18-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - సుఖమునిచ్చే ఒక్క తండ్రిని స్మృతి చేయండి, ఈ కొద్ది సమయములో యోగబలమును జమ చేసుకున్నట్లయితే అంతిమములో అది చాలా ఉపయోగపడుతుంది”

ప్రశ్న:-

అనంతమైన వైరాగ్యము గల పిల్లలైన మీకు ఏ స్మృతి సదా ఉండాలి?

జవాబు:-

ఇది మా ఛీ-ఛీ శరీరము, దీనిని వదిలి తిరిగి ఇంటికి వెళ్ళాలనే స్మృతి సదా ఉండాలి. తండ్రి మరియు వారసత్వము గుర్తుండాలి, ఇంకేదీ గుర్తు రాకూడదు. ఇది అనంతమైన వైరాగ్యము. తలపై ఉన్న పాపాల భారము తొలగిపోయే విధంగా, ఆత్మ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యే విధంగా, కర్మలు చేస్తూ స్మృతిలో ఉండే పురుషార్థము చేయాలి.

ఓంశాంతి. తండ్రి పిల్లలకు ప్రతి రోజూ చాలా సహజమైన విషయాలను అర్థం చేయిస్తారు. ఇది ఈశ్వరీయ పాఠశాల. గీతలో కూడా భగవానువాచ అని కరెక్టుగా అంటారు. భగవంతుడైన తండ్రి అందరికీ ఒక్కరే. అందరూ భగవంతుడు కాలేరు కానీ అందరూ ఒకే తండ్రికి పిల్లలుగా అవ్వగలరు. తండ్రి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్థాపన చేసేవారని తప్పకుండా బుద్ధిలోకి రావాలి. ఆ తండ్రి నుండి మనకు స్వర్గ వారసత్వము తప్పకుండా లభించే ఉంటుంది. భారతదేశంలోనే శివజయంతికి గాయనముంది కానీ శివజయంతి ఎలా జరుగుతుంది అనేది తండ్రియే స్వయంగా వచ్చి అర్థము చేయిస్తారు. తండ్రి కల్పము యొక్క సంగమయుగములో పిల్లలను మళ్ళీ పతితము నుండి పావనముగా చేసేందుకు అనగా వారసత్వమునిచ్చేందుకు వస్తారు. ఈ సమయంలో అందరికీ రావణుని శాపముంది కావుననే అందరూ దుఃఖమయంగా ఉన్నారు. ఇప్పుడిది కలియుగ పాత ప్రపంచము. మేము బ్రహ్మాముఖవంశావళి బ్రాహ్మణులమని మీరు సదా గుర్తుంచుకోండి. ఎవరైతే తమను తాము బ్రహ్మాకుమార-కుమారీలుగా భావిస్తారో, వారు మేము తాతగారి నుండి బ్రహ్మా ద్వారా తప్పకుండా కల్ప-కల్పము వారసత్వము తీసుకుంటామని అర్థం చేసుకోవాలి. ఇంతమంది పిల్లలు ఇంకెవ్వరికీ ఉండజాలరు. వారు అందరికీ తండ్రి. బ్రహ్మా కూడా బిడ్డయే. పిల్లలందరికీ తాతగారి నుండి వారసత్వము లభిస్తుంది. వారిచ్చే వారసత్వము సత్యయుగ రాజధాని. ఈ అనంతమైన తండ్రి స్వర్గ రచయిత కావున మనకు తప్పకుండా స్వర్గ రాజ్యాధికారము ఉండాలి. కానీ మనకు స్వర్గ రాజ్యాధికారము ఉండేదని మర్చిపోయాము. అయితే, నిరాకార తండ్రి ఎలా ఇస్తారు, తప్పకుండా బ్రహ్మా ద్వారానే ఇస్తారు. భారతదేశంలో వీరి రాజ్యముండేది. ఇప్పుడిది కల్పము యొక్క సంగమము. సంగమయుగములో బ్రహ్మా ఉన్నారు, కావుననే బి.కె.