24-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - తండ్రి మీకు జ్ఞాన రత్నాలనిచ్చేందుకు వచ్చారు, బాబా మీకు ఏదైతే వినిపిస్తారో లేక అర్థం చేయిస్తారో అది జ్ఞానము, జ్ఞాన రత్నాలను జ్ఞాన సాగరుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు”

ప్రశ్న:-

ఆత్మ విలువ తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణమేమిటి?

జవాబు:-

మలినం చేరడం వలన విలువ తగ్గిపోతుంది. ఏ విధంగా బంగారంలో లోహాలను కలిపి నగలను తయారుచేయడం వలన దాని విలువ తగ్గిపోతుందో, అదే విధంగా సత్యమైన బంగారంగా ఉన్న ఆత్మలో అపవిత్రత అనే మలినము ఏర్పడినప్పుడు దాని విలువ తగ్గిపోతుంది. ఈ సమయంలో తమోప్రధానంగా ఉన్న ఆత్మకు ఎటువంటి విలువా లేదు. శరీరానికి కూడా ఎటువంటి విలువా లేదు. ఇప్పుడు మీ ఆత్మ మరియు శరీరము రెండూ స్మృతి ద్వారా విలువైనవిగా తయారవుతున్నాయి.

గీతము:-

ఈ రోజు ఉదయముదయమే ఎవరు వచ్చారు..... (యహ్ కౌన్ ఆజ్ ఆయా సవేరే-సవేరే.....)

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు మరియు స్మృతి యొక్క యుక్తులను కూడా తెలియజేస్తున్నారు. పిల్లలు కూర్చున్నారు, భోళానాథుడైన శివబాబా వచ్చారని పిల్లలకు లోలోపల తెలుసు. అరగంట శాంతిగా కూర్చున్నారనుకోండి, ఏమీ మాట్లాడకపోతే మీలోపలి ఆత్మ శివబాబా ఏదైనా మాట్లాడాలని అంటుంది. శివబాబా విరాజమానమై ఉన్నారు, కానీ ఏమీ మాట్లాడడం లేదు అని మీకు తెలుసు. ఇది కూడా మీ స్మృతి యాత్రే కదా. బుద్ధిలో శివబాబా స్మృతియే ఉంది. బాబా ఏమైనా మాట్లాడాలి, జ్ఞాన రత్నాలను ఇవ్వాలి అని లోపల భావిస్తారు. పిల్లలైన మీకు జ్ఞానరత్నాలను ఇచ్చేందుకే తండ్రి వస్తారు. వారు జ్ఞానసాగరుడు కదా. పిల్లలూ, దేహీ-అభిమానులుగా ఉండండి, తండ్రిని స్మృతి చేయండి అని వారు అంటారు. ఇది జ్ఞానము. ఈ డ్రామా చక్రాన్ని, మెట్ల వరసను మరియు తండ్రిని స్మృతి చేయండి, ఇదే జ్ఞానము అని తండ్రి చెప్తున్నారు. బాబా ఏదైతే అర్థం చేయిస్తారో, దాన్ని జ్ఞానం అని అంటారు. స్మృతియాత్రను కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇవన్నీ జ్ఞాన రత్నాలు. స్మృతి విషయం గురించి అర్థం చేయించే ఈ జ్ఞానరత్నాలు చాలా మంచివి. మీ 84 జన్మలను గుర్తు చేయండి అని తండ్రి చెప్తారు. మీరు పవిత్రంగా వచ్చారు, మళ్ళీ పవిత్రంగా అయ్యే వెళ్ళాలి. కర్మాతీత స్థితిలో వెళ్ళాలి మరియు బాబా నుండి పూర్తి వారసత్వము తీసుకోవాలి. ఆత్మ స్మృతి బలముతో సతోప్రధానంగా అయినప్పుడే అది లభిస్తుంది. ఈ పదాలు చాలా విలువైనవి, నోట్ చేసుకోవాలి. ఆత్మలోనే ధారణ జరుగుతుంది. ఈ శరీరమైతే ఇంద్రియాలతో కూడినది, ఇది వినాశనమైపోతుంది. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే నిండుతాయి. తండ్రిలో కూడా సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానం యొక్క సంస్కారం నిండి ఉంది, అందుకే వారిని జ్ఞాన సాగరుడు అని అనడం జరుగుతుంది. 84 జన్మల చక్రము పూర్తిగా సహజమైనది అని బాబా సరి చేసి అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు 84 జన్మల చక్రము పూర్తయ్యింది. ఇప్పుడు మనం తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాలి. మలినంగా ఉన్న ఆత్మ అయితే అక్కడకు వెళ్ళలేదు. మీ ఆత్మ పవిత్రంగా అయినప్పుడు ఈ శరీరము వదిలిపోతుంది. పవిత్రమైన శరీరము ఇక్కడ లభించదు. ఇది పాత చెప్పు, దీని పట్ల వైరాగ్యము వస్తూ ఉంటుంది. ఆత్మ పవిత్రంగా అయ్యి మళ్ళీ భవిష్యత్తులో మనం పవిత్రమైన శరీరాన్ని తీసుకోవాలి. సత్యయుగంలో మన ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా ఉండేవి. ఈ సమయంలో మీ ఆత్మ అపవిత్రంగా అయిపోయింది కనుక శరీరము కూడా అపవిత్రంగా ఉంది. బంగారం ఎటువంటిదో నగ కూడా అదేవిధంగా ఉంటుంది. గవర్నమెంట్ కూడా సాధారణమైన బంగారు నగలను ధరించండి, వాటి విలువ తక్కువగా ఉంటుంది అని చెప్తుంది. ఇప్పుడు మీ ఆత్మ విలువ కూడా తక్కువగా ఉంది. అక్కడ మీ ఆత్మకు ఎంతో విలువ ఉంటుంది. సతోప్రధానంగా ఉంటుంది కదా. ఇప్పుడు తమోప్రధానంగా ఉంది. మలినాలు చేరాయి, దేనికీ పనికి రాదు. అక్కడ ఆత్మ పవిత్రంగా ఉంటుంది, కనుక దానికి చాలా విలువ ఉంటుంది. ఇప్పుడు 9 క్యారెట్లుగా అయిపోయింది కనుక ఎటువంటి విలువా లేదు, అందుకే ఆత్మను పవిత్రంగా చేసుకుంటే దానితో శరీరము కూడా పవిత్రమైనది లభిస్తుంది అని తండ్రి చెప్తున్నారు. ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు.

నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రియే చెప్తారు. కృష్ణుడు ఎలా చెప్పగలరు. వారైతే దేహధారి కదా. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి, ఏ దేహధారినీ స్మృతి చేయకండి అని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, కావున తిరిగి అర్థం చేయించాలి. శివబాబా నిరాకారుడు, వారి జన్మ అలౌకికమైనది. పిల్లలైన మీకు కూడా అలౌకిక జన్మనిస్తారు. అలౌకిక తండ్రి, అలౌకిక పిల్లలు. లౌకికము, పారలౌకికము మరియు అలౌకికము అని అంటారు. పిల్లలైన మీకు అలౌకిక జన్మ లభిస్తుంది. తండ్రి మిమ్మల్ని దత్తత తీసుకుని వారసత్వాన్నిస్తారు. బ్రాహ్మణులైన మనది కూడా అలౌకిక జన్మ అని మీకు తెలుసు. అలౌకిక తండ్రి నుండి అలౌకిక వారసత్వము లభిస్తుంది. బ్రహ్మాకుమార-కుమారీలు తప్ప ఇంకెవ్వరూ స్వర్గానికి యజమానులుగా అవ్వలేరు. మనుష్యులు ఏమీ అర్థము చేసుకోరు. తండ్రి మీకు ఎంతగా అర్థం చేయిస్తున్నారు. అపవిత్రంగా అయిన ఆత్మ స్మృతి లేకుండా పవిత్రంగా అవ్వలేదు. స్మృతిలో లేకపోతే మలినాలు ఉండిపోతాయి. పవిత్రంగా అవ్వలేకపోతే, తర్వాత శిక్షలు అనుభవించవలసి వస్తుంది. మొత్తం ప్రపంచంలోని మనుష్యాత్మలందరూ పవిత్రంగా అయ్యి తిరిగి వెళ్ళాలి, శరీరమైతే వెళ్ళదు. స్వయాన్ని ఆత్మగా భావించడం ఎంత కష్టంగా ఉంటుంది, వ్యాపారాలు మొదలైనవాటిలో ఆ స్థితి ఉండదు అని తండ్రి చెప్తున్నారు. అచ్ఛా, స్వయాన్ని ఆత్మగా భావించలేకపోతే శివబాబాను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. వ్యాపారాలు మొదలైనవి చేస్తూ కూడా నేను ఆత్మ, ఈ శరీరము ద్వారా పని చేస్తాను అన్న ఈ శ్రమ చేయాలి. ఆత్మనైన నేనే శివబాబాను స్మృతి చేస్తూ ఉంటాను. ఆత్మయే మొట్టమొదట పవిత్రంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. ఇదే శ్రమ. ఇందులో చాలా గొప్ప సంపాదన ఉంది. ఇక్కడ ఎంత గొప్ప షావుకార్లున్నా కానీ, గొప్ప కోటీశ్వరులున్నా కానీ ఆ సుఖము లేదు. అందరి తలపై దుఃఖముంది. పెద్ద-పెద్ద రాజులు, ప్రెసిడెంట్లు మొదలైనవారు ఈ రోజు ఉంటారు, రేపు వారిని హతమారుస్తారు. విదేశాలలో ఏమేమి జరుగుతూ ఉంటాయి. షావుకార్లకు, రాజులకు అయితే కష్టాలు ఉంటాయి. ఇక్కడ కూడా రాజులుగా ఉండేవారు ప్రజలుగా అయిపోయారు. రాజులపై మళ్ళీ ప్రజా రాజ్యం ఏర్పడింది. డ్రామాలో ఆ విధంగా రచింపబడి ఉంది. అంతిమంలోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది పరస్పరంలో కొట్లాడుకుంటూ ఉంటారు. కల్పక్రితము కూడా ఇలా జరిగిందని మీకు తెలుసు. మీరు గుప్త వేషంలో, హృదయపూర్వకంగా, ప్రేమగా, పోగొట్టుకున్న మీ రాజ్యాన్ని తీసుకుంటారు. మేమే యజమానులుగా ఉండేవారము, సూర్యవంశీ దేవతలుగా ఉండేవారము అని మీకు పరిచయం లభించింది. ఇప్పుడు మళ్ళీ అలా తయారయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు సత్యనారాయణ కథను వింటున్నారు కదా. తండ్రి ద్వారా మనం నరుని నుండి నారాయణునిగా ఎలా అవ్వాలి? తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. భక్తిమార్గములో దీనిని ఎవ్వరూ నేర్పించలేరు. మనుష్యులెవ్వరినీ తండ్రి, టీచరు, గురువు అని అనరు. భక్తిలో ఎన్నో పాత కథలు కూర్చుని వినిపిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు 21 జన్మలు విశ్రాంతి పొందేందుకు పావనంగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది.

