21-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - తండ్రి మిమ్మల్ని సుందరమైన దేవీ-దేవతలుగా తయారుచేసేందుకు చదివిస్తున్నారు, సుందరతకు ఆధారము పవిత్రత”

ప్రశ్న:-

ఆత్మిక జ్యోతిపై బలిహారమయ్యే దీపపు పురుగుల గుర్తులు ఏమిటి?

జవాబు:-

బలిహారమయ్యే దీపపు పురుగులు - 1. జ్యోతి (బాబా) ఏ విధముగా ఉందో, ఎలా ఉందో అన్నదానిని యథార్థ రూపములో తెలుసుకుంటారు మరియు స్మృతి చేస్తారు. 2. బాబాపై బలిహారమవ్వడం అనగా బాబా సమానంగా అవ్వడం 3. బాబాపై బలిహారమవ్వడం అనగా బాబా కంటే కూడా ఉన్నతంగా రాజ్యానికి అధికారులుగా అవ్వడం.

గీతము:-

సభలో జ్యోతి వెలిగింది..... (మహఫిల్ మే జల్ ఉఠీ షమా.....)

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని ఈ లైను విన్నారు. ఈ విధంగా ఎవరు అర్థం చేయిస్తున్నారు? ఆత్మిక తండ్రి. వారు ఒక జ్యోతి కూడా. వారికి అనేక పేర్లు పెట్టేశారు. బాబాను ఎంతగానో మహిమ కూడా చేస్తుంటారు. ఇది కూడా పరమపిత పరమాత్ముని మహిమయే కదా. దీపపు పురుగుల కోసం తండ్రి దీపంగా అయ్యి వచ్చారు. దీపపు పురుగులు దీపాన్ని చూసినప్పుడు దానిపై బలిహారమయ్యి శరీరాలను విడిచిపెట్టేస్తాయి. దీపముపై ప్రాణాలిచ్చే దీపపు పురుగులు ఎన్నో ఉన్నాయి. అందులోనూ విశేషంగా దీపావళి రోజున అనేక దీపాలను వెలిగిస్తారు, అప్పుడు చిన్న-చిన్న జీవులు ఎన్నో రాత్రి చనిపోతాయి. మన తండ్రి సుప్రీమ్ ఆత్మ అని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. వారిని హుస్సేన్ అని కూడా అంటారు, సదా పవిత్రంగా ఉంటారు కనుక చాలా సుందరంగా ఉంటారు. ఆత్మ పవిత్రంగా అయితే దానికి శరీరము కూడా పవిత్రమైనది, సహజమైన సౌందర్యం కలది లభిస్తుంది. శాంతిధామములో ఆత్మలు పవిత్రంగా ఉంటాయి, మళ్ళీ ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చినప్పుడు సతోప్రధానము నుండి సతో, రజో, తమోలోకి వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ సుందరము నుండి శ్యామంగా అనగా నల్లగా, అపవిత్రంగా అయిపోతాయి. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు స్వర్ణిమయుగ ఆత్మగా చెప్పబడుతుంది. ఆ తర్వాత వారికి శరీరం కూడా స్వర్ణిమ యుగానిదే లభిస్తుంది. ప్రపంచము కూడా పాతదిగా మరియు కొత్తదిగా అవుతుంది. భక్తిమార్గములో ఆ సుందరమైన పరమపిత పరమాత్మనే - ఓ శివబాబా, అని పిలుస్తూ ఉంటారు, ఆ నిరాకార పరమపిత పరమాత్మ ఆత్మలను అపవిత్రము నుండి పవిత్రంగా, సుందరమైనవారిగా తయారుచేయడానికి వచ్చి ఉన్నారు. ఈ రోజుల్లోనైతే చాలామంది సుందరంగా ఉంటారు, కానీ వారి ఆత్మ పవిత్రంగా ఉందని కాదు. శరీరము సుందరంగా ఉన్నా ఆత్మ అయితే పతితమైనదే కదా. విదేశాలలో ఎంత సుందరంగా ఉంటారు. ఈ లక్ష్మీ-నారాయణులు సత్యయుగ సౌందర్యము కలవారు మరియు ఇక్కడిది నరకం యొక్క సౌందర్యము అని మీకు తెలుసు. మనుష్యులకు ఈ విషయాలు తెలియవు. ఇది నరకం యొక్క సౌందర్యము అని పిల్లలకే అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు మనము స్వర్గము కోసం సహజ సౌందర్యవంతులుగా తయారవుతున్నాము. 