లని పిలవబడతారు. అంధ విశ్వాసము యొక్క విషమేమీ కాదు, ఇక్కడ దత్తత తీసుకున్నారు. మనము బ్రహ్మాకుమార-కుమారీలము. బ్రహ్మా శివబాబా యొక్క పుత్రుడు, మనకు శివబాబా నుండి మళ్ళీ స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది. ఇంతకుముందు కూడా లభించింది, అలా లభించి 5 వేల సంవత్సరాలయ్యింది. మనము దేవీ దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారము. చివరి వరకు వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు క్రీస్తు వచ్చారు, క్రైస్తవ ధర్మము ఇప్పటివరకు కొనసాగుతూ ఉంది మరియు వృద్ధి చెందుతూ ఉంటుంది. మేము క్రీస్తు ద్వారా క్రైస్తవులుగా అయ్యామని వారికి తెలుసు. నేటికి 2 వేల సంవత్సరాల క్రితము క్రీస్తు వచ్చారు. ఇప్పుడు వృద్ధి జరుగుతుంది. మొట్టమొదట సతోప్రధానముగా ఉంటారు, తర్వాత రజో, తమోలలోకి రావాలి. మీరు సత్యయుగంలో సతోప్రధానముగా ఉండేవారు, తర్వాత రజో, తమోలలోకి వచ్చారు. సృష్టి తమోప్రధానము నుండి మళ్ళీ సతోప్రధానముగా తప్పకుండా అవుతుంది. కొత్త ప్రపంచములో ఆదిసనాతన దేవీ దేవతా ధర్మముండేది. ముఖ్యమైన ధర్మాలు నాలుగు. మీ ధర్మము అర్ధకల్పము కొనసాగుతుంది. ఇక్కడ కూడా మీరు ఆ ధర్మానికి చెందినవారే కానీ వికారులైన కారణంగా మీరు స్వయాన్ని దేవీ దేవతలని పిలుచుకోరు. మీరు ఆదిసనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు, కానీ వామమార్గములోకి వెళ్ళిన కారణంగా మీరు పతితులుగా అయిపోయారు, కావుననే మిమ్మల్ని మీరు హిందువులమని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఉన్నతోన్నతమైనవారు శివబాబా. వారి తర్వాత బ్రాహ్మణులైన మీరు. బ్రాహ్మణులైన మీ వర్ణము ఉన్నతాతి ఉన్నతమైనది. బ్రహ్మాకు పిల్లలుగా అయ్యారు కానీ వారసత్వము బ్రహ్మా ద్వారా లభించదు. శివబాబా బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపనను చేస్తున్నారు. ఆత్మలైన మీరిప్పుడు తండ్రిని తెలుసుకున్నారు. నా ద్వారా నన్ను తెలుసుకోవడంతో మొత్తం సృష్టి చక్రం యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని అర్థము చేసుకుంటారని తండ్రి అంటారు. ఆ జ్ఞానము నాకు మాత్రమే ఉంది. నేను జ్ఞాన సాగరుడను, ఆనంద సాగరుడను, పవిత్రతా సాగరుడను. మీరు 21 జన్మల కోసం పవిత్రంగా అవుతారు, తర్వాత విషయసాగరంలో పడిపోతారు. ఇప్పుడు జ్ఞానసాగరుడైన తండ్రి మిమ్మల్ని పతితుల నుండి పావనులుగా చేస్తారు. గంగా నీరు పావనంగా ఏమీ చేయలేదు. స్నానము చేసేందుకు వెళ్తారు కానీ ఆ నీరు పతితపావని కాదు. ఈ నదులు సత్యయుగములో కూడా ఉన్నాయి, కలియుగములో కూడా ఉన్నాయి. నీటిలో తేడా ఏమీ ఉండదు. సర్వుల సద్గతిదాత రాముడొక్కరే అని కూడా అంటారు. వారే జ్ఞాన సాగరుడు, పతితపావనుడు.

