13-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - నిద్రించి ఉన్న మీ భాగ్యాన్ని మేల్కొలుపుకునేందుకు మీరు తండ్రి వద్దకు వచ్చారు, భాగ్యము మేల్కొనడం అనగా విశ్వానికి యజమానులుగా అవ్వడము”

ప్రశ్న:-

పిల్లలైన మిమ్మల్ని తండ్రి సమానంగా వివేకవంతులుగా తయారుచేసే ఔషధము ఏమిటి?

జవాబు:-

పిల్లలైన మీ బుద్ధికి ఔషధము - ఈ చదువు. ఎవరైతే ప్రతి రోజు చదువుకుంటారో అనగా ఈ ఔషధాన్ని తీసుకుంటారో, వారి బుద్ధి పారసంగా అవుతుంది. బుద్ధివంతులకే బుద్ధి అయిన పారసనాథుడైన తండ్రి మిమ్మల్ని తమ సమానంగా పారసబుద్ధి గలవారిగా తయారుచేస్తారు.

గీతము:-

అదృష్టాన్ని మేల్కొలుపుకొని వచ్చాను..... (తక్దీర్ జగాకర్ ఆయీ హూ.....)

ఓంశాంతి. పాటలోని లైనును విన్నప్పుడు కూడా మధురాతి మధురమైన పిల్లలకు రోమాలు నిక్కబొడుచుకోవాలి. ఇది సాధారణమైన పాటనే కానీ దీని సారము ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి పాట అర్థమును, శాస్త్రాలు మొదలైనవాటి అర్థమును తెలియజేస్తారు. కలియుగంలో అందరి భాగ్యము నిద్రించి ఉన్నదని కూడా మధురాతి మధురమైన పిల్లలకు తెలుసు. సత్యయుగంలో అందరి భాగ్యము మేల్కొని ఉంటుంది. నిద్రించి ఉన్న భాగ్యాన్ని మేల్కొలిపేవారు, శ్రీమతమునిచ్చేవారు మరియు భాగ్యాన్ని తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారే కూర్చొని పిల్లల భాగ్యాన్ని మేల్కొలుపుతారు. పిల్లలు జన్మిస్తూనే వారి భాగ్యము మేల్కొంటుంది. పిల్లలు జన్మిస్తూనే, మేము వారసులమని వారికి తెలిసిపోతుంది. అదే విధంగా, ఇది అనంతమైన విషయము. కల్ప-కల్పము మా భాగ్యము మేల్కొంటుంది, మళ్ళీ నిద్రిస్తుందని పిల్లలకు తెలుసు. పావనంగా అయినప్పుడు భాగ్యము మేల్కొంటుంది. పావన గృహస్థ ఆశ్రమమని అంటారు. ఆశ్రమము అనే పదము పవిత్రమైనది. పవిత్ర గృహస్థ ఆశ్రమము ఉంటుంది, దీనికి విరుద్ధంగా అపవిత్ర పతిత గృహస్థ ధర్మము ఉంటుంది. దీనిని ఆశ్రమమని అనరు. అందరికీ గృహస్థ ధర్మం ఉంటుంది. జంతువులలో కూడా ఉంటుంది. అందరూ పిల్లలకు జన్మనిస్తారు. జంతువులు కూడా గృహస్థ ధర్మములోనే ఉన్నాయని అంటారు. మేము స్వర్గములో పవిత్ర గృహస్థ ఆశ్రమములో ఉండేవారమని, దేవీ-దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు పిల్లలకు తెలుసు. సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు..... అని వారి మహిమను కూడా పాడుతారు. స్వయంగా మీరు కూడా పాడేవారు. మేము మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతున్నామని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మనుష్యుల నుండి దేవతలుగా..... అన్న గాయనము కూడా ఉంది. బ్రహ్మా-విష్ణు-శంకరులను కూడా దేవతలని అంటారు. బ్రహ్మా దేవతాయ నమః అని అంటారు, తర్వాత శివ పరమాత్మాయ నమః అని అంటారు. దాని అర్థము కూడా ఇప్పుడు మీకు తెలుసు. వారు కేవలం అంధవిశ్వాసంతో అంటారు. ఇప్పుడు, శంకర దేవతాయ నమః అని అంటారు, శివుని కోసం శివ పరమాత్మాయ నమః అని అంటారు, అంటే తేడా ఉంది కదా. వారు దేవత అన్నట్లు, వీరు పరమాత్మ అన్నట్లు. శివుడు, శంకరుడు ఒకరే అని అనలేరు. మనము నిజంగానే రాతిబుద్ధి గలవారిగా ఉండేవారిమని, ఇప్పుడు పారసబుద్ధి గలవారిగా అవుతున్నామని మీకు తెలుసు. దేవతలను రాతిబుద్ధి గలవారని అనరు. డ్రామానుసారంగా రావణ రాజ్యములో మళ్ళీ మెట్లు దిగవలసిందే. పారసబుద్ధి నుండి రాతిబుద్ధి గలవారిగా అవ్వాలి. అందరికంటే తెలివైనవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు మీ బుద్ధిలో శక్తి లేదు. అటువంటివారిని తండ్రి కూర్చొని పారసబుద్ధి గలవారిగా తయారుచేస్తారు. మీరు ఇక్కడకు పారసబుద్ధి గలవారిగా తయారయ్యేందుకు వచ్చారు. పారసనాథుని మందిరాలు కూడా ఉన్నాయి. అక్కడ మేళాలు జరుగుతాయి. కానీ పారసనాథుడు ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. వాస్తవానికి పారసంగా తయారుచేసేవారు తండ్రి మాత్రమే. వారిని బుద్ధివంతుల బుద్ధి అని అంటారు. ఈ జ్ఞానము పిల్లలైన మీ బుద్ధికి ఔషధం వంటిది, దీనితో బుద్ధి ఎంతగా మారుతుంది. ఈ ప్రపంచము ముళ్ళ అడవిలా ఉంది. ఒకరికొకరు ఎంతో దుఃఖమును ఇస్తారు. ఇప్పుడు ఇది తమోప్రధాన రౌరవ నరకము. గరుడ పురాణంలో చాలా ఆసక్తికరమైన విషయాలను వ్రాసేశారు.

ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధికి ఔషధము లభిస్తుంది. అనంతమైన తండ్రి ఔషధమును ఇస్తున్నారు. ఇది చదువు. దీనిని జ్ఞానామృతమని కూడా అంటారు. ఇది నీరు మొదలైనవాటి విషయమేమీ కాదు. ఈ రోజుల్లో అన్ని వస్తువులను అమృతమని అనేస్తారు. గంగా జలమును కూడా అమృతమని అంటారు. దేవతల పాదాలను కడిగి ఆ నీటిని పెట్టుకుంటారు, దానిని అమృతమని అంటారు. ఇప్పుడిది కూడా బుద్ధి ద్వారా అర్థము చేసుకునే విషయము కదా. ఆ దోసిలి నీరు అమృతమా లేక పతితపావని అయిన గంగా జలము అమృతమా? వారు ఇచ్చే దోసిలి నీరు పతితులను పావనంగా చేస్తుందని అనరు, గంగా జలమును పతితపావని అని అంటారు. మనుష్యులు మరణించినప్పుడు గంగా జలము నోటిలో ఉండాలని అంటారు. అర్జునుడు బాణమును వేసి, అమృత జలమును అందించినట్లుగా చూపిస్తారు. పిల్లలైన మీరు బాణాలు మొదలైనవేవీ వేయలేదు. బాణాలతో యుద్ధము చేసే గ్రామము ఒకటి ఉంది. అక్కడి రాజును ఈశ్వరుని అవతారమని అంటారు. కానీ ఎవరూ కూడా ఈశ్వరుని అవతారముగా అవ్వలేరు. వాస్తవానికి సర్వుల సద్గతిదాత అయిన సత్యాతి-సత్యమైన సద్గురువు ఒకే ఒక్కరు. వారు ఆత్మలందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ తిరిగి తీసుకువెళ్ళలేరు. బ్రహ్మ తత్వములో లీనమయ్యే విషయము కూడా లేదు. ఇది తయారైన నాటకము. సృష్టి చక్రము అనాదిగా తిరుగుతూనే ఉంటుంది. ప్రపంచ చరిత్ర-భూగోళాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది ఇప్పుడు మీకు తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. మనుష్యులు అనగా ఆత్మలకు, వారు ఎవరినైతే ఓ గాడ్ ఫాదర్ అని స్మృతి చేస్తారో, ఆ తండ్రి అయిన రచయిత గురించి కూడా తెలియదు. హద్దు తండ్రిని ఎప్పుడూ గాడ్ ఫాదర్ అని అనరు. గాడ్ ఫాదర్ అనే పదమును చాలా గౌరవపూర్వకంగా పలుకుతారు. పతిత పావనుడు, దుఃఖహర్త-సుఖకర్త అని వారి కోసమే పాడుతారు. ఒకవైపు, వారు దుఃఖహర్త-సుఖకర్త అని అంటారు, కానీ ఎప్పుడైనా దుఃఖము కలిగినప్పుడు లేక బిడ్డ మరణించినప్పుడు, ఈశ్వరుడే సుఖ-దుఃఖాలను ఇస్తారని అంటారు. ఈశ్వరుడు నా బిడ్డను తీసుకువెళ్ళిపోయారని అంటారు. వారేమి చేసారు? ఒకవైపు మహిమ చేస్తారు, ఇంకేదైనా జరిగినప్పుడు ఈశ్వరుడిని నిందిస్తారు. ఈశ్వరుడే సంతానమిచ్చారని కూడా అంటారు, అటువంటప్పుడు వారు తిరిగి తీసుకుంటే మీరు ఎందుకు ఏడవాలి? ఈశ్వరుని వద్దకే వెళ్ళాడు కదా. సత్యయుగంలో ఎప్పుడూ ఎవరూ ఏడవరు. ఏడవవలసిన అవసరము లేదని తండ్రి అర్థం చేయిస్తారు. తన లెక్కాచారం బట్టి ఆత్మ వెళ్ళి మరొక పాత్రను అభినయించాలి. జ్ఞానము లేని కారణంగా మనుష్యులు ఎంతగా ఏడుస్తారు, పిచ్చివారిలా అయిపోతారు. తల్లి మరణించినా హల్వా తినాలని ఇక్కడ తండ్రి అర్థం చేయిస్తారు. నష్టోమోహులుగా అవ్వాలి. మాకు ఒకే ఒక్క అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. పిల్లలకు ఇటువంటి అవస్థ ఉండాలి. మోహజీత్ రాజు కథను కూడా విన్నారు కదా. ఇవన్నీ కట్టు కథలు. సత్యయుగంలో ఎప్పుడూ దుఃఖపు విషయమేమీ ఉండదు. ఎప్పుడూ అకాలమృత్యువు ఉండదు. మేము మృత్యువుపై విజయాన్ని పొందుతామని పిల్లలకు తెలుసు. తండ్రిని మహాకాలుడని కూడా అంటారు. కాలుడికే కాలుడు అయిన వారు మీరు మృత్యువుపై విజయాన్ని పొందేలా చేస్తారు అనగా మృత్యువు మిమ్మల్ని ఎప్పుడూ కబళించదు. మృత్యువు ఆత్మను కబళించలేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది, దీనినే మృత్యువు కబళించడం అని అంటారు. అంతేకానీ, మృత్యువనేదీ వస్తువేమీ కాదు. మనుష్యులు మహిమను పాడుతూ ఉంటారు కానీ ఏమీ అర్థము చేసుకోరు. అచ్యుతమ్, కేశవమ్..... అని పాడుతారు కానీ అర్థము ఏమీ తెలియదు. మనుష్యులు పూర్తిగా తెలివిహీనులైపోయారు. ఈ 5 వికారాలు మీ బుద్ధిని ఎంతగా పాడుచేస్తాయనేది తండ్రి అర్థం చేయిస్తారు. ఎంతమంది మనుష్యులు బద్రీనాథ్ మొదలైన స్థానాలకు వెళ్తారు. ఈ రోజు 2 లక్షల మంది వెళ్ళారు, 4 లక్షల మంది వెళ్ళారు..... పెద్ద-పెద్ద ఆఫీసర్లు కూడా తీర్థ యాత్రలకు వెళ్తారు. మీరు తీర్థ యాత్రలకు వెళ్ళరు కావున ఈ బి.కె.లు నాస్తికులు ఎందుకంటే వీరు భక్తి చేయరు అని అంటారు. ఎవరికైతే భగవంతుడి గురించి తెలియదో, వారు నాస్తికులని మీరంటారు. తండ్రి గురించైతే ఎవరికీ తెలియదు, అందుకే దీనిని అనాథల ప్రపంచమని అంటారు. పరస్పరంలో ఎంతగా కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. ఈ ప్రపంచమంతా బాబా ఇల్లే కదా. మొత్తం ప్రపంచములోని పిల్లలను పతితుల నుండి పావనులుగా చేసేందుకు తండ్రి వస్తారు. అర్ధకల్పము పవిత్ర ప్రపంచముండేది కదా. రాజా రాముడు ఏ విధంగా ఉంటారో, ప్రజలు కూడా అలానే ఉంటారు, రాజా రాముడు ఏ విధంగా ధనవంతునిగా ఉంటారో, ప్రజలు కూడా అలానే ఉంటారు..... అని పాడుతారు కూడా. అక్కడ అధర్మము ఎలా ఉండగలదు. అక్కడ పులి-మేక కలిసి నీరు తాగుతాయని కూడా అంటారు, అటువంటప్పుడు అక్కడకు రావణుడు మొదలైనవారు ఎక్కడ నుండి వచ్చారు? అర్థము చేసుకోరు. బయటివారు ఇటువంటి విషయాలను విని నవ్వుకుంటారు.

