03-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 28.03.2006


‘‘విశ్వములోని ఆత్మలను దుఃఖాల నుండి విడిపించేందుకు మనసా సేవను పెంచండి, సంపన్నముగా మరియు సంపూర్ణముగా అవ్వండి’’

ఈ రోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాప్ దాదా తమ నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో సంపన్నులైన పిల్లలను చూస్తున్నారు. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ సర్వ ఖజానాలకు యజమానిగా తయారుచేసారు. ఇచ్చేవారు ఒక్కరే మరియు వారు అందరికీ ఒకే విధంగా సర్వ ఖజానాలను ఇచ్చారు. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇవ్వలేదు. ఎందుకని? బాబా తరగని ఖజానాలకు యజమాని. అది అనంతమైన ఖజానా, కనుక పిల్లలు ప్రతి ఒక్కరూ తరగని ఖజానాలకు యజమానులు. బాప్ దాదా పిల్లలందరికీ ఒకే విధంగా, సమానముగా ఇచ్చారు. కానీ ధారణ చేసేవారిలో కొందరు సర్వ ఖజానాలను ధారణ చేసేవారైతే కొందరు యథా శక్తితో ధారణ చేసేవారు. కొందరు నంబర్ వన్ అయితే, కొందరు నంబరువారుగా ఉన్నారు. ఎవరు ఎంతగా ధారణ చేసారో అంతగా వారి ముఖము నుండి, నయనాల నుండి ఖజానాల నషా స్పష్టముగా కనిపిస్తుంది. ఖజానాలతో నిండుగా ఉన్న ఆత్మ ముఖము ద్వారా, నయనాల ద్వారా నిండుగా కనిపిస్తుంది. ఏ విధంగా స్థూల ఖజానాను ప్రాప్తి చేసుకునే ఆత్మ యొక్క నడవడిక ద్వారా, ముఖము ద్వారా ఆ నషా కనిపిస్తుందో, అలా ఈ అవినాశీ ఖజానాల నషా, సంతోషము స్పష్టముగా కనిపిస్తుంది. సంపన్నత యొక్క నషా నిశ్చింత చక్రవర్తులుగా తయారుచేస్తుంది. ఎక్కడైతే ఈశ్వరీయ నషా ఉంటుందో అక్కడ చింత ఉండదు, నిశ్చింత చక్రవర్తులుగా, నిశ్చింతపురికి చక్రవర్తులుగా అవుతారు. మరి మీరందరూ ఈశ్వరీయ సంపన్నతా ఖజానాలు కల నిశ్చింత చక్రవర్తులే కదా! మీరు నిశ్చింతపురికి చక్రవర్తులు. ఏదైనా చింత ఉందా? ఏదైనా దుఃఖము ఉందా? ఏమవుతుందో, ఎలా అవుతుందో అన్నదాని చింత కూడా ఉండకూడదు. త్రికాలదర్శీ స్థితిలో స్థితులై ఉండేవారికి - ఏదైతే జరుగుతూ ఉందో అది మంచిది, ఏదైతే జరగబోయేది ఉందో అది ఇంకా మంచిది అన్న విషయము తెలుసు. ఎందుకని? మీరు సర్వశక్తివంతుడైన బాబాకు సహచరులు, వారితో పాటు ఉండేవారు. బాప్ దాదా సదా మా హృదయములో ఉంటారు మరియు మేము సదా బాబా హృదయ సింహాసనముపై ఉంటాము అని ప్రతి ఒక్కరికీ నషా ఉంది, శుద్ధ గర్వము ఉంది. ఇటువంటి నషా ఉంది కదా! ఎవరైతే హృదయ సింహాసనాధికారులో వారి సంకల్పములో కాదు కదా, కనీసము స్వప్నములో కూడా దుఃఖపు అల అంశమాత్రముగా కూడా రాదు. ఎందుకని? వారు సర్వ ఖజానాలతో నిండుగా ఉంటారు, నిండుగా ఉన్న వస్తువులో అలజడి కలగదు కదా.

