06-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి వద్ద ఏ సామాగ్రి అయితే ఉందో, అది మీకు పూర్తిగా లభించింది, మీరు దానిని ధారణ చేయండి మరియు చేయించండి’’

ప్రశ్న:-
త్రికాలదర్శి తండ్రికి డ్రామా ఆదిమధ్యాంతాలు తెలిసినా కూడా, రేపటి విషయాన్ని ఈ రోజు చెప్పరు, ఎందుకు?

జవాబు:-
బాబా అంటారు - పిల్లలూ, ఒకవేళ నేను ముందే చెప్తే, డ్రామాలో ఉన్న మజా పోతుంది. అలా చెప్పడము నియమము కాదు. అన్నీ తెలిసినా కానీ, నేను కూడా డ్రామాకు వశమై ఉన్నాను, ముందే వినిపించలేను. అందుకే మీరు ఏమి జరుగుతుంది అన్న చింతను వదిలేయండి.

పాట:-
నీ దారిలోనే మరణించాలి...

ఓంశాంతి
బాబా ఆత్మల యొక్క పారలౌకిక తండ్రి, వారు ఆత్మలతోనే మాట్లాడుతారు. ఆత్మలను పిల్లలూ, పిల్లలూ, అని పిలవడము వారికి అలవాటు. శరీరము కుమార్తెది కావచ్చు కానీ ఆత్మలందరూ కొడుకులే. ఆత్మలు ప్రతి ఒక్కరూ వారసులు అనగా వారసత్వము తీసుకునేందుకు అధికారులు. తండ్రి వచ్చి చెప్తున్నారు - పిల్లలూ, మీలోని ప్రతి ఒక్కరికీ వారసత్వము తీసుకునే హక్కు ఉంది. అనంతమైన తండ్రిని చాలా స్మృతి చేయాలి, ఇందులోనే శ్రమ ఉంది. బాబా మనల్ని చదివించడానికి పరంధామము నుండి వచ్చారు. సాధు-సన్యాసులైతే తమ ఇళ్ళ నుండి వస్తారు లేదా ఏవైనా గ్రామాల నుండి వస్తారు. బాబా అయితే మనల్ని చదివించడానికి పరంధామము నుండి వచ్చారు. ఈ విషయము ఎవరికీ తెలియదు. వారు అనంతమైన తండ్రి, వారే పతిత-పావనుడు, గాడ్ ఫాదర్. వారిని ఓషన్ ఆఫ్ నాలెడ్జ్ (జ్ఞాన సాగరుడు) అని కూడా అంటారు, వారు అథారిటీ కదా. అది ఏ జ్ఞానము? ఈశ్వరీయ జ్ఞానము. తండ్రి మనుష్య సృష్టికి బీజరూపుడు. వారు సత్-చిత్-ఆనంద స్వరూపుడు. వారికి చాలా గొప్ప మహిమ ఉంది. వారి వద్ద ఈ సామాగ్రి ఉంది. ఎవరి వద్దనైనా దుకాణముంటే, మా దుకాణములో ఫలానా-ఫలానా వెరైటీలు ఉన్నాయని చెప్తారు. తండ్రి కూడా అంటారు - నేను జ్ఞాన సాగరుడిని, ఆనంద సాగరుడిని, శాంతి సాగరుడిని. నా వద్ద ఈ సామాగ్రి అంతా ఉంది. నేను డెలివరీ చేయడానికి సంగమములో వస్తాను. నా వద్ద ఏదైతే ఉందో, అదంతా డెలివరీ చేస్తాను, ఇక ఆపై ఎవరు ఎంత ధారణ చేస్తే లేదా ఎవరెంత పురుషార్థము చేస్తే అంత పొందుతారు. తండ్రి వద్ద ఏమేమి ఉన్నాయి అనేది పిల్లలకు తెలుసు, అది కూడా ఏక్యురేట్ గా తెలుసు. ఈ రోజుల్లో ఎవరూ, తమ వద్ద ఏమేమి ఉంది అనేది పూర్తిగా చెప్పరు. కొందరిది మట్టిలో కూరుకుపోతుంది... అని అంటూ ఉంటారు కదా, అవన్నీ ఇప్పటి విషయాలే. నిప్పు అంటుకుంటుంది, అంతా సమాప్తమైపోతుంది. రాజుల వద్ద లోలోపల చాలా పెద్ద దృఢమైన గుహలు ఉంటాయి. భూకంపాలు వచ్చినా, మంటలు తీవ్రముగా అంటుకున్నా సరే, ఆ గుహల నుండి బయటకు రాగలరు. ఇక్కడి వస్తువేదీ అక్కడ ఉపయోగపడదని పిల్లలైన మీకు తెలుసు. గనులన్నీ మళ్ళీ కొత్తగా నిండుతాయి. సైన్స్ కూడా రిఫైన్ అయ్యి మీకు ఉపయోగపడుతుంది. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తము జ్ఞానమంతా ఉంది. మాకు సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తెలుసునని పిల్లలకు తెలుసు. ఇకపోతే చివరిగా కొద్ది భాగము మిగిలి ఉంది, దానిని కూడా తెలుసుకుంటారు. బాబా ముందే అంతా ఎలా వినిపిస్తారు. తండ్రి అంటారు - నేను కూడా డ్రామాకు వశమై ఉన్నాను, ఇప్పటివరకు ఏ జ్ఞానమైతే లభించిందో, అంతవరకు మాత్రమే డ్రామాలో నిశ్చితమై ఉంది. ఏ క్షణమైతే గడిచిందో, దానిని డ్రామా అని భావించాలి. ఇకపోతే, రేపు ఏమి జరగబోతుంది అనేది చూద్దాము. రేపటి విషయాన్ని ఈ రోజు వినిపించను. ఈ డ్రామా రహస్యాన్ని మనుష్యులు అర్థం చేసుకోరు. కల్పము ఆయువును ఎంతగా పెంచేసారు. ఈ డ్రామాను అర్థం చేసుకునే ధైర్యము కూడా కావాలి. అమ్మ మరణించినా హల్వా