15-10-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - కర్మలు చేస్తూ స్వయాన్ని ప్రేయసిగా భావిస్తూ ప్రియుడినైన నన్నొక్కడినే స్మృతి చేయండి, స్మృతితోనే మీరు పావనంగా తయారై పావన ప్రపంచంలోకి వెళ్తారు

ప్రశ్న:-

మహాభారత యుద్ధ సమయంలో పిల్లలైన మీకు తండ్రి నుండి ఏ ఆజ్ఞ లభించింది?

జవాబు:-

తండ్రి ఆజ్ఞ ఏమిటంటే - పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి. ఇప్పుడు తండ్రిని మరియు రాజధానిని స్మృతి చేయండి అని అందరికీ సందేశాన్ని ఇవ్వండి. తమ నడవడికను సరిదిద్దుకోండి. చాలా-చాలా మధురంగా అవ్వండి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. స్మృతిలో ఉండే అలవాటు చేసుకోండి మరియు స్వదర్శన చక్రధారులుగా అవ్వండి. అడుగులు ముందుకు వేసే పురుషార్థాన్ని చేయండి.

ఓంశాంతి.

పిల్లలు తండ్రి స్మృతిలో కూర్చున్నారు. అందరూ కూర్చొని, పిల్లలైన మేమంతా తండ్రి స్మృతిలో కూర్చున్నాము - అని చెప్పే సత్సంగం ఇంకేదీ ఉండదు. అటువంటి స్థానం ఇదొక్కటే. ఎప్పటివరకైతే జీవించి ఉంటారో, అప్పటి వరకు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అని బాబా డైరెక్షన్ ఇచ్చారని పిల్లలకు తెలుసు. ఓ పిల్లలూ, అని ఈ పారలౌకిక తండ్రి మాత్రమే అంటారు. పిల్లలందరూ వింటున్నారు. బాబా కేవలం పిల్లలైన మీకు మాత్రమే కాదు, అందరికీ చెప్తారు - పిల్లలూ, తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే మీ జన్మ-జన్మల పాపాలు ఏవైతే ఉన్నాయో, వేటి కారణంగానైతే తుప్పు పట్టిందో, అదంతా తొలగిపోతుంది మరియు మీ ఆత్మ సతోప్రధానంగా అవుతుంది. వాస్తవానికి మీ ఆత్మ సతోప్రధానంగానే ఉండేది, తర్వాత పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ తమోప్రధానంగా అయిపోయింది. ఈ మహావాక్యాలు తండ్రి తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. లౌకిక తండ్రికి ఇద్దరు లేక నలుగురు పిల్లలుంటారు. ఆ పిల్లలకు రామ-రామ అనండి లేక పతితపావన సీతా-రామ అనండి లేక శ్రీ కృష్ణుడిని స్మృతి చేయండి అని చెప్తారు. అంతేకానీ, ఓ పిల్లలూ, ఇప్పుడు తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని చెప్పరు. తండ్రి అయితే ఇంట్లోనే ఉంటారు, వారిని స్మృతి చేసే విషయమే లేదు. ఈ అనంతమైన తండ్రి జీవాత్మలకు చెప్తారు. ఆత్మలే తండ్రి ఎదురుగా కూర్చొని ఉన్నారు. ఆత్మల తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. 5 వేల సంవత్సరాల తర్వాత ఆత్మలు మరియు పరమాత్మ కలుసుకుంటారు. తండ్రి అంటారు - నేను కల్ప-కల్పము వచ్చి ఈ పాఠం నేర్పిస్తాను - ఓ పిల్లలూ, ఓ పతితపావనా రండి అని మీరు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. నేను తప్పకుండా వస్తాను. లేదంటే ఎప్పటివరకని స్మృతి చేస్తూ ఉంటారు? ఒక హద్దు అనేది తప్పకుండా ఉంటుంది కదా. కలియుగపు హద్దు ఎప్పుడు పూర్తవుతుంది అనేది మనుష్యులకు తెలియదు. ఈ విషయం కూడా తండ్రియే తెలియజేయవలసి ఉంటుంది. ఓ పిల్లలూ, నన్ను స్మృతి చేయండి అని తండ్రి తప్ప ఇంకెవ్వరూ చెప్పలేరు. ముఖ్యమైన విషయము స్మృతి. రచన యొక్క