నలువైపులా ఉన్న పిల్లల యొక్క సంపన్నతను చూస్తున్నారు, బాప్ దాదా ప్రతి ఒక్కరి జమా ఖాతాను చెక్ చేసారు. ఖజానాలైతే తరగనంతగా లభించాయి కానీ లభించిన ఆ ఖజానాలను కార్యములో పెడుతూ ఖాళీ చేసేసారా లేక లభించిన ఆ ఖజానాలను కార్యములో కూడా పెట్టారు మరియు పెంచారు కూడానా? ప్రతి ఒక్కరి ఖాతాలో ఎంత శాతము జమ అయ్యింది? ఎందుకంటే ఈ ఖజానాలు కేవలము ఇప్పుడు ఈ సమయము కొరకే కాదు, ఈ ఖజానాలు భవిష్యత్తులో కూడా మీతోపాటు వస్తాయి. జమ అయినదే మీతోపాటు వస్తుంది. కావున శాతము చూస్తున్నారు. ఏం చూసారు? సేవనైతే పిల్లలందరూ తమ-తమ యోగము అనుసారముగా, తమ-తమ శక్తి అనుసారముగా చేస్తున్నారు, కానీ సేవా ఫలము జమ అవ్వటములో తేడా వచ్చేస్తుంది. కొంతమంది పిల్లల జమ ఖాతాను చూసారు, వారు సేవనైతే చాలానే చేస్తారు కానీ సేవ చేసినందుకు ఫలము జమ అయ్యిందా, లేదా అన్నదాని గుర్తులు ఏముంటాయి? సేవ ఏదైనా కానీ, అది మనసా సేవ అయినా, వాచా సేవ అయినా, కర్మణా సేవ అయినా, మూడింటిలోనూ 100 శాతము మార్కులు ఉంటాయి. మూడింటిలోనూ 100 శాతము ఉంటాయి. సేవనైతే చేసారు కానీ ఒకవేళ సేవ చేసే సమయములో లేక సేవ చేసిన తరువాత స్వయము తమ మనసులో స్వయముతో సంతుష్టముగా ఉన్నారా, అలాగే ఎవరి సేవనైతే చేసారో వారు, అలాగే ఎవరైతే సేవలో సహచరులుగా అవుతారో వారు, లేక సేవ చేసేవారిని చూసినవారు, విన్నవారు, వారంతా కూడా సంతుష్టముగా ఉన్నారంటే, జమ అయినట్లుగా భావించండి. స్వయము యొక్క సంతుష్టత, సర్వుల సంతుష్టత లేనట్లయితే జమ అయినదాని శాతము తక్కువైపోతుంది.

యథార్థ సేవ యొక్క విధి ఏమిటి అనేది ఇంతకుముందు కూడా చెప్పాము - మూడు విషయాలు విధిపూర్వకముగా ఉన్నట్లయితే జమ అవుతుంది. అదేమిటో వినిపించాము కదా - ఒకటి నిమిత్త భావము, రెండు నిర్మాన భావన, మూడు నిర్మల స్వభావము, నిర్మల వాణి. భావము, భావన మరియు స్వభావము, మాటలు. ఒకవేళ ఈ మూడు విషయాలలో ఏ ఒక్కటైనా తక్కువగా ఉన్నట్లయితే, ఒకటి ఉండి రెండు లేకపోయినా, రెండు ఉండి ఒకటి లేకపోయినా కూడా, ఆ లోటు జమ శాతమును తగ్గించేస్తుంది. కావున నాలుగు సబ్జెక్టులలోనూ మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి - నాలుగు సబ్జెక్టులలోనూ మా ఖాతా జమ అయ్యిందా? ఎందుకని? బాప్ దాదా చూసారు - భావము, భావన, స్వభావము, మాటలు... అని ఈ నాలుగు విషయాలనేవైతే వినిపించామో, వాటి అనుసారముగా చూస్తే, చాలామంది పిల్లల సేవా సమాచారము చాలా ఎక్కువగా ఉంది కానీ జమ ఖాతా తక్కువగా ఉంది.

