15-11-2020 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 18-01-87


‘‘కర్మాతీత స్థితియొక్క గుర్తులు’’

ఈరోజు అవ్యక్త బాప్ దాదా తమ ‘‘అవ్యక్త స్థితి భవ’’ యొక్క వరదానీ పిల్లలను మరియు అవ్యక్త ఫరిస్తాలను కలుసుకోవడానికి వచ్చారు. ఈ అవ్యక్త మిలనము ఈ మొత్తము కల్పములో ఇప్పుడు ఒక్కసారే సంగమయుగములో జరుగుతుంది. సత్యయుగములో కూడా దేవ మిలనము ఉంటుంది కానీ ఫరిస్తాల మిలనము, అవ్యక్త మిలనము ఈ సమయములోనే జరుగుతుంది. నిరాకారుడైన బాబా కూడా అవ్యక్త బ్రహ్మాబాబా ద్వారా మిలనం చేస్తారు. నిరాకారునికి కూడా ఈ ఫరిస్తాల సభ అతి ప్రియమనిపిస్తుంది కనుకనే తమ ధామాన్ని వదిలి ఆకారీ మరియు సాకారీ ప్రపంచములో మిలనం జరుపుకునేందుకు వచ్చారు. ఫరిస్తా పిల్లల స్నేహ ఆకర్షణ వలన బాబాకు కూడా రూపాన్ని మార్చుకుని, వేషాన్ని మార్చుకుని పిల్లల ప్రపంచములోకి రావలసే వస్తుంది. ఈ సంగమయుగము బాబా మరియు పిల్లల అతి ప్రియమైన మరియు అతీతమైన ప్రపంచము. స్నేహమునకు అన్నింటికంటే ఎక్కువ ఆకర్షితము చేసే శక్తి ఉంది, అది పరమ-ఆత్మను, బంధనముక్తుడిని కూడా, శరీరము నుండి విముక్తి అయినవారిని కూడా స్నేహ బంధనములో బంధించివేస్తుంది. అశరీరుడిని కూడా లోన్ తీసుకున్న శరీరధారిగా చేసేస్తుంది. ఇదే పిల్లల స్నేహమునకు ప్రత్యక్ష ప్రమాణము.

ఈరోజు నలువైపుల కల పిల్లల అనేక స్నేహ ధారలు, స్నేహ సాగరములో కలిసిపోయే రోజు. ‘‘మేము బాప్ దాదాను కలిసేందుకు వచ్చాము’’ అని పిల్లలు అంటారు. కలిసేందుకు పిల్లలు వచ్చారా? లేక పిల్లలను కలిసేందుకు బాబా వచ్చారా? లేక ఇరువురూ మధువనములో కలుసుకునేందుకు వచ్చారా? పిల్లలు స్నేహ సాగరములో స్నానం చేసేందుకు వచ్చారు కానీ బాబా వేలాది గంగలలో స్నానం చేసేందుకు వస్తారు కనుక గంగ-సాగరముల మేళ విచిత్రమైన మేళ. స్నేహ సాగరములో కలిసిపోయి సాగర సమానంగా అయిపోతారు. ఈ రోజును బాబా సమానంగా అయ్యే స్మృతి దివసము లేక సమర్థ దివసము అని అంటారు. ఎందుకని? ఈరోజు బ్రహ్మాబాబా సంపన్నంగా మరియు సంపూర్ణంగా, బాబా సమానంగా అయిన స్మృతిచిహ్న దివసము. బ్రహ్మా, కొడుకు సో తండ్రి, ఎందుకంటే బ్రహ్మా, కొడుకు కూడా, తండ్రి కూడా. ఈరోజున బ్రహ్మా కొడుకు రూపంలో సుపుత్రుడైన కొడుకుగా అయ్యే ఋజువును ఇచ్చారు, స్నేహ స్వరూపంగా, సమానంగా అయ్యే ఋజువును ఇచ్చారు; అతి ప్రియంగా మరియు అతి అతీతంగా ఉండే ఋజువును ఇచ్చారు; బాబా సమానంగా కర్మాతీతంగా అనగా కర్మ బంధనము నుండి ముక్తులై, అతీతంగా అయ్యే ఋజువును ఇచ్చారు; మొత్తము కల్పము యొక్క కర్మల లెక్కాచారము నుండి విముక్తి అయ్యే ఋజువును ఇచ్చారు. కేవలము సేవ, స్నేహము తప్ప మరే ఇతర బంధనము లేదు. సేవలో కూడా సేవా బంధనములో బంధింపబడే సేవాధారి కాదు ఎందుకంటే సేవలో కొందరు బంధనముక్తులై సేవ చేస్తే, కొందరు బంధనయుక్తులై సేవ చేస్తారు. బ్రహ్మాబాబా కూడా సేవాధారి. కానీ సేవలో హద్దుకు చెందిన రాయల్ కోరికలు సేవలో కూడా లెక్కాచారము యొక్క బంధనములో బంధిస్తాయి. కానీ సత్యమైన సేవాధారులు ఈ లెక్కాచారము నుండి కూడా ముక్తులుగా ఉంటారు. ఇదే కర్మాతీత స్థితి అని అనబడుతుంది. దేహ బంధనము, దేహ సంబంధాల బంధనము ఎలానో, అలాగే సేవలో స్వార్థము - ఈ బంధనము కూడా కర్మాతీతంగా అవ్వడంలో విఘ్నం వేస్తుంది. కర్మాతీతంగా అవ్వటము అనగా ఈ రాయల్ లెక్కాచారము నుండి కూడా విముక్తి.