చక్రాన్ని స్మృతి చేయడమనేది పెద్ద విషయమేమీ కాదు. కేవలం తండ్రిని స్మృతి చేయడంలోనే శ్రమ అనిపిస్తుంది. తండ్రి అంటారు - అర్ధకల్పం భక్తి మార్గము, అర్ధకల్పం జ్ఞాన మార్గము. అర్ధకల్పం జ్ఞానం యొక్క ప్రారబ్ధాన్ని పొందారు. తర్వాత అర్ధకల్పం భక్తి యొక్క ప్రారబ్ధం ఉంటుంది. అది సుఖం యొక్క ప్రారబ్ధము, ఇది దుఃఖం యొక్క ప్రారబ్ధము. సుఖ-దుఃఖాల ఈ ఆట తయారుచేయబడింది. కొత్త ప్రపంచంలో సుఖం ఉంటుంది, పాత ప్రపంచంలో దుఃఖం ఉంటుంది. మనుష్యులకు ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. మా దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని అంటారు కూడా. అర్ధకల్పం రావణ రాజ్యం నడుస్తుంది. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ దుఃఖాన్ని తొలగించలేరు - అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. శారీరక వ్యాధులు మొదలైనవాటిని డాక్టర్లు నయం చేస్తారు కానీ అది అల్పకాలం కోసం మాత్రమే. ఇదైతే అర్ధకల్పం కోసం స్థిరంగా ఉంటుంది. కొత్త ప్రపంచాన్ని స్వర్గమని అంటారు. అక్కడ తప్పకుండా అందరూ సుఖమయంగా ఉంటారు. ఇకపోతే, మిగిలిన ఆత్మలన్నీ ఎక్కడ ఉంటాయి? ఈ ఆలోచన కూడా ఎవరికీ రాదు. ఇది కొత్త చదువు అని, చదివించేవారు కూడా కొత్తవారని మీకు తెలుసు. భగవానువాచ - నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను. సత్యయుగంలో ఒకే ధర్మముంటుంది అనేది వాస్తవము కావున తప్పకుండా మిగిలిన ధర్మాలన్నీ వినాశనమవుతాయి. కొత్త ప్రపంచం మరియు పాత ప్రపంచం అని వేటినంటారు, అలాగే సత్యయుగంలో ఎవరు ఉంటారు - ఈ విషయాలు కూడా ఇప్పుడు మీకు తెలుసు. సత్యయుగంలో ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం యొక్క రాజ్యముండేది. ఇది నిన్నటి విషయమే. ఇది 5 వేల సంవత్సరాల కథ. 5 వేల సంవత్సరాల క్రితం భారత్ లో ఈ దేవీ-దేవతల రాజ్యముండేదని తండ్రి తెలియజేస్తారు. వారు 84 జన్మలను తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు పతితులుగా అయ్యారు. అందుకే, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారుచేయండి అని ఇప్పుడు పిలుస్తారు. నిరాకారీ ప్రపంచంలోనైతే అంతా పావనాత్మలే ఉంటారు. తర్వాత కిందకు వచ్చి పాత్రను అభినయిస్తారు, అప్పుడు సతో, రజో, తమోలలోకి వస్తారు. సతోప్రధానులను నిర్వికారులని అంటారు. తమోప్రధానులు తమను తాము వికారులుగా చెప్పుకుంటారు. ఈ దేవీ-దేవతలు నిర్వికారులు, మేము వికారులము అని భావిస్తారు. అందుకే తండ్రి అంటారు - దేవతల పూజారులు ఎవరైతే ఉంటారో, వారికి ఈ జ్ఞానం వెంటనే బుద్ధిలో కూర్చుంటుంది ఎందుకంటే వారు దేవతా ధర్మానికి చెందినవారు. పూజ్యులుగా ఉన్న మనమే పూజారులుగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. క్రైస్తవులు క్రీస్తును పూజిస్తారు ఎందుకంటే వారు ఆ ధర్మానికి చెందినవారు. మీరు కూడా దేవతల పూజారులు కావున మీరు ఆ ధర్మానికి చెందినవారే. దేవతలు నిర్వికారులుగా ఉండేవారు, ఇప్పుడు వారు వికారులుగా అయ్యారు. వికారాల కోసమే ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి.

తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు సదా సుఖమయంగా అవుతారు. ఇక్కడైతే సదా దుఃఖితులుగా ఉంటారు, అల్పకాలిక సుఖముంటుంది. అక్కడైతే అందరూ సుఖమయంగా ఉంటారు కానీ ఎంతైనా, పదవిలోనైతే తేడా ఉంటుంది కదా. సుఖం యొక్క రాజధాని కూడా ఉంటుంది, దుఃఖం యొక్క రాజధాని కూడా ఉంటుంది. ఎప్పుడైతే తండ్రి వస్తారో, అప్పుడు వికారీ రాజుల రాజ్యాలు కూడా సమాప్తమైపోతాయి ఎందుకంటే ఇక్కడి ప్రారబ్ధం సమాప్తమైపోతుంది. తండ్రి శ్రీమతమనుసారంగా నడుచుకోవాలని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి అంటారు - నేను ఎలాగైతే శాంతిసాగరుడనో, ప్రేమసాగరుడనో మిమ్మల్ని కూడా అలా తయారుచేస్తాను. ఈ మహిమ కేవలం తండ్రిది మాత్రమే, ఇది మనుష్యులెవ్వరి మహిమ కాదు. తండ్రి పవిత్రతా సాగరుడని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మలైన మనం కూడా పరంధామంలో ఉన్నప్పుడు పవిత్రంగా ఉండేవారము. ఈ ఈశ్వరీయ జ్ఞానం పిల్లలైన మీ వద్ద మాత్రమే ఉంది. ఇది ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. ఈశ్వరుడు ఎలాగైతే జ్ఞానసాగరుడో, స్వర్గ వారసత్వాన్ని ఇస్తారో, అలా పిల్లలను కూడా తమ సమానంగా తప్పకుండా తయారుచేస్తారు. ఇంతకుముందు మీకు తండ్రి పరిచయం లేదు. ఏ పరమాత్మునికైతే ఇంతటి మహిమ ఉందో, వారు మమ్మల్ని అంత ఉన్నతంగా తయారుచేస్తారని ఇప్పుడు మీకు తెలుసు కావున స్వయాన్ని అంత ఉన్నతంగా తయారుచేసుకోవాల్సి ఉంటుంది. వీరిలో దేవతల వలె, చాలా మంచి దైవీ గుణాలున్నాయి..... అని అంటారు కదా. ఎవరి స్వభావమైతే శాంతిగా ఉంటుందో, ఎవరైతే ఎవరినీ నిందించరో, వారిని మంచి వ్యక్తులని అంటారు. కానీ వారికి తండ్రి గురించి, సృష్టి చక్రం గురించి తెలియదు. ఇప్పుడు తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని అమరలోకానికి యజమానులుగా తయారుచేస్తారు. తండ్రి తప్ప కొత్త ప్రపంచానికి యజమానులుగా ఇంకెవ్వరూ తయారుచేయలేరు. ఇది పాత ప్రపంచము, అది కొత్త ప్రపంచము. అక్కడ దేవీ దేవతల రాజధాని ఉంటుంది. కలియుగంలో ఆ రాజధాని ఉండదు, అది కాకుండా వేరే రాజధానులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అనేక రాజధానులు వినాశనమై, ఒకే రాజధాని స్థాపన జరగనున్నది. ఎప్పుడైతే ఏ రాజధాని ఉండదో, అప్పుడు తండ్రి వచ్చి స్థాపన చేస్తారు. అది కూడా తండ్రి తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. పిల్లలైన మీకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి. తండ్రి ఏదైతే చెప్తారో, అది తప్పకుండా చేస్తారు. ఒకటేమో, తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయండి మరియు సేవ చేయండి, ఇతరులకు మార్గాన్ని తెలియజేయండి. దేవీ-దేవతా ధర్మం వారు ఎవరైతే ఉంటారో, వారిపై తప్పకుండా ప్రభావం పడుతుంది. మనం ఒక్క తండ్రిని మాత్రమే మహిమ చేస్తాము. తండ్రిలో గుణాలున్నాయి కనుక వారే వచ్చి మనల్ని గుణవంతులుగా తయారుచేస్తారు. తండ్రి అంటారు - పిల్లలూ, చాలా మధురంగా అవ్వండి, అందరికీ ప్రేమగా కూర్చొని అర్థం చేయించండి. భగవానువాచ - నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి. పాత ప్రపంచ మహావినాశనం ఎదురుగా నిలబడి ఉంది. ఇంతకుముందు కూడా మహాభారీ మహాభారత యుద్ధం జరిగింది, భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు. ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. సత్యయుగంలో ఒకే ధర్మం ఉండేది, అది ఇప్పుడు ప్రాయః లోపమైపోయింది. ఇప్పుడు తండ్రి వచ్చి అనేక ధర్మాలను వినాశనం చేసి ఏక ధర్మ స్థాపనను చేస్తారు. అమరపురిలోకి వెళ్ళేందుకు నేను యజ్ఞాన్ని రచిస్తాను, మీకు అమరకథను వినిపిస్తాను అని తండ్రి అర్థం చేయిస్తారు. అమరలోకంలోకి వెళ్ళాలంటే తప్పకుండా మృత్యులోక వినాశనం జరుగుతుంది. తండ్రి కొత్త ప్రపంచ రచయిత కనుక తండ్రికి తప్పకుండా ఇక్కడికే రావాల్సి ఉంటుంది. ఇప్పుడు వినాశ జ్వాల ఎదురుగా నిలబడి ఉంది. మీరు సత్యమే చెప్తున్నారు, నిజంగా ఇది అదే మహాభారత యుద్ధమని తర్వాత అర్థం చేసుకుంటారు. ఈ మహాభారత యుద్ధము ప్రసిద్ధమైనది కనుక తప్పకుండా ఈ సమయంలో భగవంతుడు కూడా ఉంటారు. భగవంతుడు ఎలా వస్తారు అనేది మీరు తెలియజేయగలరు. మాకైతే డైరెక్టుగా భగవంతుడే అర్థం చేయిస్తున్నారని మీరు అందరికీ చెప్పవచ్చు. వారు, నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. సత్యయుగంలోనైతే అందరూ సతోప్రధానంగా ఉంటారు. ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అయి ముక్తి-జీవన్ముక్తులలోకి వెళ్ళండి.

