04-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అల్ఫ్ (భగవంతుడు) మరియు బే (రాజ్యాధికార వారసత్వము) ను స్మృతి చేసినట్లయితే రమణీకముగా తయారవుతారు, తండ్రి రమణీకమైనవారు కనుక వారి పిల్లలు కూడా రమణీకముగా ఉండాలి’’

ప్రశ్న:-
దేవతల చిత్రాల పట్ల అందరికీ ఎందుకు ఆకర్షణ కలుగుతుంది? వారిలో ఏ విశేషమైన గుణముంది?

జవాబు:-
దేవతలు చాలా రమణీకమైనవారు మరియు పవిత్రమైనవారు. రమణీకత కారణముగా వారి చిత్రాల పట్ల కూడా ఆకర్షణ కలుగుతుంది. దేవతలలో పవిత్రత యొక్క విశేష గుణముంది, ఆ గుణము కారణముగానే అపవిత్రమైన మనుష్యులు వారి ఎదురుగా తల వంచుతూ ఉంటారు. ఎవరిలోనైతే సర్వ దైవీ గుణాలు ఉంటాయో, ఎవరైతే సదా సంతోషముగా ఉంటారో, వారే రమణీకముగా ఉంటారు.

ఓంశాంతి
ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా ఎంత అద్భుతమైనది. ఇటువంటి అనంతమైన తండ్రికి మీరందరూ పిల్లలు కావున పిల్లలు కూడా ఎంత రమణీకముగా ఉండాలి. దేవతలు కూడా రమణీకమైనవారు కదా. కానీ రాజధాని చాలా పెద్దది. అందరూ ఒకేలా రమణీకముగా ఉండలేరు. అయినా కానీ కొందరు పిల్లలు తప్పకుండా చాలా రమణీకముగా ఉన్నారు. రమణీకముగా ఎవరు ఉంటారు? ఎవరైతే సదా సంతోషముగా ఉంటారో, ఎవరిలోనైతే దైవీ గుణాలు ఉంటాయో, వారు రమణీకముగా ఉంటారు. ఈ రాధ-కృష్ణులు మొదలైనవారు రమణీకమైనవారు కదా. వారిలో చాలా-చాలా ఆకర్షణ ఉంది. ఏ ఆకర్షణ ఉంది? పవిత్రత యొక్క ఆకర్షణ, ఎందుకంటే వీరి ఆత్మ కూడా పవిత్రమైనది మరియు శరీరము కూడా పవిత్రమైనది. కావున పవిత్ర ఆత్మలు అపవిత్ర ఆత్మలను ఆకర్షిస్తారు. వారి చరణాలకు నమస్కరిస్తారు. వారిలో ఎంత శక్తి ఉంటుంది. సన్యాసులైనా సరే, దేవతల ఎదురుగా తప్పకుండా తల వంచుతారు. కొందరు చాలా అహంకారముతో ఉంటారు, అయినా కానీ దేవతల ఎదురుగా లేదా శివుని ఎదురుగా తప్పకుండా తల వంచుతారు. దేవీల చిత్రాల ఎదురుగా కూడా తల వంచుతారు ఎందుకంటే తండ్రి కూడా రమణీకమైనవారు కావున తండ్రి తయారుచేసిన దేవీ-దేవతలు కూడా రమణీకమైనవారు. వారిలో పవిత్రత యొక్క ఆకర్షణ ఉంది. వారి ఆ ఆకర్షణ ఇప్పటికీ కొనసాగుతుంది. ఎవరైతే - మేము ఈ లక్ష్మీ-నారాయణుల వలె అవుతామని అనుకుంటున్నారో, మరి వీరిలో ఎంతైతే ఆకర్షణ ఉందో, అంత ఆకర్షణ మీలో కూడా ఉండాలి. ఈ సమయములోని మీ ఆకర్షణ ఇక అవినాశీగా అయిపోతుంది. అందరి విషయములో ఇలా జరగదు. నంబరువారుగా అయితే ఉన్నారు కదా. భవిష్యత్తులో ఎవరైతే ఉన్నత పదవిని పొందేవారు ఉంటారో, వారిలో ఇక్కడి నుండే ఆకర్షణ ఉంటుంది ఎందుకంటే ఆత్మ పవిత్రముగా అయిపోతుంది. మీలో ఎవరైతే ప్రత్యేకముగా స్మృతియాత్రలో ఉంటారో, వారిలో ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. యాత్రలో పవిత్రత తప్పకుండా ఉంటుంది. పవిత్రతలోనే