21 జన్మల కోసం వీరిలా సుందరంగా తయారవుతాము. ఇక్కడి సౌందర్యము ఒక్క జన్మకు మాత్రమే ఉంటుంది. మొత్తం ప్రపంచములోని మనుష్యమాత్రులనే కాక మొత్తం ప్రపంచమంతటినీ సుందరంగా తయారుచేయడానికి ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. కొత్త ప్రపంచమైన సత్యయుగంలో సుందరమైన దేవీ-దేవతలు ఉండేవారు. ఆ విధంగా తయారయ్యేందుకు మీరిప్పుడు చదువుకుంటున్నారు. బాబాను దీపం అని కూడా అంటారు కానీ వారు పరమ ఆత్మ. ఏవిధంగా మిమ్మల్ని ఆత్మ అని అంటారో, అదే విధంగా వారిని పరమ ఆత్మ అని అంటారు. పిల్లలైన మీరు తండ్రి మహిమను గానము చేస్తారు, తండ్రి మళ్ళీ పిల్లలైన మీ మహిమను గానము చేస్తారు, నా కన్నా కూడా ఉన్నతమైన పదవిని పొందే విధంగా నేను మిమ్మల్ని ఉన్నతంగా తయారుచేస్తాను. నేను ఎవరినో, ఏ విధంగా ఉంటానో, ఏ విధంగా పాత్రను అభినయిస్తానో ఇంకెవ్వరికీ తెలియదు. ఆత్మలైన మనం పాత్రలను అభినయించేందుకు పరంధామము నుండి ఏ విధంగా వస్తామో పిల్లలైన మీకిప్పుడు తెలుసు. మనం శూద్ర కులములో ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ కులములోకి వచ్చాము. ఇది కూడా మీ వర్ణము. ఇతర ధర్మాల వారెవ్వరికీ ఈ వర్ణాలు లేవు. వారికి వర్ణాలుండవు. వారికి ఒకే వర్ణము ఉంది, వారిని క్రిస్టియన్లు అనే అంటారు. కానీ వారు కూడా సతో-రజో-తమోలలోకి వస్తారు. మిగిలిన ఈ వర్ణాలన్నీ మీ కోసమే ఉన్నాయి. సృష్టి కూడా సతో-రజో-తమోలలోకి వస్తుంది. అనంతమైన తండ్రి కూర్చుని ఈ సృష్టి చక్రాన్ని అర్థం చేయిస్తున్నారు. జ్ఞానసాగరుడు, పవిత్రతా సాగరుడైన తండ్రియే, నేను పునర్జన్మలు తీసుకోను అని స్వయంగా చెప్తున్నారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వస్తారు అన్నది మనుష్యులకు తెలియదు. వారి జీవిత కథను గురించి కూడా తెలియదు. నేను ఎవరినో, ఏ విధంగా ఉంటానో, నాలో ఏ పాత్ర ఉందో, సృష్టిచక్రము ఏ విధంగా తిరుగుతుందో - ఇది పిల్లలైన మీకు నేను కల్ప-కల్పము అర్థం చేయిస్తాను. మనం మెట్లు దిగుతూ-దిగుతూ తమోప్రధానంగా అయిపోయామని మీకు తెలుసు. 84 జన్మలు కూడా మీరే తీసుకుంటారు. అంతిమంలో వచ్చేవారు కూడా సతో-రజో-తమోలలోకి రావల్సిందే. మీరు తమోప్రధానంగా అయినట్లయితే మొత్తం ప్రపంచం తమోప్రధానంగా అయిపోతుంది. ఆ తర్వాత మీరు మళ్ళీ తప్పకుండా తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాల్సిందే. ఈ సృష్టి చక్రము అలా తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడిది కలియుగము, దీని తర్వాత మళ్ళీ సత్యయుగము వస్తుంది. కలియుగము ఆయుష్షు పూర్తి అయ్యింది. మళ్ళీ పిల్లలైన మీకు రాజయోగము నేర్పించేందుకు నేను సాధారణ తనువులో కల్పక్రితము వలె ప్రవేశించాను అని తండ్రి చెప్తున్నారు. ఈ రోజుల్లో యోగాలు అనేక రకాలుగా ఉన్నాయి. బ్యారిస్టర్ యోగము, ఇంజనీర్ యోగము..... బ్యారిస్టర్ చదువును చదివేందుకు బ్యారిస్టర్ తోపాటు బుద్ధియోగాన్ని జోడించవలసి ఉంటుంది. మనము బ్యారిస్టరుగా అవుతున్నప్పుడు మనల్ని ఆ విధంగా చదివించేవారిని స్మృతి చేస్తాము. వారికి తమ తండ్రి వేరుగా ఉంటారు, ఒకవేళ గురువు కూడా ఉంటే వారిని కూడా స్మృతి చేస్తూ ఉంటారు. అయినా కూడా బ్యారిస్టర్ తోపాటు వారి బుద్ధి యోగముంటుంది. ఆత్మయే చదువుకుంటుంది, ఆత్మయే శరీరము ద్వారా జడ్జ్, బ్యారిస్టర్ మొదలైనవారిగా తయారౌతుంది.