స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి చెప్తారు. అర్థకల్పం అయితే డ్రామానుసారంగా దేహాభిమానులుగా ఉంటారు, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వాలి. డ్రామానుసారంగా ఇప్పుడు పాత ప్రపంచము మారి కొత్తదిగా అవ్వాలి. ప్రపంచమైతే ఒక్కటే. పాత ప్రపంచము మళ్ళీ కొత్తదిగా అవుతుంది. కొత్త ప్రపంచములో కొత్త భారత్ ఉండేది, అందులో దేవీ-దేవతలు ఉండేవారు, యమునా నది తీరంలో రాజధాని ఉంటుందని కూడా మీకు తెలుసు, దానిని పరిస్తాన్ అని కూడా అనేవారు. అక్కడ సహజమైన సౌందర్యం ఉంటుంది. ఆత్మ పవిత్రంగా అయినప్పుడు పవిత్రాత్మకు శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. నేను వచ్చి మిమ్మల్ని సుందరమైన దేవీ-దేవతలుగా తయారుచేస్తాను అని తండ్రి చెప్తున్నారు. మాలో అవగుణాలైతే లేవు కదా, స్మృతిలో ఉంటున్నామా, అని పిల్లలైన మీరు స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. చదువు కూడా చదువుకోవాలి. ఇది చాలా గొప్ప చదువు. ఒకే ఒక్క చదువు. ఆ చదువులోనైతే ఎన్ని పుస్తకాలు మొదలైనవి చదువుతారు. ఈ చదువు ఉన్నతాతి ఉన్నతమైనది, చదివించేవారు కూడా ఉన్నతాతి ఉన్నతమైన శివబాబా. అలాగని శివబాబా ఈ ప్రపంచానికి యజమాని కాదు. విశ్వానికి యజమానులుగా అయితే మీరే అవుతారు కదా. ఎన్ని కొత్త-కొత్త గుహ్యమైన విషయాలు మీకు వినిపిస్తూ ఉంటారు. పరమాత్మ సృష్టికి యజమాని అని మనుష్యులు భావిస్తారు. మధురాతి-మధురమైన పిల్లలూ, నేను ఈ సృష్టికి యజమానిని కాదు, మీరు యజమానులుగా అవుతారు, మళ్ళీ రాజ్యాన్ని పోగొట్టుకుంటారు, మళ్ళీ తండ్రి వచ్చి విశ్వానికి యజమానులుగా చేస్తారు - అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. విశ్వము అని దీనినే అంటారు. మూలవతనము లేక సూక్ష్మవతనము యొక్క విషయము కాదు. మూలవతనము నుండి మీరిక్కడకు వచ్చి 84 జన్మల చక్రములో తిరుగుతారు. మళ్ళీ తండ్రి రావలసి వస్తుంది. మీరు పోగొట్టుకున్న ఈ ప్రారబ్ధాన్ని పొందేందుకు ఇప్పుడు మళ్ళీ మీతో పురుషార్థము చేయిస్తాను. ఇది గెలుపు-ఓటముల ఆట కదా. ఈ రావణరాజ్యము సమాప్తం అవ్వాలి. తండ్రి ఎంత సహజరీతిగా అర్థం చేయిస్తారు. స్వయంగా తండ్రి కూర్చుని చదివిస్తున్నారు. అక్కడైతే మనుష్యులు, మనుష్యులను చదివిస్తారు. మీరు కూడా మనుష్యులే కానీ తండ్రి ఆత్మలైన మిమ్మల్ని కూర్చుని చదివిస్తున్నారు. చదువు యొక్క సంస్కారం ఆత్మలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారు, అదంతా భక్తికి సంబంధించిన జ్ఞానము. సంపాదన చేసుకునేందుకు కూడా జ్ఞానముంది, శాస్త్రాల జ్ఞానము కూడా ఉంది, ఇది ఆత్మిక జ్ఞానము. ఆత్మలైన మీకు ఆత్మిక తండ్రి కూర్చుని జ్ఞానం వినిపిస్తున్నారు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా మీరు విన్నారు. మొత్తం మనుష్య సృష్టిలో ఈ విధంగా ఎవ్వరూ చదివిస్తూ ఉండకపోవచ్చు. ఈశ్వరుడు ఎలా చదివిస్తారో ఎవ్వరికీ తెలియదు.

