17-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు, మీరే భారతదేశాన్ని స్వర్గంగా తయారుచేస్తారు, కనుక మీకు మీ బ్రాహ్మణ జాతి యొక్క నషా ఉండాలి”

ప్రశ్న:-

సత్యమైన బ్రాహ్మణుల ముఖ్యమైన గుర్తులు ఏమిటి?

జవాబు:-

1. సత్యమైన బ్రాహ్మణుల లంగరు ఈ పాత ప్రపంచము నుండి ఎత్తి వేయబడి ఉంటుంది. వారు ఈ ప్రపంచము యొక్క తీరాన్ని వదిలి పెట్టినట్లుగా ఉంటారు. 2. సత్యమైన బ్రాహ్మణులనగా, వారు చేతులతో పని చేస్తూ ఉంటారు మరియు బుద్ధి సదా తండ్రి స్మృతిలో ఉంటుంది అంటే కర్మయోగులుగా ఉంటారు. 3. బ్రాహ్మణులు అనగా కమలపుష్ప సమానంగా ఉంటారు. 4. బ్రాహ్మణులనగా సదా ఆత్మాభిమానులుగా ఉండే పురుషార్థాన్ని చేసేవారు. 5. బ్రాహ్మణులనగా కామం మహాశత్రువుపై విజయమును ప్రాప్తి చేసుకునేవారు.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలనగా ఎవరు? ఈ బ్రాహ్మణులు. మనము బ్రాహ్మణులము, దేవతలుగా తయారయ్యేవారమని ఎప్పుడూ మర్చిపోకూడదు, వర్ణాలను కూడా గుర్తు పెట్టుకోవలసి ఉంటుంది. ఇక్కడ మీరు పరస్పరము అంతా బ్రాహ్మణులే. బ్రాహ్మణులను అనంతమైన తండ్రి చదివిస్తారు, ఈ బ్రహ్మా ఏమీ చదివించరు. శివబాబా బ్రహ్మా ద్వారా చదివిస్తారు. బ్రాహ్మణులనే చదివిస్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవీ దేవతలుగా అవ్వలేరు. వారసత్వము శివబాబా నుండి లభిస్తుంది. ఆ శివబాబా అయితే అందరికీ తండ్రి. ఈ బ్రహ్మాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. లౌకిక తండ్రి అయితే అందరికీ ఉంటారు. పారలౌకిక తండ్రిని భక్తి మార్గంలో స్మృతి చేస్తారు. వారు అలౌకిక తండ్రి అని, వారి గురించి ఎవ్వరికీ తెలియదని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. బ్రహ్మా యొక్క మందిరముంది, ఇక్కడ కూడా ఆదిదేవ్ అయిన ప్రజాపిత మందిరముంది. వీరిని కొంతమంది మహావీర్ అని అంటారు, దిల్ వాలా అని కూడా అంటారు, కానీ వాస్తవానికి హృదయాన్ని గెలుచుకునేవారు శివబాబా, అంతేకానీ ఆదిదేవ్ అయిన ప్రజాపిత బ్రహ్మా కాదు. ఆత్మలందరినీ సదా సుఖవంతంగా చేసేవారు, సంతోషపరిచేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు, ప్రపంచములోని మనుష్యులకు ఏమీ తెలియదు. వారు తుచ్ఛ బుద్ధిగలవారిగా ఉన్నారు. బ్రాహ్మణులైన మనము మాత్రమే శివబాబా నుండి వారసత్వమును తీసుకుంటున్నాము. ఈ విషయాన్ని మీరు కూడా పదే పదే మర్చిపోతారు. స్మృతి అనేది చాలా సహజము. యోగమనే పదమును సన్యాసులు పెట్టారు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు. యోగమనేది సామాన్య పదము. దీనిని యోగాశ్రమము అని కూడా అనరు, ఎందుకంటే ఇక్కడ తండ్రి మరియు పిల్లలు కూర్చుని ఉన్నారు. అనంతమైన తండ్రిని స్మృతి చేయడము పిల్లల బాధ్యత. బ్రాహ్మణులైన మనము బ్రహ్మా ద్వారా తాతగారి నుండి వారసత్వమును తీసుకుంటున్నాము, అందుకే ఎంత వీలైతే అంత స్మృతి చేస్తూ ఉండండి అని శివబాబా చెప్తారు. చిత్రాలను కూడా మీ దగ్గర పెట్టుకున్నట్లయితే స్మృతి ఉంటుంది. మనము బ్రాహ్మణులము, తండ్రి నుండి వారసత్వమును తీసుకుంటాము. బ్రాహ్మణులు ఎప్పుడైనా తమ జాతిని మర్చిపోతారా. మీరు శూద్రుల సాంగత్యములోకి రావడంతో మీ బ్రాహ్మణత్వమును మర్చిపోతారు. బ్రాహ్మణులైతే దేవతల కన్నా ఉన్నతమైనవారు, ఎందుకంటే బ్రాహ్మణులైన మీరు నాలెడ్జ్ ఫుల్. భగవంతుడిని జానీజాననహార్ (అన్నీ తెలిసినవారు) అని అంటారు కదా, దీని అర్థము కూడా తెలియదు. అలాగని అందరి హృదయాలలో ఏముంది అనేది వారు కూర్చుని చూస్తారని కాదు. అలా కాదు, వారికి సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానముంది, వారు బీజరూపుడు. వారికి వృక్షం యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. అటువంటి తండ్రిని చాలా స్మృతి చేయాలి. వీరి (బ్రహ్మా) ఆత్మ కూడా ఆ తండ్రిని స్మృతి చేస్తుంది. ఆ తండ్రి అంటారు - ఈ బ్రహ్మా కూడా నన్ను స్మృతి చేస్తారు, అందుకే ఈ పదవిని పొందుతారు. మీరు కూడా స్మృతి చేస్తేనే పదవిని పొందుతారు. మొట్టమొదట మీరు అశరీరులుగా వచ్చారు, మళ్ళీ అశరీరులుగా అయ్యి తిరిగి వెళ్ళాలి. మిగిలినవారంతా మీకు దుఃఖమునిచ్చేవారు, అటువంటి వారిని ఎందుకు గుర్తు చేస్తారు. నేను మీకు లభించాను కదా, నేను మిమ్మల్ని కొత్త ప్రపంచములోకి తీసుకువెళ్ళడానికి వచ్చాను, అక్కడ ఎలాంటి దుఃఖము ఉండదు. అక్కడ దైవీ సంబంధాలుంటాయి. ఇక్కడ మొట్టమొదట భార్య-భర్తల సంబంధములో దుఃఖముంటుంది, ఎందుకంటే వికారులుగా అవుతారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ ప్రపంచానికి యోగ్యులుగా తయారుచేస్తాను, అక్కడ వికారాల విషయము ఉండదు. కామమును మహాశత్రువని అంటారు, అది ఆదిమధ్యాంతాలు దుఃఖమునిస్తుంది. ఆదిమధ్యాంతాలు దుఃఖమునిస్తుందని క్రోధము కోసం ఈ విధంగా అనరు. కామమును జయించాలి, అదే ఆదిమధ్యాంతాలు దుఃఖమునిస్తుంది, పతితులుగా చేస్తుంది. పతితులనే పదము వికారులకు ఉపయోగిస్తారు. ఈ శత్రువుపై విజయాన్ని పొందాలి. మనం స్వర్గము యొక్క దేవీ దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు, ఈ నిశ్చయం ఏర్పడనంతవరకు ఏమీ పొందలేరు.