పిల్లలైన మీరిప్పుడు ఆత్మాభిమానులుగా అయ్యే సంస్కారాలను స్వయంలో ధారణ చేస్తున్నారు. అర్థకల్పము దేహాభిమానములో ఉన్నారు, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మలోనే చదువుకునే సంస్కారం ఉంది. మనుష్యాత్మనే జడ్జ్ గా అవుతుంది, ఇప్పుడు మనము విశ్వానికి యజమానులుగా, దేవతలుగా అవుతున్నాము, మనల్ని ఆ విధంగా చదివించేవారు పరమ ఆత్మ అయిన శివబాబా. వారే జ్ఞానసాగరుడు, శాంతి, సంపదల సాగరుడు. సాగరము నుండి రత్నాల పళ్ళెములు వెలువడ్డాయని చూపిస్తారు. ఇవన్నీ భక్తి మార్గములోని విషయాలు అని తండ్రి రెఫర్ చేయవలసి ఉంటుంది. ఇవి అవినాశీ జ్ఞానరత్నాలు, ఈ జ్ఞాన రత్నాలతో మీరు చాలా షావుకార్లుగా అవుతారు, ఆ తర్వాత వజ్ర వైఢూర్యాలు కూడా మీకు చాలా లభిస్తాయి అని తండ్రి చెప్తున్నారు. ఈ ఒక్కొక్క రత్నము లక్షల విలువ చేస్తుంది, ఇవి మిమ్మల్ని ఎంతో షావుకార్లుగా చేస్తాయి. భారత్ నిర్వికారీ ప్రపంచంగా ఉండేది, అందులో పవిత్రమైన దేవతలు ఉండేవారు. ఇప్పుడు నల్లగా అపవిత్రంగా అయిపోయారని మీకు తెలుసు. ఆత్మ మరియు పరమాత్మల మేళా జరుగుతుంది. ఆత్మ శరీరములో ఉన్నప్పుడే వినగలుగుతుంది. పరమాత్మ కూడా శరీరములోకి వస్తారు. ఆత్మ మరియు పరమాత్మల ఇల్లు శాంతిధామము. అక్కడ ఎటువంటి కదలికలూ ఉండవు. ఇక్కడ పరమాత్మైన తండ్రి వచ్చి పిల్లలను కలుస్తారు. శరీర సహితంగా కలుస్తారు. అది ఇల్లు, అక్కడ మీరు విశ్రాంతిని తీసుకుంటారు. పిల్లలైన మీరిప్పుడు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు, మిగిలిన ప్రపంచం కలియుగములో ఉంది. భక్తిమార్గములో చాలా ఖర్చు చేస్తారు, అలాగే అనేక చిత్రాలను కూడా తయారుచేస్తారు, ఎన్నో పెద్ద-పెద్ద మందిరాలను నిర్మిస్తారు అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. లేకపోతే కృష్ణుడి చిత్రాన్ని ఇంట్లోనే పెట్టుకోవచ్చు. చిత్రాలు చాలా చౌకగా లభిస్తున్నా కూడా అంతంత దూరాలలో ఉన్న మందిరాలకు ఎందుకు వెళ్తారు. ఇది భక్తిమార్గము. సత్యయుగంలో ఈ మందిరాలు మొదలైనవి ఉండవు. అక్కడ పూజ్యులుగానే ఉంటారు. కలియుగంలో అందరూ పూజారులు ఉంటారు. మీరిప్పుడు సంగమయుగములో పూజ్యులైన దేవతలుగా తయారవుతున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు. ఈ సమయంలో మీ ఈ అంతిమ పురుషార్థీ శరీరము చాలా విలువైనది. ఈ శరీరంలో ఉంటూ మీరు చాలా సంపాదనను జమ చేసుకుంటారు. అనంతమైన తండ్రితో పాటుగా మీరు తింటూ, తాగుతూ ఉంటారు. అందరూ వారినే పిలుస్తారు. కృష్ణునితో తింటాము అని అనరు. నీవే తల్లివి-తండ్రివి అని తండ్రిని స్మృతి చేస్తారు...... పిల్లలైతే తండ్రితో ఆడుకుంటూ ఉంటారు. మేమంతా కృష్ణుడి పిల్లలము అని ఎవరూ అనరు. ఆత్మలందరూ పరమపిత పరమాత్ముని సంతానము. మీరు వచ్చినట్లయితే మేము మీతోనే ఆడుకుంటాము, తింటాము అన్నీ చేస్తాము అని ఆత్మ శరీరము ద్వారా చెప్తుంది. మీరు బాప్ దాదా అని అంటారు. మరి ఇది ఒక కుటుంబం వంటిది కదా. బాప్ దాదా మరియు పిల్లలు ఉంటారు. ఈ బ్రహ్మా అనంతమైన రచయిత. తండ్రి వీరిలో ప్రవేశించి వీరిని దత్తత