13-01-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీ నోటి నుండి సదా జ్ఞాన రత్నాలే వెలువడాలి, మీ ముఖము సదా హర్షితంగా ఉండాలి”

ప్రశ్న:-

ఏ పిల్లలైతే బ్రాహ్మణ జీవితంలో జ్ఞానమును ధారణ చేసారో వారి గుర్తులేమిటి?

జవాబు:-

1. వారి నడవడిక దేవతల వలె ఉంటుంది, వారిలో దైవీ గుణాల ధారణ జరుగుతుంది. 2. వారికి జ్ఞానాన్ని విచార సాగర మథనము చేసే అభ్యాసముంటుంది. వారు ఎప్పుడూ ఆసురీ విషయాలను అనగా చెత్త విషయాలను మథనము చేయరు. 3. వారి జీవితము నుండి తిట్టడం మరియు నిందించడం సమాప్తమైపోతుంది. 4. వారి ముఖము సదా హర్షితంగా ఉంటుంది.

ఓంశాంతి. బాబా కూర్చొని జ్ఞానము మరియు భక్తి గురించి అర్థం చేయిస్తారు. భక్తి ద్వారా సద్గతి జరగదు మరియు సత్యయుగంలో భక్తి ఉండదని పిల్లలు అర్థం చేసుకున్నారు. జ్ఞానము కూడా సత్యయుగంలో లభించదు. కృష్ణుడు భక్తి చేయరు, జ్ఞాన మురళీని మ్రోగించరు. మురళీ అంటేనే జ్ఞానాన్ని ఇవ్వడము. మురళీలో జాదూ (ఇంద్రజాలము) ఉందని గాయనం కూడా ఉంది కదా. కనుక తప్పకుండా ఏదో ఇంద్రజాలము ఉంటుంది కదా! కేవలం మురళీని మ్రోగించడమైతే సాధారణ ఫకీరులు కూడా మ్రోగిస్తూ ఉంటారు. ఈ మురళీలో జ్ఞానం యొక్క ఇంద్రజాలము ఉంది. అజ్ఞానాన్ని ఇంద్రజాలమని అనరు. మురళీని ఇంద్రజాలమని అంటారు. జ్ఞానము ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. సత్యయుగం ఉన్నప్పుడు ఈ జ్ఞానము యొక్క వారసత్వం ఉంటుంది. అక్కడ భక్తి ఉండదు. ద్వాపర యుగంలో దేవతల నుండి మనుష్యులుగా అయినప్పుడు భక్తి ఉంటుంది. మనుష్యులను వికారులని, దేవతలను నిర్వికారులని అంటారు. దేవతల సృష్టిని పవిత్ర ప్రపంచమని అంటారు. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతున్నారు. జ్ఞానమని దేనినంటారు? ఒకటి స్వయం యొక్క పరిచయమును మరియు బాబా పరిచయమును, ఇంకా సృష్టి ఆదిమధ్యాంతాల నాలెడ్జ్ ను జ్ఞానమని అంటారు. జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది. తర్వాత భక్తి ప్రారంభమైనప్పుడు దిగేకళ అని అంటారు ఎందుకంటే భక్తిని రాత్రి అని, జ్ఞానాన్ని పగలు అని అంటారు. ఇది ఎవరి బుద్ధిలోనైనా కూర్చోగలదు కానీ దైవీ గుణాలను ధారణ చేయరు. దైవీ గుణాలున్నట్లయితే జ్ఞాన ధారణ ఉందని అర్థమవుతుంది. జ్ఞాన ధారణ ఉన్నవారి నడవడిక దేవతల వలె ఉంటుంది. తక్కువ ధారణ ఉన్నవారి నడవడిక మిక్స్ గా ఉంటుంది. ధారణ లేనట్లయితే వారు పిల్లలే కారు. మనుష్యులు తండ్రిని ఎంతగా నిందిస్తారు. బ్రాహ్మణ కులములోకి వచ్చినప్పుడు తిట్టడం, నిందించడం సమాప్తమైపోతుంది. మీకు జ్ఞానము లభిస్తుంది, దానిపై మీరు విచార సాగర మథనము చేస్తే అమృతము లభిస్తుంది. విచార సాగర మథనమే చేయకపోతే ఇంకే మథనము జరుగుతుంది? ఆసురీ ఆలోచనల మథనము జరుగుతుంది, దాని నుండి చెత్తే వెలువడుతుంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ విద్యార్థులు. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువును చదువుతున్నామని మీకు తెలుసు. దేవతలు ఈ చదువును చదివించరు. దేవతలను ఎప్పుడూ జ్ఞాన సాగరులని అనరు. జ్ఞాన సాగరుడని ఒక్కరినే అంటారు. దైవీ గుణాలు కూడా జ్ఞానము ద్వారానే ధారణ అవుతాయి. పిల్లలైన మీకిప్పుడు ఈ జ్ఞానము ఏదైతే లభిస్తుందో, ఇది సత్యయుగంలో ఉండదు. ఈ దేవతలలో దైవీ గుణాలున్నాయి. సర్వగుణ సంపన్నులు..... అని మీరు మహిమ కూడా చేస్తారు. కనుక మీరిప్పుడు ఈ విధంగా తయారవ్వాలి. మాలో దైవీ గుణాలన్నీ ఉన్నాయా లేక ఏవైనా ఆసురీ గుణాలున్నాయా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ ఆసురీ అవగుణాలున్నట్లయితే వాటిని తొలగించుకోవాలి, అప్పుడే దేవతలని అంటారు. లేకపోతే తక్కువ పదవిని పొందుతారు.

