17-09-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మీరు ఈ పురుషోత్తమ సంగమయుగములోనే ఉత్తమోత్తమ పురుషులుగా అవ్వాలి, అందరికన్నా ఉత్తమ పురుషులు ఈ లక్ష్మీ-నారాయణులు”

ప్రశ్న:-

పిల్లలైన మీరు తండ్రితో కలిసి ఏ ఒక్క గుప్త కార్యమును చేస్తున్నారు?

జవాబు:-

ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపన మరియు దైవీ రాజధాని స్థాపన - మీరు తండ్రితో కలిసి గుప్త రూపంలో ఈ కార్యం చేస్తున్నారు. తండ్రి తోట యజమాని, వారు వచ్చి ముళ్ళ అడవిని పుష్పాల తోటగా తయారుచేస్తున్నారు. ఆ తోటలో భయంకరమైన దుఃఖం కలిగించే వస్తువులేవీ ఉండవు.

గీతము:-

చివరికి ఆ రోజు నేటికి వచ్చింది...... (ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్......)

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తప్పకుండా శరీరము ద్వారానే అర్థం చేయిస్తారు. ఆత్మ శరీరము లేకుండా ఏ కార్యాన్ని చేయలేదు. ఆత్మిక తండ్రి కూడా ఒక్కసారే పురుషోత్తమ సంగమయుగములో శరీరము తీసుకోవాల్సి వస్తుంది. ఇది సంగమయుగము కూడా, దీన్ని పురుషోత్తమ యుగమని కూడా అంటారు ఎందుకంటే ఈ సంగమయుగము తర్వాత మళ్ళీ సత్యయుగము వస్తుంది. సత్యయుగాన్ని కూడా పురుషోత్తమ యుగమని అంటారు. తండ్రి వచ్చి పురుషోత్తమ యుగాన్నే స్థాపన చేస్తారు. సంగమయుగములో వస్తారు కనుక ఇది కూడా తప్పకుండా పురుషోత్తమ యుగము అవుతుంది. ఇక్కడే పిల్లలను పురుషోత్తములుగా తయారుచేస్తారు. తర్వాత పురుషోత్తములైన మీరు కొత్త ప్రపంచంలో ఉంటారు. పురుషోత్తములు అంటే ఉత్తమోత్తమ పురుషులైన ఈ రాధా-కృష్ణులు లేక లక్ష్మీ-నారాయణులు. ఈ జ్ఞానము కూడా మీకే ఉంది. వీరు తప్పకుండా స్వర్గానికి యజమానులని ఇతర ధర్మాల వారు కూడా అంగీకరిస్తారు. భారత్ కు చాలా గొప్ప మహిమ ఉంది కానీ అది స్వయం భారతవాసులకు తెలియదు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని కూడా అంటారు కదా కానీ స్వర్గమంటే ఏమిటో అర్థం చేసుకోరు. స్వర్గానికి వెళ్ళారని అంటున్నారంటే ఇంతవరకు నరకంలో ఉన్నారని వారే ఋజువు చేస్తున్నారు. తండ్రి స్థాపన చేసినప్పుడు స్వర్గముంటుంది. వారైతే కొత్త ప్రపంచాన్నే స్వర్గమని అంటారు. రెండు వస్తువులు కదా - స్వర్గము మరియు నరకము. మనుష్యులైతే స్వర్గాన్ని లక్షల సంవత్సరాలని చెప్తారు. నిన్న స్వర్గముండేది, వీరి రాజ్యముండేది, మళ్ళీ తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు.