ప్రతి ఖజానాను చెక్ చేసుకోండి - జ్ఞాన ఖజానా అనగా ఏ సంకల్పాలు మరియు కర్మలైతే చేసారో, అవి నాలెడ్జ్ ఫుల్ గా అయ్యి చేసారా? అవి సాధారణముగా అయితే లేవు కదా? యోగము అనగా సర్వ శక్తుల ఖజానా నిండుగా ఉండాలి. కనుక చెక్ చేసుకోండి - ప్రతి రోజు యొక్క దినచర్యలో ఏ సమయములో ఏ శక్తి యొక్క అవసరము ఉందో, ఆ సమయములో ఆ శక్తి ఆర్డర్ లో ఉందా? మాస్టర్ సర్వశక్తివాన్ అంటేనే యజమాని అని అర్థము. సమయము గడిచిపోయిన తరువాత ఆ శక్తి గురించి ఆలోచిస్తూ ఉండిపోవటం లేదు కదా. ఒకవేళ అవసరమైన సమయములో శక్తి ఆజ్ఞాపించినప్పుడు అది ప్రత్యక్షము కాకపోతే, ఒక్క శక్తినైనా సరే ఆజ్ఞానుసారముగా నడిపించలేకపోతే, మరి నిర్విఘ్న రాజ్యానికి అధికారులుగా ఎలా అవుతారు? మరి శక్తుల ఖజానా ఎంత జమ అయి ఉంది? అవసరమైన సమయములో కార్యములో పెట్టినప్పుడే అది జమ అవుతుంది. కావున - నా ఖాతా ఎంత ఉంది అన్నదానిని చెక్ చేసుకుంటూ వెళ్తున్నారా? ఎందుకంటే బాప్ దాదాకు పిల్లలందరి పట్ల అతి ప్రేమ ఉంది, పిల్లలందరి జమ ఖాతా నిండుగా ఉండాలి అని బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు. ధారణలో కూడా నిండుగా ఉండాలి. ధారణ ఉంది అన్నదానికి గుర్తు ఏమిటంటే - ప్రతి కర్మ గుణ సంపన్నముగా ఉంటుంది. ఏ సమయములో ఏ గుణము యొక్క అవసరము ఉంటుందో, ఆ గుణము ముఖము, నడవడికలో ఇమర్జ్ అయి కనిపించాలి. ఒకవేళ ఏ గుణములోనైనా లోటు ఉంటే, ఉదాహరణకు కర్మ చేసే సమయములో సరళతా గుణము అవసరమనుకోండి, మధురత అవసరమనుకోండి, అప్పుడు మాటలలో, కర్మలలో ఒకవేళ సరళత, మధురతకు బదులుగా కాస్త ఆవేశము వస్తే లేక అలసట కారణముగా మాటలు మధురముగా లేకపోతే, ముఖము మధురముగా లేకపోతే, సీరియస్ గా ఉంటే, అప్పుడు వారిని గుణ సంపన్నులు అని అనరు కదా! పరిస్థితులు ఎటువంటివైనా కానీ నా గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ గుణాలే ఇమర్జ్ అవ్వాలి. ప్రస్తుతము క్లుప్తముగా వినిపిస్తున్నాము.