మెజారిటీ గీతా పాఠశాలలకు నిమితమైన సేవాధారులు వచ్చారు కదా. మరి సేవ అనగా ఇతరులను కూడా విముక్తులుగా చెయ్యటము. ఇతరులను విముక్తులుగా చేస్తూ స్వయమును బంధనములో బంధించుకోవటం లేదు కదా? నష్టోమోహులుగా అయ్యేందుకు బదులుగా, లౌకిక పిల్లలు మొదలైనవారందరిపై ఉన్న మోహాన్ని త్యాగము చేసి స్టూడెంట్లపై మోహమునైతే పెట్టుకోవటం లేదు కదా? వీరు చాలా మంచివారు, చాలా మంచివారు, మంచివారు-మంచివారు అని అనుకుంటూ నావారు అనే కోరికతో కూడిన బంధనంలో అయితే బంధింపబడటం లేదు కదా? బంగారు సంకెళ్ళు అయితే బాగా అనిపించడం లేదు కదా ? మరి ఈరోజును హద్దుకు చెందిన మేరే-మేరే (నావి-నావి) అన్నవాటి నుండి విముక్తులుగా అయ్యే రోజుగా అనగా కర్మాతీతంగా అయ్యే అవ్యక్త దివసంగా జరుపుకోండి. దీనినే స్నేహానికి ఋజువు అని అంటారు. కర్మాతీతంగా అవ్వటము - అందరి ఈ లక్ష్యమైతే బాగుంది. ఇప్పుడు చెక్ చేసుకోండి - ఎంతవరకు కర్మల బంధనము నుండి అతీతంగా అయ్యారు? మొదటి విషయము - లౌకికము మరియు అలౌకికము, కర్మ మరియు సంబంధము, రెండింటిలోనూ స్వార్థ భావము నుండి ముక్తి. రెండవ విషయము - వెనుకటి జన్మల కర్మల లెక్కాచారము కారణంగానైనా లేక వర్తమాన పురుషార్థములో బలహీనత కారణంగానైనా, ఎటువంటి వ్యర్థ స్వభావ-సంస్కారాలకు వశమవ్వటము నుండి ముక్తులుగా అయ్యారా? ఎప్పుడైనా ఏదైనా బలహీన స్వభావ-సంస్కారము లేక వెనుకటి సంస్కార-స్వభావము వశీభూతముగా చేస్తుంది అంటే అది బంధనయుక్తము, బంధనముక్తము కాదు. మేము కావాలని చేయటం లేదు కానీ స్వభావము లేక సంస్కారము చేయిస్తుంది అని ఇలా ఆలోచించవద్దు. ఇది కూడా బంధనముక్తికి గుర్తు కాదు, ఇది బంధనయుక్తమునకు గుర్తు. మరొక విషయము - ఏదైనా పరిస్థితి, అది సేవకు, సంగఠనకు, ప్రకృతికి చెందినదైనా, అది స్వస్థితిని లేక శ్రేష్ఠ స్థితిని కదిలిస్తుందంటే అది కూడా బంధనముక్త స్థితి కాదు. ఈ బంధనము నుండి కూడా విముక్తి. మూడవ విషయము - పాత ప్రపంచములో పాత అంతిమ శరీరములో ఏవిధమైనటువంటి వ్యాధి అయినా తమ శ్రేష్ఠ స్థితిని అలజడిలోకి తీసుకురావటము - దీని నుండి కూడా విముక్తి. ఒకటేమో వ్యాధి రావటము, ఒకటేమో వ్యాధి కదిలించటము. కనుక రావటము - ఇది విధి కానీ స్థితి కదిలిపోవటము - ఇది బంధనయుక్తమునకు గుర్తు. స్వ చింతన, జ్ఞాన చింతన, శుభ చింతకులుగా అయ్యే చింతన మారి శారీరిక వ్యాధి యొక్క చింతన నడవటము - దీని నుండి విముక్తి, ఎందుకంటే ప్రకృతి గురించి ఎక్కువగా చింతన చేయటం అనేది చింత రూపములోకి మారిపోతుంది. కనుక దీని నుండి విముక్తులవ్వటము - ఇదే కర్మాతీత స్థితి అని అనబడుతుంది. ఈ అన్ని బంధనాలను వదలటము, ఇదే కర్మాతీత స్థితికి గుర్తు. బ్రహ్మా బాబా ఈ అన్ని కర్మ బంధనాల నుండి విముక్తులై కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకున్నారు. కనుక ఈ రోజు బ్రహ్మా బాబా సమానంగా కర్మాతీతంగా అయ్యే రోజు. ఈ రోజు యొక్క మహత్వాన్ని తెలుసుకున్నారా? అచ్ఛా!

