14-09-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - తమ సత్యాతి-సత్యమైన చార్టును పెట్టుకున్నట్లయితే అవస్థ బాగుంటుంది, చార్టు పెట్టుకోవడం వలన కళ్యాణం జరుగుతూ ఉంటుంది

ప్రశ్న:-

ఏ స్మృతి పాత ప్రపంచం నుండి సహజంగానే దూరం చేస్తుంది?

జవాబు:-

మేము కల్ప-కల్పము తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము, ఇప్పుడు మేము వారసత్వం తీసుకునేందుకు మళ్ళీ శివబాబా ఒడిలోకి వచ్చాము, బాబా మమ్మల్ని దత్తత తీసుకున్నారు, మేము సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యాము, శివబాబా మాకు గీతను వినిపిస్తున్నారు - ఈ స్మృతియే పాత ప్రపంచం నుండి దూరం చేస్తుంది.

ఓంశాంతి.

పిల్లలైన మీరు ఇక్కడ శివబాబా స్మృతిలో కూర్చొన్నారు. వారు మళ్ళీ మనల్ని సుఖధామానికి యజమానులుగా తయారుచేస్తున్నారని మీకు తెలుసు. పిల్లల బుద్ధిలో ఎంత సంతోషముండాలి, ఇక్కడ కూర్చొని ఉండగానే ఖజానా లభిస్తుంది కదా. అనేక రకాల కాలేజీలలో, యూనివర్సిటీలలో ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండవు. బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తున్నారని మీకు మాత్రమే తెలుసు. ఈ సంతోషముండాలి కదా. ఈ సమయంలో మిగిలిన ఆలోచనలన్నింటినీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇక్కడ కూర్చొన్నప్పుడు, మేము సుఖధామానికి యజమానులుగా అవుతున్నామని బుద్ధిలో నషా ఉండాలి. సుఖం మరియు శాంతి యొక్క వారసత్వాన్ని మనం కల్ప-కల్పము తీసుకుంటాము. మనుష్యులకైతే ఏమీ తెలియదు. కల్పక్రితం కూడా చాలా మంది మనుష్యులు అజ్ఞానాంధకారంలో, కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తూ సమాప్తమైపోయారు. మళ్ళీ అలాగే జరుగుతుంది. మమ్మల్ని తండ్రి దత్తత తీసుకున్నారని లేదా మేము శివబాబా ఒడిలోకి వచ్చామని పిల్లలు అర్థం చేసుకుంటారు. వారు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు మనం బ్రాహ్మణులము. మనం సత్యాతి-సత్యమైన గీతా పాఠాన్ని వింటున్నాము. మనం బాబా నుండి రాజయోగంతో మరియు జ్ఞాన బలంతో మళ్ళీ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఇటువంటి ఆలోచనలు నడుస్తూ ఉండాలి కదా. తండ్రి కూడా వచ్చి సంతోషకరమైన విషయాలను తెలియజేస్తారు కదా. పిల్లలు కామ చితిపై కూర్చొని నల్లగా భస్మమైపోయారని తండ్రికి తెలుసు. అందుకే నేను అమరలోకం నుండి మృత్యులోకంలోకి వస్తాను. మేము మృత్యులోకం నుండి అమరలోకంలోకి మళ్ళీ వెళ్తామని మీరంటారు. తండ్రి అంటారు - ఏ మృత్యులోకంలోనైతే అందరి మృత్యువు జరిగి ఉందో, నేను అక్కడికి వెళ్తాను, వారిని తిరిగి అమరలోకంలోకి తీసుకువెళ్తాను. శాస్త్రాలలో ఏవేవో రాసేసారు - వారు సర్వశక్తివంతుడని, ఏది కావాలనుకుంటే అది చేయగలరు అని రాసారు. కానీ, ఓ పతితపావన తండ్రి రండి, వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయండి, దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వండి - దీని కోసమే వారిని పిలవడం జరుగుతుందని పిల్లలకు తెలుసు, ఇందులో గారడి యొక్క విషయమేమీ లేదు. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేయడానికే తండ్రి వస్తారు.