అలాగే సేవ - సేవలో సేవాధారుల యొక్క అన్నింటికంటే మంచి లక్షణము ఏమిటంటే - స్వయము కూడా సదా తేలికగా, లైట్ గా మరియు సంతోషముగా కనిపించటము. సేవకు ఫలము సంతోషము. ఒకవేళ సేవ చేస్తున్నప్పుడు సంతోషము మాయమైపోతే సేవా ఖాతా జమ అవ్వదు. సేవ చేసారు, సమయాన్ని వెచ్చించారు, కష్టపడ్డారు అంటే అప్పుడు కొంచెము శాతములో జమ అవుతుంది, వ్యర్థముగా పోదు, కానీ ఎంత శాతములో జమ అవ్వాలో అంత జమ అవ్వదు. అలాగే సంబంధ-సంపర్కాలలో జమ అవ్వడానికి గుర్తు - ఆశీర్వాదాలు ప్రాప్తించటము. ఎవరి సంబంధ, సంపర్కములోకైతే వస్తారో వారి మనసు నుండి మీ కొరకు ఆశీర్వాదాలు వెలువడాలి - చాలా మంచివారు అని ఊరికే పైపైకి అనటం కాకుండా, మనసు నుండి వెలువడాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు వెలువడాలి. ఆశీర్వాదాలు ప్రాప్తించినట్లయితే ఆశీర్వాదాలు లభించటమనేది చాలా సహజ పురుషార్థానికి సాధనము. భాషణ చెయ్యకపోయినా కానీ, సరే, మనసా సేవ కూడా అంత శక్తిశాలిగా లేదనుకోండి, కొత్త-కొత్త ప్లాన్లు తయారుచెయ్యటం రాదనుకోండి, ఏం పర్వాలేదు, అన్నిటికంటే సహజ పురుషార్థానికి సాధనము - ఆశీర్వాదాలను తీసుకోండి, ఆశీర్వాదాలను ఇవ్వండి. ఇలా బాప్ దాదా అనేకమంది పిల్లల మనసులోని సంకల్పాలను చదువుతారు. కొంతమంది పిల్లలు సమయమనుసారముగా, పరిస్థితుల అనుసారముగా ఏమంటూ ఉంటారంటే - ఒకవేళ ఎవరైనా చెడు పని చేసారనుకోండి, అప్పుడు వారికి ఆశీర్వాదాలను ఎలా ఇవ్వాలి? వారిపైనైతే కోపము వస్తుంది కదా, వారికి ఆశీర్వాదాలను ఎలా ఇవ్వాలి? అంతేకాక క్రోధానికి పిల్లా-పాపలు కూడా చాలా ఉంటాయి. సరే, అతను చెడు పని చేసారు, అతను చెడ్డవాడు, అది చెడు పని చేసారు అని మీరు సరిగ్గానే అర్థం చేసుకున్నారు. మీరు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు, మంచిగా అర్థం చేసుకున్నారు, కానీ ఒకటేమో అర్థం చేసుకోవటము, మరొకటి వారి చెడు పనులను, చెడు విషయాలను మీ మనసులో పెట్టుకోవటము. అర్థం చేసుకోవటానికి మరియు లోపల పెట్టుకోవటానికి తేడా ఉంది. ఒకవేళ మీరు తెలివైనవారైతే, తెలివైనవారు ఎక్కడైనా చెడు విషయాలను తన వద్ద పెట్టుకుంటారా? కానీ అతను చెడ్డవారు అన్న విషయాన్ని మీ మనసులో పెట్టుకున్నారు అంటే మీరు చెడు వస్తువును మీ వద్ద పెట్టుకున్నట్లు, దానిని సంభాళించినట్లు. అర్థం చేసుకోవటము వేరే విషయము, లోపల పెట్టుకోవటము వేరే విషయము. తెలివైనవారిగా అవ్వటము మంచిదే, అవ్వండి, కానీ లోపల పెట్టుకోవద్దు. ‘వీరు ఉన్నదే ఇలా’ అని అనుకున్నారంటే అది లోపల పెట్టుకున్నట్లు. ఇలా భావిస్తూ వ్యవహారములోకి రావటము అంటే అది తెలివైన పని కాదు. బాప్ దాదా చెక్ చేసారు. ఇప్పుడు సమయము దానంతటదే సమీపముగా రాదు, మీరు తీసుకురావాలి. కొందరు ఏమని అడుగుతుంటారంటే - 10 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా, ఎంత సమయము పడుతుందో కాస్త సూచన అయితే ఇవ్వండి కదా!

