23-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతియే స్థిరంగా ఉండడము కూడా అహో సౌభాగ్యము”

ప్రశ్న:-

సేవ పట్ల అభిరుచి ఉండే పిల్లల గుర్తులేమిటి?

జవాబు:-

వారు తమ నోటి ద్వారా జ్ఞానమును వినిపించకుండా ఉండలేరు. వారు ఆత్మిక సేవలో తమ ఎముక ఎముకను స్వాహా చేస్తారు. వారికి ఆత్మిక జ్ఞానమును వినిపించడంలో చాలా సంతోషము కలుగుతుంది. వారు సంతోషములోనే నాట్యము చేస్తూ ఉంటారు. వారు తమ కన్నా పెద్దవారికి చాలా గౌరవాన్ని ఇస్తారు, వారి నుండి నేర్చుకుంటూ ఉంటారు.

గీతము:-

ఈ ప్రపంచము మారినా..... (బదల్ జాయె దునియా.....)

ఓంశాంతి. పిల్లలు పాటలోని రెండు లైన్లు విన్నారు. ఇది ప్రతిజ్ఞకు సంబంధించిన పాట. ఎవరికైనా నిశ్చితార్థము జరిగినప్పుడు, స్త్రీ-పురుషులు ఒకరినొకరు ఎప్పుడూ వదలిపెట్టమని ప్రతిజ్ఞ చేస్తారు. కొంతమందికి పరస్పరంలో పడకపోతే ఒకరినొకరు వదిలేస్తారు కూడా. ఇక్కడ పిల్లలైన మీరు ఎవరికి ప్రతిజ్ఞ చేస్తారు? ఈశ్వరునికి చేస్తారు. వారితోనే పిల్లలైన మీకు లేక ప్రేయసులైన మీకు నిశ్చితార్థము జరిగింది, కానీ ఈ విధంగా విశ్వానికి యజమానులుగా తయారుచేసేవారిని కూడా వదిలేస్తారు. పిల్లలైన మీరిక్కడ కూర్చున్నారు, ఇప్పుడు అనంతమైన బాప్ దాదా వచ్చేశారని మీకు తెలుసు. ఇక్కడ మీకు ఏ అవస్థ అయితే ఉంటుందో, అది బయట సెంటర్లలో ఉండదు. ఇక్కడ బాప్ దాదా వచ్చేశారని మీరు భావిస్తారు. బయట సెంటర్లలోనైతే బాబా వినిపించిన మురళీ వచ్చేసిందని భావిస్తారు. ఇక్కడికి మరియు అక్కడికి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మీరు అనంతమైన తండ్రి సమ్ముఖములో కూర్చున్నారు, అక్కడైతే సమ్ముఖముగా ఉండరు. సమ్ముఖముగా వెళ్ళి మురళీ వినాలని కోరుకుంటారు. బాబా వచ్చేశారని ఇక్కడ పిల్లల బుద్ధిలోకి వచ్చింది. ఇతర సత్సంగాలలో, ఫలానా స్వామీజీ వస్తారని భావిస్తారు కదా, కానీ ఈ ఆలోచన కూడా అందరికీ ఏకరసముగా ఉండదు. చాలా మంది బుద్ధియోగము వేరే వైపులకు భ్రమిస్తూ ఉంటుంది, కొంతమందికి పతి గుర్తుకొస్తారు, కొంతమందికి సంబంధీకులు గుర్తుకొస్తారు. ఆ ఒక్క గురువుపై కూడా బుద్ధియోగము నిలవదు. స్వామీజీ స్మృతిలో కూర్చుని ఉన్నవారు ఎవరో అరుదుగా ఉంటారు, ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. అందరూ శివబాబా స్మృతిలో ఉంటారని కూడా కాదు. బుద్ధి ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది, మిత్ర-సంబంధీకులు మొదలైనవారు గుర్తుకొస్తారు. మొత్తం సమయమంతా ఒక్క శివబాబా స్మృతిలోనే ఉండడము అంటే అహో సౌభాగ్యము, కానీ ఎవరో అరుదుగా స్మృతిలో స్థిరముగా ఉంటారు. ఇక్కడ తండ్రి సమ్ముఖములో ఉండడంతో చాలా సంతోషముండాలి. అతీంద్రియ సుఖము గురించి గోపీ వల్లభుని గోప-గోపికలను అడగండి, ఇది ఇక్కడి గాయనమే. ఇక్కడ మీరు తండ్రి స్మృతిలో కూర్చున్నారు. ఇప్పుడు మనము ఈశ్వరుని ఒడిలో ఉన్నామని, తర్వాత దైవీ ఒడిలో ఉంటామని మీకు తెలుసు. ఈ చిత్రంలో ఈ కరెక్షన్ చేయాలి, ఇది వ్రాయాలి అని కొంతమంది బుద్ధిలో సేవ యొక్క ఆలోచనలు కూడా నడుస్తాయి. కానీ ఎవరైతే మంచి పిల్లలు ఉంటారో వారు, ఇప్పుడు తండ్రి నుండి వినాలని భావిస్తారు, ఇంకే సంకల్పాలను రానివ్వరు. తండ్రి జ్ఞాన రత్నాలతో జోలెను నింపేందుకు వచ్చారు కనుక తండ్రితోనే బుద్ధి యోగాన్ని జోడించాలి. నంబరువారుగా ధారణ చేసేవారు అయితే తప్పకుండా ఉంటారు. కొంతమంది మంచి రీతిగా విని ధారణ చేస్తారు, కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు. బుద్ధి యోగము వేరే వైపులకు పరిగెడుతూ ఉంటే ధారణ జరగదు, కచ్చాగానే ఉండిపోతారు. 