మనమే సుఖధామం యొక్క దేవతలుగా ఉండేవారము, సతోప్రధానంగా ఉండేవారము అని మీకు తెలుసు. ప్రతి ఒక్కరూ సతోప్రధానం నుండి తమోప్రధానంలోకి రావాల్సిందే. ఇక్కడ కూర్చొన్నప్పుడు పిల్లలకు ఇంకా ఆనందం కలగాలి, స్మృతి కలగాలి. తండ్రినే ప్రపంచమంతా స్మృతి చేస్తుంది - ఓ ముక్తిదాత, మార్గదర్శకుడా, ఓ పతితపావనా రండి అని పిలుస్తారు. రావణ రాజ్యంలో ఉన్నప్పుడే వారిని పిలుస్తారు, సత్యయుగంలో పిలవరు. ఇవి చాలా సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇవి ఎవరు వినిపించారు? తండ్రిని కూడా మహిమ చేస్తారు, టీచరు, సద్గురువు యొక్క మహిమను కూడా చేస్తారు - ముగ్గురూ ఒక్కరేనని మీ బుద్ధిలో ఉంది. వీరు తండ్రి, టీచరు మరియు సద్గురువు కూడా. పతితులను పావనంగా తయారుచేయడమే శివబాబా వ్యాపారము. పతితులు తప్పకుండా దుఃఖితులుగా ఉంటారు. సతోప్రధానంగా ఉన్నవారు సుఖంగా, తమోప్రధానంగా ఉన్నవారు దుఃఖితులుగా ఉంటారు. ఈ దేవతలది ఎంత సతోగుణీ స్వభావము. ఇక్కడి మనుష్యులది కలియుగీ తమోగుణీ స్వభావము. ఇకపోతే, మనుష్యులు నంబరువారుగా మంచివారిగా లేక చెడ్డవారిగా ఉంటారు. సత్యయుగంలో ఎప్పుడూ - వీరు చెడ్డవారు, వీరు ఇలాంటివారు అని అనరు. అక్కడ చెడు లక్షణాలేవీ ఉండవు. అది దైవీ సంప్రదాయము. అయితే, షావుకార్లు మరియు పేదవారు ఉండవచ్చు. అంతేకానీ అక్కడ ఇది మంచి గుణం లేక చెడు గుణం అని పోల్చడానికి ఏమీ ఉండదు, అందరూ సుఖంగా ఉంటారు. దుఃఖము అన్న మాటే ఉండదు. దాని పేరే సుఖధామము. కావున పిల్లలు తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకునే పురుషార్థం చేయాలి. మీ చిత్రాన్ని మరియు లక్ష్మీనారాయణుల చిత్రాన్ని కూడా పెట్టుకోవచ్చు. వీరికి నేర్పించేవారు ఎవరో ఉన్నారని అంటారు. ఇది భగవానువాచ కదా. భగవంతునికి తమకంటూ శరీరమేమీ లేదు. వారు వచ్చి లోన్ గా తీసుకుంటారు. భగీరథుని గురించి చెప్తూ ఉంటారు, అంటే వారు తప్పకుండా రథంపై విరాజమానమై ఉన్నారు. వారు నందిపైన ఏమీ విరాజమానమవ్వరు. శివుడిని మరియు శంకరుడిని కలిపేసారు, అందుకే నందిని చూపించారు. కనుక తండ్రి అంటారు - మనం తండ్రికి చెందినవారిగా అయ్యామని మీకు ఎంత సంతోషముండాలి. మీరు నా వారు అని కూడా తండ్రి అంటారు. తండ్రికి పదవిని పొందాలనే సంతోషం లేదు. టీచరు అయితే టీచరే, వారు చదివించాలి. తండ్రి అంటారు - పిల్లలూ, నేను సుఖ సాగరుడిని, నేను మిమ్మల్ని దత్తత తీసుకున్నాను కనుక ఇప్పుడు మీకు అతీంద్రియ సుఖం అనుభవమవుతుంది. దత్తత అయితే అనేక రకాలుగా ఉంటుంది. పురుషుడు కూడా కన్యను దత్తత తీసుకుంటారు. ఆ కన్య అతడిని - వీరు నా పతి అని భావిస్తారు. శివబాబా మమ్మల్ని దత్తత తీసుకున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ప్రపంచంలోని వారికి ఈ విషయాలు అర్థం కావు. వారి దృష్టిలో దత్తత అనగా పరస్పరంలో కామఖడ్గాన్ని ఉపయోగించడము. ఎవరైనా రాజు ఒక బిడ్డను దత్తత తీసుకున్నారనుకోండి, అది అల్పకాలిక సుఖం కోసం దత్తత తీసుకున్నట్లు అవుతుంది. సన్యాసులు కూడా దత్తత తీసుకుంటారు కదా. వీరు మా గురువు అని మనుష్యులంటే, వీరు మా ఫాలోవర్స్ అని గురువు అంటారు. ఎన్ని రకాలుగా దత్తత తీసుకుంటారు. తండ్రి పిల్లలను దత్తత తీసుకుంటారు, వారికి సుఖాన్ని ఇస్తారు కానీ తర్వాత వివాహం చేయించి దుఃఖ వారసత్వాన్ని ఇస్తారు. ఈ గురువు తీసుకునే దత్తత ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంది. ఆత్మలను తమవారిగా చేసుకునేందుకు ఇది ఈశ్వరుని దత్తత. ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని రకాల దత్తతలను చూసారు. సన్యాసులకు చెందినవారిగా ఉన్నప్పటికీ - ఓ పతిత పావనా రండి, వచ్చి మమ్మల్ని దత్తత తీసుకుని పావనంగా తయారుచేయండి అని పాడుతూ ఉంటారు. మనమందరము సోదరులము కానీ, వారు వచ్చి తమవారిగా చేసుకున్నప్పుడే కదా సోదరులుగా అవుతాము. బాబా, మేము దుఃఖితులుగా అయిపోయామని అంటారు. రావణ రాజ్యం యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోరు. దిష్టి బొమ్మను తయారుచేసి కాలుస్తూ ఉంటారు. ఎవరైనా దుఃఖం కలిగిస్తే వారిపై కేసు పెట్టాలని అనుకుంటారు. కానీ రావణుడు ఎప్పటి నుండి శత్రువుగా అయ్యాడు? చివరికి ఈ శత్రువు మరణిస్తాడా లేదా? ఈ శత్రువు గురించి మీకు మాత్రమే తెలుసు. ఈ శత్రువుపై విజయం పొందేందుకు మిమ్మల్ని దత్తత తీసుకోవడం జరుగుతుంది. వినాశనం జరగనున్నదని కూడా పిల్లలైన మీకు తెలుసు, అటామిక్ బాంబులు కూడా తయారై ఉన్నాయి. ఈ జ్ఞాన యజ్ఞం ద్వారానే వినాశ జ్వాల వెలువడింది. రావణునిపై విజయం పొంది, తర్వాత కొత్త సృష్టిపై రాజ్యం చేస్తామని ఇప్పుడు మీకు తెలుసు. మిగిలినదంతా ఒక బొమ్మలాట వంటిది. రావణుని బొమ్మ చాలా ఖర్చు చేయిస్తుంది. మనుష్యులు చాలా ధనాన్ని వ్యర్థంగా పోగొట్టుకుంటారు. ఎంతగా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. వారు భ్రమిస్తూ, దుఃఖితులు అవుతారు, ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. ఇప్పుడు మనం శ్రీమతాన్ని అనుసరిస్తూ, శ్రేష్ఠాచారీ సత్యయుగీ స్వరాజ్యాన్ని పొందుతున్నాము. సత్యయుగాన్ని స్థాపన చేసేవారు శ్రేష్ఠాతి-శ్రేష్ఠమైన శివబాబా. మనల్ని శ్రేష్ఠమైన దేవతలుగా, విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. శ్రీ శ్రీ శివబాబా మనల్ని శ్రీ (శ్రేష్ఠంగా) గా తయారుచేస్తారు. శ్రీ శ్రీ అని కేవలం ఒక్కరిని మాత్రమే అంటారు. దేవతలను శ్రీ అని అంటారు, ఎందుకంటే వీరు పునర్జన్మలలోకి వస్తారు కదా. వాస్తవానికి శ్రీ అని వికారీ రాజులను అనలేరు.