ఇప్పుడు పిల్లలైన మీరు దైవీ గుణాలను ధారణ చేస్తారు. చాలా మంచి-మంచి విషయాలను వినిపిస్తారు. దీనినే పురుషోత్తమ సంగమయుగమని అంటారు. ఈ సమయంలో మీరు పురుషోత్తములుగా అవుతున్నారు కనుక వాతావరణం కూడా చాలా బాగుండాలి. నోటి నుండి ఎటువంటి ఛీ-ఛీ మాటలు వెలువడకూడదు, లేకపోతే వీరు తక్కువ పదవి వారని అంటారు. మాట, నడవడిక మరియు వాతావరణం ద్వారా వెంటనే తెలిసిపోతుంది. మీ ముఖము సదా హర్షితంగా ఉండాలి లేకపోతే వీరిలో జ్ఞానము లేదని అంటారు. నోటి ద్వారా సదా రత్నాలే వెలువడాలి. ఈ లక్ష్మీ నారాయణులు ఎంత హర్షితముఖులుగా ఉన్నారో చూడండి. వీరి ఆత్మలు జ్ఞాన రత్నాలను ధారణ చేశారు. నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలే వెలువడుతాయి. రత్నాలనే వింటూ-వినిపిస్తూ ఉంటే ఎంతటి సంతోషం ఉంటుంది. ఏ జ్ఞాన రత్నాలనైతే మీరిప్పుడు తీసుకొంటున్నారో, అవన్నీ తర్వాత వజ్ర వైఢూర్యాలుగా అయిపోతాయి. నవరత్నాల మాల వజ్రవైఢూర్యాలదేమీ కాదు, ఇది జ్ఞానరత్నాల మాల. మనుష్యులేమో వాటిని రత్నాలుగా భావిస్తూ ఉంగరాలు మొదలైనవి ధరిస్తారు. ఈ జ్ఞానరత్నాల మాల పురుషోత్తమ సంగమయుగంలోనే ధరింపబడుతుంది. ఈ రత్నాలే మిమ్మల్ని భవిష్య 21 జన్మల కోసం సంపన్నంగా తయారు చేస్తాయి. వీటిని ఎవ్వరూ దోచుకోలేరు. ఇక్కడ మీరు ఈ వజ్రవైఢూర్యాలను ధరించినట్లయితే వెంటనే ఎవరైనా దోచుకుంటారు. కనుక స్వయాన్ని చాలా చాలా వివేకవంతులుగా చేసుకోవాలి. ఆసురీ అవగుణాలను తొలగించుకోవాలి. ఆసురీ అవగుణాలతో ముఖము కూడా అదే విధంగా అయిపోతుంది. క్రోధంలో ముఖము ఎర్రగా, రాగి వలె అయిపోతుంది. కామ వికారము వారైతే నల్లగా అయిపోతారు. కనుక పిల్లలు ప్రతి విషయంలోనూ విచార సాగర మథనము చేయాలి. ఈ చదువు చాలా ధనాన్ని పొందేందుకు ఉన్నది. ఆ చదువు రత్నాలేమీ కాదు. అయితే, నాలెడ్జ్ చదివి పెద్ద పొజిషన్ ను పొందుతారు. కనుక చదువు ఉపయోగపడింది, ధనము కాదు. చదువే ధనము. అది హద్దు యొక్క ధనము, ఇది అనంతమైన ధనము. రెండూ చదువులే. తండ్రి మనల్ని చదివించి విశ్వానికి యజమానులుగా చేస్తారని మీకిప్పుడు తెలుసు. అది ఒక్క జన్మ కోసం అల్పకాలిక క్షణ భంగురమైన చదువు. మళ్ళీ రెండవ జన్మలో కొత్తగా చదవవలసి ఉంటుంది. అక్కడ ధనము కొరకు చదువు అవసరముండదు. అక్కడ ఇప్పటి పురుషార్థముతో అపారమైన ధనము లభిస్తుంది. ధనము అవినాశీగా అవుతుంది. దేవతల వద్ద చాలా ధనము ఉండేది, తర్వాత భక్తి మార్గము అనగా రావణరాజ్యములోకి వచ్చినప్పుడు ఎంత ధనముండేది, ఎన్ని మందిరాలు నిర్మించబడ్డాయి. తర్వాత ముసల్మానులు మొదలైనవారు వచ్చి ధనాన్ని దోచుకున్నారు. ఎంత ధనవంతులుగా ఉండేవారు! ఇప్పటి చదువుతో ఎవ్వరూ అంత ధనవంతులుగా అవ్వలేరు. మనము ఇంత ఉన్నతమైన చదువును చదువుతున్నామని, దీనితో వీరి (దేవీ-దేవతల) వలె తయారవుతామని మీకిప్పుడు తెలుసు. కనుక చదువు ద్వారా మనుష్యులు ఎలా తయారవుతారో చూడండి! పేదవారి నుండి షావుకార్లుగా అవుతారు. ఇప్పుడు భారతదేశము కూడా ఎంత నిరుపేదగా ఉంది. షావుకార్లకైతే తీరికే ఉండదు. నేను ఫలానా అని తమ అహంకారముంటుంది. ఇందులో అహంకారము మొదలైనవి సమాప్తమైపోవాలి. నేను ఒక ఆత్మను, ఆత్మ వద్ద ధనము-సంపద, వజ్రవైఢూర్యాలు మొదలైనవేవీ ఉండవు. దేహ సహితంగా సంబంధాలన్నింటినీ విడిచిపెట్టండని తండ్రి కూడా అంటారు. ఆత్మ శరీరము విడిచిపెట్టినట్లయితే షావుకారుతనము మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి. మళ్ళీ కొత్తగా చదువుకొని ధనాన్ని సంపాదించాలి లేదా దాన-పుణ్యాలు బాగా చేసి ఉంటే షావుకారుల ఇంటిలో జన్మ తీసుకుంటారు. వెనుకటి కర్మల ఫలము అని అంటారు కదా. జ్ఞానాన్ని దానము చేసి ఉన్నట్లయితే లేదా కాలేజ్-ధర్మశాలలు మొదలైనవి నిర్మించి ఉన్నట్లయితే దాని ఫలము లభిస్తుంది కానీ అల్పకాలికముగా లభిస్తుంది. ఈ దాన-పుణ్యాలు కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది. సత్యయుగములో