నేటి సభ విశేషంగా సేవాధారులది అనగా పుణ్య ఆత్మలుగా అయ్యేవారి సభ. గీతా పాఠశాలను తెరవటము అనగా పుణ్య ఆత్మగా అవ్వటము. అన్నింటికంటే అతి పెద్ద పుణ్యము - ప్రతి ఆత్మను సదాకాలము కొరకు అనగా అనేక జన్మల కొరకు పాపాల నుండి విముక్తి చెయ్యటము - ఇదే పుణ్యము. ‘గీతా పాఠశాల’ అన్న పేరు చాలా బాగుంది. గీతా పాఠశాల వారు అనగా సదా స్వయం గీతా పాఠమును చదివేవారు మరియు చదివించేవారు. గీతా జ్ఞానములోని మొదటి పాఠము - అశరీరి ఆత్మగా అవ్వండి మరియు అంతిమ పాఠము - నష్టోమోహా, స్మృతి స్వరూపులుగా అవ్వండి. మొదటి పాఠము విధి మరియు అంతిమ పాఠము విధితో సిద్ధి. మరి గీతా పాఠశాల వారు ప్రతి సమయము ఈ పాఠాన్ని చదువుతారా లేక కేవలము మురళీని వినిపిస్తారా? ఎందుకంటే సత్యమైన గీతా పాఠశాల యొక్క విధి ఏమిటంటే ముందుగా స్వయం చదవటము అనగా తయారవ్వటము, తరువాత ఇతరులను నిమిత్తులుగా అయ్యి చదివించటము. మరి గీతా పాఠశాల వారందరూ ఈ విధితో సేవ చేస్తున్నారా? ఎందుకంటే మీరందరూ ఈ విశ్వము ఎదురుగా పరమాత్మ చదువుకు శ్యాంపుల్ (నమూనా). శ్యాంపుల్ కు మహత్వము ఉంటుంది. శ్యాంపుల్ అనేక ఆత్మలకు అలా అయ్యేందుకు ప్రేరణనిస్తుంది. కనుక గీతా పాఠశాల వారిపై పెద్ద బాధ్యత ఉంది. శ్యాంపుల్ గా అవ్వటంలో ఒకవేళ ఏ కొంచెమైనా లోపము కనిపించినట్లయితే, అనేక ఆత్మల భాగ్యమును తయారుచేసేందుకు బదులుగా, భాగ్యమును తయారుచేసుకోవటము నుండి వంచితులుగా చేసేందుకు నిమిత్తులుగా అవుతారు ఎందుకంటే చూసేవారు, వినేవారు సాకార రూపములో నిమిత్త ఆత్మలైన మిమ్మల్ని చూస్తారు. బాబా అయితే గుప్తము కదా కనుక మీ శ్రేష్ఠ కర్మలను చూసి, అనేక ఆత్మలు శ్రేష్ఠ కర్మలను చేసి తమ భాగ్య రేఖను శ్రేష్ఠంగా తయారు చేసుకోగలిగేలా అటువంటి శ్రేష్ఠ కర్మలను చేసి చూపించండి. కనుక ఒకటేమో స్వయమును సదా శ్యాంపుల్ గా భావించటం, మరొకటి సదా మీ సింబల్ (గుర్తు) ను గుర్తు పెట్టుకోవటము. గీతా పాఠశాల వారి సింబల్ ఏమిటి, తెలుసా? కమల పుష్పము. కమలంగా అవ్వండి మరియు అమలు చెయ్యండి అని బాప్ దాదా వినిపించారు. కమలంగా అయ్యేందుకు సాధనమే అమలు చెయ్యటము. ఒకవేళ అమలు చెయ్యనట్లయితే కమలంగా అవ్వలేరు కనుక ‘నేను శ్యాంపుల్’ అన్నదానిని మరియు ‘కమల పుష్పము’ సింబల్ ను సదా బుద్ధిలో పెట్టుకోండి. సేవ ఎంతగా వృద్ధి పొందినాగానీ, సేవ చేస్తూ అతీతులుగా అయ్యి ప్రియమైనవారిగా అవ్వాలి. కేవలము ప్రియమైనవారిగా అవ్వద్దు, అతీతంగా అయ్యి ప్రియంగా అవ్వాలి ఎందుకంటే సేవ పట్ల ప్రేమ ఉండటము మంచి విషయమే కానీ ప్రేమ మోహం రూపంలోకి మారిపోకూడదు. దీనినే అతీతంగా అయ్యి ప్రియంగా అవ్వటము అని అంటారు. సేవకు నిమిత్తంగా అయ్యారు, ఇదైతే చాలా బాగా చేసారు. పుణ్య ఆత్మ అన్న బిరుదైతే లభించేసింది, కనుకనే చూడండి, ప్రత్యేక ఆహ్వానమునిచ్చారు, ఎందుకంటే పుణ్య కార్యము చేసారు. ఇంతకుముందు సిద్ధి పాఠమునేదైతే చదివించామో, ఆ సిద్ధి యొక్క స్థితితో ఇప్పుడు వృద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉండాలి. భవిష్యత్తులో ఏం చెయ్యాలో అర్థమైందా? అచ్ఛా!

