04-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు పారలౌకిక తండ్రిని యథార్థ రీతిలో తెలుసుకున్నారు, అందుకే మిమ్మల్ని మాత్రమే సత్యమైన ప్రీతి బుద్ధి కలవారని లేక ఆస్తికులని అంటారు’’

ప్రశ్న:-
తండ్రి భక్తుల రక్షకుడని వారి ఏ కర్తవ్యముతో ఋజువవుతుంది?

జవాబు:-
భక్తులందరినీ రావణుడి జైలు నుండి విడిపించడము, నిరుపేదల నుండి సంపన్నులుగా తయారుచేయడము, ఈ కర్తవ్యము ఒక్క తండ్రిది మాత్రమే. పాత భక్తులు ఎవరైతే ఉన్నారో, వారిని బ్రాహ్మణులుగా చేసి దేవతలుగా తయారుచేయడము - ఇదే వారు ఇచ్చే రక్షణ. తన భక్తులందరికీ ముక్తి-జీవన్ముక్తులను ఇవ్వడానికి భక్తుల రక్షకుడు వచ్చారు.

పాట:-
భోళానాథుడి కన్నా అతీతమైనవారు లేరు...

ఓంశాంతి
పిల్లలు ఎవరి మహిమను విన్నారు? భగవంతుడు ఉన్నతోన్నతమైనవారని అంటూ ఉంటారు మరియు భగవంతుడినే తండ్రి అని అంటారు. వారే ఈ రచన అంతటికీ రచయిత. ఉదాహరణకు లౌకిక తండ్రి కూడా తన రచనకు రచయిత అవుతారు. ముందుగా కన్యను తన పత్నిగా చేసుకుంటారు, ఆ తర్వాత ఆమె ద్వారా రచనను రచిస్తారు. 5-7 మంది పిల్లలకు జన్మనిస్తారు, వారిని రచన అని అంటారు. తండ్రి రచయిత. అతను హద్దు రచయిత. రచనకు రచయిత అయిన తండ్రి నుండి వారసత్వము లభిస్తుందని కూడా పిల్లలకు తెలుసు. మనుష్యులకు ఇద్దరు తండ్రులైతే తప్పకుండా ఉంటారు. ఒకరు లౌకిక తండ్రి, మరొకరు పారలౌకిక తండ్రి. జ్ఞానము మరియు భక్తి వేర్వేరని, వాటి తర్వాత వైరాగ్యమని పిల్లలకు అర్థం చేయించారు. ఈ సమయములో పిల్లలైన మీరు సంగమములో కూర్చున్నారు, మిగిలినవారంతా కలియుగములో కూర్చున్నారు. వాస్తవానికి అందరూ పిల్లలే, కానీ మీరు అనంతమైన తండ్రిని తెలుసుకున్నారు, వారు రచన అంతటికీ రచయిత. లౌకిక తండ్రి ఉన్నా కానీ, ఆ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. సత్యయుగములో లౌకిక తండ్రి ఉంటారు, పారలౌకిక తండ్రిని ఎవరూ స్మృతి చేయరు ఎందుకంటే అది ఉన్నదే సుఖధామము. ఆ పారలౌకిక తండ్రిని దుఃఖములో స్మృతి చేస్తారు. ఇక్కడ చదివించడము జరుగుతుంది, మనుష్యులను తెలివైనవారిగా చేయడము జరుగుతుంది. భక్తి మార్గములో మనుష్యులకు తండ్రి గురించి కూడా తెలియదు. పరమపిత పరమాత్మ, ఓ గాడ్ ఫాదర్, ఓ దుఃఖహర్త-సుఖకర్త అని అంటారు కూడా. మళ్ళీ సర్వవ్యాపి అని అనేస్తారు. రాళ్ళల్లో, కణ-కణములో, కుక్క-పిల్లి అన్నింటిలోనూ ఉన్నారని అనేస్తారు. తండ్రి అయిన పరమాత్మను నిందించడము మొదలుపెడతారు.

మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు కనుక మీరు ఆస్తికులుగా అయ్యారు. మీకు తండ్రి పట్ల ప్రీతి బుద్ధి ఉంది. మిగిలినవారందరికీ తండ్రి పట్ల విపరీత బుద్ధి ఉంది. మహాభారీ యుద్ధము కూడా ఎదురుగా నిలబడి ఉందని ఇప్పుడు మీకు తెలుసు. పాత ప్రపంచ వినాశనార్థం, ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత కలియుగీ పతిత ప్రపంచము పూర్తి అయ్యి, తండ్రి ద్వారా సత్యయుగీ పావన ప్రపంచము స్థాపనవుతుంది. వారిని - ఓ పతిత-పావనా రండి, ఓ నావికుడా, మమ్మల్ని ఈ విషయ సాగరము నుండి బయటకు తీసి, క్షీర సాగరములోకి తీసుకువెళ్ళండి అని అంటూ తలచుకుంటారు. గాంధీజీ కూడా - పతిత-పావనా సీతా రామ... ఓ రామా, సీతలందరినీ పావనముగా చేయండి అని పాడేవారు. మీరంతా సీతలు, భక్తురాళ్ళు. వారు భగవంతుడు, అందరూ వారిని పిలుస్తారు. వారు మిమ్మల్ని పతితము నుండి పావనముగా చేస్తున్నారు. వారు మీకు ఎక్కడా ఎదురుదెబ్బలు తగలనివ్వరు. వారు తీర్థయాత్రలకు వెళ్ళండి, కుంభమేళాలకు వెళ్ళండి అని చెప్పరు. ఈ నదులు పతిత-పావని ఏమీ కావు. పతిత-పావనుడు జ్ఞాన సాగరుడైన తండ్రి ఒక్కరే. సాగరాన్ని లేక నదులను ఎవరూ తలచుకోరు. ఓ పతిత-పావన బాబా, మమ్మల్ని పావనముగా చేయండి అని తండ్రిని పిలుస్తారు. ఇకపోతే, నీటి నదులైతే మొత్తము ప్రపంచమంతటా ఉన్నాయి, అవి పతిత-పావని కావు. పతిత-పావన అని ఒక్క తండ్రిని మాత్రమే అంటారు. వారు ఎప్పుడైతే వస్తారో, అప్పుడే పావనముగా తయారుచేస్తారు. భారత్ కు చాలా గొప్ప మహిమ ఉంది. భారత్ అన్ని ధర్మాలకు తీర్థ స్థానము. శివ జయంతి కూడా ఇక్కడ గాయనము చేయడము జరుగుతుంది. సత్యయుగము పావన ప్రపంచము, అక్కడ దేవీ-దేవతలు ఉంటారు. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు... అని దేవతల మహిమను గాయనము చేయడము జరుగుతుంది. చంద్రవంశీయులను 14 కళలు కలవారని అంటారు. ఆ తర్వాత మెట్లు కిందకు దిగుతారు. తండ్రి వచ్చి క్షణములో మెట్లు ఎక్కించి శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్తారు. మళ్ళీ 84 జన్మల చక్రములో తిరిగి మెట్లు దిగుతారు. ఎవరో ఒకరైతే 84 జన్మలను తప్పకుండా తీసుకుని ఉంటారు. ముఖ్యమైనది సర్వశాస్త్రమయీ శిరోమణి గీత. శ్రీమత్ భగవత్ అనగా భగవంతుని ద్వారా వినిపించబడినది. కానీ భగవంతుడని ఎవరినంటారు అనేది పతిత మనుష్యులకు తెలియదు. పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత, ఒక్క నిరాకార శివుడు మాత్రమే, కానీ వారెప్పుడు వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. తండ్రి వారంతట వారే వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. ఇప్పుడు చూడండి - ఈ కుమారులు మరియు కుమార్తెలు, ఇరువురూ బాబా అనే పిలుస్తారు. మీరే తల్లి-తండ్రి, మీ ఈ రాజయోగాన్ని నేర్చుకోవడముతో అపారమైన సుఖము లభిస్తుంది... అని అంటూ ఉంటారు కూడా. అనంతమైన తండ్రి నుండి 21 జన్మల కోసం, స్వర్గ వారసత్వాన్ని పొందడానికని మీరు ఇక్కడకు వస్తారు. ఇప్పుడు శివ జయంతిని కూడా భారత్ లోనే జరుపుకుంటారు. రావణుడిని కూడా భారత్ లోనే చూపిస్తారు. కానీ అర్థమేమీ తెలియదు. శివుడు మన అనంతమైన తండ్రి, ఈ విషయము ఒక్కరికి కూడా తెలియదు. కేవలం శివుడిని పూజిస్తూ ఉంటారు. ఎప్పుడైతే వృక్షమంతా తమోప్రధానమైపోతుందో, అప్పుడు తండ్రి వస్తారు. కొత్త ప్రపంచములో భారత్ స్వర్గముగా ఉండేది. భారత్ లోనే సత్యయుగము ఉండేది. భారత్ లోనే ఇప్పుడు కలియుగము ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మొట్టమొదట మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు, ఇప్పుడు మీరు 84 జన్మలను అనుభవించి నరకవాసులుగా అయ్యారు. ఇప్పుడు నేను మీకు రాజయోగాన్ని నేర్పించి మనుష్యుల నుండి దేవతలుగా, పతితులు నుండి పావనముగా తయారుచేస్తాను. భక్తి అనగా బ్రహ్మా యొక్క రాత్రి. జ్ఞానము అనగా బ్రహ్మా యొక్క పగలు. బ్రహ్మాకుమార-కుమారీలైన మీరు పగలులోకి వెళ్తారు. ఈ పాత ప్రపంచానికి ఇప్పుడు నిప్పు అంటుకోనున్నది, ఇది నిజంగా మహాభారత యుద్ధము. తప్పకుండా ఈ మహాభారత యుద్ధము తర్వాతనే భారత్ స్వర్గముగా అవుతుంది. అనేక ధర్మాల వినాశనము జరిగి, ఏక ధర్మ స్థాపన జరుగుతుంది.

