24-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"శివభగవానువాచ - మధురమైన పిల్లలూ, మీరు నన్ను స్మృతి చేయండి మరియు ప్రేమించండి ఎందుకంటే నేనే మిమ్మల్ని సదా సుఖీగా తయారుచేయడానికి వచ్చాను”

ప్రశ్న:-

ఏ పిల్లల ద్వారానైతే పొరపాట్లు జరుగుతూ ఉంటాయో, వారి నోటి నుండి ఎటువంటి మాటలు స్వతహాగా వెలువడుతాయి?

జవాబు:-

నా భాగ్యములో ఏముంటే అదే లభిస్తుంది, స్వర్గములోకైతే వెళ్తాను కదా. ఈ మాటలు పురుషార్థీ పిల్లలవి కావు అని బాబా అంటారు. ఉన్నత పదవిని పొందే పురుషార్థమునే చేయాలి. ఉన్నత పదవినిచ్చేందుకు తండ్రి వచ్చినప్పుడు ఇక పొరపాట్లు చేయకండి.

గీతము:-

బాల్యపు రోజులను మర్చిపోకండి..... (బచ్పన్ కే దిన్ భులా న దేనా.....)

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని లైన్ ను అర్థము చేసుకున్నారు. మీరిప్పుడు జీవిస్తూనే అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. మొత్తం కల్పమంతా హద్దు తండ్రికి చెందినవారిగా ఉన్నారు. ఇప్పుడు కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీరు మాత్రమే అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఒకవేళ తండ్రిని విడిచిపెట్టినట్లయితే అనంతమైన వారసత్వము లభించదు. మీరు ఈ విషయాన్ని అర్థము చేయించినా కానీ కొంచెంలోనే ఎవరూ సంతుష్టపడరు. మనుష్యులు ధనాన్ని కోరుకుంటారు. ధనము లేకుండా సుఖము ఉండదు. ధనము కూడా కావాలి, శాంతి కూడా కావాలి, నిరోగి శరీరము కూడా కావాలి. ప్రపంచములో ఈ రోజు ఏముంది, రేపు ఏమి జరగనున్నది అనేది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వినాశనము అయితే ఎదురుగా నిలబడి ఉంది. ఈ విషయాలు ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేవు. ఒకవేళ వినాశనము నిలబడి ఉందని అర్థము చేసుకున్నా కానీ, ఏమి చేయాలి అన్నది అర్థం కాదు. యుద్ధము ఎప్పుడైనా ప్రారంభము అవ్వచ్చు అని పిల్లలైన మీకు తెలుసు. కొద్దిగా నిప్పురవ్వ అంటుకన్నా సరే, విస్ఫోటం జరగడానికి సమయం పట్టదు. ఈ పాత ప్రపంచము ఇక సమాప్తమైపోయినట్లేనని పిల్లలకు తెలుసు, అందుకే ఇప్పుడు త్వరలో తండ్రి నుండి వారసత్వమును తీసుకోవాలి. తండ్రిని సదా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే చాలా హర్షితంగా ఉంటారు. దేహాభిమానములోకి రావడముతో తండ్రిని మర్చిపోయి దుఃఖితులుగా అవుతారు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా అనంతమైన తండ్రి నుండి సుఖాన్ని తీసుకుంటారు. ఇటువంటి లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకే మీరిక్కడకు వచ్చారు. రాజా-రాణులకు నౌకర్లుగా అవ్వడానికి మరియు ప్రజలకు నౌకర్లుగా అవ్వడానికి చాలా తేడా ఉంటుంది కదా. ఇప్పటి మీ పురుషార్థము మళ్ళీ కల్ప-కల్పాంతరాలకు నిలిచిపోతుంది. నేను ఎంత పురుషార్థము చేశాను అన్నది చివర్లో అందరికీ సాక్షాత్కారమవుతుంది. మీ అవస్థను చూసుకుంటూ ఉండండి అని ఇప్పుడు కూడా తండ్రి చెప్తారు. మధురాతి మధురమైన తండ్రి నుండి మనకు స్వర్గ వారసత్వము లభిస్తుంది, అటువంటి తండ్రిని మనం ఎంతగా స్మృతి చేస్తున్నాము. మీ ఆధారమంతా స్మృతి పైనే ఉంది, ఎంత స్మృతి చేస్తారో, అంత సంతోషము కూడా ఉంటుంది. ఇప్పుడు దగ్గరలోకి వచ్చి చేరుకున్నామని భావిస్తారు. కొంతమంది అలసిపోతారు కూడా, గమ్యము ఇంకా ఎంత దూరముందో తెలియదని అనుకుంటారు. గమ్యానికి చేరుకుంటే, శ్రమ కూడా సఫలమవుతుంది. ఇప్పుడు మీరు ఏ గమ్యానికి చేరుకుంటున్నారు అనేది ప్రపంచానికి తెలియదు, భగవంతుడని ఎవరిని అంటారు అన్నది కూడా ప్రపంచానికి తెలియదు. భగవంతుడు అని కూడా అంటారు, మళ్ళీ రాయి రప్పలలో ఉన్నారని అంటారు.