బాబా పిల్లల్ని ప్రశ్నిస్తున్నారు, బాబానైతే చాలా ప్రశ్నలు అడుగుతుంటారు కదా. ఈ రోజు బాబా పిల్లలను ప్రశ్నిస్తున్నారు - సమయాన్ని సమీపముగా తీసుకువచ్చేవారు ఎవరు? డ్రామాయే, కానీ నిమిత్తులెవరు? ఎవరు ఆపినందుకు ఉదయము ఆగి ఉంది... అని మీ పాట కూడా ఒకటి ఉంది కదా. పాట ఉంది కదా? మరి ఆ ఉదయాన్ని తీసుకువచ్చేవారు ఎవరు? వినాశనకారులైతే వినాశనము చెయ్యాలి, వినాశనము చెయ్యాలి... అని తపిస్తూ ఉన్నారు కానీ నవ నిర్మాణము చేసేవారు అంతగా రెడీగా ఉన్నారా? ఒకవేళ పాతది సమాప్తమైపోయిన తరువాత నవ నిర్మాణము జరగకపోతే ఏమవుతుంది? అందుకని బాప్ దాదా ఇప్పుడు తండ్రి రూపానికి బదులుగా టీచర్ రూపాన్ని ధారణ చేసారు. హోమ్ వర్క్ఇచ్చారు కదా? హోమ్ వర్క్ ఎవరు ఇస్తారు? టీచరు. చివరిలో ఉన్నది సద్గురువు పాత్ర. కావున మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - సంపన్న మరియు సంపూర్ణ స్థితి ఎంతవరకు తయారైంది? శబ్దము నుండి అతీతమవ్వటము మరియు శబ్దములోకి రావటము, ఈ రెండూ సమానముగా ఉన్నాయా? ఏ విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు శబ్దములోకి రావటము సహజమైపోయిందో, అలాగే శబ్దము నుండి దూరమైపోవటము, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా ఉందా? క్షణములో శబ్దములోకి రావటము, క్షణములో శబ్దము నుండి అతీతమైపోవటము - అంత ప్రాక్టీస్ ఉందా? ఏ విధంగా శరీరము ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడకు కావాలంటే అక్కడకు రావటము-పోవటము చెయ్యగలరు కదా, అలాగే మనసు, బుద్ధి ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడకు కావాలంటే అక్కడకు రావటము-పోవటము చెయ్యగలరా? ఎందుకంటే అంతిమములో పాస్ మార్కులు ఎవరికి లభిస్తాయంటే ఎవరైతే క్షణములో ఏది కావాలంటే అది, ఎలా కావాలంటే అలా, ఏది ఆజ్ఞాపిస్తే అందులో సఫలురైపోవాలి. సైన్స్వారు కూడా - సహజముగా కూడా ఉండాలి మరియు తక్కువ సమయములో అయిపోవాలి అని ఇదే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. మరి అటువంటి స్థితి ఉందా? నిమిషాల వరకు వచ్చారా, క్షణాల వరకు వచ్చారా, ఎక్కడి వరకు వచ్చారు? లైట్ హౌస్ , మైట్ హౌస్ అనేది ఒక్క క్షణములో ఆన్ చెయ్యగానే దాని కాంతిని వ్యాపింపజేస్తుంది కదా, అలాగే మీరు క్షణములో లైట్ హౌస్ గా అయ్యి నలువైపులా లైట్ ను వ్యాపింపజెయ్యగలరా? ఈ స్థూల నేత్రాలు ఒక స్థానములో కూర్చునే దూరము వరకు చూడగలవు కదా, వాటి దృష్టిని వ్యాపింపజెయ్యగలవు కదా! అలాగే మీరు మూడవ నేత్రము ద్వారా ఒక స్థానములో కూర్చునే వరదాత, విధాతగా అయ్యి నలువైపులా ఉన్నవారిని మీ దృష్టితో సంతృప్తిపరచగలరా? మిమ్మల్ని మీరు అన్ని విషయాలలోనూ చెక్ చేసుకుంటున్నారా? మూడవ నేత్రము అంత శుభ్రముగా, స్పష్టముగా ఉందా? అన్ని విషయాలలోనూ ఒకవేళ కొంచెము బలహీనత ఉన్నా కానీ, దానికి కారణము ఇంతకుముందు కూడా వినిపించాము కదా, అదేమిటంటే - ‘నేను మరియు నాది’ కి సంబంధించిన హద్దులోని మోహము. నేను అన్నదాని గురించి స్పష్టముగా వినిపించాము కదా, హోమ్ వర్క్ కూడా ఇచ్చాము. రెండు ‘నేను’ అనేవాటిని సమాప్తము చేసి ఒక్క ‘నేను’ను ఉంచుకోవాలి. అందరూ ఈ హోమ్ వర్క్ ను చేసారా? ఎవరైతే ఈ హోమ్ వర్క్ లో సఫలురయ్యారో వారు చేతులెత్తండి. బాప్ దాదా అందరినీ చూసారు. ధైర్యము పెట్టండి, భయపడకండి, చేతులెత్తండి. మంచిది, అభినందనలు లభిస్తాయి. చాలా కొద్దిమంది ఉన్నారు. వీరందరి చేతులను టి.వి.లో చూపించండి. చాలా కొద్దిమంది చేతులెత్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అందరికీ తమపై తమకే నవ్వు వస్తూ ఉంది.

