06-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 18.01.2006


‘‘సంకల్పాలు, సమయము మరియు మాటల యొక్క పొదుపు స్కీమ్ ద్వారా సఫలతా మహోత్సవాన్ని జరుపుకోండి, నిరాశలో ఉన్న ఆత్మలలో ఆశా దీపాన్ని వెలిగించండి’’

ఈ రోజు స్నేహము యొక్క రోజు. నలువైపులా ఉన్న పిల్లలందరూ స్నేహ సాగరునిలో ఇమిడిపోయి ఉన్నారు. ఈ స్నేహము సహయోగులుగా తయారుచేసేటువంటిది. స్నేహము అన్ని ఇతర ఆకర్షణల నుండి దూరం చేసేటువంటిది. స్నేహము యొక్క వరదానము పిల్లలైన మీ అందరి జన్మ యొక్క వరదానము. స్నేహములో పరివర్తన చేయించే శక్తి ఉంది. ఈ రోజున నలువైపులా రెండు రకాల పిల్లలను చూసారు. అందరూ లవ్లీ (ప్రియమైన) పిల్లలే కానీ ఒకరు లవ్లీ పిల్లలు, మరొకరు లవలీనమై ఉన్న పిల్లలు. లవలీనమై ఉన్న పిల్లలు ప్రతి సంకల్పములో, ప్రతి శ్వాసలో, ప్రతి మాటలో, ప్రతి కర్మలో స్వతహాగానే తండ్రి సమానముగా సహజముగా ఉంటారు, ఎందుకని? పిల్లలకు తండ్రి సమర్థ భవ అన్న వరదానాన్ని ఇచ్చారు. నేటి ఈ రోజును స్మృతి దివసము మరియు సమర్థ దివసము అని అంటారు, ఎందుకని? తండ్రి ఈ రోజున స్వయాన్ని బ్యాక్ బోన్ (వెన్నెముక)గా చేసుకున్నారు మరియు లవలీనమై ఉన్న పిల్లలను విశ్వమనే స్టేజ్ పై ప్రత్యక్షము చేసారు. వ్యక్తములో పిల్లలను ప్రత్యక్షము చేసారు మరియు స్వయం అవ్యక్త రూపములో సహచరునిగా అయ్యారు.