తినాలి... మరణించిన తర్వాత వెళ్ళి మరొక జన్మ తీసుకున్నారు కనుక మనమెందుకు ఏడవాలి అని భావిస్తారు. బాబా అర్థం చేయించారు - ఈ ప్రదర్శనీ నేటికి 5 వేల సంవత్సరాల క్రితం ఇదే తేదీన, ఇదే స్థానములో, ఇదే విధముగా జరిగిందని మీరు వార్తాపత్రికలలో వ్రాయవచ్చు. ఈ ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతున్నాయి అని వ్రాయాలి. ఈ ప్రపంచము ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని, ఇవన్నీ సమాప్తమైపోతాయని మీకు తెలుసు. మనమైతే పురుషార్థము చేసి వికర్మాజీతులుగా అవుతాము, మళ్ళీ ద్వాపరము నుండి విక్రముని కాలము అనగా వికర్మలు జరిగే కాలము ప్రారంభమవుతుంది. ఈ సమయములో మీరు వికర్మలపై విజయాన్ని పొందుతారు కనుక వికర్మాజీతులుగా అవుతారు. పాప కర్మలను శ్రీమతము ఆధారముగా జయించి వికర్మాజీతులుగా అవుతారు. అక్కడ మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు. అక్కడ దేహాభిమానము ఉండదు. కలియుగములో దేహాభిమానము ఉంటుంది. సంగమములో మీరు దేహీ-అభిమానులుగా అవుతారు. పరమపిత పరమాత్ముని గురించి కూడా తెలుసుకుంటారు. ఇది శుద్ధ అభిమానము. బ్రాహ్మణులైన మీరు అందరికన్నా ఉన్నతమైనవారు. మీరు సర్వోత్తమమైన బ్రాహ్మణ కుల భూషణులు. ఈ జ్ఞానము కేవలం మీకు మాత్రమే లభిస్తుంది, ఇంకెవ్వరికీ లభించదు. ఇది మీ సర్వోత్తమమైన కులము. అతీంద్రియ సుఖము గురించి గోపీ వల్లభుని పిల్లలను అడగండి అని కూడా అంటూ ఉంటారు. మీకు ఇప్పుడు లాటరీ లభిస్తుంది. ఏదైనా వస్తువు మామూలుగా లభిస్తే, అంత సంతోషముండదు. పేదవారి నుండి షావుకారుగా అయినప్పుడు సంతోషముంటుంది. ఎంతగా మనము పురుషార్థము చేస్తామో, అంతగా తండ్రి నుండి రాజధాని యొక్క వారసత్వాన్ని తీసుకుంటామని మీకు కూడా తెలుసు. ఎవరెంతగా పురుషార్థము చేస్తారో, అంత పొందుతారు. పిల్లలూ, మీ అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేయండి అన్న ముఖ్యమైన విషయాన్ని తండ్రి చెప్తారు. వారు అందరికీ ప్రియమైన తండ్రి. వారే వచ్చి అందరికీ సుఖ-శాంతులను ఇస్తారు. ఇప్పుడు దేవీ-దేవతల రాజధాని స్థాపనవుతుంది. అక్కడ రాజు-రాణి ఉండరు. అక్కడ మహారాజు-మహారాణి అని అంటారు. ఒకవేళ భగవాన్-భగవతి అని అంటే, మరి యథా రాజా రాణి తథా ప్రజా అందరూ భగవాన్-భగవతీలుగా అయిపోతారు, అందుకే భగవాన్-భగవతి అని అనరు. భగవంతుడు ఒక్కరే. మనుష్యులను భగవంతుడని అనరు. సూక్ష్మవతనవాసులైన బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా దేవతలని అంటారు. స్థూలవతనవాసులను మనము భగవాన్-భగవతి అని ఎలా అంటాము. ఉన్నతోన్నతమైనది మూలవతనము, ఆ తర్వాత సూక్ష్మవతనము, ఇది (స్థూలవతనము) మూడవ నంబరులో ఉంది. ఈ విషయము మీ బుద్ధిలో ఉండాలి. ఆత్మలైన మన తండ్రి శివబాబాయే, వారు శిక్షకుడు కూడా, గురువు కూడా. వారు కంసాలి, బ్యారిస్టరు మొదలైనవారు కూడా. వారు అందరినీ రావణుడి జైలు నుండి విడిపిస్తారు. శివబాబా ఎంత పెద్ద బ్యారిస్టరు. మరి అటువంటి తండ్రిని ఎందుకు మర్చిపోవాలి. బాబా, మేము మర్చిపోతున్నాము అని ఎందుకంటారు. మాయ తుఫానులు చాలా వస్తాయి. బాబా అంటున్నారు - అవి వస్తాయి, ఎంతోకొంత శ్రమించాలి. ఇది మాయతో యుద్ధము. పాండవులైన మీకు కౌరవులతో ఎటువంటి యుద్ధము జరగడము లేదు. పాండవులు ఎలా యుద్ధము చేస్తారు. అలా చేస్తే, వారు హింసకులైపోతారు. తండ్రి ఎప్పుడూ హింసను నేర్పించరు. ఏమీ అర్థం చేసుకోలేరు. వాస్తవానికి మనకు యుద్ధాలేవీ ఉండవు. నన్ను స్మృతి చేయండి, అప్పుడు మాయ దాడి జరగదు అని బాబా కేవలం యుక్తిని తెలియజేస్తారు. దీని గురించి కూడా ఒక కథ ఉంది - ముందు సుఖము కావాలా లేక దుఃఖము కావాలా అని అడిగితే, సుఖము కావాలని చెప్పారు. దుఃఖము సత్యయుగములో ఉండదు.