1-2 సార్లు మురళీ వింటూ కూడా ధారణ జరగలేదంటే, ఆ అలవాటు పక్కా అయిపోతూ ఉంటుంది. ఇక తర్వాత ఎంతగా వింటూ ఉన్నా సరే, వారికి ధారణ జరగదు, వారు ఎవ్వరికీ వినిపించలేకపోతారు. ఎవరికైతే ధారణ జరుగుతుందో, వారికి సేవ పట్ల అభిరుచి ఉంటుంది. అటువంటివారు ఉత్సాహంతో ఉప్పొంగుతూ ఉంటారు, మేము వెళ్ళి జ్ఞాన ధనాన్ని దానము చేయాలని ఆలోచిస్తారు. ఎందుకంటే ఈ ధనము ఒక్క తండ్రి దగ్గర తప్ప ఇతరులెవ్వరి దగ్గర లేదు. అందరికీ ఒకే విధంగా ధారణ జరగదని, అందరూ ఒకే విధంగా ఉన్నత పదవిని పొందలేరని కూడా తండ్రికి తెలుసు, అందుకే వారి బుద్ధి వేరే వైపులకు భ్రమిస్తూ ఉంటుంది. అటువంటివారి భవిష్య భాగ్యము అంత ఉన్నతంగా తయారవ్వదు. కొంతమంది స్థూల సేవలో తమ ఎముక ఎముకనూ ఇస్తారు, అందరినీ సంతుష్టపరుస్తారు. భోజనం తయారుచేస్తూ, తినిపించేవారుంటారు, ఇది కూడా ఒక సబ్జెక్టు కదా. ఎవరికైతే సేవ పట్ల అభిరుచి ఉంటుందో, వారు నోటితో జ్ఞానమును వినిపించకుండా ఉండలేరు. అయితే బాబా, వీరికి దేహాభిమానమైతే లేదు కదా, పెద్దవారి పట్ల గౌరవమునుంచుతున్నారా లేదా అని చూస్తారు కూడా. గొప్ప మహారథులకు గౌరవాన్ని ఇవ్వడము జరుగుతుంది. అయితే కొంతమంది చిన్నవారు కూడా తెలివైనవారిగా అయిపోతారు, అప్పుడు పెద్దవారు కూడా చిన్నవారికి గౌరవాన్ని ఇవ్వవలసి ఉండవచ్చు, ఎందుకంటే ఆ చిన్నవారి బుద్ధి గ్యాలప్ చేస్తుంది. సేవ పట్ల అభిరుచిని చూసి, వీరు బాగా సేవ చేస్తారని తండ్రి సంతోషిస్తారు కదా. రోజంతా ప్రదర్శనీలలో అర్థము చేయించే అభ్యాసము చేయాలి. అక్కడ ఎంతోమంది ప్రజలు తయారవుతారు కదా, ఇంకే ఉపాయమూ లేదు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, రాజులు, రాణులు, ప్రజలు అందరూ ఇక్కడే తయారవుతారు. అటువంటప్పుడు ఎంత సేవ చేయాలి. ఇప్పుడు మనము బ్రాహ్మణులుగా అయ్యామని పిల్లల బుద్ధిలో ఉంది. ఇంట్లో గృహస్థంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ, ఎవరి అవస్థ వారిది ఉంటుంది కదా, అలాగని ఇళ్ళు-వాకిళ్ళను వదిలి పెట్టకూడదు. ఇంట్లోనే ఉండండి కానీ పాత ప్రపంచం సమాప్తమయ్యే ఉందని బుద్ధిలో నిశ్చయముంచుకోవాలని తండ్రి అంటారు. ఇప్పుడు మనకు తండ్రితోనే పని ఉంది. ఎవరైతే కల్పక్రితము జ్ఞానమును తీసుకున్నారో, మళ్ళీ వారే తీసుకుంటారని కూడా మీకు తెలుసు. ప్రతి సెకండు యథావిధిగా రిపీట్ అవుతుంది. ఆత్మలో జ్ఞానముంటుంది కదా, తండ్రి వద్ద కూడా జ్ఞానముంటుంది. పిల్లలైన మీరు కూడా తండ్రి వలె తయారవ్వాలి. పాయింట్లను ధారణ చేయాలి. ఒకే సమయములో అన్ని పాయింట్లు అర్థము చేయించడం జరగదు. వినాశనము కూడా ఎదురుగా ఉంది, ఇది ఇంతకుముందు జరిగిన అదే వినాశనము. సత్య-త్రేతా యుగాలలో ఎలాంటి యుద్ధాలు జరగవు, చాలా ధర్మాలు ఏర్పడిన తర్వాత, సైన్యము మొదలైనవి ఏర్పడినప్పుడు యుద్ధాలు ప్రారంభమవుతాయి. మొట్టమొదట ఆత్మలు సతోప్రధాన స్థితి నుండి దిగిపోతాయి, తర్వాత సతో, రజో, తమో స్థితులలోకి వస్తాయి. రాజధాని ఎలా స్థాపనవుతుంది అనేదంతా బుద్ధిలో ఉంచుకోవాలి. ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు, శివబాబా వచ్చి మాకు ఖజానాలను ఇస్తున్నారని బుద్ధిలో ఉంచుకోవాలి, వాటిని బుద్ధిలో ధారణ చేయాలి. మంచి మంచి పిల్లలు నోట్స్ రాస్తారు, వ్రాయడం మంచిది, అప్పుడు బుద్ధిలోకి టాపిక్స్ వస్తాయి. ఈ రోజు ఫలానా టాపిక్ పై అర్థం చేయించాలని భావిస్తారు. నేను మీకు ఎంత ఖజనాను ఇచ్చాను అని తండ్రి అంటారు. సత్య-త్రేతా యుగాలలో మీ వద్ద అపారమైన ధనముండేది, తర్వాత వామ మార్గములోకి వెళ్ళడంతో ఆ ధనం తగ్గిపోతూ వచ్చింది. సంతోషం కూడా తగ్గిపోతూ వచ్చింది. ఏదో ఒక వికర్మ జరగడం మొదలవుతుంది. కిందికి దిగుతూ దిగుతూ కళలు తగ్గిపోతూ ఉంటాయి. సతోప్రధానము, సతో, రజో, తమో స్థితులు ఉంటాయి. సతో నుండి రజోలోకి వస్తారు, అలాగని ఒక్కసారిగా దిగిపోతారని కాదు, నెమ్మది నెమ్మదిగా దిగుతారు. తమోప్రధానములో కూడా నెమ్మది నెమ్మదిగా మెట్లు దిగుతూ వస్తారు, కళలు తగ్గిపోతూ ఉంటాయి, రోజు రోజుకు కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు జంప్ చేయాలి, తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి, దీనికోసం సమయము కూడా కావాలి. ఎక్కితే వైకుంఠ రసమును చవి చూస్తారు..... అని గాయనముంది. కామము యొక్క చెంపదెబ్బ తగలడంతో పూర్తిగా చూర్ణమైపోతారు, ఎముకలన్నీ విరిగిపోతాయి. కొంతమంది మనుష్యులు స్వయాన్ని జీవహత్య చేసుకుంటారు, అది ఆత్మహత్య కాదు, దానిని జీవహత్య అని అంటారు. ఇక్కడైతే తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి, తండ్రిని స్మృతి చేయాలి ఎందుకంటే తండ్రి నుండి రాజ్యాధికారము లభిస్తుంది. నేను తండ్రిని స్మృతి చేసి భవిష్యత్తు కోసం ఎంత సంపాదించుకున్నాను, అంధులకు చేతికర్రగా ఎంతగా అయ్యాను అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ఈ పాత ప్రపంచము మారుతున్నదని ప్రతి ఇంటికీ సందేశాన్నివ్వాలి. తండ్రి కొత్త ప్రపంచము కోసం రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మెట్ల చిత్రంలో ఈ విషయాలన్నీ చూపించారు, ఈ చిత్రాన్ని తయారుచేయడానికి శ్రమించవలసి ఉంటుంది. ఎవరైనా సరే సహజంగా అర్థము చేసుకునే విధంగా ఈ చిత్రాన్ని తయారుచేయాలని, రోజంతా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ప్రపంచములోని వారంతా ఇక్కడకు రారు, దేవీదేవతా ధర్మము వారు మాత్రమే వస్తారు. మీ సేవైతే ఎంతగానో జరుగనున్నది. మన ఈ క్లాసు ఎప్పటివరకు నడుస్తుంది అనేది మీకు తెలుసు. వారు కల్పము యొక్క ఆయుష్షు లక్షల సంవత్సరాలని భావిస్తారు కనుక శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తూనే ఉంటారు. అంతము జరిగినప్పుడు అందరి సద్గతిదాత వస్తారని, మా శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి గతి ఏర్పడుతుందని, తర్వాత మేము కూడా వెళ్ళి జ్యోతిలో కలిసిపోతామని భావిస్తారు. కానీ అలా జరగనే జరగదు. మనము అమరుడైన బాబా ద్వారా సత్యాతి-సత్యమైన అమరకథను వింటున్నామని మీకిప్పుడు తెలుసు. కావున అమరుడైన తండ్రి ఏదైతే చెప్తారో, దానిని అంగీకరించాలి కూడా, వారు కేవలం నన్ను స్మృతి చేయండి, పవిత్రముగా అవ్వండి అని చెప్తారు. లేకపోతే శిక్షలు కూడా చాలా అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా తక్కువది లభిస్తుంది. సేవలో శ్రమ చేయాలి. దధీచి ఋషి ఉదాహరణ ఉంది - వారు ఎముకలను కూడా సేవలో పెట్టారు. తమ శరీరాన్ని కూడా పట్టించుకోకుండా రోజంతా సేవలో ఉండడము, దీన్నే సేవలో ఎముకలను ఇవ్వడమని అంటారు. ఒకటి, ఎముకలతో చేసే దైహిక సేవ, రెండవది - ఎముకలతో చేసే ఆత్మిక సేవ. ఆత్మిక సేవ చేసేవారు ఆత్మిక జ్ఞానాన్నే వినిపిస్తూ ఉంటారు, ధనమును దానము చేస్తూ సంతోషములో నాట్యం చేస్తూ ఉంటారు. ప్రపంచంలోని మనుష్యులు చేసే సేవ అంతా దైహిక సేవ. శాస్త్రాలను వినిపిస్తారు, అదేమీ ఆత్మిక సేవ కాదు. ఆత్మిక సేవను కేవలం తండ్రి మాత్రమే వచ్చి నేర్పిస్తారు, స్పిరిచ్యుల్ తండ్రియే వచ్చి స్పిరిచ్యుల్ (ఆత్మిక) పిల్లలను చదివిస్తారు.