నేటి ఈ స్మృతి మరియు సమర్థ దివసము నాడు బాప్ దాదా పిల్లలను బాలకుల నుండి యజమానులుగా చేసి సర్వశక్తివంతుడైన తండ్రిని మాస్టర్ సర్వశక్తివంతులై ప్రత్యక్షము చేసే కార్యాన్ని ఇచ్చారు మరియు తండ్రి చూసి సంతోషిస్తున్నారు ఎందుకంటే యథా యోగము తథా శక్తితో పిల్లలందరూ తండ్రిని ప్రత్యక్షము చేసే కార్యములో అనగా విశ్వ కళ్యాణము చేసి విశ్వ పరివర్తన చేసే కార్యములో నిమగ్నులై ఉన్నారు. తండ్రి ద్వారా సర్వ శక్తుల వారసత్వము ఏదైతే లభించి ఉందో, దానిని స్వయం కొరకు మరియు విశ్వాత్మల కొరకు కార్యములో వినియోగిస్తున్నారు. బాప్ దాదా కూడా ఇటువంటి మాస్టర్ సర్వశక్తివంతులకు, తండ్రి సమానముగా ఉల్లాస-ఉత్సాహాలలో ఉండేటువంటి ఆల్ రౌండ్ సేవాధారులకు, నిస్వార్థ సేవాధారులకు, అనంతమైన సేవాధారీ పిల్లలకు మనస్ఫూర్తిగా పదమాల, పదమాల రెట్లు అభినందనలను తెలుపుతున్నారు. అభినందనలు, అభినందనలు. దేశములోని పిల్లలు కూడా తక్కువైనవారేమీ కారు మరియు విదేశాలలోని పిల్లలు కూడా తక్కువైనవారేమీ కారు. బాప్ దాదా ఇటువంటి పిల్లలను మనసులోనే మహిమ కూడా చేస్తారు మరియు వాహ్ పిల్లలూ వాహ్! అని పాటను కూడా పాడుతారు. మీరందరూ వాహ్ వాహ్ పిల్లలు కదా! చేతులు ఊపుతున్నారు, చాలా మంచిది. బాప్ దాదాకు పిల్లల విషయములో శుద్ధమైన గర్వముతో కూడిన నషా ఉంది - తన పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారీ రాజులే అని అనేటువంటి తండ్రి మొత్తము కల్పములో ఎవ్వరూ ఉండరు. మీరందరూ అయితే స్వరాజ్య అధికారీ రాజులే కదా! ప్రజలైతే కారు కదా! చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు - మేము భవిష్యత్తులో ఏమవుతామో, ఆ చిత్రాన్ని మాకు చూపించండి అని అంటారు. బాప్ దాదా ఏమంటారు? జగదంబ తల్లి ప్రతి ఒక్కరికీ చిత్రాన్ని ఇచ్చేవారు, కనుక మాకు కూడా చిత్రాన్ని ఇవ్వండి అని పాత పిల్లలైతే అంటారు. బాప్ దాదా అంటారు, పిల్లలు ప్రతి ఒక్కరికీ తండ్రి ఒక విచిత్ర దర్పణాన్ని (అద్దాన్ని) ఇచ్చారు, ఆ దర్పణములో - నేను ఎవరిని అన్న మీ భవిష్య చిత్రాన్ని చూడగలరు. తెలుసా, ఆ దర్పణము మీ వద్ద ఉందా? అది ఏ దర్పణమో తెలుసా? మొదటి లైన్ వారికైతే తెలిసే ఉంటుంది కదా! తెలుసా? ఆ దర్పణము ఏమిటంటే - వర్తమాన సమయములోని స్వరాజ్య స్థితి యొక్క దర్పణము. వర్తమాన సమయములో ఎంతగా స్వరాజ్య అధికారులుగా ఉంటారో, దాని అనుసారముగా విశ్వ రాజ్యాధికారులుగా అవుతారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు దర్పణములో చూసుకోండి - స్వరాజ్య అధికారులుగా సదా ఉన్నారా? లేదా అప్పుడప్పుడు ఆధీనులుగా, అప్పుడప్పుడు అధికారులుగా ఉంటున్నారా? ఒకవేళ అప్పుడప్పుడు ఆధీనులుగా, అప్పుడప్పుడు అధికారులుగా అవుతున్నారంటే, ఒకసారి కళ్ళు మోసగిస్తాయి, ఒకసారి మనసు మోసగిస్తుంది, ఒకసారి నోరు మోసగిస్తుంది, ఒకసారి చెవులు కూడా మోసం చేసేస్తాయి, వ్యర్థమైన విషయాలను వినాలనే అభిరుచి కలుగుతుంది, ఇలా ఒకవేళ ఏ కర్మేంద్రియమైనా మోసం చేస్తుందంటే, పరవశులుగా చేస్తుందంటే, దాని బట్టి నిరూపణ అవుతుంది - తండ్రి ద్వారా సర్వ శక్తులు ఏవైతే వరదానముగా లభించాయో లేక వారసత్వముగా లభించాయో, ఆ కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ లేవు అని ఋజువు అవుతుంది. కనుక ఆలోచించండి, ఎవరైతే స్వయముపైనే పరిపాలన చేయలేకపోతున్నారో, వారు విశ్వాన్ని ఎలా పరిపాలించగలరు! మీ వర్తమాన స్థితిని స్వరాజ్య అధికారీ దర్పణములో చెక్ చేసుకోండి. దర్పణమైతే అందరికీ లభించింది కదా? దర్పణము లభించింది అంటే చేతులు ఎత్తండి. దర్పణముపై ఏవైనా మరకలైతే పడలేదు కదా? దర్పణము స్పష్టముగా ఉందా?

బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ స్వరాజ్య అధికారి అన్న స్వమానాన్ని ఇచ్చారు. మాస్టర్ సర్వశక్తివంతులు అన్న టైటిల్ పిల్లలందరికీ తండ్రి ద్వారా లభించి ఉంది. మాస్టర్ శక్తివంతులు కారు, సర్వశక్తివంతులు. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణలో ఏమంటూ ఉంటారంటే - బాబా, మీరైతే సర్వ శక్తులను ఇచ్చారు కానీ ఈ శక్తులు అప్పుడప్పుడు అవసరమైన సమయములో పని చెయ్యటం లేదు. ఏమని రిపోర్ట్ చేస్తారంటే - అవి అవసరమైన సమయములో ఇమర్జ్ అవ్వటం లేదు, సమయము గడిచిపోయిన తర్వాత ఇమర్జ్ అవుతున్నాయి. మరి కారణమేమిటి? ఏ సమయములో ఏ శక్తిని ఆహ్వానిస్తారో ఆ సమయములో చెక్ చేసుకోండి, నేను యజమాని అనే సీట్ పై సెట్ అయ్యి ఉన్నానా? ఒకవేళ ఎవరైనా సీట్ పై సెట్ అయి లేకపోతే, సీట్ లేనివారి ఆర్డరును ఎవ్వరూ పాటించరు. నేను స్వరాజ్య అధికారిని, మాస్టర్ సర్వశక్తివంతుడిని, తండ్రి ద్వారా వారసత్వానికి మరియు వరదానానికి అధికారిని, ఈ సీట్ పై సెట్ అయ్యి అప్పుడు ఆర్డర్ చేయండి. ఏం చేయను, ఎలా చేయను, అవ్వటం లేదు, సీట్ నుండి కిందకు దిగి కూర్చుని ఆర్డరు చేస్తే, మరి ఎలా పాటిస్తాయి! ఈ కాలములో కూడా ఒకవేళ ఎవరైనా ప్రధానమంత్రి ఉన్నారనుకోండి, వారు సీట్ లో ఉంటే అందరూ పాటిస్తారు కానీ సీట్ నుండి దిగిపోయారు అంటే ఎవరైనా పాటిస్తారా? మరి చెక్ చేసుకోండి - సీట్ పై సెట్ అయ్యి ఉన్నానా? అధికారిగా అయ్యి ఆర్డరు చేస్తున్నానా? తండ్రి పిల్లలు ప్రతి ఒక్కరికీ అథారిటీని ఇచ్చారు, ఇది పరమాత్మ అథారిటీ, ఈ అథారిటీ ఆత్మ నుండి లభించినదేమీ కాదు, మహాత్ముల అథారిటీ లభించలేదు, ఇది పరమాత్మ అథారిటీ, కనుక అథారిటీ మరియు అధికారము అన్న ఈ స్థితిలో స్థితులై ఏ శక్తినైనా ఆర్డర్ చేయండి, అది జీ హజూర్, జీ హజూర్ (చిత్తం ప్రభూ) అని అంటుంది. సర్వ శక్తుల ముందు ఈ మాయ, ప్రకృతి, సంస్కారాలు, స్వభావము అన్నీ దాసీగా అయిపోతాయి. యజమాని, ఏదైనా ఆర్డరు చేయండి అని అవి యజమాని అయిన మీ కొరకు ఎదురుచూస్తాయి.