ఈ చదువు ద్వారా ఇప్పుడు రాజ్య స్థాపన జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఎవరైతే బాగా చదువుకుని, శ్రీమతంపై నడుస్తారో వారు ఉన్నతంగా అవుతారు మరియు ఎవరైతే వెళ్ళి తండ్రిని నిందింపజేస్తారో, చేతిని విడిచిపెట్టేస్తారో వారు ప్రజలలో చాలా తక్కువ పదవిని పొందుతారు. తండ్రి అయితే ఒకే చదువును చదివిస్తారు. చదువులో ఎంత మార్జిన్ (తేడా) ఉంది. దైవీ రాజ్యముండేది కదా. తండ్రి ఒక్కరే ఇక్కడకు వచ్చి రాజ్యాన్ని స్థాపన చేస్తారు. మిగిలినదంతా వినాశనమవ్వనున్నది. పిల్లలూ, ఇప్పుడు త్వరగా ఏర్పాట్లు చేసుకోండి, పొరపాట్లలో సమయాన్ని వ్యర్థము చేసుకోకండి అని తండ్రి చెప్తున్నారు. స్మృతి చేయకపోతే చాలా విలువైన సమయం నష్టమవుతుంది. శరీర నిర్వహణార్థము వ్యాపారాలు మొదలైనవి చేయండి కానీ చేతులు పని వైపు, హృదయం ప్రియుని వైపు ఉండాలి (హత్ కార్ డే, దిల్ యార్ డే). నన్ను స్మృతి చేసినట్లయితే మీకు రాజ్యము లభిస్తుంది అని తండ్రి చెప్తున్నారు. ఖుదాదోస్త్ కథను కూడా విన్నారు కదా. అల్లాహ్ అవల్దీన్ నాటకము కూడా చూపిస్తారు. చిటికె వేయడంతో ఖజానా బయటకు వస్తుంది. అల్లాహ్ చిటికె వేయడంతో ఎలా ఉన్న మిమ్మల్ని ఎలా తయారుచేస్తారో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. దివ్యదృష్టితో వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఇంతకుముందు పిల్లలు పరస్పరం కలిసి కూర్చునేవారు, మళ్ళీ తమకు తామే ధ్యానంలోకి వెళ్ళేవారు. దానిని ఇంద్రజాలం అని అనేవారు. కనుక దాన్ని ఆపేసారు. ఈ విషయాలన్నీ ఈ సమయానికి చెందినవి. హాతిమతాయి కథ కూడా ఉంది. నోటిలో బంగారు నాణెము వేసుకోగానే మాయ మాయమైపోయేది. నాణెం బయటకు తీయగానే మాయ వచ్చేసేది. ఈ రహస్యాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. పిల్లలూ, నోటిలో నాణెం వేసుకోండి అని తండ్రి చెప్తున్నారు. మీరు శాంతి సాగరులు, ఆత్మ శాంతిలో తన స్వధర్మములో ఉంటుంది. సత్యయుగంలో కూడా నేను ఒక ఆత్మ అని తెలుసు. అంతేకానీ పరమాత్మ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే - అక్కడ వికారాల పేరే ఉండదు, అది నిర్వికారీ ప్రపంచము, పంచ వికారాలు అక్కడ ఉండనే ఉండవు, దేహాభిమానమే ఉండదు అని చెప్పండి. మాయా రాజ్యములో దేహాభిమానులుగా అవుతారు, అక్కడ మోహజీతులుగా ఉంటారు. ఈ పాత ప్రపంచము పట్ల నష్టోమోహులుగా అవ్వాలి. ఇళ్ళు వాకిళ్ళు విడిచిపెట్టేవారికి వైరాగ్యము కలుగుతుంది. మీరైతే ఇళ్ళు వాకిళ్ళను విడిచిపెట్టకూడదు. తండ్రి స్మృతిలో ఉంటూ ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళాలి. అందరి లెక్కాచారాలు సమాప్తమవ్వాలి. తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. ఇది కల్ప-కల్పము జరుగుతుంది. ఇప్పుడు మీ బుద్ధి దూర-దూరాల వరకు పైకి వెళ్తుంది. సాగరము ఎంత