మీరు మనసా-వాచా-కర్మణా ఏక్యురేట్ గా తయారవ్వాలని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, ఇందులో శ్రమ ఉంది. మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారుచేస్తారని ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు, మున్ముందు అర్థము చేసుకుంటారు. ఒకే ప్రపంచము, ఒకే రాజ్యము, ఒకే ధర్మము, ఒకే భాష ఉండాలని కూడా కోరుకుంటారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితము సత్యయుగంలో ఒకే రాజ్యము, ఒకే ధర్మము ఉండేదని, దానిని స్వర్గమని అంటారని మీరు అర్థం చేయించగలరు. రామ రాజ్యము మరియు రావణ రాజ్యము గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. మీరిప్పుడు 100 శాతము తుచ్ఛ బుద్ధిగలవారి నుండి స్వచ్ఛమైన బుద్ధిగలవారిగా నంబరువారు పురుషార్థానుసారముగా తయారవుతారు. తండ్రి కూర్చొని మిమ్మల్ని చదివిస్తారు. మీరు కేవలం తండ్రి మతముపై నడవండి. తండ్రి అంటారు - పాత ప్రపంచంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి, నన్ను స్మృతి చేస్తూ ఉండండి. తండ్రి ఆత్మలకే అర్థము చేయిస్తారు. నేను ఈ కర్మేంద్రియాల ద్వారా ఆత్మలను చదివించడానికే వచ్చాను. ఆత్మలైన మీరు కూడా కర్మేంద్రియాల ద్వారా వింటారు. పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇది పాత ఛీ-ఛీ శరీరము. బ్రాహ్మణులైన మీరు పూజకు యోగ్యులు కారు. మీరు మహిమా యోగ్యులు, దేవతలు పూజకు యోగ్యులు. మీరు శ్రీమతముపై విశ్వాన్ని పవిత్రమైన స్వర్గంగా తయారుచేస్తారు, అందుకే మీకు మహిమ ఉంది. మీకు పూజ జరగదు. బ్రాహ్మణులైన మీకు మాత్రమే మహిమ ఉంది, దేవతలకు లేదు. తండ్రి మిమ్మల్నే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. జగదంబ మరియు బ్రహ్మా మొదలైనవారి మందిరాలను నిర్మిస్తారు కానీ వారెవరు అనేది నిర్మించినవారికి తెలియదు. జగత్పిత అయితే బ్రహ్మాయే కదా, వీరిని దేవత అని అనరు. దేవతల ఆత్మ మరియు శరీరము, రెండూ పవిత్రముగా ఉంటాయి. ఇప్పుడు మీ ఆత్మ పవిత్రముగా అవుతూ ఉంటుంది. శరీరము పవిత్రముగా లేదు. ఇప్పుడు మీరు ఈశ్వరుని మతముపై భారతదేశాన్ని స్వర్గంగా తయారుచేస్తున్నారు. మీరు కూడా స్వర్గానికి యోగ్యులుగా అవుతున్నారు. తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తండ్రి కూర్చొని చదివిస్తారు. బ్రాహ్మణుల వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. ఏ బ్రాహ్మణులైతే పక్కాగా అయిపోతారో, వారు వెళ్ళి తర్వాత దేవతలుగా అవుతారు. ఇది కొత్త వృక్షము. మాయ తుఫానులు కూడా వస్తాయి. సత్యయుగంలో ఎలాంటి తుఫానులు రావు. ఇక్కడ మాయ తండ్రి స్మృతిలో ఉండనివ్వదు. తండ్రి స్మృతిలో ఉండాలని, తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలని మనము కోరుకుంటాము. అంతా స్మృతి పైనే ఆధారపడి ఉంది. భారతదేశపు ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. ఎవరైనా వచ్చి ప్రాచీన యోగమును నేర్పించాలని విదేశీయులు కూడా కోరుకుంటారు. ఇప్పుడు యోగము కూడా 2 రకాలుగా ఉంటుంది - ఒక రకంవారు హఠయోగులు, రెండవ రకంవారు రాజయోగులు. మీరు రాజయోగులు. ఇది భారతదేశపు ప్రాచీన రాజయోగము, దీనిని తండ్రియే నేర్పిస్తారు. కేవలం గీతలో నా పేరుకు బదులుగా కృష్ణుని పేరును వేసేశారు, దానితో ఎంత తేడా వచ్చేసింది. శివజయంతి జరిగితే మీ వైకుంఠ జయంతి కూడా జరుగుతుంది, అక్కడ శ్రీకృష్ణుని రాజ్యముంటుంది. శివబాబా జయంతి జిరిగితే గీతా జయంతి కూడా జరుగుతుందని మీకు తెలుసు. వైకుంఠ జయంతి కూడా జరుగుతుంది, అక్కడ మీరు పవిత్రంగా ఉంటారు. కల్పక్రితము వలె స్థాపన చేస్తారు. నన్ను స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి అంటారు. స్మృతి చేయకపోతే మాయ ఏదో ఒక వికర్మ చేయించేస్తుంది. స్మృతి చేయలేదు అంటే చెంప దెబ్బ తగులుతుంది. స్మృతిలో ఉంటే చెంప దెబ్బలు తినరు. ఇటువంటి బాక్సింగ్ జరుగుతుంది. మన శత్రువు మనిషేమీ కాదని మీకు తెలుసు. మన శత్రువు రావణుడు.