ఈ సమయములో సీతలందరూ రావణుడి శోకవాటికలో ఉన్నారని మీకు తెలుసు. ఈ ప్రపంచమంతా సాగరము మధ్యలో ఉన్న లంక వంటిది. ఇప్పుడు అందరూ రావణుడి జైలులో ఉన్నారు. సర్వులకు సద్గతినిచ్చేందుకు తండ్రి వచ్చారు. అందరూ శోకవాటికలో ఉన్నారు. స్వర్గములో సుఖము ఉంది, నరకములో దుఃఖము ఉంది. దీనిని శోకవాటిక అని అంటారు. అది శోకము లేని ప్రపంచము, స్వర్గము. రెండింటికీ మధ్యన చాలా వ్యత్యాసము ఉంది. పిల్లలైన మీరు ప్రయత్నము చేసి తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడు సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కుతుంది. తండ్రి సలహాపై నడుచుకోకపోతే, సవతి పిల్లలు అయినట్లు. అప్పుడిక ప్రజలలోకి వెళ్ళిపోతారు. సొంత పిల్లలైతే రాజధానిలోకి వస్తారు. రాజధానిలోకి రావాలనుకుంటే శ్రీమతాన్ని అనుసరించవలసి ఉంటుంది. శ్రీకృష్ణుడి నుండి మతము లభించదు. మతములు రెండే ఉంటాయి. ఇప్పుడు మీరు శ్రీమతాన్ని తీసుకుంటారు, దాని ఫలాన్ని సత్యయుగములో అనుభవిస్తారు. ఆ తర్వాత ద్వాపరములో రావణుడి మతము లభిస్తుంది. అందరూ రావణుడి మతాన్ని అనుసరించి అసురులుగా అయిపోతారు. మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది. మతమును ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే, వారే ఈశ్వరుడు. మీరు ఈశ్వరీయ మతాన్ని అనుసరించి ఎంత పవిత్రముగా అవుతారు. మొదటి పాపము - విషయసాగరములో మునకలు వేయడము. దేవతలు విషయసాగరములో మునకలు వేయరు. అక్కడ పిల్లలు ఉండరా, అని అడుగుతారు. పిల్లలెందుకు ఉండరు! కానీ అది నిర్వికారీ ప్రపంచము, సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము. అక్కడ ఈ వికారాలేవీ ఉండవు. తండ్రి అర్థం చేయించారు - దేవతలు కేవలం ఆత్మ-అభిమానులుగా ఉంటారు, పరమాత్మ-అభిమానులుగా ఉండరు. మీరు ఆత్మాభిమానులుగా కూడా ఉన్నారు, పరమాత్మ అభిమానులుగా కూడా ఉన్నారు. ఇంతకుముందు ఈ రెండు విధాలుగానూ ఉండేవారు కాదు. సత్యయుగములో పరమాత్ముని గురించి తెలియదు, వారికి ఆత్మ గురించి తెలుసు, ఆత్మనైన నేను ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్ళి కొత్త శరీరాన్ని తీసుకుంటానని తెలుసు, ఇప్పుడిక పాత శరీరాన్ని వదిలి కొత్తదానిని తీసుకోవాలని అక్కడ ముందే తెలిసిపోతుంది. కొడుకు జన్మించేటప్పుడు కూడా ముందే సాక్షాత్కారమవుతుంది. యోగబలముతో మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు, అటువంటప్పుడు యోగబలముతో పిల్లలు జన్మించలేరా! యోగబలముతో మీరు దేనినైనా పావనముగా చేయగలరు. కానీ మీరు స్మృతిని మర్చిపోతారు. కొంతమందికి అభ్యాసమైపోతుంది. చాలామంది సన్యాసులకు కూడా భోజనము పట్ల గౌరవముంటుంది, కావున వారు ఆ సమయములో చాలా మంత్రాలను పఠించి, అప్పుడు భోజనము చేస్తారు. మీకు కూడా పథ్యమైతే చెప్పారు. మాంసము-మద్యము ఏవీ తీసుకోకూడదు. మీరు దేవతలుగా అవుతారు కదా. దేవతలు ఎప్పుడూ అశుద్ధమైనవి తినరు. కనుక ఆ విధముగా పవిత్రముగా అవ్వాలి. తండ్రి