02-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘శివ భగవానువాచ - మధురమైన పిల్లలూ, మీరు నన్ను స్మృతి చేయండి మరియు ప్రేమించండి ఎందుకంటే నేనే మిమ్మల్ని సదా సుఖీగా తయారుచేయడానికి వచ్చాను’’

ప్రశ్న:-
ఏ పిల్లల ద్వారానైతే నిర్లక్ష్యము జరుగుతూ ఉంటుందో, వారి నోటి నుండి ఎటువంటి మాటలు స్వతహాగా వెలువడుతాయి?

జవాబు:-
నా భాగ్యములో ఏముంటే అది లభిస్తుందిలే, స్వర్గములోకైతే ఎలాగూ వెళ్తాను కదా. బాబా అంటారు, ఈ మాటలు పురుషార్థీ పిల్లలవి కావు. ఉన్నత పదవిని పొందే పురుషార్థమునే చేయాలి. ఉన్నత పదవిని ఇచ్చేందుకు తండ్రి వచ్చినప్పుడు ఇక నిర్లక్ష్యము చేయకండి.

పాట:-
బాల్యపు రోజులను మర్చిపోకండి...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని లైన్ యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు జీవిస్తూనే మీరు అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. మొత్తం కల్పమంతా హద్దులోని తండ్రికి చెందినవారిగా అయ్యారు. ఇప్పుడు కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీరు మాత్రమే అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యారు. అనంతమైన తండ్రి నుండి మనము అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఒకవేళ తండ్రిని విడిచిపెట్టినట్లయితే అనంతమైన వారసత్వము లభించదు. మీరు ఈ విషయాన్ని అర్థం చేయించినా కానీ కొంచెములోనే ఎవ్వరూ సంతుష్టపడరు. మనుష్యులు ధనాన్ని కోరుకుంటారు. ధనము లేకుండా సుఖము ఉండదు. ధనము కూడా కావాలి, శాంతి కూడా కావాలి, నిరోగి శరీరము కూడా కావాలి. ప్రపంచములో ఈ రోజు ఏముంది, రేపు ఏమి జరగనున్నది అనేది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వినాశనమైతే ఎదురుగా నిలబడి ఉంది. ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. ఒకవేళ వినాశనము నిలబడి ఉందని అర్థం చేసుకున్నా కానీ, ఏమి చేయాలి అన్నది అర్థం కాదు. యుద్ధము ఎప్పుడైనా ప్రారంభము అవ్వవచ్చు అని పిల్లలైన మీకు తెలుసు. కొద్దిగా నిప్పురవ్వ అంటుకన్నా సరే, విస్ఫోటం జరగడానికి సమయము పట్టదు. ఈ పాత ప్రపంచము ఇక సమాప్తమైపోయినట్లేనని పిల్లలకు తెలుసు, అందుకే ఇప్పుడు త్వరగా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రిని సదా స్మృతి చేస్తూ ఉన్నట్లయితే చాలా హర్షితముగా ఉంటారు. దేహాభిమానములోకి రావడముతో తండ్రిని మర్చిపోయి దుఃఖము తీసుకుంటారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా అనంతమైన తండ్రి నుండి సుఖాన్ని తీసుకుంటారు. ఇక్కడికి మీరు వచ్చిందే ఈ విధముగా లక్ష్మీ-నారాయణులుగా అవ్వడానికి. రాజా-రాణులకు నౌకర్లుగా అవ్వడానికి మరియు ప్రజలకు నౌకర్లుగా అవ్వడానికి చాలా తేడా ఉంటుంది కదా. ఇప్పటి మీ పురుషార్థము ఇక కల్ప-కల్పాంతరాలకు నిలిచిపోతుంది. నేను ఎంత పురుషార్థము చేసాను అన్నది చివరిలో అందరికీ సాక్షాత్కారమవుతుంది. ఇప్పుడు కూడా తండ్రి చెప్తున్నారు, మీ అవస్థను చూసుకుంటూ ఉండండి. మధురాతి మధురమైన బాబా, వారి నుండి మనకు స్వర్గ వారసత్వము లభిస్తుంది, వారిని మనము ఎంతగా స్మృతి చేస్తున్నాము. మీ ఆధారమంతా స్మృతి పైనే ఉంది. ఎంతగా స్మృతి చేస్తారో, అంత సంతోషము కూడా ఉంటుంది. ఇప్పుడు దగ్గరలోకి వచ్చి చేరుకున్నామని భావిస్తారు. కొంతమంది అలసిపోతారు కూడా, గమ్యము ఇంకా ఎంత దూరముందో తెలియదని అనుకుంటారు. గమ్యానికి చేరుకుంటే, ఆ కృషి కూడా సఫలమవుతుంది. ఇప్పుడు మీరు ఏ గమ్యానికి చేరుకుంటున్నారు అనేది ప్రపంచానికి తెలియదు. భగవంతుడని ఎవరిని అంటారు అన్నది కూడా ప్రపంచానికి తెలియదు. భగవంతుడు అని అంటారు కూడా, మళ్ళీ రాయి-రప్పలలో ఉన్నారని అంటారు.

