15-02-2020 ప్రాత:మురళిఓంశాంతి"బాప్దాదా" మధువనం


'మధురమైన పిల్లలారా - ఆత్మ రూపి జ్యోతిలో జ్ఞాన-యోగాల నెయ్యి వేస్తూ ఉంటే, జ్యోతి వెలుగుతూ ఉంటుంది. జ్ఞాన - యోగాలకు గల తేడాను బాగా అర్థము చేసుకోవాలి ''

ప్రశ్న:-

తండ్రి చేయు కర్తవ్యము ప్రేరణ ద్వారా జరగదు, వారు ఇక్కడకు తప్పక రావలసే వచ్చింది, ఎందుకు ?

జవాబు:-

ఎందుకంటే మానవుల బుద్ధి పూర్తిగా తమోప్రధానంగా ఉంది. తమోప్రధానమైన బుద్ధి ప్రేరణను గ్రహించజాలదు. తండ్రి రానే వస్తారు కనుకనే ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి!...................అని అంటారు.

గీతము:-

ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి,..............( ఛోడ్ భీ దే ఆకాశ్ సింహాసన్,..............)

ఓంశాంతి.

భక్తులు ఈ పాటను తయారు చేశారు. ఇప్పుడు దీని అర్థము ఎంత బాగుంది. ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి అని అంటారు. ఇది ఆకాశము. ఆకాశమంటే ఉండే స్థానము. ఆకాశము నుండి అయితే ఏ వస్తువూ రాదు. ఆకాశ సింహాసనమని అంటారు. ఆకాశ తత్వములో అయితే మీరు ఉంటారు. తండ్రి మహాతత్వములో ఉంటారు. దానిని బ్రహ్మతత్వము లేక మహాతత్వము అని అంటారు. అక్కడ ఆత్మలు నివసిస్తాయి. తండ్రి అక్కడి నుండే వస్తారు. ఎవరో ఒకరు వస్తారు కదా. మీరు వచ్చి మా జ్యోతిని వెలిగించండి అని అంటారు. గాయనము కూడా ఉంది............. ఒకటి గుడ్డి వారి సంతానము గుడ్డివారు, రెండవది - నేత్రవంతుల సంతానము నేత్రవంతులు. ధృతరాష్ట్రుడు, యుధిష్ఠరుడు అనే పేర్లు చూపిస్తారు. ఇప్పుడు అందరూ రావణుని సంతానము. రావణుడంటే మాయ కదా. అందరి బుద్ధి రావణ బుద్ధిగా ఉంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ బుద్ధి గలవారు. తండ్రి ఇప్పుడు మీ బుద్ధికి వేయబడిన తాళాన్ని తెరుస్తున్నారు. రావణుడు బుద్ధికి తాళము వేస్తాడు. ఎవరైనా ఏదైనా అర్థము చేసుకోలేకుంటే వారిని రాతి బుద్ధి గలవారని అంటారు. తండ్రి ఇక్కడకు వచ్చి జ్యోతి వెలిగిస్తారు కదా. ప్రేరణ ద్వారా పని జరగదు. సతోప్రధానంగా ఉండిన ఆత్మలోని శక్తి ఇప్పుడు తగ్గిపోయింది, తమోప్రధానమైపోయింది. పూర్తి మసకబారిపోయారు. మనుష్యులు ఎవరైనా మరణిస్తే దీపము వెలిగిస్తారు, ఎందుకు వెలిగిస్తారు? జ్యోతి ఆరిపోయినందున అంధకారము అవ్వకుండా ఉండాలని జ్యోతిని వెలిగిస్తారు. కానీ ఇక్కడ జ్యోతి వెలిగించడం వలన అక్కడ వెలుగు ఎలా ఉంటుంది? కొంచెం కూడా అర్థము చేసుకోరు. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అవుతారు. తండ్రి చెప్తున్నారు - నేను మిమ్ములను స్వచ్ఛ బుద్ధి గలవారిగా చేస్తున్నాను. జ్ఞానమనే నెయ్యి వేెస్తున్నాను. ఇవన్నీ అర్థము చేయించే విషయాలు. జ్ఞాన యోగాలు వేరు వేరు. యోగమును జ్ఞానమని అనరు. భగవంతుడు వచ్చి నన్ను స్మృతి చేయమని, జ్ఞానమిచ్చారని కొంతమంది అంటారు. కానీ వాస్తవానికి జ్ఞానమంటే ఇది కాదు. ఇది తండ్రి, పిల్లల విషయము. వీరు మా తండ్రి అని పిల్లలకు తెలుసు. ఇందులో జ్ఞానముందని అనరు. జ్ఞానమైతే చాలా విస్తారంగా ఉంది. ఇది కేవలం స్మృతి చేయడమే. తండ్రి నన్ను స్మృతి చేయండి చాలు అని చెప్తున్నారు. ఇది సాధారణ(జశీఎఎశీఅ) విషయము. దీనిని జ్ఞానమని అనరు. పుత్రుడు జన్మించాడంటే తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తాడు కదా. జ్ఞానము విస్తారంగా ఉంది. తండ్రి - నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు. ఇది జ్ఞానము కాదు. మేము ఆత్మలము, మా తండ్రి పరమ-ఆత్మ పరమాత్మ అని మీకు తెలుసు. దీనిని జ్ఞానమని అంటారా? తండ్రిని పిలుస్తారు. జ్ఞానమంటే నాలెడ్జ్(సఅశీషశ్రీవసస్త్రవ). కొందరు బి.ఏ, ఎమ్.ఎ,.......... చదువుతారు, ఎన్ని పుస్తకాలు చదవవలసి ఉంటుంది. ఇప్పుడు మీరంతా నా పిల్లలు కదా, నేను మీ తండ్రిని నాతోనే యోగము చేయండి అనగా నన్నే స్మృతి చేయండి అని బాబా చెప్తారు, దీనిని జ్ఞానమని అనరు. మీరంతా నా పిల్లలే. ఆత్మలైన మీకు నాశనము లేదు. ఎవరైనా మరణిస్తే వారి ఆత్మను పిలుస్తారు. ఇప్పుడు ఆ శరీరము సమాప్తమైపోయింది. ఆత్మ భోజనమెలా తింటుంది? భోజనమేమో బ్రాహ్మణులు తింటారు. కానీ ఇవన్నీ భక్తిమార్గములోని సంప్రదాయాలు. అలాగని మనము చెప్పినందున ఆ భక్తి మార్గము సమాప్తమైపోతుందని కాదు. అది కొనసాగుతూనే వస్తుంది. అయితే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటుంది.