పిల్లలైన మీరు బాబాకు సహాయకులుగా అయి, ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. మీరు స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు యోగ్యులుగా అయినట్లయితే, ఇక వినాశనము ప్రారంభమైపోతుంది. ఇది శివబాబా యొక్క జ్ఞాన యజ్ఞము, శివుడు అని అన్నా లేక రుద్రుడు అని అన్నా అది వారే. కృష్ణ జ్ఞాన యజ్ఞమని ఎప్పుడూ అనరు. సత్య, త్రేతాయుగాలలో యజ్ఞాలు ఉండవు. ఎప్పుడైతే ఉపద్రవాలు సంభవిస్తాయో, అప్పుడు యజ్ఞము రచించడము జరుగుతుంది. ధాన్యము లేనప్పుడు లేదా యుద్ధము జరిగేటప్పుడు, శాంతి కోసమని యజ్ఞాన్ని రచిస్తారు. వినాశనము అవ్వకుండానైతే భారత్ స్వర్గముగా అవ్వలేదని పిల్లలైన మీకు తెలుసు. భారతమాత శివశక్తి సైన్యము అని అంటూ ఉంటారు. పవిత్రమైనవారికే వందనము చేయడము జరుగుతుంది. మాతలైన మిమ్మల్ని వందేమాతరం అని అంటారు ఎందుకంటే మీరు శ్రీమతాన్ని అనుసరించి భారత్ ను స్వర్గముగా తయారుచేసారు. ఇప్పుడు తండ్రి అంటారు - మృత్యువైతే అందరి తలలపై నిలబడి ఉంది, అందుకే ఇప్పుడు ఈ ఒక్క జన్మ పవిత్రముగా అవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయి, తర్వాత దేవతలుగా అవుతారు, ఇది కొత్త విషయమేమీ కాదు. కల్ప-కల్పము, ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది, నరకము నుండి స్వర్గముగా అవుతుంది. పతిత ప్రపంచములో మనుష్యులు ఏ కర్మలనైతే చేస్తారో, అవి వికర్మలుగానే అవుతాయి. తండ్రి అంటారు, 5 వేల సంవత్సరాల క్రితం కూడా మీకు కర్మ, అకర్మ, వికర్మల గతిని అర్థం చేయించాను, ఇప్పుడు మళ్ళీ మీకు అర్థం చేయిస్తాను. నేను పరమపిత పరమాత్మను, నిరాకారుడిని, మీ తండ్రిని. నేను ఏ శరీరాన్ని అయితే ఆధారముగా తీసుకున్నానో, వారు భగవంతుడేమీ కారు. మనుష్యులను దేవతలని కూడా అనరు. అటువంటప్పుడు మనుష్యులను భగవంతుడు అని ఎలా అనగలరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ మెట్లు కిందకు దిగుతూ వచ్చారు, పైకి ఎవరూ వెళ్ళలేరు. అందరూ పతితముగా అయ్యే మార్గాన్నే తెలియజేస్తారు, స్వయం వారు కూడా పతితముగా అవుతూ ఉంటారు. అందుకే తండ్రి అంటారు - వారిని కూడా ఉద్ధరించేందుకు నేను రావలసి ఉంటుంది. ఇది రావణ రాజ్యము. మీరు ఇప్పుడు రావణ రాజ్యము నుండి బయటకు వచ్చారు. నెమ్మది-నెమ్మదిగా అందరికీ తెలుస్తుంది. బ్రాహ్మణులుగా అవ్వకుండా శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకోలేరు. తండ్రులు ఇద్దరు. ఒకరు నిరాకారీ తండ్రి, ఒకరు సాకారీ తండ్రి. వారసత్వమనేది ఒకటి సాకారీ తండ్రి నుండి సాకారీ పిల్లలకు లభిస్తుంది, ఇంకా, నిరాకారీ అనంతమైన తండ్రి నుండి నిరాకారీ ఆత్మలకు వారసత్వము లభిస్తుంది. మధురాతి మధురమైన శివబాబా నుండి మనం 21 జన్మల కోసం సుఖధామము యొక్క వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చాము అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. విశ్వానికి యజమానులుగా యోగబలముతో అవుతారు. ఇక్కడ ఆయుధాలు మొదలైనవేవీ లేవు. కనుక తండ్రితో యోగము జోడించి, వికర్మలను వినాశనము చేసుకుని, విష్ణుపురికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు అమరలోకానికి వెళ్ళడానికి అమరకథను వింటున్నారు. అక్కడ అకాల మృత్యువులు ఎప్పుడూ సంభవించవు. దుఃఖము యొక్క నామ-రూపాలు ఉండవు. పిల్లలైన మీరు శ్రీమతాన్ని అనుసరిస్తూ అనంతమైన తండ్రి ద్వారా శ్రేష్ఠాతి-శ్రేష్ఠమైన