చేయరు. సత్యయుగంలో మంచి కర్మలే ఉంటాయి ఎందుకంటే ఇప్పటి వారసత్వమే లభించి ఉంటుంది. అక్కడ ఎవరి ద్వారా కూడా వికర్మలు జరగవు ఎందుకంటే రావణుడే ఉండడు. పేదవారి వలన కూడా వికర్మలు జరగవు. ఇక్కడైతే షావుకార్ల వలన కూడా వికర్మలవుతాయి. అందుకే ఈ అనారోగ్యాలు మొదలైన దుఃఖాలుంటాయి. అక్కడ వికారాలలోకే వెళ్ళరు కనుక వికర్మలు ఎలా తయారవుతాయి? ఆధారమంతా కర్మలపైనే ఉంది. ఇది మాయా రావణ రాజ్యము, ఇక్కడ మనుష్యులు వికారులుగా అయిపోతారు. తండ్రి వచ్చి నిర్వికారులుగా తయారుచేసేందుకు చదివిస్తారు. తండ్రి నిర్వికారులుగా చేస్తారు, మాయ మళ్ళీ వికారులుగా చేస్తుంది. రామ వంశీయులు మరియు రావణ వంశీయులకు యుద్ధము జరుగుతుంది. మీరు తండ్రి పిల్లలు, వారు రావణుని పిల్లలు. ఎంతోమంది మంచి-మంచి పిల్లలు మాయతో ఓడిపోతారు. మాయ చాలా శక్తివంతమైనది. అయినా ఆశనుంచుతారు. అధమాతి అధముల (పూర్తిగా పతితులు) ఉద్ధరణ కూడా చేయవలసి ఉంటుంది కదా. తండ్రి అయితే మొత్తం విశ్వాన్ని ఉద్ధరించవలసి ఉంటుంది. చాలామంది పడిపోతారు. ఒక్కసారిగా నష్ట ఖాతాలో అధమాతి అధములుగా అయిపోతారు. అటువంటివారిని కూడా తండ్రి ఉద్ధరిస్తారు. రావణ రాజ్యంలో అందరూ అధములుగానే ఉన్నారు కానీ తండ్రి రక్షిస్తారు. అయినా పడిపోతూనే ఉంటారు, దానితో చాలా అధములుగా అయిపోతారు. వారు మళ్ళీ అంతగా పైకి ఎక్కడం జరగదు. ఆ అధమత్వము లోలోపల తింటూ ఉంటుంది. అంతిమ సమయంలో ఎవరైతే..... అని మీరు అంటారు కదా. వారి బుద్ధిలో ఆ అధమత్వమే వస్తూ ఉంటుంది. కనుక కల్ప-కల్పము మీరే దేవతలుగా అవుతారని తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అలా జంతువులేమైనా అవుతాయా? మనుష్యులే అలా అవుతారు మరియు అర్థము చేసుకుంటారు. ఈ లక్ష్మీనారాయణులకు కూడా ముక్కు, చెవులు మొదలైనవి ఉన్నాయి, వారు మనుష్యులే కదా! కానీ దైవీ గుణాలు కలిగిన వారు కావున వారిని దేవతలని అంటారు. వీరు ఇలాంటి సుందరమైన దేవతలుగా ఎలా అవుతారు, మళ్ళీ ఎలా పడిపోతారు, ఈ చక్రము గురించి మీకు తెలిసిపోయింది. ఎవరైతే విచార సాగర మథనము చేస్తూ ఉంటారో వారికి ధారణ కూడా బాగా జరుగుతుంది. విచార సాగర మథనమే చేయకపోతే తెలివిహీనులుగా అయిపోతారు, మురళీ నడిపించే వారికి విచార సాగర మథనము నడుస్తూ ఉంటుంది. ఈ టాపిక్ గురించి ఇలా, ఇలా అర్థం చేయించాలని ఆటోమేటిక్ గా విచార సాగర మథనము జరుగుతూ ఉంటుంది. ఫలానావారు రానున్నారు అని భావిస్తారు, వారికి కూడా ఉల్లాసముగా అర్థము చేయిస్తారు. వారు కొద్దిగానైనా అర్థము చేసుకోవచ్చు, అది భాగ్యము పై ఆధారపడి ఉంది. కొందరికి వెంటనే నిశ్చయము ఏర్పరచుకుంటారు, కొందరు ఏర్పరచుకోరు. నమ్మకం పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు కాకపోతే మున్ముందు తప్పకుండా అర్థము చేసుకుంటారు. విశ్వాసముంచాలి కదా. విశ్వాసముంచడం అనగా సేవ పట్ల అభిరుచి ఉన్నట్లు. అలసిపోకూడదు. ఎవరైనా చదువుకొని మళ్ళీ అధములుగా అయ్యి వచ్చినట్లయితే వారిని తప్పకుండా విజిటింగ్ రూమ్ లో కూర్చోబెడతారా లేదా వెళ్ళిపొమ్మని చెప్తారా? ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని వారిని తప్పకుండా అడుగుతారు. మాయతో ఓడిపోయామని చెప్తారు. అలా ఎంతోమంది వస్తారు. జ్ఞానం చాలా బాగుందని కానీ మాయ ఓడించేసింది అని భావిస్తారు. స్మృతి అయితే ఉంటుంది కదా. భక్తిలోనైతే ఓడిపోవడం మరియు గెలవడమనే మాటే ఉండదు. ఈ నాలెడ్జ్ ధారణ చేయవలసినది. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా సత్యమైన గీతను వింటున్నారు, దీని ద్వారా దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా అవ్వలేరు. క్రిస్టియన్లు, పారశీకులు, ముసల్మానులలో బ్రాహ్మణులంటూ ఎవరూ ఉండరు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు అర్థము చేసుకుంటారు.

