23-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - మీ ఈ జీవితము చాలా-చాలా అమూల్యమైనది, ఎందుకంటే మీరు శ్రీమతంపై విశ్వానికి సేవ చేస్తున్నారు, ఈ నరకాన్ని స్వర్గంగా చేస్తారు"

ప్రశ్న:-

సంతోషము మాయమవ్వడానికి కారణం మరియు దాని నివారణ ఏమిటి?

జవాబు:-

సంతోషము అదృశ్యమయ్యేందుకు కారణాలు - 1. దేహా-అభిమానంలోకి వచ్చిన కారణంగా 2. మనసులో ఏదైనా సంశయము ఉత్పన్నమైనప్పుడు కూడా సంతోషము మాయమైపోతుంది, అందుకే ఎప్పుడైనా ఏదైనా సంశయము ఉత్పన్నమైతే వెంటనే బాబాను అడగండి అని బాబా సలహానిస్తున్నారు. దేహీ-అభిమానులుగా ఉండే అభ్యాసము చేసినట్లయితే సదా సంతోషంగా ఉంటారు.

ఓంశాంతి. భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైనవారు మరియు పిల్లల ఎదురుగా భగవానువాచ - నేను మిమ్మల్ని ఉన్నతాతి ఉన్నతంగా తయారుచేస్తాను, కనుక పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి. బాబా మమ్మల్ని మొత్తం విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారని కూడా మీరు భావిస్తారు. పరమపిత పరమాత్మ ఉన్నతాతి ఉన్నతమైనవారు అని మనుష్యులు అంటారు. నేనైతే విశ్వానికి యజమానిగా అవ్వను అని బాబా స్వయంగా చెప్తున్నారు. భగవానువాచ - మనుష్యులు నన్ను ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడు అని అంటారు మరియు నేను నా పిల్లలే ఉన్నతాతి ఉన్నతమైనవారు అని అంటాను. ఇది ఋజువు చేసి చెప్తారు. పురుషార్థాన్ని కూడా డ్రామానుసారంగా, కల్పక్రితము వలె చేయిస్తారు. ఏ విషయమైనా అర్థమవ్వకపోతే అడగండి అని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. మనుష్యులకైతే ఏమీ తెలియదు. ప్రపంచమంటే ఏమిటో, వైకుంఠమంటే ఏమిటో వారికి తెలియదు. ఎంతమంది నవాబులు, మొగలులు మొదలైనవారు ఉండి వెళ్ళారు, అమెరికాలో ఎంతమంది ధనవంతులున్నారు కానీ ఎవ్వరూ ఈ లక్ష్మీ-నారాయణుల వలె అవ్వలేరు. వారైతే వైట్హౌస్ మొదలైనవి నిర్మిస్తారు కానీ అక్కడైతే రత్న జడితమైన గోల్డెన్ హౌస్ లు తయారవుతాయి. దానినే సుఖధామం అని అంటారు. మీదే హీరో-హీరోయిన్ పాత్ర. మీరు వజ్ర సమానంగా అవుతారు. బంగారు యుగముండేది. ఇప్పుడిది ఇనుప యుగము. మీరు ఎంత భాగ్యశాలులు అని తండ్రి చెప్తున్నారు. స్వయంగా భగవంతుడే కూర్చుని అర్థము చేయిస్తున్నారు కావున మీరు ఎంత సంతోషంగా ఉండాలి. మీ ఈ చదువు కొత్త ప్రపంచము కోసమే ఉంది. మీ ఈ జీవితము చాలా అమూల్యమైనది ఎందుకంటే మీరు విశ్వ సేవను చేస్తారు. మీరు వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారుచేయండి అని తండ్రినే పిలుస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు కదా. మీరు స్వర్గములో ఉండేవారు కదా, ఇప్పుడు నరకంలో ఉన్నారు, మళ్ళీ స్వర్గములో ఉంటారు అని తండ్రి చెప్తున్నారు. నరకం ప్రారంభమవ్వగానే మళ్ళీ స్వర్గము యొక్క విషయాలను మర్చిపోతారు. ఇది మళ్ళీ జరుగుతుంది. మళ్ళీ మీరు బంగారు యుగము నుండి ఇనుప యుగములోకి తప్పకుండా రావాల్సిందే. మనసులో ఎటువంటి సంశయమున్నా, దాని వలన సంతోషం ఉండకపోతే చెప్పండి అని బాబా పదే-పదే పిల్లలకు చెప్తారు. తండ్రి కూర్చుని చదివిస్తున్నారంటే చదువుకోవాలి కదా. మీరు దేహాభిమానములో వచ్చేస్తారు కనుక సంతోషము ఉండదు. సంతోషమైతే ఉండాలి కదా. తండ్రి అయితే కేవలం బ్రహ్మాండానికి యజమాని, మీరు విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు. తండ్రిని సృష్టికర్త అని అంటారు కానీ ప్రళయం జరుగుతుంది, మళ్ళీ కొత్త ప్రపంచాన్ని రచిస్తారు అని కాదు. నేను కేవలం పాతదానిని కొత్తదిగా చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. పాత ప్రపంచాన్ని వినాశనము చేయిస్తాను. మిమ్మల్ని కొత్త ప్రపంచానికి యజమానులుగా చేస్తాను. నేనేమీ చేయను. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పతిత ప్రపంచములోనే నన్ను పిలుస్తారు. పారసనాథులుగా తయారుచేస్తాను. కనుక పిల్లలు స్వయంగా పారసపురిలోకి వచ్చేస్తారు. అక్కడైతే నన్ను అసలు ఎప్పుడూ పిలవనే పిలవరు. బాబా, పారసపురిలోకి వచ్చి చూసి వెళ్ళండి అని ఎప్పుడైనా పిలుస్తారా? అస్సలు పిలవరు. దుఃఖములో అందరూ స్మరిస్తారు, పతిత ప్రపంచములో స్మృతి చేస్తారు, సుఖములో ఎవరూ స్మరించరు అని గాయనం కూడా ఉంది. స్మృతి చేయరు, పిలవరు. కేవలం ద్వాపర యుగంలో మందిరాలను నిర్మించి అందులో నన్ను ఉంచుతారు. పూజించేందుకు రాతితో కాకుండా వజ్రంతో లింగాన్ని తయారుచేస్తారు, ఎంతటి అద్భుతమైన విషయాలు. బాగా చెవులు తెరుచుకుని వినాలి. చెవులను కూడా పవిత్రంగా చేసుకోవాలి. మొదటిది పవిత్రత. పులి పాలు బంగారు పాత్రలోనే నిలుస్తాయని చెప్తారు. ఇందులో కూడా పవిత్రత ఉంటేనే ధారణ జరుగుతుంది. కామము మహాశత్రువు, దీనిపై విజయము పొందాలని తండ్రి చెప్తున్నారు. ఇది మీ అంతిమ జన్మ. ఇది అదే మహాభారత యుద్ధము అని కూడా మీకు తెలుసు. కల్ప-కల్పము ఏ విధంగా వినాశనము జరిగిందో, అదే విధంగా ఇప్పుడు కూడా, డ్రామానుసారంగా జరుగుతుంది.