ఇప్పుడు జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చి మాకు జ్ఞానమునిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది పతిత ప్రపంచము కదా. మరి ప్రేరణ ద్వారా పతితులను పావనంగా చేస్తారా ఏమిటి? ఓ పతితపావనా రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలుస్తారు, అంటే వారు తప్పకుండా భారతదేశములోనే వచ్చారు. ఇప్పుడు కూడా జ్ఞానసాగరుడైన నేను వచ్చానని వారు అంటారు. శివబాబాలోనే మొత్తం జ్ఞానముందని పిల్లలైన మీకు తెలుసు, ఆ తండ్రియే కూర్చొని పిల్లలకు ఈ విషయాలన్నీ అర్థము చేయిస్తారు. శాస్త్రాలలో ఉన్నవన్నీ కట్టు కథలు. వ్యాస భగవానుడు శాస్త్రాలను తయారుచేశారని వారి పేరును తీసుకుంటారు. ఆ వ్యాసుడు భక్తి మార్గానికి చెందినవారు. వీరు వ్యాసదేవుడు, వీరి పిల్లలైన మీరు సుఖదేవులు. ఇప్పుడు మీరు సుఖదేవతలుగా అవుతారు. వ్యాసుని నుండి, శివాచార్యుని నుండి మీరు సుఖపు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మీరు వ్యాసుని పిల్లలు. కానీ మనుష్యులు తికమక పడకూడదని శివుని పిల్లలు అని అనడం జరుగుతుంది. వారి అసలు పేరు శివ. శివబాబా మీ సమ్ముఖంలో కూర్చొని ఉన్నారు కావున ఏ దేహధారినీ చూడకండి అని ఇప్పుడు తండ్రి అంటారు. ఆత్మను తెలుసుకోవడం జరుగుతుంది, పరమాత్మను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వారు పరమపిత పరమాత్మ శివ. పతితుల నుండి పావనంగా అయ్యే మార్గాన్ని వారే స్వయంగా వచ్చి తెలియజేస్తారు. నేను ఆత్మలైన మీకు తండ్రినని వారు అంటారు. ఆత్మను రియలైజ్ చేయడం జరుగుతుంది, దానిని చూడడం జరగదు. ఇప్పుడు మీరు మీ ఆత్మను రియలైజ్ చేశారా అని తండ్రి అడుగుతున్నారు. ఇంత చిన్న ఆత్మలో ఒక రికార్డు వలె అవినాశీ పాత్ర నిశ్చితమై ఉంది.