ఆకర్షణ ఉంటుంది. పవిత్రత యొక్క ఆకర్షణ అనేది, చదువు పట్ల కూడా ఆకర్షణను కలిగిస్తుంది. ఈ విషయము మీకు ఇప్పుడే తెలిసింది. మీకు వారి (లక్ష్మీ-నారాయణుల) కర్తవ్యము గురించి తెలుసు. వారు కూడా తండ్రిని ఎంతగా స్మృతి చేసి ఉంటారు. వారు అంతటి రాజ్యాన్ని ఏదైతే పొందారో, అది తప్పకుండా రాజయోగము ద్వారానే పొంది ఉంటారు. ఈ సమయములో మీరు ఆ పదవిని పొందడానికి వచ్చారు. తండ్రి కూర్చుని మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ నిశ్చయాన్ని పక్కా చేసుకుని ఇక్కడకు వచ్చారు కదా. తండ్రి కూడా వారే, చదివించేవారు కూడా వారే, తమతో పాటు తీసుకువెళ్ళేవారు కూడా వారే. కావున ఈ గుణాలు సదా ఉండాలి. సదా హర్షితముఖులుగా ఉండండి. అల్ఫ్ (భగవంతుడు) అయిన తండ్రి స్మృతిలో ఉన్నప్పుడే సదా హర్షితముగా ఉంటారు. అప్పుడు బే అనగా రాజ్యాధికార వారసత్వము కూడా స్మృతిలో ఉంటుంది, మరియు దీని ద్వారా చాలా రమణీకముగా కూడా అవుతారు. మనము ఇక్కడ రమణీకముగా అయ్యి మళ్ళీ భవిష్యత్తులో ఇలా రమణీకముగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడి చదువే అమరపురిలోకి తీసుకువెళ్తుంది. ఈ సత్యమైన బాబా మీకు సత్యమైన సంపాదనను చేయిస్తున్నారు. ఈ సత్యమైన సంపాదనయే 21 జన్మలు మీతోపాటు వస్తుంది. ఆ తర్వాత భక్తి మార్గములో ఏదైతే సంపాదన చేసుకుంటారో, అది అల్పకాలికమైన సుఖము కోసమే. అదేమీ సదా మీతో పాటు ఉండదు. కావున ఈ చదువులో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సాధారణమైనవారు. మిమ్మల్ని చదివించేవారు కూడా పూర్తిగా సాధారణ రూపములో ఉన్నారు కావున చదువుకునేవారు కూడా సాధారణముగానే ఉంటారు, లేకపోతే సిగ్గుగా అనిపిస్తుంది. మనము ఉన్నతమైన వస్త్రాలను ఎలా ధరించగలము, మన మమ్మా-బాబా ఎంత సాధారణముగా ఉన్నారు, కావున మనము కూడా సాధారణముగా ఉంటాము. వీరెందుకు సాధారణముగా ఉంటారు? ఎందుకంటే వనవాహములో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు వెళ్ళాలి, ఇక్కడేమీ వివాహము చేసుకునేది లేదు. అక్కడ వారు వివాహము చేసుకున్నప్పుడు కుమారీ వనవాహములో ఉంటుంది. మురికి బట్టలను ధరిస్తుంది, నూనె పెట్టుకుంటుంది, ఎందుకంటే అత్తవారింటికి వెళ్తుంది. బ్రాహ్మణుడి ద్వారా నిశ్చితార్థము జరుగుతుంది. మీరు కూడా అత్తవారింటికి వెళ్ళాలి. రావణపురి నుండి రామపురిలోకి అనగా విష్ణుపురిలోకి వెళ్ళాలి. ఎటువంటి అభిమానము, దేహానికి సంబంధించినదైనా లేదా వస్త్రాలు మొదలైనవాటిని సంబంధించినదైనా సరే, ఎటువంటి అభిమానము కలగకూడదు అని ఈ వనవాహ పద్ధతిని పెట్టారు. ఎవరి వద్దనైనా సాధారణమైన చీర ఉంటే, వారు ఇతరుల వద్ద ఖరీదైన చీర ఉండటాన్ని చూస్తే, ఆలోచన నడుస్తుంది. ఈమె వనవాహములో లేరే అని అనుకుంటారు. కానీ మీరు వనవాహములో ఇలా సాధారణముగా ఉంటూ కూడా ఎవరికైనా ఇంత ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే, అంతటి నషా కలిగి ఉన్నట్లయితే వారికి కూడా బాణము తగులుతుంది. పాత్రలు తోముతూ ఉన్నా లేదా బట్టలు ఉతుకుతూ ఉన్నా, మీ ముందుకు ఎవరైనా వస్తే వారికి వెంటనే భగవంతుడి యొక్క స్మృతిని కలిగించండి. మీకు ఆ నషా ఎక్కి ఉండాలి. అంతేకాక సాధారణ వస్త్రాలను ధరించి ఎవరికైనా జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే, వీరిలో ఎంత ఉన్నతమైన జ్ఞానముంది అని వారు కూడా ఆశ్చర్యపోతారు! ఇది గీతా జ్ఞానము మరియు భగవంతుడు ఇచ్చిన జ్ఞానము. రాజయోగము అంటే గీతా జ్ఞానమే. మరి ఈ విధముగా నషా కలుగుతుందా? బాబా తమ ఉదాహరణను చెప్తున్నారు. నేను పిల్లలతో ఏదైనా ఆట ఆడుతున్నప్పుడు, ఎవరైనా జిజ్ఞాసువు ఎదురుగా వచ్చినట్లయితే, వారికి వెంటనే తండ్రి పరిచయాన్ని ఇస్తాను. యోగశక్తి, యోగబలము ఉన్న కారణముగా, ఆ వ్యక్తి కూడా అక్కడే నిలబడిపోయి, వీరు ఇంత సాధారణముగా ఉన్నారు కానీ వీరిలో ఎంతటి శక్తి ఉంది అని ఆశ్చర్యపోతారు! అప్పుడిక ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేకపోతారు. నోటి నుండి ఏ మాట రాదు. ఎలాగైతే మీరు వాణి నుండి అతీతముగా ఉన్నారో, అలా అతను కూడా వాణి నుండి అతీతముగా అయిపోతారు. ఈ నషా లోలోపల ఉండాలి. ఎవరైనా సోదరి లేదా సోదరుడు వస్తే, వారిని అలా నిలబెట్టి, విశ్వానికి యజమానులుగా తయారుచేసే మతాన్ని ఇవ్వవచ్చు. లోలోపల అంతటి నషా ఉండాలి. మీ తపనతో నిలబడిపోవాలి. మీ వద్ద జ్ఞానమైతే ఉంది కానీ యోగము యొక్క పదును లేదు అని బాబా సదా అంటూ ఉంటారు. పవిత్రత మరియు స్మృతిలో ఉన్నట్లయితేనే పదును వస్తుంది. స్మృతియాత్ర ద్వారా మీరు పవిత్రముగా అవుతారు, శక్తి లభిస్తుంది. జ్ఞానము అనేది ధనము వంటిది. ఉదాహరణకు స్కూల్లో చదువుకుని ఎమ్.ఎ., బి.ఎ. మొదలైనవి చేస్తే, వారికి దానికి తగినంత ధనము లభిస్తుంది. కానీ ఇక్కడి విషయము వేరు. భారత్ యొక్క ప్రాచీన యోగమైతే ప్రసిద్ధమైనది. ఇది స్మృతి. తండ్రి సర్వశక్తివంతుడు కావున పిల్లలకు తండ్రి నుండి శక్తి లభిస్తుంది. పిల్లలకు లోలోపల ఏమని ఉండాలంటే - ఆత్మలమైన మేము బాబా సంతానము, కానీ మేము బాబా అంత పవిత్రముగా లేము, ఇప్పుడు అలా తయారవ్వాలి. ఇప్పుడిదే లక్ష్యము-ఉద్దేశ్యము. యోగము ద్వారానే మీరు పవిత్రముగా అవుతారు. అనన్యులైన పిల్లలెవరైతే ఉన్నారో, వారు రోజంతా ఇవే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎవరైనా వస్తే, మేము వీరికి మార్గాన్ని చూపించాలి, పాపం వీరు అంధులుగా ఉన్నారు అని వారి పట్ల దయ కలగాలి. అంధులకు చేతికర్రను అందించి తీసుకువెళ్తారు కదా. వారంతా అంధులే, జ్ఞాన నేత్రము లేదు.