పిల్లలైన మీరు స్వర్గములో మీ మహళ్ళను మళ్ళీ కల్పక్రితము తయారుచేసినట్లుగా తయారుచేసుకోవాలి. స్వర్గాన్నే ప్యారడైజ్ అని అంటారు. పురాణాల నుండి ప్యారడైజ్ అన్న పదం వెలువడింది. మానస సరోవరములో దేవకన్యలుండేవారని అంటారు. అందులో ఎవరైనా మునకలు వేస్తే దేవకన్యలుగా అయిపోతారని అంటారు. నిజానికిది జ్ఞాన మానస సరోవరము. ఇందులో మీరు ఎలా ఉన్నవారు ఎలా అయిపోతారు. సుందరమైనవారిని దేవకన్యలని అంటారు, అంతేకానీ రెక్కలున్న దేవకన్యలు ఎవరూ ఉండరు. పాండవులైన మిమ్మల్ని మహావీరులు అని అంటారు, దానికివారు పాండవులకు చాలా పెద్ద-పెద్ద చిత్రాలు, గుహలు మొదలైనవి చూపించారు. భక్తిమార్గములో ఎంత ధనాన్ని వ్యర్థము చేస్తారు. నేను పిల్లలను ఎంత షావుకార్లుగా తయారుచేశాను అని తండ్రి చెప్తున్నారు. మీరు ఇంతటి ధనాన్ని ఏం చేశారు. భారత్ ఎంత షావుకారుగా ఉండేది. ఇప్పుడు భారత్ పరిస్థితి ఎలా ఉంది. ఏదైతే ఒకప్పుడు 100 శాతము సంపన్నంగా ఉండేదో, అది ఇప్పుడు 100 శాతము నిరుపేదగా అయిపోయింది. ఇప్పుడు పిల్లలైన మీరు ఎన్ని ఏర్పాట్లు చేయాలి. శివబాబాను స్మృతి చేస్తే మీరు కృష్ణుని వలె అవుతారని పిల్లలు మొదలైన వారికి కూడా ఈ విషయాన్ని అర్థం చేయించాలి. కృష్ణుడు ఎలా తయారయ్యారు అన్నది ఎవ్వరికీ తెలియదు. ముందు జన్మలో శివబాబాను స్మృతి చేయడం ద్వారానే కృష్ణునిగా అయ్యారు. కనుక పిల్లలైన మీకు ఎంత సంతోషము ఉండాలి. కానీ ఎవరైతే సదా ఇతరుల సేవలో ఉంటారో వారికే అపారమైన సంతోషం ఉంటుంది. నడవడిక చాలా-చాలా రాయల్ గా ఉండడమే ముఖ్యమైన ధారణ. అన్నపానాదులు చాలా సుందరంగా ఉండాలి. పిల్లలైన మీ వద్దకు ఎవరైనా వచ్చినప్పుడు, వారికి అన్ని రకాలుగా సేవను చేయాలి. స్థూలంగానూ, సూక్ష్మంగానూ చేయాలి. దైహికంగానూ-ఆత్మికంగానూ రెండు విధాలుగా చేస్తే మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఎవరైనా వస్తే వారికి మీరు సత్యమైన సత్య నారాయణుని కథను వినిపించండి. శాస్త్రాలలోనైతే ఏమేమో కథలు వ్రాసేశారు. విష్ణు నాభి నుండి బ్రహ్మా వెలువడినట్లుగా, మళ్ళీ బ్రహ్మా చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. ఇప్పుడు విష్ణు నాభి నుండి బ్రహ్మా ఎలా వస్తారు, ఇది ఎంత గొప్ప రహస్యము. ఈ విషయాలను ఇంకెవ్వరూ ఏ మాత్రము అర్థము చేసుకోలేరు. నాభి నుండి వెలువడే విషయమే లేదు. బ్రహ్మానే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మాగా అవుతారు. బ్రహ్మా విష్ణువుగా అవ్వడానికి క్షణము పడుతుంది. క్షణములో జీవన్ముక్తి అని అంటారు. నీవు విష్ణు రూపంగా అవుతావు అని బాబా సాక్షాత్కారము చేయించారు. సెకండులో నిశ్చయం ఏర్పడింది. వినాశన సాక్షాత్కారం కూడా జరిగింది, లేకపోతే కలకత్తాలో రాజరికపు వైభవంతో ఉండేవారు. ఎటువంటి శ్రమ ఉండేది కాదు. చాలా రాయల్ గా ఉండేవారు. ఇప్పుడు తండ్రి మీకు ఈ జ్ఞానరత్నాల వ్యాపారాన్ని నేర్పిస్తారు. దీని ముందు ఆ వ్యాపారము అసలేమీ కాదు. కానీ వీరి పాత్రకు మరియు మీ పాత్రకు తేడా ఉంది. బాబా వీరిలో ప్రవేశించారు, వెంటనే వీరు అన్నీ వదిలేశారు. భట్టీ జరగవలసి ఉంది. మీరు కూడా అన్నీ వదిలేశారు. నదిని దాటుకుని భట్టీకి వచ్చారు. ఏమేమి జరిగాయి, కానీ మీకు ఎవరి గురించి చింత లేదు. కృష్ణుడు ఎత్తుకువెళ్ళాడని అంటారు! ఎందుకు ఎత్తుకువెళ్ళారు? వారిని పట్టపు రాణులుగా చేసుకునేందుకు తీసుకువెళ్ళారు. పిల్లలైన మిమ్మల్ని స్వర్గానికి మహారాణులుగా తయారుచేసేందుకే ఈ భట్టి కూడా తయారయింది. శాస్త్రాలలో ఏమేమో వ్రాసేశారు, ప్రాక్టికల్ గా ఏముందో ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. ఎత్తుకుపోయే విషయమే లేదు. వీరు కల్పక్రితము కూడా నిందలపాలయ్యారు. పేరు అప్రతిష్టపాలయ్యింది. ఇది డ్రామా, కల్పక్రితము వలె అంతా జరుగుతుంది.