మనము తండ్రికి చెందినవారిగా అయిపోయామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి మతముపైనే నడుచుకోవాలి. విదేశాలలో ఉన్నా సరే, అక్కడ ఉంటూ కూడా కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మీకు శ్రీమతము లభిస్తుంది. తండ్రి స్మృతితో తప్ప ఆత్మ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వలేదు. మీరంటారు - బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము, ఏ విధంగా మా మమ్మా-బాబా వారసత్వాన్ని తీసుకుంటారో, అలాగే మేము కూడా పురుషార్థము చేసి తప్పకుండా వారి సింహాసనంపై కూర్చుంటాము, మమ్మా-బాబా, రాజరాజేశ్వరులుగా అవుతారు కావున మేము కూడా అవుతాము. పరీక్ష అయితే అందరికీ ఒకటే ఉంటుంది. కేవలం తండ్రిని స్మృతి చేయండి అని మీకు చాలా కొద్దిగా నేర్పించడం జరుగుతుంది. దీనిని సహజ రాజయోగ బలము అని అంటారు. యోగముతో చాలా బలము లభిస్తుందని మీరు అర్థం చేసుకుంటారు. మేము ఏదైనా వికర్మను చేసినట్లయితే చాలా శిక్షలను అనుభవిస్తామని, పదభ్రష్టులవుతామని మీరు అర్థం చేసుకుంటారు. స్మృతిలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. సద్గురువు నిందకులు ఏ ఆధారమును పొందరు అన్న గాయనముంది. గురువు యొక్క నిందకులు..... అని వారంటారు. నిరాకారుని గురించి ఎవ్వరికీ తెలియదు. భక్తులకు ఫలమునిచ్చేవారు భగవంతుడు అని గాయనము కూడా చేయడం జరుగుతుంది. సాధు-సన్యాసులు మొదలైన వారందరూ భక్తులే. భక్తులే గంగా స్నానము చేసేందుకు వెళ్తారు. భక్తులు, భక్తులకు ఫలమునివ్వరు. భక్తులు, భక్తులకు ఫలమునిచ్చినట్లయితే ఇక భగవంతుడిని ఎందుకు స్మృతి చేయాలి. ఇది భక్తి మార్గము, అందరూ భక్తులు. భక్తులకు ఫలమునిచ్చేవారు భగవంతుడు. అంతేకానీ, ఎక్కువ భక్తి చేసేవారు తక్కువ భక్తి చేసేవారికి ఫలమునిస్తారని కాదు. అలా కాదు. భక్తి అనగా భక్తి. రచన, రచనకు వారసత్వాన్ని ఎలా ఇస్తారు. వారసత్వము రచయిత నుండే లభిస్తుంది. ఈ సమయములో అందరూ భక్తులు. జ్ఞానము లభించినప్పుడు భక్తి దానంతట అదే తొలగిపోతుంది. జ్ఞానము జిందాబాద్ అవుతుంది, జ్ఞానము లేకుండా సద్గతి ఎలా కలుగుతుంది. అందరూ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని వెళ్ళిపోతారు. వినాశనము ఎదురుగా నిలబడి ఉందని, దానికన్నా ముందే పురుషార్థము చేసి తండ్రి నుండి పూర్తిగా వారసత్వాన్ని తీసుకోవాలని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు.