మనము తండ్రికి చెందినవారిగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి యొక్క మతముపైనే నడవాలి. విదేశాలలో ఉన్నా సరే, అక్కడ ఉంటూ కూడా కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మీకు శ్రీమతము లభిస్తుంది. స్మృతితో తప్ప ఆత్మ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వలేదు. మీరంటారు - బాబా, మేము మీ నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాము, ఏ విధముగా మా మమ్మా-బాబా వారసత్వాన్ని తీసుకుంటారో, అదే విధముగా మేము కూడా పురుషార్థము చేసి వారి సింహాసనముపై తప్పకుండా కూర్చుంటాము, మమ్మా-బాబా, రాజ-రాజేశ్వరులుగా అవుతారు కావున మేము కూడా అవుతాము. పరీక్ష అయితే అందరికీ ఒకటే. మీకు చాలా కొద్దిగా నేర్పించడము జరుగుతుంది, అదేమిటంటే - కేవలం తండ్రిని స్మృతి చేయండి. దీనిని సహజ రాజయోగ బలము అని అంటారు. యోగముతో చాలా బలము లభిస్తుందని మీరు అర్థం చేసుకుంటారు. మేము ఏవైనా వికర్మలు చేసినట్లయితే చాలా శిక్షలను అనుభవిస్తామని, పదభ్రష్టులమవుతామని మీరు అర్థం చేసుకుంటారు. స్మృతిలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. సద్గురువుకు నింద తీసుకువచ్చినవారు ఉన్నత స్థానాన్ని, ఉన్నత పదవిని పొందలేరు అని అంటూ ఉంటారు. అక్కడ వారు, గురువుకు నింద తీసుకువచ్చినవారు... అని అంటారు. నిరాకారుని గురించి ఎవరికీ తెలియదు. భక్తులకు ఫలాన్ని ఇచ్చేవారు భగవంతుడు అని అంటూ ఉంటారు కూడా. సాధు-సన్యాసులు మొదలైనవారందరూ భక్తులే. భక్తులే గంగా స్నానాలు చేయడానికి వెళ్తారు. భక్తులు, భక్తులకు ఫలాన్ని ఇవ్వరు. భక్తులు, భక్తులకు ఫలాన్ని ఇచ్చినట్లయితే ఇక భగవంతుడిని ఎందుకు స్మృతి చేయడము. ఇది ఉన్నదే భక్తి మార్గము. అందరూ భక్తులే. భక్తులకు ఫలాన్ని ఇచ్చేవారు భగవంతుడు. అంతేకానీ, ఎక్కువ భక్తి చేసేవారు తక్కువ భక్తి చేసేవారికి ఫలాన్ని ఇస్తారని కాదు. అలా కాదు. భక్తి అంటే భక్తే. రచన, రచనకు వారసత్వాన్ని ఎలా ఇస్తారు! వారసత్వము రచయిత నుండే లభిస్తుంది. ఈ సమయములో అందరూ భక్తులే. జ్ఞానము లభించినప్పుడు భక్తి దానంతట అదే దూరమైపోతుంది. జ్ఞానము జిందాబాద్ అవుతుంది. జ్ఞానము లేకుండా సద్గతి ఎలా లభిస్తుంది. అందరూ తమ లెక్కాచారాలను సమాప్తము చేసుకుని వెళ్ళిపోతారు. వినాశనము ఎదురుగా నిలబడి ఉందని, దాని కంటే ముందే పురుషార్థము చేసి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు.

