13-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - ఇప్పుడు మళ్ళీ విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది, ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసేందుకు తండ్రి వచ్చారు అన్న శుభవార్తను అందరికీ వినిపించండి"

ప్రశ్న:-

పిల్లలైన మీకు పదే-పదే స్మృతిలో ఉండండి అనే సూచన ఎందుకు ఇవ్వడం జరుగుతుంది?

జవాబు:-

ఎందుకంటే సదా ఆరోగ్యవంతులుగా మరియు సదా పావనంగా అయ్యేందుకే స్మృతి ఉన్నది కనుక సమయము లభించినప్పుడల్లా స్మృతిలో ఉండండి. ఉదయం-ఉదయం స్నానం మొదలైనవి చేసిన తర్వాత ఏకాంతంగా విహరించండి లేక ఒకచోట కూర్చోండి. ఇక్కడైతే అంతా సంపాదనే సంపాదన. స్మృతి ద్వారానే విశ్వానికి యజమానులుగా అవుతారు.

ఓంశాంతి. ఈ సమయంలో విశ్వములో అందరూ శాంతిని కోరుకుంటున్నారని మధురమైన పిల్లలకు తెలుసు. విశ్వములో శాంతి ఎలా ఏర్పడుతుంది అన్న మాటలను వింటూనే ఉంటారు. కానీ ఇప్పుడు కోరుకుంటున్న విశ్వములోని శాంతి ఎప్పుడుండేది అన్నది ఎవ్వరికీ తెలియదు. విశ్వములో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యమున్నప్పుడు శాంతి ఉండేదని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పటి వరకు కూడా లక్ష్మీ-నారాయణుల మందిరాలను నిర్మిస్తూనే ఉన్నారు. మీరు ఎవరికైనా, విశ్వములో 5 వేల సంవత్సరాల క్రితము శాంతి ఉండేది, ఇప్పుడు అది మళ్ళీ స్థాపించబడుతుందని తెలియజేయవచ్చు. దానిని ఎవరు స్థాపన చేస్తున్నారు అన్నది మనుష్యులకు తెలియదు. ఇది పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు, మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. మీరు ఇది వ్రాయవచ్చు, కానీ ఇప్పటివరకు ఆ విధంగా వ్రాసే ధైర్యము ఎవ్వరికీ లేదు. అందరూ విశ్వంలో శాంతి ఏర్పడాలని అంటున్నారని - వార్తాపత్రికల ద్వారా వింటూనే ఉంటారు. యుద్ధాలు మొదలైనవి జరిగినప్పుడు మనుష్యులు విశ్వంలో శాంతి ఏర్పడేందుకు యజ్ఞాలు రచిస్తారు. అది ఏ యజ్ఞము? రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. ఇప్పుడు ఏ తండ్రినైతే రుద్రుడు, శివుడు అని అంటారో వారు ఈ సమయంలో ఈ జ్ఞాన యజ్ఞాన్ని రచించారని పిల్లలకు తెలుసు. విశ్వంలో శాంతి స్థాపన ఇప్పుడు జరుగుతోంది. సత్యయుగ కొత్త ప్రపంచములో శాంతి ఉన్నప్పుడు తప్పకుండా రాజ్యము చేసేవారు కూడా ఉంటారు కదా. నిరాకార ప్రపంచం కోసం విశ్వంలో శాంతి ఉండాలి అని అనరు. అక్కడ ఉండేదే శాంతి. విశ్వం అంటే మనుష్యులు ఉండేటటువంటి స్థానం. నిరాకార లోకాన్ని విశ్వము అని అనరు. అది శాంతిధామము. బాబా పదే-పదే అర్థం చేయిస్తూ ఉంటారు, అయినా కొంతమంది మర్చిపోతారు మరియు కొందరి బుద్ధిలో ఉంటుంది, వారు అర్థము చేయించగలరు. విశ్వంలో శాంతి ఎలా ఉండేది, అది ఇప్పుడు మళ్ళీ ఎలా స్థాపనవుతుంది అన్నది ఎవరికైనా అర్థము చేయించడం చాలా సహజం. భారత్ లో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందిన రాజ్యమున్నప్పుడు ఒకే ధర్మముండేది. విశ్వంలో శాంతి ఉండేది. ఇవి చాలా సహజంగా అర్థం చేయించగలిగే మరియు వ్రాయగలిగే విషయాలు. పెద్ద-పెద్ద మందిరాలను నిర్మించేవారికి కూడా, వీరి రాజ్యమున్నప్పుడు నేటికి 5 వేల సంవత్సరాల క్రితము విశ్వంలో శాంతి