ఈ రోజు సమర్థ దివసము కదా, కావున పిల్లల్లో ఏయే సమర్థతలు ఉన్నాయి అన్నదానిని బాప్ దాదా రివైజ్ చేయిస్తున్నారు. అండర్ లైన్ చేయిస్తున్నారు. అవసరమైన సమయములో శక్తిహీనులుగా ఎందుకు అయిపోతారు? బాప్ దాదా చూసారు, మెజారిటీ పిల్లలలో లీకేజ్ ఉంది, లీకేజ్ అవుతున్న కారణముగా శక్తులు తక్కువైపోతున్నాయి మరియు లీకేజ్ అనేది విశేషముగా రెండు విషయాలలో ఉంది - ఆ రెండు విషయాలు ఏమిటంటే - సంకల్పాలు మరియు సమయము వ్యర్థముగా పోతున్నాయి. చెడు ఉండదు కానీ వ్యర్థము ఉంటుంది. సమయానికి చెడు కార్యాన్ని చెయ్యరు కానీ అలాగని జమ కూడా చేసుకోవడం లేదు. ఈ రోజు చెడు ఏమీ చేయలేదు కదా అని చూసుకుంటారే కానీ మంచి ఏం జమ చేసుకున్నాను? పోగొట్టుకోలేదు కానీ సంపాదించుకున్నానా? దుఃఖాన్ని ఇవ్వలేదు కానీ ఎంతమందికి సుఖాన్ని ఇచ్చాను? ఎవరినీ అశాంతపరచలేదు కానీ శాంతి వైబ్రేషన్లను ఎంతవరకు వ్యాపింపజేసాను? శాంతిదూతగా అయి వాయుమండలము ద్వారా లేక నోటి ద్వారా లేక వైబ్రేషన్ల ద్వారా శాంతిని ఎంతమందికి ఇచ్చాను? ఎందుకంటే ఈ కొద్ది సమయమే పురుషోత్తమ కళ్యాణకారీ సమయమని, జమ చేసుకునే సమయమని మీకు తెలుసు. ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ ఉండదు, ఇది ప్రతి ఘడియ గుర్తుండాలి. అయిపోతుందిలే, చేసేస్తాములే... ఇలా కాదు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు. బ్రహ్మాబాబా యొక్క తీవ్రగతితో కూడిన పురుషార్థము ఇదే, అందుకే నంబర్ వన్ అనే గమ్యాన్ని చేరుకున్నారు. కావున తండ్రి ఏవైతే సమర్థతలను ఇచ్చారో, అవి ఈ సమర్థ దివసము రోజున గుర్తుకొచ్చాయి కదా! పొదుపు స్కీమ్ ను తయారుచెయ్యండి. సంకల్పాల పొదుపు, సమయము యొక్క పొదుపు, వాణి యొక్క పొదుపు, ఏవైతే యథార్థమైన మాటలు కావో, ఆ అయథార్థమైన, వ్యర్థమైన మాటల యొక్క పొదుపు చేయాలి.