ఇప్పుడు మీ బుద్ధి ఎంత విశాలంగా ఉండాలి. మనం ఈ చదువు ద్వారా డబల్ కిరీటధారులుగా అవుతామని మీకు తెలుసు. మనమే ఒకప్పుడు డబల్ కిరీటధారులుగా ఉండేవారము. ఇప్పుడు సింగిల్ కిరీటం కూడా లేదు. పతితులుగా ఉన్నాము కదా. ఇక్కడ ఎవరికీ ప్రకాశ కిరీటాన్ని ఇవ్వలేము. ఈ చిత్రాలలో మీరు తపస్సులో కూర్చున్న చోట ప్రకాశ కిరీటాన్ని చూపించకూడదు. మీరు భవిష్యత్తులో డబల్ కిరీటధారులుగా తయారవ్వాలి. మనం బాబా ద్వారా డబల్ కిరీటధారులైన మహారాజా-మహారాణులుగా తయారయ్యేందుకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. ఈ సంతోషం ఉండాలి. శివబాబాను స్మృతి చేయాలి, అప్పుడు పతితుల నుండి పావనంగా తయారై స్వర్గానికి యజమానులుగా అయిపోతారు, ఇందులో కష్టం అనిపించే విషయమేమీ లేదు. ఇక్కడ మీరు విద్యార్థులై కూర్చొన్నారు. అక్కడ బయట మిత్ర-సంబంధీకులు మొదలైన వారి వద్దకు వెళ్ళడంతో విద్యార్థి జీవితాన్ని మర్చిపోతారు. అప్పుడు మిత్ర-సంబంధీకులు గుర్తుకొస్తారు. మాయ ఫోర్సు ఉంటుంది కదా. హాస్టల్ లో ఉంటే బాగా చదువుకుంటారు. బయటకు వెళ్తూ-వస్తూ ఉండడంతో సాంగత్య దోషం వలన పాడైపోతారు. ఇక్కడ నుండి బయటకు వెళ్తే, విద్యార్థి జీవితం యొక్క నషా మాయమైపోతుంది. చదివించే బ్రాహ్మణీలకు కూడా ఇక్కడ ఉంటే ఉన్నంత నషా, బయటకు వెళ్తే ఉండదు. ఇది మధుబన్, హెడ్ ఆఫీస్. ఇక్కడ విద్యార్థులు టీచరు ఎదురుగా ఉంటారు, ఇక్కడ లౌకిక కార్య వ్యవహారాలేవీ ఉండవు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంటుంది. కొంతమందైతే రోజంతటిలో అసలు శివబాబాను స్మృతి చేయరు. శివబాబాకు సహాయకులుగా తయారవ్వరు. శివబాబా పిల్లలుగా అయ్యారు కనుక సేవ చేయండి. ఒకవేళ సేవ చేయడం లేదు అంటే వారు కుపుత్రులు. బాబా అర్థం చేసుకుంటారు కదా. నన్ను స్మృతి చేయండి అని చెప్పడం బాబా బాధ్యత. ఫాలో చేస్తే చాలా-చాలా కళ్యాణం జరుగుతుంది. వికారీ సంబంధాలు భ్రష్టాచారిగా ఉన్నాయి. వారిని వదిలేస్తూ వెళ్ళండి, వారితో సాంగత్యం చేయకండి. తండ్రి అయితే అర్థం చేయిస్తారు కానీ వారి భాగ్యంలో ఉండాలి కదా. బాబా అంటారు - చార్టు పెట్టాలి, దీనితో కూడా చాలా కళ్యాణం జరుగుతుంది. కొంతమందైతే ఒక గంట కూడా కష్టం మీద స్మృతిలో ఉంటారు. అంతిమంలో 8 గంటలకు చేరుకోవాలి. మీరు కర్మయోగులు కదా. కొంతమందికి అప్పుడప్పుడు ఉత్సాహం కలుగుతుంది, అప్పుడు చార్టు పెడతారు. అది మంచిదే. తండ్రిని ఎంత స్మృతి చేస్తే, అంత లాభముంటుంది. ఎవరైతే అంతిమ సమయంలో నారాయణుడిని స్మరిస్తారో, వారు నారాయణ పదవిని పొందుతారు..... అని అంటూ ఉంటారు. ఈ నానుడిలో మళ్ళీ-మళ్ళీ అని ఎందుకంటారు? ఎవరైతే మంచి రీతిలో స్మృతి చేయరో, వారి జన్మ-జన్మల భారమేదైతే ఉందో, అది వారిని మళ్ళీ-మళ్ళీ జన్మ తీసుకునేలా చేసి, సాక్షాత్కారాలు కలిగిస్తుంది, తద్వారా శిక్ష లభిస్తుంది. ఉదాహరణకు కాశీలో కత్తుల బావిలోకి దూకిన వెంటనే వారికి వారి పాపాలు సాక్షాత్కారమవుతాయి. మేము పాపాలకు శిక్ష పొందుతున్నామని అనుభవం చేస్తారు. చాలా శిక్షలు అనుభవించేవారు ఉంటారు. బాబా సేవలో ఎవరైతే విఘ్నాలు కలిగిస్తారో, వారు శిక్షలకు యోగ్యులు. వారు తండ్రి సేవలో ఆటంకాలు కలిగిస్తారు. తండ్రికి రైట్ హ్యాండ్ ధర్మరాజు. తండ్రి అంటారు - మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోండి ఎందుకంటే మీరు తండ్రి స్మృతితోనే పావనంగా అవుతారు. లేదంటే పావనంగా అవ్వలేరు. తండ్రి అయితే ప్రతిజ్ఞ చేయిస్తారు. ఇకపోతే, చేయడం, చేయకపోవడం అనేది మీ ఇష్టము. ఎవరైతే చేస్తారో, వారు పొందుతారు. ప్రతిజ్ఞ చేసేవారు చాలా మంది ఉంటారు కానీ కొందరు మళ్ళీ చెడు