ఉండేది, వీరి మందిరాలే మీరు నిర్మిస్తున్నారు - అని మీరు వ్రాయవచ్చు. భారత్ లోనే వీరి రాజ్యముండేది, అప్పుడు ఇంకే ధర్మమూ ఉండేది కాదు. ఇది చాలా సహజమైన మరియు అర్థము చేసుకోవలసిన విషయము. డ్రామానుసారముగా మున్ముందు అన్నీ అర్థము చేసుకుంటారు. ఈ శుభవార్తను మీరు అందరికీ వినిపించవచ్చు, మీరు దీనిని అందమైన కార్డు పైన ముద్రించవచ్చు కూడా. నేటికి 5 వేల సంవత్సరాల క్రితము విశ్వములో శాంతి కొత్త ప్రపంచములో, కొత్త భారత్ లో ఉండేది. అప్పుడు ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. ఇప్పుడు మళ్ళీ విశ్వములో శాంతి స్థాపన జరుగుతుంది. ఈ విషయాలను స్మరించినా కూడా పిల్లలైన మీకు చాలా సంతోషము కలగాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారానే మనము విశ్వానికి యజమానులుగా అవుతామని మీకు తెలుసు. ఆధారమంతా పిల్లలైన మీ పురుషార్థముపైనే ఉంది. ఏ మాత్రము సమయం లభించినా తండ్రి స్మృతిలో ఉండండి అని తండ్రి అర్థం చేయించారు. ఉదయం స్నానము చేసిన తర్వాత ఏకాంతంలో తిరగండి లేక కూర్చోండి. ఇక్కడైతే సంపాదనే సంపాదన చేసుకోవాలి. సదా ఆరోగ్యవంతులుగా మరియు సదా పావనంగా అయ్యేందుకే స్మృతి ఉన్నది. ఇక్కడ సన్యాసులు పవిత్రంగా ఉన్నప్పటికీ, అనారోగ్యంగా అయితే తప్పకుండా అవుతారు. ఇది ఉన్నదే రోగగ్రస్థుల ప్రపంచము. అది నిరోగీ ప్రపంచము. ఇది కూడా మీకు తెలుసు. స్వర్గములో అందరూ నిరోగులుగా ఉంటారని ప్రపంచంలో ఎవరికి తెలుసు. స్వర్గం అని దేనినంటారో కూడా, ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. ఎవరు కలిసినా మీరు అర్థం చేయించవచ్చు అని బాబా చెప్తున్నారు. ఎవరైనా స్వయాన్ని రాజా-రాణి అని పిలిపించుకున్నారనుకోండి, ఇప్పుడు రాజా-రాణులు అయితే ఎవరూ లేరు, మీరిప్పుడు రాజా-రాణులు కారు అని చెప్పండి. దానిని బుద్ధి నుండి కూడా తొలగించవలసి ఉంటుంది. మహారాజా-మహారాణులైన శ్రీ లక్ష్మీ-నారాయణుల రాజధాని ఇప్పుడు స్థాపన జరుగుతుంది. కనుక ఇప్పుడు ఇక్కడ తప్పకుండా రాజా-రాణులు ఎవ్వరూ ఉండకూడదు. మేము రాజా-రాణులము అన్నది కూడా మర్చిపోండి. సాధారణ మనుష్యుల వలె నడుచుకోండి. వీరి వద్ద కూడా ధనము, బంగారము మొదలైనవి అయితే ఉంటాయి కదా. ఇప్పుడు నిబంధనలు జారీ అవుతున్నాయి, అన్నీ తీసేసుకుంటారు. తర్వాత సాధారణ మనుష్యుల వలె అయిపోతారు. ఈ యుక్తులను కూడా రచిస్తున్నారు. కొందరిది ధూళిలో కలిసిపోతుందని, కొందరిది రాజులు తింటారు... అని గాయనము కూడా ఉంది కదా. ఇప్పుడు అసలు రాజులు ఎవ్వరిదీ తినరు. అసలు రాజులే లేరు, ప్రజలది ప్రజలే తింటున్నారు. ఈ రోజుల్లోని రాజ్యము చాలా విచిత్రమైనది. ఎప్పుడైతే పూర్తిగా రాజుల పేరు తొలగిపోతుందో, అప్పుడు మళ్ళీ రాజధాని స్థాపన జరుగుతుంది. ఎక్కడైతే విశ్వములో శాంతి ఉంటుందో, అక్కడకు మనము వెళ్తున్నామని మీకిప్పుడు తెలుసు. అది సుఖధామము, సతోప్రధాన ప్రపంచము. మనము అక్కడకు వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నాము. పిల్లలు కూర్చుని అథారిటీతో అర్థం చేయించాలి, కేవలం బాహ్యమైన కృత్రిమ అలంకారాలు అవసరం లేదు. ఈ రోజుల్లోనైతే అలాంటి కృత్రిమమైనవి కూడా చాలా వెలువడ్డాయి కదా. ఇక్కడైతే పక్కా బ్రహ్మాకుమార-కుమారీలు కావాలి.