ఈ సమయంలో వివాహము చేసుకోవడం అనేది నాశనం చేసుకోవడం వంటిది అని తండ్రి అంటారు, ఒకరినొకరు నాశనం చేసుకుంటారు (పతితముగా చేసుకుంటారు). ఇప్పుడు పారలౌకిక తండ్రి ఆర్డినెన్స్ జారీ చేసారు - పిల్లలూ, ఈ కామము మహాశత్రువు, దీనిపై విజయాన్ని పొందండి మరియు పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయండి. ఎవ్వరూ పతితంగా అవ్వకూడదు. ఈ వికారాల వలన మీరు జన్మజన్మలుగా పతితముగా అయ్యారు, అందుకే కామము మహాశత్రువని అంటారు. పతితపావనా రండి అని సాధు-సన్యాసులందరూ అంటారు. సత్యయుగంలో పతితులెవ్వరూ ఉండరు. తండ్రి వచ్చి జ్ఞానముతో సర్వులకు సద్గతినిస్తారు, ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. జ్ఞానమునిచ్చేవారు ఎవ్వరూ లేరు. జ్ఞానమునిచ్చేవారు ఒక్క జ్ఞానసాగరుడు మాత్రమే. జ్ఞానముతో పగలు ఏర్పడుతుంది. పగలు రామునిది, రాత్రి రావణునిది. ఈ పదాల యొక్క యథార్థమైన అర్థము కూడా పిల్లలైన మీకు తెలుసు. కేవలం పురుషార్థంలో బలహీనంగా ఉన్నారు. తండ్రి అయితే చాలా మంచి రీతిగా అర్థం చేయిస్తారు. మీరు 84 జన్మలను పూర్తి చేశారు, ఇప్పుడు పవిత్రంగా అయి తిరిగి వెళ్ళాలి. మీకు శుద్ధమైన అహంకారముండాలి. ఆత్మలైన మనము తండ్రి మతముపై ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారుచేస్తున్నాము, ఆ స్వర్గంలో మళ్ళీ రాజ్యము చేస్తాము. ఎంత శ్రమ చేస్తే, అంతటి పదవిని పొందుతారు. రాజా-రాణులుగా అయినా అవ్వండి లేదా ప్రజలుగా అయినా అవ్వండి. రాజా-రాణులుగా ఎలా తయారవుతారు అనేది కూడా మీరు చూస్తున్నారు. ఫాలో ఫాదర్ అని గాయనము చేయడము జరుగుతుంది, ఇది ఇప్పటి విషయమే. లౌకిక సంబంధము కోసము ఇలా అనరు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని ఈ తండ్రి మతాన్నిస్తున్నారు. ఇప్పుడు మనము శ్రీమతముపై నడుస్తున్నామని మీకు తెలుసు. ఎంతోమందికి సేవ చేస్తారు. పిల్లలు తండ్రి వద్దకు వచ్చినప్పుడు, శివబాబా కూడా జ్ఞానముతో ఆహ్లాదపరుస్తారు. వీరు (బ్రహ్మా) కూడా నేర్చుకుంటున్నారు కదా. నేను ఉదయాన్నే వస్తానని శివబాబా అంటారు. అచ్ఛా, అప్పుడు ఎవరైనా కలుసుకునేందుకు వస్తే వీరు (బ్రహ్మా) అర్థం చేయించరా. బాబా, మీరు వచ్చి అర్థం చేయించండి, నేను అర్థం చేయించలేను అని వీరు ఈ విధంగా అనరు. ఇవి చాలా గుప్తమైన, గుహ్యమైన విషయాలు కదా. నేను అందరికన్నా బాగా అర్థము చేయించగలను. శివబాబాయే అర్థం చేయిస్తారని, వీరు (బ్రహ్మా) అర్థం చేయించరని మీరెందుకు ఇలా అనుకుంటారు. వీరు కల్పక్రితము అర్థం చేయించారు కావుననే ఈ పదవిని పొందారని కూడా మీకు తెలుసు. మమ్మా కూడా అర్థం చేయించేవారు కదా. వారు కూడా ఉన్నత పదవిని పొందుతారు. మమ్మా-బాబాలను సూక్ష్మవతనంలో చూస్తారు, కనుక పిల్లలు ఫాలో ఫాదర్ చేయాలి. పేదవారే సరెండర్ (సమర్పణ) అవుతారు, షావుకార్లు అలా అవ్వలేరు. బాబా, ఇదంతా మీదే అని పేదవారే అంటారు. శివబాబా అయితే దాత, వారెప్పుడూ తీసుకోరు. ఇదంతా మీదేనని బాబా పిల్లలతో అంటారు. నేను నా కోసం ఇక్కడా మహళ్ళు తయారుచేసుకోను, అలాగే అక్కడ కూడా తయారుచేసుకోను. మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. ఇప్పుడు ఈ జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకోవాలి. నా జోలెను నింపండి అని మందిరాలకి వెళ్ళి అంటారు. కానీ అది ఏ రకమైన జోలె, దేనితో జోలెను నింపాలి..... అనేది తెలియదు, జోలెను నింపేవారైతే ధనమునిచ్చే లక్ష్మి, శివుని వద్దకైతే వెళ్ళరు, శంకరుని వద్దకు వెళ్ళి అలా అంటారు. శివుడు మరియు శంకరుడు ఒక్కరేనని భావిస్తారు కానీ అలా కాదు.