పనులు చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో - నాకైతే ఒక్కరు తప్ప ఇతరులెవ్వరూ లేరని పాడుతూ ఉంటారు. కానీ, ఆత్మ ఆ విధంగా ఎందుకు పాడుతూ వచ్చిందని అనేది ఇప్పుడు మీ బుద్ధిలోకి వస్తుంది. నాకైతే ఒక్క గిరిధర గోపాలుడు తప్ప ఇంకెవ్వరూ లేరు..... అని రోజంతా పాడుతూ ఉంటారు. సంగమంలో తండ్రి వచ్చినప్పుడే ఇంటికి తీసుకువెళ్తారు. మీరు కృష్ణపురిలోకి వెళ్ళేందుకు చదువుకుంటారు కదా. రాకుమారుల కాలేజ్ ఉంటుంది, అక్కడ రాకుమారులు, రాకుమార్తెలు చదువుకుంటారు. అది హద్దు విషయము. వారైతే అప్పుడప్పుడు అనారోగ్యం పాలవుతారు, మరణించవచ్చు కూడా. ఇది రాకుమార-రాకుమారీలుగా తయారయ్యే గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. ఇది రాజయోగం కదా. మీరు నరుని నుండి నారాయణునిగా తయారవుతారు. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుని సత్యయుగ రాకుమార-రాకుమారీలుగా అవుతారు. తండ్రి ఎంతటి ఆనందం కలిగించే విషయాలను వినిపిస్తారు కానీ ఇవి గుర్తుండాలి కదా. కొంతమంది ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే చిక్కుకుపోతారు. తండ్రిని స్మృతి చేయడం కూడా నంబరువారుగా చేస్తారు. ఎవరైతే ఎక్కువ స్మృతి చేస్తూ ఉంటారో, వారు ఇతరుల చేత కూడా స్మృతి చేయిస్తూ ఉంటారు. అనేకుల కళ్యాణాన్ని ఎలా చేయాలి అన్నదే బుద్ధిలో ఉండాలి. బయట ఉన్నవారు ప్రజలకు దాస-దాసీలుగా అవుతారు, ఇక్కడున్నవారు రాజులకు దాస-దాసీలుగా అవుతారు. మున్ముందు అన్నీ సాక్షాత్కారమవుతూ ఉంటాయి. నిజంగా మేము పూర్తి పురుషార్థం చేయలేదు అని మీరు కూడా అనుకుంటారు. చాలా చమత్కారాలు చూస్తారు. ఎవరైతే మంచి రీతిలో చదువుకుంటారో, వారే నవాబులుగా అవుతారు. తండ్రి ఎంతగా చెప్తూ ఉంటారు - సెంటర్లకు ప్రదర్శనీ చిత్రాలను ఇస్తాను, వాటిని పిల్లలకు నేర్పించి తెలివైనవారిగా తయారుచేయండి. అప్పుడు బి.కె.లకు సేవ చేయడం తెలుసు అని బాబా అనుకుంటారు. సేవ చేస్తే ఉన్నత పదవిని పొందుతారు. అందుకే బాబా ప్రదర్శనీలు తయారుచేయడానికి ప్రాముఖ్యతనిస్తున్నారు. ఈ చిత్రాలను తయారుచేయడం అనేది చాలా సాధారణమైన విషయము. ధైర్యం చేసి ప్రదర్శనీ చిత్రాలను తయారుచేయడంలో సహాయం చేయాలి, అప్పుడు పిల్లలకు అర్థం చేయించడం సులభమవుతుంది. టీచర్లు, మేనేజర్లు చల్లబడిపోయారని బాబా అర్థం చేసుకుంటారు. కొంతమంది బ్రాహ్మణీలు మేనేజర్లుగా అవుతారు, అప్పుడు వారికి దేహాభిమానం వచ్చేస్తుంది. తమను తాము అన్నీ తెలిసినవారిగా భావిస్తారు. మేము చాలా బాగా నడుచుకుంటున్నామని భావిస్తారు. కానీ వారి గురించి ఇతరులను అడిగితే 10 విషయాలు వినిపిస్తారు. మాయ పెద్ద చక్రంలో వేసేస్తుంది. పిల్లలు ఎల్లప్పుడూ సేవలోనే నిమగ్నమై ఉండాలి. తండ్రి దయాహృదయుడు, దుఃఖహర్త-సుఖకర్త కనుక పిల్లలు కూడా అలా తయారవ్వాలి. కేవలం తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయిపోతారు అని తండ్రి అంటారు. ఇది ఎంత సహజము. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే పతితుల నుండి పావనంగా తయారై, మీరు శాంతిధామం, సుఖధామానికి వెళ్తారు. వారికి నిశ్చయం ఏర్పడితే వెంటనే రాయించాలి. బ్రహ్మాకుమార-కుమారీలు నిజంగా శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారని రాస్తారు కూడా. టువంటి తండ్రికి చెందినవారిగా తప్పకుండా అవ్వాలని అర్థం చేసుకుంటారు. వారి శరణు తీసుకోవాలి. మీరు తండ్రి శరణులోకి వచ్చారు కదా అనగా తండ్రి ఒడిలోకి వచ్చారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సమానంగా దయా హృదయులుగా, దుఃఖహర్త-సుఖకర్తగా తయారవ్వాలి.