బ్రాహ్మణులైన మీరు బ్రహ్మాబాబాతో పాటు కలిసి విశ్వములో శాంతి స్థాపన చేసే కార్యాన్ని చేస్తున్నారు. ఇటువంటి శాంతి స్థాపన చేసే పిల్లలు చాలా శాంతచిత్తులుగా మరియు చాలా మధురంగా ఉండాలి ఎందుకంటే - విశ్వములో శాంతిని స్థాపన చేసేందుకు మేము నిమిత్తంగా అయ్యామని మీకు తెలుసు. కనుక మొదట మనలో చాలా శాంతి ఉండాలి. మాటలు కూడా చాలా నెమ్మదిగా, చాలా రాయల్ గా మాట్లాడాలి. మీరు పూర్తిగా గుప్తంగా ఉన్నారు. మీ బుద్ధి అవినాశీ జ్ఞానరత్నాల ఖజానాతో నిండుగా ఉంది, తండ్రికి మీరు వారసులు కదా. బాబా వద్ద ఉన్న ఖజానా అంతా మీరు కూడా పూర్తిగా నింపుకోవాలి. ఆస్తి అంతా మీదే, కానీ అంతటి ధైర్యము లేకపోతే తీసుకోలేరు. తీసుకునేవారే ఉన్నత పదవిని పొందుతారు. ఎవరికైనా అర్థం చేయించేందుకు చాలా అభిరుచి ఉండాలి. మనము భారత్ ను మళ్ళీ స్వర్గంగా తయారుచేయాలి. వ్యాపారాలు మొదలైనవి చేస్తూ వాటితో పాటు ఈ సేవను కూడా చేయాలి, అందుకే బాబా త్వర-త్వరగా చేయమంటారు. అయినా కూడా డ్రామానుసారంగానే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ సమయానుసారంగానే నడుచుకుంటున్నారు, పిల్లల చేత కూడా పురుషార్థము చేయిస్తున్నారు. ఇప్పుడు ఇంకా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది అని పిల్లలకు నిశ్చయముంది. ఇది మన అంతిమ జన్మ, తర్వాత మనము స్వర్గములో ఉంటాము, ఈ దుఃఖధామము మళ్ళీ సుఖధామంగా అవుతుంది. అలా అవ్వడానికి సమయమైతే పడుతుంది కదా. ఈ వినాశనము చిన్నదేమీ కాదు. కొత్త ఇల్లు తయారౌతున్నప్పుడు మరి కొత్త ఇల్లే గుర్తుకొస్తుంది. అది హద్దుకు సంబంధించిన విషయము, అందులో సంబంధాలు మొదలైనవేవీ మారవు. ఇక్కడైతే పాత ప్రపంచమే మారనున్నది. ఆపై బాగా చదువుకున్నవారే రాజ్యకులంలోకి వస్తారు. లేకపోతే ప్రజలలోకి వెళ్ళిపోతారు. పిల్లలకు చాలా సంతోషముండాలి. 50-60 జన్మలు మీరు సుఖాన్ని పొందుతారని బాబా తెలియజేసారు. ద్వాపరంలో కూడా మీ వద్ద చాలా ధనము ఉంటుంది. దుఃఖం తర్వాత కలుగుతుంది. రాజులు ఎప్పుడైతే పరస్పరము కొట్లాడుకుంటారో, విడిపోతారో అప్పుడు దుఃఖము ప్రారంభమౌతుంది. మొదట అయితే ధాన్యము మొదలైనవి కూడా చాలా చౌకగా దొరికేవి. కరువులు మొదలైనవి కూడా తర్వాత ఏర్పడుతాయి. మీ వద్ద చాలా ధనముంటుంది. సతోప్రధానం నుండి తమోప్రధానతలోకి నెమ్మది-నెమ్మదిగా వస్తారు. కనుక పిల్లలైన మీలో చాలా సంతోషం ఉండాలి. స్వయంలోనే సంతోషము లేకపోతే, శాంతి లేకపోతే, మరి వారు విశ్వములో శాంతిని ఎలా స్థాపన చేయగలరు! చాలా మంది బుద్ధిలో అశాంతి ఉంటుంది. శాంతి వరదానాన్ని ఇచ్చేందుకే బాబా వస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే, తమోప్రధానంగా అయిన కారణంగా అశాంతిగా ఉన్న ఆత్మ ఆ స్మృతి ద్వారా సతోప్రధానంగా శాంతిగా అయిపోతుందని తండ్రి చెప్తున్నారు. కానీ పిల్లల ద్వారా అంతగా స్మృతి యొక్క శ్రమ జరగడం లేదు, స్మృతిలో ఉండని కారణంగానే మాయా తుఫానులు వస్తాయి. స్మృతిలో ఉంటూ పూర్తిగా పావనంగా అవ్వకపోతే శిక్షలను అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా భ్రష్టమైపోతుంది. స్వర్గములోకైతే వెళ్తాము కదా అని అనుకోకూడదు. అరే, దెబ్బలు తిని పైసా విలువ చేసే సుఖాన్ని పొందడం, ఇదేమైనా మంచిదా. మనుష్యులు ఉన్నత పదవిని పొందేందుకు ఎంతగా పురుషార్థము చేస్తారు. అంతేకానీ ఏది లభిస్తే అది మంచిది అని అనుకోకూడదు. అలా పురుషార్థము చేయనివారు ఎవ్వరూ ఉండరు. భిక్షం అడిగే ఫకీర్లు కూడా తమ వద్ద ధనాన్ని పోగు చేసుకుంటారు. అందరికీ ధనము యొక్క ఆకలి ఉంటుంది. ధనముతో ప్రతి విషయం యొక్క సుఖం కలుగుతుంది. మనము బాబా నుండి అపారమైన ధనాన్ని తీసుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. పురుషార్థము తక్కువగా చేసినట్లయితే ధనము కూడా తక్కువగానే లభిస్తుంది. తండ్రి ధనానిస్తున్నారు కదా. ధనముంటే అమెరికా మొదలైనవి తిరిగి రావచ్చు అని కూడా అంటారు. మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో మరియు సేవ చేస్తారో, అంతగా సుఖము పొందుతారు. తండ్రి ప్రతి విషయంలోనూ పురుషార్థము చేయించి, ఉన్నతంగా తయారుచేస్తారు. పిల్లలు నా కులం పేరును ప్రసిద్ధము చేస్తారు అని తండ్రి భావిస్తారు. పిల్లలైన మీరు కూడా ఈశ్వరీయ కులం యొక్క, తండ్రి యొక్క పేరును ప్రసిద్ధము చేయాలి. వీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సద్గురువు కూడా. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి, ఉన్నతాతి ఉన్నతమైన సత్యమైన సద్గురువు కూడా. గురువు ఒక్కరే ఉంటారు, ఇంకెవ్వరూ ఉండరని కూడా అర్థము చేయించబడింది. సర్వుల సద్గతిదాత ఒక్కరే. ఇది కూడా మీకు తెలుసు. ఇప్పుడు మీరు పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. పారసపురికి పారసనాథ రాజా-రాణులుగా అవుతారు. ఇది ఎంత సహజమైన విషయము. భారత్ బంగారు యుగంగా ఉండేది, విశ్వములో శాంతి ఎలా ఉండేది అన్నది మీరు ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రము ద్వారా అర్థము చేయించవచ్చు. స్వర్గములో శాంతి ఉండేది. ఇప్పుడిది నరకము. ఇందులో అశాంతి ఉంది. స్వర్గములో ఈ లక్ష్మీ-నారాయణులు ఉంటారు కదా. కృష్ణుడిని లార్డ్ కృష్ణ అని కూడా అంటారు. కృష్ణ భగవాన్ అని కూడా అంటారు. ఇప్పుడు లార్డ్స్ (భూస్వాములు) అయితే చాలామంది ఉన్నారు, ఎవరి వద్దనైతే ల్యాండ్ (భూమి) ఎక్కువగా ఉంటుందో వారిని కూడా ల్యాండ్ లార్డ్ (భూస్వామి) అని అంటారు. కృష్ణుడైతే విశ్వానికి రాకుమారుడిగా ఉండేవారు, అప్పుడు విశ్వంలో శాంతి ఉండేది. రాధా-కృష్ణులే లక్ష్మీ-నారాయణులుగా అవుతారని కూడా ఎవ్వరికీ తెలియదు.