బాప్ దాదా పిల్లలందరినీ సదా అథారిటీ యొక్క సీట్ పై సెట్ అయినటువంటి స్వరాజ్య అధికారీ రాజా రూపములో చూడాలనుకుంటున్నారు. ఇష్టమేనా? ఈ రూపము ఇష్టమే కదా! ఎప్పుడైనా బాప్ దాదా ఏ పిల్లలనైనా టి.వి.లో చూస్తే, అప్పుడు ఈ రూపమే చూడాలి. బాప్ దాదా వద్ద నేచురల్ టి.వి. ఉంది, స్విచ్ ఆన్ చేయవలసిన అవసరముండదు. ఒకే సమయములో నలువైపులా చూడగలరు. ప్రతి ఒక్క బిడ్డను, మూలమూలల్లో ఉన్నవారిని చూడగలరు. మరి వీలవుతుందా? రేపటి నుండి. టి.వి. చూస్తే ఎలా కనిపిస్తారు? ఫరిశ్తా డ్రెస్ లో. ఫరిశ్తాల డ్రెస్ అంటే మెరుస్తున్న లైట్ యొక్క డ్రెస్. ఈ శరీర భానము యొక్క మట్టితో కూడిన డ్రెస్ ను వేసుకోకండి. మెరుస్తున్న డ్రెస్ ఉండాలి, సఫలతా సితారగా ఉండాలి, ప్రతి ఒక్కరినీ ఇటువంటి మూర్తిగా బాప్ దాదా చూడాలనుకుంటున్నారు. ఇష్టమే కదా! మట్టితో కూడిన డ్రెస్ ను ధరిస్తే మట్టికి చెందినవారిగానే అయిపోతారు కదా! తండ్రి అశరీరిగా ఉన్నారు, బ్రహ్మాబాబా మెరిసే డ్రెస్ లో ఉన్నారు, ఫరిశ్తాగా ఉన్నారు. కనుక తండ్రిని అనుసరించండి. స్థూలముగా చూడండి, మీ డ్రెస్ కు ఏదైనా మట్టి అంటుకుంటే, మరకలు ఏర్పడితే అప్పుడు ఏం చేస్తారు? మార్చేసుకుంటారు కదా! అలాగే చెక్ చేసుకోండి - సదా మెరుస్తూ ఉన్న ఫరిశ్తా డ్రెస్ ఉందా? పిల్లలు ప్రతి ఒక్కరూ రాజా పిల్లలు అని తండ్రికి ఏదైతే శుద్ధ గర్వముతో కూడిన నషా ఉందో, ఆ స్వరూపములోనే ఉండండి. రాజాగా అయ్యి ఉండండి. అప్పుడు ఈ మాయ మీకు దాసిగా అయిపోతుంది మరియు వీడ్కోలు తీసుకునేందుకు వస్తుంది, అర్ధకల్పము కొరకు వీడ్కోలు తీసుకునేందుకు వస్తుంది, దాడి చెయ్యదు. బాప్ దాదా సదా అంటుంటారు - తండ్రిపై బలిహారమయ్యేవారు ఎప్పుడూ ఓడిపోలేరు. ఒకవేళ ఓటమి జరిగింది అంటే బలిహారమవ్వలేదు అని అర్థము.