తీసుకుంటారు. నీవు నా వాడివి అని వారితో బాబా అంటారు. ఇది ముఖవంశావళి. స్త్రీని కూడా దత్తత తీసుకుంటారు కదా. అప్పుడు తను కూడా ముఖవంశావళిగా అవుతారు. నీవు నా దానవు అని అంటారు. ఆ తర్వాత ఆమె ద్వారా కుఖవంశావళి పిల్లలు జన్మిస్తారు. ఈ పద్ధతి ఎక్కడ నుండి ప్రారంభమైంది? నేను వీరిని దత్తత తీసుకున్నాను కదా, అలాగే వీరి ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకుంటాను అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు నా పిల్లలు. కానీ వీరు పురుషుడు. కావున మిమ్మల్ని అందరినీ సంభాళించేందుకు మళ్ళీ సరస్వతిని కూడా దత్తత తీసుకున్నాను. వారికి మాత అనే టైటిల్ లభించింది. సరస్వతీ నది కదా, ఈ నది ఒక మాత కదా. తండ్రి సాగరుడు. ఈ నది కూడా సాగరము నుండే వెలువడింది. బ్రహ్మపుత్ర నది మరియు సాగరము యొక్క మేళా చాలా పెద్దదిగా ఉంటుంది. ఇటువంటి మేళా ఇంకెక్కడా జరగదు. అది నదుల మేళా, ఇది ఆత్మ మరియు పరమాత్మల మేళా. బాబా శరీరములోకి వచ్చినప్పుడే మేళా కూడా జరుగుతుంది. నేను హుస్సెన్ ను, నేను వీరిలో కల్ప-కల్పము ప్రవేశిస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రమంతా ఉంది, దీనికి 5 వేల సంవత్సరాలు ఆయుష్షు ఉంటుంది. ఈ అనంతమైన ఫిల్మ్ నుండి వారు హద్దులోని ఫిల్మ్ లు తయారుచేస్తారు. ఏదైతే గతించిందో, అది వర్తమానం అవుతుంది. వర్తమానము మళ్ళీ భవిష్యత్తుగా అవుతుంది, అప్పుడు దానిని గతము అని అంటారు. గతంగా మారేందుకు ఎంత సమయము పడుతుంది. కొత్త ప్రపంచములోకి వచ్చి ఎంత సమయము గడిచింది? 5 వేల సంవత్సరాలు. ఇప్పుడు మీరందరూ స్వదర్శన చక్రధారులు. మేము మొదట బ్రాహ్మణులుగా ఉండేవారము, ఆ తర్వాత దేవతలుగా అయ్యాము అని మీరు అర్థం చేయిస్తారు. పిల్లలైన మీకిప్పుడు తండ్రి ద్వారా శాంతిధామము మరియు సుఖధామము యొక్క వారసత్వము లభిస్తుంది. తండ్రి వచ్చి మూడు ధర్మాలను ఒకేసారి స్థాపన చేస్తారు. మిగిలిన ధర్మాలన్నింటినీ వినాశనము చేయిస్తారు. మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళే సద్గురువు అయిన తండ్రి లభించారు. మమ్మల్ని సద్గతిలోకి తీసుకువెళ్ళండి, శరీరాన్ని సమాప్తం చేయండి అని పిలుస్తారు కూడా. మేము శరీరాన్ని వదిలి శాంతిధామానికి వెళ్ళే యుక్తిని తెలియజేయండి అని అంటారు. మనుష్యులు గురువుల వద్దకు కూడా ఈ కోరికతోనే వెళ్తారు. కానీ ఆ గురువులు శరీరము నుండి విడిపించి తమతోపాటు తీసుకువెళ్ళలేరు. పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే. కావున వారు వచ్చినప్పుడు మనం తప్పకుండా పావనంగా అవ్వాలి. తండ్రిని మాత్రమే కాలుడికే కాలుడు, మహాకాలుడు అని అంటారు. అందరినీ శరీరము నుండి విడిపించి తమతో పాటు తీసుకువెళ్తారు. వీరు సుప్రీమ్ గైడ్. ఆత్మలందరినీ తిరిగి తీసుకువెళ్తారు. ఇది ఛీ-ఛీ శరీరము, కావుననే దీని బంధనము నుండి ముక్తులవ్వాలని కోరుకుంటారు. శరీరాన్ని వదిలినట్లయితే బంధనాలన్నీ తొలగిపోయినట్లే అని భావిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఈ ఆసురీ బంధనాలన్నింటి నుండి