పిల్లల బుద్ధిలో జ్ఞాన-యోగాల వ్యత్యాసము స్పష్టంగా ఉండాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్పింది జ్ఞానము కాదు. ఇది తండ్రి ఇచ్చే ఆదేశము. దీనిని యోగమని అంటారు. సృష్టిచక్రము ఎలా తిరుగుతుందో తెలుసుకోవడాన్ని జ్ఞానమని అంటారు. యోగము అనగా స్మృతి. తండ్రిని స్మృతి చేయడం పిల్లల కర్తవ్యము. అది లౌకికము, ఇది పారలౌకికము. 'నన్ను స్మృతి చేయమని' తండ్రి చెప్తున్నారు. ఇందులో జ్ఞానము లేదు. కనుక జ్ఞానము వేరు. తండ్రిని స్మృతి చేయమని పిల్లలకు చెప్పాలా? జన్మిస్తూనే లౌకిక తండ్రి గుర్తుంటాడు. ఇక్కడ తండ్రి స్మృతిని ఇప్పించాల్సి వస్తుంది. ఇందులో శ్రమ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి - ఇది చాలా శ్రమతో కూడిన పని. అందుకే యోగములో నిలువలేరని తండ్రి చెప్తున్నారు. ''బాబా, మీ స్మృతిని మర్చిపోతాము'' అని పిల్లలు వ్రాస్తారు. జ్ఞానాన్ని మర్చిపోతామని అనరు. జ్ఞానమైతే చాలా సులభము. స్మృతిని జ్ఞానమని అనరు. ఇందులో మాయా తుఫానులు చాలా వస్తాయి. భలే జ్ఞానములో చాలామంది తీవ్రంగా ఉంటారు. మురళి కూడా చాలా బాగా చదువుతారు. కాని స్మృతి చార్టులో ఎంత సమయం స్మృతి చేశారు? బాబాను స్మృతి చేయు యదార్థమైన చార్టు తయారు చేసి చూపండి. ముఖ్యమైనది స్మృతియే. వచ్చి పావనంగా చేయమని పిలిచేది పతితులే. ముఖ్యమైనది పావనంగా అయ్యే విషయము. ఇందులోనే మాయ విఘ్నాలు కలుగజేస్తుంది. శివభగవానువాచ - స్మృతిలో ఒక్కరు కూడా పక్వము కాలేదు. అందరూ అపరిపక్వము(కచ్చా)గానే ఉన్నారు. మంచి మంచి పిల్లలు మురళి బాగా చెప్తారు కాని స్మృతిలో చాలా బలహీనంగా ఉన్నారు. యోగము ద్వారానే వికర్మలు వినాశమౌతాయి. యోగము ద్వారానే కర్మేంద్రియాలు పూర్తిగా శాంతిస్తాయి. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఏ దేహమూ గుర్తు రాకూడదు. ఈ ప్రపంచమంతా సమాప్తమవుతుందని ఆత్మకు తెలుసు. మనమిప్పుడు మన ఇంటికి వెళ్ళి మళ్లీ రాజధానిలోకి వస్తాము. ఇది సదా బుద్ధిలో ఉండాలి. లభించిన జ్ఞానము ఆత్మలో ఉండాలి. తండ్రి యోగేశ్వరుడు. వారు స్మృతి చేయడం నేర్పిస్తారు. వాస్తవానికి ఈశ్వరుని యోగేశ్వరుడని అనరు. యోగేశ్వరులు మీరే. ఈశ్వరుడైన తండ్రి నన్ను స్మృతి చేయమని చెప్తున్నారు. ఈ స్మృతిని నేర్పించేవారు తండ్రి అయిన ఈశ్వరుడు. ఆ నిరాకార తండ్రి శరీరము ద్వారా వినిపిస్తారు. పిల్లలు కూడా శరీరము ద్వారా వింటారు. చాలామంది యోగములో చాలా కచ్ఛాగా ఉన్నారు. అస్సలు స్మృతే చేయని పిల్లలు చాలామంది ఉన్నారు. జన్మ-జన్మాంతరాల పాపాలన్నిటి శిక్షలు అనుభవిస్తారు. ఇక్కడకు వచ్చిన తర్వాత పాపాలు చేస్తే 100 రెట్లు శిక్షలను అనుభవిస్తారు. జ్ఞాన మాటలు చాలా ఎక్కువగా మాట్లాడ్తారు. కానీ యోగము పూర్తిగా లేనందున పాపాలు భస్మమవ్వవు. అపరిపక్వముగానే ఉండిపోతారు. అందుకే సత్య - సత్యమైన మాల 8 మందిది మాత్రమే తయారయింది. నవరత్నాలు గాయనము చేయబడ్తాయి. 108 రత్నముల గురించి ఎప్పుడైనా విన్నారా? 108 రత్నాలతో ఏ వస్తువునూ తయారు చేయరు. చాలామంది ఈ విషయాలను పూర్తిగా అర్థము చేసుకోలేరు. స్మృతిని జ్ఞానమని అనరు. సృష్టి చక్రమును జ్ఞానమని అంటారు. శాస్త్రాలలో జ్ఞానము లేదు. అవి భక్తిమార్గపు శాస్త్రాలు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను ఈ శాస్త్రాల ద్వారా లభించను. సాధువులు మొదలైన వారినందరిని ఉద్ధరించేందుకు నేనే వస్తాను. బ్రహ్మలో లీనమవ్వాలని వారు అనుకుంటారు. అంతేకాక నీటి బుడగను ఉదాహరణంగా ఇస్తారు. ఇప్పుడు మీరు ఇలా అనరు. మనమంతా ఆత్మలమని, తండ్రి పిల్లలమని మీకు తెలుసు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని కూడా అంటారు. కాని అర్థము తెలియదు. భలే మేము ఆత్మలమని అంటారు కానీ ఆత్మ ఏమిటో, పరమాత్మ ఏమిటో ఎవ్వరికీ జ్ఞానము బొత్తిగా లేదు. ఆ తండ్రే వచ్చి ఇదంతా వినిపిస్తారు. అది ఆత్మలమైన మన ఇల్లు అని మీకు తెలుసు. అక్కడ వంశమంతా ఉంది. ప్రతి ఆత్మకు తమ-తమ పాత్ర లభించే ఉంది. సుఖమునిచ్చేదెవరు? దు:ఖమునిచ్చేదెవరు? ఈ విషయాలు కూడా ఎవ్వరికీ తెలియదు.