ఎవరైతే కల్పక్రితము రాజ్యము తీసుకున్నారో, వారు తప్పకుండా వస్తారని మీకిప్పుడు బాగా తెలుసు. నేను కూడా కల్ప-కల్పమూ వచ్చి భారత్ ను స్వర్గంగా తయారుచేస్తానని తండ్రి చెప్తున్నారు. మొత్తం 84 జన్మల లెక్కను తెలియజేసారు. సత్యయుగంలో మీరు అమరులుగా ఉంటారు. అక్కడ అకాల మృత్యువులుండవు. శివబాబా మృత్యువుపై విజయాన్ని ప్రాప్తింపజేస్తారు. నేను కాలుడికే కాలుడను అని చెప్తారు. కథలు కూడా ఉన్నాయి కదా. మీరు కాలుడిపై విజయమును పొందుతారు. మీరు అమరలోకానికి వెళ్తారు. అమరలోకములో ఉన్నత పదవిని పొందేందుకు, ఒకటేమో పవిత్రంగా అవ్వాలి, రెండవది దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ప్రతిరోజు మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి. రావణుని ద్వారా మీకు నష్టము జరిగింది. నా ద్వారా లాభము కలుగుతుంది. ఈ విషయాలను వ్యాపారస్థులు బాగా అర్థము చేసుకుంటారు. ఇవి జ్ఞానరత్నాలు. ఎవరో అరుదైన వ్యాపారి వీటితో వ్యాపారం చేస్తారు. మీరు వ్యాపారం చేసేందుకు వచ్చారు. కొందరు బాగా వ్యాపారము చేసి 21 జన్మల కోసం స్వర్గ ప్రాప్తిని పొందుతారు. 21 జన్మలే కాదు, 50-60 జన్మలు మీరు ఎంతో సుఖంగా ఉంటారు. పదమపతులుగా అవుతారు. దేవతల పాదాలలో పద్మాలను చూపిస్తారు కదా. దాని అర్థాన్ని తెలుసుకోరు. మీరిప్పుడు పదమపతులుగా అవుతున్నారు కావున మీకు ఎంత సంతోషముండాలి. నేను ఎంత సాధారణమైనవాడిని అని తండ్రి చెప్తున్నారు. పిల్లలైన మిమ్మల్ని స్వర్గములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. ఓ పతిత-పావనా రండి, వచ్చి పావనంగా తయారుచేయండి అని కూడా మీరు పిలస్తారు. పావనమైనవారు సుఖధామములోనే ఉంటారు. శాంతిధామానికి చరిత్ర-భూగోళము ఏదీ ఉండదు. అది ఆత్మల వృక్షము. సూక్ష్మవతనం విషయమేదీ లేదు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో, అది మీరు తెలుసుకున్నారు. సత్యయుగంలో లక్ష్మీ-నారాయణుల వంశం ఉండేది. కేవలం ఒక్క లక్ష్మీ-నారాయణులే రాజ్యం చేస్తారని కాదు. వృద్ధి అయితే జరుగుతుంది కదా. తర్వాత ద్వాపరంలో, వారే పూజ్యుల నుండి మళ్ళీ పూజారులుగా అవుతారు. ఏ విధంగా మనుష్యులు పరమాత్మను సర్వవ్యాపి అని అంటారో, అదే విధంగా పరమాత్మను మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అంటారు. ఈ విషయాలను మీరు అర్థము చేసుకున్నారు. ఉన్నతాతి ఉన్నతమైనవారు భగవంతుడు అని అర్థకల్పము నుండి మీరు పాడుతూ వచ్చారు మరియు ఇప్పుడు పిల్లలైన మీరు ఉన్నతాతి ఉన్నతమైనవారు అని భగవానువాచ ఉంది. మరి అటువంటి తండ్రి సలహాపై కూడా నడుచుకోవాలి కదా. గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించాలి. ఇక్కడైతే అందరూ ఉండలేరు. అందరూ ఉండడం మొదలుపెడితే ఎంత పెద్ద భవనం