మనము పావన ప్రపంచములోకి వెళ్తున్నామని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారే నిమిత్తులుగా అవుతారు. బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులుగా అవ్వకుండా మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. వారసత్వమునిచ్చేందుకే తండ్రి పిల్లలను రచిస్తారు. మనం శివబాబాకు చెందినవారమే. పిల్లలకు వారసత్వమునిచ్చేందుకు సృష్టిని రచిస్తారు, శరీరధారులకే వారసత్వాన్నిస్తారు కదా. ఆత్మలైతే పైన ఉంటాయి, అక్కడైతే వారసత్వము లేక ప్రారబ్ధము యొక్క విషయమే ఉండదు. మీరిప్పుడు పురుషార్థము చేసి ప్రారబ్ధాన్ని తీసుకుంటున్నారు, ఈ విషయము ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు సమయము సమీపముగా వస్తూ ఉంది. బాంబులు దాచిపెట్టుకోవడానికి ఏమీ తయారుచేయలేదు, చాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నన్ను స్మృతి చేయండి అని ఇప్పుడు తండ్రి మనల్ని ఆజ్ఞాపిస్తున్నారు, లేకపోతే అంతిమములో చాలా ఏడ్వవలసి వస్తుంది. రాజ విద్య యొక్క పరీక్షలో ఎవరైనా ఫెయిల్ అయితే, ఆ కోపంలో నీటిలో పడి మరణిస్తారు, ఇక్కడ కోపము యొక్క విషయమేమీ లేదు. చివర్లో మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి, మనము ఎలా తయారవుతాము అనేది కూడా తెలిసిపోతుంది. పురుషార్థము చేయించడము తండ్రి పని. పిల్లలంటారు - బాబా, మేము కర్మలు చేస్తూ స్మృతి చేయడం మర్చిపోతున్నాము, మరి కొంతమంది స్మృతి చేసేందుకు తీరిక లభించడము లేదని అంటారు. అప్పుడు బాబా అంటారు - అచ్ఛా, సమయము తీసి స్మృతిలో కూర్చోండి, తండ్రిని స్మృతి చేయండి. మీరు పరస్పరములో కలుసుకున్నప్పుడు కూడా మేము బాబాను స్మృతి చేయాలనే ప్రయత్నమే చేయండి, అందరూ కలిసి కూర్చుంటే మీరు బాగా స్మృతి చేస్తారు, సహాయము లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయము. ఎవరైనా విదేశాలకు వెళ్ళినా, అక్కడ కూడా కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి - తండ్రి స్మృతి ద్వారానే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. తండ్రిని స్మృతి చేయండి - కేవలం ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి అని బాబా అంటారు. యోగబలముతో పాపాలన్నీ భస్మమైపోతాయి. బాబా అంటారు - మన్మనాభవ, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. స్మృతియే ముఖ్యమైన విషయము. ఎక్కడికీ వెళ్ళే విషయమేమీ లేదు, ఇంట్లో ఉండండి, కేవలం తండ్రిని స్మృతి చేయండి. పవిత్రంగా అవ్వకపోతే స్మృతి చేయలేరు. అందరూ వచ్చి ఇక్కడ క్లాసులో చదువుకుంటారని కాదు. మంత్రమును తీసుకొని, మీరు ఎక్కడికైనా సరే వెళ్ళండి. తండ్రి సతోప్రధానముగా అయ్యే మార్గాన్ని అయితే తెలియజేసారు. అయితే సెంటరుకు వస్తే కొత్త-కొత్త పాయింట్లను వింటూ ఉంటారు. ఒకవేళ ఏ కారణంచేతనైనా సెంటరుకు రాలేకపోయారు, వర్షము పడుతుంది లేదా కర్ఫ్యూ జరుగుతుంది, ఎవ్వరూ బయటకు వెళ్ళలేకపోతున్నారు, అప్పుడు ఏమి చేస్తారు? తండ్రి అంటారు - ఏమీ ఫర్వాలేదు, శివుని మందిరములో అభిషేకము చేయ్యాల్సిందేనని కాదు, మీరు ఎక్కడ ఉన్నా స్మృతిలో ఉండండి. నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయండి, తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని మరియు దేవతలుగా అయిపోతారని ఇతరులకు కూడా ఈ విషయాన్నే చెప్పండి. రెండు పదాలే ఉన్నాయి - రచయిత అయిన తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. రచయిత ఒక్కరే, వారు ఎంత సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రిని స్మృతి చేసే మంత్రము లభించింది. తండ్రి అంటారు - ఈ బాల్యాన్ని మర్చిపోకూడదు. ఈ రోజు నవ్వుతారు, ఒకవేళ తండ్రిని మర్చిపోతే రేపు ఏడ్వవలసి వస్తుంది. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. చాలా మంది ఏమని అంటారంటే - స్వర్గములోకైతే వెళ్తాను కదా, ఇక భాగ్యములో ఏముంటే అది లభిస్తుంది..... ఇటువంటి వారిని ఎవరూ పురుషార్థులు అని అనరు. మనుష్యులు ఉన్నత పదవిని పొందేందుకే పురుషార్థము చేస్తారు. ఇప్పుడు తండ్రి నుండి ఉన్నత పదవి లభిస్తున్నప్పుడు పొరపాట్లు ఎందుకు చేయాలి. ఎవరైతే స్కూల్లో చదువుకోరో, అటువంటివారు చదువుకున్నవారి ముందు సేవకులుగా అవ్వవలసి ఉంటుంది. తండ్రిని పూర్తిగా స్మృతి చేయకపోతే, ప్రజల్లో నౌకర్లుగా అవుతారు, దీనికి సంతోషపడకూడదు. పిల్లలు సమ్ముఖములో రిఫ్రెష్ అయి వెళ్తారు. చాలామంది బంధనమున్నవారు ఉన్నారు, అయినా ఫర్వాలేదు, ఇంట్లో కూర్చొని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని, యుద్ధము అకస్మాత్తుగానే ప్రారంభమవుతుందని బాబా ఎంతగా అర్థం చేయిస్తారు. యుద్ధము ఇక ప్రారంభమయినట్లుగానే కనిపిస్తుంది. రేడియో ద్వారా కూడా మీకు అంతా తెలిసిపోతుంది. ఏ మాత్రం తేడా చేసినా, మేము ఇలా చేస్తాము అని బెదిరిస్తారు, ముందే ఇలా చెప్పేస్తారు, బాంబుల విషయంలో వారికి చాలా అహంకారం ఉంటుంది. తండ్రి కూడా అంటారు - పిల్లలూ, మీరు యోగబలములో ఇంకా తెలివైనవారిగా అవ్వలేదు, దానికన్నా ముందే యుద్ధము జరగడమనేది డ్రామానుసారముగా జరగనే జరగదు, పిల్లలు ఇంకా పూర్తిగా వారసత్వాన్ని తీసుకోలేదు. ఇప్పుడు రాజధాని పూర్తిగా స్థాపన అవ్వలేదు, ఇంకా కొద్ది సమయము కావాలి. బాబా పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఏ సమయంలో ఏమి జరుగుతుందో తెలియదు, విమానాలు, రైళ్ళు పడిపోతాయి, మృత్యువు ఎంత సహజముగా నిలబడి ఉంది. భూమి కంపిస్తూ ఉంటుంది. అన్నింటికన్నా ఎక్కువగా భూకంపాలే పని చేయవలసి ఉంటుంది, భూమి కంపించినప్పుడే భవనాలు మొదలైనవన్నీ పడిపోతాయి. మృత్యువు జరగకముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి కనుక చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. బాబా, మీరు తప్ప మాకు ఇంకెవ్వరూ లేరు. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. మీరు చిన్న-చిన్న పిల్లలకు అర్థం చేయించినట్లుగా తండ్రి కూర్చొని ఎంత సహజ రీతిగా అర్థం చేయిస్తారు. నేను మీకు ఏ కష్టాన్ని ఇవ్వను, కేవలం స్మృతి చేయండి మరియు కామచితిపై కూర్చొని కాలిపోయిన మీరు ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చొని పవిత్రముగా అవ్వండి. మీ ఉద్దేశ్యము ఏమిటి అని మిమ్మల్ని అడుగుతారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారని అందరికీ తండ్రి అయిన శివబాబా చెప్తున్నారని చెప్పండి. కలియుగములో అందరూ తమోప్రధానముగా ఉన్నారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రియే.

కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీ తుప్పు తొలగిపోతుందని ఇప్పుడు తండ్రి అంటారు. ఇంతటి సందేశాన్ని అయితే ఇవ్వగలరు కదా. స్వయం స్మృతి చేసినప్పుడే ఇతరుల చేత స్మృతి చేయించగలరు. స్వయం స్మృతి చేస్తూ ఉంటేనే ఇతరులకు రుచిగా చెప్పగలుగుతారు, లేకపోతే హృదయపూర్వకముగా చెప్పలేరు. మీరు ఎక్కడ ఉన్నా సరే, ఎంత వీలైతే అంత, కేవలం తండ్రిని స్మృతి చేయండి అని తండ్రి అర్థం చేయిస్తారు. ఎవరు మిమ్మల్ని కలిసినా సరే వారికి, మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది అన్న శిక్షణనే ఇవ్వండి. తండ్రి అంటారు - మీరందరూ తమోప్రధానముగా, పతితముగా అయిపోయారు, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, పవిత్రముగా అవ్వండి. ఆత్మయే పతితముగా అయ్యింది. సత్యయుగములో పావన ఆత్మ ఉంటుంది. తండ్రి అంటారు - స్మృతితోనే ఆత్మ పావనముగా అవుతుంది, ఇంకే ఉపాయము లేదు. ఈ సందేశాన్ని అందరికీ ఇస్తూ ఉన్నా కూడా, చాలామందికి కళ్యాణము చేస్తారు, బాబా మీకు ఇంకే కష్టాన్నీ ఇవ్వరు. ఆత్మలందరినీ పావనముగా తయారుచేసేవారు పతితపావనుడైన తండ్రి మాత్రమే. అందరికన్నా ఉత్తమోత్తమ పురుషులుగా తయారుచేసేవారు తండ్రి. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో, వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. రావణ రాజ్యములో మనము పూజారులుగా అయ్యాము, రామ రాజ్యములో పూజ్యులుగా ఉండేవారము. ఇప్పుడిది రావణ రాజ్యము యొక్క అంతము. తండ్రిని స్మృతి చేయడంతో మనము పూజారుల నుండి మళ్ళీ పూజ్యులుగా అవుతాము. ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయాలి, వృద్ధ మాతలు కూడా సేవ చేయాలి. మిత్ర-సంబంధీకులకు కూడా సందేశాన్నివ్వండి. సత్సంగాలు, మందిరాలు మొదలైనవి కూడా అనేక రకాలైనవి ఉన్నాయి. మీదైతే ఒకే రకమైనది. కేవలం తండ్రి పరిచయాన్నివ్వాలి. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారని శివబాబా చెప్తారు. నిరాకార శివబాబా, సర్వుల సద్గతిదాత అయిన బాబా, ఆత్మలకు చెప్తారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు. ఇది అర్థము చేయించడము సహజమే కదా. వృద్ధ మాతలు కూడా సేవ చేయగలరు. ఇదే ముఖ్యమైన విషయము. వివాహాలు మొదలైనవాటికి వెళ్ళినప్పుడు, వారి చెవిలో ఈ మాటను వినిపించండి - నన్ను స్మృతి చేయండి అని గీతా భగవంతుడు చెప్తున్నారు. ఈ మాటను అందరూ ఇష్టపడతారు. ఎక్కువగా చెప్పే అవసరమేమీ లేదు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు - కేవలం తండ్రి యొక్క ఈ సందేశాన్ని ఇవ్వాలి. అచ్ఛా, భగవంతుడు ప్రేరణ ఇస్తున్నారని భావించండి. స్వప్నంలో సాక్షాత్కారాలు జరుగుతాయి. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారని తండ్రి చెప్తున్నట్లుగా ఆ శబ్దము మీకు వినిపిస్తుంది. స్వయం మీరు కూడా ఈ చింతన చేస్తూ ఉన్నట్లయితే మీ నావ తీరానికి చేరిపోతుంది. మనము ప్రాక్టికల్ గా అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యాము మరియు తండ్రి నుండి 21 జన్మల వారసత్వమును తీసుకుంటున్నామంటే మీకు సంతోషముండాలి. తండ్రిని మర్చిపోతేనే కష్టమనిపిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆత్మ సతోప్రధానముగా అయిపోతుంది అని తండ్రి ఎంత సహజముగా తెలియజేస్తారు. వీరికి సరైన మార్గము లభించిందని అందరూ అర్థము చేసుకుంటారు. ఈ మార్గాన్ని ఎప్పుడూ ఎవరూ తెలియజేయలేరు. ఒకవేళ సాదువులు, శివబాబాను స్మృతి చేయమని చెప్తే ఇక వారి వద్దకు ఎవరు వెళ్తారు. ఎటువంటి సమయము వస్తుంది అంటే మీరు ఇంటి నుండి బయటకు కూడా వెళ్ళలేరు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. అంతిమ సమయంలో ఎవరైతే శివబాబాను స్మరిస్తారో..... వారు నారాయణ వంశములో జన్మ తీసుకుంటారు, లక్ష్మీనారాయణుల వంశములోకి వస్తారు కదా, పదే-పదే రాజ్య పదవిని పొందుతారు. కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు ప్రేమించండి. వారిని స్మృతి చేయకుండా ఎలా ప్రేమించగలరు. సుఖము లభించినప్పుడు ప్రేమించడం జరుగుతుంది, దుఃఖమునిచ్చే వారిని ప్రేమించడం జరగదు. తండ్రి అంటారు - నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను కనుక నన్ను ప్రేమించండి. తండ్రి మతముపై నడుచుకోవాలి కదా. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సంతోషంగా ఉండేందుకు స్మృతి యొక్క శ్రమ చేయాలి. స్మృతి బలము ఆత్మను సతోప్రధానముగా తయారుచేసేటువంటిది. ఒక్క తండ్రిని ప్రేమగా స్మృతి చేయాలి.