అందరూ విశేషంగా ఒక విషయం కోసం ఎదురుచూస్తున్నారు, అది ఏంటి? (రిజల్టు వినిపించాలి). రిజల్టు మీరు వినిపిస్తారా లేక బాబా వినిపిస్తారా? బాప్ దాదా ఏం అన్నారు - రిజల్టును తీసుకుంటారా లేక ఇస్తారా? డ్రామా ప్లాన్ అనుసారంగా ఏదైతే జరిగిందో, ఎలా అయితే జరిగిందో, దానిని మంచిదనే అంటారు. అందరూ లక్ష్యమును బాగా పెట్టుకున్నారు, లక్షణాలను యథాశక్తి కర్మలలో చూపించారు. బహుకాలపు వరదానమును నంబరువారుగా ధారణ చేసారు కూడా మరియు ఇప్పుడు కూడా ఏ వరదానమునైతే ప్రాప్తి చేసుకున్నారో, ఆ వరదానీమూర్తులుగా అయ్యి బాబా సమానంగా వరదాన-దాతగా అవుతూ ఉండాలి. ఇప్పుడు బాప్ దాదా ఏం కోరుకుంటున్నారు? వరదానమైతే లభించింది, ఇప్పుడు, ఈ సంవత్సరము బహుకాలపు బంధనముక్తులుగా అనగా బాబా సమానమైన కర్మాతీత స్థితి యొక్క విశేష అభ్యాసమును చేస్తూ, ప్రపంచానికి అతీతము మరియు ప్రియత్వముల అనుభవమును చేయించండి. అప్పుడప్పుడు అనుభవము చెయ్యటము - ఇప్పుడు ఈ విధిని మార్చి బహుకాలపు అనుభూతుల యొక్క ప్రత్యక్షతగా, బహుకాలపు నిశ్చల, నిర్విఘ్న, నిర్బంధన, నిర్వికల్ప, నిర్వికర్మ అనగా నిరాకారి, నిర్వికారి, నిరహంకారి - ఈ స్థితిని ప్రపంచము ముందు ప్రత్యక్ష రూపములో తీసుకురండి. బాబా సమానంగా అవ్వటము అని దీనినే అంటారు. అర్థమైందా?