ఆత్మలైన మనమే శరీరాన్ని ధారణ చేస్తామని మీకు తెలుసు. మొదట మీరు దేహాభిమానులుగా ఉండేవారు, ఇప్పుడు దేహీ అభిమానులుగా అయ్యారు. ఆత్మలైన మనము 84 జన్మలను తీసుకుంటామని మీకు తెలుసు. దీనికి అంతము ఉండదు. ఈ డ్రామా ఎప్పటి నుండి మొదలైందని కొందరు అడుగుతారు, కానీ ఇది అనాది డ్రామా, ఇది ఎప్పటికీ వినాశనమవ్వదు. దీనిని తయారై తయారవుతున్న అవినాశీ వరల్డ్ డ్రామా అని అంటారు. ఎలాగైతే చదువురాని పిల్లలకు చదివిస్తారో, అలా తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మనే శరీరంలో ఉంటుంది. ఇది రాతి బుద్ధి గలవారికి ఫుడ్ (భోజనము), బుద్ధికి వివేకము లభిస్తుంది. పిల్లలైన మీ కోసం బాబా చిత్రాలను తయారు చేయించారు. ఇది చాలా సహజము. వీరు త్రిమూర్తి బ్రహ్మా-విష్ణు-శంకరులు. ఇప్పుడు బ్రహ్మాను కూడా త్రిమూర్తి అని ఎందుకంటారు? దేవ-దేవ మహాదేవ అని అంటారు. ఒకరిపైన మరొకరిని ఉంచుతారు కానీ అర్థం ఏమీ తెలియదు. బ్రహ్మా, దేవత ఎలా అవ్వగలరు. ప్రజాపిత బ్రహ్మా అయితే ఇక్కడ ఉండాలి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. నేను ఈ శరీరంలో ప్రవేశించి, ఇతని ద్వారా మీకు అర్థం చేయిస్తానని తండ్రి అంటారు. వీరిని నా వానిగా చేసుకుంటాను. వీరి అనేక జన్మల అంతిమంలో నేను వస్తాను. వీరు కూడా 5 వికారాలను సన్యసిస్తారు. సన్యాసం చేసేవారిని యోగి, ఋషి అని అంటారు. మీరిప్పుడు రాజఋషులుగా అయ్యారు. మీరు 5 వికారాలను సన్యసించారు కావున పేరు మారుతుంది. మీరు రాజయోగులుగా అవుతారు. మీరు ప్రతిజ్ఞను చేస్తారు. ఆ సన్యాసులు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడ స్త్రీ-పురుషులు ఇరువురూ కలిసి ఉంటారు, మేము ఎప్పటికీ వికారాలలోకి వెళ్ళము అని ప్రతిజ్ఞను చేస్తారు. ముఖ్యమైనది వికారాల విషయమే.