మీ గురించి మనుష్యులు ఎన్ని విషయాలు అంటూ ఉంటారు, ఎన్ని గొడవలు చేస్తారు, వీరైతే సోదరీ-సోదరులుగా చేస్తారని అంటారు. ప్రజాపిత బ్రహ్మా యొక్క ముఖవంశావళీ బ్రాహ్మణుల కోసమే బ్రాహ్మణ దేవీ-దేవతాయ నమః అని గానం చేస్తారు అని అర్థము చేయించబడుతుంది. బ్రాహ్మణులు కూడా వారికి నమస్కరిస్తారు ఎందుకంటే వారు సత్యమైన సోదరీ-సోదరులు, పవిత్రంగా ఉంటారు. మరి పవిత్రంగా ఉన్నవారిని ఎందుకు గౌరవించరు. కన్య పవిత్రంగా ఉన్నందుకు వారి కాళ్ళకు నమస్కరిస్తారు కూడా. బయట నుండి వచ్చే అతిథులు కూడా కన్యకు నమస్కరిస్తారు. ఈ సమయంలో కన్యకు ఇంతటి గౌరవము ఎందుకుంది? ఎందుకంటే మీరు బ్రహ్మాకుమార-కుమారీలు కదా. కన్యలైన మీదే మెజారిటీ. శివశక్తి పాండవ సైన్యము అన్న గాయనం చేయబడింది. ఇందులో పురుషులు కూడా ఉన్నారు, కానీ మెజారిటీ మాతలున్నారు కనుక అలా గాయనము చేయబడింది. కనుక ఎవరైతే బాగా చదువుకుంటారో, వారే ఉన్నతంగా అవుతారు. ఇప్పుడు మీరు మొత్తం విశ్వం యొక్క చరిత్ర-భూగోళాలను తెలుసుకున్నారు. చక్రము ద్వారా అర్థము చేయించడం కూడా చాలా సహజం. భారత్ పారసపురిగా ఉండేది, ఇప్పుడు రాతిపురిగా ఉంది. కనుక అందరూ రాతినాథులుగా అయ్యారు కదా. పిల్లలైన మీకు ఈ 84 జన్మల చక్రము గురించి కూడా తెలుసు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కనుక తండ్రిని కూడా స్మృతి చేయాలి, దీని ద్వారా పాపం సమాప్తమౌతుంది. కానీ నిర్లక్ష్యం వలన పిల్లల ద్వారా స్మృతి యొక్క శ్రమ జరగడం లేదు. ఉదయమే లేవరు. ఒకవేళ లేచినా ఆనందం అనిపించదు. నిద్ర వస్తే మళ్ళీ పడుకుంటారు. నిరాశపడిపోతారు. పిల్లలూ, ఇది యుద్ధ మైదానము కదా, ఇందులో నిరాశాపరులుగా అవ్వకూడదు. స్మృతి శక్తితోనే మాయపై విజయము పొందాలి. ఇందులో శ్రమ చేయాలి అని తండ్రి చెప్తున్నారు. చాలా మంచి-మంచి పిల్లలు ఎవరైతే యథార్థ రీతిగా స్మృతి చేయరో, వారు చార్టు పెట్టడం ద్వారా లాభ-నష్టాల గురించి తెలుస్తుంది. ఈ చార్టు నా స్థితిని అద్భుతంగా తయారుచేసిందని చెప్తారు. అలా అరుదుగా ఏ ఒక్కరో చార్టు పెడతారు. ఇది కూడా చాలా శ్రమతో కూడుకున్నది. చాలా సేవాకేంద్రాలలో అసత్యమైనవారు కూడా వెళ్ళి కూర్చుంటారు, వికర్మలు చేస్తూ ఉంటారు. తండ్రి డైరక్షన్ ను అమలుపరచకపోతే చాలా నష్టపోతారు. నిరాకారుడు చెప్తున్నారా లేక సాకారుడా - అన్నది పిల్లలకు తెలియదు. సదా శివబాబాయే డైరక్షన్ ఇస్తున్నారని భావించండి అని పదే-పదే పిల్లలకు అర్థము చేయించడం జరుగుతుంది. అప్పుడు మీ బుద్ధి అక్కడే జోడింపబడి ఉంటుంది.