విడిపించి సుఖమునిచ్చే దైవీ సంబంధములోకి తీసుకువెళ్తారు. మనము శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామములోకి వస్తామని మీకు తెలుసు. మళ్ళీ దుఃఖధామములోకి ఎలా వస్తామో కూడా మీకు తెలుసు. బాబా శ్యామము నుండి సుందరంగా తయారుచేసేందుకే వస్తారు. నేను మీ విధేయుడైన, సత్యమైన తండ్రిని కూడా అని తండ్రి చెప్తున్నారు. తండ్రి సదా విధేయుడిగానే ఉంటారు. వారు చాలా సేవ చేస్తారు. ఎంతో ఖర్చు పెట్టి చదివించి, మళ్ళీ ధన సంపదలు అన్నింటినీ పిల్లలకిచ్చి తాను వెళ్ళి సాధువుల సాంగత్యము చేస్తారు. తండ్రి పిల్లలను తమ కన్నా కూడా ఉన్నతంగా తయారుచేస్తారు. అలాగే ఈ తండ్రి కూడా నేను మిమ్మల్ని డబల్ యజమానులుగా తయారుచేస్తాను అని చెప్తున్నారు. మీరు ఈ విశ్వానికి కూడా యజమానులుగా, అలగే బ్రహ్మాండానికి కూడా యజమానులుగా అవుతారు. మీకు డబల్ పూజ కూడా జరుగుతుంది. ఆత్మలకు కూడా పూజలు జరుగుతాయి, అలాగే దేవతా వర్ణములో కూడా పూజలు జరుగుతాయి. నాకైతే కేవలం ఒక్క శివలింగ రూపములో మాత్రమే పూజ జరుగుతుంది. నేనైతే రాజుగా అవ్వను. నేను మీకు ఎంతగా సేవ చేస్తూ ఉంటాను. మరి ఇటువంటి తండ్రిని మీరెందుకు మర్చిపోతున్నారు! ఓ ఆత్మా, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమౌతాయి. మీరు ఎవరి వద్దకు వచ్చారు? మొదట బాబా, ఆ తర్వాత దాదా. ఇప్పుడు తండ్రి, తర్వాత గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన ఆదిదేవ్ ఆడమ్, ఎందుకంటే అనేక వంశాలు తయారవుతాయి కదా. శివబాబాను ఎవరైనా గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారా? బాబా మిమ్మల్ని ప్రతి విషయములోనూ చాలా ఉన్నతంగా తయారుచేస్తారు. మీకు ఇటువంటి తండ్రి లభించారు, మరి మీరు వారినెందుకు మర్చిపోతున్నారు? వారిని మర్చిపోతే పావనంగా ఎలా అవుతారు! తండ్రి పావనంగా అయ్యేందుకు యుక్తులను తెలియజేస్తున్నారు. ఈ స్మృతి ద్వారానే మాలిన్యం తొలగిపోతుంది. మధురాతి-మధురమైన గారాబాల పిల్లలూ, దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వాలి, పవిత్రంగా కూడా అవ్వాలి అని తండ్రి చెప్తున్నారు. కామము మహాశత్రువు. ఈ ఒక్క జన్మ నా కోసం పవిత్రంగా అవ్వండి. ఎటువంటి చెడు పనిని చేయకండి, నా గడ్డం పరువు నిలబెట్టండి అని లౌకిక తండ్రి కూడా అంటారు కదా. నేను పావనంగా తయారుచేసేందుకు వచ్చాను, ఇప్పుడు ఇక ముఖము నల్లగా చేసుకోకండి అని పారలౌకిక తండ్రి కూడా చెప్తారు. లేకపోతే పరువు పోగొడుతారు అని అంటారు. బ్రాహ్మణులందరి పరువు మరియు తండ్రి పరువు కూడా తీసేస్తారు. బాబా, మేము పడిపోయాము, ముఖము నల్లగా చేసుకున్నాము అని వ్రాస్తారు. బాబా అంటున్నారు - నేను మిమ్మల్ని సుందరంగా తయారుచేసేందుకు వచ్చాను, మీరు మళ్ళీ ముఖము నల్లగా చేసేసుకుంటారు. మీరు సదా సుందరంగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ అంతిమ పురుషార్థీ శరీరము చాలా విలువైనది, దీని ద్వారా చాలా సంపాదన చేసుకోవాలి. అనంతమైన తండ్రితో పాటు తింటూ, త్రాగుతూ..... సర్వ సంబంధాల అనుభూతిని చేయాలి.