దేవీ-దేవతలుగా అవ్వడానికి వచ్చారు. ఇది శాస్త్రాల జ్ఞానమేమీ కాదు. విష్ణు నాభి నుండి బ్రహ్మా వచ్చినట్లుగా చూపిస్తారు. వారి చేతిలో శాస్త్రాలను చూపిస్తారు. తండ్రి అంటారు - బ్రహ్మా ద్వారా నేను మీకు మొత్తం రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. నేనే జ్ఞాన సాగరుడిని. జ్ఞాన సూర్యుడు ఉదయించినప్పుడు అజ్ఞాన అంధకారము వినాశనమవుతుందని గానము కూడా చేస్తారు. సత్యయుగములో అజ్ఞానము ఉండదు. అది సత్యఖండముగా ఉండేది, భారత్ వజ్ర సమానముగా ఉండేది, వజ్ర-వైఢూర్యాల మహళ్ళు తయారయ్యేవి. ఇప్పుడైతే మనుష్యులకు కడుపు నిండా తినడానికి కూడా లేదు. దివాలా తీసిన పరిస్థితి ఉన్న విశ్వాన్ని మళ్ళీ సంపన్నముగా ఎవరు తయారుచేయాలి! ఈ పని తండ్రిది మాత్రమే. తండ్రికే దయ కలుగుతుంది. వారంటారు - నేను మీకు రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చాను, నరుడిని నారాయణునిగా, నారిని లక్ష్మిగా చేస్తాను. భక్తుల రక్షకుడు భగవంతుడు. మిమ్మల్ని రావణుడి జైలు నుండి విడిపించి సుఖధామానికి తీసుకువెళ్తాను. ఈ ప్రపంచమంతటిలో ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారే దేవతలుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మా అని బ్రహ్మా పేరు కూడా ప్రసిద్ధమైనది. బ్రాహ్మణులైన మీరు అందరికన్నా ఉత్తములు, మీరు భారత్ కు సత్యమైన ఆత్మిక సేవను చేస్తున్నారు. తండ్రి స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి. పతితుల నుండి పావనులుగా అవ్వడానికి ఇంకే మార్గము లేదు. స్మృతితోనే మాలిన్యము భస్మమవుతుంది. సత్యమైన బంగారము, కల్తీ బంగారముగా ఎలా అవుతుంది అనేది కంసాలికి తెలుసు. అందులో వెండి, రాగి, ఇనుము కలుపుతారు. మీరు కూడా మొదట సతోప్రధానముగా ఉండేవారు, ఆ తర్వాత మీలో మాలిన్యము చేరుకుంది, మీరు తమోప్రధానముగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానముగా అవ్వాల్సి ఉంటుంది, అప్పుడే సత్యయుగములోకి వెళ్ళగలరు. తండ్రి అంటారు - దేహధారులెవరినీ గుర్తు చేయకండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ గుర్తు చేయకండి, అప్పుడు మీరు స్వర్గపురికి యజమానులుగా అయిపోతారు. స్వర్గము అనగా విష్ణుపురి ఉండేది, ఇప్పుడిది రావణపురి. మళ్ళీ తప్పకుండా విష్ణుపురిగా అవుతుంది. నేను సాధు-సత్పురుషులు మొదలైనవారందరినీ ఉద్ధరించేందుకు వస్తాను. అందుకే, యదా యదాహి ధర్మస్య... అని అంటారు. ఇది భారత్ కు సంబంధించిన విషయమే. సర్వుల సద్గతిదాత తండ్రినైన నేనొక్కడినే, శివుడిని. శివుడు, రుద్రుడు ఇవన్నీ వారి పేర్లే, ఎన్నో పేర్లు పెట్టేసారు. తండ్రి అంటారు - నా అసలు పేరైతే ఒక్కటే, శివ. నేను శివుడిని, పిల్లలైన మీరు సాలిగ్రామాలు. మీరు అర్ధకల్పము దేహాభిమానులుగా ఉన్నారు, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి. ఒక్క తండ్రిని తెలుసుకోవడముతో, తండ్రి ద్వారా మీరు అంతా తెలుసుకుంటారు, మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయిపోతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీమతముపై నడుస్తూ శ్రేష్ఠాతి-శ్రేష్ఠమైన దేవతలుగా అవ్వాలి. మొత్తము విశ్వమంతటికీ సత్యాతి-సత్యమైన ఆత్మిక సేవను చేయాలి. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపనలో తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి.

