28-07-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - ఈ అనంతమైన నాటకంలో మీరు అద్భుతమైన పాత్రధారులు, ఇది అనాది నాటకము, ఇందులో ఎటువంటి మార్పులు జరగవు”

ప్రశ్న:-

ఏ గుహ్యమైన రహస్యాన్ని వివేకవంతులైన, దూరదృష్టి కల పిల్లలు మాత్రమే అర్థము చేసుకోగలరు?

జవాబు:-

మూలవతనము నుండి మొదలుకొని మొత్తం డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల గుహ్య రహస్యమును, దూరదృష్టి కలిగిన పిల్లలు మాత్రమే అర్థము చేసుకోగలరు, బీజము మరియు వృక్షముల మొత్తం జ్ఞానము వారి బుద్ధిలో ఉంటుంది. ఈ అనంతమైన నాటకంలో ఆత్మ రూపీ పాత్రధారి శరీరాన్ని ధరించి ఏ పాత్రనైతే అభినయిస్తుందో, ఆ పాత్రను సత్యయుగము నుండి మొదలుకొని కలియుగము వరకు అభినయించాలి. ఏ పాత్రధారి కూడా మధ్యలో తిరిగి వెళ్ళలేరు.

గీతము:-

నీవు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నావు... (తూనే రాత్ గవాయీ సోకే...)