మధురమైన గారాబాల పిల్లలూ, మీ ఆత్మ పతితంగా ఉంది కావున నరకములోనే ఉన్నారు అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు కలియుగము ఇంకా 40 వేల సంవత్సరాలుందని కూడా అంటారు, అటువంటప్పుడు తప్పకుండా కలియుగవాసులనే అంటారు కదా. ఇది పాత ప్రపంచము కదా. పాపం మనుష్యులు ఘోరమైన అంధకారములో ఉన్నారు. చివర్లో నిప్పు అంటుకున్నప్పుడు ఇవన్నీ సమాప్తమైపోతాయి. మీరు నంబరువారు పురుషార్థానుసారంగా ప్రీతి బుద్ధికలవారిగా ఉన్నారు. ఎంతగా ప్రీతి బుద్ధి కలవారిగా ఉంటారో, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఉదయమే లేచి చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. ప్రేమ యొక్క అశ్రువులు కూడా వస్తాయి ఎందుకంటే చాలా సమయం తర్వాత తండ్రి వచ్చి కలిశారు. బాబా, మీరు వచ్చి మమ్మల్ని దుఃఖము నుండి విడిపిస్తారు. మేము విషయ సాగరంలో మునకలు వేస్తూ ఎంత దుఃఖితులుగా అవుతూ వచ్చాము. ఇప్పుడిది రౌరవ నరకము. ఇప్పుడు బాబా మీకు మొత్తం చక్ర రహస్యాన్ని అర్థం చేయించారు. మూలవతనమంటే ఏమిటో కూడా వచ్చి తెలియజేసారు. ఇంతకుముందు మీకు తెలియదు, దీనినే ముళ్ళ అడవి అని అంటారు. స్వర్గాన్ని అల్లా తోట, పుష్పాల తోట అని అంటారు. తండ్రిని తోట యజమాని అని కూడా అంటారు కదా. మిమ్మల్ని పుష్పాల నుండి మళ్ళీ ముళ్ళుగా ఎవరు తయారుచేస్తారు? రావణుడు. భారత్ పుష్పాల తోటగా ఉండేది, ఇప్పుడు అడవిలా ఉంది అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అడవిలో జంతువులు, తేళ్ళు మొదలైనవి ఉంటాయి. సత్యయుగములో భయంకరమైన జంతువులు మొదలైనవేవీ ఉండవు. శాస్త్రాలలోనైతే చాలా విషయాలు వ్రాసేశారు. కృష్ణుడిని సర్పము కాటేసింది, ఇలా జరిగింది అని వ్రాసేశారు. కృష్ణుడిని మళ్ళీ ద్వాపర యుగములోకి తీసుకువెళ్ళారు. భక్తి పూర్తిగా వేరే విషయం, జ్ఞాన సాగరుడు ఒక్క తండ్రి మాత్రమే అని తండ్రి అర్థం చేయించారు. అంతేకానీ బ్రహ్మా-విష్ణు-శంకరులు జ్ఞానసాగరులు కాదు. పతిత-పావనుడు అని ఒక్క జ్ఞాన సాగరుడిని మాత్రమే అంటారు. జ్ఞానము ద్వారానే మనుష్యులకు సద్గతి లభిస్తుంది. సద్గతి స్థానాలు రెండు - ముక్తిధామము మరియు జీవన్ముక్తిధామము. ఇప్పుడు ఈ రాజధాని స్థాపన అవుతుంది కానీ గుప్తంగా జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. తండ్రియే వచ్చి ఆదిసనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు, అప్పుడందరూ తమ-తమ మనుష్య శరీరాలలోకి వస్తారు. తండ్రికి తమ శరీరము అయితే లేదు, కనుకనే వారిని నిరాకార గాడ్ ఫాదర్ అని అంటారు. మిగిలిన వారందరూ సాకారులు. వీరిని నిరాకార ఆత్మల నిరాకార గాడ్ ఫాదర్ అని అంటారు. ఆత్మలైన మీరు కూడా అక్కడే ఉంటారు. తండ్రి కూడా అక్కడే ఉంటారు. కానీ గుప్తంగా ఉంటారు. తండ్రియే వచ్చి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. మూలవతనంలో ఎటువంటి దుఃఖమూ ఉండదు. తండ్రి చెప్తున్నారు, ఒకే ఒక విషయంలో మీ కళ్యాణం ఉంది - తండ్రిని స్మృతి చేయండి, మన్మనాభవ. తండ్రికి సంతానముగా అయ్యారు, అంతే, ఇక పిల్లలకు వారసత్వం లభిస్తుందన్నది తెలిసిన విషయమే. అల్లాను స్మృతి చేసినట్లయితే సత్యయుగీ కొత్త ప్రపంచం యొక్క వారసత్వం తప్పకుండా లభిస్తుంది. ఈ పతిత ప్రపంచము వినాశనం కూడా తప్పకుండా జరిగేది