అచ్ఛా - రెండవ హోమ్ వర్క్- క్రోధాన్ని వదలటము, ఇదైతే సహజమే కదా! క్రోధాన్ని ఎవరు వదిలారు? ఇన్ని రోజులలో ఎప్పుడూ క్రోధము చేయలేదా? (ఇందులో చాలామంది చేతులెత్తారు). ఇందులో కొంచెం ఎక్కువమందే ఉన్నారు. ఎవరైతే క్రోధము చేయలేదో, ఈ విషయములో మీ చుట్టుపక్కల ఉన్నవారిని కూడా అడుగుతాము. ఎవరైతే చేతులెత్తారో వారు లేచి నిలబడండి. అచ్ఛా, చాలామంది ఉన్నారు. క్రోధము చేయలేదా? సంకల్పములోనైనా, మనసులోనైనా క్రోధము వచ్చిందా? సరే, అయినా కూడా అభినందనలు, ఒకవేళ మనసులో క్రోధము వచ్చినా కూడా నోటి ద్వారా కోపగించుకోలేదంటే అందుకు కూడా అభినందనలు. చాలా మంచిది.

రిజల్టు లెక్కలో మీరే చూడండి - స్థాపనా కార్యము అనగా స్వయాన్ని సంపన్నముగా చేసుకోవటము మరియు సర్వాత్మలకు ముక్తి వారసత్వాన్ని ఇప్పించటము, ఇది సంపన్నమైందా? స్వయాన్ని జీవన్ముక్తి స్వరూపముగా తయారుచేసుకోవటము మరియు సర్వాత్మలకు ముక్తి వారసత్వాన్ని ఇప్పించటము - ఇదే స్థాపనా కర్తలైన ఆత్మల శ్రేష్ఠ కర్మ. అందుకనే బాప్ దాదా అడుగుతున్నారు - సర్వ బంధనాల నుండి ముక్తులై, జీవన్ముక్తి స్థితికి సంగమములోనే చేరుకోవాలా లేక సత్యయుగములో చేరుకోవాలా? సంగమయుగములో సంపన్నముగా అవ్వాలా లేక అక్కడ కూడా రాజయోగాన్ని చేసి నేర్చుకోవాలా? సంపన్నముగా అయితే ఇక్కడే అవ్వాలి కదా? సంపూర్ణముగా కూడా ఇక్కడే అవ్వాలి. సంగమయుగ సమయము కూడా అన్నింటికంటే అత్యంత పెద్ద ఖజానా. మరి ఎవరు ఆపినందుకు ఉదయము ఆగి ఉంది? చెప్పండి.