ఓంశాంతి. పిల్లలు ఈ పాటను విన్నారు. ఇప్పుడు ఇందులో కొన్ని పదాలు సరిగ్గా ఉన్నాయి, కొన్ని తప్పుగా కూడా ఉన్నాయి. సుఖములోనైతే స్మరించడం జరగదు. దుఃఖము కూడా తప్పకుండా రావాల్సిందే. దుఃఖమున్నప్పుడే సుఖమునిచ్చేందుకు తండ్రి రావలసి ఉంటుంది. ఇప్పుడు మనము సుఖధామము కోసం చదువుతున్నామని మధురాతి-మధురమైన పిల్లలకు తెలుసు. శాంతిధామము మరియు సుఖధామము. మొదట ముక్తి, తర్వాత జీవన్ముక్తి ఉంటుంది. శాంతిధామము ఇల్లు, అక్కడేమీ పాత్రను అభినయించడం జరగదు. పాత్రధారులు ఇంటికి వెళ్ళిపోతారు, అక్కడేమీ పాత్రను అభినయించరు. పాత్రను స్టేజ్ పైనే అభినయించడం జరగుతుంది. ఇది కూడా స్టేజ్. ఏ విధంగా హద్దులోని నాటకము ఉంటుందో అదే విధంగా ఇది అనంతమైన నాటకము. తండ్రి తప్ప ఇంకెవ్వరూ దీని ఆదిమధ్యాంత రహస్యాలను అర్థం చేయించలేరు. నిజానికి కేవలం అర్థము చేయించడానికే ఈ యాత్ర లేక యుద్ధము అనే పదాలు ఉపయోగిస్తారు. అంతేకానీ ఇందులో యుద్ధము మొదలైనవేవీ లేవు. యాత్ర అనే పదం కూడా ఉపయోగిస్తారు, కానీ స్మృతి అని అర్థం. స్మృతి చేస్తూ-చేస్తూ పావనంగా అయిపోతారు. ఈ యాత్ర కూడా ఇక్కడే పూర్తవుతుంది. ఎక్కడికీ వెళ్ళనవసరము లేదు. పావనంగా అయి మన ఇంటికి వెళ్ళాలి అని పిల్లలకు అర్థము చేయించడం జరుగుతుంది. అపవిత్రంగా ఉన్నవారు వెళ్ళలేరు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మనైన నాలో మొత్తం చక్రం యొక్క పాత్ర ఉంది. ఇప్పుడు ఆ పాత్ర పూర్తయ్యింది. నన్ను స్మృతి చేయడం చాలా సహజం అని తండ్రి సలహానిస్తున్నారు. మీరు ఇక్కడే కూర్చుంటారు, ఎక్కడికీ వెళ్ళరు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు అని తండ్రి వచ్చి చెప్తున్నారు. యుద్ధమేదీ లేదు. స్వయాన్ని తమోప్రధానము నుండి సతోప్రధానముగా తయారుచేసుకోవాలి. మాయపై విజయము పొందాలి. 84 జన్మల చక్రము పూర్తవ్వాలి అని పిల్లలకు తెలుసు, భారత్ సతోప్రధానంగా ఉండేది, అందులో తప్పకుండా మనుష్యులే ఉంటారు. భూమి ఏమీ మారదు. మనం సతోప్రధానముగా ఉండేవారము, మళ్ళీ తమోప్రధానముగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలని మీకిప్పుడు తెలుసు. మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారుచేయండి అని మనుష్యులు పిలుస్తారు కూడా. కానీ వారెవరు, ఎలా వస్తారు అనేది ఏమాత్రము తెలియదు. ఇప్పుడు బాబా మిమ్మల్ని వివేకవంతులుగా చేశారు. మీరు ఎంత ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇక్కడి షావుకారుల కన్నా, అక్కడి పేదవారు కూడా చాలా ఉన్నతంగా ఉంటారు. ఎంత గొప్ప-గొప్ప రాజులైనా సరే, ఎంత ధనమున్నా సరే వికారులే కదా. వీరికంటే అక్కడి సాధారణ ప్రజలు కూడా చాలా ఉన్నతంగా ఉంటారు. బాబా తేడాను తెలియజేస్తున్నారు. రావణుని నీడ పడటంతో పతితులుగా అయిపోతారు. నిర్వికారీ దేవతల ఎదురుగా వెళ్ళి స్వయాన్ని పతితులము అని అంటూ తల వంచి నమస్కరిస్తారు. బాబా ఇక్కడకు వచ్చిన వెంటనే చాలా పైకి ఎక్కిస్తారు. ఒక్క క్షణపు విషయం. ఇప్పుడు తండ్రి జ్ఞానం యొక్క మూడవ నేత్రాన్నిచ్చారు. పిల్లలైన మీరు దూరదృష్టికలవారిగా అయిపోతారు. పైన ఉన్న మూలవతనము నుండి మొత్తం డ్రామా చక్రమంతా మీ బుద్ధిలో గుర్తుంది. ఏ విధంగా అయితే హద్దులోని డ్రామాను చూసి వచ్చి, ఏమేమి చూసారో వినిపిస్తారు కదా! బుద్ధిలో నిండి ఉంటుంది కనుక వర్ణిస్తారు. ఆత్మలో నింపుకుని వస్తారు, తర్వాత వర్ణన చేస్తారు. అయినా ఇవి అనంతమైన విషయాలు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ అనంతమైన డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల రహస్యము ఉండాలి. ఇది పునరావృతమవుతూ ఉంటుంది. ఆ హద్దు నాటకములోనైతే ఒక పాత్రధారి వెళ్ళిపోతే వారికి బదులుగా ఇంకొకరు రావచ్చు. ఎవరికైనా అనారోగ్యము కలిగినప్పుడు వారికి బదులుగా మరొకరిని చేర్చుకుంటారు. ఇది చైతన్యమైన డ్రామా, ఇందులో కొద్దిగా కూడా మార్పులు-చేర్పులు జరగవు. మనము ఒక ఆత్మ, ఇది శరీర రూపీ వస్త్రం, దీనిని ధరించి మనము బహురూపీ పాత్రను అభినయిస్తామని పిల్లలైన మీకు తెలుసు. నామం, రూపం,దేశం, ముఖ కవళికలు మారుతూ ఉంటాయి. పాత్రధారులకు తమ పాత్ర గురించి తెలిసి ఉంటుంది కదా. తండ్రి పిల్లలకు ఈ చక్రము యొక్క రహస్యాన్ని అర్థము చేయిస్తూ ఉంటారు. సత్యయుగము నుండి మొదలుకొని కలియుగము వరకు వస్తారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వచ్చి కొత్తగా పాత్రను అభినయిస్తారు. దీన్ని వివరంగా అర్థము చేయించేందుకు సమయం పడుతుంది. బీజములో జ్ఞానం ఉన్నా అర్థము చేయించేందుకు సమయమైతే పడుతుంది కదా. మీ బుద్ధిలో మొత్తం బీజం మరియు వృక్షం యొక్క రహస్యం ఉంది, కానీ దీని బీజము పైన ఉంది అని మంచి వివేకవంతులుగా ఉన్నవారే అర్థము చేసుకుంటారు. దీని ఉత్పత్తి, పాలన మరియు సంహారము ఎలా జరుగుతాయో అర్థము చేసుకుంటారు, అందుకే త్రిమూర్తులను కూడా చూపించారు. తండ్రి ఇచ్చే వివరణ మనుష్యులెవ్వరూ కూడా ఇవ్వలేరు. ఇక్కడికి వచ్చినప్పుడే తెలుసుకుంటారు, అందుకే ఇక్కడకు వచ్చి అర్థము చేసుకోండి అని మీరు అందరికీ చెప్తారు. కొంతమంది చాలా కఠినంగా ఉంటారు, మేము ఏమీ వినాలనుకోవడం లేదు అని అంటారు, కొందరు వింటారు కూడా. కొందరు లిటరేచర్ తీసుకుంటారు, కొందరు తీసుకోరు. ఇప్పుడు మీ బుద్ధి చాలా విశాలంగా, దూరదృష్టి కలదిగా అయ్యింది. మూడు లోకాల గురించి మీకు తెలుసు, మూలవతనాన్ని నిరాకారీ ప్రపంచం అని అంటారు. సూక్ష్మవతనంలో ఏమీ ఉండదు. కనెక్షన్ అంతా మూలవతనము మరియు స్థూలవతనముతోనే ఉంది. సూక్ష్మవతనము అయితే కొంత సమయము కోసమే ఉంది. ఆత్మలన్నీ పాత్రను అభినయించేందుకు పై నుండి ఇక్కడకు వస్తాయి. అన్ని ధర్మాల ఈ వృక్షము నంబరువారుగా ఉంటుంది. ఇది మనుష్యుల వృక్షం మరియు పూర్తిగా ఏక్యురేట్ గా ఉంటుంది. కొద్దిగా కూడా ముందూ-వెనకా అవ్వదు. ఆత్మలు కూడా ఇంకే స్థానములోనూ కూర్చోలేవు. ఆకాశములో నక్షత్రాలు నిలిచి ఉన్నట్లుగా, బ్రహ్మతత్వములో ఆత్మలు నిలిచి ఉంటాయి. ఈ నక్షత్రాలు పెద్దవిగా ఉన్నా కానీ దూరము నుండి చిన్న-చిన్నవిగా కనిపిస్తాయి. కానీ ఆత్మలు చిన్నవిగా-పెద్దవిగా అవ్వవు, వినాశనం చెందవు. మీరు స్వర్ణిమ యుగానికి వెళ్తారు, మళ్ళీ ఇనుప యుగంలోకి వస్తారు. మనము స్వర్ణిమ యుగములో ఉండేవారము, ఇప్పుడు ఇనుప యుగంలోకి వచ్చామని పిల్లలకు తెలుసు. ఎటువంటి విలువా లేదు. మాయ మెరుపులు ఎన్ని ఉన్నా కూడా ఇది రావణుని స్వర్ణిమ యుగము, అది ఈశ్వరీయ స్వర్ణిమ యుగము.