ఇప్పుడు మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది కావున అంతా తెలుసుకున్నారు. మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాలను మనము ఇప్పుడు తెలుసుకున్నాము. ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. హియర్ నో ఈవిల్, సీ నో ఈవిల్ (చెడు వినకండి, చెడు చూడకండి)... ఈ చిత్రము ఎందుకు తయారుచేయబడింది అనేది మీకు ఇంతకుముందేమైనా తెలుసా? ప్రపంచములోనివారికెవ్వరికీ దీని అర్థం తెలియదు, మీకు ఇప్పుడు తెలుసు. ఎలాగైతే తండ్రి నాలెడ్జ్ ఫుల్ గా ఉన్నారో, అలా వారి పిల్లలైన మీరు కూడా ఇప్పుడు నంబరువారు పురుషార్థమనుసారముగా నాలెడ్జ్ ఫుల్ గా అవుతున్నారు. కొంతమందికైతే చాలా నషా ఎక్కుతుంది. వాహ్! బాబాకు బిడ్డగా అయి బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోలేదంటే, వారికి బిడ్డగా అయి ఏమి చేసినట్లు! రోజూ రాత్రి తమ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. బాబా వ్యాపారి కదా. వ్యాపారస్థులకు లెక్కల ఖాతాను చూసుకోవడము సహజమనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు లెక్కల ఖాతాను చూసుకోవడము రాదు, వారు వ్యాపారస్థులు కూడా కారు. వ్యాపారస్థులు బాగా అర్థం చేసుకుంటారు. మీరు వ్యాపారస్థులు. మీరు మీ లాభ-నష్టాలను అర్థం చేసుకుంటారు, రోజూ ఖాతాను చూసుకోండి. లెక్కలను సంభాళించండి. నష్టముందా లేక లాభముందా? మీరు వ్యాపారస్థులు కదా. బాబా వ్యాపారస్థుడు, రత్నాకరుడు అన్న గాయనముంది కదా. వారు అవినాశీ జ్ఞాన రత్నాల వ్యాపారాన్ని ఇస్తారు. ఇది కూడా మీకు నంబరువారు పురుషార్థమనుసారముగా తెలుసు. అందరూ చురుకైన బుద్ధి కలవారేమీ కాదు, ఒక చెవితో వింటారు, మరొక చెవి నుండి బయటకు వెళ్ళిపోతుంది. జోలిలో ఉన్న రంధ్రము నుండి బయటకు వెళ్ళిపోతుంది. జోలి నిండదు. తండ్రి అంటారు, ధనము ఎంత దానము చేసినా తరగదు. ఇవి అవినాశీ జ్ఞాన రత్నాలు కదా. తండ్రి రూప్-బసంత్. వారు కూడా ఆత్మనే, వారిలో జ్ఞానముంది. వారి పిల్లలైన మీరు కూడా రూప్-బసంత్ లు (యోగస్వరూపులు మరియు జ్ఞానస్వరూపులు). ఆత్మలో జ్ఞానము నింపబడుతుంది. ఆత్మకు రూపముంది. ఆత్మ చిన్నదే కానీ రూపమైతే ఉంది కదా. ఆత్మను తెలుసుకోవడము జరుగుతుంది, పరమాత్మను కూడా తెలుసుకోవడము జరుగుతుంది. సోమనాథునికి భక్తి చేస్తారు, అప్పుడు ఇంత చిన్నని నక్షత్రానికి ఎలా పూజ చేస్తారు. పూజ కోసమని ఎన్ని లింగాలను తయారుచేస్తారు. శివలింగాలను ఇంటి పైకప్పంత పెద్దవిగా కూడా తయారుచేస్తూ ఉంటారు. వాస్తవానికి చిన్న రూపమే కానీ వారి హోదా ఉన్నతమైనది కదా.