ఉంది. అమరపురిలోకి వెళ్ళాల్సిందే. అమరనాథుడు పార్వతులైన మీకు అమరకథను వినిపిస్తున్నారు. తీర్థ స్థానాలకు ఎంతమంది మనుష్యులు వెళ్తారు, అమరనాథ్ కు ఎంతమంది వెళ్తారు. అక్కడేమీ లేదు. అంతా మోసము. సత్యము ఇసుమంత కూడా లేదు. అసత్యమైన శరీరము, అసత్యమైన మాయ అని గాయనం కూడా జరుగుతుంది. దీనికి కూడా అర్థము తెలియాలి. ఇక్కడ ఉన్నదే అసత్యం. ఇది కూడా జ్ఞానం యొక్క విషయం. అంతేకానీ గ్లాసును గ్లాసు అని అనడం అసత్యం కాదు. అయితే తండ్రి గురించి ఏదైతే చెప్తారో, అది అసత్యమే చెప్తారు. సత్యము చెప్పేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు బాబా వచ్చి సత్యాతి-సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తున్నారని మీకు తెలుసు. అసత్యపు వజ్రాలు-ముత్యాలు కూడా ఉంటాయి కదా. ఈరోజుల్లో అసత్యానికి చాలా షో ఉంది. సత్యమైన వాటికన్నా వాటి ప్రకాశము ఎక్కువగా ఉంటుంది. ఈ అసత్యపు రాళ్ళు ఇంతకుముందు ఉండేవి కావు. తర్వాత విదేశాల నుండి వచ్చాయి. అసత్యమైన వాటిని సత్యమైన వాటితో కలిపేస్తారు, అసలు తెలియదు. అయితే వీటిని పరిశీలించగలిగే వస్తువులు కూడా వచ్చాయి. కొద్దిగా కూడా తెలుసుకోలేనటువంటి అసత్యపు ముత్యాలు కూడా వచ్చాయి. ఇప్పుడు పిల్లలైన మీకు ఎటువంటి సంశయమూ ఉండదు. సంశయముండేవారు ఇక మళ్ళీ రారు. ప్రదర్శినీలో ఎంత ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు పెద్ద-పెద్ద దుకాణాలు తెరవండి, మీదొక్కటే సత్యమైన దుకాణము అని తండ్రి చెప్తున్నారు. మీరు సత్యమైన దుకాణాన్ని తెరుస్తారు. గొప్ప-గొప్ప సన్యాసులకు పెద్ద-పెద్ద దుకాణాలు ఉంటాయి, అక్కడకు గొప్ప-గొప్ప వ్యక్తులు వెళ్తారు. మీరు కూడా పెద్ద-పెద్ద సెంటర్లు తెరవండి. భక్తిమార్గపు సామగ్రి పూర్తిగా వేరు. అంతేకానీ భక్తి ప్రారంభం నుండే కొనసాగుతూ వచ్చిందని కాదు. జ్ఞానము ద్వారా సద్గతి అంటే పగలు వస్తుంది. అక్కడ సంపూర్ణ నిర్వికారులుగా, విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారని కూడా మనుష్యులకు తెలియదు. సూర్య వంశము మరియు చంద్ర వంశము, ఇంకే ధర్మమూ ఉండదు. పిల్లలు పాటను కూడా విన్నారు. మనము వచ్చి మన అనంతమైన తండ్రిని కలుసుకునే ఆ సంగమయుగపు రోజులు చివరికి ఈ రోజు వచ్చాయని మీరు అర్థం చేసుకున్నారు. అనంతమైన వారసత్వం పొందేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఆఖరికి ఆ రోజు నేడు వచ్చిందని సత్యయుగంలోనైతే ఈ విధంగా అనరు. చాలా ధాన్యము పండుతుంది, ఇలా జరుగుతుంది అని ఇక్కడివారు భావిస్తారు. మేము స్వర్గ స్థాపన చేస్తున్నామని వారు భావిస్తారు. విద్యార్థులది కొత్త రక్తము, వీరు చాలా సహాయం చేస్తారు అని భావిస్తారు, అందుకే గవర్నమెంట్ వారిపై చాలా శ్రమ చేస్తుంది. కానీ వాళ్ళే మళ్ళీ రాళ్ళు మొదలైనవాటితో కొడతారు. గొడవలు చేయడంలో మొట్టమొదట విద్యార్థులే ముందు ఉంటారు. వారు చాలా తెలివైనవారుగా ఉంటారు. వారిది కొత్త రక్తమని అంటారు. ఇప్పుడు కొత్త రక్తమనే మాటే లేదు. అది రక్త సంబంధము, ఇప్పుడు మీది ఆత్మిక సంబంధము. బాబా, నేను మీకు రెండు మాసాల బిడ్డను అని అంటారు కదా. చాలామంది పిల్లలు ఆత్మిక జన్మదినాన్ని జరుపుకుంటారు. ఈశ్వరీయ జన్మదినాన్ని మాత్రమే జరుపుకోవాలి. ఆ దైహిక జన్మదినాన్ని క్యాన్సల్ చేయాలి. మనము బ్రాహ్మణులకు