6 -7 సంవత్సరాలలో ఎంత ధాన్యం పండుతుందో అడగవద్దు అని మనుష్యులు చెప్తూ ఉంటారు. వారి ప్లాను ఎలా ఉంది మరియు పిల్లలైన మీ ప్లాను ఎలా ఉందో చూడండి. పాత దానిని కొత్తదిగా తయారుచేయడం నా ప్లాను అని తండ్రి చెప్తున్నారు. మీ ప్లాను ఒక్కటే. తండ్రి శ్రీమతంపై మనం మన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. బాబా మార్గాన్ని తెలియజేస్తారు, శ్రీమతాన్నిస్తారు, స్మృతిలో ఉండేందుకు మతము ఇస్తారు. మతము అన్న పదమైతే ఉంది కదా. తండ్రి సంస్కృత పదాలను చెప్పరు. తండ్రి హిందీలోనే అర్థము చేయిస్తూ ఉంటారు. లెక్కలేనన్ని భాషలున్నాయి కదా. అనువాదం చేసేవారు కూడా ఉంటారు, వారు విని మళ్ళీ వినిపిస్తారు. హిందీ మరియు ఇంగ్లీషు అయితే చాలా మందికి తెలుసు. వాటిని చదువుతారు. కానీ ఇంట్లో ఉండే మాతలు అంతగా చదవరు. ఈ రోజుల్లో విదేశాల్లో ఇంగ్లీష్ నేర్చుకుంటారు, మళ్ళీ ఇక్కడకు వచ్చిన తర్వాత కూడా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. హిందీ అస్సలు మాట్లాడలేరు. ఇంటికి వచ్చి తల్లితో ఇంగ్లీషులో మాట్లాడడం ప్రారంభిస్తారు. నాకు ఇంగ్లీషు ఏమి అర్థమవుతుంది అని పాపం ఆమె తికమక పడుతుంది. వారు మళ్ళీ ఎంతో కొంత హిందీ నేర్చుకోవలసి వస్తుంది. సత్యయుగములోనైతే ఒకే రాజ్యము, ఒకే భాష ఉండేవి, దానినిప్పుడు మళ్ళీ స్థాపన చేస్తున్నారు. ఈ సృష్టి చక్రము ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత ఏ విధంగా తిరుగుతుందో బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఇక్కడ మీకు చాలా తీరిక సమయం లభిస్తుంది. ఉదయమే స్నానము మొదలైనవి చేసి విహరించడానికి బయటకు వెళ్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది, లోపల మనమందరం పాత్రధారులము అన్న స్మృతియే ఉండాలి. ఇది కూడా ఇప్పుడు స్మృతిలోకి వచ్చింది. బాబా మనకు 84 జన్మల చక్ర రహస్యాన్ని తెలియజేశారు. మనము సతోప్రధానంగా ఉండేవారము, ఇది చాలా సంతోషకరమైన విషయము. మనుష్యులు తిరుగుతూ ఉంటారు, వారికి ఎటువంటి సంపాదనా ఉండదు. మీరైతే చాలా సంపాదన చేసుకుంటారు. బుద్ధిలో చక్రము కూడా గుర్తుండాలి, అలాగే తండ్రిని కూడా స్మృతి చేస్తూ ఉండాలి. సంపాదన చేసుకునేందుకు బాబా చాలా మంచి-మంచి యుక్తులను తెలియజేస్తారు. ఏ పిల్లలైతే జ్ఞానాన్ని విచార సాగర మథనము చేయరో, వారి బుద్ధిలో మాయ అలజడి కలిగిస్తుంది. వారినే మాయ విసిగిస్తుంది. నేను ఈ చక్రములో ఏ విధంగా తిరిగాను, సత్యయుగములో ఇన్ని జన్మలు తీసుకుని మళ్ళీ క్రిందకి దిగుతూ వచ్చాను, ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి అని లోలోపల ఆలోచించండి. నన్ను స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అయిపోతారని బాబా చెప్తున్నారు. నడుస్తూ-తిరుగుతూ బుద్ధిలో స్మృతి ఉన్నట్లయితే మాయ యొక్క అలజడి సమాప్తమైపోతుంది. మీకు చాలా-చాలా లాభము కలుగుతుంది. స్త్రీ - పురుషులు ఇరువురూ కలిసే వచ్చినా కూడా, ప్రతి ఒక్కరూ తమ ఉన్నత పదవిని పొందేందుకు స్వయమే శ్రమ చేయాలి. ఒంటరిగా వెళ్తే చాలా ఆనందంగా ఉంటుంది. తమ ధ్యాసలోనే ఉంటారు. వేరొకరు తోడుగా ఉంటే కూడా బుద్ధి అటు-ఇటు వెళ్తుంది. ఇది చాలా సహజమైనది, తోటలు మొదలైనవి అన్నిచోట్లా ఉన్నాయి, ఇంజనీర్లు ఉంటే వారికి ఇక్కడ వంతెన కట్టాలి, ఇది చేయాలి అన్న చింతన నడుస్తూ ఉంటుంది. బుద్ధిలో ప్లాను వస్తుంది. మీరు ఇంట్లో కూర్చున్నా కూడా బుద్ధి అటువైపే నిమగ్నమవ్వాలి. ఈ అలవాటు చేసుకుంటే మీలో ఇదే చింతన నడుస్తూ ఉంటుంది. చదువుకోవాలి కూడా, వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. వృద్ధులు, యువకులు, పిల్లలు మొదలైనవారందరూ పావనంగా అవ్వాలి. ఆత్మకు తండ్రి నుండి వారసత్వము తీసుకునే హక్కు ఉంది. పిల్లలకు కూడా బాల్యములోనే ఈ బీజము పడితే చాలా మంచిది. ఆధ్యాత్మిక విద్య ఇంకెవ్వరూ నేర్పించలేరు.