రిజల్టులో ముందుగా స్వయంతో స్వయం సంతుష్టంగా ఉండటము, ఇలా ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే ఒకటేమో స్వయం యొక్క సంతుష్టత, రెండవది బ్రాహ్మణ పరివారము యొక్క సంతుష్టత, మూడవది బాబా యొక్క సంతుష్టత. మూడింటి రిజల్టులో ఇప్పుడు ఇంకా ఎక్కువ మార్కులు తీసుకోవాలి. కనుక సంతుష్టంగా అవ్వండి, సంతుష్టంగా చెయ్యండి. బాబా యొక్క సంతుష్టమణులుగా అయ్యి సదా మెరుస్తూ ఉండండి. బాప్ దాదా పిల్లలను గౌరవిస్తారు కనుక గుప్త రికార్డును చెప్తారు. కాబోయే దేవతలు, కనుక బాప్ దాదా సదా సంపన్నతా స్థితిని చూస్తారు. అచ్ఛా!

అందరూ సంతుష్టమణులే కదా? వృద్ధిని చూసి సంతోషంగా ఉండండి. ఆబూ రోడ్డు వరకు క్యూ ఏర్పడాలి అని మీరందరూ ఎదురుచూస్తున్నారు. మరి ఇప్పుడైతే కేవలము హాల్ నిండింది, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు నిద్రపోతారా లేక అఖండ యోగాన్ని చేస్తారా? ఇది కూడా జరిగేది ఉంది కనుక కొంచెములోనే సంతుష్టంగా ఉండండి, మూడు అడుగులకు బదులుగా ఒక్క అడుగు భూమి లభించినా కూడా సంతుష్టంగా ఉండండి. ఇదివరకు ఇలా జరిగేది అని ఇలా ఆలోచించకండి. పరివారం వృద్ధి చెందుతున్నందుకు సంతోషపడండి. ఆకాశము మరియు పృథ్వి అయితే తరిగిపోయేవి కావు కదా. పర్వతాలైతే చాలా ఉన్నాయి. ఇది కూడా జరగాలి, ఇది కూడా లభించాలి - ఇలా ఆలోచించి విషయాన్ని పెద్దదిగా చేసేస్తారు. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని దాదీలు కూడా ఆలోచనలో పడతారు. పగటిపూట ఎండలో నిద్రపోయి, రాత్రిపూట మేల్కొని ఉండే అటువంటి రోజు కూడా వస్తుంది. వారు అగ్నిని వెలిగించి వెచ్చదనం కోసం దాని చుట్టూ కూర్చుంటారు, మీరు యోగాగ్నిని వెలిగించి కూర్చుంటారు. ఇష్టమేనా లేక మంచం కావాలా? కూర్చునేందుకు కుర్చీ కావాలా? ఈ పర్వతాల ఆధారాన్నే కుర్చీగా చేసుకోవాలి. సాధనాలు ఉన్నప్పుడు సుఖం తీసుకోండి, లేనప్పుడు పర్వతాన్ని కుర్చీగా చేసుకోవాలి. వీపుకు విశ్రాంతి కావాలి కదా, ఇంకేం లేదు. 5000 మంది వచ్చినట్లయితే కుర్చీలను తీసేయవలసిందే కదా. తర్వాత క్యూ ఏర్పడినప్పుడు మంచాలను కూడా వదలాల్సి వస్తుంది. ఎవర్రెడీగా ఉండండి. ఒకవేళ మంచాలు దొరికినా ‘హా జీ’, నేల దొరికినా కూడా ‘హా జీ’ అనాలి. ఇలా ప్రారంభంలో చాలా అభ్యాసము చేయించాము. 15-15 రోజుల వరకు ఆస్పత్రులు మూసుండేవి. ఆస్తమా రోగులు కూడా జొన్నరొట్టెను తినేవారు, మజ్జిగను త్రాగేవారు. కానీ అనారోగ్యము చేయలేదు, అందరూ ఆరోగ్యవంతులుగా అయిపోయారు. ఇది ప్రారంభంలో అభ్యాసము చేసి చూపించారు కావున అంతిమములో కూడా జరుగుతుంది కదా. లేదంటే, ఆలోచించండి, ఆస్తమా రోగులుకు మజ్జిగను ఇచ్చినట్లయితే ముందే గాభరా పడిపోతారు. కానీ ఆశీర్వాదమనే మందు తోడుగా ఉంటుంది కనుక మనోరంజనంగా అయిపోతుంది. పరీక్షగా అనిపించదు. కష్టం అనిపించదు. త్యాగము కాదు, విహారయాత్రగా అయిపోతుంది. మరి అందరూ తయారుగా ఉన్నారా లేక ఏర్పాట్లు చేసేవారి వద్దకు టీచర్లు లిస్టు తీసుకువెళ్తారా? అందుకే పిలవరు కదా. సమయము వచ్చినప్పుడు ఈ అన్ని సాధనాల నుండి కూడా దూరమై సాధన యొక్క సిద్ధి రూపములో అనుభవము చేస్తారు. ఆత్మిక మిలటరీ (సైన్యం) కూడా కదా. మిలటరీ పాత్రను కూడా పోషించాలి కదా. ఇప్పుడైతే స్నేహమయ పరివారము ఉంది, ఇల్లు ఉంది - ఇది కూడా అనుభవము చేస్తున్నారు. కానీ సమయము వచ్చినప్పుడు ఆత్మిక మిలటరీవారిగా అయ్యి ఎటువంటి సమయము వస్తుందో, దానిని అదే స్నేహముతో దాటడము - ఇది కూడా మిలటరీవారి విశేషత. అచ్ఛా!