మనము పావన ప్రపంచములోకి వెళ్తున్నామని మీకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారే నిమిత్తముగా అవుతారు. బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులుగా అవ్వకుండా మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. వారసత్వాన్ని ఇవ్వడానికే తండ్రి పిల్లలను రచిస్తారు. మనము ఎలాగూ శివబాబాకు చెందినవారమే. వారు పిల్లలకు వారసత్వముగా ఇవ్వడము కోసమని సృష్టిని రచిస్తారు. శరీరధారులకే వారసత్వాన్ని ఇస్తారు కదా. ఆత్మలైతే పైన ఉంటాయి. అక్కడైతే వారసత్వము లేక ప్రారబ్ధము యొక్క విషయమే ఉండదు. మీరు ఇప్పుడు పురుషార్థము చేసి ప్రారబ్ధాన్ని తీసుకుంటున్నారు, ఈ విషయము ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు సమయము సమీపముగా వస్తూ ఉంది. బాంబులనేవి దాచిపెట్టుకోవడానికి ఏమీ తయారుచేయలేదు. ఏర్పాట్లు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు తండ్రి మనల్ని ఆజ్ఞాపిస్తున్నారు - నన్ను స్మృతి చేయండి. లేదంటే అంతిమములో చాలా ఏడ్వవలసి ఉంటుంది. లౌకిక చదువు యొక్క పరీక్షలలో ఎవరైనా ఫెయిల్ అయితే, ఆ కోపములో వెళ్ళి నీటిలో పడి మరణిస్తారు. ఇక్కడ కోపము యొక్క విషయమేమీ లేదు. చివరిలో మీకు సాక్షాత్కారాలు చాలా జరుగుతాయి. మనము ఎలా-ఎలా తయారవుతాము అనేది కూడా తెలిసిపోతుంది. తండ్రి పని పురుషార్థము చేయించడము. పిల్లలంటారు - బాబా, మేము కర్మలు చేస్తూ స్మృతి చేయడము మర్చిపోతున్నాము అని, మరి కొంతమంది అంటారు - స్మృతి చేయడానికి తీరిక లభించడము లేదు అని. అప్పుడు బాబా అంటారు - అచ్ఛా, సమయము తీసి స్మృతిలో కూర్చోండి, తండ్రిని స్మృతి చేయండి. మీరు పరస్పరములో కలుసుకున్నప్పుడు కూడా - మేము బాబాను స్మృతి చేయాలి అన్న ప్రయత్నమే చేయండి. అందరూ కలిసి కూర్చుంటే మీరు స్మృతి బాగా చేస్తారు, సహాయము లభిస్తుంది. ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయడము. ఎవరైనా విదేశాలకు వెళ్ళినా, అక్కడ కూడా కేవలం ఒక్క విషయాన్నే గుర్తుంచుకోండి - తండ్రి స్మృతి ద్వారానే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు అని. తండ్రి చెప్తున్నారు - కేవలం ఒక్క విషయాన్నే గుర్తుంచుకోండి, అదేమిటంటే - తండ్రిని స్మృతి చేయండి. యోగబలముతో అన్ని పాపాలు భస్మమైపోతాయి. తండ్రి అంటారు, మన్మనాభవ, నన్ను స్మృతి చేసినట్లయితే విశ్వానికి యజమానులుగా అవుతారు. ముఖ్యమైన విషయము స్మృతియే. ఎక్కడికీ వెళ్ళాల్సిన విషయమేమీ లేదు. ఇంటిలో ఉండండి, కేవలం తండ్రిని స్మృతి చేయండి. పవిత్రముగా అవ్వకపోతే స్మృతి చేయలేకపోతారు. అందరూ వచ్చి ఇక్కడ ఉన్న క్లాసులో చదువుకుంటారని కాదు. మంత్రము తీసుకున్న తర్వాత ఎక్కడికైనా సరే వెళ్ళండి. సతోప్రధానముగా అయ్యే మార్గాన్ని అయితే తండ్రి ముందే తెలియజేసారు. అయితే సెంటరుకు వెళ్ళినట్లయితే కొత్త-కొత్త పాయింట్లను వింటూ ఉంటారు. ఒకవేళ ఏ కారణముగానైనా సెంటరుకు వెళ్ళలేకపోతే, వర్షము పడుతుంటే లేదా కర్ఫ్యూ జరుగుతుంటే, ఎవ్వరూ బయటకు వెళ్ళలేకపోతుంటే, అప్పుడు ఏమి చేస్తారు? తండ్రి అంటారు - ఏమీ పర్వాలేదు. శివుని మందిరములో అభిషేకము చెయ్యాల్సిందేనని కాదు. ఎక్కడ ఉన్నా మీరు స్మృతిలో ఉండండి. నడుస్తూ-తిరుగుతూ స్మృతి చేయండి. ఇతరులకు