2. ఆత్మను సత్యమైన బంగారముగా తయారుచేసుకునేందుకు ఒక్క తండ్రిని తప్ప ఇంకే దేహధారినీ గుర్తు చేయకూడదు. పారలౌకిక తండ్రి పట్ల సత్యాతి-సత్యమైన ప్రీతిని పెట్టుకోవాలి.

వరదానము:-
ఆత్మిక ఉన్నతి యొక్క సాధనము ద్వారా సర్వ పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే అకాలమూర్త భవ

ఏ విధముగా శరీర నిర్వహణ కొరకు అనేక సాధనాలను ఉపయోగిస్తారో అలా ఆత్మిక ఉన్నతి కొరకు కూడా సాధనాలను ఉపయోగించండి. దీని కొరకు సదా అకాలమూర్త స్థితిలో స్థితులయ్యే అభ్యాసము చేయండి. ఎవరైతే స్వయాన్ని అకాలమూర్త ఆత్మగా భావిస్తూ నడుచుకుంటారో వారు అకాల మృత్యువు నుండి, కరువుల నుండి, సర్వ సమస్యల నుండి రక్షింపబడతారు. మానసిక చింతలను, మానసిక పరిస్థితులను దూరం చేసేందుకు కేవలం మీ పాత శరీర భానాన్ని తొలగిస్తూ వెళ్ళండి.

స్లోగన్:-
ఏ విషయములోనైనా పదే-పదే ఫీల్ అయితే, వారు ఫైనల్ లో ఫెయిల్ అయిపోతారు.

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు - ‘‘మనుష్యులు సాక్షాత్కారాలలోకి ఎలా వెళ్తారు?’’

