్వడము.