మీ ఈ ఆధ్యాత్మిక విద్యను, తండ్రినే వచ్చి మీకు చదివిస్తారు. ఆ స్కూల్లో దైహిక విద్య లభిస్తుంది. అలాగే అది శాస్త్రాల విద్య. ఇది ఆత్మిక విద్య, దీనిని భగవంతుడు మీకు నేర్పిస్తారు. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటారు. దీనిని ఆత్మ వచ్చి చదివిస్తారు, దీనికి ఇంకే పేరు పెట్టడం జరగదు. ఇది స్వయంగా తండ్రి వచ్చి చదివిస్తారు. భగవానువాచ కదా. భగవంతుడు ఒకేసారి ఈ సమయంలోనే వచ్చి అర్థం చేయిస్తారు, దీనిని ఆత్మిక జ్ఞానం అని అంటారు. ఆ శాస్త్రాల విద్య వేరు. మొదటిది దైహిక కాలేజ్ మొదలైనవాటిలో ఉండే జ్ఞానం, రెండవది ఆధ్యాత్మిక శాస్త్రాల విద్య, మూడవది ఈ ఆత్మిక జ్ఞానం అని మీకు తెలుసు. వారు ఎంత గొప్ప డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అయినా కానీ వారి వద్ద ఉన్నవి కూడా శాస్త్రాల విషయాలే. మీ ఈ జ్ఞానము పూర్తిగా వేరుగా ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మలందరికీ తండ్రి అయిన స్పిరిచ్యువల్ ఫాదర్ మాత్రమే చదివిస్తారు. శాంతి సాగరుడు, సుఖసాగరుడు..... అని వారికే మహిమ ఉంది. కృష్ణుని మహిమ పూర్తిగా వేరు, గుణాలు-అవగుణాలు మనుష్యులలో ఉంటాయి, వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. తండ్రి మహిమ గురించి కూడా యథార్థ రీతిగా మీకు తెలుసు. వారు కేవలం చిలుకలాగా పాడుతూ ఉంటారు, ఏ మాత్రం అర్థం తెలియదు. తమ ఉన్నతిని ఏ విధంగా చేసుకోవాలి అని తండ్రి పిల్లలకు సలహానిస్తారు. పురుషార్థము చేస్తూ ఉన్నట్లయితే పక్కా అయిపోతూ ఉంటారు, తర్వాత ఆఫీసులో పని చేసే సమయంలో కూడా ఈ స్మృతి ఉంటుంది, ఈశ్వరీయ స్మృతి ఉంటుంది. మాయ స్మృతి అయితే అర్థకల్పము నడిచింది, ఇప్పుడు తండ్రి కూర్చుని యథార్థ రీతిగా అర్థం చేయిస్తున్నారు. మేము ఎలా ఉండేవారము, ఇప్పుడు ఎలా అయ్యాము అని స్వయాన్ని పరిశీలించుకోండి. బాబా మళ్ళీ అటువంటి దేవతలుగా తయారుచేస్తున్నారు. ఇది కూడా పిల్లలైన మీరు మాత్రమే నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసుకున్నారు. మొట్టమొదట భారత్ మాత్రమే ఉండేది. తండ్రి కూడా పాత్రను అభినయించేందుకు భారత్ లోనే వస్తారు. మీరు కూడా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు కదా. మీరు పవిత్రంగా అవ్వాలి, లేకపోతే చివర్లో వస్తారు, ఇంకేమి సుఖము పొందుతారు. భక్తి ఎక్కువగా చేసి ఉండకపోతే రారు. వీరు అంతగా అర్థము చేసుకోలేరని భావిస్తారు. అర్థం చేసుకోగలరు కదా. చాలా శ్రమ చేస్తారు, అయినా ఎవరో అరుదుగా వెలువడుతారు కానీ అలసిపోకూడదు. శ్రమ అయితే చేయాలి. శ్రమపడకుండా ఏమీ లభించదు. ప్రజలైతే తయారవుతూ ఉంటారు.

