24-05-2020 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 15-01-1986


"చౌక బేరము మరియు పొదుపు బడ్జెట్”

రత్నాకరుడైన తండ్రి అత్యంత పెద్ద వ్యాపారము (సౌదా) చేసే తన వ్యాపారి (సౌదాగర్) పిల్లలను చూసి మందహాసము చేస్తున్నారు. వ్యాపారము ఎంతో గొప్పది మరియు ఆ వ్యాపారం చేసే వ్యాపారస్థులు ప్రపంచంతో పోలిస్తే ఎంతో సాధారణంగా, అమాయకంగా ఉన్నారు. భగవంతునితో వ్యాపారం చేసే ఏ ఆత్మలు భాగ్యశాలురుగా అయ్యారో చూసి మందహాసము చేస్తున్నారు. ఇంత గొప్ప వ్యాపారం ఒక్క జన్మ చేసి తద్వారా 21 జన్మలకు సదా సంపన్నంగా అవుతారు. ఏమి ఇస్తారు, ఏమి తీసుకుంటారు. లెక్కలేనంత పదమాల సంపాదన లేక పదమాల వ్యాపారాన్ని ఎంత సహజంగా చేస్తారు. ఈ వ్యాపారం చేసేందుకు సమయం కూడా వాస్తవానికి ఒక్క సెకండు మాత్రమే పడుతుంది. ఎంత చౌక వ్యాపారం చేశారు? ఒక్క సెకండులో, ఒక్క మాటలో వ్యాపారం చేసేశారు - హృదయపూర్వకంగా నా బాబా అని అంగీకరించారు. ఈ ఒక్క మాటతో ఇంత గొప్ప లెక్కలేనన్ని ఖజానాల వ్యాపారం చేసేశారు. ఇది చౌక వ్యాపారం కదా. శ్రమా లేదు, ఖర్చు కూడా లేదు. సమయమిచ్చే పని కూడా లేదు. వేరే ఏవైనా హద్దు వ్యాపారాలు చేస్తే ఎంత సమయం ఇవ్వాల్సి వస్తుంది. శ్రమ కూడా చేయాల్సి వస్తుంది, ధరలు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంటాయి. అది కూడా ఎంతవరకు నడుస్తుంది? ఒక్క జన్మకు కూడా గ్యారంటీ లేదు. కనుక ఇప్పుడు శ్రేష్ఠమైన వ్యాపారం చేసేశారా లేక చెయ్యాలి అని ఇంకా ఇప్పుడు ఆలోచిస్తున్నారా? పక్కా వ్యాపారం చేశారు కదా? బాప్ దాదా తమ వ్యాపారి పిల్లలను, వ్యాపారం చేసే వారి లిస్టులో ఎవరెవరు ప్రసిద్ధిగా ఉన్నారని చూస్తున్నారు. ప్రపంచంవారు కూడా ప్రసిద్ధి చెందినవారి లిస్టు తయారుచేస్తారు కదా. విశేషంగా డైరక్టరీ కూడా తయారుచేస్తారు. తండ్రి డైరక్టరీలో ఎవరి పేర్లు ఉన్నాయి? ఎవరి వైపు అయితే ప్రపంచంవారి దృష్టి వెళ్ళదో, వారే తండ్రితో వ్యాపారం చేసారు మరియు పరమాత్మ నయనాలలో నక్షత్రాలుగా అయిపోయారు, కంటిపాపలుగా అయిపోయారు. నిరాశతో ఉన్న ఆత్మలను విశేషమైన ఆత్మలుగా చేసేశారు. ఇలాంటి నషా సదా ఉంటుందా? పరమాత్మ డైరక్టరీలో విశేషమైన వి.ఐ.పి.లు మనమే, అందుకే అమాయకుల భగవంతుడని మహిమ ఉంది. వారు చతుర సుజనుడే (చతుర్ సుజాన్) కానీ వారికి అమాయకులంటేనే ఇష్టము. ప్రపంచంలోని బాహ్యముఖతతో కూడిన చతురత తండ్రికి ఇష్టం లేదు. వాళ్ళ రాజ్యము కలియుగంలో ఉంది, అక్కడ ఇప్పుడిప్పుడే లక్షాధికారిగా ఉంటారు, ఇప్పుడిప్పుడే బికారిగా అవుతారు. కాని మీరంతా సదా కొరకు పదమాపదమ్ పతులుగా అవుతారు. భయంతో ఉండే రాజ్యము కాదు, నిర్భయమైనది.