2. ఉన్నత పదవిని పొందేందుకు చదువు పట్ల పూర్తి అటెన్షన్ ను పెట్టాలి. భాగ్యములో ఏముంటే అదే లభిస్తుందని కాదు, పొరపాట్లను వదిలి పూర్తి వారసత్వానికి అధికారులుగా అవ్వాలి.

వరదానము:-

ఆలోచించడము మరియు చేయడము మధ్యనున్న అంతరమును తొలగించే స్వపరివర్తకుల నుండి విశ్వపరివర్తక భవ

యథార్థము కానటువంటి ఏ సంస్కారమైనా, స్వభావమైనా, మాటైనా లేక సంపర్కమైనా వ్యర్థమే, ఆ వ్యర్థాన్ని పరివర్తన చేసే మెషినరీని (యంత్రాన్ని) తీవ్రతరం చేయండి. ఆలోచించారు మరియు చేసేసారు..... అప్పుడు విశ్వపరివర్తన యొక్క మెషినరీ వేగవంతమవుతుంది. స్థాపనకు నిమిత్తులుగా అయిన ఆత్మల యొక్క ఆలోచించడములో మరియు చేయడములో ఇప్పుడు అంతరము కనిపిస్తుంది, ఈ అంతరమును తొలగించండి. అప్పుడు స్వ పరివర్తకుల నుండి విశ్వ పరివర్తకులుగా అవ్వగలరు.

స్లోగన్:-

ఎవరైతే తమ జీవితములో అనుభూతి అనే గిఫ్ట్ ను ప్రాప్తి చేసుకున్నారో, వారే అందరికన్నా లక్కీ.