ఈ రోజుల్లో వివాహం కోసం ఫోటోలు చూపిస్తారు, ఫలానా వారి కోసం ఇటువంటి మంచి ఇంటివారు కావాలని వార్తాపత్రికలలో కూడా ప్రకటిస్తారు. ప్రపంచము గతి ఏమైపోయింది, ఇంకా ఎలా అవ్వనున్నది! అనేక రకాలైన మతాలున్నాయని పిల్లలైన మీకు తెలుసు. బ్రాహ్మణులైన మీది ఒకే మతము. అది విశ్వంలో శాంతిని స్థాపన చేసే మతము. మీరు శ్రీమతము ద్వారా విశ్వములో శాంతిని స్థాపిస్తున్నారు కనుక పిల్లలు కూడా శాంతిగా ఉండవలసి ఉంటుంది. ఎవరు చేస్తారో వారే పొందుతారు. లేకపోతే చాలా నష్టము కలుగుతుంది. జన్మ-జన్మాంతరాలకు నష్టపోతారు. మీ లాభ-నష్టాలను చూసుకోండి అని పిల్లలకు చెప్తారు. మేము ఎవ్వరికీ దుఃఖమునివ్వలేదు కదా అని చార్టును పరిశీలించుకోండి. తండ్రి చెప్తున్నారు, ఈ సమయంలో మీకు ఒక్కొక్క క్షణము చాలా విలువైనది, ఎందుకంటే శిక్షలు అనుభవించి చిన్న పదవిని తీసుకోవడం గొప్ప విషయమా. మీరైతే గొప్ప ధనవంతులుగా అవ్వాలని అనుకుంటున్నారు కదా. మొట్టమొదట పూజ్యులుగా ఉన్నవారే పూజారులుగా అవుతారు. ఇంత ధనం ఉండే సోమనాథ మందిరాన్ని తయారుచేసారు, అప్పుడే పూజ చేయగలరు కదా. ఇది కూడా లెక్క ఉంది. చార్టు పెడితే చాలా లాభముంటుందని మళ్ళీ పిల్లలకు అర్థం చేయించబడుతుంది. ఇది నోట్ చేసుకోవాలి. అందరికీ సందేశాన్ని ఇస్తూ వెళ్ళండి, మౌనంగా కూర్చుండిపోకండి. రైలులో కూడా మీరు అర్థము చేయించి లిటరేచర్ ఇవ్వండి. ఇది కోట్ల ఆస్తి అని చెప్పండి. భారత్ లో లక్ష్మీ-నారాయణుల రాజ్యమున్నప్పుడు విశ్వములో శాంతి ఉండేది. ఇప్పుడు బాబా మళ్ళీ ఆ రాజధానిని స్థాపన చేసేందుకు వచ్చారు, మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమౌతాయి మరియు విశ్వములో శాంతి ఏర్పడుతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనము విశ్వంలో శాంతిస్థాపన చేసేందుకు నిమిత్తమైన బ్రాహ్మణులము, మనము చాలా-చాలా శాంతచిత్తులుగా ఉండాలి, చాలా నెమ్మదిగా మరియు రాయల్ గా మాట్లాడాలి.