ఈ రోజు ప్రపంచంలో ధనం కూడా ఉంది, భయం కూడా ఉంది. ఎంత ధనముందో అంత భయంతోనే తింటారు, భయంతోనే నిదురిస్తారు. మీరు చింతలేని చక్రవర్తులుగా అవుతారు. నిర్భయులుగా అవుతారు. భయాన్ని కూడా భూతమని అంటారు. మీరు ఆ భూతము నుండి విడుదలైపోతారు. విడుదలైపోయారు కదా? ఏదైనా భయముందా? నాది అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ భయము తప్పకుండా ఉంటుంది. "నా బాబా". నిర్భయులుగా చేసేది ఒక్క శివబాబాయే. వారిని తప్ప ఇతర వేటినైనా, బంగారు జింకను అయినా నాదిగా భావిస్తే భయముంటుంది. కనుక బ్రాహ్మణ జీవితంలో కూడా 'నాది-నాది' అనే సంస్కారము ఏమైనా సూక్ష్మ రూపంలో ఉండిపోలేదు కదా అని చెక్ చేసుకోండి. సిల్వర్ జూబ్లీ, గోల్డన్ జూబ్లీ జరుపుకుంటున్నారు కదా. వెండి లేదా బంగారమును అగ్నిలో కరిగించి వాటిలో ఉండే మలినాన్ని సమాప్తం చేసినప్పుడే అవి రియల్ గా అవుతాయి. రియల్ సిల్వర్ జూబ్లీ, రియల్ గోల్డన్ జూబ్లీ కదా. కనుక జూబ్లీ జరుపుకునేందుకు రియల్ సిల్వర్, రియల్ గోల్డ్ గా అవ్వాల్సే వస్తుంది. అలాగని సిల్వర్ జూబ్లీ జరుపుకునేవారు సిల్వర్ గానే అవ్వాలని కాదు. అదైతే సంవత్సరాల లెక్కతో సిల్వర్ జూబ్లీ అని అంటారు. కాని అందరూ బంగారు యుగానికి అధికారులైన గోల్డన్ ఏజ్ వారు. కనుక ఎంతవరకు రియల్ గోల్డ్ గా అయ్యాము అని చెక్ చేసుకోండి. వ్యాపారమైతే చేశారు కాని సంపాదించారు, తిన్నారు అన్నట్లు అయితే లేరు కదా? 21 తరాల వరకు సదా సంపన్నంగా ఉండేంత జమ చేసుకున్నారా? మీ వంశావళి కూడా సంపన్నంగా ఉండాలి. కేవలం 21 జన్మలకే కాదు కాని ద్వాపరయుగంలో కూడా భక్త ఆత్మలుగా అయిన కారణంగా ఏ లోటు ఉండదు. ద్వాపరయుగంలో కూడా ఎంత ధనముంటుందంటే, దాన-పుణ్యాలు బాగా చేయవచ్చు. కలియుగం చివర్లో కూడా చూడండి, చివరి జన్మలో కూడా బికారులుగా అయితే అవ్వలేదు కదా! రొట్టె పప్పు తినేవారిగానే ఉన్నారు కదా. నల్ల ధనమైతే లేదు కాని రొట్టె పప్పు అయితే ఉన్నాయి కదా. ఈ సమయంలోని సంపాదన లేక వ్యాపారం పూర్తి కల్పంలోనే ఎప్పుడూ బికారిగా అవ్వనివ్వదు. చివరి జన్మలో కూడా రొట్టె పప్పు తినేంతగా జమ చేసుకున్నారా, ఇంతగా పొదుపు లెక్కను ఉంచుకున్నారా? బడ్జెట్ తయారుచేయడం వచ్చా? జమ చేసుకోవడంలో తెలివైనవారే కదా. లేకుంటే 21 జన్మలు ఏం చేస్తారు? సంపాదించేవారిగా అవుతారా లేక రాజ్య అధికారులుగా అయ్యి రాజ్యం చేస్తారా? రాయల్ ఫ్యామిలీ వారికి సంపాదించే అవసరముండదు. ప్రజలైతే సంపాదించాల్సి ఉంటుంది. వారిలో కూడా నంబరు ఉంది. షావుకారు ప్రజలు, సాధారణ ప్రజలు. పేదవారైతే ఉండనే ఉండరు. కాని రాయల్ ఫ్యామిలీ వారు తమ పురుషార్థానికి ప్రాలబ్ధంగా రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. జన్మ-జన్మలు రాయల్ ఫ్యామిలీకి అధికారులుగా అవుతారు. రాజ్య సింహాసనానికి అధికారులుగా ప్రతి జన్మలో అవ్వరు కాని రాయల్ ఫ్యామిలీలో వచ్చే అధికారాన్ని జన్మ జన్మలకు ప్రాప్తి చేసుకుంటారు. కనుక ఏం అవుతారు? ఇప్పుడు బడ్జెట్ తయారుచేయండి. పొదుపు ప్రణాళికను తయారుచేయండి.