పిల్లలైన మీరిప్పుడు సత్యయుగీ కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడ మీ ద్వారా ఎటువంటి వికర్మ జరగదు. అది రామ రాజ్యము, అక్కడ కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఇప్పుడు రావణ రాజ్యములో అందరూ దుఃఖితులుగా ఉన్నారు కదా. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో నంబరువారు పురుషార్థానుసారముగా ఉంది. ఈ మెట్ల చిత్రములోనే జ్ఞానమంతా వచ్చేస్తుంది. ఈ అంతిమ జన్మ పవిత్రముగా అయినట్లయితే, పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారని తండ్రి అంటారు. మీరు ఏ విధంగా అర్థం చేయించాలంటే, దానితో మనుష్యులకు, మేము సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయ్యామని, స్మృతియాత్రతోనే మళ్ళీ సతోప్రధానముగా అవుతామని తెలియాలి. ఇది గమనించాక బుద్ధి నడుస్తుంది, అప్పుడు ఈ జ్ఞానము ఎవ్వరి వద్దా లేదని అర్థమవుతుంది. ఈ మెట్ల చిత్రములో ఇతర ధర్మాల సమాచారం ఎక్కడ ఉందని అంటారు. ఆ విషయాలు ఈ సృష్టి చక్రము చిత్రములో వ్రాయబడి ఉన్నాయి, వారు కొత్త ప్రపంచములోకి రారు, వారికి శాంతి లభిస్తుంది అని చెప్పాలి. భారతవాసులే స్వర్గములో ఉండేవారు కదా. తండ్రి కూడా భారతదేశములోకే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు, అందుకే భారతదేశ ప్రాచీన యోగాన్ని అందరూ కోరుకుంటారు. తప్పకుండా కొత్త ప్రపంచములో కేవలం భారతదేశమే ఉండేదని ఈ చిత్రాల ద్వారా వారంతట వారే అర్థము చేసుకుంటారు. తమ ధర్మాన్ని గురించి కూడా తెలుసుకుంటారు. ధర్మ స్థాపన చేసేందుకు క్రీస్తు వచ్చారు కానీ ఈ సమయంలో వారు కూడా తమోప్రధానముగా ఉన్నారు. రచయిత మరియు రచనల ఈ జ్ఞానము ఎంత పెద్దది.