ఈ సాక్షాత్కారాలలోకి వెళ్ళే విషయములో, దీని ఫిలాసఫీ చాలా సూక్ష్మమైనది. ఈ అంతఃవాహక శరీరముతో వెళ్ళి తిరిగి వస్తారు. ఎలాగైతే ఎవరైనా విహరించేందుకు బయటకు వెళ్తారు కదా, అక్కడ విహరించడానికి వెళ్ళారంటే మరణించారని కాదు, వారు విహరించి మళ్ళీ తిరిగి వస్తారు కదా. అలాగే ఇక్కడ కూడా, ఆత్మ ఈ శరీరము నుండి బయటకు వచ్చి అంతఃవాహక శరీరముతో విహరించడానికి వెళ్తుంది. కొద్ది సమయము కోసం వారి ఆత్మ ఎగిరే పక్షి వలె ఉంటుంది. వారి దారాన్ని (బుద్ధిని) ఆకర్షించి, దివ్యదృష్టితో వారికి సాక్షాత్కారము కలిగించే పని పరమాత్మదే. ఎలాగైతే మనము రాత్రి శరీరము నుండి అతీతముగా, ఆత్మగా అయి, సుఖమయ మార్గములోకి అనగా స్వప్నావస్థలోకి వెళ్ళిపోతాము, ఆ సమయములో శరీరము శాంతిగా ఉంటుంది, అప్పుడు దేహము మరియు దేహ ధర్మాలను మర్చిపోతాము. అలాగని శరీరము మరణించిందనేమీ కాదు. మళ్ళీ జాగృతిలోకి వచ్చినప్పుడు, ఆ రాత్రి వచ్చిన కల యొక్క అవస్థను వర్ణించి వినిపిస్తారు. అదే విధముగా, పరమాత్మునితో యోగము జోడించినప్పుడు పరమాత్ముడు దివ్యదృష్టితో ఆత్మను విహరించేలా చేస్తారు. ఆ తర్వాత ధ్యానము నుండి లేచినప్పుడు, మేము ఇది చూసి వచ్చాము అని వారు చూసిన సాక్షాత్కారాన్ని వర్ణించి వినిపిస్తారు. అయితే, ఆ స్వప్నాలు రజోగుణిగా, తమోగుణిగా కూడా ఉంటాయి, కానీ ఈ ధ్యానము సతోగుణ అవస్థ కలదిగా ఉంటుంది. కనుక ధ్యానములో శరీరమేమీ మరణించదు, కానీ శరీరము యొక్క అనుభూతి మాయమైపోతుంది. ఎలాగైతే క్లోరోఫాం ఇవ్వడముతో శరీరము యొక్క స్పృహను కోల్పోతారు. చూడండి, డాక్టర్ ఏ అవయవానికైనా మత్తు ఇచ్చేటప్పుడు, ఇంజెక్షన్ ఇచ్చి మత్తు ఇస్తారు, అప్పుడు ఇతర ఇంద్రియాలైతే పని చేస్తాయి. ధ్యానము కూడా ఇటువంటిదే. ఆత్మ ఎగిరి వెళ్ళి విహరించి వస్తుంది కానీ శరీరము మరణించదు. ఇప్పుడు ఈ దారాన్ని (బుద్ధిని) ఆకర్షించే శక్తి కూడా పరమాత్మలోనే ఉంది, మనుష్యాత్మలలో లేదు. అచ్ఛా. ఓంశాంతి.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా చేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

సదా హర్షితముగా ఉండేవారి స్మృతిచిహ్నాన్ని విష్ణు రూపములో చూపించారు. విష్ణుమూర్తి క్షీరసాగరములో ప్రశాంతముగా పడుకుని జ్ఞాన స్మరణ చేస్తూ హర్షిస్తూ ఉన్నారు. కనుక హర్షితముగా ఉండేందుకు సాధనము - జ్ఞాన స్మరణ. ఎవరు ఎంతగా జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఉంటారో, వారు అంతగానే హర్షితముగా ఉంటారు. ఏ పరిస్థితి కూడా వారి ధైర్యాన్ని, ఉల్లాస-ఉత్సాహాలను తక్కువ చెయ్యలేదు. వారు సహనశీలతా శక్తితో ప్రతి పరిస్థితిని సహజముగా దాటివేస్తారు.