ఈ రోజుల్లో వేస్టును (వ్యర్థమును) బెస్ట్ (సమర్థంగా) గా చేస్తారు. వేస్టునే పొదుపు చేస్తారు. కనుక మీరందరు కూడా పొదుపు ఖాతాను సదా స్మృతిలో ఉంచుకోండి. సంకల్ప శక్తి, వాచా శక్తి, కర్మణా శక్తి, సమయం శక్తి, వీటిని ఎలా మరియు ఎక్కడ కార్యంలో ఉపయోగించాలో బడ్జెట్ తయారుచెయ్యండి. ఈ శక్తులన్నీ వ్యర్థమయ్యే విధంగా ఉండకూడదు. సంకల్పాలు కూడా ఒకవేళ సాధారణంగా, వ్యర్థంగా ఉంటే వ్యర్థం మరియు సాధారణత్వం రెండిటి ద్వారా పొదుపు జరగదు పైగా పోగొట్టుకుంటారు. రోజంతటిలో మీ చార్టు తయారుచేయండి. ఈ శక్తులను కార్యంలో ఉపయోగించి ఎంత పెంచారు! ఎందుకంటే ఎంతగా కార్యంలో ఉపయోగిస్తారో అంతగా శక్తి పెరుగుతుంది. సంకల్ప శక్తి గురించి అందరికీ తెలుసు కానీ కార్యంలో ఉపయోగించే అభ్యాసంలో నంబరువారుగా ఉన్నారు. కొంతమంది కార్యంలోనూ ఉపయోగించరు, పాప కర్మలోనూ పోగొట్టుకోరు. కాని సాధారణ దినచర్యలో ఇటు సంపాదించరు, అటు పోగొట్టుకోరు. జమ అయితే అవ్వలేదు కదా. సాధారణ సేవ యొక్క దినచర్యను లేక సాధారణ ప్రవృత్తిలోని దినచర్యను బడ్జెట్ ఖాతా జమ అవ్వడమని అనరు. యథాశక్తి సేవ కూడా చేశాను, చదువు కూడా చదువుకున్నాను, ఎవ్వరికీ దుఃఖమివ్వలేదు, ఏ చెడు కర్మ కూడా చేయలేదు - కేవలం ఇది మాత్రమే చెక్ చేసుకోకండి. దుఃఖమివ్వలేదు కాని సుఖమిచ్చారా? ఎంత మరియు ఎలాంటి శక్తిశాలి సేవ చేయాలో అంత చేశారా? ఎలాగైతే బాప్ దాదా, నేను-నాదిని త్యాగం చేయడమే సత్యమైన సేవ అని సదా డైరక్షన్ ఇస్తారో అలాంటి సేవ చేశారా? తప్పుడు మాటలు మాట్లాడలేదు కానీ ఎవరైనా నిరాశలో ఉన్నవారిని ఆశావాదులుగా చేసే మాటలు మట్లాడారా? ధైర్యహీనులను