తండ్రి అంటారు - కేవలం నా స్మృతితోనే మీరు సతోప్రధానంగా అయి సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మనం ఆత్మిక పండాలము, మన్మనాభవ యొక్క యాత్రను చేస్తున్నాము. తండ్రి వచ్చి బ్రాహ్మణ ధర్మాన్ని, సూర్యవంశీ, చంద్రవంశీ ధర్మాలను స్థాపన చేస్తారు. తండ్రి అంటారు - నన్ను స్మృతి చెయ్యకపోతే జన్మ-జన్మల పాప భారం తొలగదు. ఇదే మీకు అన్నింటికంటే పెద్ద చింత. ఓ ప్రేయసులారా, మీరు కర్మలు చేసుకుంటూ, వ్యాపార-వ్యవహారాలు చేసుకుంటూ, ప్రియుడినైన నన్ను స్మృతి చేయండి. ప్రతి ఒక్కరు తమను తాము పూర్తిగా సంభాళించుకోవాలి. తండ్రిని స్మృతి చేయండి. ఎలాంటి పతిత కర్మలు చేయకండి. భారత్ స్వర్గంగా ఉండేదని, అక్కడ లక్ష్మీ నారాయణుల రాజ్యముండేదని - ఇంటి-ఇంటికీ తండ్రి సందేశాన్ని ఇస్తూ ఉండండి. ఇప్పుడిది నరకము. నరకం యొక్క వినాశనం కోసమే ఈ మహాభారత యుద్ధం ఉంది. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి. ఇది తండ్రి ఆజ్ఞ, దీనిని పాటించడం, పాటించకపోవడం అనేది మీ ఇష్టము. నేను మీకు సందేశాన్ని వినిపించడానికి వచ్చాను. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే - అందరికీ సందేశాన్ని వినిపించండి. ఏ సేవ చేయాలి అని బాబాను అడుగుతారు. సందేశాన్ని ఇస్తూ ఉండండి అని బాబా అంటారు. తండ్రిని స్మృతి చేయండి, రాజధానిని స్మృతి చేయండి. అప్పుడు అంతమతి సో గతి జరుగుతుంది (అంతిమ సమయంలో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అలాంటి జన్మ లభిస్తుంది). మందిరాలకు వెళ్ళండి, గీతా పాఠశాలలకు వెళ్ళండి. మున్ముందు చాలా మంది మిమ్మల్ని కలుస్తూ ఉంటారు. మీరు దేవీ-దేవతా ధర్మం వారిని పైకి ఎత్తాలి.