శివబాబా రచయిత అని పిల్లలైన మీకు తెలుసు. వారు కొత్త రచనను రచిస్తారు. వారు బీజరూపుడు, సత్ చిత్ ఆనందసాగరుడు, జ్ఞానసాగరుడు. స్థాపన, వినాశనము, పాలన ఎలా చేస్తారు అనేది తండ్రికి తెలుసు, మనుష్యులకు తెలియదు. బి.కె.లైన మీరు ప్రపంచాన్ని వినాశనము చేస్తారని ఆ మనుష్యులు వెంటనే అనేస్తారు. అచ్ఛా, మీ నోటిలో గులాబ్ జామున్. వీరు వినాశనానికి నిమిత్తులుగా అయ్యారని అంటారు. వీరు శాస్త్రాలను గాని, భక్తిని గాని, గురువులను గాని ఎవ్వరినీ నమ్మరు, కేవలం వారి దాదాను మాత్రమే నమ్ముతారని అంటారు. కానీ ఇది పతిత శరీరము, నేను వీరిలో ప్రవేశించానని తండ్రి స్వయంగా అంటున్నారు. పతిత ప్రపంచంలో పావనమైనవారు ఎవరూ ఉండరు. మనుష్యులు ఏవైతే చెప్పుడు మాటలను వింటారో, అవే మాట్లాడతారు. ఇటువంటి చెప్పుడు మాటల ద్వారానే భారతదేశము దుర్గతిని పొందింది, అప్పుడు తండ్రి వచ్చి సత్యాన్ని వినిపించి అందరికీ సద్గతినిస్తారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి నుండి సుఖ వారసత్వాన్ని తీసుకుని సుఖమునిచ్చే దేవతగా తయారవ్వాలి. అందరికీ సుఖమునివ్వాలి. రాజఋషులుగా అయ్యేందుకు అన్ని వికారాలను సన్యసించాలి.

2. చదువే సత్యమైన ఔషధము, సద్గతి కోసం చెప్పుడు మాటలను వదిలి శ్రీమతముపై నడవాలి. ఒక్క తండ్రి ద్వారానే వినాలి. మోహజీతులుగా అవ్వాలి.

వరదానము:-

సదా స్వమానంలో స్థితులై నిర్మాన స్థితి ద్వారా సర్వులకు గౌరవాన్ని ఇచ్చే మాననీయ, పూజ్యనీయ భవ

తండ్రి మహిమనే మీ స్వమానము, స్వమానములో స్థితులై ఉన్నట్లయితే నిర్మానులుగా అవుతారు, అప్పుడు అందరి నుండి స్వతహాగానే గౌరవం లభిస్తూ ఉంటుంది. గౌరవమనేది అడిగితే లభించదు, గౌరవమనేది ఇవ్వడం ద్వారా, స్వమానంలో స్థితులై ఉండడం ద్వారా, ప్రతిష్ఠను త్యాగం చేయడం ద్వారా, సర్వులకు మాననీయులుగా మరియు పూజ్యనీయులుగా అయ్యే భాగ్యము ప్రాప్తిస్తుంది ఎందుకంటే గౌరవమివ్వడం అంటే ఇవ్వడం కాదు, తీసుకోవడము.

స్లోగన్:-

అన్నీ తెలిసినవారిగా అవ్వడంతో పాటు చేసేవారిగా కూడా అయి అసమర్థ ఆత్మలకు అనుభూతి అనే ప్రసాదాన్ని పంచుతూ వెళ్ళండి.