కూడా ఇదే విషయాన్నే చెప్పండి - తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు దేవతలుగా అయిపోతారు అని. రెండే మాటలు ఉన్నాయి - రచయిత అయిన తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. రచయిత ఒక్కరే. వారు ఎంత సహజమైన మార్గాన్ని తెలియజేస్తారు. తండ్రిని స్మృతి చేసే మంత్రము లభించింది. తండ్రి అంటారు - ఈ బాల్యాన్ని మర్చిపోకండి. ఈ రోజు నవ్వుతారు కానీ ఒకవేళ రేపు తండ్రిని మర్చిపోతే ఏడ్వవలసి ఉంటుంది. తండ్రి నుండి వారసత్వాన్ని పూర్తిగా తీసుకోవాలి. చాలామంది ఏమంటూ ఉంటారంటే - స్వర్గములోకైతే వెళ్తాను కదా, ఇక భాగ్యములో ఏది ఉంటే అది లభిస్తుందిలే... అటువంటివారిని పురుషార్థీ అని అనరు. మనుష్యులు పురుషార్థము చేసేదే ఉన్నత పదవిని పొందేందుకని. ఇప్పుడు తండ్రి నుండి ఉన్నత పదవి లభిస్తున్నప్పుడు మరి నిర్లక్ష్యము ఎందుకు చేయాలి. ఎవరైతే స్కూల్లో చదువుకోరో, అటువంటివారు చదువుకున్నవారి ముందు సేవకులుగా అవ్వవలసి ఉంటుంది. తండ్రిని పూర్తిగా స్మృతి చేయకపోతే, వెళ్ళి ప్రజల్లో నౌకర్లుగా అవుతారు, అందులో సంతోషపడిపోకూడదు. పిల్లలు సమ్ముఖములో రిఫ్రెష్ అయి వెళ్తారు. చాలామంది బంధనమున్నవారు ఉన్నారు, ఏం పర్వాలేదు, ఇంటిలో కూర్చుని తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని, యుద్ధము అకస్మాత్తుగానే ప్రారంభమవుతుందని ఎంతగా అర్థం చేయిస్తారు. యుద్ధము ఇక ప్రారంభమైనట్లుగానే కనిపిస్తుంది. రేడియో ద్వారా కూడా అంతా తెలిసిపోతుంది. ఏ మాత్రము తేడా చేసినా మేము ఇలా చేస్తాము అని బెదిరిస్తారు, ముందే అలా చెప్పేస్తారు, బాంబుల విషయములో చాలా అహంకారము ఉంది. తండ్రి కూడా అంటారు - పిల్లలు ఇంకా యోగబలములో తెలివైనవారిగా అవ్వలేదు, దాని కంటే ముందే యుద్ధము జరగడమనేది డ్రామానుసారముగా జరగనే జరగదు. పిల్లలు ఇంకా పూర్తి వారసత్వాన్నే తీసుకోలేదు. ఇప్పుడు పూర్తి రాజధాని ఇంకా స్థాపన అవ్వలేదు. ఇంకా కొద్ది సమయము కావాలి. పురుషార్థము చేయిస్తూ ఉంటారు. ఏ సమయములో ఏమి జరుగుతుందో తెలియదు. విమానాలు, రైళ్ళు పడిపోతాయి, మృత్యువు ఎంత సహజముగా నిలబడి ఉంది. భూమి కంపిస్తూ ఉంటుంది. అన్నింటికన్నా ఎక్కువగా భూకంపాలే పని చేయవలసి ఉంటుంది. భూమి కంపించినప్పుడే మొత్తము ఇళ్ళు మొదలైనవన్నీ కూలిపోతాయి. మృత్యువు జరిగేకంటే ముందే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి, అందుకే చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. బాబా, మీరు తప్ప మాకు ఇంకెవ్వరూ లేరు. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. చిన్న-చిన్న పిల్లలకు అర్థం చేయించినట్లుగా తండ్రి కూర్చుని ఎంత సహజ రీతిలో అర్థం చేయిస్తున్నారు. నేను మీకు వేరే ఏ కష్టము ఇవ్వను, కేవలం స్మృతి చేయండి మరియు కామచితిపై కూర్చుని కాలిపోయిన మీరు ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చుని పవిత్రముగా అవ్వండి. మీ ఉద్దేశ్యము ఏమిటి అని మిమ్మల్ని అడుగుతారు. మీరు ఇలా చెప్పండి - అందరికీ తండ్రి అయిన శివబాబా చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు అని. కలియుగములో అందరూ తమోప్రధానముగా ఉన్నారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రియే.