తండ్రి అర్థం చేయిస్తారు - చాలా-చాలా మధురంగా అవ్వండి. చెడు నడవడిక ఉంటే పదవి భ్రష్టమవుతుంది. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. సమయం చాలా కొద్దిగా ఉంది. ఎవరి నుండైతే స్వర్గ రాజ్యం లభిస్తుందో, ఆ ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి. ఎవరైనా మురళీ వినిపించలేకపోతే (జ్ఞానం వినిపించలేకపోతే) మెట్ల చిత్రం ముందు కూర్చుని ఇలా ఆలోచించండి - మేము ఈ విధంగా జన్మలు తీసుకుంటాము, ఈ విధంగా చక్రంలో తిరుగుతూ ఉంటాము..... అలా చేస్తే దానంతట అదే మీ వాణి తెరుచుకుంటుంది. ఏ విషయమైతే లోపల ఉంటుందో, అది తప్పకుండా బయటకు వస్తుంది. స్మృతి చేస్తే మనం పవిత్రంగా తయారవుతాము మరియు కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తాము. ఇప్పుడు మనది ఎక్కే కళ. కనుక లోపల సంతోషముండాలి. మనం ముక్తిధామానికి వెళ్ళి తర్వాత జీవన్ముక్తిలోకి వస్తాము. ఇది చాలా గొప్ప సంపాదన. వ్యాపార-వ్యవహారాలు చేసుకోండి, కేవలం బుద్ధి ద్వారా స్మృతి చేయండి. స్మృతి చేయడం అలవాటు అయిపోవాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. నడవడిక బాగోకపోతే ధారణ జరగదు. ఎవ్వరికీ అర్థం చేయించలేరు. అడుగులు ముందుకు వేసే పురుషార్థం చేయాలి. వెనుకకు రాకూడదు. ప్రదర్శనీలో సేవ చేస్తే చాలా సంతోషం కలుగుతుంది. వారికి, నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారని కేవలం ఈ విషయాన్ని తెలియజేయండి. దేహధారులను స్మృతి చేయడంతో వికర్మలు తయారవుతాయి. వారసత్వాన్ని ఇచ్చేవాడిని నేను. నేను అందరికీ తండ్రిని. నేనే వచ్చి మిమ్మల్ని ముక్తి-జీవన్ముక్తులలోకి తీసుకువెళ్తాను. ప్రదర్శనీలలో, మేళాలలో సేవ చేసేందుకు చాలా అభిరుచి ఉండాలి. సేవ పట్ల అటెన్షన్ పెట్టాలి. పిల్లలు తమంతట తామే ఈ విషయాల గురించి ఆలోచించాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క బాబాపై పూర్తి ప్రేమనుంచుకోవాలి. అందరికీ సత్యమైన మార్గాన్ని తెలియజేయాలి. వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటూ మిమ్మల్ని మీరు పూర్తిగా సంభాళించుకోవాలి. ఒక్కరి స్మృతిలోనే ఉండాలి.

2. సేవ చేయాలి అని చాలా-చాలా అభిరుచి ఉండాలి. తమ నడవడికను సరిదిద్దుకోవాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి.

వరదానము:-

చేయువారు మరియు చేయించువారి స్మృతి ద్వారా సహజయోగాన్ని అనుభవం చేసే సఫలతామూర్త భవ

ఏ కార్యాన్ని చేస్తున్నా సరే, ఈ కార్యానికి నిమిత్తులుగా చేసిన వెన్నెముక ఎవరు అనే స్మృతి ఉండాలి. వెన్నెముక లేకుండా ఏ కర్మలోనూ సఫలత లభించదు. అందుకే ఏ కార్యం చేస్తున్నా సరే - నేను నిమిత్తుడను, చేయించేవారు స్వయంగా సర్వ సమర్థుడైన తండ్రి - కేవలం దీనిని స్మృతిలో ఉంచుకుని కర్మలు చేసినట్లయితే సహజ యోగం యొక్క అనుభూతి కలుగుతూ ఉంటుంది. తర్వాత ఈ సహజయోగం అక్కడ సహజంగా రాజ్యం చేయిస్తుంది. ఇక్కడి సంస్కారాలను అక్కడికి తీసుకువెళ్తారు.

స్లోగన్:-

కోరికలు నీడ వంటివి, మీరు వెన్ను చూపిస్తే, అవి మీ వెనుకే వస్తూ ఉంటాయి.