తండ్రి వచ్చి జ్ఞానాన్ని తెలియజేస్తారు, దీని ద్వారా మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. సత్య, త్రేతా యుగాలలో భక్తి, శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. మీరు తండ్రి నుండి సదా సుఖము యొక్క వారసత్వమును తీసుకుంటారు. అక్కడ మీకు గంగా స్నానాలు చేయడము లేక యాత్రలు చేయడము అనేవేమీ ఉండవు. ఇది మీ ఆత్మిక యాత్ర, దీనిని మనుష్యులెవ్వరూ నేర్పించలేరు. బాబా ఆత్మలందరికీ తండ్రి, శారీరక తండ్రులు అనేకమంది ఉన్నారు. ఆత్మిక తండ్రి ఒక్కరే. ఇది పక్కాగా గుర్తుంచుకోండి. బాబా కూడా మీకు ఎంతమంది తండ్రులని అడిగితే ఇలా అడుగుతున్నారేమిటి అని తికమకపడతారు. అందరికీ ఒకే తండ్రి ఉంటారు. ఇద్దరు-ముగ్గురు తండ్రులెలా ఉంటారు. ఆ తండ్రియైన పరమాత్మను మీరు దుఃఖములో స్మృతి చేస్తారని తండ్రి అర్థము చేయిస్తారు. ఓ పరమపిత పరమాత్మ, మమ్మల్ని దుఃఖము నుండి విడిపించండి అని దుఃఖములో సదా వేడుకుంటారు. అనగా ఇద్దరు తండ్రులున్నట్లు కదా. ఒకరు దైహిక తండ్రి, మరొకరు ఆత్మిక తండ్రి. మీరే తల్లి-తండ్రి, మేము మీ పిల్లలము అని వారి మహిమనే చేస్తారు. మీ కృపతో అపారమైన సుఖము లభిస్తుందని అంటారు. లౌకిక తల్లిదండ్రుల నుండి అపారమైన సుఖము లభించదు. దుఃఖము కలిగినప్పుడు ఆ తండ్రిని స్మృతి చేస్తారు. ఆ తండ్రియే ఇటువంటి ప్రశ్నలను అడుగుతారు, ఇంకెవ్వరూ ఇలా అడగలేరు.