2. నిర్లక్ష్యాన్ని వదిలి స్మృతి యొక్క శ్రమ చేయాలి. ఎప్పుడూ నిరాశాపరులుగా అవ్వకూడదు.

వరదానము:-

వికారాల రూపీ సర్పాన్ని కూడా శయ్యగా చేసుకునే విష్ణు సమానంగా సదా విజయీ, నిశ్చింత భవ

విష్ణువుకు శేషశయ్యగా దేనినైతే చూపిస్తారో, అది విజయీ పిల్లలైన మీ సహజయోగీ జీవితానికి స్మృతిచిహ్నము. సహజయోగము ద్వారా వికారాల రూపీ సర్పాలు కూడా అధీనమైపోతాయి. ఏ పిల్లలైతే వికారాల రూపీ సర్పాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకుని వాటిని విశ్రాంతి తీసుకునే శయ్యగా చేసుకుంటారో, వారు సదా విష్ణు సమానంగా హర్షితంగా మరియు నిశ్చింతగా ఉంటారు. కనుక వికారాలను అధీనము చేసుకున్న అధికారిని, ఆత్మ సదా విశ్రాంతి స్థితిలో నిశ్చింతగా ఉంది అన్న ఈ చిత్రాన్ని సదా మీ ఎదురుగా ఉంచుకోండి.

స్లోగన్:-

బాలకుడు మరియు యజమానత్వపు బ్యాలన్స్ ద్వారా ప్లాన్ ను ప్రాక్టికల్ లోకి తీసుకురండి.