అల్ఫ్ ను స్మృతి చేయాలని మీకు తెలుసు. అల్ఫ్ ను స్మృతి చేయడం ద్వారానే రాజ్యాధికారం లభిస్తుంది. మిమ్మల్ని ఎవరు ఎప్పుడు కలిసినా వారికి అల్ఫ్ అల్లాహ్ ను స్మృతి చేయమని చెప్పండి. అల్ఫ్ నే ఉన్నతమైనవారని అంటారు. వేలితో అల్ఫ్ వైపు సూచిస్తారు కదా! అల్ఫ్ ను ఒకటి అని కూడా అంటారు. భగవంతుడు ఒక్కరే, మిగిలినవారంతా సంతానము. తండ్రి అయితే సదా అల్ఫ్ గానే ఉంటారు. వారు రాజ్యం చేయరు. జ్ఞానాన్ని కూడా ఇస్తారు, తమ పిల్లలుగా కూడా చేసుకుంటారు కనుక పిల్లలు ఎంత సంతోషంలో ఉండాలి. బాబా మనకు ఎంత సేవ చేస్తున్నారు. మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. స్వయం వారు ఆ కొత్త పవిత్ర ప్రపంచములోకి రారు. పావన ప్రపంచములో వారిని ఎవరూ పిలవరు. పతితులే పిలుస్తారు. పావన ప్రపంచంలోకి వచ్చి ఏం చేస్తారు. వారి పేరే పతిత పావనుడు కనుక పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారుచేయడమే వారి డ్యూటీ. తండ్రి పేరు శివ మరియు పిల్లలను సాలిగ్రామాలని అంటారు. వారి పూజ జరుగుతుంది. శివబాబా అని అంటూ అందరూ స్మృతి చేస్తారు. రెండవది బ్రహ్మాను కూడా బాబా అని అంటారు. ప్రజాపిత బ్రహ్మా అని చాలామంది అంటారు కానీ వారి గురించి యథార్థ రీతిగా తెలియదు. బ్రహ్మా ఎవరి సంతానము? పరమపిత పరమాత్మ శివుడు వారిని దత్తత తీసుకున్నారని మీరు అంటారు. వీరు శరీరధారి కదా! ఆత్మలందరూ ఈశ్వరుని సంతానము. ఆత్మలందరికీ తమ తమ శరీరాలున్నాయి, తమ తమ పాత్ర లభించింది, అది అభినయించవలసిందే. ఇది పరంపరగా కొనసాగుతూ వచ్చింది. అనాది అనగా దానికి ఆదిమధ్యాంతాలు ఉండవు. ఇది అంతమవుతుందని మనుష్యులు వింటే మళ్ళీ ఎలా తయారవుతుంది అని తికమకపడతారు. ఇది అనాది అని తండ్రి అర్థము చేయిస్తారు. ఎప్పుడు తయారయింది అని అడగవలసిన అవసరం లేదు. ప్రళయమనేదే జరగదు. ఇది కూడా వ్యర్థ ప్రలాపాలు. కొద్దిమంది మనుష్యులే మిగులుతారు కావున ప్రళయము జరిగిందని అంటారు. బాబాలో ఏ జ్ఞానమైతే ఉందో, అది ఇప్పుడే ఇమర్జ్ అవుతుంది. మొత్తం సాగరమంతటినీ సిరాగా చేసినా కూడా..... అది పూర్తి కాదు అని వీరి గురించే అంటారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీ హర్షితముఖము ద్వారా తండ్రి పేరును ప్రసిద్ధము చేయాలి. జ్ఞాన రత్నాలనే వినాలి మరియు వినిపించాలి. మెడలో జ్ఞాన రత్నాల మాల ధరింపబడి ఉండాలి. ఆసురీ అవగుణాలను తొలగించివేయాలి.

2. సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు. విశ్వాసముంచి అభిరుచితో సేవ చేయాలి. విచార సాగర మథనము చేసి ఉల్లాసముగా ఉండాలి.

వరదానము:-

స్నేహానికి రిటర్న్ లో సమానతను అనుభవం చేసే సర్వశక్తి సంపన్న భవ

ఏ పిల్లలైతే తండ్రి స్నేహంలో సదా ఇమిడి ఉంటారో, వారికి వారి స్నేహానికి ప్రతిఫలంగా తండ్రి సమానంగా అయ్యే వరదానం ప్రాప్తిస్తుంది. ఎవరైతే సదా స్నేహయుక్తంగా మరియు యోగయుక్తంగా ఉంటారో, వారు స్వతహాగా సర్వశక్తులతో సంపన్నంగా అయిపోతారు. సర్వశక్తులు సదా తోడుగా ఉన్నట్లయితే విజయం లభించి తీరుతుంది. ఎవరికైతే సర్వశక్తివంతుడైన తండ్రి నా సహచరుడు అన్న స్మృతి ఉంటుందో, వారెప్పుడూ ఏ విషయంలోనూ చలించరు.

స్లోగన్:-

పురుషార్థీ జీవితంలో ఎవరైతే సదా సంతుష్టంగా మరియు సంతోషంగా ఉంటారో వారే అదృష్టవంతులు.