మీరు ఈ విధంగా చెప్పవచ్చు - మాకు ఎవ్వరి ధనము అవసరము లేదు, ధనమును మేమేమి చేసుకుంటాము, మీరు కూడా వినండి, ఇతరులకు కూడా వినిపించండి. ఈ చిత్రాలు మొదలైనవి ముద్రించండి, ఈ చిత్రాలను ఉపయోగించుకోవాలి. ఈ జ్ఞానము వినిపించేందుకు హాలు కట్టించండి, అంతేకానీ మేము ధనము తీసుకొని ఏమి చేస్తాము, మీ ఇంటి కళ్యాణమే జరుగుతుంది, మీరు కేవలం ఏర్పాట్లను చేయండి. రచయిత మరియు రచనల జ్ఞానము చాలా బాగుందని చాలామంది వచ్చి చెప్తారు, ఇది మనుష్యులు మాత్రమే అర్థము చేసుకోవాలి. విదేశీయులు ఈ జ్ఞానాన్ని విని చాలా ఇష్టపడతారు, చాలా సంతోషిస్తారు. మేము కూడా తండ్రితో యోగమును జోడించినట్లయితే మా వికర్మలు వినాశనమవుతాయని అర్థము చేసుకుంటారు. అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి. ఈ జ్ఞానాన్ని గాడ్ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరని అర్థము చేసుకుంటారు. ఖుదా స్వర్గమును స్థాపించారని అంటారు కానీ వారు ఎలా వస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. మీ మాటలు విని సంతోషిస్తారు, తర్వాత పురుషార్థము చేసి యోగము నేర్చుకుంటారు, తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు. సేవ కోసమైతే ఎంతగానో ఆలోచించాలి. భారతదేశంలో నైపుణ్యాన్ని చూపిస్తే బాబా విదేశాలకు కూడా పంపిస్తారు, ఈ సంస్థ విదేశాలకు కూడా వెళ్తుంది. ఇప్పుడింకా సమయముంది కదా. కొత్త ప్రపంచము తయారయ్యేందుకు సమయం పట్టదు. ఎక్కడైనా భూకంపాలు మొదలైనవి జరిగితే, 2-3 సంవత్సరాలలో పూర్తిగా కొత్త ఇళ్ళు మొదలైనవి నిర్మిస్తారు. పనివారు చాలా మంది ఉండి, మొత్తం సామానంతా తయారుగా ఉన్నట్లయితే, తయారుచేయడానికి సమయమేమీ పట్టదు. విదేశాలలో ఇళ్ళు ఎలా తయారవుతాయి - మినిట్ మోటర్ (నిమిషములో తయారవుతాయి). మరి స్వర్గంలో ఇంకెంత వేగంగా తయారవుతూ ఉండవచ్చు. అక్కడ బంగారం, వెండి మొదలైనవి మీకు చాలా లభిస్తాయి, మీరు గనుల నుండి బంగారం, వెండి, వజ్రాలు తీసుకొని వస్తారు. అన్ని కళలను నేర్చుకుంటున్నారు. ఇక్కడ సైన్స్ వారి గర్వము ఎంతగా కొనసాగుతుంది. ఈ సైన్స్ మళ్ళీ అక్కడ ఉపయోగపడుతుంది. ఇక్కడ నేర్చుకున్నవారు మళ్ళీ అక్కడ ఇంకొక జన్మను తీసుకొని దీన్ని ఉపయోగిస్తారు. ఆ సమయంలో ప్రపంచమంతా కొత్తదిగా అయిపోతుంది, రావణ రాజ్యము సమాప్తమైపోతుంది, పంచ తత్వాలు కూడా నియమానుసారముగా మన సేవలో ఉంటాయి. స్వర్గము తయారవుతుంది. అక్కడ ఎటువంటి ఉపద్రవాలు జరగవు, రావణ రాజ్యమే ఉండదు, అందరూ సతోప్రధానముగా ఉంటారు.