పిల్లలూ, మీ ఉన్నతి చేసుకోవాలంటే ఉదయము-ఉదయమే స్నానము మొదలైనవి చేసి ఏకాంతంలోకి వెళ్ళి తిరగండి లేక కూర్చోండి అని బాబా పిల్లల ఉన్నతి కోసం యుక్తిని తెలియజేస్తున్నారు. ఆరోగ్యము కోసం నడవడం కూడా మంచిది. బాబా కూడా గుర్తుకొస్తారు మరియు డ్రామా రహస్యము కూడా బుద్ధిలో ఉంటుంది, ఎంతో సంపాదన జరుగుతుంది. ఇది సత్యమైన సంపాదన, ఆ సంపాదన పూర్తవ్వగానే ఇక ఈ సంపాదన గురించి చింతన చేయండి. కష్టమేమీ లేదు, బాబాను కూడా చూసారు, మొత్తం జీవిత కథను వ్రాశారు - ఈ రోజు ఇన్ని గంటలకు లేచాను, తర్వాత ఇది చేశాను...... తర్వాత వచ్చేవారు చదివి నేర్చుకుంటారని భావిస్తారు. గొప్ప-గొప్ప మనుష్యుల జీవిత చరిత్రను చదువుతారు కదా. పిల్లల కోసం వ్రాస్తారు, మళ్ళీ పిల్లలు కూడా ఇంట్లో అటువంటి మంచి స్వభావము కలవారిగా ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థము చేసి సతోప్రధానంగా అవ్వాలి. సతోప్రధాన ప్రపంచం యొక్క రాజ్యాన్ని మళ్ళీ తీసుకోవాలి. మనము కల్ప-కల్పము రాజ్యము తీసుకుంటాము, మళ్ళీ కోల్పోతాము అని మీకు తెలుసు. ఇవన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. ఇది కొత్త ప్రపంచము, కొత్త ధర్మము కోసం కొత్త జ్ఞానము, కనుక త్వర-త్వరగా పురుషార్థము చేయమని మధురాతి-మధురమైన పిల్లలకు అర్థము చేయిస్తారు. శరీరముపై భరోసా లేదు. ఈ రోజుల్లో మృత్యువు చాలా సహజమైపోయింది. అక్కడ అమరలోకములో ఎప్పుడూ అటువంటి మృత్యువు ఉండదు, ఇక్కడైతే కూర్చుని-కూర్చుని మరణిస్తారు, అందువలన మీ పురుషార్థము చేస్తూ ఉండండి. జమా చేసుకుంటూ ఉండండి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బుద్ధిని జ్ఞాన చింతనలో బిజీ పెట్టుకునే అభ్యాసము చేయాలి. ఏ కాస్త సమయం దొరికినా ఏకాంతములోకి వెళ్ళి విచార సాగర మథనము చేయాలి. తండ్రిని స్మృతి చేసి సత్యమైన సంపాదనను జమా చేసుకోవాలి.