2. సాంగత్య దోషం నుండి తమను తాము చాలా-చాలా సంభాళించుకోవాలి. ఒక్క తండ్రినే ఫాలో చేయాలి. అనేకుల కళ్యాణం చేసే సేవను చేయాలి. ఎప్పుడూ అహంకారంలోకి వచ్చి నాకు అంతా తెలుసు అని అనుకోకూడదు.

వరదానము:-

సంకల్పాల సూచనలతో మొత్తం కార్యవ్యవహారమంతా నడిపించే సదా ప్రకాశ కిరీటధారీ భవ

ఏ పిల్లలైతే సదా లైట్ గా ఉంటారో, వారి సంకల్పాలు మరియు సమయం ఎప్పుడూ వ్యర్థమవ్వవు. ఏదైతే జరిగేది ఉంటుందో, ఆ సంకల్పాలే ఉత్పన్నమవుతాయి. ఎలాగైతే మాటలతో విషయాన్ని స్పష్టం చేస్తారో, అదే విధంగా సంకల్పాల ద్వారా మొత్తం కార్యవ్యవహారమంతా నడుస్తుంది. ఎప్పుడైతే ఇటువంటి విధిని తమదిగా చేసుకుంటారో, అప్పుడు ఈ సాకార వతనం సూక్ష్మవతనంగా అవుతుంది. దీనికోసం సైలెన్స్ శక్తిని జమ చేసుకోండి మరియు ప్రకాశ కిరీటధారులుగా ఉండండి.

స్లోగన్:-

ఈ దుఃఖధామం నుండి దూరంగా ఉన్నట్లయితే దుఃఖపు అలలు ఎప్పటికీ రాలేవు.