నిర్మించాల్సి ఉంటుంది. క్రింద నుండి పై వరకు దర్శనం కోసం ఎంత పెద్ద క్యూ తయారౌతుందో, ఒక రోజు మీరే చూస్తారు. ఎవరికైనా దర్శనం లభించకపోతే తిట్టడం కూడా మొదలుపెడతారు. మహాత్ముని దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెందినవారే. వారు పిల్లలనే చదివిస్తారు. మీరు ఎవరికైతే మార్గాన్ని తెలియజేస్తారో, వారిలో కొందరు బాగా నడుచుకుంటారు, కొందరు ధారణ చేయలేరు, చాలా మంది వింటూనే ఉంటారు, మళ్ళీ బయటకు వెళ్ళగానే ఇక్కడది ఇక్కడే వదిలేస్తారు, ఆ సంతోషము ఉండదు, చదువు ఉండదు, యోగము ఉండదు. చార్టు పెట్టమని బాబా ఎంతగా అర్థం చేయిస్తారు. లేకపోతే చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. మేము బాబాను ఎంతగా స్మృతి చేస్తాము అని చార్టు చూసుకోవాలి. భారత్ యొక్క ప్రాచీన యోగానికి చాలా మహిమ ఉంది. ఏదైనా విషయం అర్థం కాకపోతే బాబాను అడగండి అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇంతకుముందు మీకేదీ తెలిసేది కాదు. ఇది ముళ్ళ అడవి అని బాబా చెప్తున్నారు. కామము మహాశత్రువు. ఇవి స్వయంగా గీతలోని పదాలు. గీతను చదివేవారు కానీ అర్థం చేసుకునేవారు కాదు. బాబా జీవితమంతా గీతను చదివారు. గీత మహత్వము చాలా గొప్పదని భావించేవారు. భక్తిమార్గములో గీతకు ఎంత గౌరవముంది. గీత పెద్దదిగా కూడా ఉంటుంది, చిన్నదిగా కూడా ఉంటుంది. కృష్ణుడు మొదలైన దేవతల చిత్రాలు చాలా చౌకగా లభిస్తూ ఉంటాయి, మళ్ళీ అవే చిత్రాలతో ఎంత పెద్ద-పెద్ద మందిరాలను నిర్మిస్తారు. కనుక మీరైతే విజయ మాలలోని మణులుగా అవ్వాలి అని బాబా చెప్తున్నారు. ఇటువంటి మధురాతి-మధురమైన తండ్రిని బాబా-బాబా అని కూడా అంటారు. వారు స్వర్గ రాజ్యాన్నిస్తారని అర్థము కూడా చేసుకుంటారు, అయినాసరే వింటారు, వినిపిస్తారు, అహో మాయ విడాకులిచ్చేసి వెళ్ళిపోతారు. బాబా అని అన్నారంటే, బాబా అంటే బాబానే. భక్తిమార్గములో కూడా పతులకు పతి, గురువులకు గురువు ఒక్కరేనని గాయనం కూడా చేయబడుతుంది. వారు మన తండ్రి. జ్ఞానసాగరుడు పతిత-పావనుడు. బాబా, మేము కల్ప-కల్పము మీ నుండి వారసత్వము తీసుకుంటూనే వచ్చాము, కల్ప-కల్పము కలుస్తాము, అనంతమైన తండ్రి అయిన మీ నుండి మాకు తప్పకుండా అనంతమైన వారసత్వము లభిస్తుంది అని పిల్లలైన మీరు అంటారు. ముఖ్యమైనవారు అల్ఫ్. అందులో వారసత్వము ఇమిడి ఉంది. బాబా అంటేనే వారసత్వము. అది హద్దుకు సంబంధించినది, ఇది అనంతమైనది. హద్దు యొక్క తండ్రులైతే లెక్కలేనంతమంది ఉన్నారు. అనంతమైన తండ్రి అయితే ఒక్కరే ఉన్నారు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్థూల, సూక్ష్మ సేవలు చేసి అపారమైన సంతోషాన్ని అనుభవము చేయాలి మరియు చేయించాలి. నడవడిక మరియు అన్న-పానాదులు చాలా రాయల్ గా ఉండాలి.