మాత్రమే తినిపిస్తాము. దీన్ని మాత్రమే జరుపుకోవాలి కదా. అది ఆసురీ జన్మ, ఇది ఈశ్వరీయ జన్మ. రాత్రి-పగలుకు ఉన్నంత తేడా ఉంది, కానీ నిశ్చయంలో కూర్చున్నప్పుడే జరుగుతుంది. ఈశ్వరీయ జన్మ జరుపుకుని మళ్ళీ ఆసురీ జన్మలోకి వెళ్ళడం కాదు. అలా కూడా జరుగుతుంది. ఈశ్వరీయ జన్మను జరుపుకుంటూ-జరుపుకుంటూ మళ్ళీ మాయమైపోతారు. ఈ రోజుల్లోనైతే మ్యారేజ్ డేను కూడా జరుపుకుంటారు, వివాహాన్ని మంచి శుభ కార్యమని భావిస్తారు. నరకంలోకి వెళ్ళే రోజును కూడా జరుపుకుంటారు. ఇది ఆశ్చర్యం కదా. తండ్రి కూర్చొని ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడైతే మీరు ఈశ్వరీయ జన్మదినాన్ని బ్రాహ్మణులతోనే జరుపుకోవాలి. మనము శివబాబా పిల్లలము, మనము జన్మదినాన్ని జరుపుకుంటే శివబాబా స్మృతే ఉంటుంది. ఏ పిల్లలైతే నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారో, వారు జన్మదినాన్ని జరుపుకోవాలి. ఆ ఆసురీ జన్మను మర్చిపోవాలి. ఇది కూడా బాబా సలహానిస్తారు. అది కూడా ఒకవేళ పక్కా నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నట్లయితేనే బాబా సలహానిస్తారు. నేనైతే బాబాకు చెందినవానిగా అయిపోయాను, ఇతరులెవ్వరూ లేరు, అంతే, అప్పుడు అంతమతి సో గతి అయిపోతుంది. బాబా స్మృతిలో మరణించినట్లయితే తర్వాత జన్మ కూడా అటువంటిదే లభిస్తుంది. లేకపోతే అంతిమ సమయంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో...... ఇది కూడా గ్రంథ్ లో ఉంది. అంతిమ సమయంలో గంగా నది తీరమున ఉండాలని ఇక్కడ అంటారు. ఇవన్నీ భక్తిమార్గపు విషయాలు. శరీరం వదిలేటప్పుడు కూడా స్వదర్శన చక్రధారులుగా ఉండాలి అని మీకు తండ్రి చెప్తున్నారు. బుద్ధిలో తండ్రి మరియు చక్రము యొక్క స్మృతి ఉండాలి. ఒకవేళ పురుషార్థము చేస్తూ ఉంటే, అప్పుడు తప్పకుండా అంతిమ సమయంలో స్మృతి కలుగుతుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే పిల్లలైన మీరిప్పుడు అశరీరులుగా అయి తిరిగి వెళ్ళాలి. ఇక్కడ పాత్ర అభినయిస్తూ-అభినయిస్తూ సతోప్రధానము నుండి తమోప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. ఈ సమయంలో ఆత్మనే అపవిత్రంగా ఉన్నప్పుడు పవిత్రమైన శరీరము ఎలా లభిస్తుంది? బాబా అయితే చాలా ఉదాహరణలు అర్థం చేయించారు, ఎంతైనా వారు వజ్రాల వ్యాపారి కదా. నగలో మాలిన్యం చేరదు, బంగారంలో కలుస్తుంది. 24 క్యారెట్ల నుండి 22 క్యారెట్లుగా అవ్వాలంటే వెండిని కలుపుతారు. ఇప్పుడైతే బంగారం లేనే లేదు. అందరి నుండి తీసుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో నోట్లు కూడా ఎలా తయారుచేస్తున్నారో చూడండి. కాగితం కూడా లేదు. కల్ప-కల్పము ఇలాగే జరుగుతూ వచ్చిందని పిల్లలకు తెలుసు. అందరినీ చెక్ చేస్తారు. లాకర్లు మొదలైనవి తెరిపిస్తారు. ఎవరి గురించైనా తనిఖీ మొదలైనవి చేస్తారు కదా. కొంతమందిది మట్టిలో కలిసిపోతుంది...... అని గాయనం కూడా ఉంది. అగ్ని కూడా తీవ్రంగా అంటుకుంటుంది. ఇవన్నీ జరగాల్సిందే అని పిల్లలైన మీకు తెలుసు, అందుకే మీరు భవిష్యత్తు కోసం బ్యాగ్-బ్యాగేజ్ ను తయారు చేసుకుంటున్నారు. ఇంకెవ్వరికీ తెలియదు, 21 జన్మల కోసం మీకు మాత్రమే వారసత్వం లభిస్తుంది. మీ ధనముతోనే భారత్ ను స్వర్గంగా చేస్తున్నారు, అందులో మళ్ళీ మీరే నివసిస్తారు.