ఇప్పుడు మీ అందరిదీ మీటింగ్ జరగబోతుంది కదా, మీటింగ్ డేట్ ఫిక్స్ అవుతుంది కదా. మరి ఈ సారి బాప్ దాదా కేవలం సేవా ప్లాన్ల యొక్క మీటింగ్ ను మాత్రమే చూడాలనుకోవటం లేదు, సేవా ప్లాన్లను కూడా తయారుచేయండి కానీ మీటింగ్ లో సఫలతా మహోత్సవానికి ప్లాన్ తయారుచేయండి. చాలా మహోత్సవాలను జరుపుకున్నారు, ఇప్పుడు సఫలతా మహోత్సవానికి డేట్ ను ఫిక్స్ చేయండి. అలా అందరూ ఎలా తయారైపోతారు అని ఆలోచిస్తూ ఉంటారు కదా. బాప్ దాదా అంటారు, తక్కువలో తక్కువ 108 రత్నాలైతే సఫలతామూర్త్ యొక్క మహోత్సవాన్ని జరుపుకోవాలి. ఉదాహరణగా అవ్వాలి. ఇది వీలవుతుందా? చెప్పండి, మొదటి లైన్ వారు చెప్పండి, వీలవుతుందా? జవాబు చెప్పే ధైర్యము చేయడం లేదు. చేస్తామో, లేదో తెలియదు అని ఆలోచిస్తున్నారు. ధైర్యముతో అన్నీ సంభవమవుతాయి. దాదీ, చెప్పండి - 108 మంది సఫలతామూర్తులు తయారవ్వగలరా? (తప్పకుండా తయారవ్వగలరు, సఫలతా మహోత్సవము వీలవుతుంది). చూడండి, దాదీలో ధైర్యము ఉంది. మీ అందరి తరఫు నుండి ధైర్యాన్ని పెడుతున్నారు కనుక సహయోగులుగా అవ్వండి. మరి ఈ మీటింగ్ ఏదైతే జరగబోతుంది కదా, అందులో బాప్ దాదా రిపోర్ట్తీసుకుంటారు. పాండవులూ, చెప్పండి కదా, ఎందుకు మౌనముగా ఉన్నారు? ఎందుకని మౌనముగా ఉన్నారు? ఈ ధైర్యాన్ని ఎందుకని పెట్టరు? చేసి చూపిస్తారా? అలానా? మంచిది, ధైర్యమైతే ఉంచుకోగలరు కదా? మేమైతే ధైర్యము ఉంచే చూపిస్తాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చేస్తారా? ఏ సంస్కారము ఉండిపోదు కదా? ఏ బలహీనతా ఉండిపోదు కదా? మంచిది, మధుబన్ వారు కూడా చేతులెత్తుతున్నారు. వాహ్! అభినందనలు, అభినందనలు. మంచిది, 108 మందైతే ఇక సహజముగా తయారైపోతారు. ఇంతమంది చేతులెత్తారు అంటే ఇక 108 మంది అనేది ఏమంత పెద్ద విషయము. డబల్ విదేశీయులు ఏం చేస్తారు? అయితే, జానకి దాదీ వింటున్నారు, నేను మాట్లాడాలి అని వారికి ఉల్లాసము కలుగుతూ ఉంది. విదేశీయుల మాలను కూడా చూస్తాము, సరేనా? చేతులెత్తండి, సరేనా? మంచిది, ఈ రోజు వీళ్ళు (డబల్ విదేశీయులు) ఎంతమంది కూర్చుని ఉన్నారు? (200 మంది). వీరిలో నుండి 108 మంది అయితే తయారైపోతారు! సరే కదా! ఈ విషయములో ‘మొదట నేను’ అని అనుకోవాలి. ఈ విషయములో ఇతరులను చూడకండి, మొదట నేను. వేరే విషయాలలో నేను, నేను అని అనకండి, కానీ ఇందులో నేను అని తప్పకుండా అనండి. బాప్ దాదా ఇంకా వేరే పని కూడా ఇస్తున్నారు.