2. బ్రాహ్మణ పరివారం మరియు తండ్రి పరువును తీసే పనులేవీ చేయకూడదు. ఆత్మాభిమానులుగా అయ్యి పూర్తిగా పవిత్రంగా అవ్వాలి. స్మృతి ద్వారా పాత మలినాలను తొలగించుకోవాలి.

వరదానము:-

కలియుగ ప్రపంచం యొక్క దుఃఖము, అశాంతితో కూడుకున్న దృశ్యాలను చూస్తూ సదా సాక్షీ మరియు అనంతమైన వైరాగీ భవ

ఈ కలియుగ ప్రపంచంలో ఏమి జరిగినా కానీ మీకు సదా ఎక్కేకళే ఉంటుంది. ప్రపంచానికి హాహాకారాలు మరియు మీ కోసం జయజయకారాలు. మీరు ఎటువంటి పరిస్థితిలోనూ భయపడరు ఎందుకంటే మీరు మొదటి నుండే సిద్ధంగా ఉన్నారు. సాక్షీగా అయ్యి అన్ని రకాల ఆటలను చూస్తున్నారు. కొంతమంది ఏడుస్తారు, ఆర్తనాదాలు చేస్తారు, సాక్షీగా అయ్యి చూడడంలో ఆనందం అనిపిస్తుంది. ఎవరైతే కలియుగ ప్రపంచం యొక్క దుఃఖము, అశాంతితో కూడుకున్న దృశ్యాలను సాక్షీగా అయ్యి చూస్తారో, వారు సహజంగానే అనంతమైన వైరాగులుగా అయిపోతారు.

స్లోగన్:-

ఎటువంటి ధరణినైనా తయారుచేసేందుకు వాణితో పాటు వృత్తి ద్వారా కూడా సేవ చేయండి.