వరకు ఉంది, సూర్య-చంద్రులలో ఏముంది అని వారు చూస్తారు. ఇంతకుముందు వాటిని దేవతలుగా భావించేవారు. ఇవైతే రంగస్థలానికి దీపాలని మీరు చెప్తారు. ఇక్కడ ఆట జరుగుతుంది. కావున ఈ దీపాలు కూడా ఇక్కడే ఉన్నాయి. మూలవతనము, సూక్ష్మవతనములో ఇవి ఉండవు. అక్కడ ఆటే ఉండదు. ఈ అనాది ఆట కొనసాగుతూ వస్తుంది. చక్రము తిరుగుతూ ఉంటుంది, ప్రళయము జరగదు. భారత్ అయితే అవినాశీ ఖండము, ఇందులో మనుష్యులు ఉంటూనే ఉంటారు, జలమయము అవ్వదు. పశుపక్ష్యాదులు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, అవన్నీ ఉంటాయి. మిగిలిన ఖండాలు సత్య-త్రేతా యుగాలలో ఉండవు. మీరు దివ్యదృష్టితో చూసినదంతా మళ్ళీ ప్రాక్టికల్ గా చూస్తారు. ప్రాక్టికల్ గా మీరు వైకుంఠములోకి వెళ్ళి రాజ్యము చేస్తారు. దాని కోసమే పురుషార్థము చేస్తూ ఉంటారు, అయినా స్మృతిలో ఎంతో శ్రమ ఉంది, మాయ స్మృతి చేయనివ్వదు అని తండ్రి అంటారు. చాలా ప్రేమగా బాబాను స్మృతి చేయాలి. అజ్ఞాన కాలములో కూడా ప్రేమగా తండ్రిని మహిమ చేసేవారు. మా ఫలానా వారు అలా ఉండేవారు, ఫలానా పదవిలో ఉండేవారు అని తలుచుకుంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రమంతా కూర్చుని ఉంది. అన్ని ధర్మాల జ్ఞానముంది. ఏ విధంగా అక్కడ ఆత్మల వృక్షం ఉన్నదో, అలా ఇక్కడ మనుష్య సృష్టి వంశవృక్షముంది. బ్రహ్మాయే గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్. తర్వాత మీ వంశము. సృష్టి అయితే నడుస్తూనే ఉంటుంది కదా.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, నరుని నుండి నారాయణునిగా అవ్వాలంటే మీరు ఏవైతే చెప్తారో, అదే చేయాలి. మొదట మీ స్థితిని చూసుకోండి. బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వము తీసుకునే తీరుతాము అని అంటారు, మరి అటువంటి నడవడిక కూడా ఉండాలి. నరుని నుండి నారాయణునిగా అయ్యే చదువు ఇదొక్కటే. ఇది మీకు తండ్రే చదివిస్తారు. రాజులకే రాజుగా మీరే అవుతారు, ఇలా ఇంకే ఖండంలోనూ అవ్వరు. మీరు పవిత్రమైన రాజులుగా అవుతారు, మళ్ళీ ప్రకాశం లేని అపవిత్ర రాజులుగా అవుతారు, పవిత్ర రాజులకు మందిరాలను నిర్మించి పూజిస్తారు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. స్టూడెంట్ టీచరును ఎందుకు మర్చిపోతాడు! బాబా, మాయ మరిపింపజేస్తుంది అని అంటారు. మళ్ళీ మాయపై దోషం వేసేస్తారు. అరే, స్మృతి అయితే మీరే చేయాలి. ముఖ్యమైన టీచరు ఒక్కరే, మిగిలినవారందరూ అసిస్టెంట్ టీచర్లు. తండ్రిని మర్చిపోతున్నారా, అచ్ఛా, టీచరును స్మృతి చేయండి. మీకు మూడు అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకరిని మర్చిపోతే ఇంకొకరిని స్మృతి చేయండి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు మీరు ఏదైతే చెప్తారో, అదే చేయాలి, ఈ పురుషార్థము చేయాలి. మోహజీతులుగా అవ్వాలి.