పిల్లలైన మీరు మీ పురుషార్థముతో మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. పేదల పెన్నిధి బాబా స్వర్గానికి యజమానులుగా చేసేందుకు వచ్చారు కానీ మీ చదువు ద్వారానే తయారవుతారు. కృప లేక ఆశీర్వాదాలతో కాదు. చదివించడం టీచరు ధర్మము. కృప యొక్క విషయం లేదు. టీచరుకు ప్రభుత్వం నుండి జీతము లభిస్తుంది. అందువలన తప్పకుండా చదివిస్తారు. ఎంత గొప్ప ప్రతిఫలము లభిస్తుంది. పదమాపదమ పతులుగా అవుతారు. కృష్ణుని పాదాలలో పద్మము గుర్తును చూపిస్తారు. మీరు భవిష్యత్తులో పదమపతులుగా అయ్యేందుకు ఇక్కడకు వచ్చారు. మీరు చాలా సుఖవంతులుగా, షావుకారులుగా, అమరులుగా అవుతారు. కాలుడిపై విజయం పొందుతారు. ఈ విషయాలను మనుష్యులు అర్థం చేసుకోలేరు. మీ ఆయుష్షు పూర్తవుతుంది, అమరులుగా అవుతారు. వారు పాండవుల చిత్రాలను చాలా పెద్దవిగా తయారుచేశారు. పాండవులు అంత పొడవుగా ఉండేవారని భావిస్తారు. ఇప్పుడు పాండవులు అయితే మీరు. ఎంత రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. మనుష్యులెవ్వరూ చాలా పొడవుగా ఉండరు. 6 అడుగులే ఉంటారు. భక్తిమార్గములో మొట్టమొదట శివబాబా భక్తి జరుగుతుంది. వారినైతే పెద్దగా తయారుచేయరు. మొదట శివబాబా యొక్క అవ్యభిచారి భక్తి జరుగుతుంది. తర్వాత దేవతల మూర్తులను తయారుచేస్తారు. వారివి మళ్ళీ పెద్ద-పెద్ద చిత్రాలు తయారుచేస్తారు. తర్వాత పాండవులవి పెద్ద-పెద్ద చిత్రాలు తయారుచేస్తారు. ఈ చిత్రాలన్నీ పూజించేందుకు తయారుచేస్తారు. 12 మాసాలకు ఒక్కసారే లక్ష్మీ పూజ చేస్తారు. జగదంబకు రోజూ పూజ చేస్తూ ఉంటారు. మీకు డబల్ పూజ జరుగుతుందని కూడా బాబా అర్థం చేయించారు. నాకైతే కేవలం ఆత్మకు లేక లింగానికి మాత్రమే జరుగుతుంది. మీకు సాలిగ్రామ రూపములో కూడా పూజ జరుగుతుంది మరియు మళ్ళీ దేవతల రూపములో కూడా పూజ జరుగుతుంది. రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు ఎన్ని సాలిగ్రామాలను తయారుచేస్తారు, మరి గొప్పవారు ఎవరు? అందుకే బాబా, పిల్లలకు నమస్కరిస్తారు. ఎంత ఉన్నత పదవిని ప్రాప్తింపజేయిస్తారు.