తండ్రి వచ్చి సత్యమైన విషయాలను తెలియజేస్తారు. తండ్రినే దుఃఖహర్త, సుఖకర్త. పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి, వ్యాపారము కూడా చేయాలి. ప్రతి ఒక్కరు స్వయం కోసం సలహాను అడుగుతారు - బాబా, ఈ విషయంలో మేము అసత్యము చెప్పవలసి వస్తోంది. బాబా ప్రతి ఒక్కరి నాడిని చూసి సలహానిస్తారు, ఎందుకంటే నేను చెప్పినా వీరు చెయ్యలేకపోతే అటువంటి సలహాను నేను ఎందుకివ్వాలని బాబా భావిస్తారు. నాడిని చూసి వారు చేయగలిగే సలహానే ఇవ్వడం జరుగుతుంది. చెప్పినా చేయకపోతే ఆజ్ఞను ఉల్లంఘించినవారి లైనులోకి వచ్చేస్తారు. ప్రతి ఒక్కరికీ తమ-తమ లెక్కాచారాలుంటాయి. సర్జన్ అయితే ఒక్కరే, వారి వద్దకు రావలసి ఉంటుంది. వారు పూర్తి సలహానిస్తారు. బాబా, ఈ పరిస్థితిలో మేము ఎలా నడుచుకోవాలి? ఇప్పుడు ఏం చేయాలి? అని ప్రతి ఒక్కరు అడగాలి. తండ్రి స్వర్గములోకైతే తీసుకువెళ్తారు. మనము స్వర్గవాసులుగా అవ్వబోతున్నామని మీకు తెలుసు. ఇప్పుడు మనము సంగమయుగవాసులము. ఇప్పుడు మీరు నరకములోనూ లేరు, స్వర్గములోనూ లేరు. ఎవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో, వారి లంగరు ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి ఎత్తివేయబడింది. మీరు కలియుగీ ప్రపంచము యొక్క తీరాన్ని వదిలేశారు. కొంతమంది బ్రాహ్మణులు స్మృతి యాత్రలో వేగంగా వెళ్తున్నారు, కొంతమంది నెమ్మదిగా వెళ్తున్నారు. కొంతమంది చేతిని వదిలేస్తారు అనగా మళ్ళీ కలియుగంలోకి వెళ్ళిపోతారు. ఇప్పడు నావికుడు మనల్ని తీసుకువెళ్తున్నారని మీకు తెలుసు. ఆ యాత్రలైతే అనేక రకాలుగా ఉంటాయి. మీదైతే ఒకే రకమైన యాత్ర. ఇది పూర్తిగా అతీతమైన యాత్ర. అయితే, తుఫానులు వస్తాయి, అవి స్మృతిని తెంచేస్తాయి. ఈ స్మృతి యాత్రను మంచి రీతిగా పక్కా చేసుకోండి. ఇందులో శ్రమ చేయండి. మీరు కర్మయోగులు. ఎంత వీలైతే అంత, చేతులతో పని చేస్తూ మనస్సుతో స్మృతి చేస్తూ ఉండండి..... బాబా, ఇక్కడ చాలా దుఃఖముంది, ఇప్పుడు మమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేయండి అని, అర్ధకల్పము నుండి ప్రేయసులైన మీరు ప్రియుడిని స్మృతి చేస్తూ వచ్చారు. స్మృతియాత్రలో ఉన్నట్లయితే మీ పాపాలు సమాప్తమైపోతాయి. మీరే స్వర్గ వారసత్వమును పొందారు, ఇప్పుడు పోగొట్టుకున్నారు. భారతదేశము స్వర్గంగా ఉండేది, అందుకే ప్రాచీన భారతదేశమని అంటారు. భారతదేశానికే చాలా గౌరవాన్నిస్తారు. భారతదేశము అన్నింటికన్నా పెద్దది మరియు అన్నింటికన్నా పాతది కూడా. ఇప్పుడు భారతదేశము ఎంత నిరుపేదగా ఉంది, అందుకే అందరూ దీనికి సహాయము చేస్తారు. మా వద్ద చాలా ధాన్యము పండుతుందని, ఎక్కడి నుండి తెప్పించాల్సిన అవసరము ఉండదని మనుష్యులు భావిస్తారు కానీ వినాశనము ఎదురుగా నిలబడి ఉందని మీకు తెలుసు. ఎవరైతే ఈ విషయమును బాగా అర్థం చేసుకుంటారో, వారికి లోపల చాలా సంతోషముంటుంది. ప్రదర్శనీలకు ఎంతమంది వస్తారు. మీరు సత్యము చెప్తున్నారని అంటారు కానీ మేము తండ్రి నుండి వారసత్వమును తీసుకోవాలని వారు అర్థం చేసుకోవాలి, ఈ విషయం వారి బుద్ధిలో కూర్చోదు. ఇక్కడ నుండి బయటకు వెళ్ళగానే సమాప్తమైపోతుంది. బాబా మనల్ని స్వర్గములోకి తీసుకువెళ్తారని మీకు తెలుసు. అక్కడ గర్భ జైలులోకి వెళ్ళము, అలాగే ఆ జైలులోకి వెళ్ళము. ఇప్పుడు జైలు యాత్ర కూడా ఎంత సహజమైపోయింది. సత్యయుగంలో ఎప్పుడూ జైలు ముఖము కూడా కనిపించదు, రెండు జైళ్ళూ ఉండవు. ఇక్కడ ఇదంతా మాయ యొక్క ఆర్భాటము. పెద్ద పెద్ద వారిని సమాప్తము చేసేస్తుంది. ఈ రోజు చాలా గౌరవాన్నిస్తారు, రేపు ఆ గౌరవము సమాప్తమైపోతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్క విషయము త్వరత్వరగా జరుగుతుంది. మృత్యువు కూడా త్వరగా జరుగుతూ ఉంటుంది. సత్యయుగంలో ఇటువంటి ఉపద్రవాలేవీ ఉండవు. మున్ముందు ఏమి జరుగుతుందో చూడాలి, చాలా భయంకరమైన దృశ్యాలు ఉంటాయి. పిల్లలైన మీకు సాక్షాత్కారము కూడా జరిగింది. పిల్లల కోసము ముఖ్యమైనది స్మృతియాత్ర. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మనసా-వాచా-కర్మణా చాలా-చాలా ఏక్యురేట్ గా అవ్వాలి. బ్రాహ్మణులుగా అయి ఎటువంటి శూద్ర కర్మలను చేయకూడదు.