బాప్ దాదా ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే బాబా ఆశల దీపాలు పిల్లలే కదా. కనుక మీ ఖాతాను బాగా చెక్ చేసుకోండి. కొంతమంది పిల్లలను చూసారు, మజారామ్ వలె ఉన్నారు, మజాలో నడుస్తున్నారు. ఏది జరిగితే అదే మంచిది అని అనుకుంటున్నారు. ఇప్పుడైతే బాగా ఆనందించండి, సత్యయుగములో ఎవరు చూస్తారు, ఎవరికి తెలుస్తుంది! అని అనుకుంటున్నారు. కనుక జమ ఖాతాలో ఇటువంటి మజాలాల్ అనండి, మజారామ్ అనండి, ఇటువంటి పిల్లలను కూడా చూసారు. సరే ఆనందించండి. వారు ఇతరులకు కూడా చెప్తూ ఉంటారు - అరే, ఏం చేసేది ఉంది, ఆనందించండి, తినండి, త్రాగండి, ఆనందాన్ని అనుభవించండి. ఆనందించండి. అప్పుడు బాబా కూడా అంటారు - సరే, ఆనందించండి. ఒకవేళ కొంచెములోనే సంతోషపడిపోయేవారైతే కొంచెముకే సంతోషపడిపోండి. వినాశీ సాధనాల ఆనందము అల్పకాలికముగా ఉంటుంది. సదాకాలము యొక్క ఆనందాన్ని వదిలి ఒకవేళ అల్పకాలికమైన సాధనాల ఆనందములో ఉండాలనుకుంటే ఇక బాప్ దాదా ఏమంటారు? సూచనను ఇస్తారు, ఇంకేమి చేస్తారు? ఎవరైనా వజ్రాల గని వద్దకు వెళ్ళి రెండు వజ్రాలను తీసుకుని వాటికే సంతోషపడిపోతే ఇక అటువంటివారిని ఏమంటారు? అటువంటివారిగా అవ్వకండి. అతీంద్రియ సుఖము యొక్క ఆనందాల ఊయలలో ఊగండి. అవినాశీ ప్రాప్తుల ఊయల అనే ఆనందములో ఊగండి. డ్రామాలో చూడండి, మాయ పాత్ర కూడా విచిత్రమైనది. ఈ సమయములోనే ఎలాంటి, ఎలాంటి సాధనాలు వెలువడ్డాయంటే, అవి ఇంతకుముందు అసలు లేనే లేవు. కానీ సాధనాలు లేకుండా కూడా ఎవరైతే సాధన చేసారో, సేవ చేసారో, ఆ ఉదాహరణమూర్తులు కూడా ఎదురుగా ఉన్నారు కదా! ఈ సాధనాలు ఇంతకుముందు ఉండేవా? కానీ సేవ ఎంతగా జరిగింది? క్వాలిటీవారైతే వెలువడ్డారు కదా! ఆది రత్నాలైతే తయారయ్యారు కదా! ఇది సాధనాల ఆకర్షణ. సాధనాలను ఉపయోగించటము తప్పు అని అనటం లేదు కానీ సాధనను మర్చిపోయి సాధనాలలో మునిగిపోవటము, దీనిని బాప్ దాదా తప్పు అంటారు. సాధనాలు జీవితములో ఎగిరే కళకు సాధనము కాదు, అవి ఆధారము కాదు. సాధనే ఆధారము. ఒకవేళ సాధనకు బదులుగా సాధనాలను ఆధారముగా చేసుకుంటే రిజల్టు ఎలా ఉంటుంది? సాధనాలు వినాశీ అయినవి, రిజల్టు ఏముంటుంది? సాధన అవినాశీ అయినది, దాని రిజల్టు ఏముంటుంది? అచ్ఛా!