అంటారు, మీరు నా ద్వారా నన్ను తెలుసుకోవడముతో అంతా తెలుసుకుంటారు. ఇక తెలుసుకోవలసినదేమీ మిగలదు. సత్యయుగములో చదువు కూడా వేరుగా ఉంటుంది. ఇప్పుడిది ఈ మృత్యులోకపు చదువు యొక్క అంతిమము. మృత్యులోకపు వ్యవహారాలన్నీ సమాప్తమై, అమరలోకపు వ్యవహారాలు ప్రారంభమవుతాయి. అంతగా పిల్లలకు నషా ఎక్కాలి. మీరు అమరలోకానికి యజమానులుగా ఉండేవారు. పిల్లలైన మీరు అతీంద్రియ సుఖము, పరమ సుఖములో ఉండాలి. పరమపిత పరమాత్మునికి మనము పిల్లలము మరియు విద్యార్థులము. పరమపిత పరమాత్మ ఇప్పుడు మనల్ని ఇంటికి తీసుకువెళ్తారు, దీనినే పరమానందము అని అంటారు. సత్యయుగములో ఈ విషయాలేవీ ఉండవు. ఇవి మీరు ఇప్పుడే వింటారు. ఈ సమయములో మీరు ఈశ్వరీయ ఫ్యామిలీకి చెందినవారు. అతీంద్రియ సుఖము గురించి గోప-గోపికలను అడగండి అన్న గాయనము ఇప్పటిదే. పరంధామములో నివసించే బాబా వచ్చి మనకు తండ్రిగా, టీచరుగా, గురువుగా అవుతారు. ముగ్గురూ సేవకులే. వారికి ఎటువంటి అభిమానము ఉండదు. నేను మీకు సేవ చేసి, మీకు సర్వస్వాన్ని ఇచ్చి నిర్వాణధామములో కూర్చుంటానని అంటారు, కావున వారు సేవకుడు అయినట్లే కదా. వైస్రాయ్ మొదలైనవారు సంతకము చేసేటప్పుడు, ఎప్పుడూ, ఒబీడియేంట్ సర్వెట్ (విధేయుడైన సేవకుడు) అని వ్రాస్తారు. బాబా కూడా నిరాకారుడు, నిరహంకారి. వారు ఏ విధముగా కూర్చుని చదివిస్తున్నారో చూడండి. ఇంతటి ఉన్నతమైన చదువును ఇంకెవ్వరూ చదివించలేరు. ఇన్ని పాయింట్లను ఎవ్వరూ ఇవ్వలేరు. వీరికి గురువు ఎవరూ నేర్పించలేదని మనుష్యులు తెలుసుకోలేరు. గురువు అనేవారు ఉన్నట్లయితే, ఎంతోమందికి గురువుగా ఉంటారు. ఒక్కరికే గురువుగా ఉంటారా ఏమిటి? ఈ తండ్రియే పతితులను పావనముగా చేస్తారు, వీరు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. బాబా అంటారు - నేను కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమయుగములో వస్తాను. బాబా, మేము కల్పక్రితం కూడా కలిసాము అని అంటారు కదా. తండ్రియే వచ్చి పతితులను పావనముగా చేస్తారు. 21 జన్మల కోసం పిల్లలైన మిమ్మల్ని పావనముగా చేస్తాను. కనుక ఇవన్నీ ధారణ చేయాలి, అప్పుడు బాబా ఏమి అర్థం చేయించారు అనేది ఇతరులకు చెప్పాలి. తండ్రి నుండి మనము భవిష్య 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటాము. ఇది గుర్తున్నట్లయితే సంతోషముగా ఉంటారు. ఇది పరమానందము. మాస్టర్ నాలెడ్జ్ ఫుల్, బ్లిస్ ఫుల్, ఈ వరదానాలన్నీ మీకు తండ్రి నుండి ఇప్పుడు లభిస్తాయి. సత్యయుగములో ఏమీ తెలియనివారిగా ఉంటారు. ఈ లక్ష్మీ-నారాయణులకు ఈ జ్ఞానమేమీ ఉండదు. వీరికి జ్ఞానము ఉండి ఉంటే, అది పరంపరగా కొనసాగుతూ వచ్చేది. మీకు ఉన్నంత పరమానందము దేవతలకు కూడా ఉండజాలదు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేవతలుగా అయ్యేందుకు ఆహార-పానీయాలను చాలా శుద్ధముగా ఉంచుకోవాలి. చాలా పథ్యముతో నడుచుకోవాలి. యోగబలముతో భోజనానికి దృష్టినిచ్చి, దానిని శుద్ధముగా చేసుకుని స్వీకరించాలి.