2. బాబా నుండి లభించిన సలహాపై పూర్తిగా నడుచుకొని ఆజ్ఞాకారులుగా అవ్వాలి. కర్మయోగులుగా అయి ప్రతి కార్యాన్ని చేయాలి. సర్వుల జోలెను జ్ఞానరత్నాలతో నింపాలి.

వరదానము:-

అమృతవేళ మహత్వాన్ని అర్థం చేసుకొని దాన్ని యథార్థ రీతిగా ఉపయోగించుకునే సదా శక్తి సంపన్న భవ

స్వయాన్ని శక్తి సంపన్నంగా తయారుచేసుకునేందుకు రోజూ అమృతవేళ తనువు మరియు మనసుతో విహరించండి. ఎలాగైతే అమృతవేళలో సమయం యొక్క సహయోగముంటుందో, అలాగే బుద్ధి యొక్క సతోప్రధాన స్థితి యొక్క సహయోగము కూడా ఉంటుంది. కావున అటువంటి వరదానీ సమయంలో మనసు యొక్క స్థితి కూడా అన్నింటికన్నా శక్తిశాలిగా ఉండాలి. శక్తిశాలి స్థితి అంటే తండ్రి సమానమైన బీజరూప స్థితి. సాధారణ స్థితిలోనైతే కర్మలు చేస్తూ కూడా ఉండగలరు కానీ వరదాన సమయాన్ని యథార్థ రీతిగా ఉపయోగించుకున్నట్లయితే బలహీనతలు సమాప్తమైపోతాయి.

స్లోగన్:-

తమ శక్తుల ఖజానాలతో శక్తిహీనమైన, పరవశ ఆత్మలను శక్తిశాలిగా తయారుచేయండి.