పిల్లలైన మీకు తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి - ఇది అన్నింటికన్నా మంచి విషయము. తండ్రి ఖజానానిస్తారు, దానిని ధారణ చేసి ఇతరులకు దానమునివ్వాలి. ఎంతగా దానమిస్తారో, అంతగా జమ అవుతూ ఉంటుంది. సేవనే చేయకపోతే ధారణ ఎలా జరుగుతుంది? సేవలో బుద్ధిని ఉపయోగించాలి. సేవ అయితే చాలా ఎక్కువగా చేయవచ్చు. రోజు రోజుకు ఉన్నతిని పొందాలి. స్వయం యొక్క ఉన్నతిని కూడా చేసుకోవాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా ఆత్మిక సేవలో తత్పరులై ఉండాలి.జ్ఞాన ధనాన్ని దానము చేసి సంతోషములో నాట్యము చేయాలి. స్వయం ధారణ చేసి ఇతరుల చేత ధారణ చేయించాలి.

2. తండ్రి ఏదైతే జ్ఞాన ఖజానాను ఇస్తారో, దానితో తమ జోలెను నింపుకోవాలి. నోట్స్ వ్రాసుకోవాలి, తర్వాత టాపిక్ పై అర్థము చేయించాలి. జ్ఞాన ధనాన్ని దానము చేసేందుకు ఉత్సాహంతో ఉప్పొంగుతూ ఉండాలి.

వరదానము:-

నిరాకారుల నుండి సాకారులుగా అవ్వాలి - ఈ మంత్రము యొక్క స్మృతితో సేవా పాత్రను అభినయించే ఆత్మిక సేవాధారి భవ

ఏ విధంగా తండ్రి నిరాకారుని నుండి సాకారునిగా అయి సేవా పాత్రను అభినయిస్తారో, అదే విధంగా పిల్లలు కూడా ఈ మంత్రమనే యంత్రాన్ని స్మృతిలో ఉంచుకొని సేవా పాత్రను అభినయించాలి. ఈ సాకార సృష్టి, సాకార శరీరము ఒక స్టేజ్. స్టేజ్ ఆధారము వంటిది మరియు పాత్రధారులు ఆధారమూర్తులు, యజమానులు. ఈ స్మృతితో అతీతముగా అయి పాత్రను అభినయించినట్లయితే సెన్స్ తో పాటు ఎస్సెన్స్ ఫుల్ గా, ఆత్మిక సేవాధారులుగా అయిపోతారు.

స్లోగన్:-

సాక్షీగా అయి ప్రతి ఆటను చూసేవారే సాక్షీ దృష్టలు.