బాబా, మీరు వస్తే మేము మీ నుండి తప్ప ఇంకెవ్వరి నుండి వినము, మిగిలిన వారంతా దుఃఖమునే ఇస్తారు, సుఖమునిచ్చేవారు మీరు మాత్రమే అని భక్తి మార్గంలో మీరు పాడతారు. కావున తండ్రి వచ్చి మీరు ఏమి అనేవారు అనేది గుర్తు తెప్పిస్తున్నారు. మీరు మాత్రమే బ్రహ్మాకుమార-కుమారీలుగా పిలువబడతారని మీకు తెలుసు. బి.కె.లంటే ఎవరు, మమ్మా, బాబా ఎవరు అనేది కూడా తెలియనంతగా మనుష్యుల బుద్ధి రాతిబుద్ధిగా ఉంది. వీరు సాధువు కాదు, సత్పురుషుడూ కాదు. సాధు-సన్యాసులను గురువులని అంటారు కానీ మాత-పితలని అనరు. ఈ తండ్రి వచ్చి దైవీ ధర్మము యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తారు. అక్కడ ఈ రాజు-రాణులు, లక్ష్మీనారాయణులు రాజ్యము చేసేవారు. మొదట పవిత్రంగా ఉంటారు, తర్వాత అపవిత్రంగా అవుతారు. పూజ్యులుగా ఉన్నవారే 84 జన్మలను తీసుకుంటారు. మొదట అనంతమైన తండ్రి నుండి 21 జన్మల సుఖపు వారసత్వము లభిస్తుంది. కుమారీలంటే 21 కులాలను ఉద్ధరించేవారు. ఇది మీ మహిమనే. మీరు కుమారీలు, గృహస్థులు కారు. పెద్దవారైనా కానీ మరజీవాగా అయ్యి, అందరూ తండ్రికి పుత్రులుగా, పుత్రికలుగా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మాకు అనేకమంది పిల్లలున్నారు, ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటారు. తర్వాత వీరందరూ దేవతలుగా అవుతారు. ఇది శివబాబా యజ్ఞము. దీనిని రాజస్వ యజ్ఞమని, స్వరాజ్యాన్ని పొందే యజ్ఞమని అంటారు. తండ్రి నుండి ఆత్మలకు స్వర్గ రాజ్య వారసత్వము లభిస్తుంది. ఈ రాజస్వ అశ్వమేధ జ్ఞాన యజ్ఞములో ఏం చేయాలి? శరీర సహితంగా ఏదైతే ఉందో, అదంతా బలిహారము చేయాలి అనగా స్వాహా చేయాలి. ఈ యజ్ఞము ద్వారానే మీరు మళ్ళీ రాజ్యమును పొందుతారు. మీరు భక్తి మార్గములో, ఓ బాబా, మీరు వచ్చినప్పుడు మేము మీపై బలిహారమవుతాము, సమర్పణవుతామని పాడేవారని తండ్రి స్మృతిని కలిగిస్తున్నారు. ఇప్పుడు మీరు స్వయాన్ని బ్రహ్మాకుమార-కుమారీలుగా భావిస్తున్నారు. మీ గృహస్థ వ్యవహారములో ఉండండి కానీ కమలపుష్ప సమానంగా, పావనంగా ఉండవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనము బాబా పిల్లలము. ఆత్మలైన మీరు ప్రేయసులు. నేనొక్కడినే ప్రియుడిని అని తండ్రి అంటారు. మీరు ప్రియుడినైన నన్ను పిలుస్తూ ఉంటారు. మీరు అర్థకల్పము నుండి ప్రేయసులు. పరమపిత పరమాత్మ అని ఎవరినైతే అంటారో, వారు నిరాకారుడు. ఆత్మ కూడా నిరాకారియే, అది ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తుంది. మీరు భక్తి మార్గములో కూడా పాత్రను అభినయించాలి. భక్తి అనగా రాత్రి, మనుష్యులు అంధకారములో ఎదురుదెబ్బలు తింటారు. ద్వాపరము నుండి మొదలుకుని మీరు ఎదురుదెబ్బలు తింటూ వచ్చారు. ఈ సమయంలో మహా దుఃఖమయంగా అయిపోయారు. ఇప్పుడిది పాత ప్రపంచము యొక్క అంతిమము. ఈ ధనము మొదలైనదంతా మట్టిలో కలిసిపోనున్నది. కోటీశ్వరులైనా లేక రాజు అయినా, పిల్లలు జన్మిస్తే ఈ ధనమంతా మా పిల్లల కోసమేనని భావిస్తారు. మా పిల్లలు, మనవళ్ళు తింటారని అనుకుంటారు. వారేమీ తినరు అని తండ్రి అంటారు. ఈ ప్రపంచమే సమాప్తమవ్వనున్నది. ఇక కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. చాలా విఘ్నాలు వస్తాయి. పరస్పరంలో కొట్లాడుకుంటారు. అంతిమములో రక్తపు నదులు ప్రవహించే విధంగా కొట్లాడుకుంటారు. మీరు ఎవరితోనూ యుద్ధము చేయరు. మీరు యోగబలముతో ఉంటారు. మీరు స్మృతిలో ఉన్నట్లయితే, మీ ముందుకు ఎవరైనా చెడు ఆలోచనతో వచ్చినా, వారికి భయంకరమైన సాక్షాత్కారము జరిగి వెంటనే పారిపోతారు. మీరు శివబాబాను స్మృతి చేస్తారు, వారు పారిపోతారు. పక్కా పిల్లలుగా ఉన్నవారు, మాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అనే పురుషార్థములో ఉంటారు. హత్ కారడే..... (చేతులతో పని చేస్తూ, బుద్ధితో తండ్రి స్మృతిలో ఉండాలి), పిల్లలు లౌకిక ఇంటిని కూడా సంభాళించాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు. కానీ ఆత్మలైన మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాల భారము కూడా తొలగిపోతుంది. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు, కానీ నంబరువారు పురుషార్థానుసారంగా అవుతారు. తర్వాత మీరందరూ ఈ శరీరాలను వదిలేస్తారు, బాబా ఆత్మలందరినీ దోమల గుంపు వలె తీసుకువెళ్తారు. మిగిలిన ప్రపంచములోని వారంతా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. భారతదేశములో కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటారు. దాని కోసమే ఈ మహాభారత యుద్ధము జరగనున్నది. ఇక్కడ చాలా వృద్ధి జరుగుతుంది. ప్రదర్శనీలు, ప్రొజెక్టర్లు మొదలైన వాటి ద్వారా ఎంతమంది వింటారు. వారు ప్రజలుగా అవుతూ ఉంటారు. రాజు ఒక్కరే ఉంటారు, మిగిలినవారంతా ప్రజలు. మంత్రి కూడా ప్రజల లైనులోనే వస్తారు. అనేకమంది ప్రజలుంటారు. ఒక రాజుకు లక్షల సంఖ్యలో ప్రజలుంటారు. కావున రాజు-రాణులకు శ్రమ చేయవలసి ఉంటుంది కదా.