2. పరమపిత పరమాత్మునికి మనము పిల్లలము మరియు విద్యార్థులము, వారు ఇప్పుడు మనల్ని మన ఇంటికి తీసుకువెళ్తారు, ఈ నషాలోనే ఉంటూ పరమ సుఖాన్ని, పరమానందాన్ని అనుభవము చేయాలి.

వరదానము:-
సేవ యొక్క తపన ద్వారా లౌకికాన్ని అలౌకిక ప్రవృత్తిలోకి పరివర్తన చేసే నిరంతర సేవాధారీ భవ

సేవాధారుల కర్తవ్యము నిరంతరము సేవలో ఉండడము - అది మనసా సేవ కావచ్చు, వాచా సేవ కావచ్చు లేక కర్మణా సేవ కావచ్చు. సేవాధారులు ఎప్పుడూ సేవ వేరు, నేను వేరు అని భావించరు. ఎవరి బుద్ధిలోనైతే సదా సేవ చేయాలనే తపన ఉంటుందో, వారి లౌకిక ప్రవృత్తి మారి ఈశ్వరీయ ప్రవృత్తిగా అవుతుంది. సేవాధారులు ఇల్లును ఇల్లుగా భావించరు, దానిని సేవా స్థానముగా భావిస్తూ నడుచుకుంటారు. సేవాధారుల ముఖ్య గుణము త్యాగము. త్యాగ వృత్తి కలవారు ప్రవృత్తిలో తపస్వీ మూర్తులుగా ఉంటారు, దాని ద్వారా సేవ స్వతహాగా జరుగుతుంది.

స్లోగన్:-
తమ సంస్కారాలను దివ్యముగా చేసుకోవాలంటే మనసు-బుద్ధిని తండ్రి ముందు సమర్పితము చేయండి.

అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’

ఏ ఆత్మకైనా రెండు క్షణాలు మధురమైన దృష్టిని ఇవ్వండి, మధురమైన మాటలు మాట్లాడండి, అప్పుడు ఆ ఆత్మను సదా కొరకు నిండుగా చేస్తారు. రెండు క్షణాల ఈ మధురమైన దృష్టి, మాటలు ఆ ఆత్మ యొక్క సృష్టిని మార్చివేస్తాయి. రెండు మధురమైన మాటలు సదా కొరకు పరివర్తన అయ్యేందుకు నిమిత్తమవుతాయి.