ఈ జప-తపాదులు మొదలైనవాటి ద్వారా ఏ ప్రాప్తి ఉండదని తండ్రి కల్పక్రితం కూడా చెప్పారు. ఇవన్నీ చేస్తూ కిందకే పడిపోతూ ఉంటారు. మెట్లు కిందకే దిగుతారు. మీది ఇప్పుడు ఎక్కే కళ. బ్రాహ్మణులైన మీరు మొదటి నంబరు జిన్ను భూతము వంటివారు. కథ ఉంది కదా - నాకు పని ఇవ్వకపోతే నేను తినేస్తాను అని జిన్ను అంటుంది. అప్పుడు దానికి మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఉండమని పని ఇవ్వడము జరిగింది. కావున దానికి ఇక పని దొరికింది. ఈ అనంతమైన మెట్లను మీరు దిగుతారు, మళ్ళీ ఎక్కుతారని బాబా కూడా అన్నారు. మీరే మెట్లన్నీ దిగుతారు, మళ్ళీ ఎక్కుతారు. జిన్ను భూతము మీరే. ఇతరులెవ్వరూ పూర్తి మెట్ల వరుస ఎక్కరు. పూర్తి మెట్ల వరుస యొక్క జ్ఞానాన్ని పొందడము ద్వారా మీరు ఎంత ఉన్నత పదవిని పొందుతారు. మళ్ళీ దిగుతారు, ఎక్కుతారు. తండ్రి అంటారు - నేను మీ తండ్రిని, మీరు నన్ను పతిత-పావనుడని అంటారు కదా, నేను సర్వశక్తివంతుడిని, ఆల్మైటీని ఎందుకంటే నా ఆత్మ సదా 100 శాతం పవిత్రముగా ఉంటుంది. నేను బిందురూపుడను, అథారిటీని. నాకు శాస్త్రాలన్నింటి రహస్యము తెలుసు. ఇది ఎంత అద్భుతము. ఇదంతా అద్భుతమైన జ్ఞానము. ఆత్మలో 84 జన్మల అవినాశీ పాత్ర ఉందని ఎప్పుడూ విని ఉండరు. అది ఎప్పుడూ అరిగిపోదు. అది నడుస్తూనే ఉంటుంది. 84 జన్మల చక్రము తిరుగుతూ ఉంటుంది. ఆత్మలో 84 జన్మల రికార్డు నిండి ఉంది. ఇంత చిన్నని ఆత్మలో ఇంత జ్ఞానముంది. ఈ జ్ఞానము బాబాలో కూడా ఉంది మరియు పిల్లలైన మీలో కూడా ఉంది. ఎంత పాత్రను అభినయిస్తారు. ఈ పాత్ర ఎప్పటికీ అంతమవ్వదు. ఆత్మను ఈ కళ్ళ ద్వారా చూడలేము. అది ఒక బిందువు, నేను కూడా అటువంటి బిందువునేనని బాబా కూడా అంటారు. ఇది కూడా పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. మీరు అనంతమైన త్యాగులు మరియు రాజఋషులు. మీకు ఎంత నషా ఎక్కాలి. రాజఋషులు పూర్తిగా పవిత్రముగా ఉంటారు. రాజఋషులు అనగా సూర్యవంశీయులు, చంద్రవంశీయులు. మీలానే వారు కూడా రాజ్యాన్ని ఇక్కడే పొందుతారు. మేము వెళ్తున్నాము, నావికుడి స్టీమరులో కూర్చున్నాము అని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇది పురుషోత్తమ సంగమయుగమని కూడా మీకు తెలుసు. తప్పకుండా పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి, వయా శాంతిధామము వెళ్ళాలి. ఇది సదా పిల్లల బుద్ధిలో ఉండాలి. మనము సత్యయుగములో ఉన్నప్పుడు వేరే ఖండమేదీ ఉండేది కాదు. మన రాజ్యమే ఉండేది. ఇప్పుడు మళ్ళీ యోగబలముతో మన రాజ్యాన్ని తీసుకుంటున్నాము ఎందుకంటే యోగబలముతోనే విశ్వరాజ్యాన్ని పొందగలమని అర్థం చేయించడము జరిగింది. బాహుబలముతో ఎవరూ పొందలేరు. ఇది అనంతమైన డ్రామా. ఈ ఆట తయారై ఉంది. ఈ ఆటను గురించిన వివరణ బాబానే ఇస్తారు. ప్రారంభము నుండి మొదలుకుని మొత్తం ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాలను వినిపిస్తారు. మీకు సూక్ష్మవతనము, మూలవతనము యొక్క రహస్యాలు కూడా మంచి రీతిలో తెలుసు. స్థూలవతనములో వీరి రాజ్యముండేది అనగా మన రాజ్యముండేది. మీరు మెట్లు ఎలా దిగుతారు అనేది కూడా గుర్తుకువచ్చింది. మెట్లు ఎక్కడము మరియు దిగడమనే ఆట పిల్లల బుద్ధిలో కూర్చుంది. ఈ ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది ఇప్పుడు బుద్ధిలో ఉంది, ఇందులో మనది హీరో-హీరోయిన్ల పాత్ర. మనమే ఓడిపోతాము, మళ్ళీ మనమే గెలుపొందుతాము, కావుననే హీరో-హీరోయిన్ అన్న పేర్లు పెట్టడము జరిగింది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడు మనము వనవాహములో ఉన్నాము - అందుకే చాలా-చాలా సాధారణముగా ఉండాలి. ఏ రకమైన అభిమానము, దేహానికి సంబంధించినదైనా లేక వస్త్రాలు మొదలైనవాటి సంబంధించినదైనా ఉండకూడదు. ఏ కర్మ చేస్తున్నా సరే తండ్రి స్మృతి యొక్క నషా ఎక్కి ఉండాలి.