2. అమరలోకములో ఉన్నత పదవిని పొందేందుకు పవిత్రంగా అవ్వడంతో పాటు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. నేను బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నాను? అవినాశీ జ్ఞానరత్నాల సంపాదన జమా చేసుకుంటున్నానా? ధారణ జరిగేందుకు చెవులు పవిత్రంగా అయ్యాయా? అని మీ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి.

వరదానము:-

మాయ ఆటను సాక్షీగా అయ్యి చూసే సదా నిర్భయ, మాయాజీత్ భవ

సమయ ప్రతి సమయం ఏ విధంగా పిల్లలైన మీ స్థితి ముందుకు వెళ్తూ ఉందో, అదే విధంగా ఇప్పుడు మాయ దాడి జరగకూడదు, మాయ నమస్కరించేందుకు రావాలి, దాడి చేసేందుకు కాదు. ఒకవేళ మాయ వచ్చినా కానీ దానిని ఆటగా భావించి చూడండి. సాక్షీగా అయ్యి హద్దు డ్రామాను చూస్తున్నట్లుగా అనుభవమవ్వాలి. మాయ యొక్క రూపము ఎంత భయంకరంగా ఉన్నా కానీ మీరు దానిని ఆటబొమ్మగా మరియు ఆటగా భావించి చూసినట్లయితే ఎంతో ఆనందం కలుగుతుంది, ఇక దానికి భయపడరు లేక గాబరాపడరు. ఏ పిల్లలైతే సదా ఆట ఆడేవారిగా అయి, సాక్షిగా అయ్యి మాయ ఆటను చూస్తారో వారు సదా నిర్భయులుగా లేక మాయాజీతులుగా అయిపోతారు.

స్లోగన్:-

క్రోధం సమీపంగా కూడా రాలేనంతగా స్నేహ సాగరలుగా అవ్వండి.