ఇప్పుడు తండ్రి అంటున్నారు - కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే తుప్పు తొలగిపోతుంది. ఇంతటి సందేశాన్ని అయితే ఇవ్వగలరు కదా. స్వయము స్మృతి చేసినప్పుడే ఇతరుల చేత స్మృతి చేయించగలరు. స్వయము స్మృతి చేస్తూ ఉంటేనే ఇతరులకు అభిరుచితో చెప్పగలుగుతారు, లేకపోతే ఆ మాట మనస్ఫూర్తిగా రాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఎక్కడ ఉన్నా సరే, ఎంత వీలైతే అంత, కేవలం స్మృతి చేయండి. మిమ్మల్ని ఎవరు కలిసినా సరే, వారికి ఇదే శిక్షణ ఇవ్వండి - మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి అంటారు - మీరందరూ తమోప్రధానముగా, పతితముగా అయిపోయారు, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, పవిత్రముగా అవ్వండి. ఆత్మయే పతితముగా అయ్యింది. సత్యయుగములో పావన ఆత్మ ఉంటుంది. తండ్రి అంటారు - స్మృతితోనే ఆత్మ పావనము అవుతుంది, ఇంకే ఉపాయము లేదు. ఈ సందేశాన్ని అందరికీ ఇస్తూ వెళ్ళినా కూడా, అనేకమంది యొక్క కళ్యాణము చేస్తారు. తండ్రి మీకు ఇంకే కష్టాన్నీ ఇవ్వరు. ఆత్మలందరినీ పావనముగా తయారుచేసేవారు పతిత-పావనుడైన తండ్రియే. అందరికన్నా ఉత్తమోత్తమ పురుషులుగా తయారుచేసేవారు తండ్రి. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో, వారే మళ్ళీ పూజారులుగా అయ్యారు. రావణ రాజ్యములో మనము పూజారులుగా అయ్యాము, రామ రాజ్యములో పూజ్యులుగా ఉండేవారము. ఇప్పుడిది రావణ రాజ్యము యొక్క అంతిమము. మనము తండ్రిని స్మృతి చేసినట్లయితే పూజారుల నుండి మళ్ళీ పూజ్యులుగా అవుతాము. ఇతరులకు కూడా మార్గాన్ని తెలియజేయాలి. వృద్ధ మాతలు కూడా సేవ చేయాలి. మిత్ర-సంబంధీకులకు కూడా సందేశాన్ని ఇవ్వండి. సత్సంగాలు, మందిరాలు మొదలైనవి కూడా అనేక రకాలైనవి ఉన్నాయి. మీదైతే ఒకే రకమైనది. కేవలం తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. శివబాబా అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. నిరాకార శివబాబా, సర్వుల సద్గతిదాత అయిన బాబా, ఆత్మలకు చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. ఇది అర్థం చేయించడమైతే సహజమే కదా. వృద్ధ మాతలు కూడా సేవ చేయగలరు. ముఖ్యమైన విషయమే ఇది. వివాహాలు మొదలైనవాటికి వెళ్ళినప్పుడు, వారి చెవిలో ఈ మాటను వినిపించండి - నన్ను స్మృతి చేయండి అని గీతా భగవంతుడు చెప్తున్నారు. ఈ మాటను అందరూ ఇష్టపడతారు. ఎక్కువగా చెప్పవలసిన అవసరమేమీ లేదు. నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారని, కేవలం తండ్రి యొక్క ఈ సందేశాన్ని ఇవ్వాలి. అచ్ఛా, భగవంతుడు ప్రేరణ ఇస్తున్నారని భావించండి. స్వప్నములో సాక్షాత్కారాలు కలుగుతాయి. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారని తండ్రి చెప్తున్నట్లుగా ఆ శబ్దము మీకు వినిపిస్తుంది. స్వయము మీరు కూడా కేవలం ఈ చింతననే చేస్తూ ఉన్నట్లయితే నావ తీరానికి చేరిపోతుంది. మనము ప్రాక్టికల్ గా అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యాము మరియు తండ్రి నుండి 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటున్నాము అంటే సంతోషముండాలి. తండ్రిని మర్చిపోవడము వలనే కష్టమనిపిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆత్మ సతోప్రధానముగా అయిపోతుంది అని తండ్రి ఎంత సహజముగా తెలియజేస్తారు. వీరికి మార్గమైతే తప్పకుండా సరైనదే లభించిందని అందరూ అర్థం చేసుకుంటారు. ఈ మార్గాన్ని ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేరు. ఒకవేళ సాధువులు మొదలైనవారు, శివబాబాను స్మృతి చేయండి అని చెప్తే ఇక వారి వద్దకు ఎవరు వెళ్తారు. ఎటువంటి సమయము వస్తుంది అంటే మీరు ఇంటి నుండి బయటకు కూడా రాలేకపోతారు. తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. అంతిమ సమయములో ఎవరైతే శివబాబాను స్మరిస్తారో... వారు మళ్ళీ-మళ్ళీ నారాయణుని లోకములో జన్మ తీసుకుంటారు, లక్ష్మీ-నారాయణుల వంశావళిలోకి వస్తారు కదా. వారు ఘడియ-ఘడియ రాజ్య పదవిని పొందుతారు. కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు ప్రేమించండి. స్మృతి చేయకుండా ఎలా ప్రేమించగలరు. సుఖము లభిస్తుంది కావున ప్రేమించడము జరుగుతుంది. దుఃఖాన్ని ఇచ్చేవారిని ప్రేమించడము జరగదు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను, అందుకే నన్ను ప్రేమించండి. తండ్రి మతముపై నడుచుకోవాలి కదా. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సంతోషముగా ఉండేందుకు స్మృతి విషయములో కృషి చేయాలి. స్మృతి బలము ఆత్మను సతోప్రధానముగా తయారుచేస్తుంది. ప్రేమగా ఒక్క తండ్రిని స్మృతి చేయాలి.