ధైర్యవంతులుగా చేశారా? ఎవరినైనా సంతోషం యొక్క ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకొచ్చారా? జమ చేయడం, పొదుపు చేయడం అంటే ఇది. ఊరికే 2 గంటలు, 4 గంటలు గడిచిపోతే అది పొదుపు చేసినట్లు కాదు. అన్ని శక్తులను పొదుపు చేసి జమ చేయండి. అలాంటి బడ్జెట్ తయారుచేయండి. ఈ సంవత్సరం బడ్జెట్ తయారుచేసి, కార్యము చేయండి. ప్రతి శక్తిని కార్యంలో ఎలా ఉపయోగించాలనే ప్లాన్ తయారుచెయ్యండి. ఈశ్వరీయ బడ్జెట్ ఎలా తయారుచేయాలంటే విశ్వంలోని ప్రతి ఆత్మ ఏదో ఒకటి ప్రాప్తి చేసుకుని మీ గుణగానం చేయాలి. అందరికీ ఏదో ఒకటి ఇవ్వనే ఇవ్వాలి. ముక్తినైనా ఇవ్వండి, జీవన్ముక్తినైనా ఇవ్వండి. మనుష్యాత్మలనే కాక ప్రకృతిని కూడా పావనంగా చేసే సేవ చేస్తున్నారు. ఈశ్వరీయ బడ్జెట్ అనగా ప్రకృతి సహితంగా సర్వాత్మలు సుఖవంతంగా మరియు శాంతిగా అయిపోవాలి. ఆ గవర్నమెంటు - ఇన్ని నీళ్ళు ఇస్తాము, ఇన్ని ఇళ్ళు ఇస్తాము, ఇంత కరెంటు ఇస్తాము అని బడ్జెట్ తయారుచేస్తుంది. మీరు ఎలాంటి బడ్జెట్ తయారుచేస్తారు? అందరికీ అనేక జన్మలకు ముక్తి-జీవన్ముక్తులను ఇచ్చే బడ్జెట్, బికారితనము నుండి, దుఃఖము, అశాంతి నుండి ముక్తులుగా చేసే బడ్జెట్. అర్ధకల్పమైతే ప్రశాంతంగా ఉంటారు. వారి ఆశ అయితే పూర్తి అవ్వనే అవుతుంది. వారు ముక్తినే కోరుకుంటారు కదా. ముక్తి గురించి తెలియదు కాని కోరుకుంటారు కదా. కనుక స్వయం పట్ల మరియు విశ్వం పట్ల ఈశ్వరీయ బడ్జెట్ ను తయారుచేయండి. ఏం చేయాలో అర్థమయిందా! సిల్వర్ మరియు గోల్డన్ జూబ్లీ రెండూ ఈ సంవత్సరంలో చేస్తున్నారు కదా. కనుక ఇది మహత్వము గల సంవత్సరము. అచ్ఛా.