ఈ రోజు సమర్థ దివసము కదా, కనుక మీరు సమర్థులు. బాప్ దాదా ఒక విచిత్రమైన దీపావళిని జరపాలనుకుంటున్నారు. మీరైతే దీపావళిని చాలా సార్లు జరుపుకున్నారు కానీ బాప్ దాదా విచిత్రమైన దీపావళిని జరపాలని అనుకుంటున్నారు, వినిపించాలా? మంచిది. వర్తమాన సమయాన్ని అయితే చూస్తూనే ఉన్నారు, రోజురోజుకు నలువైపులా కల మనుష్యాత్మలలో నిరాశ ఎంతగానో పెరుగుతూ ఉంది. కనుక మనసా సేవ అయినా చెయ్యండి, వాచా అయినా చెయ్యండి, సంబంధ-సంపర్కములోనివారి సేవ అయినా చెయ్యండి, కానీ బాప్ దాదా నిరాశకు లోనైయున్న మనుష్యులలో ఆశా దీపాలను వెలిగించాలని కోరుకుంటున్నారు. నలువైపులా మనుష్యాత్మల మనసులలో ఆశా దీపాలు వెలగాలి. ఈ ఆశాదీపాల దీపావళిని బాప్ దాదా చూడాలనుకుంటున్నారు. వీలవుతుందా? ఇప్పుడు విశ్వ పరివర్తన ఇక జరిగిపోయినట్లే, స్వర్ణిమ ప్రభాతము వచ్చేసినట్లే - అని వాయుమండలములో తక్కువలో తక్కువ ఈ ఆశా దీపాలు వెలగాలి. ఏమీ జరగదు, ఏమీ జరగదు అన్న ఈ నిరాశ సమాప్తమైపోవాలి. ఆశా దీపాలు వెలగాలి. చెయ్యగలరు కదా. ఇదైతే సహజమే కదా లేక కష్టమా? సహజమేనా? ఎవరైతే చేస్తారో వారు చేతులెత్తండి. చేస్తారా? ఇంతమంది అందరూ దీపాలను వెలిగిస్తే దీపావళి అయితే జరిగిపోతుంది కదా! వైబ్రేషన్లను ఎంతటి శక్తిశాలిగా చేసుకోండి అంటే, వాళ్ళకు ఎదురుగా చేరుకోలేకపోవచ్చు కానీ లైట్ హౌస్, మైట్ హౌస్ గా అయ్యి దూరాల వరకు వైబ్రేషన్లను వ్యాపింపజెయ్యండి. సైన్స్అనేది లైట్ హౌస్ ద్వారా దూరాల వరకు లైట్ ను ఇవ్వగలిగినప్పుడు మరి మీరు వైబ్రేషన్లను వ్యాపింపజెయ్యలేరా! చెయ్యాల్సిందే అని కేవలం దృఢ సంకల్పాన్ని చెయ్యండి. బిజీ అయిపోండి. మనసును బిజీ పెట్టుకుంటే స్వయానికి కూడా లాభము మరియు ఆత్మలకు కూడా లాభము జరుగుతుంది. విశ్వ కళ్యాణము చెయ్యాల్సిందే అని నడుస్తూ-తిరుగుతూ దీనినే వృత్తిలో పెట్టుకోండి. ఈ వృత్తి వాయుమండలాన్ని వ్యాపింపజేస్తుంది ఎందుకంటే సమయము అనేది అకస్మాత్తుగా వస్తుంది. మీరు మాకు ఎందుకు చెప్పలేదు అని మీ సోదర, సోదరీలు ఫిర్యాదు చేసే విధంగా జరగకూడదు! కొందరు పిల్లలు - అంతిమ సమయానికల్లా చేసేస్తాము అని అనుకుంటారు, కానీ అంతిమము కల్లా చేసినా కూడా మీపై ఫిర్యాదు చేస్తారు. మాకు కొద్ది సమయం ముందు చెప్పుంటే ఎంతోకొంత తయారుచేసుకునేవాళ్ళము కదా అని ఈ ఫిర్యాదు చెప్తారు, అందుకే ప్రతి సంకల్పములో బాప్ దాదా స్మృతి ద్వారా లైట్ ను తీసుకుంటూ ఉండండి, లైట్ హౌస్ గా అయ్యి లైట్ ను ఇస్తూ ఉండండి. సమయాన్ని వృధా చేయకండి. చాలా యుద్ధము చేస్తున్నారు అన్నది బాప్ దాదా చూసినప్పుడు, బాప్ దాదాకు మంచిగా అనిపించదు. మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, మరి యుద్ధము చేస్తున్నారా! కనుక రాజాగా అవ్వండి, సఫలతామూర్తులుగా అవ్వండి, నిరాశను సమాప్తము చేసి ఆశాదీపాలను వెలిగించండి. అచ్ఛా!