భక్తిని రాత్రి అని అంటారు, జ్ఞానాన్ని పగలని అంటారు. మీరు 63 జన్మలు మోసపోయారు. ఎదురుదెబ్బలు తిన్నారు. తర్వాత నేను జ్ఞానమిస్తాను. ఎంత సమయము పడ్తుంది? ఒక సెకండు. ఒక్క సెకెండులో జీవన్ముక్తి అని మహిమ ఉంది. వీరు మీ తండ్రి కదా, వారే పతితపావనులు. వారిని స్మృతి చేస్తే మీరు పావనమైపోతారు. సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలు కలిసి ఒక చక్రమని అంటారు. పేర్లు కూడా తెలుసు కాని దీని సమయమెంతో రాతిబుద్ధి గల వారైనందున ఎవ్వరికీ తెలియదు. ఇది ఘోరమైన కలియుగమని కూడా అర్థము చేసుకుంటారు. ఈ కలియుగము ఇంకా ఇలాగే కొనసాగితే ఇంకా గాఢాంధకారమవుతుంది. అందుకే కుంభకర్ణుని నిద్రలో నిదురిస్తూ ఉండినారని, వినాశనము జరిగిపోయిందని గాయనముంది. జ్ఞానము కొద్దిగా విన్నా ప్రజలుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులెక్కడ? ప్రజలెక్కడ? చదివించేవారేమో ఒక్కరే. ప్రతి ఒక్కరికి వారి వారి అదృష్టము వేరుగా ఉంటుంది. కొంతమంది స్కాలర్షిప్ తీసుకుంటారు. కొంతమంది ఫెయిల్ అవుతారు. రామునికి గుర్తుగా బాణము ఎందుకిచ్చారు? ఎందుకంటే పాస్ అవ్వలేదు. ఇది కూడా ఒక గీతాపాఠశాల. కొంతమంది కొన్ని మార్కులు తీసుకునేందుకు కూడా అర్హులుగా లేరు. నేను ఆత్మ ఒక బిందువును, తండ్రి కూడా ఒక బిందువే. ఈ విధంగా వారిని స్మృతి చేయాలి. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని వారు ఏ పదవి పొందుతారు? స్మృతి చేయనందున చాలా నష్టపోతారు. స్మృతి బలము చాలా అద్భుతాలు చేస్తుంది. కర్మేంద్రియాలు పూర్తిగా శాంతించి శీతలమైపోతాయి. జ్ఞానము వలన శాంతించవు. యోగబలముతో శాంతిస్తాయి. మీరు వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపించమని భారతవాసులు పిలుస్తారు. అయితే ఇప్పుడు వచ్చేదెవరు? కృష్ణుని ఆత్మ ఏమో ఇక్కడే ఉంది. సింహాసనము పై ఎవ్వరూ కూర్చొని లేరు. వారినెలా పిలుస్తారు? మేము ఏసుక్రీస్తు ఆత్మను స్మృతి చేస్తున్నామని ఎవరైనా అంటే, ఏసుక్రీస్తు ఆత్మ కూడా ఇక్కడే ఉందని చెప్పండి. ఏసుక్రీస్తు ఆత్మ ఇక్కడే ఉందని వారికి తెలియదు, వాపసు ఇంటికి వెళ్లలేదు. మొదటి నంబరులో ఉన్న లక్ష్మీనారాయణులే పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు. కనుక వారే వెళ్ళలేదంటే, ఇతరులు వాపస్ ఎలా వెళ్తారు? అదంతా లెక్కాచారముంది కదా. మానవులు చెప్పేదంతా అసత్యము. అర్ధకల్పము అసత్య ఖండము, అర్ధ కల్పము సత్య ఖండము. ఇప్పుడందరూ నరకవాసులుగా ఉన్నారని ప్రతి ఒక్కరికి అర్థం చేయించాలి. మళ్లీ భారతవాసులే స్వర్గవాసులుగా అవుతారు. మనుష్యులు ఎన్నో వేదశాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైనవి చదువుతూనే ఉంటారు. దీని వలన ముక్తి లభిస్తుందా? క్రిందికి తప్పకుండా దిగాల్సిందే, ప్రతి వస్తువు సతో, రజో, తమోలో తప్పకుండా వస్తుంది. నూతన ప్రపంచమని దేనినంటారో ఎవ్వరికీ తెలియదు. తండ్రి సన్ముఖంలో కూర్చొని ఇదంతా అర్థం చేయిస్తున్నారు. దేవీ దేవతా ధర్మము ఎప్పుడు, ఎవరు స్థాపించారో భారతవాసులకు తెలియనే తెలియదు. కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు - జ్ఞానము ఎంత బాగున్నా చాలామంది పిల్లలు యోగములో పాస్ అవ్వలేకున్నారు. యోగము లేకుంటే వికర్మలు వినాశనమవ్వవు. ఉన్నత పదవి పొందలేరు. యోగములో మస్త్గా ఉన్నవారే ఉన్నతపదవి పొందుతారు. వారి కర్మేంద్రియాలు పూర్తిగా శీతలమైపోతాయి, దేహ సహితం సర్వమూ మరచి దేహీ-అభినమానులుగా అవుతారు. మనము అశరీరులము. ఇప్పుడు ఇంటికి వెళ్తాము. లేస్తూ, కూర్చుంటూ, ఇప్పుడు ఈ శరీరాన్ని వదలాలని భావించండి. మనము పాత్రను అభినయించాలి. ఇప్పుడు ఇంటికి వెళ్తాము. జ్ఞానమేమో లభించింది. తండ్రిలో జ్ఞానముంది. వారు ఎవ్వరినీ స్మృతి చేసే పని లేదు. పిల్లలైన మీరు స్మృతి చేయాలి. తండ్రిని జ్ఞానసాగరులని అంటారు. యోగసాగరులని అనరు కదా. చక్ర జ్ఞానాన్ని వినిపిస్తారు. తన పరిచయాన్ని కూడా ఇస్తారు. స్మృతిని జ్ఞానమని అనరు. పిల్లలకు దానంతకదే స్మృతి వస్తుంది. స్మృతి చేసే తీరాలి. చేయకుంటే వారసత్వమెలా లభిస్తుంది? తండ్రి అయినందున వారసత్వము తప్పకుండా లభిస్తుంది. ఇక మిగిలింది జ్ఞానము. మనము 84 జన్మలెలా తీసుకున్నాము? తమోప్రధానము నుండి సతోప్రధానంగా మళ్లీ సతోప్రధానము నుండి తమోప్రధానంగా ఎలా అవుతామో తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు తండ్రి స్మృతి ద్వారా సతోప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు ఆత్మిక పిల్లలైన మీరు ఆత్మిక తండ్రి వద్దకు వచ్చారు. వారికి శరీరము ఆధారము కావాలి కదా? నేను వృద్ధ శరీరములో ప్రవేశిస్తానని వారంటారు. అది కూడా వానప్రస్థ సమయములో. తండ్రి వచ్చినప్పుడు సృష్టి అంతటికి కళ్యాణమవుతుంది. ఇది భాగ్యశాలి రథము. ఇతని ద్వారా చాలా సర్వీసు జరుగుతుంది. శరీర భావమును వదిలేందుకు స్మృతి చేయాలి. ఇందులో జ్ఞాన విషయమే లేదు. ఎక్కువగా స్మృతి నేర్పించాలి. జ్ఞానమేమో చాలా సులభము. చిన్నపిల్లలు కూడా వినిపిస్తారు. పోతే స్మృతిలోనే శ్రమ ఉంది. ఒక్కరి స్మృతే ఉండాలి. దీనినే అవ్యభిచారి స్మృతి అని అంటారు. ఎవరి శరీరాన్ని స్మృతి చేసినా అది వ్యభిచార స్మృతి అవుతుంది. స్మృతి ద్వారా అందరినీ మరచి అశరీరులుగా అవ్వాలి. మంచిది.