సదా శేష్ఠమైన వ్యాపారాన్ని స్మృతిలో ఉంచుకునేవారు, సదా జమ ఖాతాను పెంచుకునేవారు, సదా పత్రి శక్తిని కార్యంలో ఉపయోగించి వృద్ధి చేసుకునేవారు, సదా సమయము యొక్క మహత్వాన్ని తెలుసుకొని మహాన్ గా అయి ఇతరులను మహాన్గా చేసేవారు, ఇటువంటి శ్రేష్ఠ ధనవంతులు, శ్రేష్ఠ తెలివైన పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

కుమారులతో - కుమార్ జీవితం కూడా అదృష్ట జీవితం ఎందుకంటే తప్పుడు మెట్లు ఎక్కడం నుండి రక్షింపబడ్డారు. ఎప్పుడూ తప్పుడు మెట్లు ఎక్కాలనే సంకల్పమైతే రాదు కదా. ఎక్కినవారు కూడా దిగుతున్నారు. ప్రవృత్తిలోని వారందరూ కూడా స్వయాన్ని కుమార్, కుమారి అని పిలుచుకుంటారు కదా. అంటే మెట్లు దిగారు కదా! కనుక సదా మీ ఈ శ్రేష్ఠ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి. కుమార్ జీవితమనగా బంధనాల నుండి రక్షింపబడే జీవితం. లేకుంటే ఎన్ని బంధనాలలో ఉన్నారో చూడండి. కనుక బంధనాలలోకి లాగబడటం నుండి రక్షింపబడ్డారు. మనసుతో కూడా స్వతంత్రులు, సంబంధాలతో కూడా స్వతంత్రులు. కుమార్ జీవితమే స్వతంత్రమైనది. ఎప్పుడూ స్వప్నంలో కూడా - కొద్దిగా ఎవరైనా సహయోగి లభించాలి! ఎవరైనా తోడు లభించాలి అనే ఆలోచనైతే రాదు కదా. జబ్బు చేసినప్పుడు సహాయంగా ఉంటారు అని ఎప్పుడైనా ఆలోచిస్తారా! అలాంటి ఆలోచన కూడా ఎప్పుడూ రాదా? కుమార్ జీవితమనగా సదా ఎగిరే పక్షి, బంధనంలో చిక్కుకున్నవారు కాదు. ఎప్పుడూ ఎలాంటి సంకల్పము రాకూడదు. సదా నిర్బంధనులుగా అయి తీవ్రవేగంతో ముందుకు వెళ్ళండి.

కుమారీలతో - కుమారీలకు సేవలో ముందుకు వెళ్ళే లిఫ్ట్ లభించింది. ఈ లిఫ్టే శ్రేష్ఠమైన గిఫ్ట్. ఈ గిఫ్ట్ ను (బహుమతిని) ఉపయోగించడం వచ్చు కదా. స్వయాన్ని ఎంత శక్తిశాలిగా చేసుకుంటారో సేవను కూడా అంత శక్తిశాలిగా చేస్తారు. ఒకవేళ స్వయమే ఏదైనా విషయంలో బలహీనంగా ఉంటే సేవ కూడా బలహీనంగా చేస్తారు కనుక శక్తిశాలిగా అయి శక్తిశాలి సేవాధారిగా అవ్వండి. ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటూ వెళ్ళండి. సమయం వచ్చినప్పుడు సఫలతాపూర్వకంగా సేవలో లగ్నమై ముందు నంబరు తీసుకోండి. ఇప్పుడైతే చదువులో సమయం ఇవ్వాల్సి వస్తుంది తర్వాత ఒకే పని ఉంటుంది కనుక ఎక్కడ ఉన్నా ట్రైనింగ్ తీసుకుంటూ ఉండండి. నిమిత్తమైన ఆత్మల సాంగత్యంతో ఏర్పాట్లు చేసుకుంటూ ఉండండి అప్పుడు యోగ్యమైన సేవాధారులుగా అవుతారు. ఎంత ముందుకు వెళ్తారో అంత స్వయానికే లాభముంది.