2. దూరదృష్టి కలవారిగా అయి ఈ అనంతమైన నాటకాన్ని యథార్థ రీతిగా అర్థము చేసుకోవాలి. పాత్రధారులందరి పాత్రను సాక్షిగా అయి చూడాలి.

వరదానము:-

మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయి బొమ్మల ఆటలను సమాప్తం చేసే స్మృతి మరియు సమర్థీ స్వరూప భవ

భక్తిమార్గంలో విగ్రహాలను తయారుచేసి పూజలు మొదలైనవి చేస్తారు, ఆ తర్వాత వాటిని ముంచివేస్తారు కావున మీరు వాటిని బొమ్మల పూజ అని అంటారు కదా. అదే విధంగా మీ ముందుకు కూడా ఎప్పుడైనా, ఏవైనా నిర్జీవమైన, నిస్సారమైన ఈర్ష్య, అనుమానము, ఆవేశము మొదలైనవాటితో కూడుకున్న విషయాలు వచ్చినప్పుడు మీరు వాటిని విస్తారము చేసి వాటిని ఇవే సత్యమని అనుభవం చేసుకుంటే లేక చేయిస్తే, ఇది కూడా వాటిలో ప్రాణమును నింపడం వంటిది, వాటిని జ్ఞానసాగరుడైన తండ్రి స్మృతి ద్వారా, గతించినదేదో గతించిపోయింది అని భావిస్తూ, స్వఉన్నతి యొక్క అలల్లో ముంచేస్తూ ఉంటారు కూడా, కానీ ఇందులో కూడా సమయమైతే వ్యర్థమవుతుంది కదా. కావున ముందే మాస్టర్ జ్ఞానసాగరులుగా అయి, స్మృతి సమర్థీ భవ అన్న వరదానము ద్వారా ఈ బొమ్మలాటలను సమాప్తం చేయండి.

స్లోగన్:-

ఎవరైతే సమయానికి సహయోగులుగా అవుతారో, వారికి ఒకటికి పదమాలరెట్ల ఫలము లభిస్తుంది.