నలువైపులా ఉన్న పిల్లల యొక్క పురుషార్థము మరియు ప్రేమకు సంబంధించిన సమాచార ఉత్తరాలు బాప్ దాదాకు అందాయి. బాప్ దాదా పిల్లల ఉల్లాస-ఉత్సాహాలను చూసి, ఇది చేస్తాము, అది చేస్తాము... అనే సమాచారము విని సంతోషిస్తున్నారు. ఇప్పుడు కేవలం ఏదైతే ధైర్యము పెట్టారో, ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయో, వాటిపై పదే-పదే అటెన్షన్ పెట్టి ప్రాక్టికల్ లోకి తీసుకురండి. పిల్లలందరికీ ఇవే బాప్ దాదా నుండి మనస్ఫూర్వకమైన ఆశీర్వాదాలు. సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో, సంబంధ-సంపర్కములలో సంపన్నముగా అయ్యే నలువైపులా ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్వదర్శనాన్ని చేసుకునే స్వదర్శన చక్రధారీ పిల్లలకు, సదా దృఢ సంకల్పము ద్వారా మాయాజీతులుగా అయ్యి బాబా ముందు స్వయాన్ని ప్రత్యక్షము చేసుకునేవారికి మరియు విశ్వము ముందు బాబాను ప్రత్యక్షము చేసే పిల్లలకు, సర్వీసబుల్, నాలెడ్జ్ ఫుల్, సక్సెస్ ఫుల్ పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు మనస్ఫూర్వకమైన పదమాల, పదమాల రెట్ల ఆశీర్వాదాలు మరియు నమస్తే, నమస్తే.

వరదానము:-
సత్యమైన, స్వచ్ఛమైన హృదయము ఆధారముగా నంబరువన్ ను తీసుకునే హృదయాభిరామునికి ఇష్టమైనవారిగా కండి

హృదయాభిరాముడైన తండ్రికి సత్యమైన హృదయము కల పిల్లలంటేనే ఇష్టము. ప్రాపంచిక వివేకము లేకపోయినా కానీ సత్యమైన, స్వచ్ఛమైన హృదయము ఉండాలి, అప్పుడు నంబరువన్ తీసుకుంటారు ఎందుకంటే బాబా ఎంత గొప్ప వివేకాన్ని ఇస్తారంటే, రచయితను తెలుసుకోవడం ద్వారా రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని తెలుసుకుంటారు. కావున సత్యమైన, స్వచ్ఛమైన హృదయము ఆధారముగానే నంబరు తయారవుతుంది, అంతేకానీ సేవ ఆధారముగా కాదు. సత్యమైన హృదయముతో చేసే సేవ యొక్క ప్రభావము హృదయము వరకు చేరుకుంటుంది. వివేకవంతులు పేరు సంపాదిస్తారు మరియు హృదయము కలవారు ఆశీర్వాదాలను సంపాదిస్తారు.

స్లోగన్:-
సర్వుల పట్ల శుభ చింతన మరియు శుభ కామనను ఉంచడమే సత్యమైన పరోపకారము.

అవ్యక్త సూచనలు - సహజయోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి

ఏ పిల్లలైతే పరమాత్మ ప్రేమలో సదా లవలీనులై, మైమరచిపోయి ఉంటారో, వారి నషా మరియు మెరుపు, అనుభూతి కిరణాలు ఎంత శక్తిశాలిగా ఉంటాయంటే ఏ సమస్య కూడా సమీపముగా రావటము కాదు కదా, కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. వారికి ఎప్పుడూ ఏ రకమైన కష్టము కలుగదు.