2. ఉన్నత పదవిని పొందేందుకు చదువు పట్ల పూర్తి అటెన్షన్ ను పెట్టాలి. భాగ్యములో ఏది ఉంటే అదే లభిస్తుందని కాదు, నిర్లక్ష్యాన్ని విడిచి పూర్తి వారసత్వానికి అధికారులుగా అవ్వాలి.

వరదానము:-
హద్దులోని బాధ్యతలను అనంతములోకి పరివర్తన చేసే స్మృతి స్వరూప నష్టోమోహా భవ

నష్టోమోహులుగా అయ్యేందుకు కేవలం మీ స్మృతి స్వరూపాన్ని పరివర్తన చేయండి. మేము గృహస్థులము, ఇది మా ఇల్లు, ఇవి మా సంబంధాలు అని ఎప్పుడైతే స్మృతి కలుగుతుందో అప్పుడే మోహము ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఈ హద్దులోని బాధ్యతలను అనంతమైన బాధ్యతలలోకి పరివర్తన చేయండి. అనంతమైన బాధ్యతలను నిర్వర్తిస్తే హద్దులోనివి స్వతహాగానే పూర్తయిపోతాయి. కానీ ఒకవేళ అనంతమైన బాధ్యతలను మరచి కేవలం హద్దులోని బాధ్యతలనే నిర్వర్తిస్తే వాటిని ఇంకా పాడు చేస్తారు ఎందుకంటే ఆ బాధ్యతలు మోహము రూపాన్ని ధరిస్తాయి. అందుకే మీ స్మృతి స్వరూపాన్ని పరివర్తన చేసి నష్టోమోహులుగా అవ్వండి.

స్లోగన్:-
మీరు ఎగిరే వేగాన్ని ఎంతగా తీవ్రము చేయండంటే, విషయాల రూపీ మేఘాలను క్షణములో దాటి వెళ్ళిపోవాలి.

అవ్యక్త ప్రేరణలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి

ఏ కార్యములోని సఫలతకైనా రెండు భుజాలు ఉంటాయి: 1-పరస్పర విశ్వాసము మరియు 2-ఏకత. ఎక్కడైతే సంగఠిత రూపములో అందరిదీ ఒకే మతము ఉంటుందో, పరస్పరము ఒకరి పట్ల ఒకరికి విశ్వాసము ఉంటుందో, అక్కడ సఫలత మెడలోని హారముగా ఉంటుంది. సంస్కారాలు భిన్నముగా ఉన్నాయి మరియు ఉంటాయి కూడా, కానీ ఒకవేళ ఎవరి సంస్కారమైనా ఘర్షణ కలిగించేదిగా ఉన్నా కానీ ఇతరులు దానికి మద్దతు పలకకండి. ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరివర్తన చేసుకున్నట్లయితే ఏకత నిలిచి ఉండగలదు.