2. మేము అనంతమైన త్యాగులము మరియు రాజఋషులము - ఈ నషాలోనే ఉంటూ పవిత్రముగా అవ్వాలి. జ్ఞాన ధనముతో నిండుగా అయి దానము చేయాలి. సత్యాతి-సత్యమైన వ్యాపారులుగా అయి తమ లెక్కాపత్రాన్ని పెట్టుకోవాలి.

వరదానము:-
స్వయాన్ని సేవాధారిగా భావిస్తూ, వంగుతూ మరియు అందరినీ వంగేలా చేసే నిమిత్త మరియు నమ్రచిత్త భవ

ఎవరైతే తమ ప్రతి సంకల్పాన్ని మరియు ప్రతి కర్మను తండ్రి ముందు అర్పణ చేస్తారో, వారిని నిమిత్తులని అంటారు. నిమిత్తముగా అవ్వడమంటే అర్పణ అవ్వడము మరియు నమ్రచిత్తులు ఎవరంటే వంగేవారు. ఎంతగా సంస్కారాలలో, సంకల్పాలలో వంగుతారో, అంతగా విశ్వము మీ ముందు వంగుతుంది. వంగడము అనగా వంగేలా చేయడము. ఇతరులు కూడా నా ముందు ఎంతోకొంత వంగాలి కదా అనే సంకల్పము కూడా ఉండకూడదు. ఎవరైతే సత్యమైన సేవాధారులో, వారు సదా వంగుతారు, వారు ఎప్పుడూ తమ అధికార దర్పాన్ని చూపించరు.

స్లోగన్:-
ఇప్పుడు సమస్యా స్వరూపులుగా కాదు, సమాధాన స్వరూపులుగా అవ్వండి.

అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’

మహానాత్మలైన మీ మనసులోని ప్రతి సంకల్పము ప్రతి ఆత్మ పట్ల మధురముగా ఉండాలి, మహాన్ గా ఉండాలి. ఏ విధముగా తండ్రి స్వభావము సదా ప్రతి ఆత్మ పట్ల కళ్యాణకారిగా మరియు దయా భావన కలదిగా ఉంటుందో, ప్రతి ఒక్కరినీ ఉన్నతిలోకి తీసుకువెళ్ళే విధముగా, మధురత మరియు నిర్మానతతో కూడినదిగా ఉంటుందో, అలా మీ స్వభావాన్ని కూడా తయారుచేసుకోండి. ఒకవేళ కఠినముగా, ఆవేశముగా మాట్లాడే స్వభావము ఉన్నట్లయితే అది కూడా బ్రాహ్మణ జీవితములో చాలా పెద్ద విఘ్నము. ఇప్పుడు అటువంటి స్వభావాన్ని పరివర్తన చేసుకోండి.