గుజరాత్ వారికి ఎవర్రెడీగా ఉండే విశేష వరదానము ఉంది. ఏం చెయ్యాలి, ఎలా రావాలి, రిజర్వేషన్ దొరకలేదు అన్న సాకులు చెప్పరు, చేరుకుంటారు. సమీపంగా ఉన్నందుకు లాభము. గుజరాత్ వారికి ఆజ్ఞాకారులుగా అయ్యే విశేష ఆశీర్వాదము ఉంది ఎందుకంటే సేవలో కూడా హా జీ అని అంటారు కదా. శ్రమతో కూడుకున్న సేవను ఎప్పుడూ గుజరాత్ వారికి ఇస్తారు కదా. రొట్టెల సేవను ఎవరు చేస్తారు? ఉండేందుకు స్థానాన్ని ఇచ్చే సేవను, పరుగులు పెట్టి చేసే సేవను గుజరాత్ వారు చేస్తారు. బాప్ దాదా అంతా చూస్తారు. బాప్ దాదాకు తెలియదని కాదు. శ్రమ చేసేవారికి విశేషంగా ప్రియుని ప్రేమ ప్రాప్తిస్తుంది. సమీపంగా ఉండే భాగ్యము ఉంది మరియు భాగ్యమును పెంచుకునే విధానమును బాగా పెట్టుకుంటారు. భాగ్యాన్ని పెంచుకోవటము అందరికీ రాదు. కొందరికి భాగ్యము ప్రాప్తిస్తుంది కానీ అది అంతవరకే ఉంటారు, పెంచుకోవటము రాదు. కానీ గుజరాత్ వారికి భాగ్యము ఉంది మరియు దానిని పెంచుకోవటము కూడా వచ్చు కనుక మీ భాగ్యమును పెంచుకుంటున్నారు - దీనిని చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తారు. కనుక బాబా యొక్క విశేష ఆశీర్వాదము - ఇది కూడా భాగ్యమునకు ఒక గుర్తు. అర్థమైందా?