అన్నీ చేస్తూ నిరంతరం నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తారు. ఉదాహరణకు ప్రేయసీ-ప్రియుడు ఉంటారు, వారి మధ్యన దైహిక ప్రేమ ఉంటుంది. పిల్లలైన మీరిప్పుడు ప్రేయసులు. మీ ప్రియుడు వచ్చి ఉన్నారు. వారు మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు చదువుకుంటూ-చదువుకుంటూ దేవతలుగా అయిపోతారు. స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు సదా కోసం నిరోగులుగా కూడా అవుతారు. తర్వాత 84 జన్మల చక్రమును కూడా గుర్తుంచుకోవాలి. సత్యయుగంలో ఇన్ని జన్మలుంటాయి, త్రేతాలో ఇన్ని జన్మలుంటాయని గుర్తుంచుకోవాలి. దేవీ-దేవతా ధర్మానికి చెందిన మనము 84 జన్మల చక్రములో పూర్తిగా తిరిగాము. మున్ముందు మీరు చాలా వృద్ధి చెందుతారు. మీ సెంటర్లు వేల సంఖ్యకు చేరుకుంటాయి. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలని మీరు ప్రతి సందులోనూ అర్థము చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇది ఛీ-ఛీ శరీరము. ఇది అనంతమైన వైరాగ్యము. సన్యాసులు కేవలం హద్దులోని ఇళ్ళు-వాకిళ్ళను వదులుతారు. వారు హఠయోగులు. వారు రాజయోగాన్ని నేర్పించలేరు. ఈ భక్తి కూడా అనాదిగా ఉందని అంటారు. ఈ భక్తి ద్వాపరం నుండి ప్రారంభమవుతుందని తండ్రి అంటారు. 84 మెట్లు దిగి మీరిప్పుడు తమోప్రధానంగా అయ్యారు. మీరు దేవీ దేవతలుగా ఉండేవారు. మేము క్రైస్తవులుగా ఉండేవారమని క్రైస్తవులు అంటారు. మనము సత్యయుగంలో ఉండేవారమని మీకు తెలుసు. తండ్రి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. లక్ష్మీనారాయణులుగా ఉన్నవారే ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. సత్యయుగంలో ఒకే రాజా-రాణి ఉండేవారు, ఒకే భాష ఉండేది. పిల్లలకు ఈ సాక్షాత్కారము కూడా జరిగింది. మీరంతా ఆదిసనాతన ధర్మానికి చెందినవారు. మీరే 84 జన్మలు తీసుకుంటారు. వారు ఆత్మ నిర్లేపి అని, ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు, ఇది తప్పు. అందరిలో ఆత్మ ఉంటుంది, అటువంటప్పుడు మాలో పరమాత్మ ఉన్నారని ఎలా అంటారు. అలా అయితే అందరూ తండ్రులైనట్లు. ఎంత తమోప్రధానముగా అయిపోయారు. ఇంతకుముందు ఏది వింటే అది నమ్మేసేవారు. ఇప్పుడు తండ్రి వచ్చి సత్యాన్ని వినిపిస్తారు. మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇస్తారు, దీని ద్వారా మీరు సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలను తెలుసుకుంటారు. ఇదే అమరకథ కూడా. అంతేకానీ సూక్ష్మవతనంలో కథలు మొదలైనవేవీ లేవు. ఇవన్నీ భక్తి మార్గపు అంటు మొక్కలు. మీరు అమరులుగా అయ్యేందుకు అమరకథను వింటున్నారు. అక్కడ మీరు సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఏడుస్తారు, తల కొట్టుకుంటారు. అక్కడ వ్యాధులు మొదలైనవేవీ ఉండవు. అక్కడ సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆయుష్షు కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడ పతితత్వము ఉండదు. మనము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశామని, ఇప్పుడు మనల్ని తీసుకువెళ్ళేందుకు బాబా వచ్చారని పక్కా చేసుకోవాలి. మీకు పావనంగా అయ్యేందుకు యుక్తులను కూడా తెలియజేస్తారు. కేవలం తండ్రినైన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. సత్యయుగములో 16 కళా సంపూర్ణులుగా ఉంటారు, తర్వాత కళలు తగ్గుతూ వస్తాయి. ఇప్పుడు మీలో ఏ కళలు లేవు. తండ్రియే దుఃఖము నుండి విడిపించి సుఖములోకి తీసుకువెళ్తారు, కావుననే వారిని లిబరేటర్ (ముక్తిదాత) అని అంటారు. వారు అందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు. మీ గురువులు మిమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్ళరు. ఆ గురువు వెళ్ళిపోతే, వారి శిష్యుడు సింహాసనంపై కూర్చొంటారు. ఇక తర్వాత, ఆ శిష్యుల మధ్యన చాలా గొడవలు జరుగుతాయి. సింహాసనం కోసం పరస్పరంలో కొట్లాడుకుంటారు. తండ్రి అంటారు, నేను ఆత్మలైన మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను, మీరు సంపూర్ణులుగా అవ్వకపోతే శిక్షలను అనుభవిస్తారు మరియు పదవి భ్రష్టమైపోతుంది. ఇక్కడ రాజధాని స్థాపన అవుతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్మృతి యొక్క అభ్యాసమును ఎంతగా చేయాలంటే, చెడు ఆలోచన గలవారెవరైనా మీ ముందుకు రాగానే వారు వెంటనే మారిపోవాలి. నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు..... ఈ పురుషార్థములో ఉండాలి.