బాబా ఎంత గుహ్యాతి-గుహ్యమైన విషయాలను వినిపిస్తారు, కనుక పిల్లలకు ఎంత సంతోషముండాలి. మనల్ని భగవాన్-భగవతిగా చేసేందుకు భగవంతుడు చదివిస్తున్నారు. ఎంతగా కృతజ్ఞతలు తెలియజేయాలి. తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే స్వప్నాలు కూడా మంచివే వస్తాయి. సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీ ఈశ్వరీయ ఆత్మిక జన్మదినాన్ని జరుపుకోవాలి, ఆత్మిక సంబంధము పెట్టుకోవాలి, రక్త సంబంధము కాదు. ఆసురీ దైహిక జన్మదినము కూడా క్యాన్సల్. అది మళ్ళీ గుర్తు కూడా రాకూడదు.

2. మీ బ్యాగ్-బ్యాగేజిని భవిష్యత్తు కోసం తయారుచేసుకోవాలి. మీ ధనాన్ని భారత్ ను స్వర్గంగా తయారుచేసే సేవలో సఫలం చేయాలి. మీ పురుషార్థము ద్వారా స్వయానికి రాజ్య తిలకమునిచ్చుకోవాలి.

వరదానము:-

స్మృతి అనే స్విచ్ ను ఆన్ చేసి సెకండులో అశరీరి స్థితిని అనుభవం చేసే ప్రీతి బుద్ధి భవ

ఎక్కడైతే ప్రభువుపై ప్రీతి ఉందో, అక్కడ అశరీరిగా అవ్వడం ఒక సెకండు ఆటతో సమానము. ఎలాగైతే స్విచ్ ఆన్ చేస్తూనే అంధకారము సమాప్తమైపోతుందో, అదేవిధంగా ప్రీతిబుద్ధి కలవారిగా అయి స్మృతి స్విచ్ ను ఆన్ చేసినట్లయితే దేహము మరియు దేహపు ప్రపంచపు స్మృతి యొక్క స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇది సెకండు ఆట. నోటితో బాబా అని అనడానికి కూడా సమయం పడుతుంది కానీ స్మృతిలోకి తీసుకురావడానికి సమయం పట్టదు. ఈ బాబా అన్న పదమే పాత ప్రపంచాన్ని మర్చిపోయేందుకు ఆత్మిక బాంబు.

స్లోగన్:-

దేహ భానమనే మట్టి యొక్క బరువు నుండి అతీతంగా ఉన్నట్లయితే డబల్ లైట్ ఫరిస్తాలుగా అయిపోతారు.