2. మేము శాంతిసాగరుని పిల్లలము, మేము శాంతిలో ఉండాలి అని సదా గుర్తుండాలి. నోట్లో బంగారు నాణెము వేసుకోవాలి. పొరపాట్లలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు.

వరదానము:-

తపిస్తున్న ఆత్మలకు ఒక క్షణంలో గతి-సద్గతులను ఇచ్చే మాస్టర్ దాతా భవ

ఏ విధంగా స్థూలమైన సీజన్ కోసం ఏర్పాట్లు చేసుకుంటారో, ఎవ్వరికీ ఎటువంటి కష్టమూ కలగకూడదని, సమయం వ్యర్థం కాకూడదని సేవాధారులను, సామాగ్రిని అన్నింటినీ సిద్ధం చేసుకుంటారో, అదే విధంగా ఇప్పుడు సర్వాత్మలకు గతి-సద్గతిని చేసేందుకు అంతిమ సీజన్ ఇక రానున్నది, తపిస్తున్న ఆత్మలకు క్యూలో నిలబడే కష్టం ఇవ్వకూడదు, వారు వస్తూ ఉండాలి మరియు తీసుకుంటూ ఉండాలి. దీనికోసం ఎవరెడీగా అవ్వండి. పురుషార్థీ జీవితంలో ఉంటూ ఇప్పుడు దాతాతనపు స్థితిలో పైన ఉండండి. ప్రతి సంకల్పము, ప్రతి క్షణము మాస్టర్ దాతలుగా అయి నడుచుకోండి.

స్లోగన్:-

హజూర్ (బాబాను) బుద్ధిలో హాజరుగా ఉంచుకున్నట్లయితే సర్వ ప్రాప్తులు జీ హజూర్ అని మీ ముందు హాజరవుతాయి.