2. స్వరాజ్యాన్ని పొందేందుకు శరీర సహితంగా మీ వద్ద ఏదైతే ఉందో, దానినంతటినీ బలిహారము చేయాలి. ఎప్పుడైతే ఈ రుద్ర యజ్ఞములో సర్వస్వాన్ని స్వాహా చేస్తారో, అప్పుడు రాజ్య పదవి లభిస్తుంది.

వరదానము:-

జ్ఞానయుక్త ఆత్మగా అయి జ్ఞాన సాగరునిలో మరియు జ్ఞానములో ఇమిడిపోయే సర్వ ప్రాప్తి స్వరూప భవ

జ్ఞానయుక్త ఆత్మలు సదా జ్ఞాన సాగరునిలో మరియు జ్ఞానములో ఇమిడి ఉంటారు, సర్వ ప్రాప్తి స్వరూపులుగా ఉన్న కారణంగా వారికి ఇచ్ఛా మాత్రమ్ అవిద్యా స్థితి స్వతహాగా ఉంటుంది. అంశమాత్రమైనా, ఏవైనా స్వభావ-సంస్కారాలకు ఆధీనులుగా ఉన్నవారిని, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారిని, ఎందుకు-ఏమిటి అనే ప్రశ్నలతో ఆర్తనాదాలు చేసేవారిని, పిలిచేవారిని, లోపల ఒక రూపం బయట మరొక రూపంలో ఉండే వారిని జ్ఞానీ ఆత్మలని అనలేరు.

స్లోగన్:-

ఈ జీవితములో అతీంద్రియ సుఖాన్ని మరియు ఆనందాన్ని అనుభవం చేసేవారే సహజయోగులు.