సేవాధారి - టీచర్ అక్కయ్యలతో

1. సేవాధారులనగా సదా నిమిత్తులు. నిమిత్త భావము సేవలో స్వతహాగానే సఫలతనిప్పిస్తుంది. నిమిత్త భావము లేదంటే సఫలత లేదు. సదా తండ్రికి చెందినవారిగా ఉండేవారము, తండ్రికి చెందినవారిగా ఉన్నాము, తండ్రికి చెందినవారిగానే ఉంటాము - ఇటువంటి ప్రతిజ్ఞ చేశారు కదా. సేవాధారులనగా ప్రతి అడుగు తండ్రి అడుగుపై వేసేవారు. దీనినే ఫాలోఫాదర్ చేయడమని అంటారు. ప్రతి అడుగును శ్రేష్ఠమైన మతముపై వేసి శ్రేష్ఠంగా తయారుచేసే సేవాధారులే కదా. సేవలో సఫలతను ప్రాప్తి చేసుకోవడము, ఇదే సేవాధారుల శ్రేష్ఠమైన లక్ష్యము. కనుక అందరూ శ్రేష్ఠమైన లక్ష్యాన్ని పెట్టుకునేవారే కదా. ఎంతగా సేవలో లేక స్వయంలో వ్యర్థం సమాప్తమైపోతుందో అంతగా స్వ మరియు సేవ సమర్థంగా అవుతాయి. కనుక వ్యర్థాన్ని సమాప్తం చేయాలి, సదా సమర్థంగా అవ్వాలి - ఇదే సేవాధారుల విశేషత. నిమిత్తంగా ఉన్న ఆత్మలు స్వయం ఎంత శక్తిశాలిగా ఉంటారో సేవ కూడా అంత శక్తిశాలిగా ఉంటుంది. సేవాధారులంటేనే సేవలో సదా ఉల్లాస-ఉత్సాహాలు తీసుకురావడం. స్వయం ఉల్లాస-ఉత్సాహాలలో ఉండేవారు ఇతరులకు ఉల్లాస-ఉత్సాహాలను ఇప్పించగలరు. కనుక ఉల్లాస-ఉత్సాహాలు ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. నేను లోపలైతే ఉల్లాస-ఉత్సాహాలతోనే ఉంటాను కాని బయటకు కనిపించదని అనకండి. గుప్త పురుషార్థము వేరే విషయము కాని ఉల్లాస-ఉత్సహాలు దాగి ఉండలేవు. ముఖముపై సదా ఉల్లాస-ఉత్సాహాల మెరుపు స్వతహాగా కనిపిస్తుంది. నోటితో చెప్పినా, చెప్పకపోయినా ముఖమే చెప్తుంది, మెరుపు మాట్లడుతుంది. ఇలాంటి సేవాధారులుగా ఉన్నారా?

సేవ చేసే గోల్డన్ ఛాన్స్ కూడా శ్రేష్ఠమైన భాగ్యానికి గుర్తు. సేవాధారులుగా అయ్యే భాగ్యమైతే ప్రాప్తి అయింది కాని ఇప్పుడు సేవాధారులలో నంబర్ వన్ గా ఉన్నారా లేక నంబర్ టూ గా ఉన్నారా? ఈ భాగ్యాన్ని కూడా తయారుచేసుకోవాలి మరియు చూడాలి. కేవలం ఒక్క భాగ్యము కాదు కాని భాగ్యముపై భాగ్యమును ప్రాప్తి చేసుకోవాలి. ఎన్ని భాగ్యాలను ప్రాప్తి చేసుకుంటూ వెళ్తారో అంత నంబరు స్వతహాగా ముందుకు వెళ్తూ ఉంటుంది. వీరినే పదమాపదమ్ భాగ్యశాలురని అంటారు. ఒక్క సబ్జెక్టులో కాదు, అన్ని సబ్జెక్టులలో సఫలతా స్వరూపులు. అచ్ఛా.