అన్నివైపుల నుండి పిల్లల స్నేహపూర్వకమైన స్మృతి యొక్క మాలలైతే ఎన్నో చేరుకున్నాయి. స్మృతులను పంపినవారిని బాప్ దాదా సమ్ముఖముగా చూస్తూ స్మృతికి జవాబుగా మనస్ఫూర్వకమైన ఆశీర్వాదాలను, మనస్ఫూర్వకమైన ప్రేమను ఇస్తున్నారు. అచ్ఛా.

ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు లేవండి. మంచిది, ప్రతి టర్న్లో చూసారు, మెజారిటీ కొత్తవారు ఉంటారు. అంటే సర్వీస్ ను పెంచినట్లు కదా, ఇంతమందికి సందేశమును ఇచ్చారు. ఏ విధంగా మీకు సందేశము లభించిందో, అదే విధంగా మీరు కూడా ఇంకా రెండింతలుగా, రెట్టింపుగా సందేశాన్ని ఇవ్వండి. యోగ్యులుగా తయారుచెయ్యండి. మంచిది. ప్రతి సబ్జెక్ట్ లో ఇంకా ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్ళండి. మంచిది.

అచ్ఛా - ఇప్పుడు లక్ష్యము పెట్టుకోండి, నడుస్తూ-తిరుగుతూ మనసా ద్వారానైనా, వాచా ద్వారానైనా, కర్మణా ద్వారానైనా సేవ లేకుండా కూడా ఉండకూడదు మరియు స్మృతి లేకుండా కూడా ఉండకూడదు. స్మృతి మరియు సేవ ఎల్లప్పుడూ కలిసే ఉంటాయి. స్మృతిలో కూడా, సేవలో కూడా స్వయాన్ని బిజీగా పెట్టుకోండి. ఖాళీగా ఉన్నట్లయితే మాయకు వచ్చేందుకు అవకాశము ఉంటుంది. ఎంత బిజీగా ఉండండి అంటే దూరం నుండే మాయకు వచ్చేందుకు ధైర్యము చాలకూడదు. అప్పుడు తండ్రి సమానముగా అవ్వాలి అన్న లక్ష్యమునేదైతే పెట్టుకున్నారో, అది సహజమైపోతుంది. శ్రమ చేయాల్సిన అవసరముండదు, స్నేహీ స్వరూపులుగా ఉంటారు. అచ్ఛా.

బాప్ దాదా నయనాలలో ఇమిడి ఉన్న ప్రకాశ రత్నాలైన పిల్లలకు, తండ్రి యొక్క సర్వ సంపదలకు అధికారులైన శ్రేష్ఠ ఆత్మలైన పిల్లలకు, సదా ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలతో ఎగురుతూ ఉండే మరియు ఎగిరింపజేస్తూ ఉండే మహావీరులు, మహావీరనీలు అయిన పిల్లలకు, ఒక్క తండ్రియే ప్రపంచము అనే ఈ తపనలో నిమగ్నమై ఉండే లవలీన పిల్లలకు, లవలీనమవ్వటమంటే తండ్రి సమానంగా సహజముగా అవ్వడమనే ఇటువంటి ప్రియమైన మరియు లవలీన పిల్లలకు ఇరువురికీ చాలా, చాలా, పదమాల-పదమాల రెట్ల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-
తమ ప్రతి కర్మ లేక విశేషత ద్వారా దాత వైపుకు సూచించే సత్యమైన సేవాధారి భవ

సత్యమైన సేవాధారి ఏ ఆత్మకైనా సహయోగాన్ని ఇస్తారు, కానీ స్వయంలో చిక్కుకునేలా చేయరు. వారు అందరి కనెక్షన్ ను తండ్రితో జోడిస్తారు. వారి ప్రతి మాట తండ్రి స్మృతిని ఇప్పించేదిగా ఉంటుంది. వారి ప్రతి కర్మలో తండ్రి కనిపిస్తారు. నా విశేషత కారణముగా వీరు నాకు సహయోగులుగా ఉన్నారు అన్న సంకల్పం కూడా వారికి రాదు. ఒకవేళ మిమ్మల్ని చూసారు, తండ్రిని చూడలేదు అంటే, అది సేవ చేసినట్లు కాదు, తండ్రిని మరపింపజేసారు. సత్యమైన సేవాధారి సత్యము వైపుకు అందరి సంబంధాన్ని జోడిస్తారు, స్వయముతో కాదు.

స్లోగన్:-
ఏ రకమైన అర్జీనైనా వేసేందుకు బదులుగా సదా సంతుష్టముగా ఉండండి.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా కండి

శ్రేష్ఠ భాగ్యపురేఖను గీసుకునేందుకు ఆధారము - శ్రేష్ఠ సంకల్పాలు మరియు శ్రేష్ఠ కర్మలు. ట్రస్టీ ఆత్మ కావచ్చు, సేవాధారి ఆత్మ కావచ్చు, ఇరువురూ ఈ ఆధారం ద్వారానే నంబరు తీసుకోగలరు. ఇరువురికీ భాగ్యము తయారుచేసుకోవడానికి పూర్తి ఛాన్సు ఉంది, ఎవరు ఎంత భాగ్యం తయారుచేసుకోవాలనుకుంటే అంత చేసుకోవచ్చు.