నలువైపుల నుండి స్నేహీ పిల్లలు ఎవరైతే చేరుకున్నారో, బాప్ దాదా కూడా దేశ-విదేశములలోని స్నేహీ పిల్లలందరి స్నేహమునకు రిటర్న్ లో ‘‘సదా అవినాశీ స్నేహీ భవ’’ అన్న వరదానమును ఇస్తున్నారు. స్నేహముతో దూరదూరాల నుండి పరుగెత్తుకుని వచ్చి చేరుకున్నారు. ఏవిధంగానైతే స్థూలంగా పరుగులు పెట్టారో, సమీపంగా చేరుకున్నారో, సమ్ముఖమునకు చేరుకున్నారో, అలా పురుషార్థములో కూడా విశేషంగా ఎగిరే కళ ద్వారా బాబా సమానంగా అవ్వాలి అనగా సదా బాబాకు సమీపంగా ఉండాలి. ఏవిధంగానైతే ఇక్కడ ఎదురుగా చేరుకున్నారో, అలా సదా ఎగిరే కళ ద్వారా బాబాకు సమీపంగానే ఉండాలి. ఏం చెయ్యాలో అర్థమైందా? ఈ స్నేహము, మనస్ఫూర్తి స్నేహము, మనోభిరాముడైన బాబా వద్దకు మీరు చేరుకునేందుకు ముందే చేరుకుంటుంది. సమ్ముఖములో ఉన్నా, లేక ఈరోజు దేశ-విదేశములలో శరీరముతో దూరంగా ఉన్నాకానీ, దూరంగా ఉన్నా కూడా పిల్లలందరూ అతి సమీపంగా ఉన్నటువంటి హృదయ సింహాసనాధికారులు. మరి అన్నింటికంటే సమీపంగా ఉన్న స్థానము మనసు. కనుక విదేశము లేక దేశములో కూర్చోలేదు, కానీ హృదయ సింహాసనంపై కూర్చున్నారు. కనుక సమీపులైపోయారు కదా. పిల్లలందరి ప్రియస్మృతులు, ఫిర్యాదులు, మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణలు, కానుకలు - అన్నీ బాబా వద్దకు చేరుకున్నాయి. బాప్ దాదా కూడా స్నేహీ పిల్లలకు ‘‘సదా శ్రమ నుండి ముక్తులై ప్రేమలో నిమగ్నమై ఉండండి’’ - అన్న వరదానమును ఇస్తున్నారు. మరి అందరికీ రిటర్న్ లభించింది కదా. అచ్చా!

సర్వ స్నేహీ ఆత్మలకు, సదా సమీపంగా ఉండే ఆత్మలకు, సదా బంధనముక్తులు, కర్మాతీత స్థితిలో బహుకాలపు అనుభవమును చేసే విశేష ఆత్మలకు, సర్వ హృదయ సింహాసనాధికారీ సంతుష్టమణులకు బాప్ దాదాల యొక్క ‘‘అవ్యక్త స్థితి భవ’’ అన్న వరదానముతోపాటు ప్రియస్మృతులు మరియు గుడ్ నైట్ మరియు గుడ్ మార్నింగ్.

వరదానము:-

పాత ఖాతాలను సమాప్తము చేసి, కొత్త సంస్కారాల రూపీ కొత్త వస్త్రాలను ధారణ చేసే బాబా సమానంగా సంపన్న భవ

దీపావళి రోజున కొత్త వస్త్రాలను ధరిస్తారు, అలా పిల్లలైన మీరు ఈ మరజీవా నూతన జన్మలో, నూతన సంస్కారాల రూపీ వస్త్రాలను ధారణ చేసి నూతన సంవత్సరమును జరుపుకోండి. మీ బలహీనతలు, లోపాలు, నిర్బలత, కోమలత మొదలైన పాత ఖాతాలు ఏవైతే ఉండిపోయాయో, వాటిని సమాప్తము చేసి సత్యమైన దీపావళిని జరుపుకోండి. ఈ కొత్త జన్మలో కొత్త సంస్కారాలను ధారణ చేసినట్లయితే బాబా సమానంగా సంపన్నంగా అవుతారు.

స్లోగన్:-

శుద్ధ సంకల్పాలనే ఖజానా జమ అయినట్లయితే వ్యర్థ సంకల్పాలలో సమయము వ్యర్థం కాదు.

 

సూచన:- ఈరోజు మాసములోని మూడవ ఆదివారము. రాజయోగి తపస్వీ సోదరసోదరీలందరూ సా. 6.30 గం.ల నుండి 7.30 గం.ల వరకు, విశేష యోగ అభ్యాస సమయంలో తమ శుభ భావనల శ్రేష్ఠ వృత్తి ద్వారా మనసా మహాదానులుగా అయ్యి అందరికీ నిర్భయతను వరదానంగా ఇచ్చే సేవను చేయండి.