2. అందరికంటే ఎక్కువ సంతోషము ఎవరికుంది - తండ్రికి ఉందా, మీకుందా? నాకే ఉంది అని ఎందుకు చెప్పరు! ద్వాపరయుగం నుండి భక్తిలో పిలిచారు, ఇప్పుడు ప్రాప్తి చేసుకున్నారంటే ఎంత సంతోషముండాలి! 63 జన్మలుగా ప్రాప్తి చేసుకోవాలనే కోరిక ఉండేది, ఇప్పుడు 63 జన్మల కోరిక పూర్తి అయిపోయిందంటే ఎంత సంతోషముండాలి! ఏదైనా వస్తువును పొందాలనే కోరిక పూర్తి అయితే సంతోషముంటుంది కదా. ఈ సంతోషమే విశ్వానికి సంతోషాన్నిప్పించేది. మీరు సంతోషంగా ఉంటే పూర్తి విశ్వం సంతోషంగా ఉంటుంది. అలాంటి సంతోషం లభించింది కదా. మీరు మారినప్పుడు ప్రపంచం కూడా మారిపోతుంది. ఎలా మారిపోతుందంటే అందులో దుఃఖము-అశాంతుల నామ-రుపాలు కూడా ఉండవు. కనుక సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి. సదా మీ శ్రేష్ఠ కర్మల ఖాతాను జమ చేసుకుంటూ ఉండండి. అందరికీ సంతోషాల ఖజానాను పంచండి. ఈనాటి ప్రపంచంలో సంతోషం లేదు. అందరూ సంతోషం కోసం బికారులుగా ఉన్నారు. వారిని సంతోషంలో నిండుగా చేయండి. సదా ఇదే సేవలో ముందుకు వెళ్తూ ఉండండి. ఏ ఆత్మలైతే నిరాశలో ఉన్నారో వారిని ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకొస్తూ ఉండండి. ఏమీ చేయలేము, ఏమీ అవ్వదు... అని వారు నిరాశతో ఉన్నారు. మీరు విజయులుగా అయి విజయులుగా చేసే ఉల్లాస-ఉత్సాహాలను పెంచేవారు. సదా విజయము అనే స్మృతి తిలకము దిద్దబడి ఉండాలి. తిలకధారులు కూడా అయ్యారు, స్వరాజ్య అధికారులు కూడా అయ్యారు - ఈ స్మృతిలో సదా ఉండండి.

ప్రశ్న - ఎవరైతే సమీప సితారలు ఉన్నారో వారి లక్షణాలు ఎలా ఉంటాయి ?

జవాబు - వారిలో సమానత కనిపిస్తుంది. సమీప సితారలలో బాప్ దాదా గుణాలు మరియు కర్తవ్యము ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఎంత సమీపంగా ఉంటే అంత సమానత ఉంటుంది. వారి ముఖం బాప్ దాదాను సాక్షాత్కారం చేయించే దర్పణంగా ఉంటుంది. వారిని చూస్తూనే బాప్ దాదా పరిచయము ప్రాప్తి అవుతుంది. వారు మిమ్మల్నే చూస్తారు కాని ఆకర్షణ బాప్ దాదా వైపు ఉంటుంది. దీనినే సన్ షోస్ ఫాదర్ (పుత్రుడు తండ్రిని ప్రత్యక్షం చేయడం) అని అంటారు. స్నేహీల ప్రతి అడుగులో, ఎవరితో స్నేహముందో వారి ముద్ర కనిపిస్తుంది. ఎంత హర్షితమూర్తులుగా ఉంటారో అంత ఆకర్షణామూర్తులుగా అవుతారు. అచ్ఛా.

వరదానము:-

సేవ ద్వారా అనేక ఆత్మల ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకుని సదా ముందుకు వెళ్ళే మహాదాని భవ

మహాదానిగా అవ్వడం అనగా ఇతరుల సేవ చేయడం, ఇతరుల సేవ చేయడం ద్వారా స్వయం సేవ స్వతహాగా జరిగిపోతుంది. మహాదానిగా అవ్వడం అనగా స్వయాన్ని సంపన్నంగా చేసుకోవడం. ఎంతగా ఆత్మలకు సుఖము, శాంతి మరియు జ్ఞానాన్ని దానమిస్తారో అంతగా ఆత్మల నుండి ప్రాప్తి యొక్క శబ్దము లేక ధన్యవాదాలు ఏవైతే వెలువడతాయో అవి మీ కొరకు ఆశీర్వాదాల రూపంగా అవుతాయి. ఈ ఆశీర్వాదాలే ముందుకు వెళ్ళేందుకు సాధనాలు. ఎవరికైతే ఆశీర్వాదాలు లభిస్తాయో వారు సదా సంతోషంగా ఉంటారు. కనుక ప్రతిరోజు అమృతవేళ మహాదానిగా అయ్యే ప్రోగ్రాం తయారుచేయండి. దానమివ్వకుండా ఉండని సమయము కానీ రోజు కానీ ఉండకూడదు.

స్లోగన్:-

ఇప్పటి ప్రత్యక్ష ఫలము ఆత్మకు ఎగిరే కళలోకి వెళ్ళే బలమునిస్తుంది.