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్మృతి బలము ద్వారా మీ కర్మేంద్రియాలను శీతలంగా, శాంతిగా చేసుకోవాలి. పూర్తిగా పాస్ అయ్యేందుకు యధార్థంగా తండ్రిని స్మృతి చేసి పావనంగా అవ్వాలి.

2. కూర్చుంటూ - లేస్తూ, ఇప్పుడు పాత శరీరాన్ని వదిలి ఇంటికి వాపస్ వెళ్తామని బుద్ధిలో ఉండాలి. తండ్రిలో ఎలాగైతే సంపూర్ణ జ్ఞానముందో, అలా మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగరులుగా అవ్వాలి.

వరదానము:-

'' ఇనుము సమానంగా(అపవిత్రంగా) ఉన్న ఆత్మను పారసంగా(పవిత్రంగా) చేసే మాస్టర్ పారసనాథ్ భవ ''

మీరంతా పారసనాథ్ తండ్రి పిల్లలైన మాస్టర్ పారసనాథులు. కనుక ఎటువంటి ఇనుము సమాన ఆత్మలైన మీ సాంగత్యము ద్వారా పారసంగా అవుతారు. వీరు ఇనుము వంటి వారని ఎప్పుడూ అనుకోకండి. పరశువేది పనే ఇనుమును బంగారుగా చేయడం. ఈ లక్ష్యము మరియు లక్షణాలను సదా స్మృతిలో ఉంచుకొని ప్రతి సంకల్పము, ప్రతి కర్మ చేయాలి. అప్పుడు ఆత్మనైన నా లైటు కిరణాలు అనేక ఆత్మలను బంగారుగా(పవిత్ర్రంగా) చేసే శక్తినిస్తున్నాయని అనుభవమవుతుంది.

స్లోగన్:-

'' ప్రతి కార్యాన్ని సాహసంతో చేస్తే అందరి గౌరవం ప్రాప్తి అవుతుంది. ''